నాన్నకు ఉత్తరం
Naanaku Uttaram - Telugu Family Story | Seeda Nagaraju
నాన్నకు ఉత్తరం - తెలుగు కుటుంబ కథ | సీదా నాగరాజు
Published in manatelugukathalu.com on 07/11/2026
“నాన్నకు ఉత్తరం” కథ ఓ చిన్నారి తన తండ్రికి రాసిన హృదయస్పర్శి లేఖ ద్వారా కుటుంబ బంధాల విలువను గుర్తుచేస్తుంది. భార్య, కూతురి పట్ల బాధ్యతను విస్మరించిన తండ్రిని ఆత్మపరిశీలన చేసుకోమని కోరే ఈ కథ కుటుంబ ప్రేమకు అద్దం పడుతుంది.
మై డియర్ డాడీ,
బాగున్నారా! నేను మాత్రం దిగులుగా ఉన్నాను. తరచూ మీరు గుర్తుకొస్తున్నారు.
మీ ప్రేమాభిమానాలు గుర్తుకొస్తున్నాయి. రియల్లీ ఐ మిస్ యూ డాడీ. ఎలా ఉన్నారు డాడీ! బహుశా బాగానే ఉండి ఉంటారు. ఎందుకంటే... మీకు నా గురించి కానీ... అమ్మ గురించి కానీ... దిగులు లేదు కదా! మీ అమ్మ, చెల్లి, తమ్ముళ్లతో సంతోషంగా ఉన్నట్లున్నారు.
మా గురించి పట్టించుకోవడమే మానేశారు. మేము నీకు అసలు గుర్తున్నామా డాడీ? మీరు మారిపోయారని, మమ్మల్ని మరచిపోయారని అమ్మ అంటూ ఉంటే నేను నమ్మలేకపోయాను.
కానీ అమ్మ అన్న మాట నిజమేనని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఆరు నెలలు గడిచిపోయినా... మా గురించి పట్టించుకోవడం లేదు. మమ్మల్ని చూసేందుకు ఒక్కసారి కూడా రాలేదు.
కనీసం ఫోన్లు కూడా చేయడం మానేశావు. పైపెచ్చు, మీ తమ్ముడి సలహా ప్రకారం మా ఫోన్ నంబర్లు బ్లాక్ చేశేశావు. ఎంత కఠినాత్ముడివి డాడీ నువ్వు?
నీకు ఒక్కగానొక్క కూతుర్నే! నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనే! ఇంకా తొమ్మిది సంవత్సరాలు కూడా నిండని పాపాయినే! అన్నిటికీ నీ మీదనే ఆధారపడే నీ గారాల కూతుర్నే! నన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలుగుతున్నావు డాడీ? మనమిద్దరం మాత్రమే రెస్టారెంట్లకు వెళ్లి స్పెషల్ బిర్యానీలు, చాట్‌లు, పానీపూరీలు తిన్న ఆ మధుర క్షణాలు మరచిపోయావా డాడీ?
ఏమిటో నా జాతకం! మా నానమ్మకు (పూజ్యులు మీ అమ్మగారు) నేనంటే మొదటినుండి చిన్నచూపే. తనకు బాబాయి (మీ ప్రియమైన తమ్ముడు) కొడుకంటేనే చాలా ఇష్టం.
ఎంతైనా మగపిల్లవాడు కదా!
మీ గారాల చెల్లికి నేనంటే కోపం. పిన్ని సంగతి సరేసరి. ఆవిడకి నేనన్నా, మా అమ్మ అన్నా అంతులేని అసూయ. మరి బాబాయి సంగతి చెప్పనక్కరలేదు.
ఆయనకి మొదటినుంచీ నేనంటే ఏదో తెలియని పగ, ద్వేషం. నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావని, బాగా సంపాదిస్తున్నావని, సొంత ఇల్లు కూడా కట్టుకున్నావని, సంతోషంగా, సౌకర్యవంతంగా జీవిస్తున్నావని వాళ్లందరికీ మొదటినుండి ఈర్ష్య.
