top of page

ధర్మభాగిని


'Dharmabhagini' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'ధర్మభాగిని' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గంభీర్ రావు మధ్య తరగతి కుటుంబీకుడు. చారుశీలతో వివాహమై పది ఏండ్లు. ‘అందానికి మారు పేరా..’ అన్నట్లుంటుంది చారుశీల. సంతానం ఇద్దరు కూతుర్లు. పెద్దకూతురు వైఢూర్యం, చిన్న కూతురు పుష్యరాగం. రత్నాల పేర్లు పెట్టుకున్నందుకు రత్నాల లాగ చాలా అందంగా ఉంటారు.


గంభీర్ రావు ప్రభుత్వ ఉద్యోగి. ఏ దురలవాటు లేని మనిషి. పేరుకు తగినట్టు గాంభీర్యము మాత్రము కనబరుచడు. చిన్న ఈడులోనే గతించిన తలిదండ్రులు గంభీర్ రావుకు మూల ధనం ఏమి మిగిల్చలేదు. కాక పోతె రెండు పడక గదుల ఇల్లు మాత్రం తోబుట్టులెవరు లేకపోవడము చేత. ఇతని స్వంతమయింది. కూతుర్లది ప్రాథమిక విద్య ఐనా పాఠశాల రుసుము తన సంపాదన స్థాయిని మించినదని వాపోతుంటాడు గంభీర్ రావు. చారుశీల కూడా స్వతంత్ర పాఠ శాలలో ఉపాధ్యాయినిగా చేరుతుంది. భర్త ఆదాయము తోడు వేన్నీళ్ళు చన్నీళ్ళుగా కుటుంబ పోషణకు కొంతైనా తన సంపాదన అక్కరకు వస్తుందని తలంపుతో.


ప్రతి సంవత్సరము పెరిగే వార్షిక వేతనాభివృద్ధి కాని, కరువు భత్యము కాని కుటుంబ వ్యయానికి తగినట్టు ఉండక ఏదో ఒక వ్యయము తగ్గింపు బాటలో సంసారము నడుస్తుంది. అక్రమ సంపాదన, లంచాల జోలికి పోవుట, స్వతంత్ర వ్యాపారము చేయుట మున్నగు వాటికి మనసొప్పని మనిషి గంభీర్ రావు.


ధర్మభాగిని (భార్య)అయిన చారుశీల భర్తకు సదా సహకారధోరణే వ్యక్తపరుస్తుంది. కలతలు లేని కుటుబమైనా డబ్బు కొరత దంపతుల మనసు నిర్వేదానికి గురి చేస్తుంది. తాను జదివిన ‘సుదర్శన శతక చక్రకము లో గల 'ఆత్మజన్మ శతకము 'లోని రెండు పద్యాలు చదివి భర్తకు వినిపిస్తుంది చారుశీల.


‘దీప మింట యనగ ధీతయె గానుండు

కొమరి యుండ నింట కొదువ లేదు

భాగ్య దేవతనగ బాలిక గల్గుటె

ఆత్మజింట బుట్ట అందమనగ’


‘కనగ ఆడ పిల్ల కాబోవు అమ్మయె

ఆడ పిల్ల బుట్ట అదియె దిష్ట

సంపదెంతొ బెరుగు సంసృతి యందున

ఆత్మజింట బుట్ట అంద మనగ’


“విన్నారా ఇప్పుడు ఆడ పిల్ల లంటె ఎంత అదృష్టమో” అంటుంది చారు శీల.


“అది సరే గాని చారూ (భార్యను ప్రేమగా పిలిచే పేరు)దిన దినము ధరలు విపరీతంగా పెరుగబట్టె. అదనపు రాబడి గూర్చి ఎంత ఆలోచించినా మనసుకు తట్టదాయె. సెలవులు పెట్టే వీలు లేదాయె. ఏదో ప్రయోగాత్మకంగా వ్యాపారము చేయడానికి” అంటుంటె చారుశీల ఒక సలహా ఇస్తానంటుంది.


“ఏమిటా సలహా” అని అడుగుతాడు గంభీర్ రావు.


“సుఖంగా బ్రతకాలంటె కష్టపడాలి” అంటుంది భార్య చారుశీల.


“అదే చారూ.. ఏమిటా కష్టము? ఇప్పుడు మనమిద్దరము కష్టపడడము లేదా.. అందులో కష్టము నీదే అధికమాయె. ఇక నేను ఏమి చెయాలో చెప్పు” అని అంటాడు గంభీర్ రావు.


“ఏమీ లేదు. మన ఇంటి డాబా మీద అన్ని రకాల కూరగాయలు పెంచుదాము. రోజూ తాజా కూరగాయలు తినుటవల్ల కొంత వ్యయము కలిసొస్తుంది. మిగిలితే ఎవరికైన అమ్మవచ్చు. అదికొంత ఆదాయము. శ్రమ చేయడము వలన ఆరోగ్యము చక్కగా ఉంటుంది. మంచి నిదుర పడుతుంది. రోజూ కూరగాయలకని బజారుకు పోయే పని తప్పుతుంది” అంటుంది చారుశీల.


“ఆలోచన బాగుంది చారూ! నేడే తొట్లు, ఎరువు, కూరగాయ గింజలు కొందాము. ఆలసిస్తే మళ్ళీ బద్దక మేర్పడి ఇవాళిటి ఉత్సాహము మరుగున పడి పోతుంది” అని పిల్లలకు జాగ్రత చెప్పి భార్యా భర్తలిరువురు బజారుకు పోతారు. రెండుమూడు గంటలు తిరిగి తొట్లు, ఎరువులు పంపమని దుకాణుదారుకు చిరునామా ఇచ్చి రక రకాల కూరగాయల గింజలు కొనుక్కొని ఇంటి దారి పడుతారిద్దరు.


