అమ్మ అందరికీ అమ్మే!
- Lalitha Sripathi

- 1 day ago
- 6 min read
అమ్మ అందరికీ అమ్మే, సవతి పిల్లల కథ, తల్లి ప్రేమ కథ

Amma Andariki Amme - Telugu Emotional Family Story | Sripathi Lalitha
అమ్మ అందరికీ అమ్మే! - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | శ్రీపతి లలిత
Published in manatelugukathalu.com on 24/06/2026
"నేను కన్న పిల్లలకే కాదు... అందరికీ అమ్మనే!"
అని చెప్పిన పద్మిని గురించి శ్రీపతి లలిత గారి ‘అమ్మ అందరికీ అమ్మే!’ కథలో తెలుసుకుందాం.
“గోపాల్ వాళ్ల నాన్నగారు శివరావుగారు పోయారట!” రవి ఫోన్ పెట్టేస్తూ, బాధగా అన్నాడు.
“పోనీలే! విముక్తి దొరికింది, దాదాపు అయిదేళ్ళ నుంచి మంచం మీదేగా! పద్మిని కష్టాలు కొంచెమైనా తీరతాయి!” రవి తల్లి గిరిజ అన్నది.
రవి, గోపాల్ కుటుంబాలు, వారి చిన్నతనంలో, పక్క, పక్క ఇళ్ళల్లో దాదాపు పది సంవత్సరాలు ఉన్నారు.
గిరిజకి, పద్మిని ఆప్త మిత్రురాలు. ఆమె, గిరిజతో తన కష్టసుఖాలు పంచుకునేది, నిజానికి ఆమె జీవితంలో కష్టాలే ఎక్కువ అనుభవించింది. ఇప్పటికీ వారి స్నేహం అలా కొనసాగుతోంది.
పద్మిని భర్త శివరావు, వారికి నలుగురు పిల్లలు.
చిన్నబ్బాయి గోపాల్ కుటుంబం తల్లితోనే ఉంటుంది. పెద్దబ్బాయి సతీష్ ముంబైలో, అమ్మాయిలు రేవతి చెన్నైలో, స్నేహ బెంగళూరులో ఉంటారు.
వీళ్లు వెళ్ళేసరికి చాలామంది బంధుమిత్రులే కాక, ఆమె పాల్గొనే ఎన్నో సమాజసేవా సంఘ సభ్యులు కూడా వచ్చారు.
ఇంతలో హాస్పిటల్ నుంచి అంబులెన్సు వచ్చింది. ‘ఇదేంటి!’ అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నవారికి, “నాన్న కళ్లు దానం చేయడమే కాకుండా, అవయవ దానం కోసం తన దేహాన్ని కూడా మెడికల్ కాలేజీకి దానం చేశారు” అన్న గోపాల్ మాటలకి రవి విస్తుపోయాడు.
“ఎవరూ ఏమీ అడ్డు చెప్పలేదా?” అడిగాడు,
“అమ్మ చెప్తే, నాన్న ఒప్పుకున్నారు, వాళ్ల మాటకి మేము ఎప్పుడైనా అడ్డు చెప్పామా!”
పార్థివ శరీరం మీద మంచి పట్టుపంచ కప్పి, పూలదండలు వేసి, ఘనంగా సాగనంపారు.
అన్ని కార్యక్రమాలు అయిపోయి అందరూ వెళ్లిపోయాక, ఒకరోజు, గోపాల్, రవి దగ్గరికి వచ్చాడు.
రెండు, మూడు డైరీలు, అతనికి ఇచ్చి,
“ఇవన్నీ అమ్మ డైరీలు రవీ! నువ్వు మంచి రచయితవి, అమ్మకి, నువ్వన్నా, నీ రచనలన్నా చాలా ఇష్టం, ఇవన్నీ చదివి, ‘అమ్మ కథ’ రాయాలి! అమ్మ పర్మిషన్ తీసుకునే ఇవి తెచ్చాను.”
