డైనింగ్ టేబుల్ - పార్ట్ 1
- Jamunarani B
- 2 hours ago
- 7 min read
డైనింగ్ టేబుల్ కథ, తెలుగు కుటుంబ కథ, కుటుంబ అనుబంధం, కోడలు అత్త కథ, భావోద్వేగ తెలుగు కథ, తెలుగు వెబ్ కథ, కుటుంబ విలువలు, ప్రేమ మరియు ఆప్యాయత, Telugu Family Story, Dining Table Story

Dining Table - Part 1 - Telugu Inspirational Story | Sritha
డైనింగ్ టేబుల్ - పార్ట్ 1 - తెలుగు ప్రేరణాత్మక కథ | శ్రిత
Published in manatelugukathalu.com on 07/07/2026
కొత్తగా పెళ్లయిన కుసుమ తన కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన మొదటి రోజే, అక్కడ ఉన్న గ్లాస్‌టాప్ డైనింగ్ టేబుల్‌తో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుకుంటుంది. ఆ డైనింగ్ టేబుల్ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలు, కుటుంబ సభ్యుల మధ్య పెరిగే అనుబంధాలు, కొత్త కోడలిగా ఆమె భావోద్వేగాలు ఈ కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. "డైనింగ్ టేబుల్ - పార్ట్ 1" కుటుంబ బంధాలు, దాంపత్యం, అత్తా-కోడళ్ల అనుబంధం, కొత్త జీవితంలోని ఆశలు, ఆప్యాయతలు, భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించే తెలుగు కుటుంబ కథ.
ప్రతి ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది. కానీ అది కేవలం భోజనం చేసే చోటు మాత్రమే కాదు. కుటుంబ సభ్యుల నవ్వులు, చిన్న చిన్న గొడవలు, ప్రేమ, అపార్థాలు, సంతోషాలు, బాధలు—అన్నింటికీ అది మౌన సాక్షి.
ఈ కథలోని డైనింగ్ టేబుల్ కూడా అలాంటి ఎన్నో సంఘటనలను చూసింది. కోడలు–అత్తగారి మధ్య జరిగిన సంభాషణలు, ఆలుమగల మధ్య చోటుచేసుకున్న మాటలు, మనసుల్లో దాగిన భావాలు… అన్నింటినీ నిశ్శబ్దంగా గమనించింది.
రోజూ అక్కడికి వచ్చేది సుమ— అంటే కుసుమ. పేరు సుమ అయినా, తిండి విషయంలో ఆమెకు ఉన్న ప్రేమ, గౌరవం, ఆస్వాదన మాటల్లో చెప్పలేనిది. తనకు నచ్చినది రుచిగా, ప్రేమగా వడ్డిస్తే చాలు; ఆమెకు అది ఒక యజ్ఞం, ఒక ఆనందం. కానీ తనను పట్టించుకోకుండా, గౌరవం లేకుండా పెట్టిన ఆహారం ముందు మాత్రం ఆమె ఒక్క ముక్క కూడా ముట్టదు.
సుమ తినే తీరు, ఆమెకు ఆహారం మీద ఉన్న ప్రేమ, ఆ ప్రేమను అర్థం చేసుకున్నవారి స్పందనలు—ఇవన్నీ దాని జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి.
ఆ డైనింగ్ టేబుల్ ఏమి చూసింది? ఆ సంఘటనలను అది ఎలా అర్థం చేసుకుంది? చివరికి ఏం జరిగింది?
తెలుసుకోవాలంటే ఈ కథను చదవండి.
1🍄
సుమ... అందరూ ఆమెను సుమ అని పిలుస్తారు. కానీ ఆమె అసలు పేరు కుసుమ.
'కుసుమ' అంటే సుకుమారంగా, పువ్వులా ఉంటుందని అనుకుంటారు. కానీ మా కుసుమ అలా కాదు. కత్తిలా తీక్షణంగా, దృఢంగా, ఆరోగ్యంగా, చలాకీగా, అందంగా ఉంటుంది.
