వ్యాపార ప్రపంచం – పార్ట్ 7

Vyapara Prapancham – Part 7 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani
వ్యాపార ప్రపంచం – పార్ట్ 7 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక | పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
Published in manatelugukathalu.com on 24/09/2026
వ్యాపార ప్రపంచం – పార్ట్ 7లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ జ్ఞాపకం ప్రణవిని ఇంకా వెంటాడుతూనే ఉంటుంది. ఆమె కలలో కనిపించిన ఆ మహిళ సుఖదేవ్–ప్రణవిల కుమార్తె కామిని ఫొటో వైపు చేయి చూపించడం ప్రణవిని మరింత ఆలోచనలో పడేస్తుంది. ఇదే సమయంలో కథ మరో కీలక మలుపు తిరుగుతుంది.
వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు. సీనియర్ సూపర్‌వైజర్ దీనదయాళ్ భానుప్రసాద్ ను క్యాంటీన్‌కు తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు, పై అధికారులతో వ్యవహరించే పద్ధతి, టీమ్‌వర్క్, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి విషయాలపై హితబోధ చేస్తాడు. మాలిని పట్ల ఎలాంటి ఆసక్తి లేని సుఖదేవ్ తన భార్య ప్రణవిపైనే తన ప్రేమ, అనుబంధం ఉన్నాయని స్పష్టంగా భావిస్తాడు. రోడ్డు ప్రమాదంలో ఒక స్త్రీ మరణించిన దృశ్యం ప్రణవిని బాధిస్తుంది. కీలకమైన పోస్టుకు సరైన వ్యక్తిని ఎంపిక చేసే పనిపై నాగమునితో చర్చ మొదలుపెడతాడు సుఖదేవ్. ముగ్గురు అభ్యర్థులలో గీతా మాధురి విద్యార్హతలు, మార్కెట్ అనాలిసిస్ నైపుణ్యం, కుటుంబ నేపథ్యం ప్రత్యేక చర్చకు దారితీస్తాయి.
వ్యాపార ప్రపంచం గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - నవల - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వ్యాపార ప్రపంచం - పార్ట్ 7 చదవండి
ఆ మాట విని అతడు కళ్ళు మిటకరిస్తూ అరచినంత పని చేశాడు—"ఆమెగారు నీకు కనిపించడం ఏమిటి ప్రణవీ! అవసరానికి మించిన వేగంతో అవకతవకగా బండిని తోలుతూ ఆమెనూ ఆమె ఆడబిడ్డనూ పడగొట్టిన ఆ మహా మగధీరుడి కలలో కనిపించాలి. కనిపించి గట్టిగా మోత మోగించాలి— ఎందుకలా అలక్ష్యంగా బండిని తోలి తన ప్రాణాలు తీశాడని, తన బిడ్డను తల్లిలేని బిడ్డను చేశాడని? అదేమీ చేయకుండా నీ కలలోకి వచ్చి నిన్ను కలత పెట్టించడం దేనికి?"
దానికి స్పందనగా ఆమె చిన్నగా నవ్వుతూ అంది— "నా కలలోకి కనిపిస్తున్నది మానవ శరీరం కాదు. అందరి కళ్ళ ముందూ శూన్యంలోకి అంతర్థానమైన మానవాత్మ. ఆత్మ ఎటువంటి సంకెళ్ళకూ లొంగని సర్వ స్వతంత్రమైనది. ఎవరి ఆదేశాలనూ ఖాతరు చేయదు. ఎవరి కోపావేశాలకూ లొంగదు."

అప్పుడతను సాభిప్రాయంగా తలూపుతూ అడిగాడు— "ఇంతకీ ఆమెగారికేమి కావాలట? ఎందుకలా నీ కలలోకి మాటిమాటికీ వచ్చి తొందరపెడుతోంది? అదైనా అడిగావా?"
"చెప్తాను ఒకటి తరవాత ఒకటిగా— మొదటిసారి కలలోకి వచ్చినప్పుడు ఆమె నన్ను లేపి ఏదో అర్థంకాని రీతిన చెప్తూ జుత్తు విరబోసుకుని ఏడవసాగింది. ఎంత ఓదార్చినా ఆపలేదు. అలా ఏడుస్తూనే గది బయటకు వెళ్ళిపోయింది."
