top of page
Original.png

వ్యాపార ప్రపంచం – పార్ట్ 10

8 hours ago
8 min read

వ్యాపార ప్రపంచం పార్ట్ 10లో భానుప్రసాద్ కోసం వెతుకుతున్న వైష్ణవి, అతన్ని ఆదుకుంటున్న విద్యాభవాని, ఉద్యోగ అవకాశం సూచిస్తున్న సుఖదేవ్.

Vyapara Prapancham – Part 10 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 10 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక | పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

Published in manatelugukathalu.com on 17/10/2026


వ్యాపార ప్రపంచం – పార్ట్ 10లో భానుప్రసాద్ పట్ల వైష్ణవి మనసులో పెరుగుతున్న ప్రేమాభిమానాలు ఆమెను తీవ్ర ఆలోచనల్లో పడేస్తాయి. పెళ్లి సంబంధాలు వస్తున్నప్పటికీ భానుప్రసాద్‌ను మరిచిపోలేని వైష్ణవి అతన్ని చూసేందుకు యూత్ హాస్టల్‌కు వెళ్తుంది. కానీ అక్కడ ఆమెకు ఊహించని విషయం తెలుస్తుంది. అనారోగ్యంతో ఉన్న భానుప్రసాద్‌ను ఒక యువ లాయర్ ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆ తర్వాత కంపెనీ గెస్ట్ హౌస్‌కు తరలించిందని తెలుసుకుంటుంది. మరోవైపు విద్యాభవాని సంరక్షణలో కోలుకుంటున్న భానుప్రసాద్‌కు సుఖదేవ్ తన కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదిస్తాడు. ఆ ప్రతిపాదనకు భానుప్రసాద్ ఇచ్చిన సమాధానం కథను మరో మలుపు తిప్పుతుంది.


వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు. సీనియర్ సూపర్‌వైజర్ దీనదయాళ్  భానుప్రసాద్ ను క్యాంటీన్‌కు తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు, పై అధికారులతో వ్యవహరించే పద్ధతి, టీమ్‌వర్క్, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి విషయాలపై హితబోధ చేస్తాడు. మాలిని పట్ల ఎలాంటి ఆసక్తి లేని సుఖదేవ్ తన భార్య ప్రణవిపైనే తన ప్రేమ, అనుబంధం ఉన్నాయని స్పష్టంగా భావిస్తాడు. రోడ్డు ప్రమాదంలో ఒక స్త్రీ మరణించిన దృశ్యం ప్రణవిని బాధిస్తుంది. కీలకమైన పోస్టుకు గీతా మాధురి ఎంపిక అవుతుంది. గత ఆరేళ్ల కంపెనీ ఆర్థిక లెక్కలను పరిశీలించి తయారుచేసిన కీలక ఫైలుతో సుఖదేవ్‌ను ఆశ్చర్యపరుస్తుంది. గీతామాధురితో  దూరంగా  ఉండాల్సిన  అవసరం  లేదని  సుఖదేవ్ తో  చెబుతాడు నాగముని.

ఇక వ్యాపార ప్రపంచం – పార్ట్ 10 చదవండి



సాహిత్యాభిమానంతో కవితావేశం కూడా ఇముడ్చుకున్న వైష్ణవి రెండు రోజులుగా పనికి వెళ్ళలేకపోతోంది. ఆలోచనా ప్రవాహాన్ని కుదుటపరుచుకోలేకపోతోంది. పెండ్లి సంబంధాలు సముద్ర కందిరీగల్లా ఇంటివాకిట గీపెట్టసాగాయి.


 అటు కుక్కకాటుకి గాయాలపాలై మెడికల్ లీవుపైనున్న భానుప్రసాద్ నుండి ప్రేమానుగత ఆలోచనల్ని మరల్చుకోలేకపోతోంది. అతడి పట్ల తనకు ఏర్పడ్డ ఇష్టం గురించి అమ్మకో వదినకో చెప్పలేకపోతోంది. అతడి పట్ల తనకేర్పడ్డ సఖ్యత ఫలిస్తుందా! ఎంత లోతుగా ఆలోచించినా దాన్ని ఒక కొలిక్కి తేవడానికి సాహసించలేకపోతోంది. 


