top of page
Original.png

తిరప్తి

 #MKKumar, #ఎంకెకుమార్, #తిరప్తి, #thirapthi, #tpt, #తిరుపతి,#TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Thirapthi - New Telugu Story Written By - M K Kumar

Published in manatelugukathalu.com on 17/02/2026

తిరప్తి - తెలుగు కథ

రచన: ఎం. కె. కుమార్


సాయంత్రం ఐదు గంటలు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో రైలు ఆగింది. బోగీ నుండి దిగిన రఘురామ్ పాదాలు ఆ నేల మీద పడగానే, శరీరం మొత్తం ఒక తెలియని విద్యుత్ ప్రవహించినట్లయింది.


ముప్పై ఐదు సంవత్సరాలు... సరిగ్గా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి సొంత గడ్డ మీద కాలు మోపుతున్నాడు.


అమెరికాలోని డాలస్ నగరంలో గడిపిన యాంత్రిక జీవితం, ఏసీ గదుల చల్లదనం, వీకెండ్ పార్టీల హడావిడి ఏదీ ఇప్పుడు అతని మనసులో లేదు. కేవలం ఒకే ఒక ఆలోచన…


"నా ఊరు... నా తిరుపతి."


స్టేషన్ బయటకు వచ్చాడు. ఒకప్పుడు ఇక్కడ కనిపించే నిదానమైన వాతావరణం లేదు. ఆటోల రణగొణధ్వనులు, మైకుల్లో అనౌన్స్‌మెంట్లు, జనసందోహం.


ఏదో జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా అనిపించింది రఘురామ్‌కి. ఒక టాక్సీని పిలిచాడు.


"సార్, ఎక్కడికి వెళ్ళాలి?" డ్రైవర్ అడిగాడు.


"ఊరంతా..." అన్నాడు రఘురామ్ చిన్నగా నవ్వుతూ.


డ్రైవర్ అర్థం కానట్లు చూశాడు.


"సరే, ముందు గాంధీ రోడ్ వైపు పోనీ..." అని చెప్పాడు.


కారు కదులుతుంటే, రఘురామ్ మనసు కాలంలో వెనక్కి ప్రయాణించడం మొదలుపెట్టింది. అద్దం లోంచి బయటకి చూస్తున్నాడు కానీ, అతని కళ్ళకు కనిపిస్తున్నది వేరు.


కారు టౌన్ క్లబ్ మీదుగా వెళ్తుంటే, రఘురామ్ కళ్ళు ఆత్రంగా వెదికాయి. ఒక పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ అక్కడ ఠీవిగా నిలబడి ఉంది.


రఘురామ్ గుండెలో ఒక సన్నని ముల్లు గుచ్చుకున్నట్లయింది.


అది రామకృష్ణ థియేటర్.


అది కేవలం ఒక థియేటర్ కాదు, అదొక దేవాలయం. రఘురామ్ కళ్ళు చెమ్మగిల్లాయి.


శంకరాభరణం సినిమా విడుదలైన రోజు గుర్తొచ్చింది.


అదొక పండగ. ఆ హాల్లో ఎస్.పి.బాలు గొంతు నుండి "శంకరా... నాదశరీరాపరా..." అని పాట వస్తుంటే, రోమాలు నిక్కబొడుచుకునేవి.


జనం ఊపిరి బిగబట్టి వినేవారు. సినిమా అయిపోయాక కూడా ఆ మత్తులో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిన రోజులు అవి.


ఇప్పుడు? ఆ సంగీతం లేదు, ఆ కళ లేదు. అక్కడ నివసించే వారికి తెలుసా, తాము నిలబడ్డ నేల మీద ఒకప్పుడు ఒక అద్భుతమైన కళాఖండం ప్రదర్శించబడిందని?


కాస్త ముందుకు వెళ్తే ఐ.ఏస్.మహల్. ఒకప్పుడు ఇంగ్లీషు సినిమాలు చూడాలంటే తిరుపతి కుర్రాళ్ళకి అదొక స్వర్గధామం.


బాండ్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు అక్కడ చూసి, కాలర్ ఎగరేసుకుని తిరిగిన రోజులు.


ఇప్పుడు ఆ మహల్ మూగబోయింది. రంగు వెలిసిపోయి, ఏకాకిగా నిలబడి, గతం తాలూకు వైభవాన్ని తలచుకుని రోదిస్తున్న వృద్ధురాలిలా ఉంది.


