top of page
Original.png

వ్యాపార ప్రపంచం – పార్ట్ 9

1 hour ago
8 min read

వ్యాపార ప్రపంచం పార్ట్ 9లో గీతా మాధురి విషయంలో సుఖదేవ్‌కు వ్యాపార సంబంధాల ప్రాధాన్యం వివరిస్తున్న నాగముని.
వ్యాపార ప్రపంచం పార్ట్ 9లో గీతా మాధురి విషయంలో సుఖదేవ్‌కు వ్యాపార సంబంధాల ప్రాధాన్యం వివరిస్తున్న నాగముని.

Vyapara Prapancham – Part 9 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 9 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక | పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

Published in manatelugukathalu.com on 08/10/2026


గీతా మాధురిని ఇంటివద్ద దింపిన సుఖదేవ్… మరుసటి రోజు నాగముని చెప్పిన మాట ఏమిటి?


డిన్నర్ ముగిసింది. గీతా మాధురికి సుఖదేవ్ లిఫ్ట్ ఇచ్చాడు. కానీ మరుసటి ఉదయమే నాగముని అతని ఛాంబర్‌కు వచ్చి ఒక కీలక విషయం మాట్లాడాడు—ఎందుకు?


వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు. సీనియర్ సూపర్‌వైజర్ దీనదయాళ్  భానుప్రసాద్ ను క్యాంటీన్‌కు తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు, పై అధికారులతో వ్యవహరించే పద్ధతి, టీమ్‌వర్క్, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి విషయాలపై హితబోధ చేస్తాడు. మాలిని పట్ల ఎలాంటి ఆసక్తి లేని సుఖదేవ్ తన భార్య ప్రణవిపైనే తన ప్రేమ, అనుబంధం ఉన్నాయని స్పష్టంగా భావిస్తాడు. రోడ్డు ప్రమాదంలో ఒక స్త్రీ మరణించిన దృశ్యం ప్రణవిని బాధిస్తుంది. కీలకమైన పోస్టుకు గీతా మాధురి ఎంపిక అవుతుంది. గత ఆరేళ్ల కంపెనీ ఆర్థిక లెక్కలను పరిశీలించి తయారుచేసిన కీలక ఫైలుతో సుఖదేవ్‌ను ఆశ్చర్యపరుస్తుంది.

ఇక వ్యాపార ప్రపంచం - పార్ట్ 9 చదవండి


“నేనలా అనలేదే! నాకు గాని ఇష్టం లేకపోతే నేనెలా ఇద్దరు బిడ్డలకు తల్లినవుతాను? సమయా సందర్భం చూసి మెసలుకోమంటున్నాను. అంతే— నథింగ్ మోర్ అండ్ నథింగ్ లెస్!”


“యు ఆర్ రైట్ ఆన్ ది ట్రాక్.. ఐ లైక్ ఇట్! మరిక సూటిగా విషయానికి వస్తున్నాను. ఈరోజు రాత్రి నీతో కలసి భోజనం చేయను. కంపెనీ కార్యాలయం వాళ్ళు కొత్తగా చేరిన ఒక లేడీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కోసం డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసారు. వస్తావా?”


“భలేవారే— మీరందరూ మాంసాహార ప్రియులు. నేనేమో కొన్నాళ్ళపాటు వ్రత పూజ పూర్తయ్యేంతవరకూ శుచీ శుభ్రతా పాటించాలి. ఇది అనివార్యం—” 


అది విని అతడు సాలోచనగా తలూపి అడిగాడు .. “బై ది బై— పూజా పునస్కారాలు ఎలాగూ ఆరంభించావు కదా— ఇప్పుడు పిలవని పేరంటానికి వస్తున్నట్టు సమయ సందర్భం లేకుండా ఎదురొచ్చే ఆ మహాతల్లి కలలోకి రావడం లేదు కదా!”


“ఔను .. మునుపులా కలలోకి రావడం లేదు. కానీ— నిన్నరాత్రి కలలోకి వచ్చి .. ‘నాకు ఆకలేస్తోంది, నాకు ఎవ్వరూ అన్నం పెట్టడం లేదు’ అంటూ నా ప్రక్కన చనువుగా కూర్చుంది. చేసేది లేక— అన్నం కలిపి తినిపించాను.” 


