top of page
Original.png

డైనింగ్ టేబుల్ - పార్ట్ 2

డైనింగ్ టేబుల్ పార్ట్ 2, తెలుగు కుటుంబ కథ, కోడలు కథ, కూతురు కోడలు తేడా, కుటుంబ అనుబంధాలు, తెలుగు భావోద్వేగ కథ, అత్త కోడలు కథ, కుటుంబ విలువలు, తెలుగు వెబ్ కథ, సుమ కథ, కుటుంబ జీవితం, డైనింగ్ టేబుల్ కథ, తెలుగు సీరియల్ కథ, కుటుంబ సంబంధాలు, Telugu Family Story

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'డైనింగ్ టేబుల్ - పార్ట్ 2' కథలో డైనింగ్ టేబుల్ వద్ద ప్రశాంతంగా పండ్లు తినాలని ఆశపడుతున్న సుమ, అదే సమయంలో ఇంటికి వచ్చిన పెద్దలతో కుటుంబ ఆచారాల మధ్య భావోద్వేగ సంఘర్షణను చూపించే హృద్యమైన తెలుగు కుటుంబ దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'డైనింగ్ టేబుల్ - పార్ట్ 2' కథలో డైనింగ్ టేబుల్ వద్ద ప్రశాంతంగా పండ్లు తినాలని ఆశపడుతున్న సుమ, అదే సమయంలో ఇంటికి వచ్చిన పెద్దలతో కుటుంబ ఆచారాల మధ్య భావోద్వేగ సంఘర్షణను చూపించే హృద్యమైన తెలుగు కుటుంబ దృశ్యం.

Dining Table - Part 2 - Telugu Inspirational Story | Sritha

డైనింగ్ టేబుల్ - పార్ట్ 2తెలుగు ప్రేరణాత్మక కథ | శ్రిత

Published in manatelugukathalu.com on 07/07/2026



ఇక డైనింగ్ టేబుల్ - పార్ట్ 2 చదవండి.


కొత్త ఇంట్లో తన కలల డైనింగ్ టేబుల్ దగ్గర కుటుంబంతో కలిసి ప్రశాంతంగా భోజనం చేయాలని ఆశపడిన సుమకు, ఇంటి ఆచారాలు, బాధ్యతలు, ఉద్యోగ జీవితం ఒక్కొక్కటిగా కొత్త అనుభవాలను పరిచయం చేస్తాయి. కూతురు, కోడలు మధ్య సమాజం చూపే చిన్నచిన్న తేడాలను ఒక డైనింగ్ టేబుల్ దృష్టిలో హృద్యంగా చూపించే "డైనింగ్ టేబుల్ - పార్ట్ 2" కుటుంబ బంధాలు, ఆప్యాయత, సంప్రదాయాలు, సమానత్వం, దాంపత్యం, ఆధునిక జీవనశైలిపై ఆలోచింపజేసే భావోద్వేగ తెలుగు కుటుంబ కథ.


6🍄 సుమకు భోజనం అంటే ఉన్న ప్రేమ ఒకవైపు, ఇంటి ఆచారాలు మరోవైపు ఉండే సంఘర్షణ


మరుసటి రోజు ఉదయం...

స్నానం చేసి, పూజ ముగించుకుని సుమ ఎంతో ఉత్సాహంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది.

"ఈరోజైనా నా కల నెరవేరుతుంది," అనుకుంది.


అందరికీ చేసిన అల్పాహారాన్ని అందంగా గిన్నెల్లో సర్ది టేబుల్‌పై అమర్చింది. తన ప్లేట్ కూడా పెట్టుకుంది.

అంతలో కామేశ్వరరావు వచ్చి కూర్చున్నాడు.

"త్వరగా పెట్టు సుమ... ఆఫీసుకు టైమ్ అవుతోంది."

అన్నాడు.


సుమ ప్రేమగా అతనికి వడ్డిస్తూ, తన ప్లేట్‌ను కూడా దగ్గరకు లాక్కుంది.

ఇద్దరూ కలిసి మొదటిసారి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినబోతుండగా...

అత్తగారి గొంతు వినిపించింది.

"అమ్మా... ఈరోజు సోమవారం. మన ఇంట్లో ఈ రోజు ఉపవాసం చేస్తారు. నువ్వూ ఉపవాసం ఉండు."


