top of page
Original.png

ఈనాటి ఈ బంధం ఏనాటిదో

#SurekhaPuli, #సురేఖపులి, #EenatiYeeBandhamEnatido, #ఈనాటిఈబంధంఏనాటిదో, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు 


Eenati Yee Bandham Enatido - New Telugu Story Written By Surekha Puli

Published in manatelugukathalu.com on 18/02/2026

ఈనాటి ఈ బంధం ఏనాటిదో - తెలుగు కథ

రచన: సురేఖ పులి


ప్రభుత్వ సంస్థ నష్టాల్లో కూరుకున్నదని, ఇంకా పదేళ్ళ సర్వీస్ ఉన్న ఆశయ్యకు యాజమాన్యం ‘బలవంతపు పదవీ విరమణ’ అంటగట్టారు. పెన్షన్ ఇంకా స్థిరపడలేదు, పెన్షన్ ఆఫీసుకు వెళ్లి వాకబు చేస్తే కనీసం వెయ్యి రూపాయలు కూడా రాని పెన్షన్ కోసం అంతగా కష్టపడి తిరిగే బదులు చిన్నదైన, ప్రైవేట్ నౌకరి చేసుకోమని హితబోధ చేశారు, కడుపులో చల్ల కదలకుండా టంచనుగా జీతాలు తీసుకుంటున్న ఇతర ఆఫీసుల్లోని ఉద్యోగులు.


బలవంతంగా ఉద్యోగం పోయినందుకు ఒంటరిగా బాధ పడుతూ, ముభావంగా ఉంటున్న నాన్నను చూడలేకపోయాడు అంజన్. ఉద్యోగం సంపాదించాలి, ఇంటి బరువును తన భుజాలు మోయాలి. అమ్మ నాన్నలకు ఊరట కలిగించాలి; చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, నిర్ధారణ చేసుకున్నాడు.


అంజన్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. అల్లారుముద్దుగా, బుద్ధిగా పెరిగాడు. హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగుల సమస్య తరగని తరుణంలో ‘హోటల్ అంగారక’ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో మొదటి రౌండ్ సఫలమైంది. మిగతా రెండు రౌండ్స్ హోటల్ యాజమాన్యం ముఖాముఖి ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఎంతో ఆశగా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ దిగి ‘హోటల్ అంగారక’ దిశగా వెళ్ళాడు అంజన్.-----హోటల్ లోపల అడుగు పెట్టగానే మిరుమిట్లు గొలిపే కాంతివంతమైన ఎరుపు రంగు విద్యుత్ దీపాలు చూస్తుంటే అంగారక గ్రహంలో అడుగుపెట్టినట్టు ఉంది. రూమ్ తీసుకొని, ఫ్రెష్ అయ్యి కిటికీ నుండి కిందకి చూశాడు. బయట సన్నజల్లు కురుస్తోంది. జనం బారులు తీరి హోటల్ ముందు నిలబడ్డారు.


“ఏదైనా పోలీస్ కేసా?” అంజన్ రిసెప్షన్‌లో అడిగాడు.


“సర్, జంటనగరాల్లో అంగారక బిర్యానీ చాలా ఫేమస్! టేస్టీ, యమ్మీ బిర్యానీ కోసమే ఈ రష్! ముఖ్యంగా సెలవు రోజుల్లో అయితే టోకెన్ తీసుకొని కనీసం గంట వేచి చూస్తే గానీ బిర్యానీ దొరకదు.” అంది రిసెప్షనిస్ట్.


బిర్యానీ ఎక్కువ ఖరీదు అనిపించినా, అతిశయోక్తి నిజమెంతో చూడాలనుకున్నాడు. టోకెన్ తీసుకొని అల్లకల్లోలమైన జనాల మధ్య కూర్చున్నాడు. ఎండా, వానా ప్రత్యక్షంగా ప్రసరణకు దారి లేక కేవలం వెలుగు మాత్రం ప్రసరించేట్టు ఎత్తుగా ఉన్న హాల్ రూఫ్ రంగు నగిషీ చెక్కిన పలకల గాజుతో కప్పబడి ఉంది. అత్యధిక ఆకలితోనో లేక వ్యామోహమో బిర్యానీ కోసం వేచి ఉన్న భోజన ప్రియులు ఆహ్లాదంగా స్ప్లాష్ నీటి తుంపర్లు ఆస్వాదిస్తున్నారు.