మరింత ముందుకు వెళ్తే, అప్పట్లో తక్కువ స్థలంలోనే ఒక ఆర్కిటెక్చర్ అద్భుతంలా కట్టిన శ్రీనివాస మహల్.


ఆ మెట్లు, ఆ బాల్కనీ డిజైన్ చూసి ముచ్చటపడేవారు.


కానీ నేడు? అక్కడొక పెద్ద 'సౌత్ ఇండియా షాపింగ్ మాల్' వెలిసింది. కళాస్వప్నాలు కాల్సిన చోట, ఇప్పుడు పట్టుచీరల వ్యాపారం నడుస్తోంది.


ఆప్యాయతల స్థానంలో అమ్మకాల వ్యవహారాలు చేరాయి. టికెట్ కోసం క్యూలో నిలబడ్డ స్నేహం, ఇప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గర నిలబడ్డ సహనంగా మారిపోయింది.


కారు వెస్ట్ పోలీస్ స్టేషన్ వైపు మలుపు తిరిగింది. రఘురామ్ చిన్నప్పుడు ఆ ఏరియా వైపు రావాలంటేనే భయపడేవాడు.


అదొక 'భూత్ బంగాళా'లా ఉండేది. పాతకాలపు రాతి కట్టడం, చుట్టూ భయం గొలిపే చెట్లు. కానీ ఇప్పుడు అక్కడ కార్పొరేట్ లుక్ వచ్చింది.


భయం పోయింది కానీ, ఆ గంభీరత్వం కూడా పోయింది.


రఘురామ్ డ్రైవర్ ని ఆపి, నడవడం మొదలుపెట్టాడు. పర్సాల వీధి లోకి అడుగుపెట్టాడు.


అక్కడ అడుగువేయగానే అతని నాసికాపుటాలకు ఏదో వాసన తగలాలి: అగరుబత్తుల వాసన, పసుపు కుంకుమల వాసన.


కానీ ఇప్పుడు డ్రైనేజీ వాసన, వాహనాల పొగ వాసన. ఒకప్పుడు ఈ వీధిలో యాత్రీకుల జోరు తిరునాళ్ళను తలపించేది.


ప్రతి ఇంటి అరుగు మీద అమ్మమ్మలు కూర్చుని కాశీదారాలు (నల్ల దారాలు) అల్లేవారు. అది కేవలం దారం కాదు, భక్తితో ముడివేసిన నమ్మకం.


ప్రతి ఇల్లు ఒక చిన్నపాటి కుటీర పరిశ్రమలా ఉండేది. దారాలు అల్లుతూనే, ఊరి సంగతులు, మంచి చెడ్డలు మాట్లాడుకునేవారు.


ఆ అమ్మమ్మల ముడతలు పడ్డ చేతుల్లో ఎంత ప్రేమ ఉండేది! ఇప్పుడు అరుగులు లేవు, గ్రిల్స్ పెట్టిన గేట్లు మూసుకుని ఉన్నాయి. మనుషులు లోపల ఉన్నారు, కానీ మనసులు ఎక్కడున్నాయో?


నడుచుకుంటూ గాలి వీధి వైపు వచ్చాడు. అక్కడ ఒకప్పుడు వినిపించే సంగీతం వేరు. ఉదయాన్నే ఆడవాళ్లు ఇత్తడి బిందెలు చంకన పెట్టుకుని, నీళ్ల కోసం వెళ్తుంటే వచ్చే ఆ 'గలగల' శబ్దం..


అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలంత శ్రావ్యంగా ఉండేది. ఆ బిందెల శబ్దం, పట్టీల శబ్దం, పరస్పరం పలకరించుకునే నవ్వుల శబ్దం... అదొక సామూహిక జీవన రాగం.


రఘురామ్‌కి దాహం వేసింది. చుట్టూ చూశాడు. ఎక్కడా చేదబావులు కనిపించలేదు.


చిన్నప్పుడు దాహం వేస్తే, ఏ ఇంటి ముందర ఆగి, బావిలో చేద వేసి, గలగలా నీళ్లు తోడుకుని, దోసిలి నిండా తాగుతుంటే... ఆ అమృతంలాంటి నీటి రుచి ఇంకా నాలుక మీద గుర్తుంది.


ఆ బావులను ఎప్పుడో బోర్లు మింగేశాయి. పోనీ బోర్లు ఉన్నాయా అంటే... ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు దాహం తీర్చిన ఆ ఇనుప బోర్లు కూడా కనుమరుగైపోయాయి.