గజపతినగరానికి చెందిన భానుప్రసాద్ పూర్తి మాంసాహారి. తనేమో శుద్ధ శాకాహారి. అందులో మాత్రమేనా— ఇంకా ఎన్నిట్లోనో వ్యత్యాసాలు పొడసూపవచ్చు. ఆకుల్లా తాకకుండా ముండ్లలా మొలిచి బ్రతుకు బాటపై గీరలు పడేలా తాకవచ్చు కూడాను—


అంతేకాక—అతడి పట్ల తనకున్న మృదుభావాన్ని బహిర్గతపరిస్తే ఇంట్లోవాళ్ళు సానుకూలంగా స్పందిస్తారా! ఏమో— ఆ విషయంలో తనకు కొండవాగంతటి అనుమానమే— అలాగని అతణ్ణి ఒక్కపెట్టున ఎలా విస్మరించగలదు? 


కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కారణాలు వెతుక్కుంటూ ఎంతకాలం భానుప్రసాద్ చుట్టూ తిరుగుతున్న మనసుని నిగ్రహపు వలయంతో అదిమి పెట్టగలదు— అందులో అతను తోడూ నీడా లేకుండా ఊళ్ళో ఒంటరిగా ఉంటున్నాడాయె— గడ్డుకాలంలో ఆలనా పాలనా చూడటానికి సమయానికి ఆదుకోవడానికి చుట్టుప్రక్కల అతడికెవరున్నారని—


ఇంతకీ కుక్కకాటు వల్ల ఏర్పడ్డ తన అనారోగ్యం విషయమై వాళ్ళ స్వంతూరుకి కబురంపాడో లేదో— కబురంపితే ఈపాటికి అతడికి కావలసిన వాళ్ళు హైద్రాబాదు చేరుకుని ఉండరూ! అదంతా ప్రక్కనపెట్టి చూస్తే— రేపు తను ఒక్కసారి కూడా అతణ్ణి చూసి పలకరించడానికి వెళ్ళలేదని, కలుసుకోవడానికి ప్రయత్నించలేదని తెలుసుకుంటే దగా చేయబడ్డవాడిలా హర్ట్ అవ్వడూ! తన పట్ల మునుపటి స్నేహభావాన్ని కనబరచడానికి పెడముఖం పెట్టడూ! టిట్ ఫర్ టాట్ లా తన ప్రక్క సీట్లలో పనిచేస్తున్న శ్రీవల్లి వైపో సుకన్య వైపో చూపు మరల్చడూ—


ఆ ఆలోచన మంచు తుంపరలా రివ్వున తాకిన వెంటనే ఆమె కుదురుగా ఉండలేకపోయింది. భోజనం చేయలేకపోయింది. మనసు మూలన తాకీ తాకని విధంగా దోబూచులాడుతున్న స్థిమితత్వం పటాపంచలైంది. ఇక ఎటువంటి జాప్యానికీ తావివ్వకుండా ఆమె వెంటనే లేచి నిల్చుంది. చీర మార్చుకుని హ్యాండ్ బ్యాగు అందుకుంది. అలా బయటకు వెళ్ళొస్తానంటూ బయటకు నడిచింది; ఎక్కడికని అడుగుతున్న తల్లి వైపు తిరిగి కూడా చూడకుండా—

భానుప్రసాద్‌ను చూసేందుకు యూత్ హాస్టల్‌కు వచ్చిన వైష్ణవికి అతన్ని ఒక యువ లాయర్ తీసుకెళ్లిందని చెబుతున్న భవానీ శంకర్.
భానుప్రసాద్‌ను చూసేందుకు యూత్ హాస్టల్‌కు వచ్చిన వైష్ణవికి అతన్ని ఒక యువ లాయర్ తీసుకెళ్లిందని చెబుతున్న భవానీ శంకర్.