ఆ మాట విన్న సుమ చేతిలోని చెంచా ఆగిపోయింది.

తనకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

వాళ్లింట్లో కూడా అమ్మ అప్పుడప్పుడు ఉపవాసం ఉండేది.

కానీ నాన్న ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు.

"దేవుడికి ఆకలితో ఉండడం కాదు, భక్తి ముఖ్యం. భోజనం మానేయడం వల్ల కాదు, మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన వల్లే పూజకు విలువ."


ఆ మాటలే సుమ మనసులో తిరుగుతున్నాయి.

ఏం చేయాలో అర్థం కాక తండ్రికి ఫోన్ చేసింది.

అన్నీ విన్న తండ్రి కాసేపు మౌనంగా ఉన్నాడు.

కూతురికి ఎప్పుడూ ఆకలితో ఉండమని చెప్పని తండ్రి...

ఇప్పుడు అత్తారింటి ఆచారాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడలేడు.

చివరికి మెల్లగా అన్నాడు.

"అమ్మా... పెద్దవాళ్ల మనసు నొప్పించకు. నీకు పూర్తిగా ఉపవాసం కష్టమైతే పండ్లు తింటూ ఉండు."


ఆ మాటతో సుమ మనసు కాస్త తేలికపడింది.

వెంటనే ఆపిల్, జామ, బొప్పాయి, పుచ్చకాయ, సపోటా...

తనకు నచ్చిన పండ్లన్నీ తీసుకొచ్చి అందంగా ముక్కలుగా కోసింది.

రంగురంగుల ప్లేట్‌లో కళాత్మకంగా అమర్చింది.

డైనింగ్ టేబుల్ వైపు చూసి నవ్వుతూ అంది.

"ఈరోజైనా నీతో కూర్చొని తిందాం అనుకున్నాను. వంటలు కాకపోయినా పండ్లైనా సరే... నీ మీద కూర్చొని తింటే నాకు అదే ఆనందం."


డైనింగ్ టేబుల్ ఆనందంతో మురిసిపోయింది.

"ఎట్టకేలకు ఈ రోజు నా ఎదురుగా కూర్చుంది!"

అని మనసులో అనుకుంది.


సుమ ఫోన్ కూడా పక్కన పెట్టేసింది.

"ముందు ఈ ఆపిల్... తర్వాత సపోటా... చివర్లో పుచ్చకాయ..."

అని చిన్నపిల్లలా తనలో తానే మాట్లాడుకుంటూ మొదటి ముక్క తీసుకోబోతోంది.

అంతలోనే...

టింగ్... టాంగ్...

కాలింగ్ బెల్ మోగింది.

"అయ్యో! ఇప్పుడెవరు వచ్చారబ్బా?"

అని నవ్వుకుంటూ తలుపు తీసేందుకు వెళ్లింది.


తలుపు తెరిచి చూసేసరికి...

ఎదురుగా బామ్మగారు, తాతగారు చిరునవ్వుతో నిలబడి ఉన్నారు.

సుమ చేతిలోని ఆనందం మళ్లీ ఒక్క క్షణం ఆగిపోయింది...


7🍄తలుపు తీసి చూసేసరికి వచ్చిన వారు తాతగారు, బామ్మగారు. వారితో పాటు వారి మనవరాలు కూడా వచ్చింది.

సుమ ఆనందంగా లోపలికి ఆహ్వానించింది.

అప్పటికే డైనింగ్ టేబుల్ మీద అందంగా అమర్చిన పండ్ల ప్లేట్ అలాగే ఉంది.

సుమ మళ్లీ కూర్చుని మొదటి ముక్క నోట్లో వేసుకోబోతుండగా...

తాతగారు ఆశ్చర్యంగా అడిగారు.

"ఏమ్మా కోడలూ... ఈరోజు సోమవారం ఉపవాసం కదా! పండ్లు కూడా తింటున్నావా?"


సుమ ఒక్కసారిగా ఆగిపోయింది.

"అత్తయ్య... పండ్లు తినొచ్చన్నారు కదా..."

అని మెల్లగా అంది.


"అయ్యో... మా ఇంట్లో అయితే కోడళ్లు పండ్లు కూడా తినరు. అలా ఉంటేనే వ్రతానికి ఫలం ఉంటుంది."