"మరి రెండవసారి కలలోకి వచ్చి ఏమి చేసింది?"
"చెప్తాను. రెండవసారి కూడా అదేవిధంగా జుత్తు విరబోసుకునే వచ్చింది. అప్పుడు కూడా ఆమె ఏమీ మాట్లాడలేదు. మూగగా చూస్తూ మనం పడుకునే మంచం వెనుక ఉన్న ఫొటో వైపు చేయి చూపిస్తోంది."
"మన తల వెనుక ఫొటో ఉందా! అదేమి ఫొటో—ఎవరి ఫొటో?"
"ఆ ఫొటో ఎవరిదో కాదు—మన కామిని ఫొటోయే—"
ఆ మాట విన్నంతనే అతడి గుండె జల్లుమంది. వణుకుతున్న పెదవులతో అడిగాడతను— "కామిని తనకు కావాలంటుందా! మన పాపను తనతో పంపించమంటుందా?"
"అబ్బే— అదేమీ అడగలేదండీ! కామిని ఫొటో చూపిస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. చివరకు తన మనోభావాన్ని నాకు అందజేయలేక శోక దేవతలా కన్నీరు కారుస్తూ వెళ్ళిపోయింది. అసలు విషయం చెప్పడానికి మరొకమారు వస్తుందేమో—"
అప్పటికి ఏమి చెప్పాలో తోచక సుఖదేవ్ ఊరకుండిపోయాడు. కాసేపు అలా ఉండిపోయి పెదవి విప్పాడతను—"ఇదంతా మీ అత్తగారికి చెప్పావా! చెప్తే ఏమంది?"
"కాత్యాయనీ వ్రతం చేయాలంది, ఆ విషయమై పురోహితుడితో మాట్లాడతానంది. ఈ తతంగం పూర్తయ్యేంత వరకు మీకు దూరంగా ఉండమంది. పిల్లల శుచీ శుభ్రతా చూసుకోమంది. ప్రతిరోజు ఉదయమో—లేక—సాయంత్రమో భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్ళి రమ్మంది."
అతడిక మాట్లాడటానికి ఏమీ లేదన్నట్లు టీపాయ్ పైన రాములమ్మ ఉంచిన కాఫీ కప్పు అందుకున్నాడు. కాఫీ చప్పరిస్తూనే మనసున అనుకున్నాడతను— "ఇంకా నయం—హైరోడ్డు యాక్సిడెంట్ తమ వల్ల జరగలేదు—బ్రతికిపోయాం!"
అలా అనుకుంటూనే అక్కణ్ణించి కదలబోయాడు. ప్రణవి ఆపింది—
"ఇంకేం చెప్పాలి?" అని అడుగుతున్నట్టు తిరిగి చూశాడు సుఖదేవ్.
అప్పుడామె లేచి నిల్చుంది— "మనమెక్కడో తప్పు చేసినట్లనిపిస్తుందండీ!"
"వై?" అని అడిగాడతను.
అప్పుడు ప్రణవి మనసులోని మాటను అతడి ముందుంచింది— "మనం వచ్చేటప్పుడు అక్కడున్న శివాలయానికి వెళ్ళాలనుకున్నాం కదండీ— కానీ—ముక్కంటిని దర్శించకుండానే నేరుగా వచ్చేశాం. అలా చేయకుండా రావడం వల్లనేమో, ఈ పరిస్థితి దాపురించింది."
అతడు భార్య మాటను పట్టున కట్ చేశాడు చిన్నగా నవ్వుతూ— "చిన్న చిన్న విషయాలలో నువ్వు లేని అపశకునాలు, అపభ్రంశాలు వెతుకుతున్నట్లున్నావు ప్రణవీ! మనం రోజంతా హోటెల్ రూములో కలిసి ఉన్నాం— హెక్టిక్ కార్యరంగంలో మునిగి ఉన్నాం—
మనం ఆ తరవాత స్నానం చేసినా అటువంటి మూడ్‌లో పవిత్ర దేవస్థలానికి ఎలా వెళ్ళాలనిపిస్తుంది? అప్పటి మన మానసిక స్థితి గురించి పార్వతీదేవికో, కైలాస శిఖరాల పైన శివతాండవం చేసే ముక్కంటికో తెలవదా! ఇంతకీ, ఆ విషయమై అంత లోతుగా ఎందుకు ఫీలవుతున్నావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు ప్రణవీ—"
"అలా డీప్‌గా ఎఫెక్ట్ కావడానికి కారణం ఉంది సుఖదేవ్! చెప్తాను— నిదానంగా వినండి. ఆమె చివరి క్షణాలలో చనిపోయే ముందు, ఏడుస్తూ కూర్చున్న వాళ్ళ పాప చేయి వదలకుండా పట్టుకుని నా కళ్ళలోకి దీర్ఘంగా చూస్తూ ప్రాణాలు విడిచింది. అది నా గుండె లోతుల్ని తాకింది."
