top of page
Original.png

శ్రీ జగదాంబికా కటాక్షం

1 hour ago
3 min read


శ్రీ జగదాంబికా కటాక్షం కథలో దివ్య ఖడ్గంతో మాంత్రికుడిని సంహరించిన జయనాథుడికి అష్టభుజ దుర్గారూపంలో దర్శనమిచ్చిన జగన్మాత

Sri Jagadhamba Kataksham - Telugu Devotional Story | Puneeth Sai Chalasani

శ్రీ జగదాంబికా కటాక్షం - తెలుగు ఆధ్యాత్మిక కథ |చలసాని పునీత్ సాయి

Published in manatelugukathalu.com on 05/10/2026


శ్రీ జగదాంబికా కటాక్షం ఒక భక్తి, పౌరాణిక, ఆధ్యాత్మిక కథ.

జగన్మాతను ఆరాధించే జయనాథుడి రాజ్యంలో మాంత్రికుడు సృష్టించిన మహమ్మారి, కరువు ఎలాంటి కల్లోలం రేపాయో ఈ కథ వివరిస్తుంది.


విజయాల పర్వదినం విజయదశమి రోజున శక్తిపురం దేశ రాజుగా జయనాథుడికి పట్టాభిషేకం జరిగింది. జయనాథుడు మరియు అతని పూర్వీకులు జగన్మాత ఉపాసకులు. ఇతడి తండ్రి విజయసింహుడు. అమ్మవారి అనుగ్రహంతో దివ్యమైన ఖడ్గాన్ని పొందాడు; ఆ ఖడ్గంతో దుష్టసంహారం చేశాడు.


విజయసింహునికి ఎంతకాలానికైనా పుత్రసంతానం కలగకపోవడంతో అమ్మవారిని గూర్చి దివ్యమైన వ్రతం ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం, జగన్మాత అనుగ్రహంతో విజయసింహుడు-జయాదేవి దంపతులకు జయనాథుడు జన్మించాడు.


విజయసింహుడి పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజారంజక పాలన కొనసాగించిన విజయసింహుడు, ప్రస్తుతం తన కొడుకు జయనాథుడికి పట్టం కట్టి, అడవిలో నివాసం ఏర్పరుచుకుని అమ్మవారిని ఉపాసిస్తూ మరణించారు. దేవీ భక్తులైన వారు మణిద్వీపాన్ని చేరారు.


జయనాథుడు తండ్రివలె జగన్మాతను పూజిస్తూ జనరంజక పాలన కొనసాగించాడు. అదే సమయంలో ఓ మాంత్రికుడు రాజ్యంలో ప్రవేశించాలని, ఆ రాజ్యంలోని కన్యను బలిస్తే తనకు అపారమైన శక్తులు లభిస్తాయని రాజ్యంలోకి ప్రవేశించాడు.


మాంత్రికుడి రాక తెలుసుకున్న జయనాథుడు, అతనికి శిరోముండనం చేయించి రాజ్యము నుంచి బహిష్కరించాడు.


అవమానభారంతో మాంత్రికుడు రాజ్యం శివారులోని అడవిలో నివాసం ఏర్పరుచుకుని, శక్తిపురాన్ని తన వశం చేసుకోవాలని భావించాడు. ఓ వర్తకుడి వేషాన్ని ధరించి, వ్యాపార నిమిత్తం రాజ్యంలోకి వచ్చినట్లు చెప్పి తన మాయమాటలతో అందరినీ ఆకర్షించాడు. అపార శక్తులతో పాటు సింహాసనాన్ని కూడా తనది చేసుకోవాలని ఆశపడ్డాడు.


తన కార్యం సాధించుటకు ముందుగా రాజ్యంలో ఓ మహమ్మారిని సృష్టించాడు. ఆ మహమ్మారి ప్రభావంతో ప్రజలు మరణించారు. అదే సమయంలో రాజ్యంలో వర్షాలు లేక కరువు తాండవించింది. ఈ రెండు విపత్కర పరిస్థితులు ఒకేసారి ఎదురవటంతో రాజ్యంలో వ్యాపారం, వాణిజ్యం నిలిచిపోయాయి.


వీటికి పరిష్కారం కోసం జయనాథుడు కులగురువు నందుడిని ఆశ్రయించాడు. నందుడు జగన్మాత అనుగ్రహం కోసం ఒక దివ్యయాగాన్ని సూచించాడు.


"ఆ యాగాన్ని దంపతులు మాత్రమే నిర్వహించాలి. జయనాథుడు బ్రహ్మచారి. కాబట్టి ముందుగా జయనాథుడి వివాహం జరిగిన తర్వాతే ఈ దివ్యయాగం జరగాలి" అని నందుడు అన్నాడు.


గిరిపురం రాజు ఆనందుడు జయనాథుడి మేనమామ. అతడి కూతురు చారురూప కూడా దేవి భక్తురాలు. ఒకనాడు జగన్మాత చారురూప కలలో ప్రత్యక్షమై శక్తిపురం రాజు జయనాథుని వివాహం చేసుకోమని ఆదేశించింది.


తన తండ్రితో జయనాథుని పెళ్లి చేసుకుంటానని చెప్పింది చారురూప. జగన్మాత ఆదేశం శిరసావహిస్తూ ఆనందుడు చారురూపను ఇచ్చి జయనాథుడితో తన రాజ్యంలో ఘనంగా వివాహాన్ని జరిపించాడు.