ఆమెకు ఫుడ్ అంటే ప్రాణం. "బతకడానికి తినడం" అనే మాట ఆమెకు వర్తించదు. "తినడానికే బతకడం" అనేదే ఆమె సిద్ధాంతం. ఎక్కడ మంచి వంటకం కనిపించినా, దాని వాసనను ఆస్వాదిస్తూ, రుచిని నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినేస్తుంది. ఆమెకు ఫుడ్ కేవలం ఆకలి తీర్చేది కాదు; అది స్నేహితుడు, ఆనందం, జీవితం.
అయితే ఒక విషయం మాత్రం ఖాయం. ప్రేమ, ఆప్యాయత, గౌరవం లేకుండా పెట్టిన భోజనం అయితే ఎంత రుచిగా ఉన్నా ఆమె ముట్టుకోదు. చిన్నప్పటి నుంచే "అన్నం పరబ్రహ్మ స్వరూపం... ఆహారాన్ని ఎప్పుడూ వృథా చేయకూడదు" అని నేర్చుకుంది. అదే అలవాటు ఆమెలో ఆహారం పట్ల మరింత గౌరవాన్ని పెంచింది.
వంట చేయడం రాదని అనుకునేరు. చాలా బాగా చేస్తుంది. కానీ తనకోసం తాను వండి తినడం కంటే, ఎవరైనా ప్రేమగా వడ్డిస్తే ఇంకా ఇష్టంగా తింటుంది.
కాలేజీలో ఆమెకు మరో పేరుంది—"వేస్ట్ టిఫిన్ బాక్స్." ఎవరి టిఫిన్‌లోనైనా మిగిలితే, "అరే... మన సుమకి ఇచ్చేద్దాం!" అని అందరూ ప్రేమగా ఆమెకే ఇచ్చేవారు.
సుమ కూడా మొహమాటం లేకుండా, ఆ ఆప్యాయతను గౌరవిస్తూ, టిఫిన్ బాక్స్‌ను మెరిసేలా ఖాళీ చేసేది. అందుకే అందరూ తమకు నచ్చిన వంటకాలు కనిపిస్తే, "ఇది సుమకి బాగా నచ్చుతుంది" అని గుర్తు పెట్టుకుని తీసుకొచ్చేవారు.
ఆమెను తింటుంటే చూసినవాళ్లు సరదాగా, "నువ్వు ఫుడ్‌ని ఎంజాయ్ చేయడం కాదు... నిన్ను చూసి ఫుడ్డే ఆనందిస్తోంది. నీ చేత తినబడటం ఆ వంటకం అదృష్టం!" అని ఆటపట్టించేవారు.
అలా నవ్వులు, స్నేహాలు, రుచికరమైన జ్ఞాపకాల మధ్య కాలేజీ జీవితం గడిచిపోయింది.
అందం, చలాకీతనం, కలుపుగోలుతనం—ఈ మూడు కలిసి ఉండడంతో ఆమెను కోడలిగా చేసుకోవాలని చాలామంది కోరుకున్నారు. చివరికి పెద్దలు చూసిన సంబంధంతో సుమ పెళ్లి కూడా ఘనంగా జరిగిపోయింది.
2🍄
కొత్త జీవితం... కొత్త ఇల్లు... కొత్త బంధాలు... కొత్త కలలు...
ఆ కలలన్నింటినీ గుండెల్లో నింపుకుని కుసుమ తన అత్తారింట్లో అడుగుపెట్టింది.
భర్త కామేశ్వరరావు మంచి ఉద్యోగం చేస్తాడు. అందగాడు. మంచి మనసున్నవాడు. నగరంలో చక్కని ఫ్లాట్ కూడా ఉంది. కొత్త కాపురం కాబట్టి ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ ఒక్కొక్కటిగా కొనడం మొదలైంది.
అందరికీ నచ్చిన సోఫా సెట్ వచ్చింది. బెడ్లు వచ్చాయి. అల్మారాలు వచ్చాయి. వంటగది సామాన్లు వచ్చాయి.
కానీ...
సుమ మనసు మాత్రం ఒక్క వస్తువు దగ్గరే ఆగిపోయింది.
డైనింగ్ టేబుల్!
"వంటగది ఎంత ముఖ్యమో... భోజనం చేసే చోటు కూడా అంతే ముఖ్యం," అనుకుంది.
