top of page
Original.png

ఆనంద మజిలీ!

ఉపశమన కేంద్రంలో రోగులతో మాట్లాడుతున్న యువతులు మరియు ఉపాధ్యాయురాలు
ఉపశమన కేంద్రంలో రోగులతో మాట్లాడుతున్న యువతులు మరియు ఉపాధ్యాయురాలు

Ananda Majilee - Telugu Emotional Story | Madhupatra Sailaja Uppaluri

ఆనంద మజిలీ! - తెలుగు భావోద్వేగ కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 12/05/2026


ఉదయం ఎనిమిది గంటలవుతోంది. హాల్లోనున్న ఫోన్ అదేపనిగా ‘ట్రింగ్ ట్రింగ్’ మంటూ మ్రోగుతోంది. తన రూంనుండి గబగబా వచ్చిన మల్లిక, “సరోజ అయ్యుంటుంది” అనుకుంటూ ఫోన్ తీసి “హలో!” అంది.


“ఏయ్ మల్లికా! ఏంటీ తయారవుతున్నావా? లేక ఇంకా సెలవురోజు అని మంచం దిగలేదా? మనకీరోజు జగతి మేడమ్‌గారితో కలసి వెళ్లాల్సిన ప్రోగ్రాం ఒకటుంది. గుర్తుందిగా? 11 గంటలకల్లా మియాపూర్ మెట్రో స్టేషన్‌కి వచ్చేస్తే, అక్కడే మేడంగారు మనల్ని కలుస్తామన్నారు, సరేనా?” అంటూ మల్లికకు మరోమాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసింది సరోజ.


“ఓ షిట్! ఈ సరోజకి అసలు బుద్ధిలేదు. ఆదివారం నాడైనా కాస్తంత రిలాక్స్‌గా ఉండనీయకుండా ఈ ప్రోగ్రాం పెట్టింది. పైగా జగతి మేడంగారి పేరు చెబుతుంది. ఆవిడ ఎప్పుడూ ఖాళీగా ఉండరు. ఎవరినీ ఉండనీయరు కూడా.


ఈ సరోజేమో ఆ మేడంగారికి వీరాభిమాని. ప్రతి విషయంలోనూ ఆమెను అనుసరిస్తూ ఆవిడ మాటను జవదాటదు. ఇక వెళ్ళక తప్పదుగా! అందులోనూ మేడంగారే మమ్మల్ని ప్రత్యేకంగా వెంటబెట్టుకుని తీసుకెళుతున్నారంటే ‘సంథింగ్ స్పెషల్’ అయ్యుంటుంది” అని మనసులో అనుకుంటూ తల్లి దగ్గరికి వచ్చి “అమ్మా! త్వరగా టిఫెన్ పెట్టమ్మా! మా మేడంగారి దగ్గరకు వెళ్ళాలి” అంటూ కంగారు పెట్టి, తానూ తయారుకావటానికి బాత్రూమ్‌లో జొరబడింది మల్లిక.

మల్లిక తల్లి “ఆదివారంనాడు కూడా ఈ హడావుడి ఏమిటమ్మా? ఎందాకా మీ ప్రయాణం?” అంటూ కొంత విసుగు ధ్వనించిన గొంతుతో అంది.


“అమ్మా! వచ్చాక అన్ని వివరాలను చెబుతాను. సరేనా!” అంటూ తల్లి పెట్టిన నాలుగు ఇడ్లీలను ముక్కునోటా కుక్కుకుని హాల్లో TV చూస్తున్న తండ్రికి ‘బై’ చెప్పి రోడ్డుమీదకు వచ్చింది మల్లిక.


ఆటో ఎక్కిన తరువాత తన బ్యాగ్‌ను ఓసారి తడిమి చూసుకుంది. ఇంత హడావిడిలోనూ జగతి మేడం చెప్పిన పుస్తకాలను బ్యాగ్‌లో పెట్టుకున్నా, మరొకసారి పుస్తకాలను చూస్తేగాని ఆమె మనసు స్థిమిత పడలేదు. ఆటో మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. మెట్రోకార్డ్ ఉండటంతో టికెట్ కొనే ఇబ్బంది


“సరోజ ఇంకా రాలేదేమిటబ్బా?” అనుకుంటూ టైం చూసుకుంది. ఇంకా అర్ధగంటపైగా ఉంది సరోజ చెప్పిన సమయానికి. 


