top of page
Original.png

వ్యాపార ప్రపంచం – పార్ట్ 8

11 hours ago
8 min read

వ్యాపార ప్రపంచం పార్ట్ 8లో సుఖదేవ్‌కు కీలక ఆర్థిక ఫైల్ అందిస్తున్న గీతా మాధురి, మరోవైపు గాయపడిన భానుప్రసాద్ పట్ల ఆందోళన చెందుతున్న విద్యాభవాని.

Vyapara Prapancham – Part 8 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 8 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక | పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

Published in manatelugukathalu.com on 03/10/2026


వ్యాపార ప్రపంచం – పార్ట్ 8లో భానుప్రసాద్ చేతికి గాయమైందని తెలుసుకున్న విద్యాభవాని తీవ్రంగా కలత చెందుతుంది. అతని గాయం చూసి ఆమె కళ్లలో కన్నీళ్లు తిరగడం ఇద్దరి మధ్య ఏర్పడుతున్న ఆత్మీయ పరిచయానికి కొత్త భావోద్వేగాన్ని జోడిస్తుంది. మరోవైపు సుగుణ్ ట్రేడర్స్‌లో స్పెషల్ బిజినెస్ సెల్ ఇన్‌ఛార్జిగా చేరిన గీతా మాధురి, గత ఆరేళ్ల కంపెనీ ఆర్థిక లెక్కలను పరిశీలించి తయారుచేసిన కీలక ఫైలుతో సుఖదేవ్‌ను ఆశ్చర్యపరుస్తుంది. ఇదే సమయంలో దుస్స్వప్నాలతో కలత చెందిన ప్రణవి ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం పూజలు, స్తోత్రాలను ఆశ్రయిస్తుంది.    Pasted markdown


వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు. సీనియర్ సూపర్‌వైజర్ దీనదయాళ్  భానుప్రసాద్ ను క్యాంటీన్‌కు తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు, పై అధికారులతో వ్యవహరించే పద్ధతి, టీమ్‌వర్క్, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి విషయాలపై హితబోధ చేస్తాడు. మాలిని పట్ల ఎలాంటి ఆసక్తి లేని సుఖదేవ్ తన భార్య ప్రణవిపైనే తన ప్రేమ, అనుబంధం ఉన్నాయని స్పష్టంగా భావిస్తాడు. రోడ్డు ప్రమాదంలో ఒక స్త్రీ మరణించిన దృశ్యం ప్రణవిని బాధిస్తుంది. కీలకమైన పోస్టుకు గీతా మాధురి ఎంపిక అవుతుంది.

ఇక వ్యాపార ప్రపంచం - పార్ట్ 8 చదవండి


అది గమనించి ఆమె వెంటనే అంది – “అంటే – వర్ యు హర్ట్?” 


దానికి బదులుగా అతడు తలూపుతూ మోచేతి షర్టుని తీసి చూపించాడు. అక్కడ కట్టు కట్టి ఉంది. అది చూసి ఆమె కలవరపడుతూ అంది – “సారీ! ఐయామ్ రియల్లీ సారీ సార్! ఈ కట్టు ఈ ఒక్కరోజుతో సరిపోతుంది కదూ!” 


అతడు మరొకసారి తల అడ్డంగా ఆడిస్తూ బదులిచ్చాడు – “కొన్ని రోజుల వరకూ కట్టు మార్చుతూ ఇంజెక్షన్లు వేసుకుంటూ ఉండాలి. ఈ విషయం నేనింకా మా ఇంట్లో వాళ్ళకు చెప్పలేదు. జడుసుకుంటారు.” 


చేతికి గాయమైన విషయం తెలుసుకుని భానుప్రసాద్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యాభవాని.
చేతికి గాయమైన విషయం తెలుసుకుని భానుప్రసాద్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యాభవాని.

అది విని విద్యాభవాని కళ్లలో కన్నీరు సుళ్ళు తిరిగింది. నోట మాట రాక తదేకంగా అతడి వైపు చూస్తూ ఉండిపోయింది. త్రిలోక్ గారు మెల్లగా లేచి వచ్చి ప్రసాదుని ఆలింగనం చేసుకున్నాడు. 


