top of page
Original.png

గ్రహణం వీడిన సూర్యుడు

Grahanam Veedina Suryudu - Telugu Emotional Story | Madhupatra Sailaja Uppaluri

గ్రహణం వీడిన సూర్యుడు - తెలుగు భావోద్వేగ కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 28/04/2026


ప్రతి కుటుంబంలో ఒక సూర్యుడు ఉంటాడు…కానీ కొన్నిసార్లు అతని వెలుగును అహంకారం కమ్మేస్తుంది.

అలాంటి ఒక యువకుడు తన కుటుంబం చేసిన త్యాగాలను గుర్తించి,తన జీవితానికి కొత్త దిశ చూపించుకున్న భావోద్వేగ ప్రయాణమే ఈ కథ.


ఆ రోజు ఆదివారం కావటంతో సూర్య చదువుకోవటానికి ఎక్కువ సమయం కేటాయించాలని, తన స్నేహితులతో కలసి సబ్జెక్ట్స్‌లో డౌట్స్ క్లియర్ చేసుకోవాలని త్వరత్వరగా తయారవుతున్నాడు. ఆటో నడిపి కుటుంబ పోషణ చేసే తండ్రి నారాయణకి ఆదివారమని, పండుగని, ఒక సెలవురోజని ఉండదు. రవికిరణాల కంటే ముందుగా ఆటోతో బయటకు వెళ్ళిన ఆయన తిరిగివచ్చేది సాయంత్రం దీపాలు పెట్టిన తరువాత మాత్రమే. భర్తకు చేదోడువాదోడుగా అయిదారు ఇళ్ళలో పాచిపనులు చేసి సంపాదిస్తోంది తల్లి లక్ష్మి. అందుకనే ఆదివారమైనా అక్క లత ఒక్కతే ఇంటిలో ఉంది.


లత ఇంటర్ పాసయ్యిన తరువాత పిల్లలకోసం రెక్కలుముక్కలు చేసుకుంటున్న తల్లిదండ్రుల కష్టాన్ని అర్ధం చేసుకుని, తమ్ముణ్ణి పెద్దగా చదివిస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటాడని, తాను అమ్మానాన్నలను ఒప్పించి ఓ బట్టల షాపులో సేల్స్‌గర్ల్‌గా చేరింది. అయితే చదువుపై తనకున్న ఇష్టం చేత ‘డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ’లో ప్రైవేటుగా డిగ్రీ చదువుకుంటోంది.  


ఆదివారాలు బట్టల షాపుకు సెలవు ఉండటంతో గబగబా ఇంటి పనులన్నింటినీ పూర్తి చేసి, వంట పనిని కూడా ముగించి, చదువుకోవటానికి సిద్ధమవుతోంది లత.


ఇంతలో స్నానం చేసి వచ్చిన సూర్య, “అక్కా! నీకో విషయం చెప్పాలి. నేను కాలేజికి ఆ డొక్కు సైకిల్‌పై వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు చూసినా దానికి రిపేర్లు వస్తున్నాయి. చూసిన స్నేహితులందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు.


వాళ్ళందరూ కాలేజికి మార్కెట్‌లో కొత్తగా వచ్చే బైక్‌లపై వస్తూంటే, నేను వాళ్ళ ముందు స్కూలు పిల్లాడిలా పాత సైకిల్‌ మీద వెళ్ళటం నాకు చాలా చిన్నతనంగా ఉంది. నా ఫ్రెండొకడు కొత్తగా బైక్ కొనుక్కుంటూ, తన పాత బైక్‌ను నాకు రూ. 25,000/-లకే అమ్ముతానన్నాడు. అలాంటి బైక్‌ను సెకండ్‌ హ్యాండ్ మార్కెట్‌లో కొనాలన్నా, కనీసం రూ. 50,000/- పెట్టనిదే మనకు దొరకదు.


నేను అడిగిన వెంటనే నాకు నచ్చిన బట్టలు, వాచ్, షూస్ కొనిచ్చారు నాన్నావాళ్ళు. అవన్నీ వేసుకుని ఆ పాత సైకిల్‌పై కాలేజికి వెళ్ళటం నాకు అవమానంగా ఉంది. 