ఇంతలో “ఇక్కడున్నావా  మల్లికా? నేను  ‘చెకింగ్ పాయింట్’ దగ్గర నీకోసం  చూశాను. చెప్పిన సమయానికన్నా ముందే వచ్చేశావుగా! నీకు ఉదయం ప్రోగ్రాం గురించి చెపితే, ఆదివారం కదా బజారు పని వుంది. ఈరోజు ‘నాన్నగారితో కలసి  సినిమాకు కూడా వెళ్ళాలి’  అంటూ గునిసావు కదా? ఇప్పుడేమో నాకన్నా ముందే వచ్చేశావు?” అంటూ ఆశ్చర్యంగా అడిగింది సరోజ.  


“ఔనే సరోజా! నీవు చెప్పినప్పుడు అలాగే అనిపించింది. జగతీ మేడం  వ్యక్తిత్వం తెలిసిన వారందరికీ ఆవిడ ‘టైంపాస్’ కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టరని తెలుసు. అందుకే మనల్ని రమ్మన్నారంటే, ఏదో  విశేషమైన పనికోసమే అయ్యుంటుందనిపించింది.  దాంతో  ఏదోతెలియని ‘పాజిటివ్ ఎనర్జి’ నాలో ప్రవేశించి, నన్ను నీకన్నా ముందు వచ్చేలా చేసింది” అంది మల్లిక ఉత్సాహంతో. 


“మల్లికా మేడంగారి గురించి చక్కగా ఎనలైజ్ చేసావు. మనం కలసి చదువుకుంటున్న ఈరెండేళ్ళ కాలంలో  మేడం మనతో ఎన్ని  మంచి పనులను చేయించారో కదా!  మరోసంవత్సరం పూర్తయితే డిగ్రీ మన చేతికి వస్తుంది. మనం ఈకాలేజీ వదిలినాగానీ,  జీవితాంతం గుర్తుంచుకునే పనులను మనతో మేడం చేయించారు. 


జన్మదినం నాడు హోటల్ పార్టీలకు బదులు బ్లడ్‌డొనేషన్స్ చేయించటం, దసరా, సంక్రాంతి సెలవలలో మురికివాడలలోని పిల్లలకు చదువు నేర్పించటం, ఇలా ఆవిడ మనతో చేయించిన పనుల జాబితా చెప్పుకుంటూపోతే అదొక ‘మహాభారత’ గ్రంధమంత అవుతుంది.  

మనం సినిమాలకనీ, షికార్లకనీ చేసే అనవసరపు ఖర్చుతో వృద్ధాశ్రమాలలో, అనాధాశ్రమాలలో నివసించే వారికి పళ్ళను, స్వీట్లను పంచి రావటం, వారినందరిని ‘అమ్మమ్మా’, ‘తాతయ్యా’ అంటూ పిలిచి వారిపై ఆపేక్షను చూపించటం, వారి మనసులను గెలుచుకోవటం ద్వారా  అక్కడున్న పెద్దల దీవెనలనందుకోవటం, ఆనందంగా గడపటం ఎంత బాగుందో కదా” అంటూ జగతి మేడంతో కలసి తాము పంచుకున్న అనుభవాలను గుర్తుచేసుకుంది సరోజ. 


“అవునే అప్పుడే నాకు తెలిసింది. ఎదుటివారిని సంతోషపెట్టినప్పుడు కలిగే ఆనందం ఒక మధురానుభూతిగా మిగిలిపోయి, దానిముందు మన స్వీయానందాలు వెలవెల బోతాయని.  పోయిన సంవత్సరం నా పుట్టినరోజున నాతో మన కాలేజీలో ఓ మామిడి మొక్కను నాటించారు. దానికి నేనే ప్రతిరోజూ నీరు పోయాలని చెప్పారు. ఆ చిన్నిచెట్టు ‘మారాకు’ తొడిగిన రోజున నేనెంతగా మురిసిపోయానో. ఇంకొక మూడేళ్ళకు మనమక్కడికి వెళ్తే చెట్టునిండా కాయలు, పండ్లతో కళకళలాడుతూ మనల్ని పలకరిస్తుందాచెట్టు  కదా” అంది మల్లిక.


“సరోజా ఇటు!” అంటూ కాస్త దూరంలో నిలబడిన జగతీ మేడం రైల్ వచ్చేస్తోందన్నట్లుగా సైగ చేసారు. 


“గుడ్‌మార్నింగ్ మేడం” అంటూ ఇద్దరూ ఆమె దగ్గరకు వేగంగా అడుగులువేసారు. 