“మీ అమ్మగారి జీవితచరిత్ర, నేను రాయడం ఏమిటి గోపాల్? పైగా ఆ పాత విషయాలు బయట పెడితే మీ నాన్నగారి తరఫు వారు గొడవ చేస్తారేమో!”
కొన్ని సంగతులు, తల్లి ద్వారా తెలిసాక, పద్మిని అంటే ఎంతో ఉన్నతమైన అభిప్రాయం రవికి.
నవ్వాడు గోపాల్, “నాన్న తరఫు వారు ఎవరున్నారు! ఉన్నా, అమ్మ జీవితంలో కష్టాలు పడ్డప్పుడు ఆవిడకి చేయూత కానీ, మానసికంగా ధైర్యం ఇచ్చినవారు ఎవరు? స్నేహితురాలిగా మీ అమ్మగారు తప్ప.
నాన్న అమ్మకు తెలియకుండా మోసం చేసి, మా అమ్మతో చట్ట ప్రకారం పెళ్లి కూడా లేకుండా మమ్మల్ని కన్నారు. సతీష్ అన్నయ్య, రేవతి అక్కయ్య అమ్మ సొంత పిల్లలు. నేను, స్నేహ రెండో ఆవిడ పిల్లలం. అమ్మ మమ్మల్ని చట్టం ద్వారా దత్తత తీసుకుంది. లేకపోతే సమాజంలో మా స్థానం ఏమిటి? చాలామందికి ఈ విషయం తెలియక మమ్మల్ని అనాథాశ్రమం నుంచి తెచ్చారనుకుంటున్నారు. అమ్మ పెంచకపోతే అక్కడికే వెళ్లేవాళ్ళం.
ఆవిడ మాకు చేసిన మహోపకారానికి చిరు కానుక ఇది.
అమ్మ వద్దనే అన్నది కానీ పిల్లలం, ముఖ్యంగా నేను, పట్టుబడుతున్నా ఆవిడ కథ లోకానికి చెప్పాలని.
ఆవిడ త్యాగం, వ్యక్తిత్వం అందరికీ తెలియాలి. నాకిప్పటికీ ఒకటే బాధ, ఆవిడ కడుపున పుట్టలేకపోయానని” కన్నీళ్లు పెట్టుకున్నాడు గోపాల్. భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాడు రవి.
ఆ డైరీల గురించి, గోపాల్ చెప్పిన సంగతి గిరిజకి,చిత్రకి చెప్పాడు.
“ఆంటీ కథ రాయడం అనేది మామూలు విషయం కాదు! మంచి అవకాశం” అంది చిత్ర సంతోషంగా.
గిరిజ మాత్రం, “చాలా జాగ్రత్తగా రాయాలి రవీ! కొన్ని విషయాలు బయట పెడితే కానీ, ఆమె గొప్పదనం అందరికీ తెలీదు. చాలామంది ఆవిడ ఇద్దరు అనాధలని పెంచుకుంది అనుకున్నారు, వాళ్ళు ఆవిడ సవతి సంతానమని తెలీదు. పద్మిని ఒక సామాన్య స్త్రీ కాదు, ఒక తపస్విని!
ఆమెకి డిగ్రీలో ఉండగానే శివరావుతో పెళ్లయింది, పెద్ద కుటుంబంలో పెద్ద కోడలిగా బాధ్యత పూర్తిగా నిర్వర్తించింది. సతీష్, రేవతి పుట్టాక, అతనికి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. పద్మిని ఇక్కడే ఉండి కుటుంబాన్ని చూసుకుంటే మంచిదని, త్వరగా ట్రాన్స్ఫర్‌కి ప్రయత్నిస్తానన్నాడు. అప్పటికి బాబుకి మూడేళ్లు, పాప ఏడాది. ఒక ఏడాదిపాటు, వారానికో ఉత్తరం, అప్పుడప్పుడు ఫోన్లు, రెండు నెలలకి ఒకసారి వచ్చి వెళ్లడం జరిగింది.