ఎట్టకేలకు భానుప్రసాద్ పెదవి విప్పాడు – “నాకు తగిలిన దెబ్బ కోసం ఫీలవకండి సార్ – లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ దట్ – ఎల్లప్పుడూ మన అదుపులో ఉండదు కదా!” అంటూ లేచి భవానితో చేతులు కలుపుతూ అన్నాడు – “మీరు మా గౌరవ అతిథులు కదా – మిమ్మల్ని ఎగ్జిట్ గేట్ వరకూ వచ్చి సాగనంపడం నా కనీస కర్తవ్యం. ఈజ్ ఇట్ నాట్!” 


ఆమె అతణ్ణి తదేకంగా చూస్తూ మౌనంగా అనుసరించింది.


మౌనమంటే నిశ్శబ్దం మాత్రం కాదు సుమా అంటారు. మౌనంలో మహోన్నతమైన హృదయ స్పందన ఉందంటారు. మనో యవ్వన రాగ బంధం పెనవేసి ఉందంటారు. అదొక ఉదాత్తమైన హృదయరాగమంటారు – అందుకే కదా!


 కాసేపు తరవాత విద్యాభవానిని కారు వరకూ సాగనంపి ఆమె తీసిచ్చిన విజిటింగ్ కార్డు అందుకుని నిదానంగా సెక్షన్ లోకి ప్రవేశించి తన సీటులో కూర్చోబోయాడు భానుప్రసాద్. 


అప్పుడు సెక్షన్ సూపర్‌వైజర్ దీనదయాళ్ గొంతు వినిపించి ఆగిపోయాడతను – “ఏమోయ్ మహానుభావా! మీకక్కడ ఏమి జరిగిందోనని బెంబేలు పడిపోతూ ఎదురు చూస్తుంటే నువ్వదేమీ జరగనట్టు కామ్‌గా సాఫీగా సీటులోకి కూర్చుంటావా! ఇదేనా గజపతినగరంలో మీరు నేర్చుకొచ్చిన సభ్యతా సంస్కారాలు? పని సంగతి తరవాత చూసుకోవచ్చుగాని – ముందు ఇలా వచ్చి కూర్చో – చీఫ్ గారి ఛేంబర్‌లో జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పు –” 


ప్రసాద్ నోరు తెరవకుండా నిదానంగా వచ్చి కూర్చున్నాడు. వైష్ణవి అక్కడకు వచ్చి మంచినీళ్ల గ్లాసు అందించింది. థ్యాంక్స్ అంటూ దానిని అందుకుని సగం గ్లాసు ఖాళీ చేసి నోరు తెరవబోయాడు – కాని సూపర్‌వైజర్ అడ్డువచ్చాడు – “మొదట దీనికి బదులు చెప్పవోయ్ – మీతో కార్యాలయ ప్రాంగణం దాటి కారు వరకూ వచ్చిన ఆ అందమైన పొడవైన అమ్మాయెవరు? లవరా లేక గర్ల్ ఫ్రెండా! లేక కాబోయే – ”


“అంటే – రాజదూత పరమశివం మీకింత వరకూ విషయం చేరవేయలేదన్నమాట!” 


దీనదయాళ్ తల అడ్డంగా ఆడించాడు, తనకేమీ తెలియదన్నట్టు – 


“అయ్యోరామ! ఆమెగారే నాకోసం వెతుక్కుంటూ వచ్చిన లేడీ అడ్వకేట్ – మిస్ విద్యాభవాని. హైకోర్టులో ఇప్పుడు జూనియర్ అడ్వకేట్‌గా ఉంటున్నారు. సుగుణ్ ట్రేడర్స్ కంపెనీ చీఫ్ సీఈఓ గారి సిస్టర్. వెరీ నైస్ అండ్ కైండ్ పర్సన్. వాళ్ల పూర్వీకులది విజయనగరం.” 