“నాకన్నా ముందే వచ్చేసారే!” నవ్వుతూ అంటున్న మేడంను చూస్తూ మల్లిక “ఆబ్యాగ్ నాకివ్వండి” అంటూ జగతి చేతిలోని బ్యాగ్‌ను తాను తీసుకుంది. 


ఇంతలో వచ్చిన రైల్‌ను  జనంతో పాటు ఎక్కారు ముగ్గురు. సీట్లు దొరికాయి. అంతా సర్దుకున్నాక “మేడం ఇంతకీ మనం ఎక్కడికి వెడుతున్నాం?” అని అడిగింది సరోజ. 

“మనం అమీర్‌పేట్‌లో రైల్ దిగి ఆటోలో వెళ్ళాలి ఆస్థలానికి. ఆటో ఎక్కాక మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు వెడుతున్నాం? అన్న విషయం మీకు చెప్తాను సరేనా” అన్నారు జగతి మేడం. 


ఓ ఇరవై నిముషాలలో అమీర్‌పేట్‌లో తన శిష్యులతో కలసి ఆటో ఎక్కారు జగతి మేడం. ఆటో కొంచెం దూరం వెళ్ళగానే జగతి మేడం, “మనం ఇప్పుడు ‘ఆత్మీయ స్పర్శ’ అనే ఉపశమన  కేంద్రానికి (Palliative Centre) వెళ్తున్నాం. దానిని ముగ్గురు వ్యక్తులు కలసి ఉన్నతమైన విలువలతోను, ఆదర్శాలతోను నిర్వహిస్తున్నారు.  


ఈమధ్యకాలంలో కాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి తీవ్రమైన వ్యాధులు చెదల్లాగా ప్రతి దేశంలోనూ వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని ప్రాధమిక దశలో గుర్తిస్తే వైద్య సదుపాయం కాస్తయినా అందే వీలుకలుగుతోంది. కానీ వ్యాధిని గుర్తించటం ఆలస్యమైతే వాటిని అరికట్టటం చాలా ఖర్చుతో కూడిన పనే కాక ప్రాణహాని కూడా ఎక్కువగా ఉంటోంది. 


తమ  కుటుంబాన్ని, ఈ ప్రపంచాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతామన్న బాధ, వేదన,  వచ్చిన వ్యాధికన్నా ఆ రోగులను ఎక్కువగా బాధ పెడుతుంది. వారినే కాదు వారి కుటుంబ సభ్యులను కూడా కలచి వేస్తుందది.


ఆ దుఃఖాన్ని మరిపించి, ఆ బాధనుంచి కొంచెమైనా వారికి ఉపశమనం కల్పించి వారి ‘ఆఖరి మజిలీ’ని ఆనందకరమైన వాతావరణంలో గడిపేందుకు ఈ “ఆత్మీయ స్పర్శ” అవకాశం కలిగిస్తుంది. ఈకేంద్రంలోనున్నవారు తమ కుటుంబసభ్యుల మధ్యనే ఉన్నామన్న భావనతో, తగిన మందులు వేసుకుంటూ సంతోషంగా కాలం గడపవచ్చు. 


“మనిషికి ఆరోగ్యమే మహా బలమైతే”,  ప్రశాంతమైన మనస్సు మనిషి ఆరోగ్యంగా వుండటానికి సహకరిస్తుంది. అందుకే  తమ జీవితచరమాంకంలోనున్న ఈవ్యక్తులు ప్రశాంతంగా, ఆనందంగా ఉండేటట్లు నిర్వాహకులు కృషిచేస్తున్నారు. 


దానిలో భాగంగానే చక్కని పాటలు, పద్యాలు పాడేవారు,    కథలను చెప్పేవారు,  ఎవరికివారే స్వచ్ఛందంగా ఇక్కడికొచ్చి వీరికి వినోదం అందిస్తూంటారు. మా బంధువులమ్మాయి వీరందరికీ వారంలో ఒకరోజైనా కొత్తరకం వంటలను రుచి చూపిస్తూ వుంటుంది. నేను కూడా ప్రతి ఆదివారం ఇక్కడికొచ్చి భగవద్గీత శ్లోకాలను వాళ్ళకర్ధమయ్యేలా చెపుతున్నాను. తద్వారా వారిలో ధైర్యాన్ని నింపి ఆత్మబలాన్ని పెంపొందించాలని నా కోరిక. 