అందుకే నువ్వే ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పి నాకు ఆ బైక్ కొనిపించాలి, తెలిసిందా! నాన్న ఇప్పుడు డబ్బు తన దగ్గర లేదంటే, ఎక్కడయినా అప్పు చేసయినా సరే ఆ బైక్‌ను కొనమని చెప్పు. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇట్లాంటి అవకాశం మనకు రాదుగా.


ప్లీజ్ అక్కా! బైక్ కొంటే నిన్ను ప్రతిరోజు మీ బట్టల షాపు దగ్గర దించి రావటానికి వీలవుతుంది. నీకు కూడా ఆటో ఖర్చు తగ్గుతుంది. రేపటి నుండి నాకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాసుతో కలసి కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నాను కదా, వాడి దగ్గరకు వెళ్ళి చదువుకుని వస్తాను. ఒక వారం రోజులలో నాన్నను డబ్బు సర్దుబాటు చేయమని చెప్పు. రాత్రికి నాకు నువ్వు ఈ విషయం చెప్పాలి. బై అక్కా!” అంటూ అక్క చెప్పే సమాధానంతో తనకు పనిలేనట్లుగా తన పాత సైకిల్‌ తీసుకుని స్నేహితుడి దగ్గరకు వెళ్ళిపోయాడు సూర్య.


“ప్చ్!” భారంగా నిట్టూర్చింది లత. ఆమె ఆలోచనలు సూర్య కోరికల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కాలేజి ఫీజులు, పుస్తకాలు, బట్టలు, షూస్, వాచ్… ఇలా వాడి కాలేజి చదువు గురించి చేసిన అన్ని ఖర్చులూ ఖరీదయినవే. ఇప్పుడేమో బైక్ అంటున్నాడు. మిగిలిన ఖర్చుల్లాగా ఇది ఒకసారి పెట్టేస్తే అయ్యేది కాదు. దాని మెయింటెనెన్స్ కొరకు ప్రతి నెలా నాన్న జేబుకి చిల్లు పడటం ఖాయం.


తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక కష్టపడే నాన్న, కాళ్ళు, చేతులు పుళ్ళు పడేలా అమ్మ చేసే పాచి పనులు, ఇవేవి పట్టకుండా తన కోరికలు తీరటమే ముఖ్యమని అనుకుంటాడు వాడు. తమ కుటుంబ ఆర్ధిక స్థితి తెలిసీ, వాడిలా అడగటం తనకు బాధ కలిగిస్తోంది.  


నేటి యువతరమంతా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. వాడిని సరయిన దారిలోకి తీసుకురావటానికి ఏం చేయాలో తెలియక తన ఆలోచనలను ఆపి, ఎంత కష్టపడయినా తాను కూడా డిగ్రీని పూర్తి చేసి మంచి ఉద్యోగంలో చేరాలనే తన లక్ష్యం చేరటానికి సాధనమైన చదువును మొదలుపెట్టింది లత.


రాత్రి ఆటో పని ముగించుకుని ఇంటికి చేరాడు తండ్రి.  అప్పటికే తల్లి కూడా పనులు ముగించుకొని వచ్చి, తాను పనిచేసే ఇళ్ళలో  వారు ఇచ్చిన పిండివంటలు, పళ్ళు తమ్ముడి కోసం దాచి ఉంచింది. సూర్య ఇంకా గూటికి చేరలేదు.


“ఏమ్మా! లతా! తమ్ముడింకా రాలేదా?” అన్నం తింటూ అడిగాడు తండ్రి. 


“వాడికి పరీక్షలు ఉన్నాయిట. తన స్నేహితుడింట్లో కలసి చదువుకుంటున్నాడు. ఇంకాసేపట్లో వచ్చేస్తాడు నాన్నా” అంది లత. 


పగలంతా ఆటో నడిపి వచ్చిన తండ్రి ముఖంలోని అలసటను గమనించి, చెప్పలేక చెప్పలేక “నాన్నా! మీతో ఒక మాట చెప్పాలి” అంటూ నసిగింది లత.  


“ఏమిటమ్మా! ఏమైనా కావాలా?” అంటూ ఆప్యాయంగా అడిగిన తండ్రి మాటలకు “తమ్ముడు సూర్య..” అంటూ ఉదయం తమ్ముడడిగిన బైక్, దాని ఖరీదు అన్నీ చెప్పింది  లత.