ఒక రోజు ఇద్దరూ ఫర్నిచర్ షాప్‌కి వెళ్లారు.
అక్కడ వరుసగా నిలబెట్టిన డైనింగ్ టేబుళ్లలో ఒకటి ఆమె కంట పడింది.
పైభాగం మెరిసే గాజు. గాజు కింద రంగురంగుల రాళ్లతో అద్భుతమైన డిజైన్. మార్బుల్ కాళ్లు. మధ్యలో అందమైన అలంకరణ.
చూసిన క్షణంలోనే…
"ఇదే... నా డైనింగ్ టేబుల్!" అని మనసులో అనుకుంది.
ఆ టేబుల్ ముందు నిలబడి కలల్లోకి జారిపోయింది.
"ఇక్కడ అన్నం పెట్టుకుంటాను... ఇక్కడ పప్పు... ఈ మూలలో కూర... పక్కనే నెయ్యి... ఎదురుగా కామేశ్వరరావు కూర్చుంటారు... మనమంతా నవ్వుకుంటూ భోజనం చేస్తాం."
మరో క్షణంలో...
"ఒకరోజు ఇడ్లీ-చట్నీ... ఇంకో రోజు పూరీ-కూర... మరొక రోజు చపాతీ... ఆదివారం బిర్యానీ..."
అలా ఒక్కో వంటకం, ఒక్కో జ్ఞాపకాన్ని ఊహించుకుంటూ చిరునవ్వులు చిందించింది.
అది చూసి...
ఆ డైనింగ్ టేబుల్‌కే ప్రాణం వచ్చినట్టైంది.
"అయ్యో! ఇన్ని సంవత్సరాలుగా ఎంతమందిని చూశాను. అందరూ నన్ను ఒక ఫర్నిచర్ ముక్కగానే చూశారు. కానీ ఈ అమ్మాయి మాత్రం నన్ను తన కుటుంబ సభ్యుడిలా చూస్తోంది. నాపై కూర్చుని తినబోయే ప్రతి భోజనాన్నీ ఇప్పుడే ఊహిస్తోంది."
"నేను ఈ అమ్మాయి ఇంటికే వెళ్లాలి. ఆమె నవ్వులు చూడాలి. ఆమె రుచిగా తినడం చూడాలి. ఆమె కుటుంబంతో కలిసి గడిపే ప్రతి క్షణానికి నేనూ సాక్షిగా ఉండాలి."
అని డైనింగ్ టేబుల్ మనసులోనే నిర్ణయించుకుంది.
అప్పటి నుంచి విచిత్రంగా...
కుసుమ చూపు ఎటు తిప్పినా అదే టేబుల్ కనిపిస్తోంది.
టేబుల్ కూడా...
"రా... నన్నే తీసుకెళ్లు... నీ ఇంటికి నేనే రావాలి..." అని పిలుస్తున్నట్టే అనిపించింది.
కామేశ్వరరావు నవ్వుతూ,
"ఏమైంది? ఇంకెన్ని టేబుళ్లు చూడాలి?" అని అడిగాడు.
కానీ అతనికి తెలియదు...
భార్య టేబుల్‌ను వదలడం లేదు కాదు...
టేబులే భార్యను వదలడం లేదు!
భార్యకు అంతగా నచ్చిందంటే ఇంకేముంది?
"ప్యాక్ చేయండి," అన్నాడు.
ఆ డైనింగ్ టేబుల్ ఆనందంతో ఇంటి దారి పట్టింది.
అది కేవలం ఒక ఫర్నిచర్ కాదు...
కుసుమ జీవితంలో జరగబోయే ఎన్నో నవ్వులకు, కన్నీళ్లకు, అపార్థాలకు, కలయికలకు మౌన సాక్షిగా మారబోతున్న ఒక కొత్త సభ్యుడు.
ఆ తర్వాత ఆ డైనింగ్ టేబుల్ ఏమేం చూసింది? అదే ఈ కథ.
3🍄
ఎట్టకేలకు ఆ డైనింగ్ టేబుల్ కుసుమ ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకుంది.