అది విని అతడు ఖంగుతిన్నట్లు చూసాడు. అసహనంగా ఫీలవుతూ అన్నాడు .. “డోంట్ బి సిల్లీ ప్రణవీ! ఆవిడకు నిజంగానే ఆకలేస్తుందంటే ఆమె ఎక్కడికి వెళ్ళాలి— ఆమెను బైకునుండి పడగొట్టేశాడే ఆవిడ భర్త— అతడి వద్దకు వెళ్ళి అన్నం పెట్టమని అడగాలి. లేదా— ఆవిడ ఆడపడుచు వద్దకు వెళ్ళాలి. అదీ వీలుకాకపోతే— వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఆకలేస్తుందని అన్నం పెట్టమని అడగాలి. 


ఇదేమిటి— ఏదో బంధువులింటికి ఏతెంచినట్లు నిన్నడగటం ఏమిటి? సింప్లీ అబ్సర్డ్! నా స్కూలు రోజుల్లో నా క్లాస్‌మేట్స్ చెప్తుండేవారు— ప్రేతాత్మలకు బుద్ధి తక్కువని— వాటికి ఎవరిని అటాక్ చేయాలి .. ఎవరిని అటాక్ చేయకూడదన్న విచక్షణ ఉండదట.” 


అప్పుడు ప్రణవి చప్పున కలుగజేసుకుంది .. “నేనిప్పుడు ఒక మాట చెప్తాను. కోపగించుకోరు కదా!”


“కోపగించుకోవడానికి ఏముందోయ్ ఇంతవరకూ విషయం వచ్చిన తర్వాత.. ఉఁ చెప్పు”


కలలో మళ్లీ కనిపించిన మహిళ గురించి సుఖదేవ్‌కు వివరిస్తున్న ప్రణవి.
కలలో మళ్లీ కనిపించిన మహిళ గురించి సుఖదేవ్‌కు వివరిస్తున్న ప్రణవి.

“నా దృష్టిలో ఆమె ప్రేతాత్మ కాదండి!”


“మరి, చచ్చిపోయినావిణ్ణి పవిత్రాత్మ అంటారా?”


“ఔనండి. ఇంతవరకూ ఆమె నన్నేమి చేసిందండి? నా వద్దకు వచ్చి తన గోడుని వెళ్ళబోసుకుంటుంది. అంతేగా!”


“అంతేగా అంటే .. నీకు నిద్రట్లోకి వచ్చి పదే పదే నిలకడ లేకుండా చేస్తుందిగా— మన దాంపత్య జీవితానికి అడ్డుపుల్లగా నిలుస్తుందిగా! కామిని ఫోటో వైపు చేయి చూపిస్తూ మనల్ని బెంబేలు పెట్టిస్తుందిగా— పిలవని పేరంటాలిలా నీ కలలోకి రావడం వల్ల అమ్మ సహితం కలవరపాటుకి లోనవుతుందిగా! 


ఇది కాదనలేని వాస్తవమేగా— ఇది పిల్లలున్న ఇల్లు. ఆ మహాతల్లి గుర్తుంచుకోవాలి. ఇక మిగిలింది చివరి అంశం— ఆమెగారు వచ్చి అడిగిన తోడనే గిన్నెలో అన్నం పెట్టి తీసుకొచ్చానన్నావుగా.. పళ్ళెం తీసుకుని అన్నం తానుగా తిందా లేక నువ్వు స్వయంగా గోరుముద్దలు తినిపించావా?”


“ఇంతవరకూ వచ్చి దాచడం ఎందుకు గాని— నేనే తినిపించానండి.” 


ఆ మాట విన్నంతనే సుఖదేవ్ “అయ్యహో!” అని నెత్తిపైన చేతినుంచుకున్నాడు ..


“ఇది టూ మచ్ కదూ!” 


ఆమె అభావంగా చూస్తూ మౌనం వహించింది. 


అప్పుడతడు కొనసాగించాడు.. “నేనొక చిన్న రిక్వెస్ట్ చెప్తాను చేస్తావా ప్రణవీ!” 


దానికి ఆమె పెదవి విప్పింది .. “రిక్వెస్ట్ చేయడం దేనికండీ! చెప్తే చేయనూ—”


“ఐతే విను .. ఎట్టి పరిస్థితిలోనూ ఆమెతో మాటలు పెంచుకోకు— కలే కదానని ఆమె రాకను తేలిగ్గా తీసుకోకు. ఆమెకు మరీ ఎక్కువగా రెస్పాన్స్ ఇవ్వకు— ఆమె చెప్పేది విని తలుపేసుకో— అన్నట్టు వ్రత పూజ ముగించడానికి ఇంకెన్నాళ్ళు పడుతుంది?”