ఇప్పుడు దాహం వేస్తే జేబులో డబ్బులుండాలి, షాపులో ప్లాస్టిక్ బాటిల్ కొనాలి. గంగమ్మ తల్లి కూడా వ్యాపార వస్తువు అయిపోయింది.


నడుస్తుంటే మహావీర్ టాకీసు గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ 'శ్రీదేవి కాంప్లెక్స్' నిలబడి ఉంది.


సినిమా ఇంటర్వెల్‌లో బయటకు వచ్చి, పక్కనే ఉన్న బండి మీద జాలీ ఐస్ కొనుక్కుని తినడం... ఆ చల్లదనం, ఆ తీపి... ఇప్పుడు ఏ బ్రాండెడ్ ఐస్ క్రీమ్‌లోనూ దొరకదు.


సాయంత్రం అయితే చాలు రోస్ మిల్క్ కోసం స్నేహితులతో పోటీ పడేవాళ్ళు. ఆ రంగు, ఆ సువాసన... అదొక ఎమోషన్.


ఊరు చివరన ఉండే ఊర్వశి హోటల్. అక్కడ దొరికే దోశ, సాంబార్ రుచి... అమృతంతో సమానం. ఇప్పుడు ఆ హోటల్ లేదు, ఆ రుచి లేదు. అంతా ఫాస్ట్ ఫుడ్ మయం. నిలబడి తినే తొందర, పరిగెత్తే జీవితం.


రఘురామ్ కాళ్ళు బరువుగా కదులుతున్నాయి. మనసులో ఒకటే ఆవేదన. తన బాల్యాన్ని వెతుక్కుంటూ ఎస్వీ హైస్కూల్ ఉన్న వైపు వెళ్ళాడు.


లక్షలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిన సరస్వతీ ఆలయం అది. కానీ అక్కడ... శూన్యం. స్కూల్ లేదు. పిల్లల అల్లరి లేదు, మాస్టర్ల పాఠాలు లేవు.


"నిక్కరు పోలీసు" అని భయపెట్టే డ్రిల్ మాస్టర్, చేతిలో బెత్తం పట్టుకుని తిరిగే హెడ్ మాస్టర్... ఎక్కడికి పోయారు? ఆ బెంచీల మీద పేర్లు చెక్కుకున్న జ్ఞాపకాలు ఏమైపోయాయి?


వేలాడుతూ బడికెళ్ళిన ఒంటెద్దు బండ్లు లేవు. అప్పట్లో స్కూల్ కి వెళ్లడమే ఒక సాహస యాత్ర.


రిక్షాల చప్పుడు, చిత్తానూరు పంచమికి వెళ్లే గుఱ్ఱపు బండ్ల టకటకలు... అన్నీ నిశ్శబ్దమైపోయాయి.


రఘురామ్‌కి సంక్రాంతి రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు ఊరంతా ముగ్గులతో నిండిపోయేది.


సన్నాయి రాగాలు గాలిలో తేలియాడేవి. వీధి వీధిన గొబ్బెమ్మలు కనువిందు చేసేవి. ఇప్పుడు అపార్ట్‌మెంట్ కారిడార్లలో స్టిక్కర్ ముగ్గులు.


గొబ్బెమ్మలు కరువు. మట్టి వాసన తెలియని తరానికి గొబ్బెమ్మల గొప్పతనం ఏం తెలుస్తుంది?


గంగ జాతర వస్తే చాలు... గంగ వేషాలకు కూర్చే దండకాయల హడావిడి ఉండేది. పూల వేషాలు చూస్తుంటే కళ్ళు మిరుమిట్లు గొలిపేవి.


తప్పేట పలకల మోత గుండెను తాకేది. పులి వేషాలు వేసే పొగరుబోతులు వీధుల్లో తిరుగుతుంటే, పిల్లలు భయంతోనూ, ఆశ్చర్యంతోనూ చూసేవారు.


ఇప్పుడు ఆ వేషాలు తగ్గాయి, ఆ ఆవేశం తగ్గింది. అంతా డీజే పాటల హోరు. సంప్రదాయం డిజిటల్ తెర వెనుక దాక్కుంది.


వీధి చివర, ఒకప్పుడు సోది చెబుతాననే సోదక్క కూర్చునేది. ఆమె మాటల్లో ఏదో నమ్మకం ఉండేది.


వేకువ జామున "బుడుబుడుక్కు... బుడుబుడుక్కు" అంటూ శబ్దం చేస్తూ లేపే బుడబుడక్కలోడు లేడు.