మైక్‌లో తన టోకెన్ నెంబర్ విని డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. సువర్ణాక్షరాలతో ‘అంగారక’ హోటల్ బ్యాడ్జితో ఎరుపు రంగు యూనిఫార్మ్, మెడలో టై, నీట్‌గా టక్ చేసుకున్న హోటల్ సిబ్బంది, వచ్చిన కస్టమర్స్ అందరూ సంతృప్తి చెందాలని హడావిడిగా తిరుగుతున్నారు. కమ్మటి హైదరాబాద్ బిర్యానీ, సుగంధ ద్రవ్యాల వాసన ముక్కు పుటాలను చేరుతున్న ఆహ్లాదకరమైన అరోమా!


ఏదో మత్తు, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కాళ్ళు గాల్లో తేలిపోతున్నాయి. కష్టంగా చుట్టూ చూశాడు, ఈ హోటల్ నాది, మరి... ఇక్కడున్న సినిమా థియేటర్ ఏమైంది?! చుట్టూ పరిసరాలు తిరుగుతున్నట్టు ఉంది. ‘ఇది నా స్వార్జితం’... అంజన్ అరవబోయాడు, మాట గొంతులో ఇరుక్కుంది. తూలి పడిపోతున్న సమయాన ఎవరో పట్టుకున్నారు.-----సెప్టెంబర్ నెల, కుండపోతగా వర్షం కురుస్తోంది. ప్రాంతీయ రేడియో వార్తలు వినబడుతున్నాయి, ‘భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో విపరీతమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి అయితే ఇల్లు వదిలి వెళ్ళాలి’ ఇంతటి దుస్థితి ఎదుర్కొని ప్రయాణం చేయాలా? సేఠ్ సందిగ్ధావస్థ చెందాడు.


వ్యాపారం అంటే ప్రమాద కారకాలు తప్పవు, ప్రతి శుక్రవారం కొత్తదనం కోసం ఎదురుచూసే ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక వినోదం సినిమా! అందరి తృప్తి, నా వ్యాపార సంతృప్తి! జీరో స్థాయి నుండి మొదలుపెట్టిన థియేటర్ వ్యాపారం లాభాల పంథాలో పరుగు పెడుతున్నది. ఏకాగ్రత, పట్టుదల కలిగిన అంజయ్య, సినిమా థియేటర్ యజమాని సినిమా రీల్ పంపిణీదారునితో పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో రాబోయే శుక్రవారం కొత్త సినిమా విడుదల చేయాలని వాన-వరద లెక్క చేయక స్వయంగా బయలుదేరాడు.


“సంజీవ, నన్ను స్టేషన్‌లో వదిలి ఇంటికి తొందరగా వెళ్ళు, ఈ వాన ఉధృతి పెరిగి తుఫాను రావొచ్చు, జాగ్రత్త!” కారు డ్రైవర్‌కు హెచ్చరిక చేసి ఆదరబాదరగా రైల్వే స్టేషన్ లోపల అడుగు పెట్టగానే నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగు పెట్టింది. ఏ మాత్రం ఆలస్యం చేయక రైల్వేస్టేషన్ బయటకు వచ్చి సంజీవ ఉన్నాడేమో అని నలుదిక్కులు చూశాడు. కనబడలేదు, ఆలస్యం చేయక టాక్సీ ఎక్కాడు.


“మీటర్ మీద నీకు అదనంగా డబ్బులు ఇస్తాను, నన్ను చూసి పారిపోయిన నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలును పక్క స్టేషన్‌లో పట్టుకోవాలి. నా ప్రయాణం ముందుకు సాగాలి. జల్ది, మేరే భాయి, తేజ్... జల్ది పోనీయ్!” ప్రయాణికుని అరుపుకు టాక్సీ డ్రైవర్ వేగం పుంజుకున్నాడు.