 వైష్ణవి వెళ్ళేటప్పటికి భానుప్రసాద్ ఉంటున్న యూత్ హాస్టల్ నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది; అదేదో బడి పిల్లల్లేని స్కూలు ఆవరణలా— అందరూ వాళ్ళ వాళ్ళ పనులపైన హాస్టల్ నుండి నిష్క్రమించినట్టున్నారు. లోపలకు ఎలా సాగాలో తోచక ఆమె కొన్ని క్షణాల పాటు నిల్చుండిపోయింది. ఇంతకీ ఏమని చెప్పి ఎలా చెప్పి మంచానపడ్డ భానుప్రసాద్ రూముకి వెళ్ళేది? తనకూ అతడికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఆమె అలా నిస్తేజంగా హాస్టల్ ప్రాంగణపు గేటు వద్ద నిల్చున్నప్పుడు ఒకతను అటు వెళుతూ వచ్చి అడిగాడు—“ఎవరు కావాలి మేడమ్? ఇది మెన్ హాస్టల్— తెలుసు కదూ!” 


ఆ ప్రశ్నకు స్పందనగా తలూపుతూ అడిగిందామె— “భానుప్రసాద్ గారని— నాతో కలసి కేంద్ర సచివాలయ కేంద్రంలో పని చేస్తున్నారు. ఈ మధ్య ఆయన గాయాల పాలయ్యారు. ఆయన లోపల ఉన్నారు కదూ!” 


“ఓ అతనా! ఆయనకు ఎక్కడో దెబ్బ తగిలిందని విన్నాను. అదిగో— అతని రూమ్ మేట్ భవానీ శంకర్ గారు వస్తున్నారు. ఆయన్ను అడగండి— గజపతినగరం భానుప్రసాద్ గారి గురించిన పూర్తి సమాచారం అందిస్తారు” అంటూ అతను ముందుకు సాగిపోయాడు. 


అప్పుడు తన పేరు ప్రస్తావనకు వచ్చిందని గ్రహించిన భవానీ శంకర్ వైష్ణవిని సమీపించి అడిగాడు— “కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ మేడమ్!” 


మొహమాటం నుండి విడివడుతూ అందామె— “మరేమీ లేదు సార్! భానుప్రసాద్ గారు నాకు ఆఫీసు కొలీగ్. ఆయనను పలకరించి పోవడానికి వచ్చాను. ఇఫ్ యు డోంట్ మైండ్— నన్నాయన వద్దకు తీసుకువెళ్తారా!” 

“అతను నా రూమ్‌మేటే—గజపతినగరం వాస్తవ్యుడు. మొన్న ఎక్కడో కుక్కల బారిన పడి గాయాల పాలయ్యాడు. యామ్ ఐ రైట్?” 


ఆమె ఔనన్నట్లు తలూపింది. 


అతడు మళ్ళీ అందుకున్నాడు— “కాని ఇప్పుడతడు ఇక్కడ లేడండి.” 


“అంటే— ఎవరైనా ఊరు నుండి వచ్చి ఆయన్ను తీసుకువెళ్ళారా!”


“అబ్బే— ఊరు నుండి ఎవరూ రాలేదండీ— ఇక్కడ చుట్టుప్రక్కలున్న ఒక లేడీ వచ్చి భానుని కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళిందండీ— అప్పుడతను ఫీవర్‌తో ఉన్నాడు.” 


అది విని ఆమె వెంటనే స్పందించలేదు. రవంత ఊపిరి బిగబట్టి నిదానం కొనితెచ్చుకుంటూ అడిగింది— “ఆమె ఎలా ఉంటారు?” 


“బాగుంటారు— ఎరుపుగా, పొడవుగా, ట్రిమ్‌గా—”

 

“నేనడిగేది అది కాదు సార్— ఆమెగారి మెడచుట్టూ బ్లాక్ రోబ్స్ ఉన్నాయా!” 

