భార్య - పార్ట్ 4
- Sudarsana Rao Pochampalli

- 24 minutes ago
- 6 min read
#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #Bharya, #భార్య, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Bharya - Part 4/4 - New Telugu Story Written By Sudarsana Rao Pochampally Published in manatelugukathalu.com on 19/02/2026
భార్య - పార్ట్ 4/4 - పెద్దకథ
రచన : సుదర్శన రావు పోచంపల్లి
జరిగిన కథ: శ్రీకంఠ, భవభూతి ఇద్దరూ విశ్రాంత ఉద్యోగులే. ఇద్దరికీ మిత సంతానమే అయినా, శ్రీకంఠకు ఇద్దరు ఆడపిల్లలైతే (శ్రావణి-చతుర), భవభూతికి ఒక కొడుకు (జయంత్), ఒక బిడ్డ (అక్షర).
శ్రీకంఠ భార్య సత్యవతితోనూ, అక్కడ భవభూతి సతీమణి భవానితోనూ ఇద్దరిద్దరే నివసిస్తున్నారు.
తమ కూతురు అక్షరను విదేశంలో ఉంటున్న ఆమె భర్త కార్తీక్ తీవ్రంగా హింసిస్తున్నాడని, శారీరక, మానసిక చిత్రహింసలకు గురిచేస్తున్నాడని కన్నీళ్లతో చెబుతారు భవభూతి దంపతులు.
శ్రీకంఠ, భద్రాచలంతో మాట్లాడి, విష్వక్సేన్ ద్వారా అక్షరను కూడా వెంట తీసుకురమ్మని చెబుదామని ప్లాన్ చేస్తాడు.
విష్వక్సేన్ కు కుదిరిన సంబంధం రద్దు అవుతుంది.
ఇక భార్య - పార్ట్ 4 చదవండి.
భార్య 4
ఆ రాత్రి భోజనానంతరము సత్యవతితో విషయమంతా తెలిపిన భవాని, అక్షరను పిలిచి, "అమ్మా! నువ్వు కార్తీక్‌ను వదులుకుంటానని అంటున్నావు. నీ హృదయం నుండి గట్టి నిర్ధారణగా వచ్చిన తలంపేనా? లేకపోతే, అతని కాళ్ల వేళ్ళా పడి, అతని కోరికలేమిటో తీర్చి, మీ సంసారము చక్కదిద్దేటట్లు మా పాట్లు మేము పడుతాము. మీ సుఖము కంటే మేము ఆశించేదేమీ లేదు. నీ తమ్ముడు జయంత్ గురించి ఇప్పటికైతే మాకేమీ దిగులు లేదు," అంటుంది భవాని, బిడ్డను దగ్గరకు తీసుకుంటూ.
"లేదమ్మా! నా ఆత్మ సాక్షిగా చెబుతున్నా, నేను ఆ దుర్మార్గునితో కాపురము చేయలేను," అంటూ ఏడుస్తుంది అక్షర. "మరి అతనికి విడాకులు ఇస్తావా?" అని తల్లి అడిగితే, "నాకైతే సంపూర్ణంగా ఉన్న ఆలోచన అదొక్కటే. నాకు మాత్రము అతని పేరంటేనే జుగుప్స కలుగుతున్నది. ఇంకా అతనితోనా నా బ్రతుకు? నేనెంత క్షోభ అనుభవించానో మీకేం తెలుసు," అంటుంది, కళ్ళలో నుండి వచ్చే నీళ్ళు ఆపుకోలేక.
భవాని ఆమె కన్నీళ్ళు తుడుస్తూ, "ఒక మాట చెబుతాను, వింటావా మరి?" అంటుంది. దానికి "ఏమిటది?" అని గద్గద స్వరముతో అడుగుతుంది అక్షర.
"నువ్వు విష్వక్సేన్‌ను వారము రోజులనుండి చూస్తున్నావు కదా? అతని మాట, చూపు, నడత, అతని గురించి నీ అభిప్రాయమేమిటి?" అని అడుగుతుంది భవాని.
