ఆమే ఒక సైన్యం

Aame Oka Sainam - Telugu Social Story | Madhupatra Sailaja Uppaluri
ఆమే ఒక సైన్యం - తెలుగు సామాజిక కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి
Published in manatelugukathalu.com on 11/10/2026
“ఆమె ఒక సైన్యం” ఒక స్ఫూర్తిదాయకమైన తెలుగు సామాజిక కథ. పేదల హక్కుల కోసం పోరాడే మల్లి ధైర్యం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు ఈ కథలో ప్రధాన ఆకర్షణ. అన్యాయాన్ని ఎదిరించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆమె సాగించిన ప్రయాణం మహిళా సాధికారతకు అద్దం పడుతుంది. ఐకమత్యంతో పోరాడితే విజయం సాధ్యమేననే సందేశాన్ని ఈ కథ మనకు అందిస్తుంది.
“సమయం చూస్తే ఇంకా ఐదు గంటలు కూడా కాలేదు. ఎవరూ ఇంత ఉదయమే తలుపులు చప్పుడు చేస్తున్నది?” అనుకుంటూ బయటికి వచ్చింది స్రవంతి. ఎదురుగా పనిమనిషి మల్లి నిలబడి ఉంది.
“రోజూ నువ్వు వచ్చాక సమయం చూస్తే కచ్చితంగా ఏడు గంటలయ్యేది. అలాంటిది ఏమయ్యింది? ఈ రోజు ఇంత ఉదయమే వచ్చావు. ఏదైనా పని పడిందా?” మల్లికి లోపలికి దారి ఇస్తూ అంది స్రవంతి.
“అవునమ్మా! మాకు రేషన్ షాప్‌లో బియ్యం ఇచ్చి మూడు నెలలు దాటుతోందని రోజూ మీకు చెప్పుకుంటూనే ఉన్నాను కదా.
నిన్న రాత్రి ఆ రేషన్ షాప్ కుర్రాడు వచ్చి మా అందరికీ ఆ బియ్యం ఈ రోజు ఇస్తున్నామని చెప్పి వెళ్లాడు. అందుకే మా వాడకట్టు జనమందరం తెల్లవారుజాము రెండు గంటల నుండి ఆ రేషన్ షాప్ ముందు క్యూ కట్టాం.
నేను కూడా వాళ్లతో పాటే ఆ క్యూలో నిలబడి, ఇప్పుడే వచ్చిన మా అత్తను ఆ క్యూలో ఉండమని చెప్పి, నేను పనిచేసే నాలుగిళ్లలో పనులు పూర్తి చేసుకుందామని ఈ రోజు కాస్త తొందరగా వచ్చానమ్మా.
నేను పనిలోకి అసలు రాకపోతే మీకు ఇబ్బంది అవుతుంది కదా... అది నాకు ఇష్టం ఉండదు. మీరు గిన్నెలు సర్దుకుని దొడ్లో వేయండమ్మా. ఈలోపు నేను వీధిగుమ్మం దగ్గర పాచి ఊడ్చి ముగ్గు పెట్టి వస్తాను. మళ్లీ ఆ క్యూలో నిలబడటానికి వెళ్లాలి” అంటూ చీపురు, నీళ్ల బక్కెట్టు తీసుకుని ఉరుకులు పరుగుల మీద వీధిలోకి వెళ్లాడు మల్లి.
స్రవంతి వాళ్ల ఇంట్లో మల్లి పనికి చేరి ఐదు సంవత్సరాలు దాటుతోంది. క్రమశిక్షణ, నిజాయతీలతో పాటు మంచి ధైర్యం, తెగువ కలిగిన అమ్మాయి. కాస్తోకూస్తో జ్వరం వచ్చినా మందుబిళ్లలు వేసుకుని మరీ పనిలోకి వస్తుందే తప్ప నాగా పెట్టదు. నాలుగైదు ఇళ్లలో పనిచేసుకుంటూ నెలకు దాదాపుగా ₹15,000/- సంపాదించుకుంటోంది.
