top of page
Original.png

మంగళ గౌరి వ్రతం


శ్రావణమాసంలో మంగళ గౌరి వ్రతం చేస్తున్న తెలుగు వివాహిత మహిళ

Mangala Gouri Vratam - Telugu Devotional Story | Sudhavishwam Akondi

మంగళ గౌరి వ్రతం తెలుగు ఆధ్యాత్మిక కథ | సుధావిశ్వం ఆకొండి

Published in manatelugukathalu.com on 20/08/2026


శ్రావణమాసం హిందూ సంప్రదాయంలో వ్రతాలు, పూజలు, పేరంటాలతో ఎంతో పవిత్రమైన కాలంగా భావిస్తారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు శ్రావణమాసంలోని మంగళవారాల్లో ఆచరించే మంగళ గౌరి వ్రతంకు సౌభాగ్యం, దాంపత్య సుఖం, భర్తకు దీర్ఘాయుష్షు ప్రసాదించే వ్రతంగా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. మంగళగౌరి దేవి అనుగ్రహంతో అల్పాయుష్కుడైన శివుడు పూర్ణాయుష్కుడైన కథ ఈ వ్రత విశ్వాసానికి ప్రధాన ఆధారంగా చెప్పబడుతుంది. గయాక్షేత్రంలోని మంగళగౌరి శక్తిపీఠ మహిమతో పాటు, శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పిన ఈ వ్రత కథలోని ఆధ్యాత్మిక సందేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.


శ్రావణమాసం అంటేనే వ్రతాలు, పేరంటాలు. ముఖ్యంగా శ్రావణమాసంలో కొత్తగా పెళ్లయిన వారిచే మంగళగౌరి వ్రతం చేయిస్తారు. ఇక రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తారు.


మంగళగౌరి వ్రతం వారి వారి ఆచారాన్ని బట్టి ఐదు సంవత్సరాల నుండి జీవితాంతం చేసుకుంటూ ఉంటారు. చాలామంది పెళ్లయిన నాటి నుంచీ ఐదేళ్లు చేసుకుని ఆపేస్తారు సామాన్యంగా. ఈ వ్రతం చేసుకుని, వ్రత కథ చదువుకుంటే స్త్రీకి అమ్మవారి పూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం! అది సత్యం కూడా!


పెళ్లిలో వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు! అప్పుడు నిష్ఠగా చేసిన గౌరీ పూజ వల్ల, అమ్మ ఎల్లప్పుడూ వెంటే ఉండి, సౌభాగ్యాన్ని, దంపతుల మధ్య అనుకూల, అన్యోన్య దాంపత్యం స్థిరంగా ఉండేలా, ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంది. అందుకే ఎంతో ఏకాగ్రతతో ఈ గౌరీ పూజ చేయాలని చెబుతారు. పెళ్లి అయ్యాక ఐదేళ్లు ఈ వ్రతం అలాగే ఏకాగ్రంగా చేయాలి. అమ్మ కాపాడుతుంది!


మంగళాలను అంటే శుభాలను కలిగించే తల్లి మంగళగౌరి గయలో వెలిసింది. శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి! అమ్మవారి వక్షస్థల భాగం ఇక్కడ పడిందని పురాణ వైశిష్ట్యం! ఆ అమ్మవారి దర్శనం అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తుంది.


అయితే ఈ శ్రావణమాసంలో ఒకసారి అమ్మను దర్శించుకుందామా మరి...

మంగళగౌరి ఆలయం ఒకే ఒక్క చోట ఉంది. అది గయాక్షేత్రంలో ఉంది. ఒకే ఒక్కసారి ఇంచుమించు పదిహేనేళ్ల క్రితం వెళ్లి దర్శించుకున్నాం. చాలా మెట్లు ఎక్కి వెళ్లాలి. పైకి వెళ్లాక పైనుంచి గయా పట్టణం అద్భుతంగా కనిపిస్తుంది.


అక్కడ ఒక చిన్న మందిరంలో ఉంది అమ్మ. ఫోటోల్లో చూస్తే ఇప్పుడు కొంచెం బాగు చేసినట్టున్నారు. ఇది శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి వక్షస్థల భాగం పడిందని చెబుతారు. చాలా చిన్న మూర్తిగా ఉంది అమ్మవారు. ఎదురుగా పెద్ద వృక్షం ఉంది. ఉదయం ఎప్పుడో పూజ చేసేసి వెళ్లిపోతారనుకుంటా! తర్వాత అక్కడ ఎవ్వరూ ఉండరు. అలా దర్శించుకుని వచ్చాం. ఇప్పుడు అక్కడ అభివృద్ధి జరిగిందేమో! మళ్లీ ఒకసారి వెళ్లి రావాలి. ఆ అవకాశం మరి ఎప్పుడో!