"ఎందుకమ్మా ఇప్పుడు అతని ప్రస్తావన? ఐనా, నాకు తెలిసినంతవరకు అతనికి కాబోయే ఇల్లాలు మాత్రం అదృష్టవంతురాలు అనుకుంటున్నాను. ఐనా, ఎందుకమ్మా అతని పేరెత్తడమిప్పుడు?" అని గ్రుచ్చి గ్రుచ్చి అడుగుతుంది అక్షర.
"అసలు విషయం చెబుతాను, వినమ్మా. ఆ శంపాలత అచ్చమైందేమీ కాదు. ఆమె ఇంకెవరినో ప్రేమించి, అమాయకుడైన విష్వక్సేన్‌కు మోసము చేసింది. ఇప్పుడు వాళ్ళ పెళ్ళి ఎత్తిపోయిందట. ఆ భద్రాచలము అంకుల్ వచ్చి ఆ సంగతి చెప్పుకుంటూ ఎంత బాధపడ్డాడో పాపం!" ఇది విని అక్షర ఉలిక్కి పడ్డట్లు, "శంపాలత అంత పని చేసిందా? నంగనాచి! చూడ్డానికి ఎంత ఉత్తమురాలో! విష్వక్సేన్ ఎంత అదృష్టవంతుడో అనుకున్నానమ్మా. అతడు ఆమె మోహములో పడి ఒక కవిత రాసుకున్నాడు. విమానములో వస్తూ అతడు ఆమెకు వినిపిస్తుంటే బాగున్నదని నేను వ్రాసుకున్నాను. కాబోయే స్నేహితురాలే కద, ఎప్పుడైనా ఆట పట్టించవచ్చు అనుకుంటూ తన సూట్‌కేస్ తెరిచి, తను వ్రాసుకున్న కవిత వినిపిస్తుంది తల్లికి, 'వినడాని' అంటూ సత్యవతికి.
విష్వక్సేన్ వ్రాసిన కవిత పేరు "ఒప్పుల కుప్ప"
కంటినొక చామ చిరంటిని - ఆమె
చుబ్రము - ఛాయాంకు బింబము.
పలువలువలు - బింబఫలములు
విశ్వంకరములు - వైసారిణములు
పైంజుషములు - పాథోజములు
చను గవ - జక్కవలు.
సంఘాటిక - స్థిరగంధము
ద్విజన్మములు - మృగేష్టములు
చర్మజములు - కలాపములు
అంతరాళము - సంగ్రహ ప్రమాణము
గండంబులు - లతామణులు
శిరోధరము - షోడశావర్తము
ప్రగండములు - మందారమాలలు
అభివీక్షణములు - రసతూపులు
చర్పటములు - సౌమ్యగంధములు
అంఘ్రిద్వయము - లతాయాతకములు
ఆభాషణములు - రసరమ్య గీతాలు
అందంద శృంగార రమణీలలామ
అవతరించె - మది పులకరించె
మదాస్వనితము - ప్రయోషించె.
"దీనికర్థము నాకొక్కముక్క కూడా తెలియక అతడినే అడిగిన. శంపాలత వైపు ఓరచూపు చూస్తూ ముసిముసి నవ్వులతో అర్థము విడమర్చి చెప్పుతుంటే నేను వ్రాసుకున్న వినండి," అంటూ:
చామ చిరంటి = అందమైన జవ్వని
చుబ్రము = ముఖము
ఛాయాంకు బింబము = చంద్ర బింబము.
పలువలువలు అంటే = పెదవులు
విశ్వంకరములు = కండ్లు
పైంజుషములు = చెవులు
చను గవ = పాలిండ్లు
జక్కవలు = చక్రవాక పక్షులు
పాథోజములు = శంఖులు
వైసారిణములు = చేపలు
సంఘాటిక = ముక్కు
స్థిరగంధము = సంపెంగ
ద్విజన్మములు = పండ్లు
మృగేష్టములు = మల్లెలు
చర్మజములు = వెండ్రుకలు
కలాపము = నెమిలి పించము
అంతరాళము = నడుము
సంగ్రహ ప్రమాణము = పిడికెడంత
గండములు = చెక్కిళ్ళు
లతామణులు = పగడాలు
శిరోధరము = మెడ
షొడశావర్తము = శంఖు
ప్రగండములు = భుజములు
మందార మాలలు = మందార పూదండలు
అభివీక్షణములు = చూపులు
రసతూపులు = శృంగారబాణాలు
చర్పటములు = అరచేతులు
సౌమ్యగంధములు = గులాబీలు
అంఘ్రిద్వయము = పాదాలు
లతాయాతకములు = చిగురుటాకులు
ఆభాషణములు = పలుకులు
రసరమ్య గీతాలు = శృంగార గానాలు
అందంద శృంగార రమణీలలమ = మిక్కిలి అందమైన పడతి
అవతరించె = ఉద్భవించె
మది పులకరించె = మనసుప్పొంగె
మదాస్వనితము = నా మనసు
ప్రయోషించె = దోచుకొనియె.
