మొదలు
- M K Kumar
- 2 hours ago
- 5 min read
మొదలు కథ, ఎం కె కుమార్, తెలుగు సైకలాజికల్ కథ, హిప్నాటిజం కథ, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ తెలుగు, ప్రేమ కథ, తెలుగు థ్రిల్లర్, సస్పెన్స్ కథ, మానసిక నియంత్రణ, ఆధ్యాత్మిక ప్రేమ కథ, తెలుగు హారర్ థ్రిల్లర్, ప్రేమ మరియు త్యాగం, తెలుగు వెబ్ కథలు

Modalu - Telugu Emotional Story | M K Kumar
మొదలు - తెలుగు భావోద్వేగ కథ | ఎం. కె. కుమార్
Published in manatelugukathalu.com on 25/06/2026
ప్రేమ అనేది స్వాధీనం కాదు... స్వేచ్ఛ. ఈ సత్యాన్ని అద్భుతమైన సస్పెన్స్ కథనం ద్వారా ఆవిష్కరించిన కథే "మొదలు". హిప్నాటిజం, ఆస్ట్రల్ ప్రొజెక్షన్, మానసిక బంధాలు, ప్రేమ, త్యాగం, ఆధ్యాత్మిక అంశాలను సమన్వయం చేస్తూ పాఠకుడిని చివరి వరకు ఉత్కంఠలో ఉంచే ఈ కథలో, నిజమైన ప్రేమ ఏ మాయాజాలాన్నైనా జయించగలదనే సందేశం హృదయాన్ని హత్తుకుంటుంది.
అవిలాల కాడ ఆ దినం సాయంత్రం వాతావరణం మస్తు సల్లగా ఉండాది. కొండల మీది నుంచి మంచు పొగ కిందకు దిగుతా ఉండాది. పాతకాలపు డాబా మాది. గదిలో లైటు ఎలుగుతా ఉండాది. ఆ ఎలుతురులో నా పెండ్లాం వినీత మొఖం పాలిపోయి, ఎటో శూన్యంలోకి సూస్తా కూకోని ఉండాది.
కిటికీ అవతల ఏడుకొండల వైపు నుంచి వస్తున్న గాలి, పెరటి చెట్టు నుండి రాలుతున్న ఆకులు బతుకులోని నిస్సహాయతను గుర్తుచేస్తా ఉండాయి. నేనూ, వినీత చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాము, ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నాము. కానీ ఇప్పుడు, పెండ్లయిన కొన్ని దినాలకే, మా ఇద్దరి మధ్యన కంటికి కనపడని ఏదో పెద్ద గోడ మొలిచినట్టు అనిపిస్తా ఉండాది.
గదిలో మా శ్వాస మాకే వినిపిస్తా ఉండాది. ఆ సప్పుడు తప్పితే మా మధ్యన ఇంకే పలూకూ బదులూ లేదు.
"నాకు మస్తు చలిగా ఉండాది అమర్ " అనింది వినీత, తన చుట్టూ ఉన్న శాలువాను గట్టిగా లాక్కుంటా.
నేను ఒక్కమారుగా నిట్టూర్చినాను. ఆ గదిలో వెచ్చగానే ఉండాది. కానీ ఆమెకు పడుతున్న ఆ చలి భౌతికమైనది కాదని నాకి ఎరుకే. ఆ చలి అంతా ఆ పెయింటింగ్ లోంచి వస్తా ఉండాది. మా పెండ్లికి బహుమతిగా తపస్ అనే పెయింటర్ పంపిన పెయింటింగ్ అది. తపస్... ఒకప్పుడు వినీతకు బొమ్మలు ఏయడం నేర్పించిన గురువు. వాడు ఆమెకు ఆ విద్య నేర్పిస్తానని చెప్పి, హిప్నాటిజం చేసి ఆమె మనసును, ఆత్మను వాడి గుప్పిట్లోకి తీసుకున్నాడు.
ఆ బొమ్మలో వినీత మొఖం చుట్టూ ఒక వింతైన కాంతి వలయం (ఆరా) ఉంటాది. ఆ బొమ్మను చూసినప్పటి నుంచి వినీత తనలో తాను లేకుండా పాయే. ఆమె భౌతికంగా నా పక్కనే ఉన్నా, ఆమె సూక్ష్మ శరీరం మాత్రం ఎక్కడో ఆ తపస్ గాడి కంట్రోల్ లో తిరుగుతా ఉండాదని నాకు అర్థమైతానే ఉండాది.