కానీ అది ఇంట్లోకి రావడమే ఒక పెద్ద హంగామా అయింది.
పైభాగం మొత్తం గాజు. కాళ్లు బరువైన మార్బుల్. లిఫ్ట్‌లో పట్టే పరిస్థితి లేదు. మెట్లు ఎక్కించి మూడో అంతస్తుకు తీసుకెళ్లాల్సిందే.
నలుగురు పనివాళ్లు ఎంతో జాగ్రత్తగా టేబుల్‌ను మోస్తూ మెట్టు మెట్టుగా పైకి తీసుకెళ్తున్నారు.
అయితే వాళ్ల కంటే ఎక్కువ టెన్షన్ పడుతోంది కుసుమే.
"అన్నా... జాగ్రత్త! ఆ మూల గోడకు తగులుతుంది."
"కొంచెం నెమ్మదిగా... గాజు ఉంది."
"అయ్యో... కింద స్పాంజ్ పెట్టండి... అలా తిప్పొద్దు."
అంటూ ఒక్క క్షణం కూడా నిశ్శబ్దంగా ఉండడం లేదు.
పనివాళ్లు నవ్వుతూ,
"మేడమ్... మేము రోజూ ఇలాంటివే మోస్తుంటాం. మాకు తెలుసు. మీరు టెన్షన్ పడకండి."
అన్నారు.
కానీ కుసుమకు వాళ్ల మాటలు చెవిన పడలేదు.
అంతలో...
డైనింగ్ టేబుల్ మనసులోనే నవ్వుకుంది.
"అయ్యో! ఈ అమ్మాయి నన్ను ఫర్నిచర్‌లా కాదు... పసిపాపలా చూసుకుంటోంది. 'జాగ్రత్త... జాగ్రత్త...' అంటూ నా కోసం ఇంత కంగారు పడుతోంది. ఈ ఇంటికి రావడం నా అదృష్టమే!"
ఎట్టకేలకు టేబుల్ ఇంటి గుమ్మం దగ్గరకు చేరింది.
అప్పుడే కుసుమ మనసులో ఒక కొత్త ఆలోచన మెరిసింది.
"మన ఇంట్లో కొత్త వాహనం వస్తే హారతి ఇస్తాం... కొత్త స్టవ్ వస్తే పసుపు, కుంకుమ పెడతాం... మరి మనకు ప్రతిరోజూ అన్నం పెట్టే ఈ డైనింగ్ టేబుల్‌కు హారతి ఇస్తే ఎంత బాగుంటుంది!"
వెంటనే అత్తగారి దగ్గరకు వెళ్లి సంకోచంగా అడిగింది.
"అత్తయ్య... ఈ డైనింగ్ టేబుల్‌కు హారతి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టి లోపలికి తీసుకుందామా?"
అప్పుడే వంటగదిలో కూరగాయలు తరుగుతున్న అత్తగారు చేతిలోని కత్తిని కింద పెట్టి ఆశ్చర్యంగా చూసింది.
"అమ్మాయి... నీకు మతిపోయిందా? ఎవరైనా డైనింగ్ టేబుల్‌కు హారతి ఇస్తారా?"
కుసుమ మాత్రం నవ్వుతూ అంది.
"అత్తయ్య... మనం తినే అన్నం దేవుడితో సమానం కదా! అన్నపూర్ణమ్మను పూజిస్తాం కదా! మరి ప్రతిరోజూ కుటుంబమంతా కూర్చుని భోజనం చేసే ఈ టేబుల్‌కు గౌరవంగా హారతి ఇస్తే తప్పేముంది?"
ఆ మాటలు విని పక్కనే నిలబడ్డ కామేశ్వరరావు నవ్వు ఆపుకోలేకపోయాడు.
"ఈ అమ్మాయికి ఫుడ్ అంటే ఇంత పిచ్చా!" అని మనసులో అనుకున్నాడు.
అత్తా-కోడళ్ల మధ్య తాను ఎందుకు పడాలని మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.
చివరికి అత్తగారు మాత్రం ఒప్పుకోలేదు.
"చాలు... లోపల పెట్టించు."
అని చెప్పేశారు.
