సుదూర తీరాలు - పార్ట్ 2

Sudhira Teeralu - Part 2 - Telugu Moral Story | Routhu Srinivasa rao
సుదూర తీరాలు - పార్ట్ 2 - తెలుగు ప్రేమ కథ | రౌతు శ్రీనివాసరావు
Publishes in manatelugukathalu.com on 17/10/2026
సుదూర తీరాలు పార్ట్ 2 ఒక హృదయాన్ని తాకే తెలుగు విరహ ప్రేమకథ. కుటుంబ కట్టుబాట్లు, సామాజిక ఒత్తిళ్లు, మౌన ప్రేమ మధ్య దూరమైన సుభాష్, శైలజల జీవితాల్లో రమ్య పాత్ర వారి ప్రేమ ప్రయాణానికి కొత్త భావోద్వేగాన్ని అందిస్తుంది.
ఆ రోజుల్లో ప్రేమ అనే మాటే చాలా తక్కువగా వినిపించేది. ఫోన్లు లేవు. ఒకరి మనసులో మాట మరొకరికి చేరాలంటే చిన్న చిన్న కాగితాలే ఆధారం.
“బాగున్నారా?”
“చదువు ఎలా సాగుతోంది?”
“ఆరోగ్యం జాగ్రత్త.”
“మరీ ఎక్కువగా చదువుతున్నట్టున్నారూ?”
అంతే…
ఒకసారి శైలజ చిన్న కాగితంపై ఇలా రాసింది—
“మిమ్మల్ని చూడాలనుంది.”
ఆ ఒక్క వాక్యం సుభాష్‌కు పెద్ద ఉత్తరంలా అనిపించింది. ఎందుకంటే… అది ఆమె రాసిన మొదటి ప్రేమలేఖ.
ఆ కాగితాన్ని చేతిలో పట్టుకుని అతను చాలాసేపు అలాగే కూర్చున్నాడు. ఆమెకు ఏం సమాధానం రాయాలో అర్థం కాలేదు. చివరికి తన మనసులోని మాటలను జాగ్రత్తగా అక్షరాల్లో పెట్టాడు—
“నువ్వంటే నాకు ఒక కొత్త ప్రపంచం. కానీ ఆ ప్రపంచాన్ని మనం అందుకోగలమా? మన కథ మరో చరిత్ర కాకూడదు. నువ్వు జాగ్రత్త.”
సుభాష్ ప్రేమలో మొదటి నుంచే ఒక భయం ఉంది. ఆమెను కోల్పోతాననే భయం కాదు. తన వల్ల ఆమెకు ఏదైనా నష్టం జరుగుతుందేమో అన్న భయం.
ఎందుకంటే, ఆ రోజులు అలా ఉండేవి. తెగింపులు తక్కువ… కుటుంబ విలువలు ఎక్కువ. ప్రేమ కంటే పెద్దగా కనిపించేది కుటుంబ గౌరవం. వ్యక్తిగత కోరికల కంటే పెద్దది — ఇంటి మాట.
అందుకే శైలజను ప్రేమించినంతగా, ఆమెను కాపాడాలనే బాధ్యత కూడా అతని గుండెల్లో పెరిగింది.
ఆ ఉత్తరాలు శైలజ చేతికి ఎలా చేరేవి? మరి ఈ కథకు ఆధారం ఎవరు? అక్కడే రమ్య పాత్ర మొదలైంది.
రమ్యకు వాళ్లిద్దరి విషయం మొదటి నుంచే తెలుసు. వాళ్లు ఒక మంచి జంటగా ఉండాలని ఆమె మనసులో నిజమైన సదుద్దేశం ఉండేది. సుభాష్ దూర ప్రాంతంలో చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు, అతను నేరుగా శైలజకు ఉత్తరం పంపే పరిస్థితి ఉండేది కాదు.
ఒకరోజు అతను రమ్యను కలిసి అడిగాడు. రమ్య సుభాష్‌కు ఒక తోబుట్టువు లాంటి వ్యక్తి.
“ఇది శైలజకు ఇవ్వగలవా?”
రమ్య అతన్ని చూసి నవ్వింది.
“ఇస్తాను. నీకు ఇంత భయం ఎందుకు, అన్నా?”
సుభాష్ కాసేపు మౌనంగా ఉండి—
“నాకు కాదు… ఆమెకు. ఏ ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే… ఆమెకు తల్లి లేదు.”
