యాభై వసంతాలు
- Ch. Pratap

- 5 hours ago
- 9 min read
యాభై వసంతాలు, తెలుగు భావోద్వేగ కుటుంబ కథ, Ch. ప్రతాప్, Mana Telugu Kathalu, elderly couple story, old age home story

యాభై వసంతాలు | ప్రేమ, సేవ, కృతజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం
Yabhai Vasanthalu - Telugu Emotional Family Story | Ch. Pratap
యాభై వసంతాలు - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | Ch. ప్రతాప్
Published in manatelugukathalu.com on 07/07/2026
యాభై సంవత్సరాల దాంపత్య జీవితాన్ని ఘనంగా జరుపుకోవాలని ఎదురుచూస్తున్న రాఘవయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఒక్కసారిగా ఊహించని నిరాశ ఎదురవుతుంది. విదేశాల్లో ఉన్న కుమారుడు యుద్ధ పరిస్థితుల వల్ల స్వర్ణోత్సవానికి రాలేకపోవడంతో ఇంటంతా విషాదం అలుముకుంటుంది. అయితే ప్రేమ, కృతజ్ఞత, సేవ, మానవత్వం కలిసి ఆ రోజును జీవితాంతం గుర్తుండిపోయే పండుగగా ఎలా మార్చాయో చెప్పే హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథే "యాభై వసంతాలు."
ఉదయం ఆరు గంటలు. ఇంట్లో నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ టెలిఫోన్ మోగింది. రాఘవయ్య వెంటనే ఫోన్ ఎత్తాడు. అమెరికాలో నివసిస్తున్న తన ఏకైక కుమారుడు అరవింద్.
"నాన్నా..." అటు వైపు నుంచి వినిపించిన స్వరం భారంగా ఉంది.
"ఏమైంది బాబూ? ప్రయాణ ఏర్పాట్లు పూర్తయ్యాయా?" అని ఉత్సాహంగా అడిగాడు రాఘవయ్య.
కొన్ని క్షణాలు మౌనం. "నాన్నా... నేను రావడం కుదరడం లేదు."
ఆ ఒక్క మాట రాఘవయ్య గుండెల్లో పిడుగులా పడింది.
"ఎందుకు?"
"యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. నేను బుక్ చేసుకున్న విమానం కూడా రద్దయింది. మరో దేశం మీదుగా రావడానికి ప్రయత్నించాను. ఏ మార్గం దొరకలేదు. నమ్మండి నాన్నా... చివరి నిమిషం వరకు ప్రయత్నించాను. మీ యాభైవ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తానని మాట ఇచ్చాను. హాలు బుక్ చేశాను. బంధువుల జాబితా సిద్ధం చేశాను. మీ ఇద్దరికీ కొత్త బట్టలు కూడా ఆన్‌లైన్‌లో పంపించాను. కానీ ఈ యుద్ధం నా కలలన్నింటినీ ఒక్కసారిగా ఆపేసింది."
రాఘవయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు.
"అమ్మతో మాట్లాడనా?"
ఫోన్‌ను లక్ష్మమ్మ చేతిలో పెట్టాడు.
"అమ్మా... నన్ను క్షమించు."
"నువ్వు క్షమాపణ చెప్పాల్సిన పని లేదు బాబూ. కానీ నీ కోసం మా కళ్లన్నీ ఎదురుచూశాయి. ఈ ఇల్లు నీ నవ్వు కోసం ఎదురుచూసింది," అని చెప్పగానే ఆమె గొంతు బిగుసుకుపోయింది.
ఫోన్ కట్ అయింది. ఆ ఇంట్లో ఆనందం ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. ఆ రోజు నుంచి లక్ష్మమ్మ జీవితం మారిపోయింది.
