బొమ్మలు చెప్పే కథలు
- Madhupatra sailaja Uppaluri

- 5 hours ago
- 8 min read

Bommalu Cheppe kathalu - Telugu Emotional Story | Madhupatra Sailaja Uppaluri
బొమ్మలు చెప్పే కథలు - తెలుగు భావోద్వేగ కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి
Published in manatelugukathalu.com on 20/04/2026
సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు…అది ప్రాణాలను కాపాడే శక్తిగా మారితే?
అదే ఈ కథలోని రాగసుధ జీవితం.ఆమె గదిలో ఉన్న ప్రతి బొమ్మ ఒక చిన్నారి గుండె కథను చెబుతుంది.
"ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ" తన్మయత్వంగా కూనిరాగం తీసుకుంటూ తనకెంతో ఇష్టమైన గదిలోకి వచ్చింది రాగసుధ. తన స్నేహితులైన బొమ్మలెన్నో తన రాక కోసం, తాను చెప్పే కబుర్ల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నాయి.
మొదటి వరుసలోని అందాల చిలక బొమ్మ, “అక్కా! ఏమిటీ రోజు ఇంత సంతోషంగా ఉన్నావు? హుషారుగా కచేరీకి వెళ్ళావు కదా. ఏమైనా విశేషం జరిగిందా అక్కడ?” అన్నట్లుగా రాగసుధ వంక చూస్తోంది.
“ఔనురా చిట్టీ! ఈ రోజు నేను వెళ్ళిన కచేరీ రవీంద్రభారతిలో జరిగింది. నా పాటలు వినేందుకు, అనేకమంది అభిమానులు దూరప్రాంతాలనుండి సైతం వచ్చి నన్ను అభినందించారు. కచేరీ ప్రారంభించేముందు సాధారణంగా నేను ఈ కచేరీలు చేయటానికి గల కారణాలను వివరించిన తరువాతనే పాటలు అందుకుంటాను. నా పాటలను విని పులకరించి, నన్ను ప్రత్యేకంగా అభినందించిన వారిలో ఓ హార్ట్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు.
నా పాటలను ఆసాంతం విన్న ఆ డాక్టర్‌గారు ఎంతో అభిమానంతో “అమ్మా! వయస్సులో నా కన్నా చాలా చిన్నదానివైనా, నువ్వు ముందుగా చెప్పిన మాటలు నన్ను బాగా కదిలించాయి. చాలా చిన్న వయస్సు నుండే నీ అన్నయ్యతో కలిసి పాటలు పాడడం ప్రారంభించటానికి ఉన్న ప్రత్యేకమైన కారణాన్ని నువ్వు వివరించిన తీరు విన్న నేను ముగ్ధుడనైపోయాను.
నీవు నిరుపేద పిల్లల గుండె జబ్బులకు అయ్యే ఆపరేషన్ ఖర్చుల కోసం నీ సంగీత కచేరీల ద్వారా వచ్చిన డబ్బులను వినియోగిస్తున్నానని చెప్పావు చూడు, ఆ మాటలను వింటున్న నా కళ్ళు చెమర్చాయి. నీవు నాలాగా డాక్టర్‌వి కాకపోయినా పేద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన పద్ధతి నన్ను కదిలించింది.
నీ వయస్సులో తల్లిదండ్రులు ఇచ్చే డబ్బుని షికార్లకి, సినిమాలకి, ఆటపాటలకు ఖర్చు చేసే పిల్లలున్న ఈ కాలంలో, నీ సంపాదన నీ సంతోషాలకు గాక, పేద పిల్లల ఆపరేషన్ల కోసం, మందుల కోసం ఖర్చు చేస్తున్న నిన్ను, నిజంగా నేను అభినందించవలసిన విషయమే. నా దృష్టిలో పేద పిల్లల ఆరోగ్యం కోసం నీవు నీ బాల్యాన్నే త్యాగం చేశావు.
నీ గొంతు, ఆ స్వర మాధుర్యం దేవుడు నీకిచ్చిన గొప్ప వరం. ఆ వరం నీ ద్వారా చిన్నారి పేద పిల్లల గుండెలకు ఆధారమైంది. ఆ వయస్సులోనే కలిగిన నీ హృదయ పరిపక్వత నా ఊహకే అందడం లేదు.