“పెళ్ళీడుకొచ్చిన అమ్మాయి చెవులకైనా చిన్నమెత్తు బంగారం కొనలేని పరిస్థితి మనది. కాలేజి ఫీజులు కట్టటానికే అష్టకష్టాలు పడుతుంటే వీడికిప్పుడు బైక్ కావలసివచ్చిందా?” అంటూ ఆవేశంగా ఆవేదన, నిస్సహాయత నిండిన గొంతుతో అంది తల్లి. 


“లతమ్మా! మొన్నమొన్ననే కాలేజిలో చేర్పించేటందుకు అందరి దగ్గరా నెల జీతం ఎక్కువ అడిగి తీసుకుని వాడికి కావలసినవన్నీ కొనిపెట్టాం. ఆరు నెలలన్నా కాలేదు. ఇలా బండి కావాలంటూ గొడవ చేయటమేమిటి? పాపం ఆ మారాజు ఉదయం ఇల్లు వదిలితే, తిండితిప్పలు కూడా చూసుకోకుండా రాత్రి దాకా ఆటో నడిపి సంపాదిస్తున్నాడు. ఇంకా ఆ కోరికలు, ఈ కోరికలు అంటూ డబ్బు తెమ్మంటే ఆయన ఎంతకని కష్టపడతారు? దాని ప్రభావం ఆయన ఆరోగ్యంపై పడితే నష్టపోయేది ఎవరు? వీడికి ఇంట్లో వాళ్ళ బాధ అఖ్కర్లేదు. నీవు నచ్చచెప్పరాదా?” అంది తల్లి.


“ఊరుకోవే పిచ్చిదానా! ఇవాళ రేపు పిల్లలంతా బైక్ లేనిదే కాలేజికి పోవటంలేదు. అందరినీ చూసిన వాడికి బైక్ కొనుక్కోవాలనే ఆశ పుట్టివుంటుంది. మా కాలంలో సైకిల్ ఉంటేనే గొప్పగా ఫీలయ్యేవాళ్ళం. ఇప్పుడు దాని స్థానంలో బైక్‌లు వచ్చాయి. అయినా వాడు కొత్త బండి అడగలేదుగా, సెకండ్ హ్యాండ్ బండేగా అడుగుతున్నది. చూద్దాం, ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో?” అంటూ భోజనం ముగించాడు తండ్రి.


“సరేలే అమ్మా! పొద్దున్నుంచి పనులు చేసి అలసిపోయావు. ఇక నీవు పడుకో. సూర్య వచ్చాక వాడికి అన్నం పెడుతూ నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాను” అంది లత. 


రాత్రి 10 గంటలు దాటాక ఇంటికి వచ్చిన సూర్య స్నానం చేసివచ్చి “అక్కా! అమ్మానాన్నలకు నేను చెప్పిన విషయం చెప్పావా? ఏమన్నారు?” అంటూ నెమ్మదిగా అడిగినా అతని గొంతులో ఆత్రుత కనిపిస్తోంది. 


అతడికి అన్నం పెట్టటానికి సిద్ధం చేస్తూ లత అంతకంటే నెమ్మదిగా, “సూర్యా! అమ్మానాన్నలు పడే కష్టం తెలిసే కదా నేను కాలేజిలో చేరకుండా ఇంట్లోనే ఉండి ప్రైవేటుగా చదువుకుంటున్నాను. మరో పక్క చిన్న ఉద్యోగం చేస్తూ కొద్దిగా సంపాదించి ఇంటి ఖర్చులకు నాకు చేతనైన సాయం అందిస్తున్నాను. అమ్మానాన్నలకు పెద్ద వయస్సులో ఆసరాగా ఉంటావనే నీకు పనులు చెప్పకుండా, అన్నీ సమకూర్చి నిన్ను కాలేజికి పంపిస్తున్నాం. మరి నీవు మన ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుని మసలుకుంటే బాగుంటుంది కదా” అంటూ తమ్ముడికి సుద్దులు చెప్పటానికి తంటాలు పడుతోంది.