“సేఠ్ జీ, ఇంత జోరు వానలో బండి ఎక్కడైనా ఆగిపోయిన, మునిగిపోయిన మీరు నష్టం భరించి నాకు సహాయం చేయాలి” ముందు జాగ్రత్తగా విన్నవించుకున్నాడు.


“శ్రద్ధాసక్తులతో పని చేయడం వరకే మన వంతు, ఫలితం భగవదేచ్ఛ!.. నాకు నీ మీద నమ్మకం, నీకు నా మీద నమ్మకం ఉన్నాయి; కనుక బతుకు ముందుకు సాగుతుంది. శీఘ్రం సామీ!” వేదాంతం చెబుతూనే ఆజ్ఞాపించాడు సేఠ్.-----వర్షం జోరు పెరిగింది, వేగంగా వచ్చిన టాక్సీ రైల్వే స్టేషన్‌లో ఆగింది. అడిగిన డబ్బు డ్రైవర్ చేతిలో పెట్టి, పరుగున స్టేషన్ లోపలికి వెళ్ళాడు. తన్ను తప్పించుకున్న, తన కోసం ఎదురుచూస్తున్న రైలు ఎక్కాడు. రైలు గమ్యస్థానం వైపు పరుగు పెట్టింది.


జనగాం స్టేషన్ సమీపిస్తుంది, ఘోర వర్షాల కారణంగా నీరు ఉధృతంగా ప్రవహిస్తూ వాగుపై చేరుకునే సమయంలో మూడు అడుగుల మేర పట్టాలు మునిగిపోయాయి. సిగ్నల్‌తో రూట్ క్లియర్‌గా ఉందని భావించిన రైలు డ్రైవర్ రైలును ముందుకు తీసుకెళ్లాడు. వాగు ఉధృతి పెరిగింది. బోగీలు వాగులో కొట్టుకుపోయాయి. కొందరు ప్రయాణికులు గాయపడ్డారు, మరెందరో ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్షంగా తన నిర్దోషిత్వం లేదని రుజువు అయినా క్రమశిక్షణ, నియమ నిబద్ధత గల కేంద్ర రైల్వేశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ అంజయ్య శ్రమను గుర్తు చేస్తూ పేరెన్నికగన్న వ్యవస్థాపకుడు, కష్టజీవి అని వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.-----‘హోటల్ అంగారక’లో మూర్ఛపోయిన అంజన్, అంగారక గ్రహంపై కాలు మోపాడు. ఒంటరితనం, నిశ్శబ్దం జత కుదిరినందుకు అంజన్ మనసులో భయం పెరిగింది. సూర్యునికి దగ్గరగా ఉన్నట్లు, అగ్నిగోళం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు అమితమైన వేడి! గ్రహం యొక్క ఉపరితలం అసమానంగా దుమ్ము, చిన్న రాళ్ల తుఫానుతో వాతావరణమంతా అస్తవ్యస్తంగా ఉంది.


“అంజన్...” సింహాసనంపై కూర్చుని ఒక సామ్రాజ్యాధికారి గెటప్‌లో ఆహ్వానిస్తున్నారు. పిలుపు విని చుట్టూ పరిశీలించి చూశాడు. ఎరుపు రంగు కాంతి ప్రసరిస్తూ... అదేదో పబ్ లాగా ఉంది.


“కూర్చో. భయపడకు, నేను అంగారకుడను, అంటే కుజుడు; సౌర కుటుంబంలో నాలుగో గ్రహం. ఇక్కడేమీ అపాయం లేదు.”


“సర్, ఈ ఎరుపు రంగు...? అంతటా రక్తం పులిమినట్టు... భయమేస్తుంది. మీరు ఒక్కరే ఉంటే భయం లేదా అంగారక గారు?”


“మీ భూమండలంలో ఉన్నట్టు ఇక్కడ భయాలు, దుర్మార్గాలు ఉండవు; అప్పుడప్పుడు దుమ్ము తుఫానులు ఉంటాయి. అవి పర్యావరణాన్ని కలుషితం చేయదు. ఎర్ర రంగు అంటావా...?

అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న సూక్ష్మ ధూళి కణాలు (ఐరన్ ఆక్సైడ్) సూర్యరశ్మిని గ్రహించి, ఎరుపు రంగు కాంతి ఎక్కువగా ప్రతిబింబించడం వలన కుజ గ్రహం ప్రకాశవంతంగా వాతావరణ అంతర్దృష్టిని తెలియజేస్తుంది.”


“అవునా? ఎంత లక్కీ మీరు? మీరు చేస్తున్న గొప్ప పనులేంటి, మేము చేస్తున్న నీచమేంటి?”


“చెప్తాను, శ్రద్ధగా విను. విశ్వజనీనమైన పర్యావరణ కాలుష్యం వలన మానవ ఆరోగ్యం, ప్రవర్తన ప్రతిబింబిస్తూ విపరీత ప్రభావం చూపుతుంది. ఇది సామాజిక సమస్య. మీరు ప్రకృతి కాలుష్యం చేస్తున్నారు.


“అర్థమైంది, ఏదైనా మంచి ఉపాయం చెప్పండి సర్.”


“మీరు ఒక విషవలయంలో ఉంటూ, రాబోవు కాలంలో భవిష్యత్తు లేదనే ప్రపంచంలో బ్రతుకుతున్నారు. స్వచ్ఛతకు, పచ్చదనానికి దూరంగా ఉంటూ అనేక ఆరోగ్య సమస్యలతో ఇరవైలోనే అరవైని చూస్తున్నారు.”


“సర్, ఇక్కడ కూర్చొని హాయిగా ఎన్నయినా చెపుతారు. మనిషి జీవితం అంత ఈజీ కాదు. రెడీమేడ్ గా అన్నీ దొరికే మీకు; కడుపు ఆకలి, కష్టజీవి శ్రమ తెలియవు. ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలకు ‘బలవంతపు పదవీ విరమణ’ అని, ‘గోల్డెన్ షేక్ హ్యాండ్’ అని పక్కలో బల్లెం అయ్యి గుచ్చుకుంటుంటే పచ్చని కాపురాల్లో చిచ్చు రగులుతున్నాయి. ఇక మా అంతరంలో అసమానత అంటారా!? దేవుడు మా లోకంలో అవతరిస్తే అంతం అవుతుంది. ఐ మీన్ ‘యుగాంతం! మీరు, మేము ఎంత తాపత్రయ పడినా వేస్ట్... దండుగ!”


“దేవుళ్ళు, రాక్షసులు... ఎవరో వచ్చి మిమ్మల్ని సరి చేయాలా? మీకు మీరు బుద్ధిగా ఉండలేరా?”


“ఉండలేము. ప్రతి ఇంటికి ఒక ఇంటి పెద్ద ఉంటారు; తరగతిలో మాస్టర్ ఉంటారు. ఇంతెందుకు మా స్వరాజ్య పోరాటంలో కూడా ఓ పెద్దాయన, మీకు తెలుసనుకుంటాను... గాంధీ గారు మాకు నాయకత్వం వహించారు. అలాగే, భూగోళాన్ని కూడా దేవుడే దేవలోకం నుండి భూలోకంలో మానవుడిగా అవతరించి మమ్మల్ని రక్షించాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేది ఆ భగవంతుడు ఒక్కడే! మీకు చేతనైతే రికమెండ్ చేయండి.”


“ఇక ఆధారపడటం మానండి. మీలో... ఒక మహాకవి శ్రీశ్రీ రచన మననం చేసుకో... ‘ఎవరో వస్తారని, ఎదో చేస్తారని...’ ఇలా ఎందరో మహానుభావులు ఎంత సద్బోధన చేసినా, మీలో మార్పు రావాలని అనుకోరు.”


“‘కాలంతో పాటు ఎన్నో మార్పులు చేసిన మానవ కృత్రిమ మేధస్సు మీ వరకు రానట్టుంది సార్...? మీ నెట్‌వర్క్ చాలా తక్కువ స్థాయిలో ఉందనుకుంటా!”