గిన్నెలు కడుగుతూ స్రవంతితో కబుర్లు మొదలుపెట్టింది మల్లి. “అమ్మా! ప్రభుత్వం మాలాంటి పేదల కోసం ఎన్నెన్నో మంచి పథకాలను అమలు చేస్తోంది. నెలనెలా రేషన్ బియ్యం ఇవ్వడం, వితంతువులకు పింఛన్లు మొదలైన వాటి ద్వారా మాకు ఎంతోకొంత మేలు కలుగుతోంది.
కానీ ఆ స్కీమ్‌ల ప్రయోజనాలు మా నోటి వరకు రాకుండా మధ్యలో డీలర్లు, ఆఫీసుల్లో అధికారులు పీడించుకు తింటున్నారు. వాళ్లు చెప్పినట్లు వినకపోతే ఆ వచ్చే డబ్బులు కూడా ఆగిపోతాయని వాళ్లకు భయపడి నోరు మూసుకు కూర్చోవాల్సి వస్తోంది.
పేదోళ్లు బయట షాపుల్లో కనీసం నిత్యవసరాలైనా కొనే స్థితిలో ఉన్నారా? రేషన్ బియ్యం వస్తే నెలలో పదిహేను రోజులైనా అన్నం తినగలుగుతాం కదా! ఆ బియ్యం కూడా నెలనెలా ఇవ్వకుండా ఏవో కుంటిగుడ్డి సాకులు చెప్పి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
అడిగే నాథుడే లేడని విర్రవీగుతున్నారు. ఈసారి ఎలక్షన్లలో వీళ్ల సంగతి గట్టిగానే అటో ఇటో తేల్చుకోవాలి” అంటున్న మల్లి కంఠంలో కోపం, వేదనలు పేదరికపు త్రాచుపాములా బుసలు కొట్టాయి.
“ఏమిటే మల్లీ! కొంపదీసి ఝాన్సీ లక్ష్మీబాయిలా తిరుగుబాటు చేస్తావా? ఆ యుద్ధానికి నీ వాళ్లంతా నీకు సహాయంగా నిలబడతారంటావా?” అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది స్రవంతి.
“నాకు సహాయంగా ఉండక ఏం చేస్తారమ్మా? ఆకలి ఎంతపనైనా చేయిస్తుంది.
‘సమాజంలో వచ్చే చాలా తిరుగుబాట్లకు పేదరికమే మూలకారణం’ అని మా కొడుకు పుస్తకాలలో ఒకసారి చదివిన గుర్తు. అయినా మాకు తిప్పలు తప్పడం లేదు. సరేనమ్మా! ఇక నేను వెళ్లొస్తాను” అంటూ పది నిమిషాలలో పని పూర్తి చేసి మరో ఇంటికి వెళ్లిపోయింది మల్లి.
స్రవంతి ఆలోచనల్లో పడింది. “మల్లి చెప్పినట్లుగా ప్రభుత్వ పథకాల్లో పెద్ద వాటా దళారులూ, అక్రమార్కులు తీసుకుపోతే ఈ పేదవాళ్లంతా ఏమైపోతారు? 'రామాలయం లేని ఊరు లేదు' అన్న సామెత పాతదైపోయి, ఈ రోజు 'మందు దుకాణం లేని వాడ లేదు' అన్న స్థితికి తెచ్చారు ప్రస్తుత పాలకులు.
దాంతో పేదవాళ్ల ఆదాయంలో అధిక భాగం ఆ మందు దుకాణాలకే పోతోంది. నెలకి లక్ష రూపాయల పైన సంపాదిస్తున్న మాకే నెలచివరలో డబ్బు కోసం వెతుకులాడే పరిస్థితి వస్తుంటే, నెలకి భార్యాభర్తలిద్దరికీ కలిపి ఓ ఇరవై వేలు కూడా సంపాదన లేని వాళ్ల బ్రతుకులు ఈ కరువు రోజుల్లో సాగేదెలా?..”
