ఫోన్ కాల్ - పార్ట్ 2
- Sudha Vishwam Akondi

- 17 hours ago
- 2 min read

Phone Call - Part 2/2 - Telugu Suspense Crime Story | Sudhavishwam Akondi
ఫోన్ కాల్ - పార్ట్ 2/2 - తెలుగు సస్పెన్స్ క్రైం కథ | సుధావిశ్వం ఆకొండి
Published in manatelugukathalu.com on 05/08/2026
భయమే సైబర్ మోసగాళ్లకు అతిపెద్ద ఆయుధం.
మొదటి భాగంలో కొడుకు ప్రమాదంలో ఉన్నాడని వచ్చిన ఫోన్ కాల్‌తో కంగారుపడిన వీరబాబు, ఈ భాగంలో తెలివిగా వ్యవహరించి పెద్ద మోసాన్ని ఎలా అడ్డుకున్నాడో తెలుసుకుంటారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచే సందేశంతో, ఉత్కంఠభరితంగా సాగిన "ఫోన్ కాల్ – పార్ట్ 2" ప్రతి కుటుంబం తప్పక చదవాల్సిన కథ.
"హలో! వీరబాబూ! లైన్లో ఉన్నారా? విన్నారా మీ అబ్బాయి మాటలు? ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? నా మాట నమ్మండి! పోలీసులు అందరూ చెడ్డవాళ్లు కారు సార్!" అన్నాడు అతను సౌమ్యంగా.
నిజమేనని అనిపించింది. కానీ అంత డబ్బు తన అకౌంట్లో లేదు. ఏం చేయాలని ఆలోచిస్తూ అతనితో అన్నాడు.
"సార్! అంత అమౌంట్ నా వద్ద అకౌంట్లో లేదు. నా ఫ్రెండ్ని అడిగి మీకు వేస్తాను. ఎలాగైనా మా వాడిని రక్షించండి!" అన్నాడు.
"సరే వీరబాబు! నేను ఈలోపు మా ఎస్సై గారితో మాట్లాడుతాను. ఒక గంట తర్వాత కాల్ చేస్తాను. అప్పటికి రెడీ ఉండు! నువ్వు మనీ వేయగానే ఇవ్వాల్సిన వారికి ఇచ్చేసి, మీ వాడిని బయటకు తీసుకువస్తాను. మీ వాడితో కాల్ చేయిస్తాను అప్పుడు" అని చెప్పి పెట్టేశాడు అవతలి వ్యక్తి.
తన తోటి రైతు పొలం పనుల కోసమని డబ్బు అడిగితే అతనికి ఫోన్ పే చేశాడు నిన్ననే! అలా ఒకరికొకరు సాయం చేసుకోవడం వాళ్ల ఊళ్ళో మామూలే! ఇది అనుకోని టెన్షన్ అతనికి.
ఫ్రెండ్ వద్దకు వెళ్ళి డబ్బు అడుగుదామని టెన్షన్గా బయటకు వెళ్ళబోయాడు.
"ఇప్పుడు వచ్చారా? మళ్ళీ ఎటు పోతున్నారు? తినేసి పోతే మంచిది కదా! మళ్ళా ఎప్పుడు ఇంటి ముఖం చూస్తారో..?" అంది వీరబాబు భార్య, భర్త మళ్ళీ బయటకు వెళ్ళడం చూసి.
భార్యకు కొడుకు విషయం చెబుదామని అనుకుని, అనవసరంగా బాధ పడుతుందని భయపడి మానుకున్నాడు.
"ఇప్పుడే వస్తా! ఏదో పని గుర్తుకు వచ్చింది" అన్నాడు.
