ఫోన్ కాల్ - పార్ట్ 1
- Sudha Vishwam Akondi
- 1 day ago
- 2 min read

Phone Call - Part 1/2 - Telugu Suspense Crime Story | Sudhavishwam Akondi
ఫోన్ కాల్ - పార్ట్ 1/2 - తెలుగు సస్పెన్స్ క్రైం కథ | సుధావిశ్వం ఆకొండి
Published in manatelugukathalu.com on 03/08/2026
ఒక అనుకోని ఫోన్ కాల్... ఒక తండ్రి జీవితాన్ని క్షణాల్లో తలకిందులు చేస్తే?
ముంబైలో చదువుతున్న తన కుమారుడు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడంటూ వచ్చిన కాల్‌తో వీరబాబు జీవితంలో మొదలయ్యే ఆందోళన, తల్లిదండ్రుల ప్రేమ, మోసగాళ్ల కుట్రలు, ఆధునిక సైబర్ మోసాల నేపథ్యాన్ని ఉత్కంఠభరితంగా ఆవిష్కరించే కథ "ఫోన్ కాల్ – పార్ట్ 1". ప్రముఖ రచయిత సుధావిశ్వం రాసిన ఈ సస్పెన్స్ కథ చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తుంది.
"మొత్తానికి నీ కొడుకుని అంత దూరం అయినా సరే పంపించి, హాస్టల్ లో పెట్టి చదివిస్తున్నావు. అంతా బాగానే ఉంది కానీ నీకున్న పొలంలో సగం అమ్మేశావు నీ కొడుకు చదువు కోసమని. నీ కొడుకు మిమ్మల్ని చూసుకునే వాడే అయినా, ముందు వాడికి జాబ్ రావాలి కదా వీరబాబూ! ...." అని అన్నాడు వీరబాబుతో అతని ఫ్రెండ్ రాంబాబు.
"ఒక్కగానొక్క కొడుకు బాగా చదువుకునేవాడు. అలాంటి వాడికోసం ఖర్చు చేస్తే ఏమీ అయిపోదు లేరా? ఇది చివరి సంవత్సరం. క్యాంపస్ సెలెక్షన్ అని ఉంటుందటరా! వెంటనే మంచి జాబ్ వస్తుంది..." అని తను చెప్పుకుంటూ పోయాడు వీరబాబు.
"సరేలేరా! బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తే సంతోషమే కదా! కానీ ముంబై అంతదూరం పంపించావు అని భయం నాది! అక్కడ ఏం చెడు అలవాట్లు నేర్చుకుంటాడోనని, అది చూసి నువ్వు ఏమయిపోతావోనని, అందరూ ఏవేవో అంటుంటే విని ఆందోళన పడ్డాను" అని అన్నాడు స్నేహితుడితో రాంబాబు.
కాసేపు స్నేహితులు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నాక, వెళ్ళొస్తానని చెప్పి రాంబాబు వెళ్లిపోయాడు.
***
వీరబాబు ఇల్లు చాలా పాతకాలం నాటిది. తన తాతలనాటి ఆ ఇల్లును ఏ మార్పులు చేయకుండా అలాగే ఉంచాడు వీరబాబు. కొన్ని ఆధునిక సౌకర్యాలు మాత్రం చేయించాడు. ఆ ఇంటికి పెద్ద అరుగు కూడా ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది.
చిన్నప్పుడు ఆ అరుగుపై ఆడుకున్న ఆ అనుభూతులు ఇప్పుడు కూడా అందరితో పంచుకుంటూ వుంటాడు. ఆ ఇల్లంటే అతనికి అందుకే ప్రాణం.
స్నేహితుడు అటు వెళ్లగానే ఇంట్లోకి వెళ్ళిన వీరబాబుకి 'నమో వేంకటేశా...' అనే పాట వినబడింది. టేబుల్ పైన పెట్టిన తన సెల్ ఫోన్ అదే పనిగా రింగ్ అవుతుందని అనుకుని అటువైపు అడుగులు వేశాడు.