కుసుమ కాసేపు చిన్నపిల్లలా ముఖం పెట్టినా, వెంటనే తేరుకుంది.
"సరే... హారతి లేకపోయినా పర్వాలేదు. నా ఇంట్లోకి వచ్చింది కదా... అదే చాలు."
అని మనసుకు నచ్చజెప్పుకుంది.
పనివాళ్లకు బహుమానం ఇచ్చి పంపించింది.
ఆ తర్వాత డైనింగ్ టేబుల్‌ను చుట్టూ ఒకసారి తిరిగి చూసి మురిసిపోయింది.
అటు డైనింగ్ టేబుల్ కూడా ఆనందంతో అనుకుంది…
"నాకు హారతి ఇవ్వాలని ఆలోచించిన మనిషిని నేను మొదటిసారి చూస్తున్నాను. ఈ అమ్మాయి నిజంగా భోజనాన్ని ప్రేమిస్తుంది. ఇక నుంచి ఆమె కుటుంబంలో జరిగే ప్రతి నవ్వుకూ... ప్రతి కన్నీటికీ... నేనే మౌన సాక్షిని."
4🍄
ఆ రోజు డైనింగ్ టేబుల్ ఇంటికి వచ్చేసరికి అందరూ బాగా అలసిపోయారు.
కొత్త ఇల్లు... కొత్త సామాన్లు... ఒక్కొక్కటి సర్దుకుంటూ సమయం ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలియలేదు.
అప్పటికే కామేశ్వరరావు,
"పద సుమ... ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నాం. ఈ రోజు బయటే భోజనం చేసి వచ్చేద్దాం."
అన్నాడు.
ఆ మాట విన్న క్షణం సుమ మనసు చిన్నబోయింది.
"అయ్యో! ఇంత ఇష్టంగా తెచ్చుకున్న డైనింగ్ టేబుల్ మీద మొదటి భోజనం చేయాలని ఎంత కలలు కన్నాను. ఈ రోజే బయట తినాల్సి వస్తుందా?" అనుకుంది.
అయినా అందరితో కలిసి బయలుదేరే ముందు ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లింది.
దాని మీద చేయి వేసి మెల్లగా తడిమింది.
"రేపటి నుంచి మనిద్దరి ప్రయాణం మొదలు... ఈ రోజు మాత్రం కాస్త ఓపిక."
అని నవ్వుతూ చెప్పింది.
వెళ్లే ముందు చిన్నపిల్లకు బై చెప్పినట్టు, "గుడ్ నైట్... త్వరలో వస్తాను."
అని చేతి ఊపింది.
డైనింగ్ టేబుల్ కూడా ఆమెనే చూస్తూ నిలబడి ఉన్నట్టనిపించింది.
"ఎంత ప్రేమగా మాట్లాడుతోంది! అందరూ నన్ను వస్తువుగా చూశారు. కానీ ఈ అమ్మాయి మాత్రం నాతోనే స్నేహం చేస్తోంది. ఎప్పుడు నా మీద కూర్చొని ఆనందంగా భోజనం చేస్తుందా అని నాకు కూడా ఎదురుచూపే."
అని మనసులో అనుకుంది.
ఇంటికి తాళం వేసి అందరూ వెళ్లిపోయారు.
విశాలమైన హాల్లో ఇప్పుడు ఒంటరిగా డైనింగ్ టేబుల్ మాత్రమే ఉంది.
"సుమ... ఇంత త్వరగా నన్ను వదిలి వెళ్లిపోయావా? మళ్లీ ఎప్పుడు వస్తావు?"
అని అది కూడా ఆమె కోసం ఎదురు చూసింది.
ఆ రోజు డైనింగ్ టేబుల్‌పై మొదటి భోజనం చేసే కుసుమ కల నెరవేరలేదు.
రాత్రి ఆలస్యంగా అందరూ భోజనం చేసి ఇంటికి చేరుకున్నారు.
గడియారం పన్నెండు దాటింది.
అందరూ అలసటతో పడుకోవడానికి సిద్ధమవుతుంటే...
సుమ మాత్రం నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకే వెళ్లింది.