స్వర్ణోత్సవం కోసం ఎంతో ఇష్టంగా కొనుకున్న పట్టుచీర అలమారాలో ముడుచుకుని పడిపోయింది. ఇంట్లో వినిపించే నవ్వులు మాయమయ్యాయి. ఆమె భోజనం చేయడం తగ్గించింది. రాత్రిళ్లు నిద్ర లేక మంచం మీద అటూ ఇటూ తిరుగుతూ ఉండేది. కిటికీ దగ్గర కూర్చొని వీధిలో వెళ్లే ప్రతి కారును చూస్తూ, "ఇప్పుడైనా వస్తాడేమో..." అని మనసులో అనుకునేది.
ఆమెకు శరీరానికంటే మనసే ఎక్కువగా జబ్బుపడింది.
డాక్టర్ పరీక్షించి, "ఆమెకు మందులు మాత్రమే సరిపోవు. జీవితంలో మళ్లీ ఆశను నింపండి. అదే అసలైన వైద్యం," అన్నాడు.
రాఘవయ్య పరిస్థితి కూడా దయనీయమే. మధుమేహం, గుండె జబ్బు, కీళ్ల నొప్పులు, అధిక రక్తపోటు—రోజూ మందులే తోడు. అయినా తన బాధను మరిచి భార్య ముఖంలో చిరునవ్వు తీసుకురావాలని ఒక్కటే ఆలోచన.
ఒక రాత్రి గోడపై వేలాడుతున్న వారి పెళ్లి ఫొటో ముందు చాలాసేపు నిలబడ్డాడు.
"ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరూ ఎన్నో కష్టాలు దాటారు. యాభై సంవత్సరాల ప్రయాణాన్ని ఒక్క నిరాశ ఓడించకూడదు," అని తనలో తానే అనుకున్నాడు.
ఆ రాత్రే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరికి చెప్పకుండా ఏర్పాట్లు ప్రారంభించాడు.
దేవాలయంలో ప్రత్యేక పూజ బుక్ చేశాడు. ఇంటిని అలంకరించడానికి పూలు తెప్పించాడు. చిన్న కేక్ ఆర్డర్ చేశాడు. పాత ఆల్బమ్‌లన్నీ తీసి యాభై సంవత్సరాల జీవితాన్ని చెప్పేలా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశాడు.
అరవింద్‌కు ఫోన్ చేసి ఒక వీడియో సందేశం పంపమన్నాడు.
"నాన్నా... నా స్థానంలో మీరు అమ్మను నవ్వించాలి," అని అరవింద్ ఏడుస్తూ చెప్పాడు.
వారి వివాహ వార్షికోత్సవం ఉదయం వచ్చింది.
ఉదయం ఐదు గంటలు. కిటికీలోంచి తొంగిచూస్తున్న లేత సూర్యకిరణాలు గదిని మెల్లగా తాకుతున్నాయి. రాఘవయ్య నిదానంగా మంచం దగ్గరకు వెళ్లి లక్ష్మమ్మ భుజంపై చేయి వేసి మృదువుగా పిలిచాడు.
"లక్ష్మీ... లేవమ్మా. ఈ రోజు మన రోజు."
లక్ష్మమ్మ కళ్లు తెరిచింది. కళ్ల చుట్టూ నిద్రలేని రాత్రుల అలసట స్పష్టంగా కనిపిస్తోంది. అతని ముఖం వైపు ఒకసారి చూసి మళ్లీ దిండు మీద తల ఆనించింది.
"నాకు వేడుకలు వద్దు. నా మనసేమీ బాగోలేదు. నన్నిలా ప్రశాంతంగా ఉండనివ్వండి. ఈ రోజు త్వరగా గడిచిపోతే చాలు."
రాఘవయ్య కాసేపు మౌనంగా ఆమెను చూస్తూ కూర్చున్నాడు. ఆ కళ్లలో యాభై సంవత్సరాల అనుబంధం, ఆమె అనుభవించిన బాధ, కొడుకు కోసం పడుతున్న తపన అన్నీ అతనికి కనిపించాయి.