రెండో సంవత్సరం, రెండు సార్లు వచ్చాడు, డబ్బులు మాత్రం ఒకటో తారీఖుకల్లా పద్మిని అకౌంట్‌లో పడేవి. పని ఒత్తిడి అని సర్ది చెప్పుకునేది.
ఒకసారి వీరి బంధువుల అబ్బాయి అనుకోకుండా ఢిల్లీ వెళ్లి శివరావు ఇంటికి వెళ్లేసరికి, ఇంట్లో ఒకావిడ చంటి బాబుతో ఉంది. ‘మీరెవరు?’ అంటే ‘ఆయన భార్యని’ అని చెప్పింది. విషయం తెలిసిన పద్మిని, అత్తగారు, మామగారు ఢిల్లీ వెళ్లారు.
“శీతల్ మా ఆఫీసులో టైపిస్ట్, నాకు ఆ అమ్మాయంటే ప్రేమ, నేను ఆమెని వదులుకోలేను. ఉద్యోగరీత్యా, మేము లీగల్‌గా పెళ్లి చేసుకోలేదు.
మీకూ, పద్మినికి ఎలాంటి లోటూ చెయ్యను! మీకు అవసరమైన డబ్బు పంపుతాను” అని చెప్పాడు.
పద్మినికి లోకమంతా చీకటి అయినట్లయింది. ‘కట్టుకున్న భర్త, తనని పిల్లల్ని వదిలి, వేరే ఆమెను ప్రేమిస్తున్నానని అంటే, తల ఊపి, ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఆత్మాభిమానం చంపుకుని ఉండాలా!’
“నేనుండగా, వేరే ఆమెతో, పిల్లలని కన్న మిమ్మల్ని నేను భర్తగా అంగీకరించలేను. నాకు విడాకులు కావాలి, మీ డబ్బులూ, భరణం ఏవీ వద్దు, నా పిల్లల్ని నేను పోషించుకోగలను!” ఖరాఖండిగా చెప్పింది పద్మిని.
“నిన్ను నమ్ముకున్న ఒక ఆడపిల్లకు ఇంత అన్యాయం చేసావు, ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువు కాదు, నా కోడలే కూతురు, కొడుకూ! సిగ్గుంటే, నాకు నీ మొహం ఈ జన్మలో చూపించకు!” కోపంగా శివరావు తండ్రి బయటికి నడిచాడు.
“నువ్వు, మనవలు మాతో ఉంటే కనీసం మిమ్మల్ని చూసుకుని బతుకుతాం. కష్టమో, నష్టమో అందరం కలిసి ఉందాం!” అన్న అత్తగారి మాటలు విని, పద్మిని స్కూల్‌లో టీచర్‌గా చేరింది.
సరిగ్గా అయిదేళ్ల తర్వాత, శివరావు, ఆరేళ్ల గోపాల్‌ని, మూడేళ్ళ స్నేహని తీసుకుని,తండ్రి దగ్గరికి వచ్చాడు. “నాన్నా! నన్ను, పిల్లల్ని అనాథల్ని చేసి, శీతల్, క్యాన్సర్‌తో చనిపోయింది.
నేను, మీ పట్ల, పద్మిని, పిల్లల పట్ల చేసిన పాపాలు ఆమెని బలి తీసుకున్నాయి. ఈ పిల్లలని అనాథల్ని చేసాయి. వీళ్ళని, ఏదైనా అనాథ ఆశ్రమంలో చేర్పించి, నేనూ ఏదైనా ఆశ్రమానికి వెళదామనుకుంటున్నాను. శీతల్‌కి వచ్చిన డబ్బులు, నేను ఉద్యోగం రాజీనామా చేస్తే వచ్చే డబ్బులు, పిల్లల పేరుమీద వేస్తే, భవిష్యత్తులో వారికి ఉపయోగపడతాయి. చివరిసారిగా మిమ్మల్నిచూసి, క్షమాపణ చెప్దామనివచ్చాను!” మొహం వేలాడేసుకుని అన్నాడు.