ఆ మాటకు దీనదయాళ్ తెల్లబోయినట్లు చూసాడు – “అదేమిటోయ్ – ఆమెగారేదో మీపైన ఫిర్యాదు చేయడానికి వచ్చారనుకుని మేమంతా ఆతృతతో కంగారుపడుతూ ఎదురు చూస్తుంటే – ప్రత్యర్థిని మెచ్చుకుంటున్నారేమిటి? డామిట్ – కథ అడ్డం తిరిగిందని చిటికె వేసే గిరీశం అవతారంలా కనిపిస్తున్నారే – వాట్ ఈజ్ ది మేటర్? కమ్‌అవుట్ విత్ ఫుల్ పిక్చర్!“ 


అప్పుడు మిగిలిన సగం మంచినీళ్ల గ్లాసూ ఖాళీ చేసి నిన్నరాత్రిపూట కుక్కల బారిన పడ్డ బాలిక గురించి వివరించి చెప్పాడతను. అంతా విన్న దీనదయాళ్ సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ లేచి నిల్చున్నాడు. తన సీటులోనుండి లేచి మెల్లగా నడుచుకుంటూ ఇటు వచ్చి భానుప్రసాద్‌ని కౌగిలించుకున్నాడు.


 కౌగిలించుకుంటూనే అన్నాడతను – “మీరిప్పుడు వెంటనే చేయాల్సింది ఒకటే – లీవు వేసి వెళ్ల్లిపోవడమే – టార్గెట్ గురించి కంగారుపడకండి – అదంతా మేము చూసుకుంటాం. కుక్కకాటుకి గాయపడ్డ మోచేయి నయమయ్యేంత వరకూ రెస్టు తీసుకోండి. రెగ్యులర్ ట్రీట్‌మెంట్ తీసుకోవడం మానకండి. నేను రికమండ్ చేస్తాను. సరేనా!”


“థ్యాంక్ యూ వెరీమచ్ సార్! వెళ్ల్లిపోతూ విద్యాభవానిగారు కూడా ఇదే మాటన్నారు. కాని – మీరన్నతరవాతనే ధైర్యం పుంజుకొచ్చింది. నేను రేపట్నించి వారం రోజులపాటు లీవు వేస్తానండి” అంటూ తన సీటు వైపు కదిలాడు భానుప్రసాద్ తన డెస్కుని క్లియర్ చేసుకోవడానికి – లీవు లెటర్ సమర్పించుకోవడానికి –

 ----------------------------------------------------------- 

గరుడ పౌర్ణమి. ఆరోజు ఉదయం సుఖదేవ్ భార్యాపిల్లల సమేతంగా ఆలయ దర్శనం చేసుకుని అర్చకులందించిన ప్రసాదం స్వీకరించి బయట జోలెలు పట్టుకుని కూర్చున్న బైరాగులకు, భిక్షువులకు చిల్లర డబ్బులు పంచి మళ్లీ ఇల్లు చేరి తల్లికీ చెల్లికీ గుడి ప్రసాదం పంచి మిగిలినది ఇంటి పనికత్తెలకు కూడా ఇచ్చి కంపెనీ కార్యాలయానికి బయలుదేరాడు. 


ఎదురొచ్చిన స్టాఫ్ చెప్పిన శుభోదయాలను, బిజినెస్ మేనేజర్ల అభినందనలను సన్నపాటి చిరునవ్వుతో స్వీకరిస్తూ ఛేంబర్‌లోకి ప్రవేశించాడు. బల్లపైనున్న మంచినీళ్ల గ్లాసు అందుకుని ఓసారి నిదానంగా సాత్వికంగా పరకాయించి చూసాడు. ఎదుట వేలాడుతున్న రవివర్మ తైలవర్ణ చిత్రం అతణ్ణి పలకరించింది – క్లాసికల్ రూపంతో మెరుస్తూ నవ్వు ముఖంతో వయ్యారంగా నిల్చున్న ఓ అభిసారిక. 


అప్పుడు డోరు తెరుచుకుంటూ వచ్చిన మాలిని – “మే ఐ కమ్ ఇన్ సార్!” అంటూ దగ్గరగా వచ్చి నిల్చుంది. 