అయితే సూర్య కోపంతో అక్క చెప్పే మాటలను పట్టించుకోకుండా “నాకు బైక్ కొనడానికి డబ్బులు కావలసిందే. అప్పటి వరకు నేనీ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను” అంటూ విసురుగా అన్నం కంచంలో చెయ్యి కడిగేసుకుని లేచివెళ్ళి మంచంపై ముసుగేసుకుని పడుకున్నాడు.  


పక్కనే నిద్రపట్టక అస్థిమితంగా కదులుతున్న తల్లికి పిల్లల మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. “అయ్యో! వీడు అన్నం తినకుండా పడుకున్నాడే! వాడికి మనం ఇవ్వకపోతే ఇంకెవరిని అడుగుతాడు” అనుకుంటూ సూర్యను తట్టిలేపి, “నాన్న రేపు ఎక్కడో ప్రయత్నించి డబ్బు తెస్తానన్నారురా. లేచి కాస్త ఎంగిలిపడు” అంటూ బ్రతిమాలింది.


అమ్మ మాటకు మెత్తపడితే తన కోరిక తీరదని భావించిన సూర్య,  “నాకు బైక్ కొనకపోతే అన్నమూ వద్దు, చదువూ  వద్దు” అంటూ అటువైపు తిరిగి దుప్పటి నిండా ముసుగేసుకున్నాడు.  


ఉదయం లత నిద్ర లేచేసరికే సూర్య బయటకు వెళ్ళిపోయాడు. కొడుకు రాత్రి అన్నం తినలేదనే విషయం భర్తకు చెప్పి ఎలాగైనా వాడికి బైక్ కొనే ఏర్పాటు చూడమని చెప్పింది తల్లి. లత షాపుకు బయలుదేరే సమయానికి కూడా సూర్య ఇంటికి రాలేదు. సూర్య ఆరోజంతా అన్నం తినలేదు.  


రెండురోజులు పస్తులున్న తరువాత నాన్న “బైక్ కొనటానికి కావలసిన డబ్బు కోసం ప్రయత్నిస్తున్నాను”  అని గట్టిగా చెప్పటంతో ఎంగిలిపడ్డాడు సూర్య. 


సూర్యకు ఆరోజుతో ఇంటర్నల్ ఎగ్జామ్స్ పూర్తయినాయి. అతనికి ఇష్టమైన ఆనంద్ సార్,  సూర్యతో పాటు మరో 10 మంది స్టూడెంట్స్‌ను పిలిచి, “మనకు ఇంటర్ కాలేజి వక్తృత్వ పోటీలు వస్తున్నాయి. అందుకుగాను మీలో ఇద్దరిని నేను సెలక్ట్ చేసి ఆ పోటీలకు పంపాలి” అని ప్రిన్సిపాల్‌గారు చెప్పారు.  


నేను ఆ ఇద్దరినీ ఎన్నుకోవటానికి మీకు ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. పరీక్ష జనరల్ టాపిక్ మీద ఉంటుంది, దానికి మీరు ఎక్కువ చదవాల్సిన పనిలేదు.


“కుటుంబంలో నా బాధ్యత” అనే అంశంలో: మీ ఇంటిలో ఎందరు ఉంటారు? వారు ఏమి చేస్తారు? కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఎలా ఉన్నాయి? కష్టపడేది ఎవరు? మీ కుటుంబం కొరకు త్యాగం చేసింది ఎవరు? మీ ఇంట్లో వారికి సాయంగా మీరేమి చేస్తారు? అనే విషయాలపై మీరు ఒక వ్యాసం రాసి నాకు ఇవ్వండి. రేపు నేను మన లైబ్రరీలో మీ నుండి ఆ వ్యాసాలను తీసుకుని, మీలో ఎవరు ఆ పోటీలకు ఎన్నికయినది చెపుతాను” అంటూ వెళ్ళిపోయారు.


ఆరాత్రి అన్నం తిన్న తరువాత ఆనంద్‌సార్ చెప్పిన వ్యాసం రాయటానికి కూర్చున్నాడు సూర్య. “నా కుటుంబంలో అమ్మ, నాన్న, అక్క, నేను ఉంటాం. నాన్న ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ నాలుగైదు ఇళ్ళలో పాచిపనులను చేస్తుంది. అక్క బట్టల షాపులో పనిచేస్తూ, ప్రైవేటుగా డిగ్రీ చదువుతోంది. నేను చదువే ధ్యేయంగా కాలేజికి వెడుతున్నాను” అంటూ తన కుటుంబం గురించి హుషారుగా వ్రాయటం మొదలుపెట్టాడు.  