ఆ మాట రమ్య మనసులో నిలిచిపోయింది. ఆ రోజు నుంచి రమ్య కేవలం ఉత్తరాలు తీసుకెళ్లే వ్యక్తి కాదు. ఆ ఇద్దరి మధ్య ఒక నమ్మకంగా మారింది. కొన్నిసార్లు ఉత్తరాన్ని శైలజ చేతిలో పెట్టేది. కొన్నిసార్లు ఇంటి వెనుకవైపు దాచేది. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, సరైన సమయం కోసం వేచి చూసేది.
ఒకసారి శైలజ సవతి తల్లికి ఏదో అనుమానం వచ్చింది.
“ఎక్కడికి వెళ్తున్నావు?”
“రమ్య ఇంటికి…”
“ఏం పని?”
అనుమానం పెరిగింది.
మాటలు పెరిగాయి. చివరికి శైలజకు తిట్లు కూడా తగిలాయి.
అంతటితో ఆగలేదు. రమ్యను కూడా నిలదీశారు.
“మా ఇంటి విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు?”
రమ్య ఏమీ ఎదురు చెప్పలేదు.
ఎందుకంటే అప్పటికే సుభాష్ మీదా, శైలజ మీదా ఆమెకు ఒక బాధ్యత ఏర్పడిపోయింది.
తర్వాత విషయం సుభాష్‌కు తెలిసింది.
అతను రమ్యతో అన్నాడు—
“ఇక నుంచి నీకు ఇబ్బంది అయితే ఏ ఉత్తరమూ తీసుకెళ్లకు.”
రమ్య నవ్వింది.
“నీ ఉత్తరం తీసుకెళ్లడం నాకు ఇబ్బంది కాదు. అది ఎవరి జీవితాన్నైనా చెడగొట్టకుండా చేరాలి. అంతే.”
ఆ రోజు నుంచి రమ్య వాళ్ల ప్రేమలో ఒక పాత్ర కాదు—
ఒక మౌనమైన వంతెన అయింది.
ఒకసారి శైలజ తన బంధువులతో కలిసి సినిమాకు వెళ్లింది.
ఆమె సినిమా చూడడానికి వెళ్లిందని సుభాష్‌కు తెలిసింది. అతనికీ వెళ్లాలనిపించింది.
కానీ ఆ రోజుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ఇంట్లో చెప్పాలి. అది ఆ రోజులు. డబ్బు కూడా లేదు.
అయినా శైలజను ఒక్కసారి దూరం నుంచి అయినా చూడాలనే కోరికతో స్నేహితుడి దగ్గర అప్పు తీసుకుని సినిమాకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత విషయం సుభాష్ తండ్రికి తెలిసింది. ఆయనకు అనుమానం వచ్చింది.
సుభాష్‌కు అది మరింత దిగ్భ్రాంతిని కలిగించింది. అక్కడ తండ్రి ఆదేశాలు అతని జీవితంలోని ఆశల కోణాలను గట్టిగా తుంచేశాయి.
తన వల్ల శైలజకు ఇంట్లో ఒక్క మాట పడినా… అది తనకు ఓటమిలా అనిపించేది.
కానీ ప్రేమను ఎంత దాచినా ఒకరోజు అది బయటపడుతుంది. వారి విషయం రెండు కుటుంబాలకూ తెలిసింది.
సుభాష్ తండ్రి మరోసారి తీవ్రంగా మందలించాడు.
“ఇది నీ వయసులో చేసుకునే పని కాదు. నువ్వు ఉన్నతంగా ఎదగాలి.”
సుభాష్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. మరోవైపు శైలజ కూడా తన ఇంట్లో ఎన్నో మాటలు విన్నది.
ఆమెకు తన ప్రేమపై నమ్మకం ఉంది. కానీ భవిష్యత్తుపై అంత నమ్మకం లేదు.
అదే ఆమె భయం. అది పేదరికం, నిరుద్యోగం, కష్టాలతో పోరాడుతున్న ఆ పల్లెటూరి యువత జీవితం.
ప్రేమ ఒకటి. జీవితం మరొకటి. అవును… ఆ రోజుల్లో ఈ రెండింటి మధ్య నిలిచిన సామాజిక కట్టుబాట్లు మరొకటి.
ఇదే ముఖ్యంగా వారి ప్రేమకు గొడ్డలిపెట్టు అయింది.
చివరికి సుభాష్‌ను దూర ప్రాంతానికి పంపించారు. అతను వెళ్లిపోయాడు.
రైల్వే స్టేషన్లో రైలు కదులుతున్నప్పుడు అతని కళ్ల ముందు చివరిసారిగా ఆ ప్రాంతం కనిపించింది. స్టేషన్… రోడ్డు… బావి… శైలజ ఇల్లు… బావి దగ్గర నిలబడి శైలజ ఏదో చెబుతున్నట్టుగా కనిపించిన ఆ జ్ఞాపకం…
అతను ఏమీ తనతో తీసుకెళ్లలేదు. కానీ అన్నీ తనతోనే తీసుకెళ్లాడు.