ఆమె ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ ఆమె భర్త శ్రీకాంత్, “ఏమిటోయ్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇందాక ఆ మల్లి చెప్పిన మాటల గురించేనా? ఓపిక, ధైర్యం ఉండాలే గాని వాళ్ల సమస్యలను వాళ్లే పరిష్కరించుకోగలరు.
దానికి మల్లిలాంటి వారే ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకు రావాలి. ఆ సంగతి అటుంచితే ముందు నేను ఆఫీసుకి వెళ్లటానికి నీ సాయం నాకు కావాలండి శ్రీమతి గారూ!” అంటూ శ్రీకాంత్ బాత్‌రూమ్‌కి వెళ్లాడు.
శ్రీకాంత్ ఆఫీసుకెళ్లాక మిగిలిన పనులు పూర్తిచేసుకుని తన స్నేహితురాలు అపర్ణకి ఫోన్ చేసి మల్లి విషయం చెప్పింది స్రవంతి.
“అవును స్రవంతి! మనం చదువుకునే రోజులలో వేదికలపై ఎన్నో విషయాలపై ప్రసంగాలు ఇచ్చాం, చర్చా కార్యక్రమాలలో పాల్గొన్నాం. కానీ సమస్యలను ప్రత్యక్షంగా ఎదిరించింది లేదు. ఈ మల్లిని చూడు, అన్యాయాన్ని ఎదిరించటంలో ఎంతగా తెగువను, ధైర్యాన్ని చూపిస్తోందో!
పోయిన నెలలో ఎవరో భూకామందు వచ్చి 'మీకందరికీ ఊరి వెలుపల నాకున్న స్థలాలు ఇస్తాను. మీరు అక్కడే గుడిసెలేసుకుని ఉండండి. అందుకయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను.
ఈ ప్రదేశంలో నేను ఒక సూపర్‌మార్కెట్ పెడతాను' అంటూ చెప్పి వీళ్లను ఒప్పించటానికి ప్రయత్నం చేశాడట. వీళ్లెవరూ అందుకు ఒప్పుకోకపోయేసరికి రెండు రోజుల తరువాత మళ్లీ వచ్చి, 'మీరు నేను చెప్పినట్లుగా వినకపోతే పోలీసులని పెట్టి మరీ ఈ స్థలాలు ఖాళీ చేయించాల్సి వస్తుంది' అంటూ బెదిరించాడట.
'డబ్బులున్న మారాజులతో గొడవలెందుకు?' అని వీళ్లల్లో కొందరంటే, మల్లి మాత్రం వాళ్లందరికీ ధైర్యం చెప్పి, 'మనల్ని ఊరి బయటకి పొమ్మంటే ఎలాగ? మన పిల్లల స్కూళ్లు, మనకి పనులు కూడా ఇక్కడే ఉన్నాయి.
వీటి కోసం మనం ప్రతిరోజూ ఆటోలలో తిరగాల్సి వస్తుంది. ఎవరికోసమో మనమెందుకు రోజూ ప్రయాణాలు చేయాలి? ఖర్చులనెందుకు భరించాలి?' అంటూ ఆ పెద్దమనిషికి ఎదురునిలిచి ఆ సమస్యని విజయవంతంగా దూరం చేసింది. మన మల్లి నిజంగా పేదలపాలిట మహారాణి.
తమ సమస్యలను తామే ఎలా ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకోవాలో ఆమెకి తెలుసు. మీ ఇంటికి రావటానికి ముందే మా ఇంటికి వచ్చి గబగబా పనులు పూర్తి చేసిందమ్మా మల్లి. ఈ రోజుల్లో ఇలాంటి పనివాళ్లు దొరకటం చాలా కష్టం. ఈ రోజైనా ఆమెకి బియ్యం దొరికితే బాగుండును” అంది అపర్ణ.