పద్మినికి ఒళ్లు మండిపోయింది. ఇంతకుముందు శీతల్ మీద ప్రేమ అంటూ, తనకి, పిల్లలకి అన్యాయం చేసాడు. ఇప్పుడు ఆమె చనిపోతే, ఆమె పిల్లలని అనాథశరణాలయంలో చేర్పిస్తానంటాడు. ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి?
కోపం అణచుకుని ఇంట్లోకి ఆహ్వానించింది. అక్కడే పద్మినికి ఏమాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. కొడుకుని చూసిన అతని తల్లితండ్రులు, తమ చివరి దశలో, భగవంతుడే కొడుకుని తమ దగ్గరికి పంపాడని సంతోషపడితే, సతీష్, నాన్న తిరిగి వచ్చారని సంతోషంగా స్నేహితులకి చెప్పడం, రేవతిని తండ్రి దగ్గరికి తీసుకెళ్లి కబుర్లు చెప్పడం చూసిన పద్మిని మనసులో తుఫాను రేగింది.
అటు అత్తమామలు, ఇటు పిల్లలు, శివరావు ఇక్కడ ఉంటే బావుంటుంది అనే ఉద్దేశంలో ఉన్నారని అర్ధమైన ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది.
తనకి భర్త వద్దు అనుకుంటే, కొందరికి కొడుకుని, ఇంకొందరికి తండ్రిని దూరం చేసినట్లవుతుంది. శీతల్ పిల్లలు, ఎవరికి ఏమి అన్యాయం చేసారని? పాపం,వారికి తల్లిని దేవుడు దూరం చేస్తే, తండ్రి కూడా దూరం అయితే…” ఆ పిల్లల అమాయకపు ముఖాలు చూసి కరిగిపోయింది ఆమె.
తన నిర్ణయాన్ని అత్తమామలకు, పిల్లలకి చెప్తే వారి సంతోషం చూసి, తన నిర్ణయం సరైందని అనుకుంది.
వారి ముందే, భర్తని పిలిచి “మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. ఈ పిల్లలు, మీరు ఉండగా అనాథలు కాకూడదు. ఇక్కడే నా పిల్లల్తో పెరుగుతారు. ఈ ఇంట్లో మీరు అత్త,మామలకి కొడుకుగా, అందరు పిల్లలకి తండ్రిగా మాత్రమే ఉంటారు, నా భర్త స్థానం మాత్రం, మీకు ఎప్పటికీ దొరకదు!” పద్మిని వంక కృతజ్ఞతగా చూస్తూ, ఏదో అనబోతున్న శివరావుని ఆపి, “ఇది నా పిల్లల్ని, అత్తమామలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం” అంది.
తెలియనివాళ్లకు తమ బంధువుల పిల్లలుగా పరిచయం చేసి, తన పిల్లలతో సమానంగా చూసుకుంది. వాళ్లు ‘అమ్మా’ అని పిలిచినా అడ్డు చెప్పలేదు. భర్త ఇంట్లో ఉన్నా ఒక సన్యాసినిలాగే బతికింది. కొడుకుని చూసిన ఆనందంతో ఆమె అత్తమామలు ప్రశాంతంగా కళ్లు మూశారు. పిల్లల ఉద్యోగాలు, పెళ్లిళ్లు - ఎందులోనూ శివరావు జోక్యం చేసుకోలేదు. తను, తన అవసరాలు... అంతే!
అందుకే, తండ్రి ఉన్నా, పిల్లలంతా, పద్మినికే చేరువయ్యారు. నలుగురూ ఒక తల్లి పిల్లలుగానే పెరిగారు. గొప్ప విషయం ఏమంటే, అలా పెంచడం సాధారణమైన ఆడవారికి అయ్యే పని కాదు.
ఒకసారి నేనే ఆమెని అడిగాను, “నీ సవతి పిల్లల్ని పెంచడానికి బాధ అనిపించలేదా?” “నా సవతి పిల్లలుగా వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు, ఎందరో అనాధలకి సాయం చేసేదాన్ని, వీరు కూడా అలానే అనుకుని చూసాను. ఒకసారి అమ్మ అయ్యాను! ఇప్పుడు, నేను కన్న పిల్లలకే కాదు, అందరికీ అమ్మనే!