ఆమె నవ్వు. ఆమె ఊపిరి. ఆమె మాటలు. ఆమె చూపుల్లోని వెలుగు. ఆమె రాసిన చిన్న చిన్న మనసు లేఖలు. అన్నింటికంటే… ఆమె తలపులను.
దూర ప్రాంతంలో ఉద్యోగం మొదలైంది. కొత్త పని. కొత్త మనుషులు. కొత్త జీవితం.
కానీ అతని మనసులో మాత్రం పాత ప్రపంచమే ఉంది. ప్రతి నెలా ఒక ఉత్తరం మాత్రం రమ్య చేతికి చేరేది.
“ఇది శైలజకు ఇవ్వు.”
“ఆమె బాగుందా?”
“ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు?”
“ఆమె ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటుందా?”
రమ్య ఆ ఉత్తరాలు తీసుకెళ్లేది.
కొన్నిసార్లు అవి శైలజ చేతికి చేరేవి.
కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితి అనుకూలంగా లేకపోతే… చేరేవి కావు.
ఒకసారి శైలజ ఇంట్లో ఆమెపై మళ్లీ అనుమానం వచ్చింది.
ఆమెను తీవ్రంగా మందలించారు. ఇది మూడోసారి. ఆ తల్లి ఈసారి గట్టిగానే మందలించింది.
ఆ విషయం సుభాష్‌కు తెలిసినప్పుడు అతను చాలా బాధపడ్డాడు.
ఒకసారి రమ్యను కలిసి అన్నాడు—
“ఇక నుంచి వద్దు రమ్య.”
“ఎందుకు?”
“నీకు ఇబ్బంది అవుతోంది.”
రమ్య కాసేపు మౌనంగా ఉండి చెప్పింది—
“సుభాష్… మీ ఇద్దరి మధ్య నేను ఏమీ చేయడం లేదు. కేవలం ఒక మాట ఒకరికి చేరేలా చేస్తున్నాను. అంతే.”
ఆమె తన వంతు త్యాగం కూడా చేసింది.
వాళ్ల ప్రేమ సార్థకం కావాలనే చిన్న ఆశతో…
ఆమె కూడా ఎన్నో మాటలు మౌనంగా భరించింది.
కాలం గడిచింది.
సుభాష్ చదువులో, ఉద్యోగంలో ముందుకు వెళ్లాడు.
అయినా ఎవరైనా తన ప్రాంతం నుంచి వస్తే అతని మొదటి ప్రశ్న ఒక్కటే—
“శైలజ వాళ్లు ఎలా ఉన్నారు?”
అది అలవాటు కాదు.
ఆమె మీదున్న మౌనమైన బాధ్యత.
ఇదిలా ఉండగా, సుభాష్ ఇంటి నుంచి ఒత్తిడి మరింత పెరిగింది.
ఒకరోజు చాలా కాలం తర్వాత సుభాష్ తిరిగి తన ఊరికి వచ్చాడు.
శైలజ ఇంటి ముందు ఆమె కనిపించింది.
ఆమెను చూసిన క్షణం అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది.
“శైలజా…”
అని పిలవాలని నోరు తెరిచాడు. కానీ ఆ శబ్దం బయటకు రాలేదు.
ఆమె మాత్రం అతని ముఖాన్ని చూసింది. ఒక క్షణం. రెండు క్షణాలు.
తర్వాత ఆమెనే ముందుగా పలికింది—
“ఎప్పుడొచ్చారు?”
సుభాష్‌కు మాట రావడానికి కాసేపు పట్టింది. మాట తడబడింది. గుండె వేగంగా కొట్టుకుంది.
“ఇప్పుడే.”
“ఎలా ఉన్నారు?”
“బాగున్నాను.”
ఆమె కళ్లలో ఎన్నో ప్రశ్నలు.
“ఇన్ని రోజులు… ఒక్కసారి కూడా రాలేదే?”
అతను ఆమెను చూశాడు.
“పని…”
అది నిజం కాదు.
కానీ పూర్తిగా అబద్ధమూ కాదు.
ఆమె అర్థం చేసుకోలేకపోయింది.
“సరే…”
అని మెల్లగా లోపలికి వెళ్లిపోయింది.
సుభాష్ అక్కడే కొద్దిసేపు నిలబడ్డాడు. కన్నీళ్లు వేడిగా గుండెను తాకాయి. ప్రపంచమంతా చీకటిగా మారింది. మౌన రోదనతో అక్కడి నుంచి అడుగులు వేశాడు.