సాయంత్రం పనులకి వచ్చిన మల్లితో “ఏమిటి మల్లీ? ఈసారన్నా విజయలక్ష్మి నిన్ను వరించిందా? బియ్యం నీ దాకా వచ్చాయా?” అని నవ్వుతూ అడిగింది స్రవంతి. ఆమె మాటలకి కన్నీళ్లొచ్చాయి మల్లికి. ఆమె ముఖంలోకి చూసిన స్రవంతి కంగారుగా “ఏమయ్యింది మల్లీ?” అని అడిగింది.
“ఏం లేదమ్మా! రేషన్ షాప్‌వాళ్లు మూడు నెలల బియ్యం ఇవ్వలేదు. కేవలం ఒక నెల కోటా ఇచ్చి 'మళ్లా పది రోజులకు మిగిలినవి ఇస్తాం' అని చెప్పారు. అదృష్టం బాగుండి మా వరకైతే ఆ మాత్రమైనా వచ్చాయి. ఇంకా పాతిక ముప్పై మందికి అవి కూడా దొరకలేదు. రాత్రంతా నిద్రలేకుండా నిలబడిన వాళ్లు నిరాశతో వెనుతిరిగారు.
వాళ్లలో ఓ పెద్దమ్మ కళ్లు తిరిగి పడిపోయింది. నేను వెళ్లి సోడా తీసుకువచ్చి ఆమెతో తాగించాక కాస్త స్థిమితపడి, 'ఖాళీ చేతులతో ఇంటికి పోతే కోడలు తనను ఇంటి నుండి గెంటేస్తుంది' అని ఒకటే ఏడుపు. ఆమె బాధను చూస్తున్న నాకు మనసులో గుబులయ్యిందమ్మా.
మా యారాలు, నేను చెరో ఐదు కిలోల బియ్యం ఆమెకిచ్చి, ఆమెతో పాటు వాళ్ల ఇంటికి వెళ్లి ఆమె కోడలికి ఇంతే ఇచ్చారని చెప్పి, ఆమెను ఇంటికి చేర్చి వచ్చాం. ఏమిటో మా జీవితాలు దినదినగండంగా మారుతున్నాయి.
నిరాశతో వెనుతిరుగుతున్న ఆ జనాల ముఖాలను చూస్తుంటే 'మన గీతలను ఎవ్వరూ మార్చరు, మనమే మార్చి రాసుకోవాలి. మనకు అవకాశాలను ఎవరూ అందించరు, మనమే అందిపుచ్చుకోవాలి' అని నా మనస్సులో ఒక ఆలోచన వచ్చిందమ్మా.
రాత్రికి మీ దగ్గరకొస్తాను. మా సమస్యలను మీకు వివరించి చెబుతాను. అమ్మా! ప్రభుత్వానికి ఓ అర్జీ రాసి పెట్టండి. మా వాడకట్టు అందరి సంతకాలు తీసుకుని జిల్లా అధికారికి ఆ అర్జీని ఇచ్చివస్తాం” దృఢసంకల్పం, స్థిరనిశ్చయాన్ని నింపుకున్న కంఠంతో అంది మల్లి.
ఆ రాత్రికే అనుకున్న విధంగా మల్లి చెప్పిన ప్రతినెలా సక్రమంగా అందని రేషన్, రెండు రోజులకొకసారైనా రాని మంచినీటి కొళాయిలు, పారుదల లేక దోమల నివాసగృహాలుగా మారిన డ్రైనేజి కాలువలు, వీధి మధ్యలో పెట్టిన బెల్ట్ షాపుల ఇబ్బంది వంటి సమస్యల గురించి వివరిస్తూ, నిరుపేదలైనవారు రోజూ చేసే శారీరక శ్రమ అంతా ఎలా బూడిదలో పోసిన పన్నీరు అవుతోందో వివరిస్తూ, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ వాడ ప్రజల తరఫున శ్రీధర్-స్రవంతి దంపతులు కలెక్టర్‌గారికి అర్జీ రాసి ఇచ్చారు.
