సెప్టెంబర్ 21 – ప్రపంచ శాంతి దినోత్సవం

September 21 - Prapancha Santhi Dinotsavam - Telugu Inspirational Story | Naga Suneetha Pokala
సెప్టెంబర్ 21 – ప్రపంచ శాంతి దినోత్సవం - తెలుగు ప్రేరణాత్మక కథ | నాగ సునీత పోకల
Published in manatelugukathalu.com on 21/09/2026
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ శాంతి దినోత్సవం (International Day of Peace) జరుపుకుంటారు. 1981లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఈ దినోత్సవాన్ని స్థాపించగా, 2001లో సెప్టెంబర్ 21ను అహింస, కాల్పుల విరమణకు అంకితమైన రోజుగా నిర్ణయించింది. 2026లో “Invest in Peace: For Everyone, Everywhere, Every Day” అనే నినాదంతో శాంతి కోసం ప్రతి ఒక్కరి రోజువారీ పాత్రను ఐక్యరాజ్య సమితి గుర్తుచేస్తోంది. ఈ సందర్భంగా శాంతి ప్రాముఖ్యత, మన జీవితంపై దాని ప్రభావం, పురాణాల్లో శాంతికి ఉన్న స్థానం, అలాగే శాంతితో మనిషిలో మార్పు తీసుకురావచ్చని చెప్పే ‘సుబుద్ధుడు’ కథను తెలుసుకుందాం.
సెప్టెంబర్ 21. ఈ తేదీ వినగానే మనకు గుర్తొచ్చేది ప్రపంచ శాంతి దినోత్సవం. శాంతి అంటే ఏమిటి? సమస్త క్రోధావేశాలను వదిలి అహింస వైపు అడుగులు వేయడం. శాంతి యొక్క ఆవశ్యకతను నలుదిశలా వ్యాపింపజేసి, అందరూ శాంతి మార్గంలో నడిచేలా ప్రోత్సహించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం.
సెప్టెంబర్ 21 అంటే కేవలం ప్రపంచ శాంతి దినోత్సవమే కాదు, ఈ రోజే ప్రపంచ అల్జీమర్స్ డే మరియు ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం జరుపుకుంటాము.
ముందుగా మనం ప్రపంచ శాంతి దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను, దాని చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకుందాం.
చరిత్ర
స్థాపన: 1981లో ఐక్యరాజ్య సమితి (UNO) దీన్ని ఏర్పాటు చేసింది.
కాల్పుల విరమణ: 2001వ సంవత్సరంలో ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా 24 గంటల అహింస మరియు కాల్పుల విరమణకు గుర్తుగా నిర్ణయించారు.
2026 నినాదం: “శాంతిని పెట్టుబడిగా పెట్టండి – ప్రతి ఒక్కరికోసం, ప్రతి చోట, ప్రతిరోజు. ”
శాంతి యొక్క ప్రాముఖ్యత:
మనిషి జీవితంలో శాంతి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. శాంతి అనేది కేవలం రెండక్షరాల పదం కాదు, ఇది మనిషి అస్తిత్వంలో కలిసిపోయి ఎప్పుడు అహింసా మార్గంలో నడిపించే ఓ దివ్యజ్యోతి. శాంతిగా ఉండేవారి మనస్సు ఎప్పుడూ ఎలాంటి కోపద్వేషఅసూయాగ్నులు లేకుండా నిర్మలమైన కాంతితో వెలుగుతూ ఉంటుంది.
శాంతి మార్గంలో ప్రయాణించే వారి మనస్సు ఎప్పుడూ చంద్రుని వెన్నెలంత స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. ఏ పనినైనా వీళ్లు తమ నిర్మలమైన మనస్సుతో శాంతి మార్గాన్ని ఎంచుకొని పూర్తి చేస్తారు. తమ మీద ప్రతికూల భావాలు ఉన్నవారి మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోని వారే నిజమైన శాంతి స్వభావులు.