“మూడు వారాలు పడుతుంది— ఆ తర్వాత—”


“ఆ తర్వాత?” అని కలవరపడుతూ అడిగాడతను. 


“కార్యసిద్ధి కోసం నోము నోచాలి. రెండు మూడు పుణ్యక్షేత్రాలు దర్శించాలి.” 


దానికతడు ఏదో అడగబోయి ఆగిపోయాడు. ఇక ఏది అడిగినా ప్రయోజనం ఉండబోదని తలపోస్తూ అతడు డిన్నర్ పార్టీకి దుస్తులు మార్చుకోవటానికి ఇంటీరియర్ రూము వైపు కదిలాడు. 


అవన్నీ కాదనలేని శుభకార్యాలే— మంగళకర పూజలే— మంత్ర పుష్పాలే— కానీ, వాటికి ఒక ముగింపనేది ఉండాలి కదా! తనలో విజృంభిస్తున్నది యౌవన ప్రాయమే కాదు .. హోరున రేకెత్తే మగతనమూ ఉందనేది తన సతీమణి ఎప్పుడు గుర్తిస్తుందో కదా!


నాగముని తోటి జూనియర్ ఆఫీసర్ల సహకారంతో హోటెల్ సంగీత్‌లో గెట్ టుగెదర్ డిన్నర్ పసందుగా ఏర్పాటు చేసాడు. మరీ ఫార్మల్‌గా కాకుండా, మరీ అఫీషియల్‌గా కాకుండా నిండుదనం తొణికిసలాడేలా విప్పార్చి దాన్ని ఒక స్పెషల్ కలయికగా మెప్పించాడు. 


అటువంటివి అంత పకడ్బందీగా, పసందుగా ఏర్పాటు చేసి మెప్పించడం అంటే ఒక కళాత్మక ప్రక్రియ. అది అందరికీ అనాయాసంగా వచ్చేది కాదు. ఏది ఎక్కడ జరగాలో, ఎలా జరగాలో ఆయనకు కరతలామలకం.


గెట్ టుగెదర్ విందు బ్యాంక్వెట్ (banquet) హాలులో ఏర్పాటు చేసారు. సీటింగ్ ఏర్పాట్లు పసందుగా, హుందాగా ఉన్నాయి. అంతమందిలోనూ గీతామాధురి అందరి కళ్ళకూ కట్టినట్లు కనిపించింది సుఖదేవ్‌కి.


గీతా మాధురి కోసం ఏర్పాటు చేసిన సుగుణ్ ట్రేడర్స్ గెట్-టుగెదర్ డిన్నర్‌లో పాల్గొన్న సుఖదేవ్, నాగముని మరియు కంపెనీ అధికారులు.
గీతా మాధురి కోసం ఏర్పాటు చేసిన సుగుణ్ ట్రేడర్స్ గెట్-టుగెదర్ డిన్నర్‌లో పాల్గొన్న సుఖదేవ్, నాగముని మరియు కంపెనీ అధికారులు.

ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆమె మామూలుగా ఘాగ్రాలో వచ్చింది. ఇప్పుడేమో ఆమె నిండు పసుపుపచ్చటి చేనేత చీరలో వచ్చింది. చీరకట్టులోని అదనపు సోయగం పొటమరించే అలంకారం వెనుక దాగి ఉన్న అసలు కిటుకు అదేనేమో— విందుకి వచ్చిన ఆహ్వానితులందరికీ పుష్పగుచ్ఛాలు హోటెల్ స్టాఫ్ సాదరంగా ఆహ్వానిస్తూ అందించారు. 


“రియల్లీ ఎ మార్వలెస్ గెస్చర్ ఇండీడ్!” అనుకున్నాడు సుఖదేవ్ మనసున— ఉదారమైన మనసుతో వడ్డించడమే కాదు— పసందుగా విందు భోజనం ఏర్పాటు చేయడం కూడా ఒక ఉదాత్తమైన కళే— ఇది కాదనలేని నిర్వచనమే— 


భోజనాలు చేస్తున్నప్పుడు, విందు పూర్తయిన తర్వాత కూడా యువ మేనేజర్లు గీతామాధురి దృష్టిని ఆకర్షించడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్టు గమనించాడతను. అది సహజమే కదా! అది అనివార్యమే కదా! యౌవన శోభలోని వెన్నెల చంద్రికలకున్న అద్వితీయమైన ప్రభావం అదే కదా! 