పలకరింపుగా ఆమెను చూసిన వెంటనే టక్కున ముఖం తిప్పుకున్నాడు; మరొకసారి మంచినీళ్ల గ్లాసు అందుకుంటూ – ఆమెకున్న అలంకారం ఆమెను అలరిస్తున్న సుస్తని. ఏం పాపిష్టి కళ్లో – ఎంత వద్దనుకున్నా కళ్లు సిగ్గూ బిడయం లేకుండా దానిపైనే తుమ్మెదల్లా వాలుతుంటాయి. 


ఇటువంటి వైఖరి తన స్థాయికి ససేమిరా తగదని తెలిసే అతను పలుసార్లు ఆమెను మరొక విభాగానికి పంపడానికి పూనుకునేవాడు. కాని – బాబాయి అడ్డుపుల్లలా అడ్డుకునేవాడు బాధ్యతలపట్ల ఆమెకు అపరిమితమైన అంకితభావం ఉందని ఎత్తి చూపుతూ –. 


బాబాయిగారు తన అవస్థను ఎప్పుడైనా గుర్తించడానికి ప్రయత్నించాడా – తనది కూడా ఆయన వయసే అనుకుంటున్నాడేమో! ఏమో – ఇప్పటికిప్పుడు మక్కీకి మక్కీగా చెప్పడం కష్టంగాని తన సతీమణి ప్రణవి సరసాలాట సాగే సమయంలో ఎత్తిపొడిచినట్లు తను విదేశీ వ్యాపార పర్యటనలకు వెళ్లొచ్చిన తరవాత ఆ హాట్ అండ్ హీట్ విషయంలో అవసరానికి మించిన వేగం పుంజుకుంటున్నాడేమో..

 

హద్దులేకుండా మదనోత్సవాన్ని వాంఛిస్తున్నాడేమో ..


బైదిబై అతను అడగాలనుకుంటూనే మరచిపోతున్నాడు; ఏదో వాళ్ల కంపెనీ ప్రాజెక్టు విషయమై అబీద్స్ వెళ్లిన మాలిని భర్త ఇంకా ఊరు చేరలేదా! తెల్లగుర్రం వంటి భార్యను విడిచి అతడక్కడ ఎన్నాళ్లుంటాడో – ఎలా ఉండగలుగుతున్నాడో – 


అతడు చప్పున ముప్పిరిగొన్న ఆలోచనల నుండి తనను తాను మరల్చుకుంటూ అడిగాడు – “యస్ మాలినీ! ఎంతసేపు అలా నిల్చుంటారు? చెప్పండి ఏదైనా అర్జెంట్ ఫైలు చూడాలా!”


“మీరలా నన్ను తేరిపార చూస్తూ ఉంటే ఏదో ముఖ్యమైన మేటర్ చెప్పదలచుకున్నారేమోననుకున్నాను. మీరటు రవివర్మ తైలవర్ణ చిత్రాన్ని చూస్తూ ఇటు నన్ను చూస్తూ కూర్చుంటే కొంచెం తడబడ్డాననుకోండి. బయట మీకోసం నాగమునిగారు ఎదురు చూస్తున్నారు. పిలవనా సార్!”


“భలేవారే! నాగమునిగారు నన్ను కలుసుకోవడానికి బయట కూర్చోవడం ఏమిటండీ – అసలాయనను ఎందుకు ఆపారు?”


“ సారీ సర్! మేటర్ అది కాదు సర్ – ఆయన కొత్తగా చేరిన స్పెషల్ బిజినెస్ సెల్ ఇన్‌ఛార్జి గీతా మాధురిగారితో ఉన్నారు. మీరు అనుమతిస్తే పంపిస్తాను.” 


అతడు ఓసారి మాలిని ముఖంలోకి తేరి చూసి – “ఓ యస్!” అన్నాడు. 


మాలిని నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి బయటకు వెళ్ల్లి వాళ్లిద్దర్నీ లోపలకు పంపించింది. ఇద్దరూ వస్తూనే – “గుడ్ మార్నింగ్ సార్!” అని శుభోదయం పలికారు. 