మనుషులు పక్కపక్కనే ఉంటారు, కానీ వాళ్ళ మనసులు ఏడనో ఆమడ దూరంలో బతుకుతా ఉంటాయి. ఇంతకంటే దిగులు ఏమన్నా ఉండాదా?
నాకు కోపం రాలా, కేవలం అంతులేని నిస్సహాయత మాత్రమే మిగిలింది. "ఆ పెయింటింగ్ ని తీసి అవతల పారేయమంటావా వినీత?" అని అడిగినాను బతిమాలుతున్నట్టుగా.
ఆమె ఏమీ మాట్లాడకుండా కళ్లు మూసుకోని, ఒక ప్రాణం లేని బొమ్మ మాదిరి క్యాటలెప్టిక్ నిద్రలోకి జారిపాయే. ఆమె కోరిక మేరకు ఆ పెయింటింగ్ తెచ్చి గదిలోనే పెట్టినాను. రాత్రంతా ఆమె సల్లటి చేతులను నా చేతుల్లో పట్టుకోని వెచ్చదనం ఇయ్యాలని చూస్తిని, కానీ నా బతుకు శూన్యంగా అనిపిస్తా ఉండాది.
బయట బండ్ల శబ్దాలు వినిపిస్తా ఉండాయి కానీ, నా మనసుకి ఏ శాంతీ దొరకలా.
మరుసటి దినం ఉదయాన్నే టౌన్ లో ఉండే ఆయుర్వేద డాక్టర్ తిరు గారు మా ఇంటికి వచ్చినారు. ఆయన నాడి పట్టుకుని చూసి, మనిషి మనస్తత్వాల గురించి, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు.
"బాబు అమర్, ఆ బొమ్మ ద్వారా ఆమె సెన్సిబిలిటీ వాడి కాడికి పోయింది. దీన్నే ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ అంటారు. ఆమెను ఇక్కడి నుంచి ఎక్కడికన్నా దూరంగా తీస్కపో. ఆ తపస్ గాడికి దొరక్కుండా పాత జ్ఞాపకాలు లేని చోటికి తీస్కపోతే, ఈ గాలి సోకుడు అంతా సర్దుకుంటాదిలే," అని సలహా ఇచ్చినాడు.
ఆయన మాట ఇని, మనసు మారుతాదని వినీతను తీస్కోని తలకోన అడవుల పక్కన ఉన్న ఒక పాత బంగ్లాకు తీస్కోని పోనాను. కొత్త గాలి తగిలితే నా వినీత నార్మల్ అయితాదేమో అని నా ఆశ. ఒక దినం సాయంత్రం మేమిద్దరం బంగ్లా వరండాలో కూకోని ఉండగా, "చంద్రగిరి కోటలో ఆ దర్బారు హాలు ఎంత బాగుండాదో కదా అమర్" అనింది వినీత.
నా గుండె జల్లుమంది. వామ్మో, మేము ఆ కోట లోపలికి పోనేలేదే! ఆమె అట్టా ఎందుకు అనిందో నాకు అర్థమైపాయే. భౌతికంగా ఆమె నా కాడ ఉన్నా, ఆమె ఆత్మ ఆ తపస్ గాడితో కలిసి ఆ కోటలో విహరిస్తా ఉండాదని నాకు తెలిసి ఏడుపొచ్చింది. వాడి మాయ నుంచి ఎంత దూరం పారిపోయినా, మనసును ఎట్టా కట్టేయగలం.
ఆ తపస్ గాడు కూడా మా ఎనకాలే తలకోన అడవుల్లోకి వొచ్చినాడని నా పనివాడు నాకు చెప్పినాడు. వాడు అడవి పక్కన ఒక పాడుబడ్డ గెస్ట్ హౌస్ లో బస చేస్తా, రోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు గది తలుపులు మూసేసి, ఇద్దరికి సరిపడా భోజనం ఆర్డర్ చేస్తా ఉండాడంట.
నాకిక మతిపోతా ఉండాది. నేను గబగబా ఆ గెస్ట్ హౌస్ కాడికి పోయి, కిటికీ కాడికి పోయి చూస్తిని. ఆ కిటికీలోంచి చూస్తే, ఆడ వాడు ఒక కుర్చీలో కూకోని, పక్కన ఉన్న ఖాళీ కుర్చీకి భోజనం అందిస్తా, నవ్వుతా మాట్లాడుతా ఉండాడు. నా వినీత ఆత్మ ఆడికే పోయిందని నాకు అర్థమైపాయే.