మీరు నన్ను వారి ఇంటి దగ్గర వదిలినప్పుడు అందుకేనేమో నాకు యాక్సిడెంట్ కూడా చేయించారు. నన్ను నాలుగు నెలలు హాస్పిటల్‌లో ఉండేలా చేశారు.
నీకు తెలియదు, నువ్వు నమ్మవు కానీ డాడీ! వాళ్లు నువ్వు ఉన్నప్పుడు ఒకలా, నువ్వు లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తారు. నన్ను సూటిపోటి మాటలతో వేధిస్తారు. అందుకే నేను అక్కడ ఉండేందుకు ఇష్టపడను.
అయినా మమ్మీని ఎందుకు అలా హింసిస్తున్నావు డాడీ? నిన్ను చూస్తేనే చాలు మమ్మీ వణికిపోతుంది. అంతెందుకు నాకు కూడా నువ్వు అరిచినా, కన్నెర్ర చేసినా హడలిపోతాను.
మీ తమ్ముడి దివాళా వ్యాపారాలకు, మీ చెల్లి రెండో పెళ్లికి నువ్వు మమ్మీ పేరు మీద చేసిన అప్పులకు, క్రెడిట్ కార్డ్ బకాయిలకు రోజూ బ్యాంకుల నుండి ఉద్యోగులు వచ్చి మమ్మీని వేధిస్తున్నారు.
ఆ అప్పులు తీర్చలేక, వాళ్లకు సమాధానం చెప్పలేక అమ్మ ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ఆ రోజు మీ చెల్లి నగలు విడిపించేందుకు మమ్మీ నగలన్నీ తాకట్టు పెట్టావు. అవి కూడా అమ్మేసుకున్నావని మమ్మీ మధనపడుతోంది.
ఎందుకు డాడీ ఇలా చేశావు? తప్పు కదా!
మీ చెల్లి, తమ్ముళ్ల కోసం అమ్మను ఎందుకు బాధపెడుతున్నావు?
పిన్ని అకౌంట్‌కి నెల నెలా లక్షలు లక్షలు పంపించావు అని తెలిసి అమ్మ బాధపడని క్షణం లేదు. ఎందుకు అలా చేశావు డాడీ?
నువ్వు ఇలాంటి వాడివి అని కలలో కూడా అనుకోలేదు డాడీ! ఎందుకు ఇలా చేస్తున్నావు? పాపం అమ్మ! అదే స్థానంలో నానమ్మ గానీ, పిన్ని గానీ, అత్త గానీ ఉండి ఉంటే నిన్ను ఎన్ని శాపనార్థాలు పెట్టేవారో! చివరికి కొట్టడానికి కూడా వెనుకాడేవారు కాదు. అమ్మని మాత్రం బొమ్మని చేసి ఆడిస్తున్నావు.
ఏ జన్మలో ఏమి పాపం చేశారో? అత్త 15 సంవత్సరముల ఒంటరి జీవితం తరువాత ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకొని భర్తను ఇల్లరికం తెచ్చుకుంది.
పిన్ని అక్కడా ఇక్కడా పనులు చేసుకుంటూ అవస్థ పడుతోంది. బాబాయికి ఏ వ్యాపారం చేసినా కలసి రావడం లేదు, నష్టాల పాలవుతున్నారు. నానమ్మ సంగతి సరేసరి.
ఇంకా ఎందుకు తప్పులు చేస్తారు డాడీ? ఆడవారిని, అందునా కట్టుకున్న భార్యని కష్టపెట్టకూడదు డాడీ.
పాపమే కాదు, శాపం కూడా. అందుకేనేమో, ఆ బాధ నీకు అర్థం కావాలనేమో దేవుడు నీకు నన్ను ఆడపిల్లగా పుట్టించాడు. అర్థం చేసుకో మా మంచి డాడీ.