అన్నారు.


సుమ నిశ్శబ్దంగా పండ్ల ప్లేట్‌ను పక్కకు జరిపేసింది.

ఆ దృశ్యాన్ని చూస్తూ డైనింగ్ టేబుల్‌కు ఏదో బాధ కలిగింది.

"ఎవరైనా భోజనం చేస్తుంటే, 'తినకు' అని చెప్పడం కూడా ఉంటుందా?"

"ఇంత ఇష్టంగా పండ్లు కోసుకుని కూర్చుంది... ఇప్పుడు మళ్లీ ఆకలిగానే లేవాలా?"

అని అనుకుంది.


అంతలో తాతగారు తమ మనవరాలిని పిలిచి,

"రా అమ్మా... నువ్వు ఏమీ తినకుండా వచ్చావు కదా! ఈ పండ్లు నువ్వు తిను."

అన్నారు.


సుమ ఆశ్చర్యంగా చూసింది.

డైనింగ్ టేబుల్‌కు ఇంకా ఆశ్చర్యమేసింది.

"ఇద్దరూ ఒకే ఇంటి ఆడపిల్లలే కదా! ఒకరికి 'తినకు'... ఇంకొకరికి 'తిను'... ఈ తేడా ఎందుకు?"

అని దానికి అర్థం కాలేదు.


అది పెద్ద సంఘటన కాదు.

ఎవరూ గొడవపడలేదు.

ఎవరూ గట్టిగా మాట్లాడలేదు.


కానీ...

ఆ చిన్న సంఘటన డైనింగ్ టేబుల్ మనసులో ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది.

"కూతురికి ఒక నియమం... కోడలికి మరో నియమం ఎందుకు?"


అయితే ఒక విషయం మాత్రం దానికి స్పష్టంగా అర్థమైంది.

తనను ఎంత ప్రేమగా ఇంటికి తెచ్చుకున్న సుమ...

ఈరోజూ తన ఎదురుగా కూర్చొని మనసారా తినలేకపోయింది.

అది చూసి డైనింగ్ టేబుల్ మౌనంగా నిట్టూర్చింది.


8 డైనింగ్ టేబుల్ దృష్టిలో "కూతురు–కోడలు" మధ్య తేడాను గమనించడం , అమ్మాయిలు అంటే అమ్మాయి లే కద? భేధ భావలు ఎందుకు??అందరూ ఒకేలా ఉండరనే భావన !!


సాయంత్రం అయింది.

ఇంట్లో మళ్లీ సందడి మొదలైంది.

టీలు, కాఫీలు, టిఫిన్లు...

ఎవరి చేతిలో వాళ్ల కప్పు, ప్లేట్.

ఎప్పటిలాగే అందరూ హాల్లో కూర్చొని తింటున్నారు.

డైనింగ్ టేబుల్ మాత్రం మౌనంగా వారిని చూస్తూనే ఉంది.

సుమ వంటగది నుంచి హాల్‌కు, హాల్‌ నుంచి వంటగదికి తిరుగుతూనే ఉంది.

ఎవరికేం కావాలో అది అందిస్తోంది.


అంతలో తాతగారు అడిగారు.

"అమ్మాయి... నువ్వు చదువుకున్నావు కదా! ఉద్యోగం చేస్తున్నావా?"


"రేపటి నుంచి జాయిన్ అవుతాను తాతయ్య."

అని నవ్వుతూ చెప్పింది సుమ.


"చాలా మంచిది. ఉద్యోగం కూడా చూసుకో... ఇల్లూ చూసుకో."

అని ఆశీర్వదించారు.


ఆ మాటలు వింటూ డైనింగ్ టేబుల్ మనసులో అనుకుంది.

"రేపటి నుంచి ఉద్యోగం కూడా మొదలవుతుందా? మరి నా ఎదురుగా కూర్చొని తినే సమయం ఇంకెప్పుడు దొరుకుతుంది?"


ఆ రాత్రి అందరూ నిద్రపోయారు.

మరుసటి రోజు...

సుమ ఉద్యోగంలో మొదటి రోజు.

తెల్లవారుజామునే లేచి వంట చేసింది.

లంచ్‌బాక్స్ సర్దింది.