“అటువంటిదేమీ చూడలేదు గాని— ఆమెగారు హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న లేడీ లాయరని తెలుసుకున్నాను. మొదట భానుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆ తరవాత ఏదో కంపెనీ గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్తానంది. 


భాను కట్టాల్సిన హాస్టల్ రూమ్ రెంటు చెల్లించి భానుకి సంబంధించిన సామానంతా తన అసిస్టెంట్ సహాయంతో ప్యాక్ చేసి కారులో తీసుకెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు నాకు వాళ్ళ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళింది. తెచ్చిస్తాను, కావాలా!” 


ఆమె తల అడ్డంగా ఊపి అక్కడి నుండి కదిలింది. బరువుగా తయారైన గుండెతో కదులుతూ ఆమె అప్రయత్నంగా ఆకాశంలోకి తలెత్తి చూసింది. గగనం నడిబొడ్డున హడావిడి చేస్తూ కదులాడుతున్నవన్నీ వర్ణనకు అందని, వర్షించని మేఘాలే—

 -------------------------------------------------------------------------------

ఆసుపత్రిలో చికిత్స అనంతరం భానుప్రసాద్‌ను ఆదుకుంటూ వైద్య సూచనలు తీసుకుంటున్న విద్యాభవాని.
ఆసుపత్రిలో చికిత్స అనంతరం భానుప్రసాద్‌ను ఆదుకుంటూ వైద్య సూచనలు తీసుకుంటున్న విద్యాభవాని.

 మెడికల్ టెస్టులన్నీ పూర్తయిన తరవాత సీనియర్ నర్సమ్మ నుండి సంజ్ఞ అందుకున్న తరవాత భానుప్రసాద్ నవ్వుతూ లేచి కూర్చోబోయాడు. 


ప్రక్కన నిల్చున్న విద్యాభవాని అతడికి చేయి అందించడానికి ముందుకు చాచింది. అతడు ఆమె చేతిని అందిపుచ్చుకోకుండానే లేచి నిల్చున్నాడు— “నో థాంక్స్” అంటూ. 


అప్పుడామె నర్సమ్మ అటు జరగడం చూసి అంది వెటకారంగా నవ్వుతూ— “భయమా!” అని. 


భయమెందుకూ అన్నట్టు చూశాడతడు. 


“కారణం ఉందిలే— కొందరికి ఆడాళ్ళంటే బోలెడంత భయం అకారణంగానే— అదొక చిత్రమైన సైకలాజికల్ ఫ్యాక్టర్— కొందరికి మాత్రమే వర్తించే విచిత్ర ఫ్యాక్టర్.” 


అతడు కూడా నవ్వు ముఖంతో స్పందించాడు— “దేవతాస్త్రీలను చూసి జడుసుకునేది నరరూప రాక్షసులు— మనసున్న మనుషులు కాదు. యామ్ ఐ కరెక్ట్!” 


అలాగా అంటూ నవ్వుతూ విద్యాభవాని అతడి చేతినందుకుంది. భవాని ఆ తరవాత నవ్వుతూ మృదువుగా స్పందించింది— “ఓకే ఓకే! మీరు భయస్తులు కారు. శునకాలను ఎదుర్కొన్న మగధీరులే— ఒప్పుకుంటున్నాను. ఇక మనం డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌ని ఓసారి చూసి వెళ్దామా?” 


“అవన్నీ మామూలు లాంఛనాలేగా— ముందు ఇది చెప్పండి. నా రూము నుండి చాలా సామగ్రి తీసి ప్యాక్ చేసినట్టున్నారు. మరి నా బైక్‌ని ఏమి చేసినట్టు?” 


“తమ ద్విచక్ర వాహనానికి ఏమీ కాలేదు. భద్రంగా మా వద్ద ఉంది. మీరు సేద తీర్చుకున్న తరవాత మీకు అప్పగించబడుతుంది. అదంతా తరవాత మాట్లాడుకుందాం. ఇక బయటకు కదులుదామా!” 