నాకు కూడా నీ వయసున్న కూతురుంది. ఎంతసేపూ కాలేజీ స్నేహితులతో పుట్టినరోజు పార్టీలు, షాపింగ్‌లు, సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతూ ఉంటుందే కానీ, కనీసం ఇంటి పనులపైన అయినా శ్రద్ధ పెట్టడమే లేదు. పేరుకి ఆమె సంఘంలో పేరుమోసిన హార్ట్ స్పెషలిస్ట్ కూతురు. కానీ నీలాంటి సామాజిక స్పృహ లేశమైనా లేదు.
ఈ 30 ఏళ్ళ ప్రాయంలో పేషంట్ల ఆపరేషన్ ఖర్చుల కోసం ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు సంగీత కచేరీలు చేసి వచ్చిన డబ్బులతో వారి గుండె చప్పుళ్లను సరిచేస్తున్నావు. దేవుడు నీకు ఎంత మంచి మనసిచ్చాడో తల్లి!” అంటూ నాపై ప్రశంసల వర్షం కురిపించారు.
అంతకంటే నాకు ఆనందం కలిగించిన విషయమేమంటే, ఆయన, “అమ్మా, నీ ఆలోచనలలో, భావాలలో పాలు పంచుకునే అవకాశం నాకు కూడా కల్పించమ్మా! ఇక నుండి నేను కూడా పేదవారికి చేసే ఆపరేషన్లలో నా ఫీజును పూర్తిగా తీసివేసి ఉచితంగా చేస్తాను.
ఈ రోజు ఓ ఆటో డ్రైవర్ కొడుకు గుండె ఆపరేషన్ గురించేగా నువ్వు కచేరీ చేశావు? నేను కూడా కేవలం హాస్పిటల్ ఖర్చులు తీసుకుని అతనికి ఆ ఆపరేషన్ చేస్తాను. నీ దారిలో పూర్తిగా కాకున్నా కొంతవరకైనా నడిచే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను” అన్నారు.
“ఇదే ఈ రోజు జరిగిన గొప్ప విశేషం. అందుకే నేను ఇంత సంతోషంగా ఉన్నాను” అంటూ చెబుతున్న రాగసుధకు అభినందనలు తెలుపుతున్నట్లుగా వచ్చిన గాలికి, చిట్టితో పాటు మిగిలిన బొమ్మలన్నీ సంతోషంగా తలలూపాయి.
“ఆ ఆటో డ్రైవర్ కొడుకుకు వచ్చే వారం ఈ పాటికి ఆపరేషన్ అయిపోతుంది. ఆ రాత్రికి మీకు తోడుగా ఉండటానికి ఓ కొత్త స్నేహితుడు ఈ గదికి వస్తాడు. మీతో బోలెడు కబుర్లు చెప్తాడు, తెలుసునా?” అంటూ ఆ బొమ్మల గదిలో రాగసుధ సరదాగా తన నేస్తాలతో మాట్లాడుతోంది.
రెండో వరుసలోని ఓ కోతి బొమ్మ, రాగసుధ తనని పలకరించలేదని బుంగమూతి పెట్టుకుని తల పక్కకు తిప్పుకుని కూర్చుంది. ముద్దుగా ఉన్న ఆ బొమ్మను పరికించి, “ఓ! మా బుజ్జిగాడికి నేను పలకరించలేదని కోపం వచ్చిందా? నీ కోపం పోగొట్టే ఓ విషయం చెప్పనా? ఈ రోజు నీ దోస్త్ రాములు, అదే గిరిజన గూడానికి చెందిన పిల్లవాడు నా కచేరీ గురించి పేపర్‌లో చూసి, షేర్ ఆటోలో కష్టపడి వచ్చాడు.
