top of page
Original.png

పెళ్ళి ఖర్చు రికవరీ అసోసియేషన్

9 hours ago
4 min read

పెళ్లికి రాని అతిథుల దగ్గర ఖర్చులు వసూలు చేస్తున్న పాపారావు మరియు పెళ్లి ఖర్చు రికవరీ ఏజెన్సీ

Pelli Karchu Recovery Association - Telugu Comedy Story | Mohana Krishna Tata

పెళ్ళి ఖర్చు రికవరీ అసోసియేషన్ - తెలుగు హాస్య కథ | తాత మోహనకృష్ణ

Published In manatelugukathalu.com On 07/11/2026


పెళ్లి ఖర్చులు తిరిగి రాబట్టాలనే అత్యాశతో పాపారావు చేసే వింత ప్రయత్నాలు ఈ హాస్య కథలో నవ్వులు పూయిస్తాయి. డబ్బుపై అతని అత్యాశ చివరికి అతనికే ఎలా చిక్కులు తెచ్చిందో సరదాగా చూపిస్తుంది.


పాపారావు ప్రతిదానికీ పైసా పైసా లెక్కలు వేయడం అలవాటు. తన పెళ్లిని కూడా ఒక పెద్ద బిజినెస్ ప్రాజెక్ట్‌లా ప్లాన్ చేశాడు. 


ఊరంతటికీ, తెలిసిన వాళ్ళకీ, తెలియని వాళ్ళకీ కలిపి దాదాపు రెండు వేల పెళ్లి కార్డులు పంచాడు. కేవలం ఐదు వందల రూపాయల ప్లేటు చొప్పున భారీ విందు ఏర్పాటు చేశాడు.


'కార్డు తెచ్చిన ప్రతి ఒక్కరూ కనీసం ఐదు వందలో, వెయ్యో కట్నం చదువుతారు, ఎలాగూ లాభమే!' అని గట్టిగా మైండ్‌లో లెక్కలు వేసుకున్నాడు.


కట్ చేస్తే... పెళ్లి రోజు వచ్చింది.


తీరా చూస్తే... పెళ్ళికి వచ్చింది కేవలం రెండు వందల మందే! మిగతా ఒక వెయ్యి ఎనిమిది వందల మంది 'రాహుకాలం', 'ఆఫీస్ పని', 'కడుపునొప్పి', 'బస్సు దొరకలేదు', 'పెళ్ళాం రెడీ అవడంలో లేట్' అంటూ రకరకాల కారణాలతో చెప్పకుండా పెళ్లి ఎగ్గొట్టారు. 


పాపారావుకి మైండ్ బ్లాక్ అయింది. 


వేలాది ప్లేట్ల భోజనం మిగిలిపోయింది, అంతకంటే ఎక్కువగా తను ఆశించిన కట్నాలు రాలేదు. పెళ్లిపీటల మీద భార్య వైపు చూడకుండా, రాని వాళ్ళ లిస్టు వైపు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.


కానీ పాపారావు ఊరికే వదిలే రకం కాదు. మరుసటి రోజే గూగుల్‌లో వెతికి ఒక వింత ఏజెన్సీని కాంటాక్ట్ చేశాడు. ఆ ఏజెన్సీ పేరు "పెళ్ళి ఖర్చు రికవరీ అసోసియేషన్".


ఆ ఏజెన్సీ వాళ్ళు నల్ల కోట్లు వేసుకుని, చేతిలో స్వైపింగ్ మెషిన్లు, క్యూఆర్ కోడ్ బోర్డులు, పాపారావు పెళ్లి కార్డుల జిరాక్స్ కాపీలు పట్టుకుని రంగంలోకి దిగారు. పెళ్ళికి రాని వాళ్ళ ఇళ్లకు ఒక్కొక్కటిగా వెళ్లడం మొదలుపెట్టారు.


మొదటిగా పాపారావు బెస్ట్ ఫ్రెండ్ సుబ్బారావు ఇంటికి వెళ్లారు ఏజెన్సీ బౌన్సర్లు.

సుబ్బారావు తలుపు తీయగానే, ఆరు అడుగుల బౌన్సర్ ఒకడు నిలబడి, "నమస్తే సార్, నిన్న పాపారావు పెళ్ళికి మీరు రాలేదు. 


కానీ మీ పేరు మీద ఒక ప్లేట్ భోజనం బుక్ అయింది. వృథా అయిన భోజనం ఖరీదు రూ. 500, పెళ్లి ముహూర్త సమయానికి మీరు రాలేకపోయినందుకు పెనాల్టీ రూ. 200, కట్నం కనీస ధర రూ. 516. మొత్తం కలిపి రూ. 1216. క్యాషా? ఆన్‌లైన్ పేమెంటా?" అన్నాడు గంభీరంగా.


సుబ్బారావు బిత్తరపోయాడు. "అదేంటండి, పెళ్ళికి రాకపోతే ఇంటికొచ్చి డబ్బులు వసూలు చేస్తారా? ఇదేమన్నా రౌడీయిజమా?" అని అరిచాడు.