వీరబాబుకు పాతకాలం సినిమాలంటే మహా ఇష్టం. అతని చిన్నతనంలో థియేటర్ లో సినిమా మొదలయ్యేముందు ఘంటసాల గారి 'నమో వేంకటేశా...!' రికార్డింగ్ వేసేవారు. ఆ తీపిగుర్తులు తలుచుకుంటూ ఉండడానికి తన సెల్ ఫోన్ కి అదే రింగ్ టోన్ పెట్టుకున్నాడు.
"హలో! ఎవరూ..?" అని అడిగాడు సెల్ ఆన్సర్ చేస్తూ.
అవతల నుంచి ఎవరో హిందీలో మాట్లాడుతున్నారు. తనకు హిందీ వస్తుంది కానీ అది కొంచెం అర్థం కాలేదు. చాలా జాగ్రత్తగా చెవులు రిక్కించి విన్నాడు. ఎవరో గర్రుమనే సౌండ్ తో మాట్లాడుతున్నారు.
"ఎవరూ మీరు? ఎందుకు కాల్ చేశారు? ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు!" అన్నాడు తెలుగులో.
"ఏ క్యా బాత్ కర్ రహే..." అని ఒకడు ఇంకెవరితోనో అంటున్నాడు
కాసేపు నిశ్శబ్దం. తర్వాత ఈసారి ఇంకొకడు లైన్లోకి వచ్చాడు.
"హలో! మీరు వీరబాబు గారేనా?" అని తెలుగులోనే అడిగాడు.
"అవును. మీరెవరు?" అన్నాడు వీరబాబు ఎవరబ్బా అనుకుంటూ.
"మేం ముంబై నుంచి కాల్ చేస్తున్నాం! మీ అబ్బాయి నరేష్ ఇక్కడే ముంబైలో చదువుతున్నాడు కదా!"
"అవును. ఏమైంది? మీరు ఎవరు?" అని అడిగాడు కంగారుగా.
"ముంబై పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం! ఇక్కడ నిన్న రాత్రి మీ నరేష్, ఇంకా కొందరు అతని దోస్తులు డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డారు. అందరినీ జైల్లో వేశారు. మీ పిల్లోడు నాకేం తెల్వదని బాగా ఏడుస్తుంటే జాలిగా అనిపించింది.
మన తెలుగోడే కదా, సాయం చేద్దామని ఎవరికీ తెల్వకుండా అతనితో మాట్లాడి మీ ఫోన్ నంబర్ తీసుకున్నాను. నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కి మీరు వెంటనే లక్ష రూపాయలు పంపండి. ఎలాగైనా మీవాడిని విడిపిస్తాను" అన్నాడు ఆ వ్యక్తి.
"మీరు ఎవరు? మిమ్మల్ని ఎలా నమ్మాలి?" అన్నాడు తెలివిగా వీరబాబు లోపల వున్న టెన్షన్ ను అణుచుకుంటూ.
"ఎన్నో ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి కదా! మీకు అనుమానం రావడం సహజమే! అందుకే మీ వాడి మాటల రికార్డు వాట్సప్ లో పంపుతున్నాను. వినండి!" అన్నాడు.
వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి రికార్డింగ్ ఫైల్ ఆన్ చేశాడు.
"నాన్నా! నా ఫ్రెండ్స్ వల్ల ఇందులో ఇరుక్కున్నాను. మీకు కాల్ చేస్తానని ఈ కానిస్టేబుల్ సార్ మీ నెంబర్ అడిగితే ఇచ్చాను. అతను చాలా మంచి వాడు నాన్నా! ఆయన ఇక్కడ అందరితో మాట్లాడి విడిపిస్తానని ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఆయనను నమ్మొచ్చు!"
ఇంతే ఉంది వాయిస్ రికార్డింగ్.
'ఆ వాయిస్ తమ పిల్లవాడు నరేశ్ దే! డౌట్ నే లేదు! నిజంగానే ముంబైలో డేంజర్ లో పడ్డాడా? అయ్యో! అనవసరంగా అంతదూరం పంపాను! అంత డబ్బు ఇప్పుడు ఎలా...' అని ఆలోచనల్లో ఉండిపోయాడు వీరబాబు.
సశేషం...
సుధావిశ్వం

-సుధావిశ్వం
