top of page

మానవ సేవే...మాధవ సేవ


'Manava Seve Madhava Seva' New Telugu Story


Written By Ch. Pratap(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జయంతపురంలో రామయ్య, కృష్ణయ్య అనే స్నేహితులు వుండేవారు. వారిద్దవిరివీ పక్క పక్క ఇళ్లు. ఇద్దరూ తమకు తమ తాతల నుండి సంక్రమించిన వ్యవసాయ భూమిలో సేద్యం చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో సంతృప్తిగా జీవిస్తుండేవారు. ఇద్దరి కుటుంబాల మధ్య మంచి స్నేహం వుంది.


ఒక రోజు రామయ్య కృష్ణయ్య వద్దకు వచ్చి అక్కడికి 200 మైళ్ళ దూరంలో వున్న ప్రసిద్ధ వినాయకుని క్షేత్రానికి వెళ్దామని అడిగాడు. అక్కద దైవ దర్శనం చేసుకుంటే జీవితంలో వచ్చే అన్ని సమస్యలు తొలిగిపోయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన్నది ఆ దేసవాసుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆ క్షేత్రంలో సంవత్సరానికి ఒకసారి పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరకు వెళ్దామని రామయ్య అడగగా కృష్ణయ్య వెంటనే అంగీకరించాడు. జాతరకు నాలుగు రోజుల వ్యవధే ఉన్నందున మర్నాడే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇద్దరూ బయలుదేరారు.

మూడవ రోజుకు ఒక గ్రామం పొలిమేరకు చేరగా అక్కడ రహదారి పక్కన అచేతనంగా పడివున్న ఒక వృద్ధుడు వారికి కనిపించాడు. వెంటనే రామయ్య ఎడ్ల బండి ఆపించి కిందకు దిగి ఆ వృద్ధుడిని పరీక్షించాడు. అతని నాడి చాలా బలహీనంగా వుంది. బహుశా అధిక శ్రమ, అనారోగ్యం, పస్తుల ఉండటాన ఆ వృద్ధుడు అచేతనమైపోయి వుంటాడనుకున్నారు. తన సీసా నుండి అతని ముఖంపై నీళ్ళు జల్లి, కాస్త బలవంతంగా త్రాగించి అతడిని సపర్యలు చేయసాగాడు రామయ్య. ఇదంతా చూస్తున్న కృష్ణయ్య ముఖం చిట్లించాడు. లేని పోని తద్దినం తలకు తగిలించుకోవడం అంటే ఇదే రామయ్యా? ఇప్పుడో, మరుక్షణమో అన్నట్లు వున్న ఈ ముసలాడికి సేవలు చేయడం అవసరమా చెప్పు?

ఇతగాడికి సపర్యలు చేస్తూ సమయం వృధా చేసుకుంటే రేపటికి మనం జాతరకు చేరలేము. అసలే ముందు దట్టమైన అదవి వుంది. దానిని చీకటిపడే లోగా దాటటం ఎంతో అవసరం.ఈ ముసలయ్యను వదిలిపెట్టి త్వరగా రా" అంటూ కృష్ణయ్య విసుగుతో రామయ్యను తొందరపెట్టసాగాడు. రామయ్య ఎంతో ప్రశాంతంగా" మిత్రమా, సాటి మనిషి ఆపదలో వున్నప్పుడు ఆదుకోవడం సాటి మానవునిగా మన కనీస కర్తవ్యం. ఇతడు కొన ఊపిరితో వున్నాడు. కాస్త సపర్యలు చేస్తే కోలుకునే అవకాశాలు మెండుగా వున్నాయి. ఈ పరిస్థితిలో మన స్వార్ధం చూసుకోవడం అన్యాయం.ఇతడికి నేను చేతనైనంత సేవలు చేసాకే ఇక్కడి నుండి కదులుతాను" అని ధృఢంగా అన్నాడు.

ఆ మాటలకు కృష్ణయ్య ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఏం చెప్పినా రామయ్య వినేటట్లు లేడు. అతని చాదస్తంతో తనకు పని లేదు. ఇక్కడ వుండడం అనవసరం నౌకున్నాడు.

"అయితే నీ ఖర్మ నీది. నేను ఇక్కడ నీతో కూర్చోని ఈ ముసలాయనకు సేవలు చెస్తూ నా సమయం వృధా చెసుకోలేను. నేను బండి తీసుకొని బయలుదేరుతున్నాను. రేపటికల్లా జాతరకు చేరుకోవాలన్న నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు" అని బండి తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు.