టిక్కెట్ కొని లోపలికి రావటానికి డబ్బులు లేవని, నా కచేరీ జరుగుతున్నంత సేపూ బయట మెట్ల మీద కూర్చుని, నేను బయటకు రాగానే గబగబా నా దగ్గరికి వచ్చి “అక్కా, ఇదిగో ఈ Rs.100/- మీరు చేయించే ఆపరేషన్ నిమిత్తం వాడండి. నా గుండె బలానికి రోజు గుడ్డు తినమని చెప్పారు కదా నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్‌గారు. అమ్మ గుడ్లు కొనమని ఇచ్చిన డబ్బులు ఇవి” అంటూ చెబుతున్న వాడి మాటలకు, నేను చేసే ఈ యజ్ఞంలో ఓ చిన్న పిల్లవాడు కూడా ఎంతో స్ఫూర్తితో నాతో కలిసి అడుగులు వేస్తున్నందుకు నాకు ఒకేసారి బాధ, సంతోషం కలిగాయి.” అంది రాగసుధ ఉద్వేగం నిండిన గొంతుతో.
ఆమె మాటలన్నింటినీ వింటున్న బుజ్జి, “అలాగా, అక్కా! నా దోస్త్ ఆరోగ్యం బాగుందా? బడికి వెళ్తున్నాడా?” అంటూ అడిగింది.
“ఆగాగు, అన్ని ప్రశ్నలూ ఒక్కసారేనా? రాములు బాగున్నాడు. చక్కగా స్కూలుకి వెడుతూ, బాగా చదువుకుంటున్నాడు. నిన్ను మరీ మరీ అడిగినట్లుగా చెప్పమన్నాడు” అంది రాగసుధ. బుజ్జి ఆనందంతో తలను అటు ఇటు ఊపింది.
అలా రాగసుధ ఓ గంట తన బొమ్మలతో మాట్లాడాక గది బయటకు వచ్చింది. ఆ గదిలో ఉన్న బొమ్మల సంఖ్యకు లెక్క లేదు. తమకు ఆపరేషన్ చేయిస్తున్న రాగసుధకు ఒక్కో పేద పిల్లవాడు తమకి ఎంతో ఇష్టమైన బొమ్మలను గుర్తుగా ఇస్తున్నారు. ఆ గదిలోని ఒక్కో బొమ్మ వెనుక ఒక్కో గుండె కథ ఉంటుంది. ఏ బొమ్మను కదిపినా ఓ జాలి కథను చెబుతుంది. అందుకే ఆ బొమ్మలన్నీ రాగసుధకు ప్రేరణ కలిగిస్తాయి. కర్తవ్యాన్ని బోధిస్తాయి. రాగసుధ ఆ గదిలోకి వెళ్ళినప్పుడల్లా ఓ గుడిలో కలిగే ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఉంటుంది.
ఆమె రాక కోసం తల్లిదండ్రులు, భర్త రోహిత్ డైనింగ్ టేబుల్ దగ్గర ఓ అరగంట నుంచి ఎదురు చూస్తున్నారు. “రాగా! ఆ గదిలో నీకు ఏమి అనిపిస్తుందో నాకు అర్థం కాదు. అంతసేపు ఆ గదిలో బొమ్మలతో ఏం చేస్తావే?” అంది తల్లి కాంచన.
“అమ్మా! వాటిని చూస్తుంటే అవి బొమ్మలుగా నాకు అనిపించవు. వాటి కళ్ళలో నా వల్ల ఆరోగ్యం బాగుపడిన బాబో, పాపో, నా పట్ల కనపరిచే అవ్యక్తమైన ప్రేమ కనిపిస్తుంది. ఒక్కో బొమ్మ ఓ జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పటికి దాదాపుగా ఓ వెయ్యి బొమ్మలు పైగా నా గదిలోకి వచ్చి ఉంటాయి. అంటే వెయ్యి రాగాలు.
ఆ బొమ్మల్లో మట్టి, గాజు, కర్రలతో చేసినవి రకరకాలుగా వాళ్ళ పేదరికాన్ని సూచిస్తూ, నన్ను గమనించమన్నట్లుగా చూస్తాయి. ఆపరేషన్ చేయించుకోలేని వారి దుస్థితి గుర్తుకొచ్చి, నా కన్నీళ్ళు తిరుగుతాయి. నా గుండె తీసి ఆ చిన్నారులకి ఇవ్వలేను. కానీ నా గాత్రాన్ని వారికోసం ధారపోస్తున్నాను. కొన్ని గుండెలకైనా ప్రాణం పోయటంలో నేనూ భాగస్వామి అయ్యానన్న ఆత్మ సంతృప్తి నాకుంది” అంది రాగసుధ. ఆమెలోని మానవీయత, ఆమె మాటలను వింటున్న వారి హృదయాలను కదిలించింది.
