అత్తగారి కథలు - 27: వివాహబంధం అంటే?

Atthagari Kathalu - 27: Vivahabandam Ante? - Telugu Family Story | L. V. Jaya
అత్తగారి కథలు - 27: వివాహబంధం అంటే? - తెలుగు కుటుంబ కథ | L. V. జయ
Published in manatelugukathalu.com on 07/11/2026
వివాహబంధం అంటే కేవలం కలిసి జీవించడం కాదు.. ఒకరినొకరు గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ, జీవిత బాధ్యతలను సమానంగా పంచుకోవడం.
‘అత్తగారి కథలు - 27: వివాహబంధం అంటే?’ కథలో జాగృతి ఆలోచనల ద్వారా ఆరోగ్యకరమైన దాంపత్యానికి అవసరమైన విలువలను రచయిత L. V. జయ చక్కగా వివరించారు.
వివాహబంధం అంటే కేవలం కలిసి జీవించడం కాదు.. ఒకరినొకరు గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ, జీవిత బాధ్యతలను సమానంగా పంచుకోవడం.
‘అత్తగారి కథలు - 27: వివాహబంధం అంటే?’ కథలో జాగృతి ఆలోచనల ద్వారా ఆరోగ్యకరమైన దాంపత్యానికి అవసరమైన విలువలను రచయిత L. V. జయ చక్కగా వివరించారు.
జాగృతి, సమర్థ్‌ల పెళ్ళికి వచ్చిన దగ్గరి చుట్టాలందరూ రెండు రోజులుండి వెళ్ళిపోయారు.
సమర్థ్, జాగృతిలతోపాటు సమర్థ్ వాళ్ళ అమ్మ, నాన్న రాధ, మాణిక్యాలరావులూ, అక్క పావని, అత్త కాంతం కుటుంబాలు మాత్రమే మిగిలారు.
జాగృతికి అప్పటివరకు పూజలు, చుట్టాలతో హడావిడిగా గడచిపోవడంతో ఇంట్లోవాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం రాలేదు.
సాయంత్రం భోజనాల సమయంలో రాధ, "రేపు మనమందరం కోడలు పుట్టింటికి వెళ్ళాలి.
అందరికీ గుర్తుంది కదా! ఉదయాన్నే లేచి బయలుదేరాలి" అని చెప్పింది.
"పెళ్ళి హడావిడి వల్ల అలసిపోయాం. మళ్ళీ ఉదయాన్నే లేవాలా వదినా!!" అంది కాంతం.
రాధ కాంతాన్ని కోపంగా చూస్తూ, "నేనూ అలసిపోయాను. రావాలనుకున్నవాళ్ళు రండి, లేనివాళ్ళ సంగతి నాకు తెలియదు.
టిఫిన్లకీ, భోజనాలకీ అక్కడికే వస్తామని వాళ్ళకి చెప్పేశాను. నేను ఎవరికీ వండలేను, వండించలేను. ఆలోచించుకోండి" అని అక్కడినుండి వెళ్ళిపోయింది.
"మీ వదిన కోపం సంగతి తెలిసిందే కదా కాంతం! ఇంకొక్కరోజే కదా, భరించు" అన్నాడు మాణిక్యాలరావు కాంతంతో.
"అయితే ఎన్ని గంటలకి లేవాలంటావ్ బావా?" అడిగాడు కాంతం భర్త నాగేశ్వరరావు.
"టిఫిన్లు కూడా అక్కడే అని చెప్పింది కదా, అంటే కనీసం రెండుకో, మూడుకో అయినా ఇంట్లోంచి బయలుదేరితే తప్ప టిఫిన్ల టైమ్‌కి వైజాగ్ చేరలేం" అన్నాడు మాణిక్యాలరావు.
మర్నాడు ఉదయం ఒంటి గంటకి అందరూ కష్టపడి లేచారు. ముందుగా మగవాళ్ళు రెడీ అయ్యి, ఇంటి బయట కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు.