అలా స్రవంతి సహాయంతో అర్జీ రాయించుకున్న మల్లి, దానిపై తమ వారందరితోనూ సంతకాలు పెట్టించి, జిల్లా అధికారికి అందించింది. ఒక నెలలోనే మల్లి ఇచ్చిన అర్జీ తాలూకు ప్రభావం కనిపించింది.
మల్లి ఆనందంగా స్రవంతి దగ్గరకు వచ్చి, “శుభవార్తమ్మా! ఈ నెల రేషన్ మాకు మొత్తం ఇచ్చేశారు అమ్మ. మన బాట సరైనదేనని రుజువయ్యిందమ్మా. పోరాడితే జయం తప్పదమ్మా” అంటూ పనిబాట పట్టింది. ఆమె నిబద్ధతకి ముచ్చటేసింది స్రవంతికి.
ఇప్పుడు మల్లి వెనుక ఎందరో సైన్యంలా ఉండి వాళ్ల సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.
ఓ రాజకీయ పార్టీ వారు మల్లి పోరాటపటిమను, ఆమె సాధిస్తున్న విజయాలను గమనించి ఆమె గురించిన వివరాలు రహస్యంగా సేకరించారు. ఆ నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తరువాత బహిరంగ సభను పెట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మల్లిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.
తన పనులన్నింటినీ ఉదయాన్నే పూర్తిచేసుకుని మిగిలిన సమయంలో పార్టీ నాయకులతో కలిసి ఆత్మవిశ్వాసంతో ప్రచారానికి వెళ్లడం మొదలుపెట్టింది మల్లి.
ప్రతి పేదవాడి గుండె తలుపునీ తట్టింది. ఆమె మాటలు అందరి మనసుల్లో బాగా నాటుకున్నాయి. ఇతర పార్టీల వారిలా ఎవరికీ పైసా డబ్బు పంచలేదు, అంతేకాదు ప్రజలకు శుష్క వాగ్దానాలు చేయలేదు.
నియోజకవర్గంలోని సమస్యల మూటలను తన మాటలతో విడదీసి ఏ విధంగా ఆ సమస్యలను అధిగమించగలదో ప్రతి వ్యక్తికీ వివరించగలిగింది. పరిష్కరించాల్సిన పెద్ద సమస్యలు తాను అధికారంలోకి వస్తే సానుకూలపరచగలననే గట్టి నమ్మకం తన ప్రచారం ద్వారా కలిగించగలిగింది మల్లి.
తనని తాను నిరూపించుకోవడానికి మల్లి ఇంతకుముందు చేసిన పనులు తోడ్పడ్డాయి.
నిరుపేదల సమస్యల పట్ల ఆమెకున్న అవగాహన, ఆమెకే అధికారం వస్తే తమలాంటి పేదలకు అందబోయే సహాయం అన్నీ కలసివచ్చాయి. అందరి హృదయాలను గెలుచుకుంది.
వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ పేదింటి యువతి అయిన మల్లి ఎన్నికల్లో సత్తా చాటింది. “మహిళా సాధికారత స్వయం సాధనతోనే సాధ్యం” అనే విషయాన్ని తన విజయంతో నిరూపించగలిగింది.
సాధారణ జీవితం నుండి అసాధారణ గెలుపుతో ఎలాంటి ఆర్భాటాలు, ఆడంబరాలు లేకుండా విజేతగా నిలిచి చూపించింది మల్లి.
పరాయి పాలన ముగిసి 75 వసంతాలు గడిచినా స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం చెక్కుచెదరలేదని నిరూపించగలిగింది మల్లి గెలుపు. ప్రతిబంధకాలను సానుకూలంగా మలచుకుంటూ తనని తాను ఓ శక్తిగా తీర్చిదిద్దుకున్న పేదింటి పరిమళం మల్లి ఆ రాష్ట్ర అసెంబ్లీ దిశగా అడుగులేస్తోంది.
స్వస్తి, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు 🙏
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు:
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు. గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.










Comments