వాగుడు

Vaagudu - Telugu Family Story | Jeedigunta Srinivasa Rao
వాగుడు - తెలుగు కుటుంబ కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 11/10/2026
“వాగుడు” ఒక చక్కని కుటుంబ, సామాజిక సందేశాత్మక తెలుగు కథ.
ఉద్యోగంలో మౌనంగా ఉండే సోమశేఖర్ రిటైర్ అయిన తర్వాత అతిగా మాట్లాడటం మొదలుపెడతాడు. భార్య సుమ చెప్పిన మాటలతో తన ప్రవర్తనలోని మరో కోణాన్ని గుర్తిస్తాడు. మౌనం, వాగుడు రెండింటికీ మధ్య సమతుల్యతే మంచి జీవితానికి మార్గమని ఈ కథ చెబుతుంది.
సోమశేఖర్ ఆఫీసులో ఎంత సీరియస్‌గా ఉంటాడో, ఇంట్లో పెళ్లాంబిడ్డలతో కూడా అంతే సీరియస్‌గా ఉండేవాడు. భార్య సుమ ఏదైనా సలహా అడిగితే, "నీకంటే నాకు ఎక్కువగా ఎంత తెలుసు? నీకు తోచినట్టు చెయ్యి," అనేవాడు.
వీళ్లకు ఒక బాబు, ఒక పాప. ఎప్పుడూ ఏమీ మాట్లాడని సోమశేఖర్, తన కొడుకు బారసాల అప్పుడు నోరుతెరిచి, "పిల్లాడి పేరు వెంకటేష్ అని పెట్టండి, అది మా నాన్న పేరు," అన్నాడు.
కూతురు పేరు పెట్టేటప్పుడు అసలు సోమశేఖర్ జోక్యం చేసుకోలేదు. దానితో సుమ తన తల్లి పేరు కౌసల్య అని పెట్టుకుంది.
"ఏమండీ, పెళ్లయిన కొత్తల్లో వసపిట్టలా మాట్లాడుతూ ఉండేవారు కదా! ఇప్పుడు ఏమైందని ఇలా సైలెంట్‌గా ఉంటున్నారు? నావల్ల ఏదైనా పొరపాటు జరిగిందా?" అని భర్తని అడిగింది.
ఒకసారి భార్య వంక చూసి, "తప్పు నీ వల్ల కాదు, ఎందుకో ఎక్కువగా మాట్లాడకూడదు అనిపించి మాట్లాడటం లేదు," అంటూ ఆఫీస్ కార్ ఎక్కి వెళ్ళిపోయాడు.
"ఏమయ్యా సోమశేఖర్, అసలు నీ నోట్లోనుంచి మాట రాదేం? బాధ్యతగల ఇంజనీరువి, కాంట్రాక్టర్‌తో మన ప్రాజెక్ట్ గురించి చెప్పకపోతే క్వాలిటీ పని ఎలా జరుగుతుంది?" అంటూ దులపరించాడు చీఫ్ ఇంజనీర్.
ఇంటి నుంచి తెచ్చుకున్న లంచ్ బాక్స్ దగ్గర పెట్టుకుని ఆలోచనలో పడ్డాడు. 'అవును, అందరిలా ఎందుకు హాయిగా మాట్లాడలేకపోతున్నాను? డిప్యూటీ ఇంజనీర్‌గా ఉన్నప్పుడు స్టాఫ్‌తో కలిసిపోయి హుషారుగా ఉండేవాడిని. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాగానే స్టాఫ్‌తో చనువుగా ఉండకూడదని గిరి గీసుకుని ఉంటూ, ఇంట్లోవాళ్లతో కూడా అలా ఉండటం ఎందుకు అలవాటు చేసుకున్నాను?' మారాలి అనుకున్నాడు.
లంచ్ బాక్స్ కడగటానికి వచ్చిన అటెండర్ సుబ్బన్నని చూసి, "సుబ్బన్నా, కింద ఉన్న బాక్స్‌లో అమ్మగారు ఏదో స్వీట్ పెట్టింది, నేను ముట్టుకోలేదు. ఇష్టం ఉంటే నువ్వు తీసుకో," అన్నాడు.
'ఎప్పుడూ లంచ్ చేసి వెళ్ళిపోయే సార్ ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడారేమిటి?' అనుకున్నాడు అటెండర్.
'అబ్బా! నోరు విప్పి అటెండర్‌తో నాలుగు మాటలు మాట్లాడగానే ఎంతో హాయిగా అనిపించింది,' అనుకున్నాడు సోమశేఖర్.
'భర్త దుమదుమలాడుతూ వస్తాడు, వంట చేసి రెడీగా పెట్టడం మంచిది' అని సుమ వంటగదిలోకి వెళ్ళింది.