ఒక యౌవనవతి వైపు ఎవ్వరూ కళ్ళెత్తి చూడలేదంటే దాని అర్థం; ఆమెలో చూసి ఆనందించడానికి యౌవన సుకుమారత్వాన్ని అభివర్ణించడానికి ఏమీ లేదనేగా— అరవిచ్చిన పెదవులతో మాటలు కలుపుతున్న గీతామాధురి వైపు చూడకూడదనుకుంటూనే ఓసారి అసంకల్పితంగా చూసి భార్య ప్రణవిని మనోనేత్రం ముందుకి తెచ్చుకున్నాడతను. 


అందంలోనే కాదు .. యౌవన శోభలో మాత్రమే కాదు .. హృదయ సౌందర్యంలో కూడా భార్యను మరొక అపరిచిత స్త్రీతో పోల్చగలగడం కష్టసాధ్యమే— ఇంతకీ ప్రణవి ఇద్దరు పిల్లల తల్లి! ఇప్పటికీ ఆమెలో అంతటి అందం, అంతటి శోభ విలసిల్లుతున్నాయంటే అది నిజంగా దేవతాస్త్రీలిచ్చిన వరం కాదూ! ప్రణవి వంటి అనుకూలవతి తనకు సహధర్మచారిణిగా లభించడం పూర్వజన్మ సుకృతమే కదూ—


భోజనాలు పూర్తయి వచ్చిన వారందరికీ చిన్నపాటి గిఫ్ట్ ప్యాకెట్లు ఇచ్చిన తర్వాత మేనేజర్లందరితో కరచాలనం చేసిన తర్వాత సుఖదేవ్ హోటెల్ పోర్టికోలో వచ్చి ఆగిన తన కారు వైపు నడిచాడు. అప్పుడు వెనుక నుండి నాగముని స్వరం వినిపించి ఆగాడు.


“కొంచెం ఆగుతారా సార్!” 


నలుగురి మధ్య ఉన్నప్పుడు అతడెప్పుడూ అబ్బాయిని అలాగే సంబోధిస్తాడు అధికార దర్పం తగ్గిపోనివ్వకుండా— సుఖదేవ్ కూడా అదే రీతిన “బాబాయ్!” అని పిలవడు. అదంతా ఓ విధమైన ఆంతరంగిక దైనందిన లౌకిక వ్యవహారమే—


“చెప్పండి నాగమునిగారూ!” అంటూ తిరిగి చూసాడు.


“మరేం లేదు సార్! గీతామాధురి తన కారు తెచ్చుకోలేదు. ఎందుకో ట్రబుల్ ఇస్తుందని సర్వీస్ సెంటర్‌కి ఇచ్చినట్లుంది. అంచేత ఆమెను ఎక్కించుకుని దారిలో దింపేస్తే బాగుంటుందని..


ప్రొడక్షన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వసుదేవ్ లిఫ్ట్ ఇస్తానన్నాడు. నేనే వద్దన్నాను. అతగాడి ఇల్లు చాలా ఎడంగా ఉన్నట్లుంది. గీతామాధురి నివాసం మీరు వెళ్ళే దారిలోనే ఉంది. అంచేత దారిలో దిగిపోవడానికి వీలుగా ఉంటుంది. ఆమెను పిలిచేదా?” 


సుఖదేవ్ బాబాయి వైపు చూసి నవ్వాడు. నవ్వుతూనే స్నేహపూరితంగా స్పందించాడు ..

“వై నాట్! పిలవండి” అని సంకేతమిచ్చాడు సుఖదేవ్. 


ఆ మాట విన్నంతనే ఆమె వాళ్ళను సమీపించింది .. “థాంక్స్ ఎ లాట్ సార్! నేను వెనుక కూర్చునేదా సార్?”


“పర్వాలేదు. మీరు నా ప్రక్కనే కూర్చోండి. అలా కూర్చోవడంలో మీకు ఆక్షేపణ లేదు కదా!”