"లక్ష్మీ," అని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మెల్లగా అన్నాడు, "నువ్వు ఈ రోజు బాధపడేది కొడుకు రాలేదని. కానీ ఒకసారి ఆలోచించు... యాభై సంవత్సరాలుగా మనం కలిసి నడిచిన ప్రతి రోజును ఒక్క నిరాశ మరిచిపోయేలా చేయడం న్యాయమా? మన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. డబ్బు లేని రోజులు చూశాం. అద్దె ఇళ్లలో ఉన్నాం. నేను ఉద్యోగం కోల్పోతానేమోనని భయపడిన రోజులు ఉన్నాయి. నీకు జబ్బు వచ్చిన రోజులు ఉన్నాయి. నాకు గుండెపోటు వచ్చినప్పుడు నువ్వు రాత్రింబవళ్లు నా మంచం పక్కనే కూర్చున్నావు. మనం ఎప్పుడైనా ఓడిపోయామా?"
లక్ష్మమ్మ మౌనంగా అతని మాటలు వింటోంది.
"మన కొడుకు రాకపోవడం అతని నిర్లక్ష్యం కాదు. పరిస్థితులు అతన్ని ఆపేశాయి. కానీ మన ఆనందాన్ని కూడా పరిస్థితులే నిర్ణయించాలా? మన పెళ్లి రోజు గుర్తుందా? అప్పట్లో పెద్ద హాలు లేదు... వందలాది అతిథులు లేరు... ఖరీదైన అలంకరణలు లేవు. ఒక చిన్న మండపం, కొద్దిమంది పెద్దలు, మన రెండు హృదయాలు మాత్రమే ఉన్నాయి. అయినా ఆ రోజు మన జీవితంలో అత్యంత గొప్ప రోజుగా మిగిలిపోయింది. ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంది. ఈ రోజూ అదే ప్రేమ మన మధ్య ఉంది."
లక్ష్మమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి.
రాఘవయ్య ఆమె కన్నీళ్లను మెల్లగా తుడిచాడు.
"నువ్వు ఒకసారి నవ్వితే... ఈ ఇంట్లో మళ్లీ వెలుగు వస్తుంది. నువ్వు ఇలా బాధపడితే, మన కొడుకు అక్కడ ప్రశాంతంగా ఉండగలడా? అతను ఇప్పటికే తనను తాను నిందించుకుంటున్నాడు. మనం బాధపడితే అతని బాధ మరింత పెరుగుతుంది. అతను దూరంలో ఉన్నాడే తప్ప, మన హృదయాలకు దూరం కాలేదు."
కొద్దిసేపు ఆగి మళ్లీ అన్నాడు...
"లక్ష్మీ... ఈ రోజు మనం వేడుక చేసుకోవడం కోసం కాదు. యాభై సంవత్సరాలుగా దేవుడు మనకు ఇచ్చిన ఈ అనుబంధానికి కృతజ్ఞత చెప్పడానికి. మనం ఈ రోజు సంతోషంగా ఉంటే, అది మన కొడుకుకి కూడా ధైర్యాన్ని ఇస్తుంది. మన జీవితాన్ని దేవుడు ఎంత అందంగా తీర్చిదిద్దాడో గుర్తు చేసుకునే రోజు ఇది. నువ్వు నా కోసం కాదు... మన ప్రేమ కోసం లేవాలి."
ఆ మాటలు లక్ష్మమ్మ హృదయంలోకి నెమ్మదిగా జారిపోయాయి. ఆమె నిశ్శబ్దంగా లేచి కూర్చుంది. రాఘవయ్య అలమారాలో నుంచి ఆమెకు ఎంతో ఇష్టమైన పట్టుచీరను తీసుకొచ్చి చేతిలో పెట్టాడు.
"ఈ చీర కొనిపెట్టిన రోజు ఎంత సంతోషపడిపోయావో గుర్తుందా? ఈ రోజు దానిని ధరించు. నా కళ్లలో ఇప్పటికీ నువ్వు అదే పెళ్లికూతురివి."
అని చెప్పి స్వయంగా మల్లెపూలను తీసుకుని ఎంతో అపురూపంగా ఆమె జడలో తురిమాడు.
"యాభై సంవత్సరాల క్రితం ఎంత అందంగా ఉన్నావో... ఈ రోజు కూడా నాకు అంతే అందంగా కనిపిస్తున్నావు."