శాంతిగా జీవించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. మనకు జీవితంలో కోపం తెప్పించే సంఘటనలు, విషయాలు ఎన్నో వచ్చి ఉంటాయి. ఆ సందర్భాలలో నువ్వెలా వ్యవహరించావన్న దాన్ని బట్టే నీ యొక్క శాంతి స్వభావం తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కోపగించుకోకుండా మనసును ఉంచుకోగలిగి ఉంటే, నువ్వు శాంతిపరుడవు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నేను ఎన్ని సందర్భాల్లో శాంతిగా ఉండగలిగాను అని ఒకసారి గుర్తుతెచ్చుకో, అప్పుడు నీకే తెలుస్తుంది నేను శాంతిస్వభావుడినా కాదా అని. శాంతిగా ఉండడం అంత సులభమైన పని కాదు, అలా అని అంత కష్టమైన పనేమీ కాదు. ఏదైనా సరే సాధన చేస్తేనే లభిస్తుంది.
కోపం, లేని శత్రువులను తెచ్చిపెడుతుంది. శాంతి ఉన్న శత్రువులను తగ్గిస్తుంది అనేది అక్షరాలా సత్యం. ప్రతి చిన్న విషయానికి కోప్పడుతూ, చిరాకు పడుతుంటే మన మిత్రులు కూడా మనకు శత్రువులవుతారు. కనుక శాంతి స్వభావాన్ని కలిగి ఉండడం మనకు చాలా అవసరం.
మన పురాణాలలో కూడా శాంతి యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతో చక్కగా వివరించడం జరిగింది. మన ఇతిహాసాలలో శాంతి అనేది ఒక గుణంగా మాత్రమే కాకుండా, ఒక ధర్మంగా మరియు దైవిక శక్తిగా వర్ణించబడింది.
పురాణాలు, ఇతిహాసాల ప్రకారం, ఏ పూజ ముగిసినా, ఏ మంత్రం ముగిసినా చివరిలో “ఓం శాంతి” అని పలకడం ఆనవాయితీ. దీనినే త్రివిధ శాంతి అని అంటారు. త్రివిధ శాంతి అనగా మూడు అంశాల శాంతి అని అర్థం.
1. ఆధ్యాత్మికం: అనగా మనస్సు, శరీరం వల్ల కలిగే బాధల నుండి శాంతి.
2. ఆధిభౌతికం: అంటే తోటి జీవుల నుండి, సమాజం నుండి మరియు ప్రకృతి నుండి కలిగే బాధల నుండి శాంతి.
3. ఆధిదైవికం: అనగా గ్రహాల స్థితి, భూకంపాలు, వరదలు వంటి దైవిక లేదా ప్రకృతి శక్తుల నుండి కలిగే బాధల నుండి శాంతి. పురాణాలలో శాంతిని వివరించే, దాని మహిమను తెలియజేసే కథలు చాలా ఉన్నాయి. వాటిలో భృగు మహర్షి–త్రిమూర్తుల పరీక్ష (భాగవత పురాణం), వశిష్ఠుడు–విశ్వామిత్రుడు (రామాయణం), అంబరీషోపాఖ్యానం (భాగవత పురాణం) మొదలైన కథలు చాలా ప్రసిద్ధి చెందాయి.
కాబట్టి రౌద్రం కంటే శాంతం ఎన్నో రెట్లు గొప్పది మరియు సురక్షితమైనది.
సైన్స్ పరంగా కూడా శాంతంగా ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
1. ఒత్తిడి తగ్గుతుంది. :మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు, మెదడులో భయాన్ని నియంత్రించే 'అమిగ్డాలా' శాంతించి, కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్ల విడుదల తగ్గుతుంది. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. శాంతిగా ఉండటం వల్ల గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు అదుపులోకి వస్తాయి. దీనివల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
2. రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
సైకోన్యూరోఇమ్యునాలజీ పరిశోధనల ప్రకారం, ప్రశాంతమైన మనస్సు ఉన్నవారిలో శరీరంలో వాపులు తగ్గి, వ్యాధి నిరోధక కణాలు మెరుగ్గా పనిచేస్తాయి.
మెరుగైన ఏకాగ్రత:
మనస్సులో అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు లేనప్పుడు మెదడు యొక్క వర్కింగ్ మెమరీ సామర్థ్యం పెరుగుతుంది. ఇది ఏకాగ్రతను, సృజనాత్మకతను పెంచుతుంది.
కాబట్టి శాంతంగా ఉండడం మన శరీరానికి, మెదడుకు మరియు మన నాడీ వ్యవస్థ చురుకుదనానికి చాలా అవసరం.