వాళ్ళంతా ఏమైపోయారు? ఈ నగర నాగరికత వాళ్ళను ఏ మూలకు నెట్టేసింది? కొర్లగుంట చివరిలో విజయా టెంట్ లేదు, పద్మావతి పురం వద్ద మరో టెంట్ లేదు.


పాత తిరుమల బస్ స్టాండ్ వద్ద ఇండియా కాఫీ షాప్‌లో కూర్చుని, గంటల తరబడి లోకాభిరామాయణం మాట్లాడిన రోజులు... ఆ కాఫీ సువాసనలో కలిసిపోయాయి.


ఇసుక వీధిలో ఇసుక లేదు, కర్నాల వీధి కురచైపోయింది. కొత్తగా కనిపించే కొత్తిండ్లు లేవు, అన్నీ ఒకేలా ఉన్న అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్‌మెంట్లు.


నరకమవుతున్న నగరం


రఘురామ్ గోవిందరాజస్వామి గుడి వైపు నడిచాడు. చిన్నప్పుడు తలెత్తి చూస్తే ఆకాశాన్ని తాకుతున్నట్టుండే ఆ గాలిగోపురం...


ఇప్పుడు చుట్టూ పెరిగిన బహుళ అంతస్తుల భవనాల మధ్య ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్టు, చిన్నగా అయిపోయినట్టు అనిపించింది. ఊరంతా ఎవరెస్టులా నిలిచిన గోపురం... ఇప్పుడు కనబడనంత చిన్నదైపోయింది.


ఉల్లిపట్టెడ... ఒకప్పుడు ఊరికి దూరంగా, ప్రశాంతంగా విసిరేసినట్టుండేది. ఇప్పుడు అది కూడా సిటీ ట్రాఫిక్‌లో ఒక భాగం. ముక్కు టెంపోలు, మూతి బస్సులు... ఆ విచిత్రమైన వాహనాలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్ కార్లు, బైకులు.


"ఎదరా... మేలా..." అంటూ పిల్లలు గోలీలాటలు ఆడే దృశ్యం కోసం రఘురామ్ కళ్ళు వెతికాయి.


కానీ ఒక్క పిల్లాడు కూడా వీధిలో లేడు. అందరూ నాలుగు గోడల మధ్య, సెల్ ఫోన్ల వెలుగులో బందీలు. బొంగరాలై తిరిగిన బాల్యం లేదు. పిల్లల అల్లరి లేని వీధులు శ్మశానాల్లా ఉన్నాయి.


ఊరు మారిపోయింది. తిరుపతి నగరమైంది... కానీ నెమ్మదిగా నరకమైపోతోందా? పెరిగిపోయిన ఊరు ప్లై ఓవర్ల మయం. ఆకాశం ఎత్తుండే భవనాలు వెలిశాయి. కానీ తరిగిపోతున్న మానవతా విలువలను ఎవరు గమనిస్తున్నారు?


ఒకప్పటి ఊరు "అమ్మ"లా ఆదరించేది. ఎవరు వచ్చినా గుండెలకు హత్తుకునేది. కానీ ఇప్పుడు ఊరు "అనాథ"ను చేసేస్తోంది. పక్క ఇంట్లో ఎవరున్నారో తెలియని స్థితి.


రఘురామ్ గుండె బరువెక్కింది. కోనేటి కట్ట మీద కూర్చున్నాడు. కళ్ళ ముందు నీళ్లు మసకబారుతున్నాయి.


"నా తిరుపతి నాకు కావాలి... నా చిన్ననాటి స్నేహితులు, ఆ స్వచ్ఛమైన గాలి, ఆ మనుషులు... అంతా ఎక్కడికి పోయారు?" అని మనసులోనే రోదించాడు.


"ఏమయ్యా... కొత్తగా వచ్చావా? అలా చూస్తున్నావ్?" అని ఒక గొంతు వినిపించింది.


రఘురామ్ తలతిప్పి చూశాడు. ఒక వృద్ధుడు. చేతిలో సంచి, ముఖం మీద చిరునవ్వు, నుదిటిన నామం.


"నేను ఇక్కడే పుట్టాను... కానీ ఇప్పుడు పరాయివాడిలా ఉన్నాను," అన్నాడు రఘురామ్ నిరాశగా.


ఆ వృద్ధుడు నవ్వాడు. ఆ నవ్వులో ఏదో పరిచయం.


"రఘూ... నువ్వేనా?" ఆశ్చర్యంగా అడిగాడు ఆ వృద్ధుడు.