“వచ్చింది, జోహార్లు! మీ యువత భవిష్యత్ నిర్దేశకులు; కాదనను. దీనికి సమాంతరంగా మనసుల కాలుష్యం పెకిలించాలి అంటే అవినీతి, దరిద్రం, మోసం, మానభంగాలు, పసికూన పైశాచికం వంటి దుష్టశక్తులను దరికి రానివ్వద్దు. సహజ వనరుల సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని, పరస్పరం సుహృద్భావం పెంచుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి.”


“మహాప్రభు! అప్పుడు మాకు మేమే దేవుళ్ళు!”


“ఇప్పుడు సరైన విషయానికి వచ్చావు... మీరు కూడా ఎవరికి వారే దేవుళ్ళు కావాలి. ఇదే ఆదర్శంగా తీసుకోవాలి.”


“అంత ఈజీ కాదేమో సర్! అయినా ప్రయత్నిస్తాము!”-----అంజన్ హెచ్.ఆర్. రౌండ్ నెగ్గాడు. చివరి రౌండ్, ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న అనూజ్ సి.ఇ.ఒ. చూచాయగా ఇంటర్వ్యూ తీసుకున్నా, అంజన్ సూటిగా సమాధానం చెప్పాడు. తాతగారు అంజన్ రూపంలో వచ్చి కనబడుతుంటే ఆనందాశ్చర్యాలతో మురిసిపోతూ తన ఫోన్లో తాతగారితో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోలు చూసుకున్నాడు.


“మిస్టర్ అంజన్, మీరు డెలివరీ బాయ్ పోస్ట్ కోసం అప్లై చేశారు. కానీ మీ రిక్రూట్‌మెంట్ ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ మేనేజర్ అని మా బోర్డు నిర్ణయించారు. ఒక వారంలో డ్యూటీ జాయిన్ కావాలి. నెల రోజుల మీకు ఓరియెంటేషన్ ఉంటుంది.


“థాంక్యూ సర్... ఒక్క పర్సనల్ డౌట్...? ఏమీ అనుకోకండి, ఇంత మాస్ జాబ్స్?”


“ఎస్, అందరూ అర్హత కలిగిన నిరుద్యోగులు. అందరికీ జీవనభృతి అవసరం! ఇతర వనరుల కంటే మా బిజినెస్ విస్తరణకు మ్యాన్ పవర్, మానవ వనరులు అత్యధికంగా అవసరం.


ఈ సంస్థ, మా తాతగారు జీరో లెవల్ నుండి ఎంతో కష్టపడి అభివృద్ధి చేశారు. అఫ్కోర్స్, అప్పుడు సినిమా థియేటర్ ఉండేది, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ‘హోటల్ అంగారక’ రూపు దిద్దుకొని ఒక బ్రాండ్ అయ్యింది! మీరు శ్రద్ధాసక్తులతో మన సంస్థను అభివృద్ధి చేయాలి.” యజమాని క్లుప్తంగా వివరణ ఇచ్చారు.


“తప్పకుండా సర్.” అంజన్ రెండు చేతులెత్తి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు. ‘హోటల్ అంగారక’ అందమైన బ్రోచర్ అందిస్తూ “విష్ యూ గుడ్‌లక్” బాస్ కరచాలనం వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చింది అంజన్‌కు.-----అంజన్ సంతృప్తిగా ఆనందాన్ని అమ్మానాన్నలతో పంచుకున్నాడు. ఆశయ్య ఫోన్లో కనబడుతున్న కొడుకు ఫోటో మనసుకు హత్తుకున్నాడు, కళ్ళలో ఆనందబాష్పాలు నిండుకున్నాయి.


సమాప్తం.

*****

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 

పేరు :సురేఖ  ఇంటి పేరు: పులి

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.

ప్రస్తుత నివాసం బెంగళూరు  విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.  స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008  లో స్వచ్ఛంద పదవీ విరమణ.

చందమామ, యువ, స్వాతి,  ఈనాడు,  మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే  లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.

Surekha Puli 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page