ఆడవాళ్ళు మగవాళ్ళకి కావాల్సినవి అందిస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇల్లు సర్దుకుంటూ ఆలస్యం అయ్యారు.
ఆడవాళ్ళు ఎంతసేపటికీ రాకపోవడంతో, "ఎంతసేపు చేస్తారు ఈ ఆడవాళ్ళు? ఎంత తయారైనా మా ఆవిడది మాడు మొహమే!!" అన్నాడు మాణిక్యాలరావు విసుగ్గా.
"మా ఆవిడ కూడా అంతే కదా బావా!! అదీ, దాని మెల్లకళ్ళు. ఎటు చూస్తుందో కూడా తెలియదు, అయినా ఎంత తయారవుతుందో" అన్నాడు నాగేశ్వరరావు.
"అలా అంటూనే నలుగుర్ని కన్నావా అయితే?" అన్నాడు మాణిక్యాలరావు నవ్వుతూ.
"నువ్వు మాత్రం కనలేదూ ఇద్దర్ని? నేనూ అంతే" అన్నాడు నాగేశ్వరరావు.
"అమ్మో! వాళ్ళు విన్నారంటే మనల్ని చంపేస్తారు" అన్నాడు మాణిక్యాలరావు నవ్వుతూ.
అప్పుడే అక్కడికి జాగృతి, పావని, పిల్లలు వచ్చారు.
మగవాళ్ళ మాటలకి పిల్లలు నవ్వుతుంటే, జాగృతి ఆశ్చర్యపోయింది. 'ఈ మగవాళ్ళిద్దరూ వాళ్ళ భార్యల గురించి ఇలా మాట్లాడుతున్నారేమిటి? అనాలనుకున్నదంతా అని మళ్ళీ భయం నటిస్తున్నారు!!' అనుకుంది.
"ఎంత వయసొచ్చినా బావమరుదుల మధ్య జోక్స్ తగ్గేటట్టు లేవు" అన్నాడు సమర్థ్ జాగృతిని చూస్తూ, 'వీళ్ళింతే' అని జాగృతికి చెప్తున్నట్టుగా.
మాణిక్యాలరావు, ఇంటికి ముందున్న మెయిన్ రోడ్డు మీద వెళ్ళిపోతున్న బస్సులని చూస్తూ, "అన్ని బస్సులు ఖాళీగా వెళ్ళిపోతున్నాయి. లేటైపోతోంది, ఇంకెంతసేపు పడుతుంది మీ అమ్మకి?" అని అడిగాడు పావనిని.
"5 నిమిషాల్లో వచ్చేస్తామని చెప్పింది నాన్నా" అంది పావని.
"ఆ వచ్చే బస్సుని ఆపరా అయితే" అన్నాడు మాణిక్యాలరావు సమర్థ్‌తో.
తరువాత వచ్చిన బస్సుని ఆపి, అందరినీ ఎక్కమని చెప్పాడు సమర్థ్. అందరూ ఎక్కి కూర్చున్నాక, డ్రైవర్ బస్సు స్టార్ట్ చేయబోయాడు.
"ఇంకా రావాల్సినవాళ్ళు ఉన్నారు, ఎందుకా కంగారు? కాసేపు ఆగు" అన్నాడు మాణిక్యాలరావు బస్సు డ్రైవర్‌తో.
"అయితే ముందే ఎందుకు ఆపి ఎక్కారు?" అని అరిచాడు బస్సు డ్రైవర్.
"బస్సు నీ సొంతం అయినట్టు మాట్లాడతావేం? అయినా ఖాళీగానే వెళ్తోంది కదా, ఆగు" అరిచాడు మాణిక్యాలరావు.
పది నిమిషాలయినా రాధ, కాంతం రాలేదు. ఈలోగా కొంతమంది ప్రయాణికులు కూడా ఎక్కి కూర్చుని, బస్సుని స్టార్ట్ చేయమని డ్రైవర్‌ని కంగారుపెట్టారు.
"ఎప్పటికి వస్తారు మీ వాళ్ళు? వాళ్ళు రాకపోతే మీరు కూడా దిగండి" అన్నాడు బస్సు డ్రైవర్ చిరాకుగా.