దానికి అతడు వెంటనే స్పందించాడు—"అయ్యోరామ! దీనికా అంతగా చలిస్తున్నావు? ఎవరైనా ఎటువంటి సందర్భంలోనైనా చనిపోయేటప్పుడు కళ్ళనిండా ప్రాణాలు నింపుకుని ఎదుట నిల్చున్న వారి వైపు లోతుగా చూస్తూ ప్రాణాలు విడుస్తారు.
అప్పుడు వాళ్ళాయన మన మధ్య లేడు. అంబులెన్సులో స్పృహ తప్పి పడున్నాడు. అతడికి గానీ ఏమీ జరక్కుండా మన మధ్య గానీ ఉంటే ఆమెగారు అతడి వైపే చూస్తూ ప్రాణాలు విడిచేది.
విద్యావంతురాలివి— పట్టభద్రురాలివి. లేనిపోనివన్నీ బుర్రలోకి ఎక్కించుకుని ఊహల పంజరంలో చిక్కుకుని మనసు పాడుచేసుకోకు— ఇప్పుడు మీ అత్తగారు ఆధ్యాత్మికమైన పరిష్కారం ఎలాగూ చెప్పారు కదా— ఆమెగారి అడుగుజాడల్లోనే ముందుకు సాగు— ఆ పవిత్ర కార్యాలన్నీ పూజా పునస్కారాలన్నీ పూర్తయ్యేంత వరకు మనం ఒరుసుకుంటూ కూర్చోం. ఒకే మంచాన విశ్రమించం. ఐ ప్రామిస్—చాలా!" అంటూ అతడు ప్రణవి భుజాలను ఓసారి ఊపి నవ్వుతూ మేడ మెట్ల వైపు సాగిపోయాడు.
ప్రణవి మానసిక స్థితిని ఇలా కొనసాగనిస్తే రేపు సైకియాట్రిక్ కేసుగా మారుతుందేమో! లేదు— తను కచ్చితంగా అలా జరగనివ్వడు— సదాచార పరాయణురాలూ, మృదు మనస్కురాలూ అయిన ప్రణవి వద్ద ఆచి తూచి మాట్లాడాలి. తడబడకుండా అడుగులు వేయాలి. అప్పుడప్పుడు విజృంభించాలని బుసలు కొట్టే కోరికల ఘీంకారాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇప్పటికి అది తప్ప మరే మార్గమూ అతడికి కనిపించలేదు. అంతే కాక— ఈ పుణ్యకార్యాలన్నీ ఒకటి తరవాత ఒకటిగా పూర్తి అయ్యేంత వరకు తల్లి కూడా కోడలి పిల్లనూ తన దగ్గరకు చేరనివ్వదేమో—
------------------------------------------------------------------------------------

ఆ రోజు సోమవారం. సచివాలయ కేంద్ర కార్యాలయం రద్దీగా ఉంది. గాలి సహితం ఆడలేని రీతిన ఉంది సెక్షన్స్ లోని హడావిడి పరచుకుంది. వీక్లీ రిపోర్టులతో, మంథ్లీ ప్రొగ్రెస్ రిపోర్టుల తయారీతో తలమునకలై ఉన్నారు వివిధ గ్రూపుల స్టాఫ్— సూపర్ వైజర్లూను.
అప్పుడు శివపూజలో కలకలంలా ప్రవేశించాడు చీఫ్ అకౌంట్స్ ఆఫీసరు పర్సనల్ ప్యూను పరమశివం— "చీఫ్ ఆఫీసర్ పంపించారు. మిమ్మల్ని త్వరగా రమ్మన్నారు" అంటూ—
అప్పుడు తలెత్తి చూస్తూ—"ఎవర్ని! నన్నా?" అని అడిగాడు దీనదయాళ్.