అందరికీ అల్పాహారం సిద్ధం చేసింది.

తన టిఫిన్ బాక్స్‌ను ప్రేమగా డైనింగ్ టేబుల్ మీద పెట్టి నవ్వుతూ అంది.

"ఈరోజు మాత్రం తప్పకుండా నీ మీద కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫీసుకి వెళ్తాను."


డైనింగ్ టేబుల్ ఆనందంతో ఎదురుచూసింది.

సుమ ప్లేట్‌లో టిఫిన్ పెట్టుకుని కూర్చోబోతుండగా...

కామేశ్వరరావు గడియారం చూసి,

"సుమా... త్వరగా రా. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆలస్యం అయితే నీకే ఇబ్బంది."

అన్నాడు.


సుమ ఒక్కసారి ప్లేట్ వైపు చూసింది...

మరోసారి గడియారం వైపు చూసింది...

చివరికి టిఫిన్‌ను కూడా డబ్బాలో వేసి బ్యాగ్‌లో పెట్టుకుంది.

"కారులో తింటాను."

అని తొందరగా బయటికి వెళ్లిపోయింది.


డైనింగ్ టేబుల్ ఆశ్చర్యంగా చూస్తూనే ఉండిపోయింది.

"తిండి అంటే ప్రాణం అనుకున్న ఈ అమ్మాయి... నన్ను ఎంత ప్రేమగా ఇంటికి తెచ్చుకుందో... కానీ ఒక్కరోజు కూడా నా ఎదురుగా ప్రశాంతంగా కూర్చొని తినలేకపోతోంది."


"మనుషులు డైనింగ్ టేబుల్‌ను భోజనం కోసం కొంటారా... లేక ఇంట్లో ఒక వస్తువుగా ఉంచుకోవడానికా?"

అని బాధపడింది.


అంతలో...

గుమ్మం దాటి వెళ్లిన సుమ ఒక్కసారిగా మళ్లీ వెనక్కి వచ్చింది.

డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి దాని మీద మెల్లగా చేయి వేసింది.

"బై..."


"ఈరోజు సాయంత్రం వచ్చాక తప్పకుండా నీ దగ్గర కూర్చొని తింటాను."


"నువ్వు ఇంటికి వచ్చి ఇన్ని రోజులు అయింది. ఇంకా నీ మీద కూర్చొని మనసారా ఒక్క భోజనం కూడా చేయలేకపోయాను."

అని మెల్లగా చెప్పి వెళ్లిపోయింది.


ఆ మాటలు విని...

డైనింగ్ టేబుల్‌కు కళ్లుంటే కన్నీళ్లు వచ్చేవి.


"ఎంత చిన్న కోరిక! ప్రశాంతంగా కూర్చొని ఒక పూట భోజనం చేయాలన్న కోరిక కూడా తీర్చుకోవడానికి ఇంత కష్టమా?"

అని అనుకుంది.


ఇంకో విషయం కూడా అది గమనించింది.

ఈ ఇంట్లో ఎవరు వచ్చినా...

ఎవరికోసం ఏ నియమం ఉంటుందో, ఎప్పుడు మారుతుందో తనకు అర్థం కాలేదు.

కానీ తన సంగతి మాత్రం స్పష్టం.

"నా దగ్గర కూర్చునేవాళ్లలో కూతురూ లేదు... కోడలూ లేదు... మగవాడూ లేదు... ఆడవాడూ లేదు...

ఆకలితో వచ్చే ప్రతి మనిషీ నాకు ఒక్కటే.

అందరికీ నేను ఒకేలా చోటిస్తాను."

అని నిశ్శబ్దంగా నిలబడి సుమ తిరిగి వచ్చే సమయం కోసం ఎదురుచూడసాగింది.


9🍄 మొదట కలల డైనింగ్ టేబుల్, ఇప్పుడు బాధ్యతల డైనింగ్ టేబుల్గా మారుతోంది.


ఉరుకులు... పరుగులు...

అలా సంసార జీవితం మొదలైంది.

ఉదయం ఉద్యోగం... లంచ్‌బాక్స్... ట్రాఫిక్...

సాయంత్రం అలసట... ఇంటి పనులు...

రోజులు ఒకదాని వెంట ఒకటి పరుగెత్తసాగాయి.