నాకు కడుపులో దేవేస్తా ఉండాది. బాధతో, కోపంతో కిటికీలోంచి అమాంతం గదిలోకి దూకినాను. నేను దూకిన స్పీడ్ కి టేబుల్ మీద ఉన్న ఒక పండ్ల కత్తి కింద పడిపాయే.
"చూసుకోరా మూర్ఖుడా, ఆమెకి గాయమైంది!" అని వాడు నా మీదికి అరిచినాడు.
వాడు అట్టా అరిచేసరికి నాకి ఏమీ అర్థం కాలా. పరుగు పరుగున నా బంగ్లాకి పోయి చూస్తిని. ఆడ సోఫాలో అపస్మారక స్థితిలో నిద్రపోతా ఉన్న వినీత చేతి వేలికి గాయమై రక్తం కారుతా ఉండాది! ఆ తపస్ గాడి గదిలో పడిన కత్తి, ఆమె ఆస్ట్రల్ బాడీకి తగిలితే, ఆ ఎఫెక్ట్ ఇక్కడ భౌతిక శరీరానికి తగిలిందని నాకి అర్థమైపాయే
జీవితం మరీ ఇంత విసుగు పుట్టినప్పుడు, మనిషి దేనికైనా తెగిస్తాడు. నాకిక సహించే ఓపిక నశించిపాయే. ఆ తపస్ గాడిని అడవి అంచున ఉన్న శివాలయం కాడికి రమ్మని గలాటాకి సవాల్ చేసినాను.
ఉదయం పూట మంచు ఇంకా పూర్తిగా ఇడిపోలేదు. పచ్చటి సెట్ల ఆకుల మీద నుంచి మంచు నీళ్లు టప్ టప్ మని రాలుతా ఉండాయి. చలికి ఎముకలు కొరుకుతా ఉండాయి. ఆ గుడి కాడ నేనూ, తపస్ ఇద్దరం ఒకరికొకరు ఇరవై ఐదు అడుగుల దూరంలో తుపాకులు పట్టుకోని నిలబడినాము.
గెస్ట్ హౌస్ లో నా వినీత గాఢ నిద్రలో ఉండాది. వాడు కూడా ఈ పిచ్చి ఆట ముగించాలనే ఉండాడు.
"వన్... టూ..." అని నా మనసులో నేనే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకున్నాను.
నేను బరువుగా ఊపిరి పీల్చుకోని ట్రిగ్గర్ మీద ఏలు పెట్టినాను. సరిగ్గా అదే సమయానికి, ఆ మంచు పొరల్లో నుంచి వినీత ఆకారం మా ఇద్దరి మధ్యలోకి నడుచుకుంటా వచ్చింది. ఆమె కళ్లు మూసుకునే ఉండాయి, అదొక సూక్ష్మ శరీరం. నా ప్రాణం బిగుసుకు పోయింది.
నేను తుపాకీ పేల్చితే, నా గుండు వాడికి తగలకుండా నా వినీతకే తగులుతాది అని నాకి ఎరుకైపాయే. ఆ నిశ్శబ్దమైన ఉదయంలో నా మనసులో ఒక పెద్ద తుఫాను రేగింది. ప్రేమ అంటే ఏంది? ఒకరిని బలవంతంగా మన కాడ ఉంచుకోవడమా? లేదా అవతలి వాడిని చంపి సొంతం చేసుకోవడమా? కాదు కదా. ప్రేమ అంటే స్వేచ్ఛ ఇయ్యడం.
నేను నా తుపాకీని కిందికి దించేసినాను. ఆ ఆయుధాన్ని నేలకేసి కొట్టినాను.
"నేను నిన్ను చంపను తపస్. నా వినీత ఆత్మను తుపాకులతో, మంత్రాలతో గెలవలేను. ఒకవేళ ఆమె ఆత్మ నిజంగానే నీ కాడ బందీ అయిపోయి ఉంటే, దాన్ని చంపి నేను బతకలేను. ప్రేమంటే ప్రాణం తీయడం కాదు, ప్రాణం పోయడం. వినీత, నా ప్రాణం నువ్వే. నువ్వు బతుకు... స్వేచ్ఛగా బతుకు!" అని గట్టిగా అరిచినాను.
నా కళ్ళ వెంబడి ధారగా కన్నీళ్లు కారుతా ఉండాయి. ఆ కన్నీళ్లలో నా నిస్వార్థమైన ప్రేమ, నా ఓటమి, నా త్యాగం అన్నీ ఉండాయి.