పరమశివం ఠపీమని బదులిచ్చాడు—"కాదు. మిమ్మల్ని కాదు. భాను ప్రసాద్ గారిని—"
ఆ మాట విన్న వెంటనే సెక్షన్ స్టాఫ్ అందరూ తలలు తిప్పి చూశారు విస్తుపోతూ— వైష్ణవి మరింత ఆశ్చర్యపోతూ ఏదో ఫైలు పేపర్లకి నెంబరింగ్ చేస్తూ కూర్చున్న భాను ప్రసాద్ వైపు చూసింది. ఆ రోజు ఉదయమే ఆమె అతడితో కలిసి క్యాంటీనులో కబుర్లాడుతూ టీ తాగింది. అంతలో ఏమైంది? ఒకవేళ వీక్లీ రివ్యూ మీటింగ్ గానీ ఉంటే సూపర్ వైజర్ గారిని కదూ పిలుస్తారు! యుడిసీని పిలవడమేమిటి?
అప్పుడు అదే భావంతో దీనదయాళ్ అడుగుతూ లేచాడు—"రివ్యూ మీటింగా!"
"కాదు సార్—మిమ్మల్ని పిలవలేదు సార్! ఎవరో లేడీ అడ్వకేట్ లా ఉన్నారు. పెద్ద సార్ రూముకి వచ్చి కాసేపు ఆయనతో మాట్లాడి భాను ప్రసాద్ గారిని చూడాలని అడిగింది. అందుకే పిలవడానికి వచ్చాను. ఆయన కనిపించరేం?"
"అదిగో— ఇక్కడే ఉన్నాడు. నువ్వెళ్ళు— నేను పంపిస్తానులే!"
ఆ మాటతో పరమశివం కదలి వెళ్ళిపోయాడు. దీనదయాళుకి పరమశివం రాక అపశకునంలా తోచింది. ఎక్కడో స్త్రీల విషయంలోనో— మరే ఇతర సున్నితమైన విషయంలోనో ప్రసాద్ ట్వీట్ చేసి ఉంటాడు. కొందరి స్త్రీల మృదు మనోభావాలను రెచ్చగొట్టి ఉంటాడు. అది స్త్రీ హక్కుల సంఘానికో మరే ఇతర సామాజిక సంస్థ వారికో నచ్చనట్లుంది. కోపం కూడా తెప్పించి ఉంటుంది.
అంచేత దెబ్బకు దెబ్బ అన్నట్లు అడ్వకేటుని— అందునా లేడీ అడ్వకేటుని పంపించి ఉంటారు; చేసిన ట్వీట్ ని వాపస్ చేసుకోమనో లేక షరతులు లేని క్షమాపణలు కోరుకోవాలనో లీగల్ పోరుకి దిగి ఉంటారు. పెద్దవాడిగా, యూనియన్ ప్రముఖుడిగా తను ఆనాడే వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు— ముఖపుస్తకాలలో ట్వీట్స్ చేసేటప్పుడు బహు ఉషారుగా ఉండాలని—
వింటే కదా! యువక రక్తం— పొంగిపొరలే ఆవేశం— రాతలో, చింతనలో పట్టు తప్పిపోయి ఉంటుంది. పరిస్థితి విషమించి ఉంటుంది. అలా సతమతమవుతూ అతను భాను ప్రసాదుని పిలిచి అతణ్ణి చీఫ్ అకౌంట్స్ ఆఫీసరు గారు పిలుస్తున్నారని చెప్పాడు.
దానికి అతడు వెంటనే స్పందించాడు—"ఎందుకూ?" అని ఆశ్చర్యంగా చూస్తూ—
"నన్నడిగితే? మీరే వెళ్ళి కనుక్కుని రండి— దేనికైనా సమయం చూసి, సంయమనం చూపి, ఆవేశపు పొంగు తగ్గించుకుని బదులివ్వండి."
భాను ప్రసాద్ తలూపుతూ కదలి వెళ్ళిపోయాడు.