మరోపక్క శక్తిపురం మంత్రగాడి మహమ్మారి వల్ల, కరువు కాటకాలతో మరింత దుర్భిక్షంగా మారింది. జయనాథుడికి వివాహం జరగటంతో వెంటనే యాగానికి ఏర్పాటు చేశాడు నందుడు.


ఆ యాగం నిరాటంకంగా సాగింది. ఆ యాగ ప్రభావం చేత రాజ్యంలో సమృద్ధిగా వర్షాలు, జగదంబ కరుణామృత వర్షం కూడా కురిసింది. ఆ వర్ష ప్రభావంతో మహమ్మారి శాంతించింది, కరువు నుంచి ఉపశమనం లభించింది.


ఇక ఈ మహమ్మారికి కారకులైన వారిని ఖచ్చితంగా వెతికి పట్టుకోవాలని జయనాథుడు సంకల్పించాడు.


గత కొంతకాలంగా రాజ్యంలో అనుమానాస్పదంగా ప్రవేశించిన వారిపై విచారణ జరపగా, ఒక వర్తకుడు మాత్రమే అనుమానాస్పదంగా కనిపించాడు. వర్తకుడిని బంధించి తీసుకురమ్మన్నాడు జయనాథుడు. బంధించటానికి వెళ్లిన భటులు తిరిగి రాలేదు; వారి జాడ తెలియరాలేదు.


ఇక స్వయంగా జయనాథుడే బయలుదేరాడు. ఆ వర్తకుని ఇంట్లో ప్రవేశించి వర్తకుడిని బంధించే ప్రయత్నం చేశాడు జయనాథుడు. కానీ అతడు మాంత్రికుడిగా మారి జయనాథుడిని బంధించే ప్రయత్నం చేశాడు.


అతడు వర్తకుడు కాదు, మాంత్రికుడు అని తెలుసుకున్న జయనాథుడు అతనిని తప్పక శిక్షించాలని తన చేతిలో ఉన్న ఖడ్గంతో అతన్ని సంహరించే ప్రయత్నం చేయగా, మాంత్రికుడు తన శక్తులతో తప్పించుకుని మళ్లీ అడవికి చేరాడు.


మాంత్రికుని సంహరించాలని జయనాథుడు కొంత సైన్యంతో అడవికి బయలుదేరాడు. అడవికి వెళ్లే ముందు తన ఆరాధ్య దైవం జగన్మాతను ప్రార్థించాడు. ఆనాడు జగన్మాత తన తండ్రికి ప్రసాదించిన ఖడ్గాన్ని తీసుకుని బయలుదేరాడు.


అడవిలో ఎన్నో ఆటంకాలు ఎదిరించి, చివరగా మాంత్రికుడు ఉండే ప్రాంతానికి చేరాడు. మాంత్రికుడు ఒక్కడే తన మాయాశక్తులతో జయనాథుని, అతని సైన్యాన్ని నిలువరించాడు. జయనాథుడి సైన్యాన్ని మూర్ఛపోయేలా చేశాడు.


జయనాథుని సంహరించి రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని ప్రయత్నించాడు.


జయనాథుడికి, మాంత్రికుడికి మధ్య ద్వంద్వ యుద్ధం జరిగింది. చివరకు అతని మాయలను ఛేదించి, తన తండ్రికి ప్రసాదించిన జగన్మాత దివ్య ఖడ్గంతో మాంత్రికుని సంహరించాడు జయనాథుడు. మాంత్రికుని మరణంతోనే అతని మాయలన్నీ తొలగాయి. మూర్ఛపోయిన భటులు, నాడు బంధించబడిన భటులు విముక్తులై జయనాథుని కీర్తించారు.


అదే సమయంలో ఓ దివ్యకాంతి అక్కడ ప్రత్యక్షమైంది. జగన్మాత అష్టభుజాలతో దుర్గా రూపంలో దర్శనమిచ్చింది.


అమ్మను జయనాథునితో సహా అందరూ స్తుతించారు. తర్వాత జగన్మాత, తనను నమ్మిన వారికి ఎల్లప్పుడూ రక్షగా ఉంటానని, "నేను ప్రసాదించిన దివ్య ఖడ్గంతో నీవు దుష్టసంహారం కావించి ధర్మరక్షణ చేయి" అని ఆదేశించింది.


అమ్మవారి ఆదేశాన్ని తప్పక పాటిస్తానని జయనాథుడు అమ్మవారికి తెలిపాడు. అలాగే అమ్మవారిని రాజ్యంలో ఎల్లప్పుడూ ఉండమని కోరాడు.


సంతోషించిన జగన్మాత, "రాగల కాలంలో ఓ విగ్రహరూపంలో మీ రాజ్యంలో తప్పక ఉంటాను" అని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం అమ్మవారు ఆ రాజ్యంలో వెలిసింది. జయనాథుడు ఆ జగన్మాతకు దివ్య ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేశాడు. ఆ జగదంబ కటాక్షంతో జయనాథుడు జనరంజక పాలన చేశాడు. రాజ్యం సుభిక్షమైనది.


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



చలసాని పునీత్ సాయి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


చలసాని పునీత్ సాయి

పరిచయం:

రచయిత పేరు : చలసాని పునీత్ సాయి

పేరు చలసాని పునీత్ సాయి నేను డిగ్రీ పూర్తి చేశాను ప్రస్తుతం సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ తెలుగు భాష పట్ల కథల పట్ల అభిమానంతో కథలు రాయటం ప్రారంభించాను.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page