“వై నాట్”—అంటూ అక్కడి నుండి కదులుతూనే అన్నాడతను— “నా బ్యాంక్ అకౌంట్‌లో క్యాష్ బ్యాలెన్స్ ఉంది. మీరు శ్రమ తీసుకోకండి” అంటూ ప్యాంటు జేబు నుండి డెబిట్ కార్డు తీసి ఆమెకు అందివ్వబోయాడు. 


విద్యాభవాని దానిని అందుకోకుండానే నవ్వింది— “మీ బ్యాంక్ అకౌంట్‌లో క్యాష్ లేదని ఎవరన్నారు? ఎంతైనా మీది నిలకడగల ప్రభుత్వ ఉద్యోగమని మాకు తెలవదా! మీ లెక్కకు తెగింపు అనేది ఉండదని మాకు తెలవదా! అంతా లెక్కపెట్టి వసూలు చేసుకుంటాను లెండి” అంటూ అతణ్ణి హాలులో కూర్చుండబెట్టి, మెడికల్ ఆఫీసర్‌తో మాట్లాడి ఆయన రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని, మెడికల్ బిల్ చెల్లించి వచ్చి—“నౌ వి ఆర్ ఫ్రీ టు మూవ్!“ అందామె. 


అతడు సీటు నుండి లేస్తూ అడిగాడు— “ఇంతకీ మనమిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కాస్ట్లీ హోటెల్ రూములో నన్నుంచకండి. హెవీ బిల్స్‌కి తట్టుకోలేను—”

 

“తినబోయి రుచి గురించి అడగటం దేనికి? మనం వెళ్ళబోయేది ఎక్కడికో త్వరలో తెలుసుకోబోతున్నారుగా!” అంటూ అతణ్ణి ఆస్పత్రి క్యాంటీను వైపు నడిపించింది. 


రెండు కప్పుల కాఫీ ఆర్డరిచ్చింది. అదే అదనుగా భావించిన భానుప్రసాద్ నోరు తెరిచాడు— “నేనొకటి అడగాలనుకుంటున్నాను విద్యాభవాని గారూ! అడిగేదా?” 


“నాకు తెలుసు మీరేది అడగబోతున్నారో—అదేమిటో చెప్పేదా!” 


“వద్దు! నా ప్రశ్న నా నోటమ్మటే రానివ్వండి. నా గుండె బరువు తగ్గనివ్వండి” 

“అలాగే” అంటూ తలూపిందామె బేరర్ నుండి కాఫీ కప్పులు అందుకుంటూ—


అప్పుడతను కాఫీ కొంచెం చప్పరించి అడిగాడు— “చెప్పండి నిర్మొహమాటంగా— నా పట్ల ఎందుకింతటి అక్కర చూపిస్తున్నారు?” 


ఆమె వెంటనే బదులివ్వలేదు. రవంతసేపు నవ్వుతూ ఉండిపోయి స్పందించింది— “నాకే కాదు— చాలా మంది స్త్రీలకు గుండెనిబ్బరం గలవారి పట్ల ఇష్టం అధికం. అందునా తెలుగు ఆడపడుచులకు ధీరుల పట్ల అభిమానం మరీను— నేను కూడా తెలుగు ఆడపడుచునే కదా— అందుకని. 


మీరెంతటి తెగువ చూపించి ఆ చిన్నపిల్లను కాపాడారో సీసీటీవీలో చూసినవారందరికీ తెలుస్తుంది. సమయానికి ఆ ఉదంతం ఫ్లాష్ కాకపోతే నాకూ తెలిసేది కాదు. అది చూసి నేను స్పందించలేదు. నా మనోభావం స్పందించలేదు. నా నిండు మనసు స్పందించింది.” 


అది విని అతడు కాసేపు ఊరకుండిపోయి అన్నాడు ఆమె చేతిని అందుకుంటూ—“వుడ్ యు మైండ్?” 