పై అంతస్తులోని చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గారి ఛాంబర్‌కి చేరుకుని తన రాక విషయమై పి.ఎ. గారి ద్వారా తెలియజేసి ఆ తరవాత అనుమతి పొంది లోపలకు ప్రవేశించాడు భాను ప్రసాద్.
ఛాంబర్ వద్ద సీనియర్ ఆఫీసర్ గారికి అభివందనాలు తెలియజేస్తూ— "మే ఐ కమ్ ఇన్ సార్!" అంటూ సమీపించి లాయర్ గారి కోసం చూపులు సారించాడతను.
ఒక యంగ్ లేడీ తప్ప మరెవ్వరూ అతడికి కనిపించలేదు. అప్పుడు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ త్రిలోక్ గారు చూస్తున్న ఫైలు నుండి తలెత్తి చూసి అన్నాడు— "ఔనోయ్ భాను ప్రసాద్! లాయర్ గారు మీ కోసమే వచ్చినట్టున్నారు. మీ కోసమే ఎదురు చూస్తున్నారు."
"యస్ సార్! లాయర్ గారి కోసమే వచ్చాను. ఆమెగారు తమ ఇంటీరియర్ రూము లోపలకు వెళ్ళినట్లున్నారు—"
"భలేవాడివేనోయ్! ఆ లేడీ లాయర్ ఈమెగారే—"
"అలాగా! సారీ— మేడమ్ బ్లాక్ రోబ్స్‌లో లేకపోయేసరికి ఎవరో విజిటర్ అనుకున్నాను—" అంటూ ఎదురుగా కూర్చున్న స్త్రీ వైపు తిరిగాడు.
అతడు నోరు తెరిచే లోపల ఆమె అందుకుంది— "మీరేనా మిస్టర్ భాను ప్రసాద్! కంగ్రాట్స్— గ్లాడ్ టు మీట్ యూ."
ఆమె మాటలు విని అతడు అయోమయంగా చూశాడు. దేనిగురించో ఊహించుకుంటూ ఇంకేదో సీను గురించి తలపోస్తూ వచ్చినతడికి సహజంగా అలాగే కదా ఉంటుంది—
అప్పుడామె ముసురును పారద్రోలుతూ విషయానికి వచ్చింది— "సారీ— నా గురించి నేనేమీ చెప్పలేదు కదూ! నా పేరు విద్యా భవాని. హైకోర్టులో జూనియర్ లాయర్‌ని. సిసిటీవీలో మీరు ఆ చిన్నపాపను కాపాడటానికి చూపించిన ధైర్యసాహసాలు చూసి అమితానందంతో మీకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాను."
ఆ మాటకతడు కళ్ళు మిటకరించి చూస్తూ తనను తాను కుదుటపరుచుకుంటూ స్పందించాడు— "మీరంటున్నది— నిన్న రాత్రి రోడ్డుపైకి వచ్చిన ఆ చిన్నపాపను చుట్టుముట్టిన వీధి కుక్కల గురించే కదూ మీరంటున్నది!"
విద్యాభవాని తలూపింది. అతడు అదే ఆశ్చర్యం గొలిపే స్వరంతో స్పందించాడు—
"మరి ఆ ప్రమాదకర ఉదంతం గురించి నేనింతవరకు ఎవరికీ చెప్పనేలేదే— మరి మీకెలా తెలిసింది? ప్లీజ్— మరేమీ అనుకోకుండా చెప్పండి, అంత స్పీడుగా సూటిగా అడుగుతున్నందుకు—"
"నేనేమీ అనుకోను గానీ— రండి— అలా ఆ సిట్టింగ్ ప్లేస్ వద్దకు వెళ్ళి మాట్లాడుకుందాం— సార్‌కి డిస్టర్బ్ కాకుండా—"
అప్పుడు త్రిలోక్ గారు ఎదురు చూడని విధంగా వాళ్ళ మధ్యకు ప్రవేశించాడు— "వద్దు వద్దు! ఇక్కడే మాట్లాడుకోండి. వినడానికి నాకు కూడా ఆసక్తిగానే ఉంది. ఇప్పటికి నాకేమీ వర్క్ ప్రెజర్ లేదు లెండి. ఈ లోపల టీలు కూడా వస్తాయి" అంటూ ప్రసాదును చూసి సైగ చేశాడు తన ప్రక్క సీటులో ఆసీనుడవమని—
అతడు థాంక్స్ చెప్తూ కూర్చుని తన వంతు సమాచారాన్ని రివైండ్ చేస్తూ అందివ్వడానికి పూనుకున్నాడు— "నిన్న రాత్రి ఏమి జరిగిందంటే— మా కాలేజీ మేట్ పుట్టినరోజు డిన్నర్‌కి హాజరై— ఆ తరవాత తనతో ఎంత ఉండమని బలవంతం చేసినా వీల్లేదంటూ బయటపడ్డాను.