వ్రత కథ:

ఈ వ్రతానికి సంబంధించిన కథ ఉంది. సత్యనారాయణ వ్రతంలో లాగా ఈ కథ చదువుకుంటారు పూజ అయ్యాక.

తన భక్తులైన పాండవులను చూడడానికి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ వారితో మాట్లాడి, చెల్లెలు అయిన ద్రౌపదిని పలుకరించడానికి వస్తాడు. అప్పుడే ఆమెకు ఈ వ్రతం చేయమని, ఈ మాసంలోని మంగళవారాలు చేయాలని చెబుతాడు. దానివల్ల పాండవులకు విజయం సిద్ధిస్తుందని చెబుతూ...


"సోదరీ! సాక్షాత్తు ఆ శివుడు కూడా ఈ మంగళగౌరిని పూజించి రాక్షస సంహారం చేశాడు. మండుడనే రాజు మంగళ గౌరిని అర్చించే యుద్ధంలో విజయాన్ని సాధించాడు. ఈ దేవిని అర్చించి వైధవ్యం రాకుండా చేసుకున్న ఒక స్త్రీ కథ చెబుతాను... విను!" అని వివరిస్తాడు.


ఒకప్పుడు మాహిష్మతి రాజ్యాన్ని జయపాలుడు అనే రాజు ప్రజానురంజకంగా పరిపాలించేవాడు. ఆయన పాలనలో ప్రజలు హాయిగా ఉన్నారు. రాజ్యం సుభిక్షంగా, ధనధాన్యాలతో తులతూగుతుండేది. ఆయనకు అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేదని బాధపడుతుండేవాడు.


అతని ధర్మబద్ధమైన పాలనను చూసి సంతోషించిన శివుడు ఆయన్ని అనుగ్రహించాలని అనుకుని, ఒకరోజు ఒక సన్యాసి రూపంలో వచ్చి, భిక్ష అడుగుతాడు. జయపాలుని భార్య భిక్ష తీసుకుని వచ్చే లోపు వెళ్ళిపోతాడు. అలా మూడు రోజులు జరుగుతుంది.


ఆ మరునాడు భర్త జయపాలుని సలహా మేరకు ఆ సన్యాసి వచ్చే సమయానికి ముందే భిక్షతో నిలబడుతుంది. సన్యాసి రూపంలో వచ్చిన శివుడు...


"మీకు సంతానం లేదు కదా! అందుకని మీ వద్ద భిక్ష స్వీకరించను" అని వెళ్లబోతాడు.

అప్పుడు ఆ రాణి...

"స్వామీ! మాకు సంతానం కలిగే మార్గం చెప్పండి! మాకు ఈ బాధ నుండి విముక్తి కలిగించండి!" అని వేడుకొంటుంది.


అప్పుడు శివుడు...

"అమ్మా! నీ భర్తను నీలి వస్త్రాలు ధరించి, నీలి అశ్వం పైన అధిరోహించి ఇక్కడికి కొంత దూరంలో ఉన్న అడవి ప్రాంతంలోకి వెళ్లమని చెప్పు! ఏ ప్రదేశంలో అడుగుపెట్టగానే తన గుర్రం అలిసిపోయి, కింద పడుతుందో చూసుకోమను! గుర్రం ఆగిన ఆ ప్రాంతంలో మామిడి చెట్లున్న ప్రదేశంలో తవ్వితే ఒక ఆలయం బయటకు కనిపిస్తుంది. అందులో కొలువైన భగవతిని అర్చించి ప్రసన్నం చేసుకుంటే మీ కోరిక తప్పకుండా తీరుతుంది" అని చెప్పి వెళ్ళిపోతాడు.


ఆ విషయం భర్త జయపాలునితో రాణి చెబుతుంది. భార్య చెప్పగానే విన్న ఆ రాజు శివుడు చెప్పినట్లుగానే వెళ్లి, అక్కడ బయటకు కనిపించిన అమ్మవారిని అర్చిస్తే, అమ్మవారు ప్రత్యక్షమై, కోరిక ఏమిటని అడుగుతుంది.