వీళ్లిద్దరూ ఇంకేం అరుచుకుంటారో అని భయం వేసింది పావనికి. "ఇంకో 5 నిమిషాలు ఆగు, వచ్చేస్తారు" అని బస్సు డ్రైవర్‌కి చెప్పి, తన కూతుర్ని పిలిచి, "అమ్మమ్మని తొందరగా రమ్మని చెప్పు" అని చెప్పి పంపింది.
పావని కూతురు తిరిగి వచ్చి, "అమ్మమ్మ చీర కట్టుకుంటోందిట, కుచ్చుళ్ళు సరిగ్గా రావటం లేదుట. ఇంటి తలుపులు, కిటికీలు వేసి, తాళాలు కూడా వేసి రావాలిట. తాతని రమ్మనమని చెప్పింది" అని చెప్పింది.
నాగేశ్వరరావు నవ్వుతూ, "చీర కట్టడానికా? తాళాలు వేయడానికా?" అన్నాడు. బస్సులో ఉన్నవాళ్ళందరూ నవ్వారు.
"వీళ్ళావిడ చీర కట్టుకుంటుంటే, ఈయన మాత్రం బస్సు ఆపేసాడు. ఇప్పుడు మనం ఆవిడ చీర కట్టుకునేంతవరకు ఆపాలన్నమాట" అన్నాడు డ్రైవర్.
"ఉదయాన్నే బయలుదేరాలని అందరికీ చెప్తుంది, కానీ ఈవిడ మాత్రం ఎప్పటికీ బయలుదేరదు" అని తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు మాణిక్యాలరావు.
వాళ్ళ మాటలకి, నవ్వులకి బాధ అనిపించింది జాగృతికి. 'ఆడవాళ్ళ గురించి ఈ రకంగా అందరి ఎదురుగా మాట్లాడడం, నవ్వుకోవడం ఏమిటో? ఇంటి పనులు చూసుకోవడం, సర్దుకోవడం, పిల్లల్ని తయారుచేయడం, ఎవరికి కావాల్సింది వాళ్ళకి అందించడం, తలుపులు, కిటికీలు వేసుకోవడం అన్నీ ఆడవాళ్ళ పనేనా? మగవాళ్ళు చేసింది ఏమైనా ఉందంటే, అది ముందే తయారయ్యి వీధుల్లో కూర్చొని ఆడవాళ్ళని తిట్టుకోవడం, వెక్కిరించడం అంతే.
దానికన్నా ఆడవాళ్ళకి సాయం చేస్తూ, అందరూ రెడీ అయ్యాక కలిసి బయలుదేరవచ్చు కదా! ఈ కంగారెందుకు? అందరిముందూ ఆడవాళ్ళని వెక్కిరించడమెందుకు?' అనుకుంది.
మాణిక్యాలరావు విసుకుంటూ తలుపులు, కిటికీలు వేసి, ఇంటికి తాళం వేసి వచ్చాడు. రాధ, కాంతం వచ్చి ఎక్కాక బస్సు బయలుదేరింది.
"ఈ ఆలస్యం అంతా ఆడవాళ్ళవల్లే. వీళ్ళు ఈ జన్మకి మారరు. మనం ఇప్పుడు కనీసం 4 గంటల ట్రైన్‌కైనా ఎక్కగలమో లేదో? ఉదయం నుండి కాఫీ కూడా నోట్లో పడలేదు" అన్నాడు మాణిక్యాలరావు కోపంగా.
బస్సు స్టేషన్‌కి చేరింది. '4 గంటలకి గరీబ్ రథ్ బయలుదేరుతుంది' అని అనౌన్స్‌మెంట్ వినిపించింది. అందరూ పరిగెత్తారు. రాధ, కాంతం మాత్రం వెనకపడిపోయారు. వాళ్ళు ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ట్రైన్ స్టార్ట్ అయ్యింది.