శాంతి ఆవశ్యకతను తెలియజేసే కథ
కథ పేరు: సుబుద్ధుడు
అనగనగా ధర్మాపురం అనే ఊరిలో సీతయ్య, పాపారావు అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. సీతయ్య పేరుకు తగ్గట్టుగానే శాంతిస్వభావి, అహింసావాది.
ఇక పాపయ్య కోపధారి, ఎప్పుడూ ఎవరో ఒకరి మీద పడి ఏడుస్తూనే ఉంటాడు. వేరే వారి మీద నోరు పారేసుకోని రోజు ఆయనకు కంటిమీద కునుకు ఉండదు. ప్రతి చిన్న విషయానికీ వేడి వేడి మసాలా లాగా రుసరుసలాడుతుంటాడు.
ఆ ఊరిలోని వారందరికీ సీతయ్య అంటే చాలా అభిమానం, ప్రేమ. తమకు ఏ కష్టం వచ్చినా అమాంతం సీతయ్య ముందు వాలి, ఓ చక్కటి పరిష్కారాన్ని తీసుకెళ్తారు గ్రామస్తులు.
ఇక పాపయ్య విషయానికి వస్తే, దొరికితే చావగొట్టాలని కాచుకుని ఉంటారు గ్రామస్తులు. పాపయ్యకు సీతయ్య, అతని శాంతి స్వభావం అస్సలు నచ్చేవి కావు.
ఓ రోజు ఇతను సీతయ్య దగ్గరికెళ్లి, “ఏం సీతయ్యా! మన ఊరోళ్లకి నువ్వు దేవుడిలా మారిపోయావు. అవకాశం ఇస్తే నీకు గుడి కట్టి పూజలు చేసేలా ఉన్నారు. ఏం మందు పెట్టావు వాళ్లకి?” అని వెటకారంగా అన్నాడు.
అది విన్న సీతయ్య, “నేనేం మందు పెట్టలేదు పాపయ్యా! కేవలం అహింస, శాంతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశానంతే” అని చెప్తాడు.
ఇది విన్న పాపయ్య, “శాంతి అంత గొప్పదా? శాంతితో దేన్నైనా సాధించవచ్చా?” అని అడిగాడు.
అప్పుడు సీతయ్య, “ఖచ్చితంగా! శాంతితో సాధించలేనిది ఏదీ లేదు. దానికి సాటి ఏదీ లేదు” అని బదులిస్తాడు.
“అబ్బా! ఇలాంటి మాటలు ఎవరైనా అంటారు. నిరూపించి చూపించు” అని అంటాడు పాపయ్య.
“సరే, అయితే నేనేం చేయాలో చెప్పు” అని అంటాడు సీతయ్య.
“మన ఊరి అడవిలో ఓ బందిపోటుగాడు ఉంటున్నాడు కదా! వాడిని శాంతి స్వభావుడిగా మార్చి చూపించు, అప్పుడు నమ్ముతాను శాంతి మహిమ కలదని” అని అంటాడు పాపయ్య.
సీతయ్య దీనికి ఒప్పుకుంటాడు. తక్షణమే ఆ గుహ దగ్గరికి చేరుకుంటాడు. ఆ గుహ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. మెల్లగా లోపలికి ప్రవేశించాడు సీతయ్య. అప్పుడే సీతయ్య ముందు పులిలా గర్జిస్తూ దూకాడు ఆ బందిపోటుగాడు.
సీతయ్య భయపడలేదు. మౌనంగా అతని ముందు నిలబడి చిరునవ్వుతో చూశాడు. ఆ సంఘటనను చూసిన అతనికి ఆశ్చర్యమేసింది. “నన్ను చూసి భయపడి పారిపోయేవాళ్లను మాత్రమే చూశాను. కానీ మొదటిసారి నా ముందు నిలబడి హాయిగా నవ్వుతున్న వ్యక్తిని చూస్తున్నాను” అని మనసులో అనుకున్నాడు.
అప్పుడు ఆ బందిపోటు బిగ్గరగా అరుస్తూ, “ఏయ్! ఎవరు నువ్వు? మృత్యువును వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చావా?” అని గొంతు మీద కత్తి పెట్టి అడిగాడు.