"వైధవ్యం వచ్చే కూతురు కావాలా? లేక పదహారు సంవత్సరాలు మాత్రమే ఆయుర్దాయం కలిగిన సుపుత్రుడు కావాలా?" అని అడుగుతుంది.

జయపాలుడు ఆలోచించి, ఆయుర్దాయం తక్కువ ఉన్నా సరే సుపుత్రుని ప్రసాదించమని కోరతాడు. కూతురు కావాలని కోరుకుని, తరువాత ఆ కూతురు వైధవ్య పరిస్థితికి అందరూ బాధపడాల్సి వస్తుందని అనుకుని, పుత్రుడే కావాలని కోరతాడు.


"అయితే రాజా! ఈ వైపు గణపతి మందిరం పక్కనే ఉన్న మామిడిచెట్టు ఉంది కదా! ఆ చెట్టు నుంచి ఒక మామిడి పండు తీసుకుని వెళ్లి నీ భార్యకు ఇవ్వు" అని చెప్పి అంతర్ధానమవుతుంది.


ఆయన ఆశతో ఎక్కువ పండ్లు తీసుకుని వెళితే, ఎక్కువ సంతానం కలిగి, ఒక్కరైనా బతుకుతారనే ఆలోచన వస్తుంది ఆయనకు. అందుకని ఆ మామిడిచెట్టు నుంచి ఎక్కువ పండ్లు తీసుకుంటాడు. కానీ చిత్రంగా అన్నీ మాయమైపోయి ఒకటే పండు చేతిలో ఉంటుంది. ఇది చూసి పక్కన ఉన్న గణపతి కోపిస్తాడు.


"రాజా! ఒక్కటి తీసుకోమంటే ఇలా ఇన్ని తెంపావు కనుక ఈ ఫలం వల్ల పుట్టే నీ కొడుకు పదహారేళ్లకే మరణిస్తాడు" అని శపించి అదృశ్యమైపోతాడు.


ఇక చేసేదేమీ లేక ఇంటికి వచ్చి ఆ పండు భార్యకిస్తాడు. ఆ ఫల ఫలితంగా పండంటి కుమారుడు జన్మిస్తాడు. 'శివుడు' అని పేరు పెట్టుకుంటారు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు. పదహారేళ్లు వచ్చే సమయం వచ్చేస్తుంది.


ఒకరోజు రాణి భర్తతో...

"ప్రభూ! మన అబ్బాయికి పెళ్లి చేస్తే, మన ఇంటికి వచ్చిన కోడలు సౌభాగ్యవతి అయితే మన బాధ తీరుతుందని అనిపిస్తోంది! ఆమె చేసిన వ్రతం వల్ల మన కుమారుడి ఆయుర్దాయం పెరగవచ్చు కదా! సావిత్రి వ్రతం చేసి ఆనాడు సావిత్రి తన భర్త సత్యవంతుని బ్రతికించుకుందని విన్నాం! అలాగే మన బిడ్డ ఆయుష్షు పెరుగుతుందని నా ఆశ" అని అంది.


అప్పుడు ఆ రాజు...

"పెళ్లికి ముందు కాశీ దర్శనం చేసుకుని రావాలని మన ఆచారం కదా! కాశీ దర్శనానికి అబ్బాయిని పంపుతాను. అటు వెళ్లి రాగానే నువ్వు చెప్పినట్లుగానే పెళ్లి చేద్దాం!" అని అన్నాడు.


వెంటనే రాజు తన కుమారుడు శివునికి తన మేనమామను తోడుగా ఇచ్చి కాశీ దర్శనం చేసుకుని రమ్మని పంపుతాడు. వాళ్లిద్దరూ అలా వెళుతుంటే దారిలో ఒక రాజ్యంలోకి అడుగుపెడతారు. అక్కడ ఒక దృశ్యాన్ని చూస్తారు.


అక్కడ కొందరు ఆడపిల్లలు చేరి ఆడుతూ ఉంటారు. ఆ ఆటల్లో ఏదో చిన్న గొడవ వల్ల తిట్టుకుంటారు. అందులో 'సుశీల' అనే అమ్మాయిని 'విధవ' అని అర్థం వచ్చేలా ఒక ఆడపిల్ల తిడుతుంది.


అప్పుడు ఆ సుశీల అనే అమ్మాయి...

"మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది. కాబట్టి మా ఇంట్లో ఎవరికీ అటువంటి పరిస్థితి రాదు! ఆ మంగళగౌరీదేవి రక్షిస్తూ ఉంటుంది!" అని ఎంతో స్థిరంగా అంటుంది.