నేనూ, శీతల్, ఒక మగవాడి అహంకారానికి బలయ్యాము. ఇదే ఒక పెళ్ళైన ఆడది చేస్తే సమాజం ఎన్ని మాటలనేది? తల్లి తెలివితక్కువతనానికి, తండ్రి బాధ్యతారాహిత్యానికి బలైన పిల్లలు వాళ్ళు, వారిమీద కోపం కానీ, ద్వేషం కానీ ఎందుకు?
ఎక్కడ ఏ ఋణమో తెలీదు కానీ, ఒక సమయంలో, నా పిల్లల కన్నా వీరి మీదే ప్రేమ ఎక్కువ అయ్యాయి. నా పెంపకమో, రక్తసంబంధమో తెలీదు, వారికి కూడా, గోపాల్, స్నేహ అంటే చాలా ప్రేమ. ఇప్పుడు ఎవరైనా గుర్తు చేస్తే తప్ప, నలుగురిలో ఇద్దరు, నా కన్నపిల్లలు కాదని అనిపించదు!”
అంత ఔన్నత్యం ఉన్న స్త్రీ ఆమె. భర్త మోసం చేసినా, అత్తమామల్ని ఎప్పుడూ నిందించలేదు. వాళ్ళ గౌరవానికి భంగం కలిగించలేదు. ఆఖరికి భర్త గురించి కూడా ఎప్పుడూ, ఎవరికీ, చెడ్డగా చెప్పలేదు. అందరు పిల్లలనీ, ఎవరికీ, ఎక్కడా, ఏమాత్రం అసంతృప్తి లేకుండా పెంచింది.
తన జీవితం అలా అయిందని ఏడుస్తూ కూర్చోక, ఎంతోమంది భర్తలు మోసం చేసిన మహిళలని ఆదుకుంది. అవయవదానానికి కృషి చేసింది. తనవి దానం ఇస్తూ, భర్త చేత కూడా ఇప్పించింది.
నాకు తెలుసు, శివరావు ముందు ఒప్పుకోలేదు. చేసిన పాపంలో కొంత అయినా తగ్గుతుందని అతని చేత ఒప్పించింది.
అలాంటి మహిళా రత్నాలు అరుదుగా ఉంటారు.
నీ ప్రాణం పెట్టి, పద్మిని కథకి ప్రాణం పొయ్యి!
ఇంకొందరు మహిళలు ఆ కథ చదివి, కొంత మార్గదర్శనం పొందచ్చు.”
ముగించింది గిరిజ.
“ఆవిడ విడాకులు ఎందుకు తీసుకోలేదు?” చిత్ర అడిగింది.
“మొదట్లోనే అడిగింది. అతను తను చేసినవి బయటపడతాయని ఒప్పుకోలేదు. అత్తమామలు కూడా ఎలానో ఇంకో పెళ్లి చేసుకునేది లేదుకదా! ఇపుడు విడాకులు తీసుకుని, ప్రతీ వారూ ఈవిడని మొగుడు వదిలేశాడు అంటే ఒరిగేది ఏముంది అని వదిలెయ్యమన్నారు. పద్మిని అప్పుడు వదిలేసింది కానీ
ఇప్పుడు ఆడవాళ్ళు అలా వదలరు, వదలకూడదు కూడా.”
తల్లి చెప్పిన విషయాలు, పద్మిని డైరీలు, రవి కలానికి, మరింత బలమిచ్చి, మరుసటి ఏడాదికి పద్మిని కథ, ‘అమ్మ అందరికీ అమ్మే!’ అక్షరరూపమివ్వడానికి దోహదపడడమేకాక, రవికి రచయిత గానూ, పద్మినికి సామాజిక సేవలోనూ అవార్డులు తెచ్చిపెట్టింది.
సమాప్తం
శ్రీపతి లలిత గారి కొన్ని ఇతర రచనలు:
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.








ఇది సత్యం. బాగా రాశారు