దాని కోసం ప్రత్యేకంగా కొన్న అందమైన టేబుల్ రన్నర్ తీసి జాగ్రత్తగా పరిచింది.
రంగురంగుల ప్లేస్‌మ్యాట్లు ఒక్కొక్కటిగా అమర్చింది.
"చూశావా... నీ గాజు గీతలు పడకూడదని ఇవి తెచ్చాను."
"ఇక్కడ ప్లేట్ పెడతాను..."
"ఇక్కడ గిన్నె..."
"ఇక్కడ గ్లాస్..."
"మధ్యలో చిన్న పూలదాని పెడితే ఇంకా అందంగా ఉంటుంది."
అంటూ డైనింగ్ టేబుల్‌తోనే మాట్లాడుకుంటూ అన్నీ సర్దేసింది.
డైనింగ్ టేబుల్ ఆనందంతో మురిసిపోయింది.
"నాకోసం ఇంత శ్రద్ధ చూపించే మనిషి ఉంటాడని నేనెప్పుడూ అనుకోలేదు."
అంతలో అత్తగారు పిలిచారు.
"అమ్మా... చాలైంది. రాత్రి చాలా అయింది. వెళ్లి పడుకో."
కామేశ్వరరావు కూడా నవ్వుతూ,
"రేపు కూడా టేబుల్ ఇక్కడే ఉంటుంది. ఈ రోజుకి దానికి గుడ్ నైట్ చెప్పి రా."
అన్నాడు.
సుమ నవ్వింది.
డైనింగ్ టేబుల్‌ను మరోసారి ప్రేమగా తడిమి, "గుడ్ నైట్... రేపు ఉదయమే నీ మీద కూర్చొని మొదటి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను."
అని చెప్పి గదిలోకి వెళ్లిపోయింది.
డైనింగ్ టేబుల్ మాత్రం ఆ ఒక్క మాటకే రాత్రంతా ఎదురుచూస్తూ నిలబడి ఉంది.
మరి మరుసటి రోజు ఉదయం కుసుమ కల నెరవేరిందా? లేక మరో కొత్త సంఘటన ఎదురైందా? చూద్దాం...
5🍄
మరుసటి రోజు ఉదయాన్నే కాలింగ్ బెల్ మోగింది.
నిద్రలేచి తలుపు తీసిన సుమకు ఒకేసారి ఆశ్చర్యం, ఆనందం.
"అరే... మీరందరూ!"
అత్తగారి చెల్లెలు, బావగారు, మరదలు, పిల్లలు... కొత్త కాపురం చూసి ఆశీర్వదించడానికి అందరూ వచ్చేశారు.
ఇంట్లో ఒక్కసారిగా సందడి మొదలైంది.
"ఏదైనా సింపుల్‌గా చేస్తే చాలు అమ్మా," అన్నా... అతిథులు ఇంట్లో ఉంటే "సింపుల్" అనేది ఎప్పుడూ సింపుల్‌గా ఉండదు.
అత్తా-కోడళ్లు ఇద్దరూ వంటగదిలోకి వెళ్లిపోయారు.
ఇడ్లీలు ఆవిరి కక్కుతున్నాయి.
వడలు బంగారు రంగులో వేగుతున్నాయి.
సాంబారు, కొబ్బరి చట్నీ... వంటగది మొత్తం పరిమళాలతో నిండిపోయింది.
అన్నీ అందంగా గిన్నెల్లో పెట్టి డైనింగ్ టేబుల్‌పై సర్దింది సుమ.
అప్పుడు గుర్తొచ్చింది...
టేబుల్‌కు నాలుగు కుర్చీలే ఉన్నాయి.
ఇంట్లో ఉన్నవాళ్లు మాత్రం ఎనిమిది మంది.
"పర్వాలేదు... అందరికీ ప్లేట్లలో వడ్డించండి. హాల్లో కూర్చుని తిందాం."
అన్నారు.
సుమ అందరికీ ప్రేమగా వడ్డించింది.
ఎవరికేం కావాలో అడిగి పెట్టింది.
ఎవరి ప్లేట్ ఖాళీ అయితే మళ్లీ నింపింది.
అందరూ కడుపునిండా తిని,
"చాలా బాగా చేశావమ్మా!"