బయట కార్ చప్పుడు వినిపించడంతో 'వచ్చారు అనుకుంటా' అనుకుంటూ మంచినీళ్ల గ్లాస్ పట్టుకుని హాలులోకి వచ్చింది. సోమశేఖర్ తన చేతిలోని బ్యాగ్ భార్యకి ఇచ్చి, మంచినీళ్ల గ్లాస్ తీసుకుని, "అలా ట్యాంక్‌బండ్ వైపు వెళ్దాం, నువ్వు పిల్లలు తయారవ్వండి," అన్నాడు.
తనని తాను గిల్లుకుంటున్న భార్య వంక చూసి, "ఏమిటి, ఆశ్చర్యంగా ఉందా? ఏదో పిల్లగాలి కోసం... సారీ, చల్లగాలి కోసం, అంతే. పానీపూరి కోసం పిల్లలు తహతహలాడుతున్నారు, తినిపిస్తాను," అన్నాడు నవ్వుతూ.
తయారయ్యి బయటకు వస్తే కార్ లేదు. "కారేదండి?" అంది సుమ.
"అది గవర్నమెంట్ కార్, ఓన్లీ ఆఫీస్ పనికి మాత్రమే వాడుకోవాలి. మనం క్యాబ్‌లో వెళ్దాం," అన్నాడు.
"అంటే మీ చాదస్తం పూర్తిగా వదల్లేదన్నమాట! మీ తోటి ఆఫీసర్స్ ఆదివారం కూడా గవర్నమెంట్ కార్లు ఇంటిదగ్గర పెట్టుకుంటున్నారు," అంది.
"చూడు సుమా, మా నాన్న మాకు కొన్ని మాటలు చెప్పాడు. అందులో 'మన సొంత పనులకు మనది కాని వస్తువులు వాడుకోకూడదు' అని. నేను ఇంతే, నా పిల్లలు పెద్దయిన తరువాత కూడా ఇలాగే నియమాలు పాటించాలి," అన్నాడు.
క్యాబ్ ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఆగింది. టికెట్లు తీసుకుని లోపలికి వెళ్లిన తరువాత సోమశేఖర్ చిన్నపిల్లాడైపోయాడు. పిల్లల కంటే ముందు రైడ్స్ ఎక్కడం, పీచుమిఠాయి తింటూ పిల్లలతో పరుగులు తీస్తుంటే, పెళ్లయిన కొత్తల్లోని సోమశేఖర్ కనిపించాడు సుమకి. 'ఎప్పుడూ ఇంత హుషారుగా ఉంటే బాగుండును' అనుకుంది.
"సుమా, ఇటురా, పానీపూరి తిందాం!" అని అరిచాడు.
"నాకు వద్దు, మీరు తినండి," అని చేతులూపింది. భర్త వచ్చేలోపు అక్కడే ఉన్న చిలుక జోష్యం వాడి దగ్గరికి వెళ్ళి కార్డు తీసింది. "ముందు జీవితం ఆనందంగా ఉంటుంది," అని విని "హమ్మయ్య" అనుకుంది.
జీవితం ఆనందంగా జరుగుతూ ఉండగానే సోమశేఖర్ రిటైర్ అయ్యాడు. అసలు కథ ఇప్పుడే మొదలైంది.
రోజూ ఎవరికో ఒకరికి ఫోన్ చేసి గంటల తరబడి మాటలు; టేబుల్ మీద పెట్టిన కాఫీ కూడా చూసుకోకుండా మాటలు! తరువాత ఎప్పుడో చూసుకుని, "ఏమిటి, చల్లటి కాఫీ ఇచ్చావు?" అనడం.
ఏవో ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ పెట్టి, అవి వచ్చేసరికి మేడమీద ఎవ్వరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండటం; కొరియర్ వాడు "ఓటీపీ చెప్పండి" అని తనను చంపేయడం!
"కొద్దిగా సాయంత్రం వరకు ఎవ్వరికీ ఫోన్ చెయ్యకండి. తోచకపోతే నాకు ఏవైనా కూరగాయలు తరిగి ఇవ్వండి," అంది సుమ.
"మాట్లాడకపోతే 'మాట్లాడరు, ముంగిసలా ఉంటే ఎలా' అని గొడవ. ఇప్పుడు ఏదో మా బ్రదర్స్‌తో మాట్లాడుకుంటూ ఉంటే 'ఎందుకు అలా గంటలు గంటలు మాటలు? ఒకరిమీద ఒకరు చెప్పుకోవడమే తప్ప పనికివచ్చే మాటలు ఏమైనా ఉన్నాయా' అంటావు," అన్నాడు.
"నామీదకి తోసేయకండి, నేను అలా అనలేదు. 'రోజూ గంటల కొద్దీ మాటలు ఎందుకు' అన్నాను. అలా మాట్లాడే బదులు యోగా నేర్చుకోండి," అంది సుమ.
"ఇది కూడా యోగానే! లంగ్స్‌కి, నోటికి ఒకేసారి పని పడటం వలన ఫ్యూచర్‌లో నోరు పడిపోదు, లంగ్ ప్రాబ్లమ్ రాదు, తెలుసా?" అన్నాడు.