ఆ క్షణం భూమి ఒక్కసారిగా స్తంభించినట్టనిపించింది.
ఆ రెండు మనసుల బాధలు పెద్దలకు ఎందుకు వినిపించవు?
దేవుడా… తనను ఎవరో తరుముతున్నట్టుగా అతని కళ్లలో కన్నీళ్లు ఉబికి వచ్చాయి.
ఒక భావన…
ఒక చేతకానితనం…
ఒక సమాజపు కట్టుబాట్లు…
ఇవన్నీ కలిసి సుభాష్‌ను అక్కడే కుంగదీశాయి.
ఆ క్షణంలో ఆ దేవుడికి కూడా బాధ కలిగేదేమో.
గుండెల్లో ఆరని మంటతో అతను ఆమె వెనక్కి తిరిగి చూస్తుందేమో అనుకున్నాడు.
ఆమె తిరిగి చూడలేదు.
అతను మాత్రం చివరిసారిగా ఆ ఇంటిని చూసి వెళ్లిపోయాడు.
కొంతకాలానికి రమ్యతో శైలజ మాట్లాడింది.
ఎన్నాళ్లుగానో తన మనసులో దాచుకున్న భయం ఆ రోజు మాటల్లోకి వచ్చింది.
“రమ్య… సుభాష్ నా జీవితంలోకి వచ్చిన క్షణం నేను చాలా సంతోషపడ్డాను. జీవిత ప్రయాణం మొత్తం సుభాష్‌తోనే నడుస్తాను అనుకున్నాను.
కానీ… నడిచే దారిలో ఏదో దురదృష్టం, ఏదో పరిస్థితి, ఏదో సామాజిక ఒత్తిడి మా మధ్యకు వచ్చిందేమో.
సుభాష్‌కు నన్ను పూర్తిగా తనతో నడిపించే ధైర్యం ఉందా? లేక సగం దారిలోనే నన్ను వదిలిపెడతాడా? అన్న భయం మాత్రం నాకు ఎప్పుడూ ఉండేది.
సుభాష్‌ను చూస్తే… కొన్నిసార్లు నాకు భయమేస్తుంది. ప్రేమ లేదని కాదు. చాలా ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమను చివరి వరకు మోసుకెళ్లగలడా అన్న భయం.
ఇప్పుడు ఇంకొకరితో నా జీవితాన్ని ఊహించుకోలేను. నా మనసు ఇంకా సుభాష్ దగ్గరే ఉంది.
కానీ జీవితం అంటే ప్రయాణం కదా, రమ్య… అందులో నేను కూడా ఒక సాధారణ ఆడమనిషినే. తల్లి లేనిదాన్నే. సామాన్యమైన జీవితం గడపాలి. ఎప్పటికీ ఇలా మధ్యలో నిలవలేను కదా. ఏదో ఒక దారిని ఎంచుకుని, ఏదో ఒక గడపతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎలాగైనా ఒక గమ్యం చేరాలి.
అయినా… సుభాష్ జ్ఞాపకాలు మాత్రం నా మదిలోనే ఉంటాయి రమ్య. వాటిని నేను ఎవరితోనూ పంచుకోలేను… మరిచిపోలేను.”
రమ్య ఆ మాటలను నిశ్శబ్దంగా విన్నది.
శైలజ కళ్లలో కన్నీళ్లు చూసింది.
ఆ క్షణంలో శైలజకు మాత్రమే కాదు…
ఆమె కన్నీళ్లకు కూడా ఈ లోకం చిన్నదైపోయింది.
రమ్యకు శైలజ బాధ అర్థమైంది.
ఆ మాటలను సుభాష్‌కు చెప్పినప్పుడు అతను చాలాసేపు మాట్లాడలేదు.
చివరికి నెమ్మదిగా అడిగాడు—
“ఆమె నన్ను సగం దారిలో వదిలేస్తానని అనుకుంటుందా?”
రమ్య ఏమీ చెప్పలేదు.
సుభాష్ కళ్లను కిందికి వంచాడు.
గొంతులో జీర పోసుకున్నట్టుగా నెమ్మదిగా అన్నాడు—
“ఆమెకు తెలియదు రమ్య… నేను ఆమెను వదిలిపెట్టలేదు.”
కొద్దిసేపు ఆగి—
“నేను ఆమెను సగం ప్రయాణంలో వదిలిపెట్టలేదు. పరిస్థితులు నన్ను ఆమె దగ్గర నుంచి తీసుకెళ్లాయి. చాలా అవకాశాలు తక్కువ. కుటుంబాన్ని దాటలేను. ఆమెను చూసుకునే శక్తిని ఇంకా అందుకోలేదు.”