మొదటి రోజు ఉద్యోగం ముగించుకుని ఇంటికి వచ్చిన సుమ, కాసేపు విశ్రాంతి తీసుకుంది.


"ఈరోజైనా నా డైనింగ్ టేబుల్ మీద ప్రశాంతంగా కూర్చొని భోజనం చేస్తాను."

అని ఆనందంగా హాల్లోకి వచ్చింది.


కానీ...

డైనింగ్ టేబుల్ దగ్గర అప్పటికే అత్తగారు కూర్చుని కూరగాయలు తరుగుతున్నారు.

"రేపు నీకు ఆఫీసుకు వెళ్లాలి కదా అమ్మా! అందుకే ఇప్పుడే కట్ చేసి పెడుతున్నాను."

అన్నారు.


సుమ చిరునవ్వు నవ్వింది.

ఏమీ అనలేదు.

డైనింగ్ టేబుల్ మాత్రం మనసులో అనుకుంది.

"నన్ను భోజనం కోసం కొన్నారు... ఇప్పుడు నా మీద కూరగాయల బల్లగా పని మొదలైందా?"

అని.


అయినా సుమ నిశ్శబ్దంగా టేబుల్ శుభ్రం చేసింది.

పాత్రలు తీసి, కడిగి, మళ్లీ మెరిసేలా తుడిచింది.

రాత్రి భోజనం చేసే సమయానికి కామేశ్వరరావు నుంచి ఫోన్ వచ్చింది.

"మీటింగ్ ఉంది సుమ... ఆలస్యం అవుతుంది."


సుమ ప్లేట్‌లో భోజనం పెట్టుకుని భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే తినేసింది.


డైనింగ్ టేబుల్ మరోసారి ఖాళీగానే మిగిలిపోయింది.

"ఇదేనా ఈ కాలం సంసారం?"

"ఒకే టేబుల్ దగ్గర కూర్చొని రెండు మాటలు మాట్లాడుకుంటూ భోజనం చేసే సమయం కూడా లేదా?"

అని నిశ్శబ్దంగా ప్రశ్నించుకుంది.


రోజులు గడుస్తున్నాయి.

ఉదయం...

సుమ లంచ్‌బాక్స్ సర్దుతుంది.

దాన్ని నా మీద పెట్టి బయలుదేరుతుంది.


సాయంత్రం...

ఆఫీసు నుంచి వచ్చాక తన ల్యాప్‌టాప్‌, ఫైళ్లు తీసుకుని నా దగ్గరే కూర్చుంటుంది.

"ఈరోజు ఆఫీసులో ఇలా జరిగింది..."

"మా టీమ్‌లో వాళ్లు ఇలా అన్నారు..."

"నీ కోసం కొత్త ప్లేస్‌మ్యాట్స్ కొనాలని అనుకుంటున్నాను..."

అని నాతోనే మాట్లాడుకుంటుంది.


కానీ...

ఆ మాటలు ముగిసేలోపే సమయం అయిపోతుంది.

ఏదో తొందరగా తింటుంది.

పడుకుంటుంది.

అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది.

"పెళ్లికి ముందు... సుమకు భోజనం అంటే పండగ.

పెళ్లి తర్వాత... భోజనం అంటే అవసరం."


ఒకప్పుడు ప్రతి ముద్దను ఆస్వాదించిన అమ్మాయి...

ఇప్పుడు ఆకలి తీర్చుకోవడానికే తింటోంది.

కొన్ని రోజుల తర్వాత జీతం వచ్చింది.

సుమ ఆనందంగా ఇంటికి కొన్ని కొత్త వస్తువులు కొనుక్కొచ్చింది.

అవి చూసి నేను కూడా సంతోషించాను.


కానీ...

ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.


అత్తగారు ఒక్కొక్క డబ్బా తీసుకొచ్చి నా మీద పెట్టడం మొదలుపెట్టారు.

"ఇది కంది పొడి..."

"ఇది కరివేపాకు పొడి..."

"ఇది నెయ్యి..."

"ఇది ఆవకాయ..."

"ఇవి లడ్డూలు..."

"ఇవి పండ్లు..."


సుమ మెల్లగా అంది.

"అత్తయ్య... ఇవన్నీ కిచెన్ క్యాబినెట్‌లో పెడితే బాగుంటుంది కదా."