"ఇంత భావయుక్తంగా వ్రాసుకున్న విష్వక్సేన్ ఈ భంగపాటుకు పాపము ఎంత కృంగిపోతున్నాడో కదా!" అంటుంది అక్షర.
"మరి మేమొక మాట చెబుతాము, ఒప్పుకుంటావా?" అని అడుగుతుంది భవాని. మధ్యలో కల్పించుకుంటూ, "నీ మంచికోరే చెబుతున్నదమ్మా! మీ అమ్మ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. అదీ ఈ రాతిరే," అని అంటుంది సత్యవతి, వీళ్ళ పైన గల చనువుతో.
"ఏమీ లేదమ్మా. నీవు విష్వక్సేన్‌ను ఇష్టపడితే అతనితో నీ పెళ్ళి చేయాలనుకుంటున్నాము. బలవంతమేమీ కాదు. నీవే బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికొచ్చి చెప్పు," అంటుంది భవాని.
ఈ మాటలకు ఒక్కసారే దిగ్భ్రాంతి చెందినట్లు వారిరువురివైపు అదోరకంగా చూస్తుంది అక్షర. అంతలోనే తమాయించుకొని, "అమ్మా! ముందు ఆ శనిగాణ్ణి వదిలించుకోనీయమ్మా! దరిద్రుడు ఎట్లా దాపురించిండో నన్ను ఎంగిలి చేసి వదిలిండు పాపిష్ఠోడు! ఐనా, నా సంగతి యావత్తు తెలిసిన కుటుంబము నన్ను చేరదీస్తుందంటారా? నిష్కల్మషమైన విష్వక్సేన్ ఈ కలుషితాన్ని అంటించుకుంటాడా?" అని ఎన్నో తీర్ల ఎదురు ప్రశ్నలతో ఇద్దరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అక్షర.
అక్షర భాషా భావనలో సత్యవతికి, భవానికి ఒక మెరుపులాంటి అభీష్ట సంకేతము ద్యోతకమవుతుంది. వాళ్ళు అక్కడికే తృప్తి చెంది, శ్రీకంఠకు, భవభూతికి అక్షరతో జరిగిన సంభాషణ వివరిస్తారు.
"అందరూ ఊపిరి పీల్చుకున్నంత తృప్తితో ఆ రాత్రి భోజనాలు చేసి, ఒక మెట్టు ఎక్కగలిగాము. ఇహ రేపు సఫలీకృతులమైతే అదృష్టానికి తిరుగు లేదు," అనుకుంటారు భవభూతి - శ్రీకంఠ.
మర్నాడుదయమే అందరూ లేచి, స్నానాదికాలు ముగించుకొని, భోజనానికి అక్కడికే కదా అనుకుంటూ, చాయ మాత్రము తాగి, "ఎందుకైనా మంచిది అక్షరను మరియొకసారి తన మనసులో ఏమున్నదో ఆమె నోటనే బయట పడేయిస్తే బాగుంటుందనుకుంటూ" అక్షరను పిలుస్తాడు శ్రీకంఠ. అక్షర రాగానే, "అమ్మా! రాత్రి మీ అమ్మ, ఆంటీ నీతో సంప్రదించిన విషయాలు నీకు అవగతమై ఉండవచ్చు. మేమైతే నీ మేలు కోరే రంగములోనికి దిగుతున్నాము. నీకేమైనా అభ్యంతరముంటే ఇప్పుడే చెప్పు తల్లి!" అని నిమ్మళంగా అడుగుతాడు. తెల్లవార్లు నిదుర పోకుండా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చిన మనసు కలదై, అక్షర అంటుంది, "నా మేలు కోరి మీరు ఏది తలపెట్టినా నాకు సమ్మతమే," అని నిర్మొహమాటంగా చెబుతుంది అక్షర.