తెల్ల వారే సరికి తొట్లు, మట్టి, ఎరువు రాగానే దాబా పైన పెట్టమని, తెచ్చిన వారికి కష్టమునకు తగిన కూలి చెల్లిస్తాడు గంభీర్ రావు. ఆ రోజు సెలవు దినము కావడముతో వంట త్వరగా చేసుకొని తొట్లలో ఎరువు, మట్టి తగినట్టు వేసి విత్తనాలు చల్లుతారు. మధ్యాహ్నము భోజనము చేసి కొంత సేద దీర్చుకుంటారు. ఇక రోజూ కార్యాలయమునుండి ఇంటికి వచ్చిన గంభీర్ రావుకు, అంతకు ముందే ఇల్లు చేరిన చారుశీలకు సాయంత్ర ఫలహారం ముగియగానే మొక్కల పెంపకము పని తో సంతోషంగా కాలం గడుపుతారు.


పిల్లల చదువులను గూర్చిన శ్రద్ధ మరువరు. మొత్తం మీద వారం పది రోజులకే ఏదో ఒక కూర చేతికి రావడము తో గంభీర్ రావుకు దిగులు లేకుండా అవుతుంది.


పొదుపు విధము అనగ పొలతేను దెలియగ

అదుపు నుంచు వ్యయము ఆవసథము

భవిత గూర్చి ఇంట భార్యకె దెలియగ

ధర్మ భాగి నుండ ధర్మ మింట

దాసి మంత్రి లక్ష్మి ధరణి గణిక మాత

అనగ ఇంతి దలచి ఆచ రించు

భార్య విధులు జేయు బాధ్యత అనుచును

ధర్మ భాగి నుండ ధర్మ మింట

తల్లి దండ్రి యింక తనవారి నందర్ని

వదలి వచ్చు దాను వధువు అగుచు

ప్రేమ తోడ సతిని పెంచగ సుఖమన

ధర్మ భాగి నుండ ధర్మ మింట


ధర్మభాగిని శతకములోని పద్యాలు వల్లించుచు హుషారుగా భార్య చారుశీలతో అంటాడు. “చారూ అనుభవ పూర్వకముగా వ్రాసెనేమొ శతక రచయిత. నాకు మాత్రము అనుభవమౌతున్నది.. నీ సలహాలు ఏవి పాటించినా అవి సఫలీకృత మవుతున్నవి” అని అంటాడు భార్యవైపు చూచుచు గంభీర్ రావు.


“నాదేముందండి.. నాకు తోచినదేదో చెప్పాను. అందులో నా గొప్పేమి లేదు. మన సంసార బండిని లాగడానికి ఇద్దరమూ భద్రములమే. కాకపోతె వలపటి.. దాపటి.. అంతే భేదము” అంటుంది చారుశీల.


బండి గట్ట రెండు భద్రము లుండను

దాప టెద్దు జూచి దారి కనగ

వలప టెద్దు వచ్చు బడలిక అనకను

అటులె ఆలు మగలు ఆవ సధము.


“ఈ పద్యము ప్రకారమే మన సంసార శకటము నడుస్తున్నది చారూ. నీకు నేను కృతజ్ఞుడను” అంటాడు గంభీర్ రావు.


“అదేమి లేదు. ప్రకృతిలోనే భగవంతుడు అన్నీ రెండుగా సృష్టించాడు. మనము ప్రకృతి ధర్మాన్ని పాటిస్తే చాలు. ఒడిదుడుకుల గనబోము” అంటుంది చారుశీల.


ఉన్న రెండు వందల గజాల ఇంటి డాబా మీదనే కుటుంబానికి అక్కర రాగా చుట్టుపక్కల వారికి సరసమైన ధర కూరగాయలు తాజాగా అదీ ఎప్పుడు పడితె అప్పుడు అందుబాటులో ఉండడముచే వీళ్ళ దగ్గరనే కొనడము ఆరంభించారు. ఇక నిరంతరముగా కూరగాయల సాగు చేయుచు ఆర్థికముగా పుంజుకుంటారు.


పసిపిల్లల పెంచినట్టు మొక్కలను పెంచడముచే ఇల్లువదలి దూర ప్రయాణము చేయుట గూడ మానవలసి వచ్చిందా కుటుంబానికి.చిత్త శుద్ధి తోడ చేసిన కష్టంబు

ఊర కనగ బోదు ఉండు సుఖము

సరఘ జీవు లెట్లు సారఘ మందెనొ

కష్ట మటులె జేయ కలుగు జయము.


కొంత కాలానికి భార్యా భర్త లిద్దరి రాబడి తోడు, కూరగాయల పెంపకముతొ అదనపు రాబడి మూడవ ఉద్యోగముగా నెల నెల గల్లా నిండ సాగింది. ఇప్పుడు గంభీర్ రావుకు దిగులు తప్పింది. ఇంట సద్గుణవతి భార్య, చక్కదనాల కూతుర్లు ఉండగా, ఆయన కుటుంబ శ్రేయస్సుకు ఆర్థిక లోపమనే అడ్డూ తొలగింది. కృషితో నాస్తి దుర్భిక్షం అను సామెత రుజువు చేసి చూపించారు దంపతులు.


సమాప్తం.

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-35 views0 comments

Comments


bottom of page