సిగ్గు, ప్రేమ, కృతజ్ఞత కలిసిన ఒక మృదువైన చిరునవ్వు లక్ష్మమ్మ పెదవులపై విరిసింది. చాలా రోజుల తర్వాత ఆమె కళ్లలో మళ్లీ జీవం కనిపించింది. ఆ చిరునవ్వు చూసిన రాఘవయ్యకు, ఆ రోజు వేడుక అప్పుడే విజయవంతమైనట్లనిపించింది.
"యాభై సంవత్సరాల క్రితం ఎంత అందంగా ఉన్నావో... ఇప్పటికీ అంతే అందంగా ఉన్నావు," అన్నాడు. సిగ్గుతో ఆమె కళ్లలో చిన్న నవ్వు మెరిసింది.
ఇద్దరూ దేవాలయానికి వెళ్లారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అర్చకుడు మంగళాశాసనాలు చేశాడు. ఇద్దరూ కలిసి దీపం వెలిగించారు.
రాఘవయ్య ఆమె చేతిని పట్టుకుని మెల్లగా అన్నాడు...
"పెళ్లి రోజున నీ చేయి పట్టుకున్నాను. ఈ రోజు మళ్లీ అదే చేయి పట్టుకుని ఒక మాట చెబుతున్నాను. నా చివరి శ్వాస వరకు నీకు తోడుగానే ఉంటాను."
ఆమెకు కన్నీళ్లు ఆగలేదు.
దేవాలయం నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ పెళ్లయిన మొదట్లో తరచూ టీ తాగిన చిన్న హోటల్‌కు వెళ్లారు. అక్కడ కూర్చొని టీ తాగుతూ తమ పేదరిక రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇద్దరూ ఒక ప్లేట్ బజ్జీలు పంచుకొని తిన్న రోజులు, నెలాఖరులో డబ్బులు లేక ఒకే కప్పు టీ ఇద్దరూ తాగిన రోజులు గుర్తుకొచ్చి నవ్వుకున్నారు.
మధ్యాహ్నం అయ్యేసరికి రాఘవయ్య కారు ఒక పాత దారిలోకి తిరిగింది.
"మనమిక్కడికి ఎందుకు వస్తున్నాం?" అని ఆశ్చర్యపోయింది లక్ష్మమ్మ. కారు ఒక వృద్ధాశ్రమం ముందు ఆగింది.
ఆ బోర్డు చూడగానే లక్ష్మమ్మ కళ్లలో వెలుగు తిరిగింది.
"అయ్యో... మన వృద్ధాశ్రమం!"
వివాహమైన మొదటి సంవత్సరం నుంచే ప్రతి వివాహ వార్షికోత్సవం రోజున మధ్యాహ్నం ఈ వృద్ధాశ్రమానికి వచ్చి అక్కడి వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించడం వారి సంప్రదాయం. "మన ఆనందంలో ఒక భాగం ఒంటరితనంలో ఉన్న వారికి చెందాలి" అనేది ఇద్దరి నమ్మకం.
ఈ ఏడాది కొడుకు రాకపోవడం వల్ల ఆ కార్యక్రమం జరగదనుకుంది లక్ష్మమ్మ.
కానీ రాఘవయ్య ముందుగానే అన్నీ సిద్ధం చేశాడు.
వేడివేడిగా అన్నం, పప్పు, సాంబారు, కూరలు, పెరుగు, పాయసం వంటివి తెప్పించాడు.
ఇద్దరూ ఒక్కో ప్లేట్ తీసుకుని వృద్ధులకు తమ చేతులతోనే వడ్డించడం ప్రారంభించారు.
ఒక తొంభై ఏళ్ల వృద్ధుడు వణుకుతున్న చేతులతో రాఘవయ్య చేయిని గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్లలో వయసు ముడతల కంటే ఎక్కువగా కనిపించింది ఎదురు చూపుల వేదన.