డిన్నర్ పార్టీ తర్వాత గీతా మాధురిని తన కారులో ఇంటివద్ద దింపేందుకు తీసుకెళ్తున్న సుఖదేవ్.
డిన్నర్ పార్టీ తర్వాత గీతా మాధురిని తన కారులో ఇంటివద్ద దింపేందుకు తీసుకెళ్తున్న సుఖదేవ్.

“నాట్ ఎట్ ఆల్ సార్! ఇట్ ఈజ్ మై ప్లెజర్ –“ అంటూ హెచ్.ఆర్. వాళ్ళిచ్చిన గిఫ్ట్ ప్యాకెట్‌ని పొదవి పట్టుకుని సుఖదేవ్ ప్రక్కన కూర్చుంది, మరొకసారి బాస్‌కి పుష్కలంగా ధన్యవాదాలు అర్పించుకుంటూ— 

............................ 

మరునాడు ఉదయం ఛాంబర్‌లోకి ప్రవేశించి మంచినీళ్ళు కాసిన్ని నోట్లో పోసుకున్న తర్వాత నాగముని అదే అదనుగా ప్రవేశించాడు శుభోదయం పలుకుతూ— సుఖదేవ్ రవంత ఆశ్చర్యపోతూ చూసాడు .. “అదేమిటి డిప్యూటీ మేనేజర్ గారూ— ఇంత పొద్దుటే వచ్చేసారు నేను పిలుపు ఇవ్వకుండానే— ఏదైనా అర్జెంట్ మేటర్ చర్చించాలా!”


“ఔను నావరకు ఇది అర్జెంటే— కాసేపు మీ ఇద్దరు పి.ఏ.లను ఇక్కడకు రావద్దని మెసేజ్ మాత్రం పంపించండి. అది చాలు—” 


సుఖదేవ్ అదేవిధంగా తనకు కాసేపు అంతరాయం కలిగించకుండా చూడమని పి.ఏ.లకు మెసేజ్ పంపించి తీరుబడిగా నాగముని వైపు తిరిగి అన్నాడు .. “చెప్పండి బాబాయ్!” 


అప్పుడు నాగముని నిదానంగా చెప్పసాగాడు .. “నాకు తెలుసు సుగుణ్ ట్రేడర్స్ సంస్థలో చాలామంది నీ హయాములో పనిచేస్తున్నారని— ప్రతినెలా నీనుండి పే..ప్యాకెట్ అందుకుంటున్నారని— అంటే— నీ సహాయ సహకారాలపైన ఆధారపడే మనుగడ సాగిస్తున్నారన్నది కూడా వాస్తవం. 


కానీ— ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఓడలు బళ్ళవుతున్నట్టు, బళ్ళు ఓడలవుతున్నట్టు ఏదో ఒక సందర్భాన మనకు కూడా వాళ్ళ సహకారం కావలసి రావచ్చు— ఐ మీన్— వాళ్ళ గుడ్‌విల్ మనకు అవసరం కావచ్చు—” 


అప్పుడు సుఖదేవ్ చప్పున అడ్డువచ్చాడు .. “ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకు బాబాయ్?”


“చెప్తాను. కొంచెం టైమివ్వు. మన వద్ద పనిచేసేవారికి కూడా మనకున్నట్లే ఎమోషన్స్ ఉంటాయి. వాటిని గుర్తించి నడుచుకుంటే అందరికీ ఉభయతారకంగా ఉంటుంది. దారిపొడవునా ఒక్కసారి— ఒక్కసారి కూడా నోట పలుకు విప్పకుండా డ్రైవ్ చేస్తూ ఆమెను వాళ్ళ ఇంటి వద్ద దిగబెట్టావట. కారు వాళ్ళ ఇంటి వద్ద ఆగిన తర్వాత నిన్నామె టీ తీసుకోవడానికి లోపలకు పిలిచిందట—” 


అప్పుడు మరొకసారి సుఖదేవ్ అడ్డు తగిలాడు .. “ఆమె ఆహ్వానాన్ని స్వీకరించి లోపలకు వెళ్ళి టీ తీసుకున్నానే—”


“ఔను. వాళ్ళింట్లోపలకు వెళ్ళి టీ తీసుకున్నావు. కానీ అక్కడ కూడా రోబోలా పెదవి విప్పకుండా టీ తాగడం పూర్తి చేసి కారెక్కి వచ్చేసావట— నేను గుచ్చి అడిగితే చెప్పిందామె, తను డిస్టర్బ్ అయినట్టు— 


అదంతా ప్రక్కన పెట్టు. 