నేను అచ్చం నీకు లాగే ఉంటానని, నీ లాగే ప్రవర్తిస్తానని అంటుంటావు కదా! మరెందుకు నా దగ్గరకు రావడం లేదు? నేనే నీ దగ్గరకు రావాలనుకున్నాను.
మీ అమ్మవాళ్లు నన్ను రానివ్వరు కదా! అందుకే ధైర్యం చేసి నీ ఆఫీస్ అడ్రస్‌కి ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇంటర్నెట్, ఈమెయిల్, వాట్సాప్ వంటివి రాజ్యమేలుతున్న ఈ కాలంలో నాకు ఇదే సేఫెస్ట్ మోడ్ అనిపించి ఈ ఉత్తరం రాస్తున్నాను.
ఉత్తరం ఎలా రాయాలో ఈ రోజే మా తెలుగు సార్ చెప్పారు, అందుకే రాస్తున్నాను.
మా స్కూలులో సంస్కృతము చెప్పే సార్ ఈ మధ్యనే ఆడవారి గొప్పతనం గురించి రెండు శ్లోకాలు చెప్పారు.
ఒకటేమో "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" (ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంతోషంతో నివసిస్తారు; అటువంటి ఇల్లు లేదా సమాజం సుభిక్షంగా ఉంటుంది).
రెండోది: "కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా - షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ."
(శ్లోకం భావం:
కార్యేషు దాసి: పని చేసే సమయంలో ఒక సేవకురాలి (దాసి) వలె శ్రద్ధగా, బాధ్యతతో పనులు చేస్తుంది.
కరణేషు మంత్రి: ఏదైనా ఆలోచన లేదా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మంచి సలహాలు ఇచ్చే మంత్రిలా వ్యవహరిస్తుంది.
భోజ్యేషు మాత: భర్తకు లేదా కుటుంబానికి భోజనం పెట్టేటప్పుడు ప్రేమను కురిపిస్తూ కడుపు నింపే తల్లిలా మారుతుంది.
రూపేచ లక్ష్మీ: రూపంలో, సౌందర్యంలో సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటుంది.
శయనేషు రంభ: పడకగదిలో భర్తకు ఆనందాన్ని ఇచ్చే విషయంలో రంభలా ఉంటుంది.
క్షమయా ధరిత్రీ: ఓర్పు, సహనం విషయంలో భూదేవితో సమానంగా భరిస్తుంది.)
అప్పుడనిపించింది ఆడపిల్లగా పుట్టడం అదృష్టమని. కానీ మీ విషయానికి వచ్చినప్పుడు, మమ్మీ పడుతున్న నరకయాతన ప్రత్యక్షముగా చూస్తున్నప్పుడు ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అని భయపడుతున్నాను. మగవాళ్లు అందరూ ఇంతేనా అనే నిస్పృహ ఆవహించింది.
అయినా నాకు తెలియక అడుగుతాను డాడీ, అమ్మ చేసిన తప్పేంటి? మీరు వేసిన శిక్షేంటి? తమ్ముడి కోసం తలకు మించిన అప్పులు, చెల్లెలి కోసం తన నగలు తాకట్టు పెట్టడం చేయవద్దని వారించింది, వాదించింది. అది కూడా తప్పేనా? కరణేషు మంత్రి అంటే అర్థం అదే కదా! ఆలోచించండి నాన్నా!
అమ్మ ఏమి చెప్పినా, ఏమి చేసినా, ఎంత మొండిగా పట్టుపట్టినా అంతా మీ కోసం లేదా మన కోసం మాత్రమే కానీ తన కోసం కాదు కదా! ఇప్పటికీ రెండు మూడు సార్లు నువ్వే కావాలని అమ్మ తన పుట్టినింటిని కూడా కాదనుకుని, తన అమ్మ నాన్నలు చెప్పినా కూడా వినకుండా మీ కోసమే మీ వెంటే, మీరు ఎక్కడికి అంటే అక్కడికి వచ్చిందని మీరే నాకు చాలా సార్లు చెప్పారు.