“ఉన్నంతలో అందరం సంతోషంగానే ఉంటున్నాం. నేను బాగా చదువుకోవటం అమ్మానాన్నలకు సంతోషాన్ని ఇస్తుందనే విషయం గ్రహించి, అందుకు నా శాయశక్తులా కృషిచేస్తున్నాను.  ఇంటిలో పిల్లల కోసం అమ్మానాన్నలు కష్టపడటం సాధారణ విషయమే అయినా, మా అక్క నాకోసం తన కాలేజిచదువుని ఆపి, ఓ బట్టల షాపులో పని చేస్తూ నాన్నకు చేతనైన సాయం చేస్తోంది. అలా ఇంటిలోని అందరూ కష్టపడితేనే నేను కాలేజికి  వెళ్ళగలుగుతున్నాను” అని వ్రాస్తున్న సూర్య మనసులో ఏదో తెలియని చింతన మొదలయ్యింది.


“కుటుంబ పెద్దగా నాన్న ఉదయం నుండి రాత్రిదాకా ఆటో నడుపుతూ కష్టపడుతున్నారు. చిరిగిపోయిన తన చొక్కాపై కాకీకోటు వేసుకుని, నాకు ఖరీదయిన బట్టలు కొనిపెట్టి, కాలేజికి  పంపుతున్న నాన్న త్యాగం నా ముఖంలో సంతోషపు రేఖలను చూడటానికే అన్నవిషయం నాకు తెలియంది కాదు. 


కాళ్ళకు పసుపు రాసుకుని, చేతులకు నూనె మర్ధించినా పుళ్ళవుతున్న తన శరీరాన్ని లెక్కచేయకుండా తన కొడుకు చేతికి విలువైన వాచ్, కాళ్ళకు అందమైన షూస్ వేసి, ఆ కాళ్ళూచేతులు కమలాలుగా ఉన్నాయని ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది  తన తల్లి. 


ఇక అక్క నా చదువుకోసం చిన్న వయస్సులోనే తన కోరికలను అణిచివేసుకుని, తన కలలను గుండెగదులలో దాచుకుని, తమ్ముడు పెద్ద ఉద్యోగస్తుడు కావాలనే ఆశయంకోసం, నా కొరకు బంగారు బాటను వేస్తూ తాను మురిసిపోతోంది..”  ఇక సూర్యకి కలం ముందుకు సాగటంలేదు.


నాకోసం వాళ్ళు ముగ్గురూ ఎంతో కష్టపడి, చదువుకోవటానికి నన్ను కాలేజికి పంపిస్తూంటే, నేను వాళ్ళకు ఏ విధమయిన సాయం చేయకుండా, స్నేహితులు, ఆటలు, అవి కావాలి, ఇవి కావాలి అంటూ వాళ్ళను వేధిస్తున్నాను. ఒకదాని వెనుక ఒకటిగా తమ కుటుంబ పరిస్థితులు, తన ప్రవర్తన గుర్తుకొచ్చి సూర్య కళ్ళు జలపాతాలైనాయి.


“కుటుంబంలో మిగిలినవారి సంతోషం గురించి ఇసుమంతైనా ఆలోచించని తాను, తన సౌఖ్యంగురించి పేచీలుపెట్టి వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నాను” అనే భావన సూర్య పెన్నును కదలనీయటంలేదు. అతని గొంతులో తడి ఆరిపోయింది. 


కాస్త దూరంగా కూర్చుని చదువుకుంటున్న లత అతని ముఖకవళికలను గమనిస్తోంది. లేచివెళ్ళి ఓ గ్లాస్‌తో మంచినీళ్ళను తమ్ముడికి అందించింది. అక్క చేతిలో ముఖం దాచుకుని భావోద్రేకాన్ని తగ్గించుకున్నాడు సూర్య. మిగిలిన వ్యాసం పూర్తిచేసి పడుకున్న సూర్యకు ఆలోచనలు కందిరీగల్లాగా చుట్టుముట్టాయి. తాను చేసిన తప్పులకు, పొరబాట్లకు మదనపడసాగాడు.