“అమ్మా! ఈ రోజు ప్రత్యేకమైన వంటలు చేసినట్లున్నావు. మీ పెళ్లి రోజా?” అని అడిగింది రాగసుధ.
“కాదే, రాగా! నువ్వే ఆలోచించి చూడు. ఈ రోజు నీకు మాత్రం మా అందరి కన్నా విశేషమైన రోజు” అంది కాంచన.
అన్నం తింటూ ఆలోచిస్తుంటే చటుక్కున స్ఫురణకు వచ్చింది. కానీ “తనకు తానుగా బయటపడి చెబితే తన గొప్పలు తానే చెప్పుకున్నట్లుంటుంది,” అనుకుని, “అమ్మా! నాకేమీ గుర్తు రావటం లేదు. నువ్వే చెప్పమ్మా!” అంది రాగసుధ.
“నీవు ఈ సంగీత సేవా ప్రయాణంలోకి వచ్చి ఈ రోజుకి సరిగ్గా 25 సంవత్సరాలైందమ్మా!” అంది కాంచన.
“వావ్! కంగ్రాట్స్ రాగా!” అంటూ రోహిత్, రాగసుధ నోట్లో స్వీట్ పెట్టి విష్ చేశాడు.
“నిజంగానా, అత్తయ్యా! రాగ సంగీత సేవకు అప్పుడే 25 ఏళ్ళు వచ్చాయా?” అని అడిగాడు రోహిత్.
“ఔను బాబు! చిన్నప్పుడే నా కొడుకు చరణ్‌కు, రాగకు సంగీతం నేర్పించాను. రాగకు 7 సంవత్సరాలు వచ్చేటప్పటికే అనేక టీవీ, రేడియో కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు రాగకు 9 ఏళ్ళు ఉంటాయి. ఆ యుద్ధంలో సైనికులెందరో చనిపోయారని తెలిసి చాలా ఏడ్చింది.
మృతవీరుల కుటుంబాలకు సాయం అందించటానికి అన్నాచెల్లెళ్ళిద్దరూ కలిసి సిటీలోని పెద్ద పెద్ద షాపుల ముందు, చౌరస్తాలలో నిలబడి పాటలు పాడారు. దాదాపు Rs.25,000/- వచ్చాయి. ఆ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి తమ వంతు విరాళంగా పంపించారు. అంత చిన్న వయస్సులోనే అలా ప్రోగ్రాములు ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ తరువాత ఒడిస్సా తుఫాను బాధితుల కోసం పాటలు పాడి విరాళాలు సేకరించి పంపారు.
ఇవన్నీ పేపర్‌లో వార్తలుగా రావటంతో, వాటిని చదివిన వీళ్ళ స్కూలు టీచర్లు ఓ రోజు మా ఇంటికి వచ్చి ఓ రిక్షా కార్మికుడి కొడుకు గుండె ఆపరేషన్ నిమిత్తం కావలసిన డబ్బు కొరకు పిల్లలతో పాటలు పాడించమని కోరారు. మరో ఆలోచనకు తావివ్వకుండా పిల్లలు అంగీకరించి ఊరి మధ్యన తోపుడు బండి మీద నిలబడి పాటలు పాడి డబ్బులు సేకరించి ఆ మొత్తం ఆ పిల్లవాని తండ్రికి సాయంగా అందించారు.
“చిన్న పిల్లలు పాటలు పాడి చేసిన ఈ సాయం” గురించి తెలుసుకున్న ఆ ఆపరేషన్ చేసే డాక్టర్‌గారు, “అంత చిన్న పిల్లలే పరుల సేవ గురించి ఇంతగా కష్టపడుతూంటే, డాక్టర్‌నైన నేను ఎంత సేవ చేయాలి!” అనుకుని ఆ పేద పిల్లడి ఆపరేషన్‌కు నామమాత్రంగా డబ్బు తీసుకుని పూర్తి చేశారు. ఈ వార్త పేపర్‌లోను, టీవీలోను రావటంతో పిల్లల పాటల కార్యక్రమాలు వీధి స్థాయి దాటి కచేరీల స్థాయికి పెరిగింది.