"బాబూ... మమ్మల్ని గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం వస్తారు. మా పిల్లలు రావడం మానేసి చాలా ఏళ్లైంది. మొదట్లో ప్రతి పండుగకు వస్తామని చెప్పేవారు. తర్వాత ఫోన్లు తగ్గాయి. ఇప్పుడు ఆ ఫోన్లు కూడా రావడం లేదు. కొన్నిసార్లు ఈ గేటు వైపు చూస్తూ రోజంతా కూర్చుంటాను. ఎవరైనా 'నాన్నా' అని పిలుస్తారేమో అనుకుంటాను. కానీ ప్రతి ఏడాది మాత్రం మీరు ఇద్దరూ తప్పకుండా వస్తారు. మీ చేతులతో పెట్టిన ఈ భోజనం కడుపును మాత్రమే కాదు బాబూ... మా ఒంటరి మనసులను కూడా నింపుతుంది."
ఆ మాటలు వింటూ రాఘవయ్య గొంతు బిగుసుకుపోయింది. ఆయన మెల్లగా ఆ వృద్ధుడి భుజంపై చేయి వేసి, "మేము ఉన్నంత కాలం ఈ సంప్రదాయం ఆగదు నాన్నగారూ," అని చెప్పగానే ఆ వృద్ధుడి కళ్లు ఆనందభాష్పాలతో నిండిపోయాయి.
అంతలో మరో అవ్వ లక్ష్మమ్మ చేతిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
"అమ్మా... ఈ రోజు నువ్వు పెట్టిన ఈ ముద్ద నాకు నా కూతురు పెట్టిన ముద్దలా అనిపిస్తోంది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లందరికీ వాళ్ల జీవితాలు ఉన్నాయి. వాళ్లను తప్పు పట్టను. కానీ ఈ వయసులో ఒక ఆప్యాయమైన పలకరింపు, ఒక ప్రేమతో పెట్టిన ముద్ద, ఒకసారి 'అమ్మా ఎలా ఉన్నావు?' అని అడిగే మాట కోసం ఈ హృదయం ఎంతగా ఎదురుచూస్తుందో నీకు తెలుసా? ఈ రోజు నువ్వు నా తల నిమిరిన క్షణంలో నాకు నా కూతురు తిరిగి వచ్చినట్లే అనిపించింది."
ఆ మాటలు వినగానే లక్ష్మమ్మ ఇక తనను తాను అదుపులో పెట్టుకోలేకపోయింది. ఆమె మోకాళ్లపై కూర్చుని ఆ అవ్వను గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరి కళ్ల నుంచి కన్నీళ్లు ధారగా జారాయి. అక్కడ ఉన్న వృద్ధుల కళ్లూ చెమ్మగిల్లాయి. ఆ క్షణంలో రక్తసంబంధాలు కాదు, ప్రేమతో ఏర్పడిన బంధాలే శాశ్వతమని అందరికీ అనిపించింది.
భోజనం పూర్తయ్యాక వృద్ధులంతా ఒకచోట చేరి, వణుకుతున్న చేతులను పైకెత్తి వారిద్దరినీ ఆశీర్వదించారు.
"మీ ఇద్దరూ ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా నూరేళ్లు కలిసి జీవించాలి. మీ ఇంట్లో ప్రేమ ఎప్పటికీ తగ్గకూడదు. మీరు పంచుతున్న ఈ మానవత్వం మీ తరతరాలకు దీవెనగా మారాలి."
"మీ ఇద్దరూ నూరేళ్లు కలిసి ఉండాలి."
ఆ ఆశీర్వాదాలు వారి హృదయాలను నింపేశాయి.
వృద్ధాశ్రమం నుంచి బయలుదేరే ముందు అక్కడి చిన్న ప్రార్థనా మందిరంలో ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు.
"లక్ష్మీ," అన్నాడు రాఘవయ్య, "మనకు కొడుకు దూరంగా ఉన్నాడు. కానీ ఇక్కడ చూడి... ఎంతమందికి పిల్లలు ఉన్నా ఒంటరిగా ఉన్నారు. మన బాధ పెద్దదనుకున్నాం. కానీ ప్రేమ పంచుకుంటే బాధ చిన్నదైపోతుంది."