"ఏమోగానీ, మొన్న మీ తమ్ముడి భార్య అంది, 'ఉదయం మాకు బావగారి ఫోన్‌తో మొదలు, కుదిరితే మళ్ళీ సాయంత్రం కూడా' అని అంది. సిగ్గేసింది! వారానికి ఒకసారి ఫోన్ చేసుకుని మాట్లాడుకోండి," అంది.
"సరే, చూద్దాంలే," అని బెండకాయలు తరగడం మొదలుపెట్టాడు.
సుమ మాటలు విన్నాక సోమశేఖర్ కాసేపు మౌనంగా ఆలోచనలో పడ్డాడు. ఉదయం నుంచి తమ్ముడితో గంటలసేపు మాట్లాడి అతని భార్యకు ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదు, ఇటు సుమ ఒక్కత్తే అన్ని పనులు చేసుకోలేక పడుతున్న బాధ చూడటంతో సోమశేఖర్‌కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది.
"చూడు సుమా..." అన్నాడు సాధువుగా. "ఉద్యోగంలో ఉన్నప్పుడు 'హోదా' అనే గిరి గీసుకుని మౌనంగా ఉండి అందరికీ దూరమయ్యాను. ఆ తప్పు తెలుసుకుని మార్పు తెచ్చుకున్నాను. కానీ రిటైర్మెంట్ అయ్యాక ఆ ఖాళీతనాన్ని భర్తీ చేసుకోవడానికి, మళ్ళీ అందరినీ చేరువ చేసుకోవాలనే తాపత్రయంలో 'అతిగా మాట్లాడటం' అనే మరో గిరిలో చిక్కుకున్నానన్నమాట," అన్నాడు.
సుమ భర్త పక్కన కూర్చుని, ప్రేమగా ఆయన చేయి పట్టుకుని, "మిమ్మల్ని ఏమీ మాట్లాడవద్దని నా ఉద్దేశం కాదు అండీ. మౌనానికి, వాగుడుకి మధ్య 'సమతుల్యత' ఉండాలి.
ఉద్యోగంలో ఉన్నప్పుడు నీతి, నియమాలు పాటించి ఎంత ఆదర్శంగా ఉన్నారో... ఇప్పుడు కూడా మీ సమయాన్ని, మాటలని అంతే ఆదర్శవంతంగా వాడితే చూడాలనుంది," అంది.
ఆ మాటలు సోమశేఖర్ మనసును తాకాయి. నాన్న చెప్పిన సూత్రాలను కార్ వాడకంలో పాటించిన తాను, జీవితంలో 'కాలం, మాట' అనే విషయాల్లో ఎందుకు పాటించకూడదు అనిపించింది.
మరుసటి రోజు నుంచే సోమశేఖర్ రోజువారీ దినచర్యలో మార్పు వచ్చింది. ఉదయాన్నే సుమ చెప్పినట్టే పార్కులో యోగా, ధ్యానం మొదలుపెట్టాడు. అక్కడ తనలాగే రిటైర్ అయిన కొందరు మిత్రులతో కలిసి ఒక 'సీనియర్ సిటిజన్స్ క్లబ్' ఏర్పాటు చేశాడు.
అక్కడ వారానికి ఒకసారి కలవడం, పుస్తకాల గురించి చర్చించుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు చేసుకున్నాడు.
ఇక ఇంట్లో ఉన్నప్పుడు బంధువులతో కేవలం కాలాన్ని వృథా చేసే కబుర్లు కాకుండా, నాణ్యమైన సమయాన్ని గడపడం నేర్చుకున్నాడు. వారానికి ఒకసారి తమ్ముళ్లకు ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడగడం, సాయంత్రాలు సుమని తీసుకుని పిల్లలతో బయటకు వెళ్లడం, అప్పుడప్పుడు వంటగదిలో సహాయం చేస్తూ హాయిగా నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఒక సాయంత్రం టీ ఇస్తూ సుమ నవ్వుతూ అంది, "ఇప్పుడు మీతో మాట్లాడటం ఎంతో హాయిగా ఉందండీ! నాటి 'మౌనం' కాదు, నేటి 'వాగుడు' కాదు... ఇది నిజమైన సోమశేఖర్ గారి పద్ధతి!"
సోమశేఖర్ చిరునవ్వు నవ్వి, "ఏ వస్తువైనా, ఏ గుణమైనా సరిపడా ఉన్నప్పుడే దానికి విలువ సుమా! అతిగా మాట్లాడితే అది 'వాగుడు' అవుతుంది... వేళ చూసి, ప్రేమగా మాట్లాడితే అది 'సంభాషణ' అవుతుంది. ఈ విషయం నేర్చుకోవడానికి నాకు ఇన్నాళ్లు పట్టింది," అంటూ దూదిలాంటి ఇడ్లీని ముక్క తుంచుకుని నోట్లో వేసుకున్నాడు.
(అతివాగుడు ఇతరుల తప్పులు ఎత్తిచూపడానికి దారి తీసి, తగాదాలు వస్తాయి.)
ముగింపు (శుభం)
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


















Comments