సుఖదేవ్ “వెరీ గుడ్ మార్నింగ్!” అంటూ ఇద్దరికీ కూర్చోమని సీటు చూపించాడు. కొద్దిసేపు ఫార్మల్‌గా పలకరింపులు చిలకరించుకున్న తరవాత లేడీ మెసెంజర్ తెచ్చి పెట్టిన కాఫీ కప్పులు అందుకున్న తరవాత గీతా మాధురి భవ్యంగా లేచి నిల్చుని చేతిలోని ఫైలుని సీఈఓకి అందించింది. 


సుగుణ్ ట్రేడర్స్ ఆర్థిక లెక్కలను పరిశీలించిన కీలక ఫైలును సుఖదేవ్‌కు అందిస్తున్న గీతా మాధురి.
 గీతా మాధురి కీలక ఫైల్‌తో సుఖదేవ్ ముందు

దానిని అందుకుంటూ రవంత విస్తుపోతూ అడిగాడతను – “ఇదేమిటి? ఫైలు కాస్తంత బరువుగానే ఉన్నట్లుందే! ఐనా – ఫైలు అందివ్వడానికి లేచి నిల్చుంటారేమిటి – ప్లీజ్ బి సీటెడ్ –” 


ఆమె మృదువుగా దరహాసం చేస్తూ అంది – “ఇది ముఖ్యమైన ఫైలు సార్!” 


అంటే అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసాడతను. 


“గత ఆరేళ్ల రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ – ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ – బ్యాలెన్స్ షీట్లు ఉన్నాయి సార్. ముఖ్యంగా అసెట్స్‌కి సంబంధించిన రిజర్వ్ ఫండుకి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి సార్. అన్నీ ఆమూలాగ్రంగా పరిశీలించాను సార్. ముఖ్యంగా వాటిలోని ఎత్తుపల్లాలు నోట్ చేసుకున్నాను.”


“ఆశ్చర్యంగా ఉందే మాధురీ! ఇన్ని వివరాలను ఈ ఒక్క రోజులో చదివి ముగించారా?”


“లేదు సార్. నిన్న నాగముని అంకుల్ గారి సహాయంతో ఫైల్సు ఇంటికి తీసుకువెళ్ల్లి స్టడీ చేశాను సార్. అక్కడక్కడ నాకు తోచిన అంశాలపై ఫుట్‌నోట్స్ కూడా ఇచ్చాను సార్ –” 


సుఖదేవ్ నవ్వు ముఖంతో “ఐ సీ!” అంటూ నాగముని వైపు చూసాడతను. నాగముని ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా తలూపుతూ కాఫీ కప్పుని చేతుల్లోకి అందుకున్నాడు – కళ్లతో నవ్వుతూ – 


కాని, సుఖదేవ్ ఊరుకోలేదు. నాగమునిని ఊరుకోనివ్వలేదు – “చూడండి మిస్టర్ డిప్యూటీ మేనేజర్ గారూ! లయబిలిటీస్ తగ్గకపోతే అసెట్స్ వాల్యూ పెరగదు. అసెట్స్ సైడ్‌కి నిలకడ ఉండదు. ఇది మాధురి గారికి విశదీకరించారా!”


“మాధురిగారికి తెలుసు. మనం ప్రత్యేకంగా విశదీకరించనవసరం లేదు సార్! ఈమె ఈక్విటీ రీసెర్చ్ అండ్ వ్యాల్యుయేషన్ కోర్సు పూర్తి చేయడమే కాక – ఫైనాన్షియల్ ఎంపవర్‌మెంట్ వంటి పలు వర్క్‌షాపుల్లో పాలు పంచుకున్నారు. లెటజ్ హోప్ – షి విల్ అటెండ్ టు దీజ్ ఐటమ్స్ ఇన్ ఎ స్పెషల్ వే –”


“దెన్ ఇట్ ఈజ్ ఓకే నాగమునిగారూ! వీలుంటే మరొకసారి సాయంత్రం కలుసుకుందాం” అని బల్లముందున్న ఫైల్సు అందుకోబోయాడు సుఖదేవ్. 


అప్పుడు నాగముని స్పందించాడు – “ఇట్ ఈజ్ ఓకే సార్! కాని – నాదొక చిన్న రిక్వెస్ట్ సార్ – ఈరోజు రాత్రి హోటల్ సవేరాలో స్పెషల్ డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాం. డివిజనల్ మేనేజర్లతో బాటు కొత్తగా చేరిన మిస్ గీతా మాధురిగారు కూడా పాలు పంచుకుంటారు. ఈజ్ ఇట్ ఓకే సార్?” 