ఆ సమయంలో కూడా సీతయ్య బెరుకు లేకుండా, “నా పేరు సీతయ్య” అని చెప్తాడు.
ఆ సమయంలో సీతయ్య ధైర్యాన్ని, అతని యొక్క శాంతి గుణాన్ని చూసి అతనికి ఆశ్చర్యమేసింది. “నన్ను చూస్తే నీకు భయం వేయడం లేదా?” అని అడిగాడు.
“నిన్ను చూస్తేనా? హా... హా... హా! నిన్ను చూస్తే నాకెందుకు భయం?” అని అంటాడు సీతయ్య.
“నన్ను చూస్తే భయం వేయడం లేదా? నాకు తెలిసి నీకు పిచ్చి పట్టిందనుకుంటా. నీ చావు ఈరోజు నా చేతిలోనే!” అని కత్తిని గట్టిగా పట్టుకుంటాడు ఆ బందిపోటు.
మరుక్షణమే “నేను మూర్ఖులను, పిరికివారిని చూసి భయపడను” అని సమాధానమిస్తాడు సీతయ్య.
ఆ మాటలు విన్న ఆ బందిపోటుగాడికి కురుపు మీద కారం చల్లినంత పనైంది. కోపంతో ఊగిపోతూ, “నేను పిరికివాడినా? నన్ను చూసి ఈ సమాజం వణుకుతుంది తెలుసా?” అని అంటాడు.
“చుట్టూ ఉన్న వారిని భయపెట్టేవాడు కూడా పిరికివాడే. దానికంటే మించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందా?” అని అంటాడు సీతయ్య.
ఈ మాటల ప్రభావం అతని మీద పడినట్టుంది.
తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, “నీకు నువ్వు ధైర్యవంతుడివని నిరూపించుకునే అవకాశం ఇస్తాలే” అని అన్నాడు సీతయ్య.
ఆ మాటలతో ఎడారిలో నీళ్లు దొరికినంత ఊరట కలిగింది అతనికి. “త్వరగా, త్వరగా అది చెప్పు! నేను ధైర్యవంతుడినని ఎలా నిరూపించుకోవాలి? దేనికైనా నేను రెడీ!” అని అంటాడు ఆ బందిపోటుగాడు.
“నువ్వు ఓ 30 రోజులు నాతో పాటు మా ఊరిలో ఉండాలి” అని చెప్తాడు సీతయ్య.
“ఊర్లోనేంటమ్మా! నేను రెడీ!” అంటాడు ఆ బందిపోటు.
అప్పటి నుంచే ఆ బందిపోటుగాడి కొత్త జీవితం మొదలవుతుంది. ఆ 30 రోజుల్లో ఓ మనిషికి ఉండాల్సిన సద్బుద్ధులన్నింటినీ నేర్పించాడు సీతయ్య. ఇప్పుడు తన పేరు బందిపోటు కాదు, సుబుద్ధుడు. ఈ పేరు అతని సుగుణాలకు మెచ్చి ఆ గ్రామస్తులు ఇచ్చిన బహుమతి.
చివరికి పాపయ్యకు తన తప్పు తెలిసింది. అప్పటినుంచి అతను కూడా సీతయ్య అడుగుజాడల్లో నడవడం మొదలుపెట్టాడు.
నీతి: శాంతితో చేయలేని పని ఏదీ లేదు.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు
సర్వేషాం శాంతిర్భవతు
సర్వేషాం పూర్ణంభవతు
సర్వేషాం మంగళంభవతు
ఓం శాంతిః శాంతిః శాంతిః
(బృహదారణ్యక ఉపనిషత్తు)
భావం: ఈ విశ్వంలో ఉన్న సమస్త మానవాళికి, జీవరాశులకు ఎల్లప్పుడూ శుభం చేకూరాలి. అందరి మనస్సులు ఎటువంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎవరి జీవితంలోనూ ఏ లోటూ లేకుండా, అందరూ ఆనందంతో, తృప్తితో పరిపూర్ణమైన జీవితాన్ని గడపాలి. ప్రతి ఒక్కరికీ ఎల్లవేళలా మంచే జరగాలి అని ఈ మంత్రం యొక్క పరమార్థం.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
నాగ సునీత పోకల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
పరిచయం: నాగ సునీత పోకల







Comments