ఆ మాటలు మామాఅల్లుళ్లు వింటారు.

తరువాత పక్కన ఉన్న శివాలయంలో కూర్చుంటారు. అప్పుడే ఆ గుడిలోకి సుశీల తండ్రి వస్తాడు.


శివపార్వతులను ఉద్దేశించి...

"అమ్మా! పరమేశ్వరా! మా అమ్మాయికి ఎలా వివాహం చేయాలనే ఆలోచనతో సతమతమవుతున్నాను. ఇప్పటికీ తగిన వరుడు దొరకలేదు. అసలు మా అమ్మాయికి తగిన వరుడు ఎక్కడున్నాడు? మీరు వరుడిని చూపించి, నా బాధ తీర్చండి!" అని అడుగుతాడు.


అది విన్న శివుడి మేనమామ ఆలయం వెనకకు వెళతాడు.

అక్కడ నిలబడి...

"ఇక్కడే శివుడు అనే పేరు గల యువకుడు కనిపిస్తాడు. వెంటనే నీ కూతురును అతడికిచ్చి వివాహం చేస్తే అంతా మంచి జరుగుతుంది!" అంటాడు.


ఆ మాటలు విని ఈశ్వరుడే చెప్పినట్లుగా భావించి సుశీల తండ్రి ఆనందంగా బయటకు వస్తాడు. అక్కడే ఆలయ ఆవరణలో కనిపించిన శివుని చూసి వివరాలు అడుగుతాడు. అతడి పేరు శివుడని తెలుసుకుని, మహేశ్వరుడు చెప్పింది ఈ శివుడి గురించేనని అనుకుని సంతోషిస్తాడు. తన ఇంటికి రమ్మని ఆహ్వానించి తీసుకెళతాడు. ఆ తర్వాత అతనికి మేనమామ తప్ప ఎవ్వరూ లేరని ఊహించుకుని వెంటనే వివాహం చేస్తాడు. మేనమామ, శివుడి ఆయుష్షు తీరే సమయం దగ్గరకు వస్తుందని, ఈ వివాహం వల్ల రక్షింపబడతాడని ఆలోచన చేసి ఏ వివరాలు వారితో చెప్పకుండా వివాహానికి సుముఖత చూపుతాడు.


పెళ్లి కాగానే సుశీల మంగళగౌరిని అర్చిస్తుంది. ఆ రాత్రి అమ్మవారు ఆమెకు కలలో కనిపించి, భర్తను రక్షించుకునే మార్గం చెబుతుంది.


"సుశీలా! నీ భర్త అల్పాయుష్కుడు! అతనికి మృత్యువు దరికి చేరే సమయం దగ్గరపడింది. నువ్వు నన్ను ఎంతో శ్రద్ధగా, నా వ్రతాన్ని ఆచరించావు కనుక నీ పట్ల నేను ప్రసన్నురాలనయ్యాను! నీ భర్తకు గండం పోయి, పూర్ణాయుష్కుడు అయ్యే మార్గం చెబుతాను. విను! నేను చెప్పినట్లుగా చెయ్యి! ఇంకా కొద్ది సమయంలో ఒక నల్లని త్రాచుపాము నీ భర్తను కాటు వేయడానికి ఇక్కడకు వస్తుంది. అప్పుడు పాలతో కూడిన ఈ కుండను దాని ముందు పెట్టు! అది నెమ్మదిగా అందులోకి దూరుతుంది. ఆ వెంటనే ఈ వస్త్రంతో ఆ కుండను గట్టిగా కట్టి, రేపు పొద్దున మీ తల్లికి ఈ కుండను వాయినం ఇవ్వు! నీ భర్తకు గండం పోతుంది. పూర్ణాయుష్కుడు అవుతాడు. చిరకాలం మీరిద్దరూ హాయిగా ఉంటారు" అని చెబుతుంది.


అమ్మవారు చెప్పినట్టుగానే నల్లత్రాచు వస్తుంది. సుశీల కూడా అమ్మవారు చెప్పిన విధంగానే కుండ ముందు పెడుతుంది. ఆ త్రాచుపాము అందులోకి దూరగానే వస్త్రంతో కట్టేసి, మరునాడు ఉదయాన్నే తల్లికి వాయినం ఇస్తుంది.

వాయినం తీసుకున్న సుశీల తల్లి ఆ వస్త్రం తీసి చూస్తే అందులో ఒక ముత్యాల హారం ఉంటుంది. ఆ హారం కూతురికే వేసుకోమని ఇస్తుంది తల్లి.