మీలో మల్లికకు సాహిత్యంపై అభినివేశం వుంది. అలాగే సరోజకు మంచి గాత్ర సౌలభ్యముంది. మల్లికా! నీవు చదివిన కథలలో మనిషి మనో స్థైర్యాన్ని పొందగల, హాస్యాన్ని అనుభవించగల కథలను వారికి చెప్పవచ్చు. అలాగే సరోజ తనకి వచ్చిన త్యాగరాయ, అన్నమయ్య, రామదాసు కీర్తనలను పాడి వారిని రంజింపజేయవచ్చు. మీయిద్దరినీ ఈసంస్థకు పరిచయం చేస్తే అక్కడున్న వారికి మీరు మంచి కాలక్షేపాన్ని అందించగలరని నాకనిపించింది. అందుకే మిమ్మల్ని అక్కడకు తీసుకెడుతున్నాను” అన్నారు జగతి మేడం. 


“ఇది నిజమా మేడం? ఓ మంచి పనిలో మేము కూడా భాగస్వాముల మవుతున్నామంటే నమ్మశక్యంగా లేదు” అంది మల్లిక.


ఇంతలో ఆటో ‘ఆత్మీయ స్పర్శ’ అనే పేరుతో వున్న పెద్ద బిల్డింగ్ దగ్గర ఆగింది. జగతి లోపలికెళ్ళే ముందుగానే మాస్క్ ధరించి తన IDకార్డ్‌ను అక్కడి నిర్వాహకునికి చూపించి మల్లిక, సరోజలను పరిచయం చేసి “వీళ్ళు కూడా ఇకనుండి వారికి వీలయినప్పుడు ఇక్కడికొస్తారు” అని చెప్పి IDకార్డ్‌లను ఇప్పించింది. 


లోపలకి వారిని తీసుకెడుతూ జగతి మేడం “మీరు ఇక్కడి వారిని చూసి కన్నీరు పెట్టకండి. మనం వారికి ధైర్యాన్ని కలిగించటానికి, ఆనందాన్ని పంచటానికి మాత్రమే వెడుతున్నాం. వారి వయస్సును దృష్టిలో వుంచుకుని వారందరిని వరుసలతో ప్రేమగా మన ఇంటి సభ్యులవలె తలచి పలకరించండి. జాలిని మాత్రం ఎట్టిపరిస్థితిలోను చూపించవద్దు” అంటూ సూచనలనందించింది.


ఇంతలో “అమ్మా! అమ్మా!..” అంటూ ఓ ఏడేళ్ళ అమ్మాయి ఎదురొచ్చి జగతిని ఆనందంగా రెండుచేతులతో చుట్టేసింది. “అమ్మా నిన్ను చూసి అప్పుడే వారంరోజులు దాటింది. నువ్వు ప్రతిరోజూ రావచ్చుగా అమ్మా?” అంటూ గారాబంగా అడిగింది ఆ అమ్మాయి. 


“లతా! నీ కళ్ళేంటి అలా ఎర్రగా ఉన్నాయి? రాత్రి నిద్రపట్టటంలేదా?” అంటూ ఆదుర్దాగా అడిగింది జగతి. 


“అమ్మా! రాత్రయితే చాలు, ఒళ్ళంతా మంటలు, కడుపులో తెలియని నెప్పొస్తోంది. మజ్జిగ, ఐస్‌వాటర్ తాగినా నిద్రపట్టటంలేదు” దిగులుగా అంటున్న లత మాటలకి జగతి గుండె కలుక్కుమంది. 


“తగ్గిపోతుందిలే అమ్మా! చూడు నీ కోసం ఏంతెచానో?” అని బ్యాగ్‌లోనుండి చేతికొచ్చింది ఒకొక్కటి తీసి లతకు ఇస్తూ “అన్నీ నీకేనా? లోపల రూంలలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలకేమైనా ఇస్తావా?” అంటూ నవ్వుతూ అంది జగతి.  


“పోమ్మా! పోయినాదివారం నీవు వచ్చినప్పుడు అందరిని అడిగి లిస్ట్ రాసి నీకిచ్చాను.  నీవు తెచ్చినవన్నీ అందరికి” అంటూ “అమ్మొచ్చింది. తాయిలాలు తెచ్చింది” అంటూ లోపలకి పరిగెత్తుకెళ్ళింది లత. 


“మేడం! లతకేమయ్యింది?” అని అడిగింది మల్లిక.  


