top of page
Original.png

గుర్తులేని జ్ఞాపకాలు

#GurthuleniJnapakalu, #గుర్తులేనిజ్ఞాపకాలు, #PulletikurthiNagesh, #పుల్లేటికుర్తినగేష్, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

                                  

Gurthuleni Jnapakalu - New Telugu Story Written By Pulletikurthi Nagesh Published In manatelugukathalu.com On 17/02/2026

గుర్తులేని జ్ఞాపకాలుతెలుగు కథ

రచన: పుల్లేటికుర్తి నగేష్ 

నేను రిటైర్ అయిన తరువాత మా ఈ కాలనీ లో పార్క్ కి అప్పుడప్పుడు వస్తుంటాను. 

అలానే ఈ రోజు వచ్చి కూర్చున్నాను చల్లగాలికి. 


చుట్టూ వున్న చెట్లు, 

వాటిలో సాయంత్రం గూటికి చేరుకుంటున్న పక్షుల కిల కిల ధ్వనులు, 

పార్క్ లో ఆడుకుంటున్న పిల్లలు, 

దూరంగా పిల్లల్ని చూస్తూ మురిసిపోతున్న తల్లులు, తండ్రులను చూస్తూ కూర్చున్నాను. 


నా బెంచీ మీదే ఆ చివరన ఒక కుర్రాడు, కుర్రాడు కాదు మధ్య వయస్కుడు, సుమారు 40 - 45 సంవత్సరాల వయస్సు వుంటుంది. 

కొంచెం దిగాలుగా కూర్చున్నాడు. 

చుట్టూ వున్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నా అంతగా ఎంజాయ్ చేస్తున్నట్లు నాకు అనిపించలేదు. 


ఏవో కుటుంబ సమస్యలు అనుకుంటాను. 

అవును ఈ వయసులో పిల్లల చదువులు, ఇళ్ల సమస్య, తల్లి తండ్రుల ఆరోగ్య సమస్య ఇలాంటివన్నీ చుట్టుముట్టే వయస్సు మరి. 

మన వయసు వాళ్ళందరూ ఇవన్నీ దాటుకునే వచ్చాం కదా.. 

అలా అనుకుంటూ.. వుండబట్టలేక పలకరించాను. 


“బాబూ! నా పేరు రామారావు. ఇక్కడే ఈ కాలనీ లోనే వుంటాను. 

నీకు అభ్యంతరం లేకపోతే నీ పేరు, నీ గురించి చెప్పు.. నిన్ను చాలాసార్లు ఇక్కడే పార్క్ లో చూశాను.. 

పార్క్ లోనే కాదు మా ఇంటికి కూడా వస్తుంటావనుకుంటున్నా.. మా అబ్బాయి ఫ్రెండ్ వా.. లేక ఇదే కాలనీలో పరిచేయమా.... 

మనకి కూడా కొంచెం టైమ్ పాస్ అవుతుంది, ” అన్నాను చిన్నగా నవ్వుతూ. 


అబ్బాయి “అదేం లేదు సార్.. నాపేరు పృధ్వీ. నేను కూడా ఈ కాలనీలోనే వుంటాను. 

నాకు భార్య మనస్వి, ఇద్దరు పిల్లలు రాహుల్, ప్రియాంక. 

అమ్మ లేదు, నాన్న వున్నారు, కొంచెం ఆరోగ్యం సరిగా వుండదు.”


“అవునా.. ఏమైనా పెద్ద ఆరోగ్య సమస్యా.. అంత దిగులుగా వున్నావు”


“లేదండీ! అంత పెద్దదేమీ కాదు. వయసుతో వచ్చే సమస్య.. ట్రీట్మెంట్ జరుగుతోంది.. మరి మీరు?” అన్నాడు ఆసక్తిగా.. 


“చెప్పాగా.. నా పేరు రామారావు. నాకు భార్య, ఒక కొడుకు వున్నారు. 