అని మెచ్చుకున్నారు.
డైనింగ్ టేబుల్ మాత్రం మౌనంగా అన్నీ చూస్తోంది.
"నన్ను ఎంత ఇష్టపడి ఇంటికి తీసుకొచ్చిందో... కానీ నా మీద కూర్చొని తినే అవకాశం మాత్రం ఆమెకే రాలేదు."
అనుకుంది.
అందరూ తిన్నాక,
"ఇప్పుడు హాయిగా నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాను."
అని సుమ ప్లేట్ తీసుకుంది.
అంతలోనే అమ్మ నుంచి ఫోన్.
ఆమె గదిలోకి వెళ్లి మాట్లాడసాగింది.
ఫోన్ అయిపోయేలోపే,
"అమ్మా... బయటికి రా."
అని ఎవరో పిలిచారు.
ప్లేట్ అలాగే ఉండిపోయింది.
కొద్దిసేపటికి మరో బంధువులు వచ్చారు.
శుభాకాంక్షలు, స్వీట్లు, హాట్లు...
అవన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్‌పైనే పెట్టారు.
సుమ తనకు ఇష్టమైన ఒక స్వీట్ తీసుకుని నెమ్మదిగా తినబోతుండగా, "అమ్మా... ఒక చాయ్ పెడతావా?"
అనే పిలుపు.
మళ్లీ వంటగదిలోకే పరుగెత్తింది.
డైనింగ్ టేబుల్ నిట్టూర్చింది.
"పొద్దున్న టిఫిన్ కూడా సరిగా తినలేదు. ఒక స్వీట్‌తోనే సరిపెట్టుకుంది."
మధ్యాహ్నం భోజనానికి మాత్రం ఎన్నో వంటలు సిద్ధమయ్యాయి.
అన్నం...
పప్పు...
కూరలు...
పచ్చడి...
చారు...
పెరుగు...
అన్నీ వరుసగా నా మీదకు వచ్చి చేరాయి.
"ఈసారి అయినా సుమ నా మీద కూర్చొని తింటుంది."
అని డైనింగ్ టేబుల్ ఎదురుచూసింది.
కానీ...
"ఇంతమందికి టేబుల్ సరిపోదు. ప్లేట్లలో వడ్డించండి. హాల్లో కూర్చొని తిందాం."
అన్నారు అందరూ.
మళ్లీ అదే కథ.
సుమ అందరికీ వడ్డించింది.
నీళ్లు పోసింది.
మళ్లీ మళ్లీ వడ్డించింది.
చివరి అతిథి చేతులు కడుక్కునే వరకు ఆమెకు కూర్చునే తీరికే రాలేదు.
గడియారం నాలుగు దాటేసరికి ఇల్లు నిశ్శబ్దమైంది.
అప్పటికే ఆకలి కంటే అలసట ఎక్కువైంది.
పెళ్లికి ముందు అయితే...
భోజనం అంటే పండగ.
పెళ్లయ్యాక...
వండి, వడ్డించి, అందరూ తిన్నాక తన వంతు వచ్చేసరికి ఆకలే తగ్గిపోతుంది.
సుమ కూడా అలాగే వంటగదిలో నిల్చునే రెండు ముద్దలు తిని ముగించింది.
ఆమెకు ఏం తిన్నానో కూడా గుర్తులేదు.
డైనింగ్ టేబుల్ మాత్రం బాధగా చూస్తూ అనుకుంది.
"నన్ను ఇంత ప్రేమగా ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి... నా మీద కూర్చొని ఒక్క ముద్ద కూడా తినలేకపోయింది. పోనీలే... బంధువులు వచ్చారు. రేపు తప్పకుండా నా దగ్గర కూర్చుంటుంది."
అని తనను తాను ఓదార్చుకుంది.
కానీ...
సుమకు తెలియదు.
ఆమె కలల డైనింగ్ టేబుల్ ప్రయాణం ఇప్పుడే మొదలైంది.
అ"డైనింగ్ టేబుల్ ఏమనుకుంది?" .
=============================
===============================
శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:
శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: శ్రిత
శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.
ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.









Comments