ఆ మాటలు వినబడగానే... అప్పటిదాకా మాయలో ఉన్న వినీత ఆకారంలో ఒక వణుకు మొదలైంది. ఆమె ఆత్మ నాలో ఉన్న నిజమైన ప్రేమను చూసి మేల్కొంది. తపస్ వాడిన హిప్నాటిజం, ఆ సైకో మాయాజాలం అంతా నా కన్నీటి చుక్క ముందర పటాపంచలైపాయే.
ఆ అదృశ్య రూపం ఆ మంచులో కరిగిపోయి, ఎక్కడినుంచి వచ్చిందో అక్కడికే అంటే బంగ్లాలో పడుకోని ఉన్న నా వినీత శరీరంలోకి వెళ్లిపాయే.
తపస్ చేతిలో ఉన్న తుపాకీ కింద పడిపోయింది. వాడికి అర్థమైపాయే, బలవంతంగా మనుషుల్ని బంధించొచ్చు కానీ, నిజమైన ప్రేమ ముందర ఏ మాయలూ పనికిరావని. వాడు నా వైపుకు ఒకమారు శూన్యంగా చూసినాడు.
"అమర్ ... నేను ఆమె ఆత్మను మంత్రంతో కట్టిపడేసినాను. కానీ నువ్వు నీ ప్రేమతో ఆ ఆత్మను విడిపించినావు. నేను ఓడిపోయినాను," అని గొణిగినాడు.
వాడి కళ్లల్లో కూడా ఒక రకమైన పశ్చాత్తాపం, విరక్తి కనపడతా ఉండాయి. వాడు నెమ్మదిగా వెనుదిరిగి, ఆ పొగమంచులో అట్టాగే ఎటో నడుచుకుంటా వెళ్లిపోయినాడు. వాడు ఇంకెప్పుడూ మా బతుకుల్లోకి రాడని నాకు అర్థమైంది.
నేను పిచ్చివాడిలా పరుగెత్తుకుంటా బంగ్లా కాడికి పోనాను. గది తలుపులు తెరిచి చూస్తిని. లోపల సోఫా మీద పడుకోని ఉన్న నా వినీత కళ్లు తెరిచి కూకోని ఉండాది. ఆమె మొఖంలో పాలిపోయిన కళ లేదు, ఆ భయం లేదు. నన్ను చూడగానే ఎంతో కాలం తర్వాత పరిచయం ఉన్న ప్రాణాన్ని చూసినట్టు వలవల ఏడ్చుకుంటా వచ్చి నా ఎదన వాలిపోయింది.
"అమర్ ... నన్ను క్షమించు. నేనెంత దూరం పోయినా, నీ ప్రేమ నన్ను మళ్లీ నీ కాడికి చేర్చింది. నాకిప్పుడే ఒక పీడకల నుంచి బయటపడ్డట్టు ఉండాది," అని ఏడ్చింది.
నేను ఆమె తల నిమురుతా, "ఏడ్వబాక వినీత. అంతా సర్దుకుంది. ఆ పీడకల పోయిందిలే," అని ఓదార్చినాను.
బయట సూర్యుడు మెల్లగా కొండల మీదికి వస్తా ఉండాడు. మంచు అంతా ఇడిపోయి, ఎలుతురు లోపలికి వస్తా ఉండాది. దూరాన గుడిలోంచి గంటల సప్పుడు 'ఢంగ్... ఢంగ్...' అని మస్తు ప్రశాంతంగా ఇనిపిస్తా ఉండాది. జీవితం అంటే ఇదేనేమో. ఎంత చీకటి కమ్మినా, ఎంత దిగులు వచ్చినా... నిజమైన ప్రేమ కాడ మళ్లీ ఒక కొత్త ఉదయం పుడుతాది.
ఆ క్షణం, గదిలో ఉన్న మా శ్వాస సప్పుడు కూడా నాకు ఒక అందమైన పాటలాగా ఇనిపిస్తా ఉండాది. మేమిద్దరం నిమ్మలంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకోని, ఆ ఎలుతురులోకి చూస్తా నిలబడినాము. బతుకు మళ్లీ మొదలైంది.
సమాప్తం
ఎం. కె. కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: ఎం. కె. కుమార్
నేను గతంలో ఎప్పుడో కథలు, కవితలు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. నేను పీజీ చేశాను. చిన్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నాను. కథలు ఎక్కువుగా చదువుతాను.
🙏

Comments