అందరూ సంబురపడి భద్రాచలము ఇంటికి పోతారు.
వీళ్ళ రాకకై ఎదురు చూస్తున్న భద్రాచలం - స్నేహశీల - విష్వక్సేన్, వీళ్ళను సాదరంగా లోనికి ఆహ్వానించి, కూర్చోమంటారు మర్యాద కనపరుస్తూ.
"మేము పలహారము, చాయ ముగించుకొనే వచ్చినము. ఇక నేరుగా భోజనాలే చేసిపోతాము," అంటూ శ్రీకంఠ భద్రాచలాన్ని, "మీతో ఒక ముఖ్యమైన పని ఉన్నది, మీ దాబ మీదికి పోయి మాట్లాడుకుందాము. పది నిమిషాల కొరకు స్నేహశీలను కూడా రమ్మను," అంటుండగానే అక్కడనే ఉన్న స్నేహ శీల, "అదేమి పనో? పదండి పోదాము," అని మిద్దెపైకి పోతారు ముగ్గురు. "మొదట మీ విష్వక్సేన్ ఎట్లున్నాడు పాపము? అతడు జరిగినదానికి కుమిలిపోతూ ఉండవచ్చు. మమ్ముల చూడగానే లోపలికి వెళ్ళిపోయిండు," అంటాడు శ్రీకంఠ. "అవునండి అన్నయ్యగారు. మావాడు ఎంతో నిరుత్సాహానికి లోనై మనసులోనే కుమిలిపోతున్నాడు. ఆ శంపాలతకన్నా ముందే వాని పెళ్ళి వేరెవరైనా అమ్మాయి కుదిరితే చేద్దామనుకుంటున్నాము. కానీ, భగవంతుని అనుగ్రహం ఎట్లుంటుందో! మీకెవరైనా తెలిస్తే చెప్పండి," అని కంట తడి పెట్టుకుంటుంది స్నేహ శీల. "అమ్మా! మీరు కొన్ని ఆదర్శాలు వదులుకుంటే నాకు తెలిసిన సంబంధమొకటి చూపిస్తాను. నిన్న భద్రాచలంతో కూడా ఇదే మాట అన్నాను. మీరు ధైర్యము చేసి మీ విష్వక్సేన్‌ను కూడా ఒప్పించగలుగుతే, నా ప్రయత్నము నేను చేస్తాను," అంటాడు శ్రీకంఠ. "కడుపులో మాడుతుంటే మడి అంటే ఆకలి ఆగదు కద అన్నయ్యగారు? మీ ఆలోచన ఏమిటో చెప్పి పుణ్యము కట్టుకొండి," అంటుంది స్నేహశీల.
శ్రీకంఠ తన ఇంట్లో గతరాత్రి అక్షరతో మాట్లాడిన విషయాలన్నీ పూస గుచ్చినట్లు వివరిస్తాడు దంపతులిద్దరికీ. "అక్షరను మీరిప్పుడే చూసి ఉండవచ్చు. వెదుకబోయిన తీగ కాలికి తగిలినట్లు భవభూతి - భవాని - అక్షర ఇప్పుడు మీ ఇంట్లోనే మీ ఆతిథ్యము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మీకిష్టమైతే మీ విష్వక్సేన్‌ను కూడా అడిగి అతని అభిప్రాయము తెలుసుకుంటే అంతా సవ్యంగా జరిగిపోతుంది. ఇంతకు ముందే భద్రాచలము భవభూతితో 'నక్కను తొక్కి వచ్చినావు' అన్నాడు. ఆ మాట సార్థకము కానీయండి," అంటాడు శ్రీకంఠ.
