top of page
Original.png

ఈఎంఐ ప్రసాద్

3 hours ago
3 min read

ఈఎంఐ ప్రసాద్ తెలుగు హాస్య కథలో అప్పుల మోజుతో ఇబ్బందులు పడే ప్రసాద్, భార్య లీల మరియు పెళ్లి చూపుల సన్నివేశం

EMI Prasad - Telugu Comedy Story | Mohana Krishna Tata

ఈఎంఐ ప్రసాద్ - తెలుగు హాస్య కథ | తాత మోహనకృష్ణ

Published In manatelugukathalu.com On 17/10/2026


“ఈఎంఐ ప్రసాద్” రచయిత తాత మోహనకృష్ణ రాసిన వినోదభరితమైన తెలుగు హాస్య కథ. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల మోజు కుటుంబ జీవితంలో ఎలాంటి విచిత్ర పరిస్థితులకు దారితీస్తుందో నవ్వుల మధ్య తెలియజేసే కథ ఇది.


ప్రసాద్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. వచ్చే జీతంతో ఇల్లు గడవడం కష్టంగా ఉన్నా, కోరికలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. విలాసవంతమైన జీవితం గడపాలని కోరిక. మార్కెట్ లోకి ఏది కొత్తది వచ్చినా దానిని కొనేస్తాడు... ఈఎంఐ లో.


అదే అతనికి "ఈఎంఐ ప్రసాద్" అనే పేరు తెచ్చిపెట్టింది.


ప్రసాద్ కి అన్నీ కొనడానికి క్రెడిట్ కార్డ్స్, లోన్స్ అన్నీ ఒక వరంలా కనిపించాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా కొంటున్నప్పుడు... 'ఈఎంఐ ఒక రెండు వేలే కదా' అని అనుకునేవాడు.


అలా అన్ని వస్తువులు టీవీ, బైక్ ఇంకా ఎన్నో కొనేసరికి తడిసి మోపెడవుతుందని లెక్క వేయలేదు పాపం! ఎంత పిచ్చంటే, కొన్న కొత్త ఫోన్ బండి చక్రాల కింద నుజ్జు నుజ్జు అయిపోయినా సరే, ఇంకా దానికి ఈఎంఐ లో వడ్డీ కడుతూనే ఉన్నాడు.


ప్రతి నెల పాపం శాలరీ క్రెడిట్ అయినట్టు మెసేజ్ రావడం, అరగంటలో ఈఎంఐలన్నీ కట్ అయిపోయి, చివరకు మిగిలేది రెండు వేలే పాపం. డబ్బులు లేక క్రెడిట్ కార్డు వాడడం, ఒక ఈఎంఐ కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డులో డబ్బులు వాడడం అతని రొటేషన్ పద్ధతి.


ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రసాద్ కూతురికి పెళ్లి ఈడు వచ్చింది. ఒకరోజు పెళ్లి కొడుకు వాళ్లు పెళ్లి చూపులకు వచ్చారు. అప్పుడు ప్రసాద్, "నమస్కారం బావగారూ! ఈ పెళ్లి చూపులంతా నో-కాస్ట్ ఈఎంఐ రూపంలో బాగా జరగాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.


ఇదేదో కొత్త మర్యాద... బాగానే ఉందని మురిసిపోయారంతా. చూపులు అయ్యాక, పెళ్లి కొడుకు తండ్రి గొంతు శ్రుతి చేసుకుని ఇలా అన్నాడు...


"బావగారూ! మరి కట్నం సంగతి ఏమిటి?" "దానికేం భాగ్యం... నేను మా అమ్మాయికి పాతిక లక్షలు కట్నం ఇస్తాను." అడగకముందే లక్షలు వస్తున్నాయని పెళ్లి కొడుకు తండ్రి ఊహల్లో డాన్స్ మొదలెట్టేశాడు.


"కానీ... నా పద్ధతిలో..." అన్నాడు ప్రసాద్ మెల్లగా. "అంటే...!"

ప్రసాద్ తన ప్రసంగాన్ని మొదలెట్టాడు...