లక్ష్మమ్మ మౌనంగా తల ఊపింది.సాయంత్రం ఇంటికి చేరుకున్నాక ఆమె మరోసారి ఆశ్చర్యపోయింది.
ఇల్లు మొత్తం పూలతో అలంకరించబడి ఉంది. టేబుల్‌పై యాభై సంవత్సరాల జ్ఞాపకాలను చెప్పే యాభై ఫొటోలు. ప్రతి ఫొటో కింద రాఘవయ్య చేతిరాతలో ఒక చిన్న జ్ఞాపకం.
"మన మొదటి అద్దె ఇల్లు."
"అరవింద్ పుట్టిన రోజు."
"నా మొదటి ఉద్యోగం."
"మన మొదటి కారు."
"మన మొదటి తీర్థయాత్ర."
ప్రతి ఫొటో ఒక జీవితాన్ని తిరిగి చూపించింది.
కొద్దిసేపటికి బంధువులు, పొరుగువారు వచ్చారు. ఎవరూ ఖరీదైన బహుమతులు తీసుకురాలేదు. ప్రేమతో చేసిన వంటకాలను తీసుకొచ్చారు.
అప్పుడే పక్కింటాయన లాప్ టాప్ తెచ్చి ఆన్ చేసాడు. అరవింద్, కోడలు, మనవలు కనిపించారు.
మనవలు ఎంతో ఉత్సాహంగా పాట పాడారు.
"హ్యాపీ గోల్డెన్ యానివర్సరీ తాతయ్యా... నానమ్మా!"
చిన్న మనవరాలు తన చేతులతో గీసిన శుభాకాంక్షల చిత్రాన్ని కెమెరాకు చూపించింది. మనవడు బంగారు రంగు కాగితాలతో తయారు చేసిన చిన్న కిరీటాలను తాతయ్య, నానమ్మ కోసం చూపిస్తూ, "మీరు మా ఇంటి కింగ్ అండ్ క్వీన్," అని చెప్పడంతో అక్కడున్న వారందరూ చప్పట్లు కొట్టారు.
అరవింద్ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు.
"మీ ఇద్దరూ నాకు కుటుంబం అంటే ఏమిటో, ప్రేమ అంటే ఏమిటో, ఒకరినొకరు గౌరవించుకోవడం అంటే ఏమిటో నేర్పించారు. ఈ రోజు నేను రాలేకపోయినా నా హృదయం మీ పాదాల దగ్గరే ఉంది. వచ్చే సంవత్సరం ఈ లోటును తప్పకుండా తీర్చుకుంటాను."
లక్ష్మమ్మ చిరునవ్వుతో చేతులు ఊపింది. "నువ్వు సంతోషంగా ఉంటే చాలు బాబూ... అదే మాకు పెద్ద బహుమతి," అని చెప్పగానే అటువైపు అరవింద్ కూడా కన్నీళ్లను దాచుకోలేకపోయాడు.
వీడియో కాల్ ముగిసిన తర్వాత కొద్దిసేపు ఇంట్లో మౌనం అలుముకుంది. వెంటనే పక్కింటి చిన్నారులు పూలరేకులు చల్లుతూ, "శుభాకాంక్షలు తాతయ్య... నానమ్మ!" అని ఆనందంగా పలకరించారు. బంధువులు, స్నేహితులు చప్పట్ల మధ్య వారిద్దరినీ కేక్ దగ్గరకు తీసుకొచ్చారు.
బంగారు రంగు అలంకరణలతో అందంగా తయారైన కేక్‌పై "యాభై వసంతాలు" అనే మాటలు మెరిసిపోతున్నాయి. రాఘవయ్య కత్తిని పట్టుకోగా, లక్ష్మమ్మ తన చేయిని అతని చేతిపై ఉంచింది. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయగానే ఇంటంతా చప్పట్లతో మార్మోగిపోయింది. "మరెన్నో వసంతాలు కలిసి జరుపుకోవాలి" అంటూ అందరూ ఒకేసారి ఆశీర్వదించారు. రాఘవయ్య ప్రేమగా మొదటి ముక్కను లక్ష్మమ్మకు తినిపించగా, ఆమె కూడా చిన్న ముక్కను అతనికి తినిపించింది. ఆ దృశ్యం చూసిన వారిలో చాలామంది కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి.