ఏజెన్సీ మేనేజర్ నవ్వుతూ, "మీకు కార్డు ఇచ్చినప్పుడు కింద చిన్న అక్షరాలతో రాసి ఉంది సార్... 'ఇంటిమేట్ చేయకుండా రాకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయి మరియు భోజనం ఖరీదు వసూలు చేయబడును' అని. కాబట్టి దయచేసి గూగుల్ పే చేయండి" అని అన్నాడు.


తప్పనిసరి పరిస్థితుల్లో సుబ్బారావు ఏడుస్తూ డబ్బులు పంపించాడు.


ఇలా ఊరంతా తిరుగుతూ పెళ్ళికి రాని ప్రతి ఒక్కరి దగ్గరా ఏజెన్సీ వాళ్ళు వసూళ్లు మొదలుపెట్టారు. ఒకాయన "నేను ఊర్లో లేను, అమెరికాలో ఉన్నా" అంటే, "పర్లేదు సార్, డిజిటల్ అటెండెన్స్ మిస్ అయ్యారు కాబట్టి డాలర్లలో పే చేయండి" అని వసూలు చేశారు. 


మరొకరు "నాకు ఇన్విటేషన్ వాట్సాప్‌లో వచ్చింది కానీ నేను చూడలేదు" అంటే, వాట్సాప్‌లో బ్లూ టిక్ పడిన స్క్రీన్ షాట్ చూపించి మరీ జరిమానా వసూలు చేశారు.


పాపారావు బుద్ధి ఎంత ఘోరంగా తయారైందంటే... చివరకు తన అత్తగారి తరపు చుట్టాలను కూడా వదల్లేదు. పెళ్ళికి రాని భార్య మేనమామ ఇంటికి బౌన్సర్లను పంపి రెండు వేలు గుంజేశాడు.


ఆ విషయం తెలిసి పాపారావు భార్య దుర్గ కోపంతో ఊగిపోయింది.


"ఏమండీ! అసలు మీకు సిగ్గు ఉందా? మా మేనమామ ఇంటికి రౌడీలను పంపి వసూళ్లు చేస్తారా?"


"రూల్ ఈజ్ రూల్ దుర్గా! ఆయన కోసం మటన్ బిర్యానీ ప్లేటు బుక్ చేశానా లేదా? ఆయన రాకపోతే ఆ నష్టం ఎవరు భరిస్తారు? మీ పెద్దమ్మకు కూడా వాట్సాప్ చూసి రానందుకు రూ. 1500 ఫైన్ వేశా!"


"దేవుడా! వచ్చిన వాళ్ళ కంటే రాని వాళ్ళ దగ్గరే ఎక్కువ సంపాదించారు కదండీ!"

"అదే నా బిజినెస్ మైండ్! వచ్చే ఏడాది మన వివాహ వార్షికోత్సవానికి కూడా ఇలాగే కార్డులు పంచుదాం. 


ఎవ్వరినీ రానివ్వకుండా చేసి, ఫైన్లు వసూలు చేస్తే కోటీశ్వరులం అయిపోతాం!"

"వార్షికోత్సవం దాకా ఎందుకు? ఇప్పుడే మా చుట్టాల డబ్బులు వెనక్కి ఇస్తారా... లేక మీకు అన్నం పెట్టకుండా 'హస్బెండ్ పెనాల్టీ' వేయమంటారా?!" అని చేతిలో గరిటె పైకి ఎత్తి చూపిస్తూ అంది దుర్గ.


పెళ్ళాం చేతిలో గరిటె చూసేసరికి పాపారావు గుండె గుభేలుమంది. దుర్గ నిజంగా త్రిశూలం ధరించి కోపంగా చూస్తున్న దుర్గాదేవిలాగా కనిపించింది. పెళ్ళాం భయానికి సైలెంట్‌గా అత్తగారి చుట్టాల డబ్బులు వెనక్కి పంపడానికి గూగుల్ పే ఓపెన్ చేశాడు!


చివరికి పాపారావు పెళ్లి ఖర్చులు పోను, ఏజెన్సీ కమీషన్ పోను వాడికి భారీ లాభాలు మిగిలాయి. ఈ దెబ్బతో ఆ ఊర్లో ఎవరి పెళ్లి కార్డు కనిపించినా జనాలు వణికిపోవడం మొదలుపెట్టారు. 


"బాబోయ్! పెళ్ళికి వెళ్ళకపోతే ఇంటికొచ్చి వసూలు చేస్తారు!" అని, ఆ తర్వాత ఆ ఊర్లో జరిగిన ప్రతి పెళ్ళికి జనాలు ముందే క్యూ కట్టి, అన్నం తినకపోయినా కట్నం కవర్లు ఇచ్చి మరీ వెళ్లడం అలవాటు చేసుకున్నారు.


సమాప్తం. 

***********








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


 తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

తాత మోహనకృష్ణ

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page