"అత్తయ్యగారు, పిన్నిగారు ఇంకా ఎక్కలేదు" అని సమర్థ్‌కి చెప్పింది జాగృతి. "వీళ్లిప్పుడూ ఇంతే, నెమ్మదిగా నడుస్తారు" అని విసుక్కున్నాడు మాణిక్యాలరావు.
సమర్థ్ డోర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరికీ చెయ్యందించాడు. రాధని గట్టిగా లాగి ట్రైన్ ఎక్కించాడు, కానీ కాంతం ఎక్కలేకపోయింది. "నెక్స్ట్ కంపార్ట్‌మెంట్ దగ్గరికి రా అత్తా, నేను అక్కడికి వస్తాను" అని అటుపక్క పరిగెత్తాడు.
'కాంతం ఎక్కిందో లేదో?' అని అందరూ కంగారు పడుతున్నా, నాగేశ్వరరావు మాత్రం నవ్వుతూ, "వదిలేయవచ్చు కదా! పోతేపోయింది, కాసేపైనా ప్రశాంతంగా ఉండవచ్చు" అన్నాడు. జాగృతికి నాగేశ్వరరావు మాటలకి ఒళ్ళు మండిపోయింది.
"నాకా అదృష్టం లేదు ఇప్పుడు" అన్నాడు మాణిక్యాలరావు, నాగేశ్వరరావు చెవిలో.
'ఇదేమిటి? తన చెల్లెలి గురించి అంటున్నా ఈ మనిషికేమీ బాధలేదా? పైగా తనకి ఆ అదృష్టం లేదంటారేమిటి? ఇదేం మనుషులు? ఛీ!' అనుకుంది జాగృతి.
కాంతం కూడా ట్రైన్ ఎక్కాక, ఏమీ జరగనట్టుగా అందరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
జాగృతి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. 'మా ఇంట్లో ఆడ, మగ భేదం లేకుండా అందరినీ సమానంగానే చూశారు.
ఇంట్లో అందరం కలిసి పనులు చేసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళని అందరిముందూ వెక్కిరించడం తప్ప బాధ్యత తీసుకోవడం లేదు. ఆడవాళ్ళు కూడా ఇదేమీ పెద్ద విషయమే కాదన్నట్టు మామూలుగానే ఉన్నారు.
చాలామంది ఇళ్ళల్లో భర్తలు, తమ భార్యలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. అబ్బాయిలకు చిన్నప్పటినుండి ఇంటి పనుల్లో సాయం చేయడం, ఆడవారిని సమానంగా చూడడం, వారిని గౌరవించడం వంటివి నేర్పరు.
మగవాళ్ళే అధికులు, యజమానులు అనే భావనతో అబ్బాయిలను పెంచుతారు.
భార్యాభర్తలు ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకముందే వివాహబంధంలోకి తోసి, భార్యను కేవలం ఇంటి బాధ్యతలు చూసుకోవడానికే పరిమితం చేస్తారు.
అది వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఈ ఆడవాళ్ళు కూడా ముందంతా బాధలన్నీ భరించి, కోడళ్ళు వచ్చాక వాళ్ళ మీద తమ ప్రతాపం చూపిస్తారు.
కనీసం సమర్థ్ వాళ్ళ ఇంట్లో మగవాళ్ళలా ఉండకుండా ఉంటే బాగుణ్ణు. లేకపోతే తన జీవితం నరకమే' అని భయపడింది.
'తన వివాహబంధం మాత్రం ఇలా ఉండకూడదు. మేమిద్దరం జీవితాంతం విడదీయరాని స్నేహితుల్లా ఉండాలి.
ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ, నమ్మకంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఎదగడంలో ప్రోత్సహించుకుంటూ ఉండాలి.
ఇల్లు నడపడం, పిల్లలని పెంచడం, డబ్బులకి సంబంధించిన విషయాలు వంటివన్నీ బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకోవాలి.
ఇది కదా వివాహబంధం అంటే! ఈ విషయం గురించి ముందే సమర్థ్‌తో మాట్లాడాలి' అని జాగృతి నిర్ణయించుకుంది.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya/profile
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు









Comments