రఘురామ్ నిశితంగా చూశాడు. ఆ కళ్ళు... ఆ నవ్వు...


"శీను గాడివా?" రఘురామ్ గొంతులో వణుకు.


అంతే. ఇద్దరూ చిన్నపిల్లల్లా కౌగిలించుకున్నారు. ముప్పై ఏళ్ల దూరం ఆ ఒక్క కౌగిలింతలో కరిగిపోయింది.


శీను చేతులు రఘు భుజాల మీద ఆసరాలా నిలిచాయి.


"ఊరు మారిపోయిందని బాధపడుతున్నావా రఘూ?" శీను అడిగాడు, రఘు కళ్ళలోని ఆవేదనను చదివినట్టు.


"అవును శీను. రాముడి గుడి తేరు లాగినప్పుడు స్కూల్‌కు సెలవు వచ్చేది కదా... ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు తేరు ఉంది, కానీ ఆ ఉత్సాహం లేదు. ఇడియాప్పం లేదు, ఉప్పు బస్తాలు తిరిగి అమ్మేవారు లేరు... నా ఊరు తప్పిపోయింది శీను," అన్నాడు రఘురామ్.


శీను చిరునవ్వుతో రఘు చేతిని పట్టుకుని, గోవిందరాజస్వామి గోపురం వైపు చూపించాడు.


"నిజమే రఘూ. రాళ్లు మారాయి, రంగులు మారాయి. ప్లై ఓవర్లు వచ్చాయి, చెట్లు పోయాయి. కానీ... ఇక్కడ చూడు..." అంటూ తన గుండె మీద చేయి వేసుకున్నాడు.


"తిరుపతి ప్రాణం భవనాల్లో లేదు రఘూ. అది ఇంకా ఇక్కడి మనుషుల గుండెల్లోనే ఉంది. నువ్వు చూసే కోణం మార్చు. ఆకాశహర్మ్యాల వెనుక దాక్కున్న వెంకన్న ఇంకా అలాగే ఉన్నాడు. మనిషి వేషధారణ మారింది కానీ, పిలుపులో ఆర్తి మారలేదు."


శీను, రఘుని తీసుకుని దగ్గర్లోని ఒక చిన్న టీ కొట్టుకు తీసుకెళ్లాడు. అక్కడ నలుగురు స్నేహితులు చేరారు. పాత జోకులు, చిన్ననాటి జ్ఞాపకాలు,


'నిక్కరు పోలీసు' మాస్టర్ గురించి వెటకారాలు... అరగంటలో రఘురామ్ ముఖంలో మళ్ళీ పాత వెలుగు వచ్చింది.


అప్పుడు అర్థమైంది రఘురామ్‌కి.


కనిపించే భవనాలు, రోడ్లు మాయమవ్వచ్చు. కానీ, కనిపించే స్నేహితుల చిరునవ్వులో వెతుక్కుంటే... ఆనాటి మా ఊరు టక్కున జ్ఞాపకమై మెరుస్తోంది.


ఆ అపార్ట్‌మెంట్ వెనుక రామకృష్ణ థియేటర్ జ్ఞాపకం ఇంకా బ్రతికే ఉంది.


ఆ షాపింగ్ మాల్ వెనుక శ్రీనివాస మహల్ దర్పం స్నేహితుల మాటల్లో ఇంకా వినిపిస్తోంది.


రఘురామ్ లేచి, తిరుమల కొండల వైపు చూశాడు.


ఊరు మారిపోవచ్చు. నాగరికత అనే ముసుగులో నరకంలా అనిపించవచ్చు. కానీ, ఎక్కడో ఒక మూల, ఒక స్నేహితుడి పలకరింపులో, ఒక గుడి గంట శబ్దంలో, ఇంకా మిగిలి ఉన్న ఆ మానవత్వంలో...


మన తిరుపతి ఎప్పటికీ ఒక భూతల స్వర్గమే.


ఆ సాయంత్రం, రఘురామ్ మళ్ళీ తన ఊరిని ప్రేమించడం మొదలుపెట్టాడు. అది అమ్మ లాంటి ఊరు. అమ్మ ముసలిదైపోవచ్చు, రూపురేఖలు మారిపోవచ్చు... కానీ అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు కదా.


సమాప్తం


ఎం. కె. కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: ఎం. కె. కుమార్


నేను గతంలో ఎప్పుడో కథలు, కవితలు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. నేను పీజీ చేశాను. చిన్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నాను. కథలు ఎక్కువుగా చదువుతాను.


🙏

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page