ఎందుకంటే— అక్కడి వాళ్ళు చేసుకోబోయేది హాట్ డ్రింక్స్ పార్టీ— నాకు లిక్కర్ తీసుకునే అలవాటు లేదు. అంచేత స్ప్రైట్ కూల్ డ్రింక్ మాత్రం గొంతులో పోసుకుని బైక్‌కి కిక్ ఇస్తూ లాడ్జి వైపు పోనిచ్చాను.
అప్పుడు అనుకోకుండా ఆ రాత్రిపూట నాలుగైదు కుక్కల మధ్య చిక్కుకుని బిర్రబిగుసుకుని నిల్చున్న ఆ మూడేళ్ళ పాపను చూశాను. అప్పుడా చిన్నారి పాపను చూసి, ఆ కుక్కల గుంపును చూసి నాకేమైందో నాకే తెలియదు. ఏదో అదృశ్య శక్తి నన్ను ముందుకు తోసినట్టు తిన్నగా నా బైక్‌ని పాపను చుట్టుముట్టిన కుక్కల గుంపులోకి పోనిచ్చాను.
నన్ను చూసి గానీ నా లోహ వాహనాన్ని చూసి గానీ ఆ వీధి శునకాలు వెనక్కి తగ్గలేదు. నన్ను అటాక్ చేయడానికి నాపైకి ఎగరడానికి ప్రయత్నించాయి. అప్పుడు నేను ఓ విధమైన పూనకంలో ఉన్నానేమో కొంచెం కూడా జంకలేదు.
నెత్తిపైన ఉన్న హెల్మెట్ తీసి వాటిపైకి విసురుతూ కౌంటర్ అటాక్ చేశాను. అప్పుడు కుక్కలన్నీ తోకముడిచాయి. అదే అదనుగా ఆ పాప ఏడుస్తూ అరుస్తూ వాళ్ళ ఇంటి వైపు పరుగెత్తింది—
"అబ్బా!" అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటూ బైక్‌కి కిక్ ఇస్తూ నేనుంటున్న లాడ్జి చేరుకున్నాను. ఇక్కడ నేను వీధి కుక్కల సైకాలజీ గురించి ఓ మాట చెప్పాలి సార్— వీధి కుక్క ఒంటరిగా ఉంటే అది ఊరకుక్కే— కానీ— గుంపుతో ఉంటే మాత్రం అది ఊరకుక్క కాదు— అడవి కుక్కగా మారిపోతుంది, అదండీ అసలు సంగతి—"
ఆ చివరి మాట విన్నంతనే త్రిలోక్ గారు చట్టున తన రివాల్వింగ్ చైర్ నుండి లేచి భాను ప్రసాద్‌తో చేతులు కలిపాడు— అభినందనలు తెలుపుతూ— "నిజానికి గుండెలదిరి పోయాయనుకో— ఆ పాపకు ఏమైనా జరుగుతుందేమోనని— అబ్బా! తెలివిగా పరుగు తీసి అక్కణ్ణించి తప్పుకుంది— ఐతే— ఒకటి భాను ప్రసాద్— నువ్వు అప్పటికప్పుడు వెనక్కి తరలిరాకుండా ఆ పాప అమ్మానాన్నలను బయటకు పిలిచి ఎడాపెడా వాయించి రావలసింది."