అతడు లోలోన అసహనాన్ని అణచుకుంటూనే తలూపాడు. యాజ్ ఎ మేటర్ ఆఫ్ ప్రొటోకాల్ అటువంటి గెట్-టుగెదర్ పార్టీలు అవసరమైనా – ఊర్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ప్రణవికి దూరంగా ఉండవలసి వస్తే అతడికి అసహనం రెట్టింపు అవుతుంటుంది. 


అందునా ఇప్పటి పరిస్థితిలో ఆమెకు ఎడంగా ఉండటమంటే – మరీ అసహనానికి లోనవుతాడు. కాని – బిజినెస్ ఈజ్ బిజినెస్ – వాటిలో అప్పుడప్పుడు చోటు చేసుకునే పార్టీ డిన్నర్ల వ్యవహారం అనివార్యం – వివిధ వర్గాల మధ్య పెంపొందవలసిన సాహచర్యానికి సాన్నిహిత్యానికి అవసరమైన ఫ్రెండ్లీ కార్యక్రమం – ఆ కారణాన అతడు “ప్లీజ్ డూ ఇట్” అంటూ తన పనిలో మునిగిపోయాడు సుఖదేవ్.


 పసందైన సాయంత్రం మృదువుగా పలకరింపుగా సమీపించేటప్పటికి సుఖదేవ్ డిన్నర్ పార్టీకి ఫ్రెష్‌అప్ అవడానికి పెందలకడే ఇల్లు చేరుకున్నాడు. హాలు నిశ్శబ్దంగా ఉంది. పిల్లల అలికిడి లేదు. ప్రణవి చిరునవ్వుల చిలకరింపు లేదు. కాళ్లకున్న సాక్స్ విప్పి అతడు మెల్లగా నడుచుకుంటూ లోపలకు నడిచాడు. 


పనికత్తెలిద్దరూ ఏవో కూరగాయలు తరగడంలో బిజీగా ఉన్నట్టున్నారు. ఓసారి ముఖం నుండి కళ్లద్దాలు తీసి జేబురుమాలుతో తుడుచుకుని తిరిగి చూసాడతను. అక్కడ పూజాగదిలో చేతులు జోడించి నిల్చున్న ప్రణవి కనిపించింది. ఇరుపక్కలా రాఘవ్, కామిని భవ్యంగా తల్లిలాగే చేతులు జోడించి నిల్చున్నారు. తల్లి వనజమ్మ ఆమెకు ఎడమ వైపు భక్తితో అరమోడ్పు కళ్లతో నిల్చుంది. 


వాళ్లను చూస్తుంటే అతడికి ఒక అందమైన భావగర్భితమైన పదజాలం గుర్తుకి వచ్చింది – “ప్రేయర్ ఈజ్ ఎ స్పిరిచువల్ కాల్ టు డివైన్ పవర్!” ఇటువంటి ప్రాణపూర్ణ పదజాలం తన పిల్లలిద్దరికీ ఎప్పుడు అర్థమవుతుందో – అతడు కొడుకు వైపూ కూతురు వైపూ ప్రేమపూర్వకంగా చూస్తూ పూజాగదికి మరీ ఎడంగా కాకుండా ప్రణవి చదవబోయే శ్లోకం వినడానికి సంసిద్ధుడయ్యాడు –


“ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః;

యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్

గాయత్రీం వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం

శంఖం చక్ర మథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే” – 


అది గాయత్రీ స్తుతి అని తెలుసుకున్నాడు సుఖదేవ్. 


అలా అనుకుంటూ అతడు వెనక్కి తగ్గుతూ మేడ మెట్ల వైపు కదలబోయాడు. కాని – ప్రణవి మరొక శ్లోకం అందుకునేటప్పటికి ఆగిపోయాడు. 