తర్వాత రాఘవయ్య ఒక చిన్న వెండి పెట్టెను తీసి లక్ష్మమ్మ చేతిలో పెట్టాడు.
"ఇది నా జీవితంలో నీకిచ్చే అత్యంత విలువైన బహుమతి," అన్నాడు.
ఆ పెట్టెను తెరిచి చూసిన లక్ష్మమ్మ ఆశ్చర్యపోయింది. అందులో యాభై చిన్న చీటీలు ఉన్నాయి. ప్రతి చీటీపై అతని స్వహస్తాలతో ఒక కృతజ్ఞతా సందేశం.
"నా కలలకు తోడుగా నిలిచినందుకు ధన్యవాదాలు."
"మన ఇంటిని ప్రేమతో నింపినందుకు ధన్యవాదాలు."
"నా ఓటముల్లో ధైర్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు."
"నా విజయాల్లో గర్వపడినందుకు ధన్యవాదాలు."
"మన కొడుకును మంచి మనిషిగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు."
"యాభై సంవత్సరాలుగా నా జీవితాన్ని వెలుగుగా మార్చినందుకు ధన్యవాదాలు."
ప్రతి చీటీ చదువుతున్న కొద్దీ లక్ష్మమ్మ కళ్ల నుంచి ఆనందాశ్రువులు జాలువారాయి. అక్కడున్న బంధువులంతా నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ప్రేమను మాటల్లో కాదు, జీవితాంతం చేసిన చిన్నచిన్న త్యాగాల్లో ఎలా వ్యక్తపరచాలో రాఘవయ్య ఆ క్షణంలో అందరికీ చూపించాడు.
రాత్రి భోజనం ముగిసింది. అతిథులంతా వారిద్దరికీ ఆశీస్సులు అందించి, మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసి ఒక్కొక్కరుగా తిరిగి వెళ్లిపోయారు. ఇంట్లో మళ్లీ ప్రశాంతత నెలకొంది. ఆ ప్రశాంతతలోనే ఒక మధురమైన తృప్తి దాగి ఉంది. ఇద్దరూ నెమ్మదిగా మెట్లు ఎక్కి మేడపైకి వెళ్లారు.
నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తూ కొద్దిసేపు మౌనంగా కూర్చున్నారు.
"రాఘవా," అంది లక్ష్మమ్మ మెల్లగా, "ఈ ఉదయం వరకు నా జీవితంలో పెద్ద దుఃఖం కొడుకు రాకపోవడమే అనుకున్నాను. కానీ ఈ రోజు వృద్ధాశ్రమంలో ఆ అమ్మానాన్నల కళ్లలో చూసిన ఒంటరితనం నా మనసును కదిలించింది. మనకు దూరంలో ఉన్న కొడుకు ఉన్నాడు. వారికి దగ్గరలో కూడా ఎవరూ లేరు."
రాఘవయ్య చిరునవ్వు నవ్వాడు.
"అందుకే ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తుంటాం. ఆనందం మన దగ్గరే ఉండి పోతే అది ఒక రోజు మసకబారిపోతుంది. పంచితే మాత్రం జీవితాంతం వెలుగిస్తుంది."
లక్ష్మమ్మ అతని చేతులను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది.
"నువ్వు నాకు ఈ రోజు ఒక వేడుకను మాత్రమే ఇవ్వలేదు. జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చావు. హాలులో జరిగే వేడుకల కంటే, మనసులో జరిగే వేడుకలే గొప్పవని నేర్పించావు. ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. ధన్యవాదాలు."
ఆమె అతని భుజంపై తల ఆనించింది. ఇద్దరూ నిశ్శబ్దంగా తమ గదిలోకి వెళ్లారు.