రమ్య అతని వైపు చూసింది.
ఆమెకు అర్థమైంది.
ఇది ప్రేమ లేని మనిషి మాట కాదు.
ప్రేమ ఉన్నా… ఆ ప్రేమను గెలిపించేంతగా పరిస్థితులను ఎదిరించలేకపోయిన ఒక మనిషి బాధ.
ఆ రోజుల్లో ఆ పల్లె వాతావరణంలో, కుటుంబ కట్టుబాట్లు దాటే శక్తి చాలామంది యువతకు ఉండేది కాదు.
కారణం విలువలు.
కుటుంబం.
బాధ్యత.
సమాజం.
మళ్లీ రైలు ఎక్కాల్సి వచ్చింది.
మళ్లీ ఉద్యోగంలో పడిపోయాడు.
కానీ ఏదో తెలియని వెలితి అతని జీవితంలో మిగిలిపోయింది.
చిరునవ్వు లేని జీవితం. కొన్ని సంవత్సరాలు…
కన్నీటి ప్రవాహంలా గడిచిపోయాయి. కన్నీటి ఉత్తరాలు మాత్రం ఆగలేదు.
మధ్య మధ్యలో ఊరికి వెళ్లేవాడు. ఆ కళ్లను మళ్లీ చూసేవాడు.
ఆ కళ్లలో మళ్లీ అదే ప్రశ్న. అదే దుఃఖం. మళ్లీ మౌనం. మళ్లీ పట్టణానికి తిరిగి రావడం.
ఇలా రోజులు గడిచిపోయాయి.
బహుశా…
ఆ దేవుడు కూడా ఆ రెండు మూగ మనసుల మౌన రోదనను, ఆ విరహ ప్రేమను చూడాలనుకున్నాడేమో.
కొన్నాళ్లకు పూర్తిగా మాటలు కరువయ్యాయి.
సుభాష్ తన గుండెను తానే చంపేసుకున్నాడు.
శైలజ దృష్టిలో తాను చెడ్డవాడిగా, దూరమైనవాడిగా కనిపిస్తేనే ఆమెకు మంచిదని అనుకున్నాడు.
ఆ విషయం రమ్యకు తెలుసు.
కానీ ఆ ప్రేమకు రెండు కన్నీటి బొట్లు రాల్చడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయింది.
అయినా ఆ విషయం శైలజకు తెలుసు.
ఆడమనసుకు ఓర్పు ఎక్కువ. లోతు ఎక్కువ.
అందుకే ఆమె అమాయకంగా ఎదురుచూస్తున్నట్టుగా కనిపించేది.
కానీ ఆ ఎదురుచూపు వెనుక ఒకే ఒక్క కోరిక—
“సుభాష్ బాధపడకూడదు.”
ఆమె తన ప్రేమను కోల్పోయినా భరించగలదు.
కానీ…
తన వల్ల సుభాష్ గుండె పగలకూడదని మాత్రం కోరుకుంది.
అది ప్రేమ. మాటల్లో చెప్పలేని ప్రేమ. దూరం చేసినా చావని ప్రేమ.
కాలం గడిచినా మసకబారని ప్రేమ.
సుదూర తీరాల్లో విడిపోయిన రెండు మనసుల మధ్య… ఇంకా ఒక చిన్న దీపంలా వెలుగుతున్న ప్రేమ.
విధి ఆడుతున్న నాటకంలో నలిగిపోతూ, రెండు మనసుల ఆరాటానికి, ఆవేదనకు సాక్షిగా నిలిచిన ఆ పల్లె… కొన్ని సంవత్సరాల పాటు విరహవేదనతో ఎరుపెక్కింది.
క్లైమాక్స్ కోసం… ఇంకొంచెం వేచి చూడండి.
ఈ రెండు మనసుల ప్రయాణం ఏ తీరానికి చేరిందో…
ఆ ప్రేమకు చివరికి ఏ గమ్యం దక్కిందో…
తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడమని కోరుతూ…
మీ RSRAO
***************************************
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
రౌతు శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రౌతు శ్రీనివాసరావు
నా పేరు రౌతు శ్రీనివాసరావు. నేను భారతీయ రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను. కవితలు, కథలు చదవడం, రచించడం నా అభిరుచులు. సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ, నా మనోభావాలను చిన్న చిన్న కథానికలుగా, కవితలుగా మలచే ప్రయత్నం చేస్తున్నాను. నా రచనలను చదివి మీ విలువైన అభిప్రాయాలు, ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏







Comments