మీరు ముంబై అంటే ముంబై, బెంగళూరు అంటే బెంగళూరు, సింగపూర్ అంటే సింగపూర్, హైదరాబాద్ అంటే హైదరాబాద్ వచ్చేసింది కదా! అట్లాంటి మా అమ్మని, మిమ్మల్ని గుడ్డిగా నమ్మి తన బంగారంతో సహా తన సర్వస్వం నీకు సమర్పించిన మీ అర్ధాంగిని మీరెలా మోసం చేయగలిగారో నాకు అర్థం కావడం లేదు.
నాకు తెలిసినంత వరకు మా డాడీ చాలా మంచోడు. మరి ఇలా ఎందుకు మారిపోయాడో? బాబోయ్! బాబాయి!! మా నాన్న నన్ను సైతం వదిలిపెట్టి, మా అమ్మను మోసగించి, తన అప్పులన్నింటినీ అమ్మ మీద రుద్ది ప్రశాంతముగా తమ్ముడి కొడుక్కి విలువైన ఆట వస్తువులు కొనిపిస్తూ కాలక్షేపం చేస్తున్నాడంటే కారణం మా బాబాయి. అందుకే అతనంటే కోపం, అసహ్యం, ద్వేషం, కక్ష, పగ... వగైరాలు. మా నాన్నని తాగుబోతుని చేసి, మాకు దూరం చేసి తను మాత్రం తన భార్యా పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ప్రపంచములో ఇట్లాంటి తమ్ముళ్లు కూడా ఉంటారా? ఇట్లాంటి బాబాయిలు కూడా ఉంటారా?
నాకు తెలియక అడుగుతాను డాడీ, నీకంటూ మనసు అనేది ఉందా? ఉంటే తమ్ముడు/తాగుడు మైకంలో ఉండి పెళ్లాం పిల్లలను హింసించమని, బాధపెట్టమని, నరకయాతన పెట్టమని చెప్తూ ఉందా?
ఒక కొడుకుగా తల్లిని గౌరవిస్తున్న మీకు, ఒక తండ్రిగా కన్న కూతురు యోగక్షేమాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదా?
భర్తగా భార్యకు సహకరించవలసింది పోయి తన పేరు మీదే అప్పులు చేసి, ఆ డబ్బంతా తమ్ముడు, చెల్లి, మరదలు, బావ, తమ్ముడి కొడుకు, అమ్మల కోసం ఖర్చుపెట్టి అప్పుల వాళ్లను మాత్రం అన్నెం పున్నెం తెలియని అమ్మ మీదికి పంపి చోద్యం చూస్తున్న నిన్ను చూస్తుంటే నాకే సిగ్గుగా ఉంది.
తన అమ్మ, తమ్ముడు, చెల్లి కోసం ఇంతగా దిగజారిపోయాడా! అని బాధేస్తోంది. ఇంత నీచానికి పాల్పడుతుంటే నీ అంతరాత్మ నిన్నేమీ ప్రశ్నించడం లేదా? నీ మనస్సాక్షి నిన్ను తప్పుపట్టడం లేదా? భగవంతుడా! మా నాన్నని తమ్ముడి ట్రాన్స్ నుండి, చెల్లెలి ట్రాప్ నుండి బయటకు తీసుకురా!
తనలో పరివర్తన రావాలి. తను భార్యకు చేస్తున్న ద్రోహానికి పశ్చాత్తాపము చెందాలి. కన్న కూతుర్ని దూరంగా పెట్టి, తమ్ముడి కొడుకుని చేరదీస్తున్న నడవడిక మారాలి. నేను ఆడపిల్లనని వివక్ష చూపిస్తున్నాడేమో! ఆ దృక్పథాన్ని దేవుడా నువ్వే మార్చాలి.