“పాపం లతకి మూడేళ్ళప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి రెండోపెళ్ళి చేసుకున్నాడు. అమ్మమ్మ తాతయ్యలే ఆపిల్లను చూసుకుంటున్నారు. ఇప్పుడు దురదృష్టం వెన్నాడి,  కాన్సర్ లాస్ట్‌స్టేజిలో బయట పడిందమ్మా. తన అమ్మమ్మ వాళ్ళు రేడియం పెట్టించారు. ఆపరేషన్ కూడా చేయించారు. నేను ప్రస్తుతం లతకి ‘అమ్మ’ పాత్ర పోషిస్తున్నాను. ఇన్నేళ్ళనుండి పొందని తల్లిప్రేమను ఆపాప ‘చివరి మజిలీ’ దాకా అందించాలనే తాపత్రయంతో ప్రతి వారం మానకుండా ఇక్కడికి వస్తున్నాను అంది జగతి.  స్నేహితురాళ్ళిద్దరి మదిలో తెలియని వెలితి తడిమింది. 


లత చేసిన సందడికి ఆ కేంద్రంలో ఉన్నవారందరూ హాలులోకి వచ్చారు. వారికి జగతిని చూడగానే తమ స్వంత కూతురో, తోబుట్టువో వచ్చిందన్న భావన కలిగి, అయినవారిని చూడగానే పులకరించే భావనలు కలిగాయి. అందరినీ ఆత్మీయంగా పలకరించి మల్లిక, సరోజలను పరిచయం చేసింది జగతి. 


అంతా కూర్చున్నాక, ఓ పెద్దాయనను “బాబాయి! క్రిందటిసారి గీతాశ్లోకం అర్ధం వివరించాను. గుర్తుందా మీకు?” అంటూ కుశలం అడిగింది  జగతి. 


“ఔనమ్మా! ‘సమ భావన’, ‘సర్వం విష్ణుమయం’ అంటూ బాగా చెప్పావు. నీవు చెప్పిన ఉదాహరణలను బ్రతికిన నాలుగు రోజులు మరచిపోలేనమ్మా! ఆయమ్మ వచ్చి మందులిస్తూంటే, నేనామెను దుర్గామాతగా భావించి ‘అమ్మా! నాపై దయతలచి ఈ రూపంలో నీ చేతిమాత్ర ద్వారా నీ దయాశక్తిని నాకందిస్తున్నావా?’ అని అడిగాను. అలాగే మంచినీళ్ళందించే వార్డ్‌బోయ్‌ని విష్ణువుగానే తలచి ‘నీవీ వేషంలో నీ అమృతధారలను నాకందించ వచ్చావా?’ అంటున్నాను. నీవు చెప్పిన శ్లోకార్ధం ఇదేగా అమ్మా. అందరిలోనూ ఆ పరమాత్ముని చూడటానికే ప్రయత్నిస్తున్నాను” అన్నారు. 


“బాబాయ్! అద్భుతంగా చెప్పారు.  చదవటం, వినడం కంటే ఆచరణ చాలా  ముఖ్యమైనది. దానిని మీరు బాగా పాటిస్తున్నారు” అంటూ అభినందించింది జగతి. అంతా కరతాళధ్వనులు చేసారు. 


ఇదంతా చూస్తున్న, వింటున్న మల్లిక, సరోజలు “జగతీ మేడం ఒక అద్భుతమైన వ్యక్తి” అనుకున్నారు. 

ఇంతలో జగతి తెచ్చిన స్వీట్స్ అందరికీ పెట్టింది లత. ఓ ఆయమ్మ టీలు తెచ్చి అందిస్తూంటే ఆ బాబాయ్‌గారు “మా లక్ష్మి రావమ్మా!..” అంటూ పాటని పూర్తిగా పాడిన పిమ్మట “అమ్మా! జగతీ! నీవు చెప్పే ఆ నాలుగు మంచి మాటలకోసం వారమంతా కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తూంటాం. మరి ప్రారంభించమ్మా!” అన్నారు. 

“యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం!  తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః!!”

  

జగతి చక్కని రాగంతో శ్లోకాన్ని పాడింది. ఈ శ్లోకం అర్ధం కూడా చెప్తాను వినండి. “జీవుడు అవసాన దశలో ఏఏ భావములను స్మరించుచూ దేహత్యాగం చేయుచున్నాడో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. అందుకే మనం నిరంతరం భగవంతునే స్మరిస్తూ, ధ్యానిస్తూంటే భగవ్ద్భక్తులుగానే పుడతాం. ఓ మార్కండేయుడు, ఓ ప్రహ్లాదుడు, ఓ కన్నప్ప వంటి భక్తులుగానన్నమాట” అంటూ చెప్పింది.  