ఆ రాత్రి ఇంట్లో దీపాలు ఆరిపోయాయి.
కానీ వారి హృదయాల్లో ప్రేమ, సేవ, త్యాగం, కృతజ్ఞత అనే నాలుగు దీపాలు మరింత ప్రకాశించాయి. యాభై సంవత్సరాల దాంపత్య జీవితానికి నిజమైన స్వర్ణోత్సవం బంగారు అలంకరణల్లో కాదు, ఒకరి హృదయంలో మరొకరు నిలిచిపోవడంలోనూ, తమ ఆనందాన్ని అవసరంలో ఉన్న వారితో పంచుకోవడంలోనూ ఉందని వారి జీవితం మరోసారి ప్రపంచానికి చెప్పింది.
సమాప్తం
***
Ch. ప్రతాప్ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/pratap

నేను వృత్తిరీత్యా ఒక సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ, నా నిజమైన ఆసక్తి, నా జీవనసారం సాహిత్యానికే అంకితం. తెలుగు పుస్తకాల సువాసన నా జీవితంలో 1984 నుంచే పరిమళించింది. అప్పటి నుంచి పఠనం నా అలవాటుగా కాక, నా జీవనశైలిగా మారింది. పుస్తకాలు నా మనసును తీర్చిదిద్దాయి, ఆ పఠనమే క్రమంగా రచనగా రూపాంతరం చెందింది. ఆలోచనల రూపం, అనుభవాల ప్రతిబింబం, హృదయానికి స్వరం — అదే నా రచన.
ఆధ్యాత్మికత, మానవ సంబంధాల లోతులు, సామాజిక స్పృహ, ప్రజాసేవ పట్ల నాలో ఉన్న మమకారం ప్రతి రచనలోనూ ప్రతిఫలిస్తుంది. నేను రాసే ప్రతి వాక్యం పాఠకునితో చేసే ఒక మౌన సంభాషణ. నా కలం కేవలం అక్షరాలు కాదు; అది జీవనాన్ని గ్రహించే ఒక మార్గం.
ఇప్పటివరకు నేను రచించినవి రెండు వందలకుపైగా కథలు, ఐదు నవలలు, రెండు వేల వ్యాసాలు. ఇవి పలు దిన, వార, మాస పత్రికలలో, అలాగే డిజిటల్ వేదికలలో వెలువడి విభిన్న వయస్సుల పాఠకులను చేరాయి. ప్రతి రచన నా అనుభవాల సారాన్ని పాఠకుని మనసుతో కలిపే ఒక మాధ్యమంగా నిలిచింది.
సాహిత్యం నాకు హాబీ కాదు — అది నా జీవిత యానం. కొత్త ఆలోచనలను అన్వేషించడం, తెలుగు భాషా సౌందర్యాన్ని కొత్త రూపాల్లో వ్యక్తపరచడం, సమాజానికి ఉపయోగపడే మార్గాలను వెతకడం — ఇవే నా సాహిత్య సాధనకు మూలాధారం. రచన ద్వారా మనసులను మేల్కొలపడం, మనసుల్లో విలువల జ్యోతిని వెలిగించడం నా నిశ్చయం.
ఇటీవల నా కృషికి గాను ఒక ప్రముఖ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం నా జీవితంలో ఒక విశిష్ట ఘట్టం. అది కేవలం గుర్తింపే కాదు, మరింత బాధ్యతను జోడించిన ప్రేరణ.
మన పురాణాలు, ఉపనిషత్తులు, వేద వాక్యాలలో దాగి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధునిక పాఠకులకు అందించడం, వాటి సారాన్ని సమాజానికి చేరవేయడం నా సాహిత్య లక్ష్యం. ఆ దిశగా ప్రతి రచన ఒక నూతన యత్నం, ఒక అంతర్ముఖ ప్రయాణం.
సాహిత్యం నా కోసం కేవలం అభిరుచి కాదు; అది నా ఆత్మ స్వరూపం. నా కలం నా ఆలోచనలకు శ్వాస, నా రచన నా జీవితయానం.








Comments