నేను చెప్పదలచుకున్నదొక్కటే— అటువంటి ఇబ్బందికర పరిస్థితిని.... యు షుడ్ హ్యావ్ అవాయిడెడ్ ఇట్— ఆమె పరిసరాల నుండి, ముఖ్యంగా ఆమె చూపుల నుండి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నావని ఆమె అపోహ పడటానికి ఆస్కారం ఉంది కదా! 


వరసకు నాకు అన్నయ్య అయిన సాంబమూర్తి కొడుకుగా నిన్ను చూస్తుంటే నేను గర్వంగా ఫీలవుతుంటాను. కుటుంబం పట్ల నీకున్న విశ్వాసం, ముఖ్యంగా ప్రణవి పట్ల నీకున్న ప్రేమాభిమానాలు తలచుకుంటే ఆత్మానందం కలుగుతుంటుంది. 


మరొకటి కూడా గమనించాను. బిజినెస్ విషయమై మనల్ని చూడటానికి అగర్వాల్ తన సతీమణితో వచ్చినప్పుడు— మనం వాళ్ళింటికి వెళ్ళి బిజినెస్ డీల్ విషయమై చర్చలు జరుపుతున్నప్పుడు అతడి సతీమణి శోభ కళ్ళు నీ చుట్టూ చక్రాల్లా ఎలా తిరుగుతుంటాయో నేను గమనించలేదనుకోకు—


నువ్వు అపర ప్రవరాఖ్యుడిలా చలించకుండా నిలదొక్కుకోవడం చూసి నేనెంతగా గర్వపడ్డానో నేను మాటలతో చెప్పలేను. సౌశీల్యత అంటే ఇదే— 


కానీ— నేను ప్రస్తావించబోయే హార్ట్ ఆఫ్ ది మేటర్ అది కాదు.” 


“మరి?” అన్నట్టు ప్రశ్నార్థకంగా కళ్ళెత్తి చూసాడు సుఖదేవ్. 


నాగముని దానికి స్పందిస్తూ కొనసాగించాడు .. “ఐ మీన్— అందరు యౌవన స్త్రీలూ అలా ఉండరని— మదనోత్సాహంతో ఊగిసలాడిపోరని— వాళ్ళలో చాలామంది నీలాగే అమ్మాయి ప్రణవి లాగే అడుగడుగునా మంచీ మర్యాదలు పాటిస్తారని—”


సుఖదేవ్ ఏమీ అనలేదు. సావధానంగా తలూపుతూ అడిగాడు .. “ఇద్దరికీ కాఫీలు తెమ్మనమని చెప్పేదా?” అని—


దానికి నాగముని తక్షణం తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడు .. “లేదు. ఇప్పుడు కాదు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్— ఒకటి చెప్పి ముగిస్తాను. నువ్వు నడుపుతున్నది శివాశ్రమం కాదు. యోగులూ బైరాగులూ తల దాచుకునే మునిమండపం అంతకంటే కాదు. నువ్వు నడుపుతున్నది అనుదినం ఒకరిపై ఒకరు పట్టు సాధించాలన్న పోటీలతో చెలరేగిపోయే వ్యాపార ప్రపంచం. 


లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు బాహ్య ప్రపంచానికి చూపించే కుత్తుకలు కోసుకునే కొత్తతరహా వ్యాపార ప్రపంచం. సుగుణ్ ట్రేడర్స్ కంపెనీ చీఫ్‌గా విలువలు పాటించే వ్యక్తిగా నువ్వు అలా చేయకపోవచ్చు. షేర్ మార్కెట్‌కి బుల్‌లా దూరి ధమ్కీ కొట్టకపోవచ్చు. 


కానీ— గొప్ప గొప్ప పేర్లతో వ్యాపారాలు సాగించే కొన్ని వ్యాపార సంస్థలు అటువంటి షార్ట్‌కట్ దారులకు పాల్పడుతున్నాయన్నది కాదనలేని వాస్తవం. కావున ప్రతి అవకాశాన్ని జారవిడవకుండా చూసుకోవాలి—” 


ఈ సారి సుఖదేవ్ చప్పున నాగముని చేతిపైన చేయి వేసి అడిగాడు .. “ఇంతకీ మీరేమి చెప్పదలచు కుంటున్నారు బాబాయ్?“


“నథింగ్ బట్ సింపుల్— సర్దుకు పోవాలంటున్నాను ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా— టు కట్ ఇట్ షార్ట్— కీలక పొజిషన్‌లో ఉన్న గీతామాధురికి రివార్డులు ఇవ్వకపోయినా పర్వాలేదు, రిగార్డ్ ఇవ్వమంటున్నాను. ఆమె కంపెనీలో చేరిన తర్వాత అసెట్స్ సైడ్ ఎలా పుంజుకుంటుందో గమనించమంటున్నాను. నోట్ చేసుకోమంటున్నాను.” 