“బాగుందమ్మా! చాలా బాగుంది! ఇక మనం ఏ పనిచేస్తున్నా రామా! కృష్ణా! శివా! శ్రీమాత్రేనమః! అనుకుంటూండాలి కదమ్మా” అన్నారు ఆయన. “ఔను! చక్కగా అర్ధం చేసుకున్నారు” అంది జగతి. 


“తల్లీ! మరొక శ్లోకం నా కోసం చెప్పమ్మా” అని అడిగారాయన. 


“యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ!  సమదుస్ఖం దుఃఖసుఖం ధీరం సోమృతత్వాయకల్పతే!!” 


“అంటే ధీరుడైనవాడు  సుఖదుఃఖాలను సమానంగా చూస్తాడు. అతడే మోక్షము పొందుటకు అర్హుడు.  అంటే ‘మీకే కష్టం వచ్చినా ఆ భగవంతుడే ఇచ్చాడని, అలాగే ఏ ఆనందం కలిగినా అదీ ఆ భవంతుడిచ్చినదే’ అనుకుంటూ ఆనందానికి అతిగా పొంగిపోక, కష్టానికి కృంగిపోక, మన మనస్సును నిబ్బరంగా ఉంచుకోవాలి” అని ఆ గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అంది జగతి. 


“తల్లీ! మనస్సు నిండా ప్రశాంతతను నింపావమ్మా!” అన్నారాయన. 


“మరి ఇప్పుడు సంగీతంలోని ఆనందాన్ని కూడా ఆస్వాదించండి. మన సరోజ చక్కని ‘అన్నమయ్య’ కీర్తన పాడుతుంది మీ కోసం” అంటూ “సరోజా!..” అంటూ పిలిచింది జగతి. 

"తెలిసితే మోక్షము తెలియకున్న బంధము 

కలవంటిది బతుకు ఘనునికినీ" అంటూ భావయుక్తంగా పాడింది సరోజ. 


ఓ పిన్నిగారు ఆ పాట సారాంశం అర్ధమై “ఇంత చిన్న వయస్సులో మాకోసం ఈ కీర్తన ఎంచుకుని పాడడం ఎంతో  ఆనందమమ్మా! నీకు మంచి భవిత ఉందమ్మా” అంటూ వచ్చి సరోజను ముద్దాడారు. 


“ఇంతసేపూ జీవితానికి అవసరమైన వేదాంత విశేషాలను విన్నారుగా. ఇక మీ హృదయాలను తేలిక చేసుకోవటానికి మన మల్లిక మీకొక హాస్యపు కథను చెపుతుంది వినండి” అంది జగతి. 

“శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని తెనాలి రామలింగకవికి సంబంధించిన దొంగల కథను వివరించి చెపుతూ, అపాయాన్ని కూడా ఉపాయంతో రామలింగడు తనకు అనుకూలంగా ఎలా మలచుకున్నాడో” చెప్పింది మల్లిక. 


లత విరబూసిన గులాబీబాలలా నవ్వుతూ “భలే ఉందక్కా ఈ కథ. వచ్చే వారం మరో కథ చెప్పవా?” అంటూ అడిగింది. సరేనన్నట్లుగా తలూపింది మల్లిక.  


“అమ్మా! మా కోసం మీరంతా సెలవురోజున కూడా మీ కుటుంబంతో గడపకుండా ఇక్కడకు వచ్చి మంచి మాటలు, పాటలు, కథలను చెపుతూ మీ అమూల్యమైన సమయాన్ని మాకోసం వెచ్చిస్తూ, మాకు ఆనందం పంచుతున్నారు. మేము మీకు ఋణపడి పోతున్నామమ్మా!” అంటూ కన్నీళ్ళతో బాధగా అన్నారు ఓ పెద్దాయన.  


“బాబాయ్! సమయం అమూల్యమైనదని మీరే అంటున్నారు. మాకు వచ్చినదానితో మీకు ఏకాస్త ప్రశాంతతను కలిగించినా మా ఈ చిన్ని ప్రయత్నం విజయవంతమైనట్లే” అంది జగతి. 

అక్కడున్న అందరితో “మళ్ళీ వారం కలుద్దాం” అంటూ,  ఓ మంచి పని చేసామన్న సంతృప్తితో ఇంటి ముఖం పట్టారు జగతి బృందం.                    


*****     

మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page