ఆవిడ పేరు.. పేరు.. ఆ.. కాత్యాయిని. ఇప్పుడు లేదులే.. కాలం చేసింది చాన్నాళ్ళ క్రితం. నీ భార్య పిల్లల గురించి చెప్పు.. ”


“మనస్వి టీచర్ గా ఉద్యోగం చేస్తుంది.. బాబు బి.టెక్. ఫైనల్ ఇయర్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్."

 

"అవునా.. నా మనవడు మనవరాలు కూడా అంతే అనుకుంటాను" అన్నాను, గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ.. 


"అంత అర్జెంట్ లేదు.. గుర్తు చేసుకుని చెప్పండి ఫర్వాలేదు.." అన్నాడు చిన్నగా నవ్వుతూ.. నా మతిమరుపు చూసి నవ్వుకుంటున్నట్లు వుంది... అయినా నాకేం అంత మతి మరుపు లేదు.. 


"అవును. మీ పిల్లలలాగే నా మనవడు మనుమరాలు కూడా బి.టెక్. ఫైనల్ ఇయర్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్” అన్నాను. 


“బాబు కంప్యూటరు సైన్స్.. పాప బైపీసీ.”. 

నాకు మతిమరుపు లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం డీటైల్ గా చెప్పాను. 


“మా అబ్బాయి ఏదో ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తాడు. ”


“ఏ ఆఫీసు?”


“సరిగా గుర్తుకు రావడంలేదు. బహుశా AG ఆఫీసు అనుకుంటా.. ”


“AG ఆఫీసులో ఏం చేస్తుంటారు మీ అబ్బాయి.. 

మీ కోడలు ఏం చేస్తుంటుంది.. 

మీరు ఎప్పుడు ఎక్కడ ఏ ఉద్యోగం లో రిటైర్ అయ్యారు.. గుర్తు చేసుకుని చెప్పండి ఫర్వాలేదు.... ”


చూస్తుంటే నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నట్లు అడుగుతున్నాడు... 

“నాకంత గుర్తులేదులే గాని.. 

నువ్వు మీ నాన్న గారి ఆరోగ్యం గురించి చెప్పు.. చూస్తుంటే చాలా దిగులు పడుతున్నట్లున్నావు... 

వయసు పెరుగుతున్న కొలది వృద్ధాప్యపు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. 

అశ్రద్ధ చేయ కుండా కొంచెం దగ్గరుండి చూసుకుంటే అన్నీ సర్దుకుంటాయి. 

ఇంతకీ ఏమిటి సమస్య అభ్యంతరం లేకపోతే చెప్పు.. ”


అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి ఇంటికి వెళ్లిపోతే బాగుణ్ణు అనుకుంటున్నాను.. 


ఇంతలో సుమారు 15 సంవత్సరాలు వుంటాయి, ఒక పాప వచ్చి “పద తాతయ్య.. చాలా ఆలస్యం అయింది.. ” అని నా చేయి పట్టుకుంది... 

అలానే పక్కకు తిరిగా. 


“పద నాన్న వెళ్దాం చీకటి పడుతుంది.. లేట్ అయితే అమ్మ తిడుతుంది.. ”. అని రెండు చేతులతో మా ఇద్దరి చేతులు పట్టుకుని లేపింది.... 


'అంటే ఈ పాప నా మనుమరాలా.. ఈ అబ్బాయి మా అబ్బాయి పృధ్వీ నా.. అప్పుడే అనుకున్నా బాగా తెలిసిన మనుషులు వీరిద్దరూ అని.. 

ఏంటో ఏదీ వెంటనే గుర్తుకు రావడం లేదు..' అనుకుంటూ.. 


ఆ చిన్నారి చేయిపట్టుకొని చీకటి పడుతున్న ఆ పార్కు నుండి మెల్లగా బయటకి అడుగులు వేశాను.. 

వెలుతురుని వెతుక్కుంటూ.. 

 

సమాప్తం

***

పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

పేరు: పుల్లేటికుర్తి నగేశ్ 

వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం. 

వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్ 

పుట్టిన ఊరు;;;;  శ్రీకాకుళం 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page