"సరే, రోగి అదే కోరుకున్నాడు, వైద్యుడు అదే కోరుకున్నాడు అన్నట్లు, మానవుడు ప్రతిపాదిస్తే భగవంతుడు పరిష్కరిస్తాడు" అను ఇంగ్లీషు నానుడి ప్రకారము మాకు అభ్యంతరానికి ఆస్కారము లేకుండా దారి చూపుతున్నారు. "మా విష్వక్సేన్‌ను కూడా సంప్రదించి కార్య రూపం దాల్చేటట్లు ప్రయత్నించుతాము. స్నేహితుణివైనా నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను," అని శ్రీకంఠ రెండు చేతులు పట్టుకుంటాడు భద్రాచలం. ముగ్గురూ క్రిందికి దిగివస్తారు సంతోషంగా.
వీళ్ళ హావభావాలు బేరీజు వేసుకున్న భవభూతి - భవాని లోలోపల సంతోషిస్తారు. అక్షర కూడా కొంత హర్షించినట్లే ఆమె చూపులను బట్టి గమనించవచ్చు.
అందరూ బరువు దింపుకున్నవారై, "ఇక చివరి ఘట్టం విష్వక్సేన్‌ను ఒప్పించడమే," అనుకుంటారు.
అనుకున్నదే తడవుగా, చిన్ననాటినుండి తల్లి మాటే వేదవాక్కుగా భావించే విష్వక్సేన్‌ను పిలిచి, అతని అరలోనికి పోయి, "నాయనా! నువ్వట్లా దిగులు చెందితే నా ప్రాణము తల్లడిల్లి పోతుందిరా. నీ మేలు కోరి నేనొక మాట చెబుతాను, కాదనవు కద?" అని ముందే నోటికి తాళం వేస్తుంది స్నేహశీల. "ఏమిటమ్మా! హఠాత్తుగా అంత మాట అంటున్నావు?" అని ఎదురు ప్రశ్న వేస్తాడు సందేహిస్తూ విష్వక్సేన్. "ఈ రోజు ఉదయమునుండి చూస్తున్న నీ వాలకము. సృష్టి ఏమి మునిగి పోలేదు. ఆ అమ్మాయి కాకపోతే దాని జేజమ్మ దొరుకుతుంది. దానికంటే ముందే నీ పెళ్ళి చేయాలని అనుకుంటున్నాము. పిల్ల ఎవరో కాదు, మన కండ్ల ముందర ఉన్న అక్షర," అంటూ కుండ బ్రద్దలు కొట్టినట్లు చెబుతుంది కొడుక్కు.
తల్లి చెప్పిన ఊహించని మాటకు ఆశ్చర్యపోతూ, "అమ్మా! వాళ్ళతో మనకు పందెం ఎందుకు? ఐనా అక్షర పెళ్ళైన పిల్ల. అటువంటి దానిని మన స్వార్థానికి ఊహించుకోవడము పాపమమ్మా! అసలు మీకీ ఆలోచన ఎట్లా వచ్చింది? వాళ్ళు గనుక వింటే ఏమనుకుంటారు? నాన్నగారితో వాళ్ళ స్నేహము బెడిసిపోదా?" అని ఏవేవో అంటుంటే, స్నేహశీల, భవభూతి, అతని భార్య భవాని, ఇంకా అక్షరతో సంప్రదించిన విషయాలన్నీ వివరంగా చెప్పి, ఎట్లైతేనేం కొడుకును ఒప్పిస్తుంది స్నేహశీల. ముసిముసి నవ్వులు నవ్వుతూ బయటకొస్తుంది, అందరికి అదే సఫలీకృత సమాచారమన్నట్లు.
అందరూ ఒక్క దగ్గరనే కూర్చొని భోం చేసి, కాస్త విశ్రాంతి తీసుకుంటుంటే, విష్వక్సేన్ - అక్షర అప్పుడే ఒక్కటైనట్టు సంబరపడిపోతూ ముచ్చటించుకుంటారు.
అక్షర - కార్తీక్ ఇద్దరూ ఇష్టపడ్డందున, వాళ్ళ విడాకులకు తొందరగానే అనుమతి లభిస్తుంది.
విష్వక్సేన్ - అక్షర పెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్‌తో జరిగి ఒక్కటౌతారు.
ఆదర్శ భార్యా భర్తలుగా జీవిస్తారు.
శుభం.
సుదర్శన రావు పోచంపల్లి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.




Comments