పప్పుచారు సాంబయ్య

Pappucharu Sambayya - Telugu Comedy Story | Varalakshmi Yanamandra
పప్పుచారు సాంబయ్య - తెలుగు హాస్య కథ | వరలక్ష్మి యనమండ్ర
Published in manatelugukathalu.com on 21/09/2026
ఆధునిక టెక్నాలజీకి ఇద్దరు బామ్మల అమాయక ప్రపంచాన్ని జోడిస్తూ రచయిత్రి వరలక్ష్మి యనమండ్ర నవ్వులు పంచేలా కథను తీర్చిదిద్దారు.
పార్వతమ్మకు 70 ఏళ్ళు. కొడుకు అమెరికా నుండి వచ్చేటప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ తెచ్చి, ఎలా ఉపయోగించాలో నేర్పాడు. "అమ్మా, ఇదిగో గూగుల్ అసిస్టెంట్, ఏం కావాలన్నా అడిగితే చెబుతాడు" అని చెప్పాడు.
ఆ రోజు నుండి పార్వతమ్మకు ఆ ఫోనే ప్రపంచం. ఉదయం లేవగానే "ఒరే సాంబయ్యా, ఇవాళ వార్తలేంట్రా?" అంటుంది. గూగుల్ చెబుతుంది. "సాంబయ్యా, భక్తి పాటలు పెట్టరా" అంటుంది. పెడుతుంది.
పార్వతమ్మ మనసులో గూగుల్ అంటే తన ఇంట్లో పనిచేసే సాంబయ్య లాంటి మనిషే అనుకుంది — ఫోన్ లోపల ఒకడు కూర్చున్నాడు అని.
ఆ రోజు మధ్యాహ్నం కోడలు పుట్టింటికి వెళ్ళింది. పార్వతమ్మ వంట చేయాలి. పప్పుచారు చేద్దామని అనుకుంది. సాంబయ్యని అడిగితే కొత్త విధానం చెబుతాడేమో అనుకుంది.
వంట గదిలో గిన్నెలు ముందేసుకుని, ఫోన్ ని పక్కన పెట్టుకుంది. కాస్త గొంతు సవరించుకుని, ప్రేమగా పిలిచింది.
"ఒరేయ్ గూగుల్ సాంబయ్యా! పప్పుచారు ఎలా పెట్టాలో చెప్పు?" అంటూ... కొడుకు ఇచ్చిన సెల్ ఫోన్ లో మీటనొక్కింది పార్వతమ్మ.
వెంటనే లోపల్నుంచి ఒక ఆడ గొంతు వినిపించింది.
గూగుల్ తడుముకోకుండా... "పప్పు ఉడికించండి... టమోటా, కరివేపాకు, ఇంగువ తిరగమాత వేయండి..." అంటూ అంతా వివరించి చెప్పింది.
పార్వతమ్మ "ఓహో, ఇంగువ కూడా వేయాలా? సరే సరే సాంబయ్యా! ఇంతకీ ఆ ఆడమనిషి ఎవరు సాంబయ్యా?" అని అడిగింది.
అదే టైముకి ఆమె ప్రాణస్నేహితురాలు సుబ్బమ్మ వచ్చింది, చేతిలో గోంగూర పచ్చడి బుట్టతో.
సుబ్బమ్మ వంటగదిలోకి వచ్చి చూసేసరికి, పార్వతమ్మ ఒక్కతే ఫోన్ తో మాట్లాడుతోంది, ఫోన్ లోంచి ఎవరో సమాధానం చెబుతున్నారు.
సుబ్బమ్మకు గుండె జారిపోయింది.
"ఏంటే పార్వతమ్మా ఇది? ఫోన్ లోపల మనిషిని పెట్టావా?" అంది.
పార్వతమ్మ "అవునే, మా వాడు అమెరికా నుండి తీసుకొచ్చాడు. వీడి పేరు సాంబయ్య, అన్నీ చెబుతాడు" అంది అమాయకంగా.
అంతే, సుబ్బమ్మ కంగారుపడిపోయింది. ఫోన్ ని దగ్గరగా చూసి,
"అమ్మో పార్వతమ్మా! నీ ఫోన్ లోపల మనిషిని పెట్టుకున్నావా? వాడికి ఊపిరి ఆడడం లేదేమో, త్వరగా బయటికి తియ్!" అంది.
దానికి పార్వతమ్మ "ఓసి పిచ్చిదానా! వాడికి గాలి ఆడకపోతే పప్పుచారు ఎలా చెబుతాడే? వాడికి అన్నీ తెలుసు" అంది.
సుబ్బమ్మ ఇంకా భయంగా "అయితే వాడికి పెళ్లాం ఉన్నదా? పిల్లలు ఉన్నారా? ఫోన్ లోపలే కాపురం చేస్తున్నారా? వాళ్లకు అన్నం ఎవరు పెడతారు?" అని అడిగింది.
"ఏమోనే! ఇందాక సాంబయ్య ఎక్కడికో వెళ్లినట్టున్నాడు, వాడి పెళ్లాం చెప్తోంది పప్పుచారు ఎలా చేయాలో" అన్నది.
దానికి గూగుల్ సాంబయ్య కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. "క్షమించండి, నాకు అర్థం కాలేదు" అన్నాడు.
పార్వతమ్మ వెంటనే "చూశావా, నీ గోలకి సాంబయ్యకు కోపం వచ్చింది, నోరు మూసుకో" అని సుబ్బమ్మను తిట్టింది.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి గూగుల్ సాంబయ్య చెప్పినట్లే పప్పుచారు పెట్టారు. చారు చాలా రుచిగా వచ్చింది.
చారు తాగిన సుబ్బమ్మ "ఏమోనే, ఫోన్ లోపల మనిషి చెప్పిన చారు మాత్రం అదిరింది. నాక్కూడా ఒక సాంబయ్యను తెప్పించవే" అంది.
"ఈసారి మా వాడు వచ్చినప్పుడు చెప్తాను, తెప్పించి పెడతాడులే సుబ్బూ" అన్నది పార్వతమ్మ.
సమాప్తం
***
వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర
పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర
కలం పేరు: లేదు
స్వస్థలం: అద్దంకి,ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని
విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.
ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు
1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి)
2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి)
3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి)
తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది.
కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం
4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి)
5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)
6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక)
(400 ఆటవెలది పద్య సంపుటీ)
7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు)
అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి.
పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు
కొన్ని సమూహాలను నిర్వహణ, కొన్ని సమూహాలలో సమీక్షణం
యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను
నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.
ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.
జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం.





Comments