కాశీ ప్రయాణం కాకుండా ఇలా పెళ్లి జరిగిపోయింది అనుకుని, సుశీలకు, మామగారు వాళ్లకు చెప్పకుండా, తన ఉంగరాన్ని భార్య దగ్గర వదిలేసి ఆ రాత్రే శివుడు మేనమామతో కలిసి కాశీకి పయనమై వెళ్ళిపోతాడు. తిరిగి రాజ్యానికి వెళ్లేటప్పుడు భార్యను తీసుకెళ్లవచ్చు అని భావిస్తాడు.


సుశీలకు భర్త కనిపించక చూస్తే అక్కడ భర్త వదిలిన ఉంగరం మాత్రం కనిపిస్తుంది. ఆమె అర్థం చేసుకుంటుంది వాళ్లు కాశీ దర్శనానికి వెళ్లి ఉంటారని. భర్త కోసం వేచి చూస్తూ, అతిథి సత్కారాలతో కాలం గడుపుతూ ఉంటుంది.


మేనమామతో కలిసి కాశీకి వెళ్లి వస్తున్న శివుడు దారిలో చెట్టు కింద విశ్రమిస్తాడు. నిద్రపడుతుంది. అప్పుడు ఒక కల కంటాడు.

కలలో యమదూతలు వచ్చి తనను లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తుంటే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. వారితో తన ప్రాణాన్ని తీసుకెళ్లడానికి వీలులేదని, వదిలి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించగా, వాళ్లు తనను వదిలి వెళ్ళిపోవడం కనిపిస్తుంది.

ఆ వెంటనే మెలకువ వచ్చిన శివుడు, అదంతా నిజమే అని అనుభూతి చెందుతాడు. అందుకు సాక్ష్యంగా తన ఊపిరి ఆగిపోబోయి, తిరిగి పనిచేసినట్లుగా గ్రహిస్తాడు. మేనమామకు చెబుతాడు. ఇద్దరూ గండం గడిచింది అని అనుకుంటారు. తిరిగి ప్రయాణం మొదలుపెడతారు.


తన కోరిక మేరకు తన తండ్రి కట్టించిన అతిథి గృహంలో అతిథి సత్కారాలు చేస్తున్న సుశీల తన భర్త అక్కడికి రావడం చూసి తల్లిదండ్రులకు తెలియజేస్తుంది. అప్పుడు తండ్రి అల్లుడిని పిలిచి మర్యాదలు చేస్తాడు. అప్పుడు అల్లుడి వివరాలు అన్నీ తెలుసుకుని, సంతోషంగా తన కూతురిని అత్తవారింటికి పంపడానికి ఏర్పాట్లు చేస్తాడు.

భార్యను సగౌరవంగా తీసుకుని తమ రాజ్యం చేరుకుంటాడు శివుడు. సమయం దాటిపోయినా కొడుకు క్షేమంగా రావడం చూసి రాజదంపతులు చాలా సంతోషపడతారు.

"నాయనా! నువ్వు క్షేమంగా తిరిగి రావడం ఆనందం కలిగిస్తోంది! ఎలా క్షేమంగా వస్తావోనని నేనూ, మీ అమ్మా భయపడుతూ భగవంతుడి పైనే భారం వేసి, జీవిస్తున్నాం! ఆ గండం ఎలా తప్పింది? ఆ కాశీ విశ్వనాథుడు కరుణించి అనుగ్రహించాడా?..." అని ఎంతో ఆతృతగా ప్రశ్నలు అడిగిన తండ్రి జయపాలుడితో శివుడు...

"అంతా మంగళగౌరిదేవి కృప!" అని జరిగినదంతా వివరిస్తాడు. అలా దేవి కృపతో ఆయుర్దాయం పెరిగింది శివుడికి. సంపూర్ణ ఆయుష్కుడు అయ్యాడు.

ఈ కథ ద్రౌపదికి చెప్పి...

"కనుక ద్రౌపదీ! ఈ వ్రతం చేసినచో నీ భర్తలకు కూడా విజయం లభిస్తుంది" అని అంటాడు శ్రీకృష్ణుడు.

ఆ మంగళగౌరీ దేవి అందరికీ మంగళాలను ప్రసాదించుగాక! 🙏🙏🙏

శ్రీ మంగళగౌరి చరణారవిందార్పణమస్తు. 🙏🙏🙏🙏🙏


సుధావిశ్వం


***

సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):










సుధావిశ్వం

-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page