సుఖదేవ్ నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు .. “మనం రిగార్డ్ ఇస్తూనే ఉన్నాంగా!” 


నాగముని స్పందించలేదు— కూర్చున్న చోటనుంచే కాఫీలు పట్టురమ్మని సైగ చేసాడు బయట ఉన్న పర్సనల్ వింగ్‌కి. జీవితమంటే వ్యాపార లావాదేవీలే కాదు, లాభ నష్టాలే కాదు, మానవ బంధాలు కూడా నూతన వ్యాపార రంగంలో ఒక అంతర్భాగమే— ఈ జీవన సూత్రాన్ని సుఖదేవ్ ఎప్పుడు తెలుసుకుంటాడో—


సి.ఈ.ఓ. గారికి అంతకంటే స్పష్టంగా ఇంకేమి చెప్పాలో నాగమునికి తోచలేదు. మృదు మనస్కులైన మనుషులు ఎమోషన్స్ ఇష్టపడతారు. చెప్పలేని రీతిన భావోద్వేగాలతో మమేకమై పోతుంటారు. 


అందునా స్త్రీలు పాజిటివ్ ఎమోషన్స్ అంటే మరీ ఇష్టపడతారు. ఎడంగా తొలగిపోకుండా దగ్గరితనం ఫీలవుతారు. ఆ నిగూఢ భావ సూత్రాన్ని అంతకంటే సులభమైన రీతిలో అబ్బాయికి ఎలా విడమర్చి చెప్పాలో అతడికి తెలియటం లేదు. 


వ్యాపార రంగంలో ఏకపత్నీ వ్రతుడుగా ఉంటే మాత్రం చాలదు— చతురత గల వ్యాపార దిగ్గజంలా దూకుడుగా అడుగులు వేయాలంటాడు నాగముని. ఎదురొచ్చిన అవకాశాన్ని తనకనుకూలంగా మలచడంలోనే ఉందంటాడు వ్యాపార దిగ్గజం చూపవలసిన చతురత ప్లస్ సమర్థత. అందులో ఇమిడి ఉన్న సారాంశం లేశమైనా సుగుణ్ ట్రేడర్స్ అధిపతికి, రథసారథికి అంతు పట్టిందో లేదో! 


అప్పటి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే కాదు, ఇప్పటి నూతన దౌత్య నీతిలో సహితం పలు దేశాల సైన్యాలు అందమైన యౌవన స్త్రీలను ప్రత్యేక రీతిన రక్షణ శాఖలోకి తీసుకుంటున్నారు. ఎందుకని? 


దేశ సేవ కోసం మాత్రమే కాదు; శత్రు దేశ రహస్యాలను రాబట్టుకోవడానికి వేగుగత్తెలుగా సేవలు అందించడానికి— అంతటి తీవ్రదశన కాకపోయినా కొంతవరకు వ్యాపార ప్రపంచంలో కూడా ప్రత్యర్థి కంపెనీల కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి, తదనుగుణంగా పథక రచన రచించుకోవడానికి స్త్రీల సహచర్యం అవసరం కలగవచ్చు కదా! 


రాను రాను వ్యాపార రంగం కూడా ఓ విధమైన రణరంగంలాగే కదా తయారవుతుంది! ఇవన్నీ గమనించకుండా అడుగడుగునా ఎదురొచ్చే జిమ్మిక్కులు గుర్తించకుండా మునుపులాగే మడిగట్టుకుని కూర్చుంటానంటే ఎలా! సమయం చూసి వీటన్నిటి గురించీ అబ్బాయితో విస్తృతంగా చర్చించాల్సి ఉంది.


=================================

ఇంకా ఉంది 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 10

త్వరలో మీ ముందుకు వస్తుంది.

=================================



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పాండ్రంకి సుబ్రమణి

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

30 /10 /2022  తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page