చివరగా ఒక్క మాట డాడీ. నా కోసం, నిన్ను ప్రాణంగా భావించే నా కోసం...,
నా కోసం ఒంటరిగా బతుకుతూ, నువ్వు తన పేరున చేసిన అప్పులు తీర్చడానికి నరకయాతన అనుభవిస్తున్న అమ్మ కోసం... నిజంగా నీ మంచి కోరే, నీ తోడు కోసం పరితపించే, నిన్ను నిన్నుగా ప్రేమించే, అభిమానించే మా ఇద్దరి కోసం... ఇకనైనా మీరు మారాలి. మీ తప్పు తెలుసుకొని, మీ డబ్బు కోసం మిమ్మల్ని తప్పుత్రోవ పట్టిస్తున్న వారి కబంధ హస్తాల నుండి బయటకు రావాలి. నిజం తెలుసుకోవాలి.
ఈ రోజే టీవీలో మ్యాగీ వారి యాడ్ చూశాను. దూరంగా ఉంటే సంబంధ బాంధవ్యాలు సడలిపోతాయి. కలసి మెలసి ఉంటే ఆప్యాయత, ఆత్మీయతలు వెల్లివిరుస్తాయి.
కలసి ఉందాం డాడీ.
మా అమ్మ కూడా మీ అమ్మ లాంటిదే.
పైగా నిన్నే నమ్ముకొని వచ్చిన అమాయకురాలు.
నాకు ఓ డౌట్ డాడీ.
మీలో ఏమైపోయాయి
ఆనాటి ప్రేమాభిమానాలు?
ఎక్కడ ఆవిరైపోయాయి
అప్పటి ఆప్యాయతానురాగాలు?
ఎలా ఇంకిపోయాయి
ఆ ఆత్మీయతానుబంధాలు?
ఎలా మరచిపోయావు
తెంచుకోలేని ఆ పేగు బంధాన్ని?
ఎవరు ఏమార్చగలిగారు
ఆ అపురూప సంబంధాన్ని?
తన భార్యా పిల్లల క్షేమం కోసం
అనుక్షణం ఆరాటపడే ఆ మనిషి ఎక్కడ?
వారి కోసమే ప్రతిక్షణం పరితపించే
ఆ మనసుకేమైంది?
అందరూ బాగున్నారు,
ఆనందముగా గడిపేస్తున్నారు.
మీరు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు,
మిమ్మల్ని నమ్ముకున్నవారు బాధలు పడుతున్నారు.
ఇలా ఎంతకాలం?
ఈ నరకయాతన ఇంకెంతకాలం?
ఇకనైనా ఆలోచించండి,
భార్యా పిల్లల కోసమైనా మారండి.
ఆత్మవంచన వద్దు,
ఆత్మ పరిశీలన చేసుకోండి.
తప్పు చేసిన వాళ్లు సంతోషంగా కాపురాలు చేసుకుంటున్నారు,
మిమ్మల్ని, మీ భార్యా పిల్లల్ని మాత్రమే దూరం చేసి ఆనందిస్తున్నారు.
ఇకనైనా నిజం తెలుసుకోండి.
"నా అన్న" వారి కోసం ముందడుగు వేయండి.
ఇట్లు,
నీ ముద్దుల కూతురు
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
సీదా నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
పరిచయం

: పేరు సీదా నాగరాజు.1965లో గుంటూరు పట్టణంలో జన్మించాను.స్థానిక జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి (1980)వరకు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల; నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్( 1980-82), సిల్వర్ జూబ్లీ కళాశాల, కర్నూలు లో డిగ్రీ( 1982-85),ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ అఫ్ లా లో లా డిగ్రీ(1985-88) చదువుకున్నాను.దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ లో ఉద్యోగం చేసి 2025 లో రిటైర్ అయ్యాను.











Comments