"మా దగ్గర కట్నం కింద ఉన్న మంచి ఆఫర్స్ మీకు తెలియాలి. మీ అబ్బాయికి పాతిక లక్షలు ఓకే చేశాను, అయితే ఒకేసారి క్యాష్ గా ఇవ్వను. నా స్టైల్ లో నెలకు 40,000 చొప్పున ఈఎంఐ రూపంలో మీ అబ్బాయి అకౌంట్ లో క్రెడిట్ చేస్తాను."


పెళ్లి కొడుకు తండ్రి షాక్ తిని, "ఏంటి... కట్నం ఈఎంఐ లో ఇస్తారా? ఒకవేళ మధ్యలో మీరు ఈఎంఐ కట్టకపోతే?" అని అడిగాడు.


"గుడ్ క్వశ్చన్! మీ అబ్బాయి మా అమ్మాయిని బాగా చూసుకుంటే, ప్రతి నెల 1వ తారీఖు కల్లా ఆటో-డెబిట్ అయిపోతుంది.


ఒకవేళ మీ అబ్బాయి మా అమ్మాయిని సరిగ్గా చూసుకోకపోతే... ఈఎంఐ బౌన్స్ అవుతుంది.


దానికి పెనాల్టీ కింద మీ అబ్బాయి వచ్చి మా ఇంట్లో వారం రోజులు ఇంటిపని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా ఎక్కువ సార్లు జరిగితే, మీ అబ్బాయి పనితో పాటు పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది" అని అన్నాడు.


దానికి పెళ్లి కొడుకు తండ్రి, "నీ కూతురిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం... ఈఎంఐలు, బ్యాంకు లావాదేవీలు, నోటీసులతోనే సరిపోతుంది. మీ కట్నం వద్దు, ఏమీ వద్దు" అంటూ పెళ్లి కొడుకుతో సహా బయటకు పరిగెత్తాడు.


"ఏమండీ! అసలు మీకు బుద్ధుందా? కూతురు పెళ్లి చూపుల్లో కూడా మీ ఈఎంఐ గోలేనా? ఇప్పటికైనా ఆ ఈఎంఐ పిచ్చి వదల్కపోతే, మిమ్మల్ని కూడా 12 నెలల ఈఎంఐ లో వేరే వాళ్లకు అమ్మేస్తాను, జాగ్రత్త!" అని వార్నింగ్ ఇచ్చింది లీల.


"పెళ్లికి నీకు నగలు, పట్టుచీరలు కావాలా...? వద్దా?" నవ్వుతూ తల ఊపింది పెళ్లాం లీల. "అయితే వార్నింగ్ వాపస్ తీసుకో... సైలెంట్ గా ఉండు" అని ఆర్డర్ వేశాడు ప్రసాద్.


ఆ దెబ్బకి... లీల నోరు మూసేసి ప్రసాద్ వెనుక నిల్చుంది.


"సార్, మీ కూతురు నాకు నచ్చింది. కానీ పెళ్లికి ముందే మీ ఈఎంఐ స్కీమ్స్ చూస్తుంటే మాకు హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది. ఒకవేళ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఆమెకు మేము ఇచ్చే ప్రేమను కూడా నెలకు ఇంత అని ఈఎంఐ పద్ధతిలోనే ఇస్తాం. ఓకే అయితే చెప్పండి" అని మెసేజ్ చేశాడు కాబోయే అల్లుడు.


ఇది చూసి లీల తల పట్టుకోగా, ప్రసాద్ మాత్రం, "చూశావా లీలా! అల్లుడు కూడా నాలాగే ఆలోచిస్తున్నాడు. జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ తో పెళ్లి ఖరారైపోయింది!" అంటూ ఆనందంతో డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు.


చివరకు ప్రసాద్ మారకపోగా, అతనికంటే ఒక ఆకు ఎక్కువ చదివిన అల్లుడే అతనికి దొరికాడు!


సమాప్తం. 

***********



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


 తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

తాత మోహనకృష్ణ

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page