దుస్స్వప్నాల నుంచి మానసిక ప్రశాంతత కోసం కుటుంబంతో కలిసి ప్రార్థిస్తున్న ప్రణవిని చూస్తున్న సుఖదేవ్.
ప్రణవి దుస్స్వప్న శాంతి ప్రార్థన

“అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం జనార్దనమ్

హంసం నారాయణం కృష్ణం జపే దుస్స్వప్న శాంతయే” – 


అది దుస్స్వప్న దోష శాంతి స్తుతి అని గ్రహించాడతను. ఆ జప పఠనమంతా తన తల్లి వనజమ్మగారి ఆదేశానుసారం సాగుతున్నదని కూడా గ్రహించాడతను. అతడిక అక్కడ నిల్చోకుండా చకచకా మేడ మెట్లవైపు నడిచాడు. మలిస్నానం ముగించి ఫ్రిజ్ నుండి మంచినీళ్లు తాగి ఫోమ్ బెడ్ పైన నిశ్శబ్దంగా కూర్చున్నాడు. 


ఎల్లప్పుడూ కాకపోయినా కొన్ని సమయాలలో నిరీక్షించడం అనివార్యం. కదిలే కాల తరంగానికి – స్పందించే జీవన ప్రవాహానికీ మధ్య పొంతన లేనిదైనా నిరీక్షణ నిరీక్షణే – అది ప్రతి మనిషికీ అనివార్యమే – అప్పుడప్పుడు ఆనందదాయకమే – 


అతడలా కూర్చున్న కొద్దిసేపటికి అతడు ఎదురు చూసినట్లే ప్రణవి చప్పుడుకి తావులేకుండా ప్రవేశించింది. నైవేద్యానికి పెట్టిన అరటిపండు ముక్క అతడి నోటికి అందించి – నుదుట బొట్టు పెట్టింది. 


లేత ఎరుపు రంగు చేనేత చీరలో మునికన్యలా మెరిసిపోతున్న భార్యను టక్కున తనపైకి లాక్కోవడానికి నడుం చుట్టూ చేతులు బిగించిన సుఖదేవ్ అదే వేగంతో ఆగిపోయి చేతులు వెనక్కి తీసుకున్నాడు; 


కొన్నాళ్ల వరకూ తను భార్యకు దూరంగా ఉండాలన్న ధార్మిక షరతు గుర్తుకి వచ్చి – భర్త తడబాటుకి నవ్వుకుంటూ అతడికి కాస్తంత ఎడంగా కూర్చుంటూ అంది – “నేనీ విషయమై ముందే చెప్పాను – మీరు ఓపెన్‌గా ఒప్పుకోవడం లేదు!” 


అదేమిటన్నట్లు అతడు షార్ప్‌గా చూసాడు. 


అప్పుడామె చిలిపితనంతో నవ్వే కళ్లతో చూస్తూ అంది – “మరొకసారి చెప్పేదా!” 


“ఉఁ” అన్నాడతను – 


“మీరు విదేశాల టూరుకి వెళ్లివచ్చినప్పట్నించీ – ముఖ్యంగా లాటిన్ అమెరికన్ దేశాలకు వెళ్లివచ్చినప్పట్నించీ మీలో తాళలేని మోహం, దాహం అధికమైంది.” 


అప్పుడామె విసిరిన నూలు ప్రోగు కొసను అతడు వెంటనే అందిపుచ్చుకున్నాడు – “ఎక్స్క్యూజ్ మీ మేడమ్! నాకు సరిగ్గా వినిపించనట్లుంది. నాలో పెరిగింది మోహమా లేక దాహమా!” 


దానికి ఆమె టక్కున బదులిచ్చింది – “రెండూను – అంతులేని పాతాళ గంగలా –” 


ఆ మాటకు అతడు ఇసుమంత జాప్యానికీ తావివ్వకుండా శంఖారావం పూరించాడు – “ఏం? నాలో పొంగే ఆ మృదు మధుర పాతాళ గంగంటే తమకు ఇష్టం లేదేమో!”


=================================

ఇంకా ఉంది 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 9

త్వరలో మీ ముందుకు వస్తుంది.

=================================



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పాండ్రంకి సుబ్రమణి

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

30 /10 /2022  తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page