అలా తమ సంగీత సేవా ప్రయాణాన్ని చదువులతో పాటు కొనసాగించిన చరణ్, విదేశాలలో ఉద్యోగం రావటంతో అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ రాగ మాత్రం ఆ సేవా సంగీత వాహినిలో తరిస్తోంది” అంటూ తన పిల్లల సంగీత ప్రయాణం గురించి ఆనందంగా చెబుతోంది కాంచన.
తల్లి మాటలు వింటున్న రాగసుధ, “ఔనమ్మా! నాకు ఉన్న కొద్దిపాటి సంగీత జ్ఞానంతో ఓ మనిషి ప్రాణాలను కాపాడగలిగానన్న తాలూకు భావాలు నా వెన్నంటే ఉంటాయి. మా పెళ్లి అయిన తరువాత రోహిత్ కూడా నా ఈ కార్యక్రమాలకు అడ్డు చెప్పకుండా నాకు సహకరిస్తున్నారు. అది నేను చేసుకున్న పుణ్యమే కదా” అంది.
రోహిత్ ఆ మాటలు వింటూ “ఇలాంటి భార్య లభించినందుకు తాను ఎంత అదృష్టవంతుడినో!” అనుకున్నాడు.
“రోహిత్! ఆ రోజులలోనే గుండె ఆపరేషన్స్ చేయించుకునే పేద పిల్లలకు ఆర్థిక సహాయం అందించేందుకు మా పిల్లలు పాటలు పాడి, విరాళాలు సేకరించి తమ వంతు సహాయం అందిస్తారు” అని మేము పేపర్‌లో ప్రకటన ఇచ్చాము. ఒక్క వారం రోజులలోనే 33 మంది పిల్లల ఆపరేషన్ల గురించి మాకు విజ్ఞాపనలు వచ్చాయి. ఆయా నగరాలలోని డాక్టర్లు కూడా తమకు చేతనైనంతలో ఆపరేషన్ ఖర్చులను తగ్గించి, ఆ పసిపిల్లలను ఆదుకున్నారు” అని చెప్పుకొచ్చింది కాంచన.
నా చిట్టి తల్లి చదువు, సంగీత సాధనలు చేస్తూ ఛారిటీ షోలలో ఎంతో పేరు తెచ్చుకుంది. సినిమాలలో కూడా పాడటానికి ఎంతో మంది సంగీత దర్శకులు అవకాశాలు ఇచ్చారు. అలా మా రాగసుధ వివిధ భాషలలో పాడి తన పేరుకు నిజమైన సార్థకత తెచ్చుకుంది. తన పాటల వల్ల వచ్చిన డబ్బునంతటినీ పేద పిల్లల వైద్య ఖర్చులకే ఉపయోగించేది” అంది కాంచన.
అత్తయ్య చెబుతున్న మాటలు వింటున్న రోహిత్, “ఔను! నేను చేసే మ్యూజిక్ వీడియోలలో రాగసుధ గొంతు విని, పరిచయం చేసుకుని ‘ఈ రాగసుధను నా జీవన సుధ’గా చేసుకున్నాను. అనేక రాగాలను ఆమెతో పలికిస్తూ అనురాగ సంగమంగా నా జీవితం సాగిస్తున్నాను” అన్నాడు.
“ఇది మాత్రం నిజమమ్మా! మీ అల్లుడు నాకు తోడునీడగా ఉంటూ, నా పాటలను తన సంగీత దర్శకత్వంలో వెలుగులోకి తెచ్చి నాకు ఇంత కీర్తి వచ్చేలా చేశారు.
వివాహమైన తరువాత సాగిన నా సంగీత ప్రయాణంలో రోహిత్ చేయూత ఎంతో ఉంది” అంది రాగసుధ. భోజనాలు పూర్తయ్యాయి.
ఇంతలో ఫోన్ మ్రోగింది. దాని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉన్న రాగసుధ, పరుగు లాంటి నడకతో వెళ్ళి ఫోన్ అందుకుంది. “అన్నయ్యా! ఎలా ఉన్నావు? నీకు ముందుగా కంగ్రాట్స్” అంది.
“ఎందుకు రాగ?” అని ఎదురు ప్రశ్నించాడు చరణ్.