ఆమె నవ్వి తల అడ్డంగా ఆడించింది— 'ఐ డోంట్ మైండ్' అని సూచన చేస్తూ— ఆమె నుండి ఆ సహేతుక సంకేతం అందుకున్న భానుప్రసాద్ ఆమె చేతిని అందుకుని కళ్ళకు హత్తుకున్నాడు. ఆమె గాని సమయానికి వచ్చి జ్వరపీడితుడై పడున్న తనను ఆదుకుని ఉండకపోతే అతడీపాటికి గజపతినగరం చేరుకుని ఉండేవాడు. ఇంట్లోవాళ్ళందర్నీ బెంబేలు పెట్టించేసేవాడు. 


ఏమో— ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం గాని— కుక్కకాటు వల్ల వచ్చిన జ్వరతీవ్రత తీవ్ర అనారోగ్య పరిస్థితికి దారితీసి ఉండును— బెడిసికొట్టి ఉండును. అంతా దైవాధీనం వలన సలక్షణంగా సానుకూలంగా జరిగిపోయింది; సమయానికి సహకారం అందించిన విద్యాభవాని ప్రమేయం వలన. కొన్ని స్నేహాలు కొన్ని సంబంధాలు అలానే ఆరంభమవుతుంటాయి; ఎక్కడో మొలకెత్తిన నదీ ప్రవాహ పుట్టుకలా—


 కంపెనీ గెస్ట్ హౌస్‌లో మూడవ రోజు ఇక తను అక్కడి నుండి కదలివెళ్ళే సమయం ఆసన్నమైందని మనసున తేల్చుకుంటున్నప్పుడు గదిలోకి విద్యాభవాని రానే వచ్చింది— “హల్లో హీరో గారూ! ఇప్పుడెలాగుంది ఒంట్లో— తెరపిగానే ఉంది కదూ?“ అని పలకరిస్తూ—

భానుప్రసాద్ లేచి కూర్చుంటూ బదులిచ్చాడు స్నేహపూర్వకంగా— “బికాజ్ ఆఫ్ యువర్ గ్రేస్—”

 

“నో నో! అంత పెద్దమాట అనకండి ప్లీజ్—మీరు చేసిన గొప్పకార్యానికి ఎంతైనా చేయవచ్చు. ఎంతైనా ఇవ్వవచ్చు.” 


“థాంక్స్ ఎ లాట్— ఇప్పుడు మీకొక మాట చెప్పాలి విద్యాభవానీ— ఇఫ్ యు డోంట్ థింక్ అదర్ వైజ్—”

 

“పెదవి విప్పడానికి అంత క్షమాపూర్వకంగా అడగటం దేనికి— చెప్పండి విత్ ఆన్ ఓపెన్ హార్ట్!” 


“అదే చెప్పబోతున్నాను భవానీ! పరుల గెస్ట్ హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదు. ముఖ్యంగా నాకిక్కడ స్టే ఏర్పాటు చేసిన మీకు కూడా మంచిది కాదు. అర్థం చేసుకోండి—”

 

“ఓకే ఓకే! మీ ఫీలింగ్ అర్థమైంది. కాని— నేను చెప్పేది మొదట వినండి. ఇదేమీ పరుల గెస్ట్ హౌస్ కాదు. మా అన్నయ్య నడిపే సుగుణ్ ట్రేడర్స్‌కి చెందిన డిలక్స్ గెస్ట్ రూము. ఇప్పుడు మీరు మాకు వి ఐ పి వంటివారు. కాబట్టి, మీరిక్కడ ఎన్నిరోజులైనా ఉండవచ్చు— ఎవ్వరూ ఏమీ అనరు. ఖర్చులన్నీ కంపెనీ భరిస్తుంది. మీకేమీ ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ నౌ?” 


సుగుణ్ ట్రేడర్స్‌లో ఉద్యోగం ఇవ్వాలన్న సుఖదేవ్ ప్రతిపాదనను కుటుంబ పరిస్థితుల కారణంగా తిరస్కరిస్తున్న భానుప్రసాద్.
సుగుణ్ ట్రేడర్స్‌లో ఉద్యోగం ఇవ్వాలన్న సుఖదేవ్ ప్రతిపాదనను కుటుంబ పరిస్థితుల కారణంగా తిరస్కరిస్తున్న భానుప్రసాద్.