తర్వాత ఎంతో ఓపికతో ఆ వృద్ధుడికి రామయ్య సపర్యలు చేసాడు. ఆహారం, నీరు కొంచెం కొంచెం గా పట్టించాడు. తన దగ్గర వున్న అత్యవసర మందులు వేసాడు.

రెండు గంటల తర్వాత అతని కష్టం ఫలించింది.ఆ వృద్ధుడు కాస్త తెప్పరిల్లి కళ్ళు తెరిచాడు. తనకు ఎంతో సేవ చేసిన రామయ్యకు చెమ్మగిల్లిన కళ్ళతో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పక్కనే వున్న పల్లె తన స్వంత ఊరని చెప్పాడు. భగవంతుడు నీకు మేలు చేస్తాడని, నీ కుటుంబం పది కాలాలపాటు అష్టైశ్వర్యాలతో సంతోషంగా దీవించాలని ఆశీర్వదించి, నెమ్మదిగా చేతి కర్ర సహాయంతో తన ఊరికి బయలుదేరాడు.

సాటి మనిషిని ఆదుకున్నానన్న తృప్తితో మనసు నిండు కుండలా రామయ్యకు అనిపించింది. తన సామానుతో కాలినడకన ముందుకు బయలుదేరాడు.

సాయంత్రానికి దట్టమైన అడవి లోకి ప్రవేశించాడు. ఇక్కడ ఆగడం ప్రమాదం కాబట్టి ముందుకే సాగాలని నిర్ణయించుకున్నాడు.

అలా ముందుకు వెళ్తుండగా దారి పక్కన రక్తసిక్తమై పడివున్న కృష్ణయ్య కనిపించాడు.

అదవిలో దొంగలు తమ బండిని అడ్డగించి బండితో పాటు తన సామాను, డబ్బు దోచుకుపోయారని, అడ్డం వచ్చిన బండివాడిని అతి కిరాతకంగా కొట్టి చంపేసారని ఏడుస్తూ చెప్పాడు. రామయ్య మాటలు వినకుండా, ఆపదలో వున్న సాటివారిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి తన స్వార్ధం చూసుకొని వచ్చేసినందుకు తనకు తగిన శాస్తే జరిగిందని కన్నీళ్ళ పర్యంతమై చెప్పాడు. రామయ్యను పదే పదే క్షమించమని ప్రాధేయపడ్డాడు.


"మానవ సేవే మాధవ సేవ అని, ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని మన పెద్దలు ఎందుకన్నారో ఇప్పుడు నాకు అర్ధమయ్యింది. విగ్రహాలలో వుండే దైవం కన్నా సాటి మానవులలో, సకల జంతుజాలంలో వుందే ఆత్మస్వరూపమైన దైవాన్ని చూడాలన్న సత్యాన్ని ఇప్పుడే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను" గాద్గిక కంఠంతో అన్నాడు కృష్ణయ్య

"కృష్ణయ్యా, మనం ఇతరులకు చేసిన సహాయం వృధాగా పోదన్న మా తండ్రిగారి మాటల్ని మనస్పూర్తిగా నమ్మి ఆచరించే వ్యక్తిని నేను. తమకు ఎన్ని కష్టాలు ఉన్నా ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్నవారే నిజమైన శక్తిమంతులు, శ్రీమంతులు అన్నది వేదోక్తి కూదా. సాయం చేయడం వలన ఇప్పటి వరకు ఎవ్వరూ పేదవారిగా మారలేదు.ప్రపంచం మన కోసం ఏమి చేసిందనే కాకుండా మనం ప్రపంచం కోసం ఎప్పుడు ఎక్కువ చేస్తామో అప్పుడే జీవితంలో అసలు విజేతవవుతాము.అందుకే మన పెద్దవాళ్ళు మీరు ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపితే.. మీ జీవితానికి కొత్త దారి కూడా కనుక్కుంటారు అని అంటుంటారు. నీ అదృష్టం వలన దైవ దర్శనం చేసుకుందాం" అని, "దైవానుగ్రహం నీ మీద పుష్కలంగా వుండబట్టి నువ్వు నాకు కనిపించావు. లేకుంటే నువ్వు ఏమైపోయేవాడివని తలుచుకుంటేనే భయం వేస్తోంది. పద కలిసి ప్రయాణం చేద్దాం. పక్క ఊరిలో కట్టించుకుందాం" అని కృష్ణయ్యకు ధైర్యం చెప్పాడు రామయ్య.

***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.270 views0 comments
bottom of page