సూర్య బాధపడటం చూసిన లతకు రెండురోజుల క్రితం తాను ఆనంద్‌సార్‌ను కలసిన విషయం మదిలో మెదిలింది.  ఆరోజు తనను చూస్తూనే సార్ “ఏమ్మా లతా! నీ చదువు బాగా సాగుతోందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?  తమ్ముడి కోసం నీవు చాలా కష్టపడుతున్నావు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా!” అన్నారు. 


“సార్! మీతో ఓ ముఖ్యమైన సమస్య గురించి చెప్పాలని వచ్చానండి” అంటూ సూర్య బైక్ అడిగిన సంగతిని ఆయనకు వివరించి “రెండురోజులనుండి అన్నం మానేసి అమ్మానాన్నలకు కంటికి నిద్రలేకుండా చేస్తున్నాడు. మా కుటుంబం ఆర్ధిక స్థితిని గురించి అసలు పట్టించుకోడు” అని  బాధ పడుతూ చెప్పింది లత.  


“సార్! మీరంటే మా సూర్యకు చాలా ఇష్టం, అంతకుమించిన గౌరవం వున్నాయి. మీరే వాడిని సరయిన దారిలో పెట్టగలరని నా నమ్మకం. అందుకే మీ దగ్గరకు వచ్చాను” అంది.


“నీవన్నది నిజమేనమ్మా! క్లాసులో చదువులో అందరికంటే ముందుంటాడు. ఉత్తమ విద్యార్ధిగా అతను గెలుచుకున్న బహుమతులే అతని ప్రవర్తన గురించి చెపుతాయి. అందుకనే మిగిలిన విద్యార్ధులకు మార్గదర్శకంగా అతనిని చూపిస్తూంటాం మా ఉపాధ్యాయులం.  


మీ కుటుంబం గురించి తెలిసిన నాకు అతని వేషధారణ చూసినప్పుడు ఇంత ఖరీదైనవి ఎలా కొనగలుగుతున్నాడు? వేసుకోగలుగుతున్నాడు? అనిపించేది. ఉన్నవారితో పోల్చిచూసుకొని తన తల్లిదండ్రులను బాధిస్తున్నాడు అన్న సంగతి నాకు ఇప్పుడు అర్ధమయ్యింది. ‘మానసిక అంతర్మధనం జరిగితే అమృతం పుడుతుంది’ అని పెద్దలంటారు. నా ప్రయత్నం నేను చేస్తాను. నీవు కంగారు పడకు” అని చెప్పి లతను పంపించారు ఆనంద్‌సార్.


మరునాడు ఆనంద్‌సార్‌కు తాను వ్రాసిన వ్యాసం ఇచ్చి, కుటుంబం గురించి తాను చేయదలచుకున్న పని గురించి ఆయనకు చెప్పి,   తేలికపడిన మనసుతో ఇల్లు చేరాడు సూర్య. 


“బైక్ కోసం నీవడిగిన డబ్బులు నాన్న తెచ్చారు. దేవుడిదగ్గర పెట్టాను. రేపు ఉదయమే నీవు వాటిని తీసుకెళ్ళి మీ స్నేహితునికిచ్చి అతని బైక్ నీవు తీసుకోవచ్చు. నీ కోరిక తీరబోతోందిగా, ఇక ప్రశాంతంగా అన్నం తిందువుగాని రా” అంటూ పిలిచింది తల్లి.  


“లేదమ్మా! ఇవాళ నాన్నతో కలసి భోజనం చేస్తాను నేను” అన్నాడు సూర్య. 


“ఒరేయ్! నీకు బైక్ కొనటానికి నాన్న ఆ డబ్బులు అప్పుకు తెచ్చారు. దానికి నెలకు ఇంతని వడ్డీతో కలిపి కట్టాలికదా. అందుకే ఇంకో గంటసేపు ఉదయం, సాయంత్రం ఆటో నడుపుతానని నాతో చెప్పారు. అందుకే రాత్రి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీవు తినేసి పడుకో. మరలా రేపు ఉదయమే కాలేజికెళ్ళాలి కదా” అంది తల్లి.