అత్తగారు నవ్వేశారు.

"అయ్యో... నాకు అందుబాటులో ఇక్కడే ఉంటే సౌకర్యంగా ఉంటుంది."

అన్నారు.


చూస్తుండగానే...

నా మీద భోజనం చేసే చోటు తగ్గిపోయింది.

ఒకవైపు పచ్చళ్లు...

మరోవైపు పొడులు...

ఇంకోవైపు పండ్లు...

మరో మూల మందులు...

నేను డైనింగ్ టేబుల్‌లా కాక...

బాధ్యతలన్నీ మోస్తున్న ఓ మౌన మనిషిలా మారిపోయాను.


అది చూసి సుమ నా దగ్గరకు వచ్చి మెల్లగా చేయి వేసింది.

"నిన్ను నేను ఇలా ఊహించలేదు...

నువ్వు నా భోజన స్నేహితుడిగా ఉండాలని అనుకున్నాను.

ఇప్పుడు అందరి అవసరాల్ని మోస్తున్నావు."

ఆమె కళ్లలోని బాధ నాకు కనిపించింది.


అప్పుడు నేను మనసులో నవ్వుకున్నాను.

*"పర్వాలేదు సుమా...

నన్ను నువ్వు ప్రేమతో ఇంటికి తీసుకొచ్చావు.

ఇప్పుడు నేను ఈ ఇంటి బాధ్యతలను కూడా ప్రేమతో మోస్తాను.

ఎప్పుడో ఒక రోజు...

నువ్వు మళ్లీ నా ఎదురుగా ప్రశాంతంగా కూర్చొని, మనసారా ఒక ముద్ద తింటావు.

ఆ రోజు కోసం నేనూ ఎదురుచూస్తూనే ఉంటాను."*


10🍄

ముగింపు...

ఈ కథలోని సుమ... మీ ఇంట్లో ఉండొచ్చు.

ఈ కథలోని డైనింగ్ టేబుల్... మీ ఇంట్లో కూడా ఉండొచ్చు.

ఒక్కసారి మీ డైనింగ్ టేబుల్‌ను గమనించండి.


దాని మీద ఏముంది?

భోజనం చేసే ప్లేట్లా...

లేక పచ్చళ్ల సీసాలా...

మందుల డబ్బాలా...

ల్యాప్‌టాప్‌లా...

లంచ్‌బాక్స్‌లా...

లేక ఇంటి బాధ్యతలన్నీనా?

మరొక్కసారి ఆలోచించండి…


చివరిసారిగా మీరు మీ కుటుంబంతో కలిసి, ఎలాంటి తొందర లేకుండా, ఫోన్ పక్కన పెట్టి, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మనసారా భోజనం చేసిన రోజు ఎప్పుడు?


కోడలిగా ఉన్నప్పుడు మనకు ఒక కోరిక ఉంటుంది.

కూతురిగా పుట్టింటికి వెళ్లినప్పుడు, అదే కోరిక ఇంకొక కోడలికి కూడా ఉండొచ్చని ఒక్కసారి గుర్తు చేసుకుంటే... చాలాసార్లు చిన్న చిన్న మార్పులు పెద్ద ఆనందాలను తీసుకొస్తాయి.


కాలం మారింది.

మన చేతుల్లో మొబైళ్లు వచ్చాయి.

ల్యాప్‌టాప్‌లు వచ్చాయి.

ఇళ్లు మారాయి.

జీవనశైలి మారింది.


కానీ...

మన ఇంట్లో కలిసి కూర్చొని భోజనం చేసే అలవాటు మాత్రం ఎక్కడో వెనుకబడిపోయింది.


అది మళ్లీ తిరిగి వస్తే...

డైనింగ్ టేబుల్ ఒక ఫర్నిచర్ మాత్రమే కాదు...

కుటుంబాన్ని కలిపే బంధంగా మారుతుంది.


ఈ రోజు ఒక్క పూటైనా...

ప్రశాంతంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, మీవాళ్లతో కలిసి భోజనం చేయండి.


బహుశా...

మీ ఇంట్లోని డైనింగ్ టేబుల్ కూడా మనసులో ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుందేమో!


=============================

సమాప్తం

=============================


శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:


శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: శ్రిత

శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.

ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page