“అన్నయ్యా! మనం సంగీత సేవా ప్రయాణం మొదలు పెట్టి ఈ రోజుకు 25 ఏళ్ళు పూర్తయ్యాయి” అంది రాగసుధ.
“అందుకు అభినందనలు ముఖ్యంగా నీకే చెప్పాలి, రాగ. నేను చదువు, కెరీర్ అంటూ సంగీతానికి దూరంగా జరిగాను. కానీ నువ్వు ఆ బాటలోనే పయనిస్తూ ఇంత దూరం వచ్చావు. బావగారు కూడా నీకు తోడుగా నిలబడ్డారు” అన్నాడు చరణ్.
“అన్నయ్యా! ఇదిగో ఈ బొమ్మను చూడు. ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. దీని పేరు ‘మున్నా’” అంది రాగసుధ.
“టెడ్డీ బేరా?” అంటున్న చరణ్ మాటలను మధ్యలోనే ఆపుతూ, “ఇది ఒట్టి టెడ్డీ బేర్ కాదు అన్నయ్యా. దీని వెనుక ఓ కథ ఉంది, విను” అంటూ చెప్పటం మొదలు పెట్టింది రాగసుధ.
ఓసారి నేను ఓ మ్యూజిక్ ఆల్బం చేయటానికి రైలులో ఢిల్లీ వెళ్తున్నాను. వేగంగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. అంతా కలకలం. “ఏమయ్యిందో?” అని తోటి ప్రయాణీకులందరూ కంగారుగా తిరుగుతున్నారు. “రైలులో ఓ బాబుకి హఠాత్తుగా గుండె నొప్పి రావటంతో, ఆ ఊరిలో రైలును ఆపి, రైల్వే డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్‌కి తీసుకు వెళ్తున్నారు” అని చెప్పారు.
నేను వెంటనే సూట్‌కేస్‌తో సహా ఆ ఊరిలోనే దిగి ఆ బాబుని తీసుకెళ్ళే అంబులెన్స్ వెనకే హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్లు బాబుని జాయిన్ చేసిన హాస్పిటల్ వాళ్ళు టెస్టులు అన్నీ చేసి, “బాబు పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి. లేకపోతే ప్రాణాపాయం అవుతుంది. ఆపరేషన్‌కు లక్ష రూపాయలు వెంటనే కట్టాలి” అని చెప్పారు.
పాపం బాబు తల్లిదండ్రులు “మా దగ్గర అంత డబ్బు లేదు. నాలుగైదు రోజులలో కట్టేస్తాం. ముందు మీరు ఆపరేషన్ చేయండి” అని ప్రాధేయపడినా, ఆ హాస్పిటల్ యాజమాన్యం “డబ్బు కడితేనే ఆపరేషన్” అని ఖరాఖండీగా అన్నారు.
నేను వెంటనే మ్యూజిక్ డైరెక్టర్‌గారు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు తీసి హాస్పిటల్ వారికి పేమెంట్ చేశాను. ఆపరేషన్ జరిగి బాబు ప్రాణాలు నిలిచాయి. ఆ తల్లిదండ్రుల ఆనందానికి అంతే లేదు.
“సమయానికి ఆ దేవుడే పంపించినట్లుగా వచ్చి మా పిల్లవాడి ప్రాణాలు కాపాడారు. మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి?” అంటూ ఎంతో ఆవేదన నిండిన గొంతుతో చెబుతూ, నా అడ్రస్ అడిగి తీసుకున్నారు. వాళ్ళ ఊరు వెళ్ళిన వెంటనే డబ్బు తిరిగి పంపిస్తామని వినమ్రంగా చెప్పారు.
మరునాడు మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళి బాబుని చూసి, వాళ్ళకు ధైర్యం చెప్పి ఢిల్లీకి పయనమయ్యాను. ఢిల్లీలో మ్యూజిక్ ఆల్బం పూర్తి చేసి, డైరెక్టర్‌గారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాను.
నేను వచ్చిన 10 రోజులకు ఈ టెడ్డీ బేర్‌ను నాకు బహుమతిగా పంపిస్తూ, డబ్బును కూడా పంపించారు ఆ బాబు తల్లిదండ్రులు. “ఆ బొమ్మే ఈ మున్నా! బాగుందా ఈ బొమ్మ కథ?” అని అడిగింది రాగసుధ. “చాలా బాగుంది రాగ, నీ మున్నా కథ” అని మెచ్చుకున్నాడు చరణ్.