"ఎప్పుడూ ఇదే గోల! టైమ్కి తినడం చెయ్యనే చెయ్యరు! నరేష్ ఫోన్ చేసి అదే అంటున్నాడు. నాన్న ఎప్పుడూ తిండి తిప్పలు పట్టించుకోకుండా పొలం పని చేయడం ఒక్కటే కాదు, అందరి పనులు నెత్తిన వేసుకుని చేసుకుంటూ పోతాడు. ఇట్ల అయితే ఎట్లా? ఈ ఇయర్ అయిపోతే నాకు జాబ్ వస్తుంది. నాన్న ఇట్ల పనులు చేస్తే ఊరుకోను అని అన్నాడు. అవును వాడికి ఒక వారం సెలవులు వచ్చాయట. రెండు రోజుల్లో ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశాడు...." అని ఆవిడ చెబుతూ పోతుంది.
"ఏంటి వాడు కాల్ చేశాడా? ఎప్పుడు చేశాడే?" అన్నాడు రిలీఫ్ ఫీల్ అవుతూ.
"పొద్దున్న నువ్వు అటు పోయాక చేశాడు. కాలేజీకి రెడీ అవుతూ కాల్ చేసిండు" అంది ఆమె.
"హమ్మయ్య! రమేష్ పొలం పనుల కోసమని డబ్బు అడగడం, నేను ఇవ్వడం నాకు మంచిది అయ్యింది. అనవసరంగా ఆ ఫ్రాడ్ గాడికి ఇచ్చేవాడిని భయపడి" అని అనుకుంటూ పైకే అనేశాడు.
"ఏమైంది?" అని అడిగింది ఆమె.
జరిగింది వివరించాడు.
"ఉండండి! మా పెద్దమ్మ కొడుకు కానిస్టేబుల్ నుంచి మొన్ననే ఎస్సై అయ్యాడు. వాడికి కాల్ చేసి చెబుదాం! ఈ ఫ్రాడ్ గాడిని పట్టుకుంటాడు" అని అతనికి కాల్ చేసి వివరంగా చెప్పారు.
***
పోలీసులు వీరబాబు ఫోన్ను ట్యాప్ చేసి పెట్టుకున్నారు. అప్పుడు ఆ కాల్ వచ్చింది.
"వీరబాబు! మనీ రెడీ చేసుకున్నావా?" అన్నాడు ఆ ఫ్రాడ్.
"లేదు. డబ్బులు ఇంకా దొరకలేదు. ట్రై చేస్తున్నాను!" అన్నాడు వీరబాబు.
"నేను పై వాళ్ళతో మాట్లాడి పెట్టాను. ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తే, మీ వాడిని వదిలేస్తారు. ఎక్కువ టైమ్ లేదు" అని తొందర పెట్టాడు వాడు.
"నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసినా అన్నా! వాడి దగ్గర కూడా లేవట! వాళ్ళ అన్నను అడిగితే ఇస్తానన్నాడు. ఏదో చెక్ క్లియర్ అయ్యేది ఉందట! బ్యాంకుకి పోయి పని చేయించుకుని, నా ఫోన్కి డబ్బు వేస్తానన్నాడు. వాడి కోసమే చూస్తున్నా అన్నా! మా వాడిని జాగ్రత్తగా చూడన్నా!" అన్నాడు వీరబాబు కంగారు పడుతున్నట్లుగానే.
పోలీసులు చెప్పినట్లుగా నెమ్మదిగా, జాగ్రత్తగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
సైబర్ పోలీసులు చకచకా తమ పని మొదలుపెట్టారు. వాడి అడ్రస్ ట్రేస్ చేస్తే అది లోకల్ హైదరాబాద్ అడ్రస్ అని తేలింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ ఫ్రాడ్ గ్యాంగును పట్టుకున్నారు.
ఫోన్ కాల్స్ చేసి మనకు తెలియని వారు కానీ, తెలిసిన వారి గొంతు అయినా కూడా అసలు విషయం కన్ఫర్మ్ చేసుకోకుండా భయపడకూడదు. భయపడితే బుద్ధి పనిచేయదు. దానివల్ల లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి వస్తుంది.
సమాప్తం

-సుధావిశ్వం




Comments