భానుప్రసాద్ అనంగీకారంగా తల అడ్డంగా ఆడించాడు. “సారీ! అలా కుదరదు. ఎన్నిరోజులైనా ఉండవచ్చన్నారే— అది కచ్చితంగా కుదరదు. నా హద్దు నాకు తెలిసుండాలి. ముఖ్యంగా మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. కావున—” అని వాక్యం పూర్తి చేసేలోపల గది బయట గొంతు వినిపించింది— “హల్లో బోల్డ్ అండ్ డేరింగ్ హీరో గారూ! ఇప్పుడెలా ఉన్నారు?” అంటూ ఉన్న సుఖదేవ్ రాక గమనించి ప్రసాద్ సర్దుకుంటూ లేచి నిల్చున్నాడు— 


శుభోదయం పలుకుతూ బదులిచ్చాడు— “ఇంజెక్షన్లు వేసుకుని టాబ్లెట్స్ తీసుకున్న తరవాత నేను పూర్తిగా కోలుకున్నట్లే— థాంక్స్ టు యు అండ్ టు మేడమ్ విద్యాభవాని—”


“అదేమిటి ప్రసాద్ గారూ! ఫ్రెండ్‌ని మేడమ్ అంటున్నారు. మా చెల్లి మిమ్మల్ని మంచి ఫ్రెండని చెప్పిందే—”


“ఔననుకోండి--- కాని అప్పుడప్పుడు తమ చెల్లిగారి వ్యక్తిత్వానికి అనుగుణంగా మేడమ్ అని పిలవడం తానుగా వచ్చేస్తుంది నాకు తెలియకుండానే—”


అప్పుడు విద్యాభవాని వాళ్ళ మధ్యకు ప్రవేశించింది— “ఆ గౌరవ పదనామాల గురించి తరవాత చర్చిద్దాం రా అన్నయ్యా! ముందు భానుప్రసాద్ గారి గోడు విను—” 


చెల్లి వైపూ భానుప్రసాద్ వైపూ కళ్ళెత్తి అదేమిటన్నట్టు చూశాడు సుఖదేవ్. ప్రసాద్ బదులివ్వకుండా కళ్ళు దించుకున్నాడు. అప్పుడు భవాని మళ్ళీ అందుకుంది— “చెప్పడానికి మొహమాటపడుతున్నట్టున్నాడు మహాశయుడు— నేను చెప్తాను. ఒక గవర్నమెంటు ఉద్యోగిగా ప్రైవేట్ కంపెనీ గెస్ట్ హౌస్‌లో అన్నినాళ్ళు ఉండటం సభ్యత కాదంటున్నాడు. ఖాళీ చేసి మరొక కొత్త లాడ్జిలోకి వెళ్ళిపోతానంటున్నాడు. గజపతినగరం వాస్తవ్యులకు అభిమానం కాస్తంత ఎక్కువేనేమో!” 


సుఖ్‌దేవ్ రవంతసేపు మౌనంగా ఉండిపోయి నిదానంగా స్పందించాడు— “దీనికి నా వద్ద పరిష్కారం ఉంది. చెప్పేదా భవానీ?” 


తలూపింది విద్యాభవాని— భానుప్రసాద్ కూడా ఆసక్తితో చూశాడు సుఖ్‌దేవ్ వైపు— వాళ్ళ చూపులకు స్పందనగా అతడు కచ్చితమైన కంఠస్వరంతో చెప్పాడు— “మీ డేరింగ్ హీరో తక్షణం మన కంపెనీలో చేరడమే— కటాబొటి జీతాలతో పెనుగులాడే బదులు ఇక్కడకు వస్తే మెట్టు తరవాత మెట్టుగా పదోన్నతులు పొందవచ్చు కదా! ఆ తరవాత మన కంపెనీ గెస్ట్ హౌస్‌లో ఎన్నాళ్ళయినా ఉండవచ్చు కదా!” 


