top of page
Writer's picturePratap Ch

కుక్క తెలివి


'Kukka Thelivi' New Telugu Story


Written By Ch. Pratap




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఒక అడవిలో ఒక కుందేలు వుండేది. దానికి గంపెడు పిల్లలు వున్నాయి. ప్రతి రోజు ఉదయం వాటికి తిండి కోసం కుందేలు బయటకు వెళ్ళేది. బయలుదేరేముందు దాని పిల్లలకు జాగ్రత్తగా వుండమని ఎన్నో సూచనలు చేసేది. ఎవరు పిలిచినా బయటకు రావొద్దని గట్టిగా నిర్దేశించింది. అయితే ఇల్లు విడిచి వెళ్ళినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు తన పిల్లలు ఎలా వున్నాయో అని ఆ కుందేలు ఆందోళన పడుతూ వుండేది.

అదే అడవిలో ఒక బలిష్టమైన అడవి కుక్క వుండేది. ఒకరోజు ఆ కుక్క తిండి కోసం వెదుకుతూ కుందేలు ఇంటివైపు వచ్చింది. ఆ ఇంట్లో ఆడుతూ పాడుతూ సందడి చేస్తూ ఆడుకుంటున్న కుందేలు పిల్లలు దానికి కనిపించాయి. మొదట్లో వాటిని ఒక్కొక్కటిగా తినేయాలని కుక్కకు ఆశ పుట్టింది. అయితే వాటి అమాయకత్వం, చిలిపితనం, అన్ని పిల్లలు కలిసి మెలిసి ఆడుకుంటుండడం చూసిన ఆ కుక్క కు వాటిపై జాలి వేసింది. ఏ మృగమో లేక, వేటగాడో వచ్చి వాటిని వేటాడి తీసుకుపోవచ్చునన్న ఆలోచనతో ఈ ఇంటి బయట ఆ పిల్లలకు కాపలాగా వుండసాగింది.

సాయంత్రం తల్లి కుందేలు వచ్చేక కుక్క తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయేది.

ఒక రోజు కాస్త ముందుగా ఇంటికి వచ్చిన కుందేలు ఇంటి బయట కూర్చున్న కుక్కను చుసి భయపడింది. తన పిల్లలను చంపడానికే కుక్క వచ్చిందన్న భయంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరకు వెళ్ళింది కుందేలు.

తనను చూసి భయపడుతున్న కుందేలును చూసి కుక్క "ఏం భయపడవద్దు. నీ పిల్లలను చంపడానికి రాలేదు. పైపెచ్చు వాటిని ఆ జంతువు తినకుండా రోజూ కాపాడుతున్నాను. ఈ పిల్లలు నాకు పిల్లలే " అని చెప్పింది.

ఆ మాటలకు కుందేలుకు కొండంత ధైర్యం వచ్చింది. తేలికైన మనసుతో కుక్క పక్కన కూర్చోని తాను తెచ్చిన ఆహారంలో కొంత భాగం పెట్టింది. అలా ఆనాటి నుండి కుక్క, కుందేలు మంచి స్నేహితులయ్యారు.

కుందేలు కుటుంబం పై ఒక నక్క కళ్ళు పడ్డాయి. దాదాపుగా అప్పుడే ఎదుగుతున్న ఎనిమిది కుందేలు పిల్లలు. ఒక నెల రోజుల వరకు తన తిండికి ఏమీ ఢోకా ఉండదు. అయితే ఆ ఇంటికి కుక్క కాపలా వున్నంత కాలం తన పాచికలు అక్కడ పారవు. అందుకే కుందేలు పిల్లల్ని తినేందుకు ఒక పథకం వేసింది. దాని ప్రకారంగా ముందుగా కుక్కతో స్నేహం చేసింది. ప్రతీ రోజు పొద్దునే కుక్క దగ్గరకు వచ్చి మంచి మంచి కబుర్లు చెప్పసాగింది. అడవిలో తనకు అడపా దడపా దొరికే ఆహారాన్ని కూడా కొంచెం కొంచెంగా కుక్కతో కలిసి పంచుకో సాగింది. అలా నక్క , కుక్క కొద్ది రోజులలోనే మంచి స్నేహితులయ్యారు.