"వాస్తవమే సార్— కానీ నేనప్పుడు నేనుగా లేను కదా సార్! బెదిరిపోయింది ఆ పాప మాత్రమే కాదు— నేను కూడా బెదరిపోయాను కదా! ఇక తెలుసుకోవలసింది ఇంకా ఉందా సార్—" అంటూ అతడు విద్యాభవాని వైపు తిరిగి కొనసాగించాడు— "జరిగిన ఉదంతం సిసిటీవీ నుండి ఫ్లాష్ అయింది కాబట్టి మీకు తెలిసొచ్చింది. దట్స్ ఫార్— ఓకే! కానీ— అందులో ఉన్నది నేనేనని మీకెలా తెలిసింది మేడమ్? ముఖ్యంగా నేనిక్కడ ఈ ఆఫీసులో పని చేస్తున్నానని మీకెలా తెలిసింది? ఇది గానీ తెలుసుకోకపోతే నాకు నిద్రపట్టదు మేడమ్."

అది విని విద్యాభవాని తెలికాంతులు చిమ్మేలా నవ్వింది— "చెప్తాను. అదే కదా మీ ఆరాటానికి కారణం— చెప్తాను." అంటూ ట్రేలో పరమశివం తీసుకువచ్చిన టీ కప్పులను అందుకుని మొదటి కప్పు చీఫ్ గారి ముందుంచి, ఆ తరవాత తనొకటి తీసుకుని, మరొకటి భాను ప్రసాద్‌కి అందించింది.
కాస్తంత టీ చప్పరించిన తరవాత చెప్పనారంభించింది— "సిసిటీవీ ఫుటేజీలో మీ రూపమే కాదు, మీ బైక్ కూడా ఉందన్నది మరచిపోకండి—"
అది విని ఆసక్తి ఆపుకోలేక అడిగాడు—"ఉంటే?"
ఆమె మరొకసారి నవ్వుతూ బదులిచ్చింది— "బైక్ ఉంటే— దానికి నంబర్ కూడా ఉంటుంది కదా! దాని ప్రకారం నేనూ, మాతోటి లీగల్ అసిస్టెంట్లతో కలిసి ముందుకు సాగి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ శాఖ వారి సహకారంతో మీ లాడ్జి అడ్రెస్ కనుక్కున్నాం.
అక్కడున్న మీ సహ లాడ్జర్స్ ద్వారా మీ ఆఫీసు విలాసం కనుక్కుని ఇప్పుడు మీ ముందు కూర్చున్నాను. ఈజ్ ఇట్ క్లియర్?"
ఆమె జవాబు విని భాను ప్రసాద్ సీట్లో కుదురుగా కూర్చోలేకపోయాడు— చట్టున లేచి చప్పట్లు కొట్టాడు. "బ్రిలియంట్— వండర్‌ఫుల్! మీరు తేజోవంతమైన లాయర్ అని నిరూపించుకున్నారు. ఇదిగో— నా కప్పు టీ కూడా మీరే తీసుకోండి—" అని తన టీ కప్పుని ఆమెకు అందివ్వబోయాడు—
విద్యాభవాని చేతిని అడ్డుపెడుతూ—"వద్దు వద్దు! మీరే తీసుకోండి. పాపను కాపాడింది మీరు— నేను కాంప్లిమెంట్ అందుకోవడం ఏమిటి?" అంటూ ఆమె సుతారంగా తిరస్కరించింది.
"దెన్ ఇట్స్ ఓకే మేడమ్!" అంటూ సీట్లో కూర్చుని టీ తాగడం పూర్తిచేశాడు భాను ప్రసాద్.
ఆ తరవాత ఆమె కూడా టీ తాగడం పూర్తి చేసి లేచి నిల్చుని త్రిలోక్ గారి వైపు చూస్తూ అంది— "థాంక్యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ కైండ్ ట్రీట్మెంట్—" అని చేతులు జోడించి భాను ప్రసాద్ వైపు తిరిగి అంది అభిమానం ధ్వనించే గొంతుతో— "ఏది ఏమైతేనేమి— మీరు కుక్కల గుంపుపైకి కౌంటర్ అటాక్ చేస్తూనే క్షేమంగా బయటపడ్డారు. వన్స్ అగైన్ కంగ్రాట్స్!" అని అతడితో చేతులు కలపడానికి కుడిచేయి అందించింది. అతడామె చేతిని అందుకోలేదు. తల అడ్డంగా ఆడిస్తూ ఉండిపోయాడు.
=================================
ఇంకా ఉంది
వ్యాపార ప్రపంచం – పార్ట్ 8
త్వరలో మీ ముందుకు వస్తుంది.
=================================
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a












Comments