రోహిత్‌తో మాట్లాడుతూ, “బావగారూ! మా రాగకు ఎంతో గొప్ప సంస్కారంతో తోడుగా నిలబడుతున్నందుకు ధన్యవాదాలు” అన్నాడు చరణ్.
“ఔను చరణ్! నువ్వు ఎప్పుడు మీ రాగ గదిలోని ‘బొమ్మలు చెప్పే కథ’లను వినటానికి ఇండియా వస్తావు?” అని అడిగాడు రోహిత్. “త్వరలోనే వస్తామండి” అంటూ ఫోన్ పెట్టేసాడు చరణ్.
“ఏమండీ! అన్నయ్య త్వరలో ఇండియాకు వస్తానన్నాడు కదా! వాడు ఎప్పుడు వచ్చినా ఓ నెల రోజులు ఇక్కడే ఉండి తిరిగి అమెరికాకు వెళ్తాడు. వాడు ఇక్కడున్న సమయంలో ఇద్దరం కలిసి ఓ ప్రోగ్రామ్ చేస్తామండి. మంచి పాటలను మీరు సెలక్ట్ చేయండి” అంది రాగసుధ.
అన్నట్లుగానే చరణ్ రెండు నెలలకే ఇండియాకు వచ్చాడు. చరణ్ వచ్చినప్పటి నుండి, తాను ఏఏ సందర్భాలలో ఏఏ పాటలను పాడిందో, తాను ఆ పాటలనే ఎంచుకోవటానికి గల కారణాలను వివరిస్తూ, తన బొమ్మల గదిలోని ఒక్కో బొమ్మను పరిచయం చేస్తూ, ఆ బొమ్మ వెనుక ఉన్న పిల్లల కథలను చెబుతూ, కాసేపు వేదనను అనుభవించి, అంతలోనే తన పాటతో ఆ చిన్నారి గుండెలను కదలించిన ఆనందాన్ని విప్పి చెప్పి మైమరచిపోయింది రాగసుధ. అతనితో కలిసి రోహిత్ ఎంచుకున్న పాటలను బాగా సాధన చేసింది.
ఆ రోజు రానే వచ్చింది. ఆ ప్రోగ్రామ్ గురించి అన్నతో కలిసి సాధన చేసి చేసి అలసిపోయిన ఆమె గొంతు, సరిగ్గా ప్రోగ్రాంలో మైక్ ముందుకు వచ్చేసరికి మూగపోయింది. వేడి నీళ్ళు, మిరియాల పాలు తెప్పించుకుని తాగింది. కానీ ఫలితం లేకపోయింది.
పక్కనే ఉన్న చరణ్, “చెల్లాయ్! ఎదురుగా ఉన్నది పాటలను వినే శ్రోతలు కారు. నీ ప్రత్యేక గదిలో ఉన్న నీకు ఎంతో ఇష్టమైన బొమ్మలు వచ్చి మన పాటలను వింటూ మైమరచిపోయే వాటి ఆనందాన్ని గమనించు” అన్నాడు.
మెల్లగా కనులు మూసి తెరచిన రాగసుధకు ఎదురుగా అదే దృశ్యం. “అక్కా! ఏమిటి పాట ఆపేసావు? మా కోసం పాడవా? మా గదికి వచ్చే మరో స్నేహితుణ్ణి ఆహ్వానించటానికైనా నీవు పాడాలి కదా” అంటూ తన బొమ్మలు బ్రతిమాలుతున్నట్లుగా అనిపించింది.
అంతే "సరసస్వర సుర ఝరీ గమనమౌ..." అంటూ గొంతు సవరించుకుంది. ఆ స్వరఝరిలో ఆడిటోరియం అంతా పులకించి పోయింది.
“ఎంత చక్కని జీవితం నీది! అందరికీ ఆదర్శవంతంగా నిలబడుతున్నావు కదా చెల్లాయ్!” అంటూ అన్నయ్య ప్రశంసలు కురిపిస్తుంటే, తడిసి ముద్దైపోతోంది రాగసుధ.
*****
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు. గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.




Comments