భానుప్రసాద్ స్పందించలేదు. మౌనం వహించాడు. అది చూసి సుఖదేవ్ గొంతుని రెట్టించాడు— “అదేమిటి ప్రసాద్ అలా మిన్నకుండిపోయారు! ఔనో కాదో చెప్పాలి కదా— తావలచి వచ్చిన ప్రేయసిని నిర్లక్ష్యం చేసినట్లు కదూ?” 


ఆ మాటకు భానుప్రసాద్ తలెత్తి చూసి సమీపించాడు— “సారీ సార్ ఇలా అంటున్నందుకు! మా ఇంటి పరిస్థితి, మా ఊరి పరిస్థితి వేరుగా ఉంటుంది.” 


అది విని సుఖదేవ్—అంటే? అన్నట్లు చూశాడు.


 ప్రసాద్ కొనసాగించాడు—“అంటే—మా వాళ్ళకు ప్రభుత్వోద్యోగమంటే వల్లమాలిన అభిమానం, ఇంకా చెప్పాలంటే వ్యామోహం మెండు. అసలు మా వాళ్ళు నన్నిక్కడకు పంపించింది గవర్నమెంటు ఉద్యోగమనే— పెన్షనబుల్ సర్వీసనే— నేను గాని ఇది కాదని ప్రైవేటు సంస్థలో చేరితే ఇక నా సంగతంతే! వీధి వీధంతా దండెత్తి వస్తారిక్కడకు. సారీ సార్ మీ ఆఫర్ కాదన్నందుకు—”


“దట్స్ ఆల్ రైట్— ఎంత ఎదిగినా ఎంత చదివినా పెద్దవాళ్ళ సెంటిమెంట్స్‌ని గుర్తించాల్సిన బాధ్యత మనకుంది కదా! బై ది బై— మీ ఆఫీసులో కూడా అడపా దడపా శాఖాపరమైన పోటీ పరీక్షలుంటాయి కదా— వాటిలో ఉత్తీర్ణుడివైతే ప్రమోషన్లు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. యామ్ ఐ రైట్?”


 ఆ ప్రశ్నకు భానుప్రసాద్ మొహమాటపడుతూ బదులిచ్చాడు—“ఉన్నాయనుకోండి- కాని అవి రాయడానికి క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉండాలి. అవి సూపరింటెండెంట్ పోస్టుకి సంబంధించిన ఎగ్జామ్స్—” 


ఆ వివరణ విని సుఖదేవ్ వెంటనే స్పందించాడు— “ఐతే ఇలా చేయండి భానుప్రసాద్— మీకు ఏజ్ బార్ దాటలేదు కదా— సెంట్రల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఎందుకు రాయకూడదు? మీకు తెలుసో తెలియదో గాని— విద్యాభవాని బ్రిలియంట్ స్టూడెంట్— ర్యాంక్ హోల్డర్— మీరు గాని పూనుకుంటే మీకు తప్పకుండా సహాయపడుతుంది.” 


ఈసారి భానుప్రసాద్ ఉన్నపాటున జెర్కింగ్‌కి లోనయినట్టు చూశాడు. ఇంతవరకూ అతడెన్నడూ ఆ కోణంలో ఆలోచించలేదు, అంతవరకూ అలా ఆలోచించవలసిన అవసరం కలగలేదు. అతడు నిదానంగా కళ్ళెత్తి భవాని ముఖంలోకి చూశాడు. 


అతడి మృదువైన చూపుకి ఆమె వెంటనే స్పందించింది— “ఆఫ్ కోర్స్ ప్రసాద్ గారూ! అన్నయ్య చెప్పినట్లు మీకు అన్ని విధాలా సహకరిస్తాను ఒక వైపు నా కోర్టు కేసులు నేను చూసుకుంటూ—”


=================================

ఇంకా ఉంది 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 11

త్వరలో మీ ముందుకు వస్తుంది.

=================================



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పాండ్రంకి సుబ్రమణి

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

30 /10 /2022  తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page