“లేదమ్మా!  నాన్న ఎంతరాత్రికి వచ్చినా ఇవాళ ఆయనతో కలసి భోజనం చేస్తాను” అన్నాడు సూర్య. 


కొడుకు కోర్కెను తీర్చటానికి నిద్రాహారాలు మానుకొని “ఆటో కావాలా బాబూ?” అంటూ అడుగుతున్న అలసట చెందిన తండ్రి ముఖం, మనోఫలకంపై కనిపిస్తున్న సూర్యకు ఏడుపాగటం లేదు. కొడుకును ఆ స్థితిలో చూసిన తల్లి “వీడికేమయ్యిందో?” అని తల్లడిల్లిపోతోంది. 


రాత్రి పదిగంటలకు ఆటో శబ్దం వినిపించింది. తండ్రి అడుగుల చప్పుడుకు ఆలోచనల ఝరినుండి బయటపడి, పరుగున వచ్చి తండ్రిని కౌగిలించుకుని వెక్కివెక్కి ఏడుస్తూ నిలబడి పోయాడు సూర్య. 


అమ్మానాన్న, లతలు “ఒరేయ్ సూర్య! ఏమయ్యిందిరా? ఏమైనా పీడకలొచ్చిందా ఏడుస్తున్నావు?” అంటూ ఆత్రంగా అడిగారు.


“ఏంకాలేదు!  నాకేమీ కాలేదు. అమ్మా! నాన్నకు తొందరగా అన్నం పెట్టు” అంటూ తండ్రి లోపలకు వెళ్ళటానికి దారినిచ్చాడు సూర్య. 


“పిచ్చి సన్నాసి! సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా పట్టలేం. బైక్ కొనుక్కోవటానికి అడిగిన సమయానికి డబ్బులు ఇచ్చానన్న సంతోషం వాడిది” అనుకుంటూ స్నానం చేయటానికి వెళ్ళాడు తండ్రి. ఆరోజు రాత్రి ఇంటిల్లిపాది కలసి కూర్చుని భోజనాలు పూర్తిచేసారు.


ఉదయానే అందరికంటే ముందుగా లేచి, గబగబా స్నానంచేసి అమ్మానాన్నలకు పాదాభివందనం చేస్తూ, “నాన్నా! నాకు కనువిప్పు అయ్యింది. ఈ డబ్బు నాకవసరం లేదు. నేను బైక్ కొనుక్కోవాలనే ఆలోచన నుండి బయటపడ్డాను. మా ఆనంద్‌సార్ నాకు చాలా గొప్ప విషయాలను తెలియజేశారు.


నాన్నంటే ఏమిటో,  కుటుంబ పెద్దగా ఆయన చేసే త్యాగాలు, మన జీవితాలను ‘సుమ’బాటగా చేయటానికి ఆయన నడచిన ముళ్ళబాటలను వివరించి చెప్పారు. అమ్మ ప్రేమ శ్వాసలాంటిదని, మనం కన్నుమూసేదాకా మనతోనే ఉంటుందని తెలుసుకున్నాను. ఇక అక్క ప్రేమ కర్పూరదీపం లాంటిది. నన్ను మార్చే దిశగా ఆమె చేసిన కృషి విలువకట్టలేనిదని అర్ధమయ్యింది.  ఇంత మంచి కుటుంబంలో పుట్టినందులకు నేను ఎంత ఉన్నతంగా బ్రతకాలో చెప్పారు ఆనంద్‌సార్”  అంటూ ఆర్తి నిండిన గొంతుతో పలికాడు సూర్య. 


“ఇకనుండి కేవలం చదువుకోవటమే కాదు, నేను కూడా కుటుంబం కోసం ఎంతోకొంత సంపాదన చేస్తాను”  అంటున్న సూర్యలో కలిగిన  మార్పుకు లత “ఇన్నాళ్ళకు వీడికి పట్టిన గ్రహణం విడిచింది. ఇకపై సూర్యునిలా ప్రకాశిస్తాడు” అని ఎంతో సంతోషపడింది. వాత్సల్యం నిండిన కళ్ళతో తమ్ముణ్ణి చూస్తూ మనస్సులోనే ఆనంద్‌సార్‌కు కృతజ్ఞతలను చెప్పుకుంది లత.

*****     

మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page