ఒకరోజు కుందేలు, కుక్క కలిసి వేటకు వెళ్లాయి. అదే అదనుగా భావించి నక్క కుందేలు ఇంట్లో జొరబడి ఒక కుందేలు పిల్లను తినేసి పూర్తిగా త్రేంచి ఏమీ తెలియనట్లు వెళ్ళిపోయింది.

ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి కుందేలుకు ఒక పిల్ల కనబడక పోవడంతో ఆందోళన చెందింది. బహుశా ఏదో జంతువు ఇంట్లోకి జొరబడి పిల్లను తినేసి వుంటుందని, అసలు ఏ కాపలా వుంచకుండా ఇద్దరూ వేటకు వెళ్లడం పెద్ద తప్పయిపోయిందని ఇద్దరూ అనుకున్నారు.

తర్వాత కొద్ది రోజులు కుందేలు, కుక్కలలో ఒకరే వేటకు వెళ్తూ ఇంకొకరు ఇంటికి కాపలా ఉండసాగారు. ఆ సమయంలో నక్క ఆ ఇంటికి చాయలకు కూడా రాకుండా జాగ్రత్త పడింది. పైగా కుక్కను కలిసినప్పుడల్లా ఎంతో స్నేహంగా మాట్లాడుతూ తనపై అనుమానం రాకుండా జాగ్రత్త పడింది.

అంతా బాగా వుందనుకున్న కుందేలు, నక్కలిద్దరూ ఒకరోజు కలిసి మళ్ళీ వేటకు వెళ్ళారు. ఆ సమయంలో నక్క ఇంట్లో జొరబడి బలిష్టంగా వున్న ఇంకొక కుందేలు పిల్లను తినేసి ఏమీ ఎరగనట్లు వెళ్ళిపోయింది.

ఆ సాయంత్రం తిరిగి వచ్చిన కుందేలుకు ఇంకొక పిల్ల అదృశ్యమై పోవడం చూసి తన తప్పిదానికి కన్నీరు మున్నీరుగా విలపించింది.

అక్కడితో కుక్క కాస్త ఆలోచనలో పడింది. తామిద్దరిలో ఎవరో ఒకరు ఇంటికి కాపలాగా ఉన్నప్పుడు ఏమీ జరగడం లేదు. తాము కలిసి వేటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఎవరో తమ రాకపోకలను కనిపెట్టి ఇంట్లోకి జొరబడి కుందేలు పిల్లని తినేస్తున్నారు. అంతే ఎవరో తమపై గట్టి నిఘా వుంచుతున్నారని, ఈ సంగతి వెంటనే తేల్చాలని అనుకుంది. ఆ ప్రకారంగా కొన్నాళ్ళ తర్వాత కుందేలుని వేటకు పంపించి, తాను దూరంగా ఒక దట్టమైన పొదలో దాక్కొని కుందేలు ఇంటిపైనే దృష్టి సారించింది.

కొంచెం సేపయ్యాక నక్క, ఇంటి వద్ద ఎవరూ కాపలా లేరని నిర్ధారించుకొని అడుగులో అడుగు వేసుకుంటూ కుందేలు ఇంట్లోకి దూరింది.

అసలు సంగతి తెలుసుకున్న కుక్క అమాంతం ఎగిరివచ్చి నక్కతో పోరాడి, చివరికి దానిని చంపేసింది. నక్క మరణంతో ‘హమ్మయ్య! శత్రువు పీడ వదిలింద’ని కుక్క, కుందేలు రెండు తేలిగ్గా ఊపిరి తీసుకున్నాయి. ఆ రోజు నుండి ఏ చీకూ చింతా లేక ఆనందంగా కలిసి మెలిసి జీవించాయి.

***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

Twitter Link



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.





58 views0 comments

Comentários


bottom of page