top of page
Original.png

వెలుగు వెనుక నీడ

9 minutes ago
7 min read

'

వెలుగు వెనుక నీడ తెలుగు కథలో మధుప్రియ నిజం తెలుసుకుని పశ్చాత్తాపపడుతున్న సుధాకర్

Velugu Venuka Needa - Telugu Love Story | M R V Sathyanarayana Murthy

వెలుగు వెనుక నీడ - తెలుగు ప్రేమ కథ | M R V సత్యనారాయణ మూర్తి | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com on 23/11/2026


బయటికి కనిపించే నిజం ఎప్పుడూ పూర్తి నిజం కాదు. “వెలుగు వెనుక నీడ” కథలో మధుప్రియ జీవితంలోని అనుకోని మలుపులు, ఆమె చేసిన త్యాగం, సుధాకర్ చేసిన అపార్థం చివరకు ఎలా తొలగిపోయాయో హృదయస్పర్శిగా ఆవిష్కరించారు.



కళ్ళు మూసుకుని, ‘శ్రీ మాత్రే నమః’ అని మనసులో అనుకుంటూ నిలబడ్డాడు సుధాకర్. 


పంతులుగారు గర్భగుడిలో సుధాకర్ భార్య పేరున కుంకుమ పూజ చేస్తున్నారు. ఆరోజు శ్రావణ మంగళవారం. పిఠాపురంలోని ‘పురూహూతిక’ అమ్మవారి గుడి భక్తులతో సందడిగా ఉంది.


పది రోజులలో సుధాకర్ భార్య మాధవికి హార్ట్ ఆపరేషన్ చేయాలి. వాళ్ళ ఇంటి పురోహితుడు చెప్పాడు, ‘దాక్షారామంలోని మాణిక్యాంబ అమ్మవారికి, పిఠాపురంలోని పురూహూతిక అమ్మవారికి పూజలు చేయించి రండి’ అని. 


హైదరాబాద్ నుండి కాకినాడ వచ్చి, టాక్సీ మాట్లాడుకుని ముందుగా దాక్షారామం వెళ్లి అమ్మవారికి పూజ చేయించాడు. ఇప్పుడు పిఠాపురం వచ్చి పూజ చేయిస్తున్నాడు.


అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న గ్రిల్స్ వెనుక నిలబడి ఉన్నాడు సుధాకర్. అతని ముందు నుండి భక్తులు వెళ్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ‘నీహారికా, అమ్మవారికి దణ్ణం పెట్టుకో అమ్మా’ అన్న స్త్రీమూర్తి మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు సుధాకర్. 


అతని ఏకాగ్రతకి భంగం కలిగింది. కళ్ళు తెరిచి చూశాడు.


ఒక మహిళ నిలబడి అమ్మవారికి దణ్ణం పెట్టుకుంటోంది, పక్కనే సుమారు ఇరవై ఏళ్ళ అమ్మాయి కూడా ఉంది. ‘ఊ.. నడవండి త్వరగా. ఇంకా అన్నవరం కూడా వెళ్ళాలి’ అన్నాడు ఒక పురుషుడు వాళ్ళతో. తల్లీ, కూతురూ అన్యమనస్కంగానే ముందుకు కదిలారు. 


అప్పుడు ఆ స్త్రీమూర్తి పక్కకు తిరిగి నడిచి మెట్లు దిగుతోంది. ఆమెని చూడగానే సుధాకర్ ఆశ్చర్యపోయాడు.


‘మధుప్రియ.. ఇక్కడ!’ అనుకున్నాడు. ఆమెని పిలుద్దామా అని వెంటనే ఆగిపోయాడు. పూజ అయ్యేవరకూ మీరు కదలకుండా ఉండి, ‘శ్రీ మాత్రే నమః’ అని అంటూ ఉండండి అని పంతులుగారు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది సుధాకర్ కి. వెంటనే అమ్మవారి కేసి తిరిగి లెంపలు వేసుకుని, ‘శ్రీ మాత్రే నమః’ అని జపిస్తూ ఉన్నాడు. 


పది నిముషాలకు పూజ ముగిసింది. పంతులుగారు గర్భగుడి నుండి బయటకు వచ్చి, అమ్మవారి ప్రసాదం, పూజ చేసిన కుంకుమ సుధాకర్ కి ఇచ్చారు. ‘రోజూ ఈ కుంకుమ మీ భార్యని పెట్టుకోమనండి. 


అమ్మవారి అనుగ్రహం వలన ఏ ఇబ్బందీ లేకుండా ఆవిడకి ఆపరేషన్ జరుగుతుంది. శుభం’ అన్నారు పంతులుగారు. సుధాకర్ ఆయనకి దక్షిణ ఇచ్చి నమస్కరించి గుడి బయటకు వచ్చి, మధుప్రియ కోసం వెతికాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు.


టాక్సీ ఎక్కి కాకినాడ వచ్చాడు. భోజనం చేసి రూమ్ కి వచ్చాడు. మరలా మధుప్రియ గుర్తుకువచ్చి గతం కళ్ళముందు కదలాడింది.


సుధాకర్, శ్రీకాంత్ ప్రాణస్నేహితులు. ఇద్దరూ ఇంటర్మీడియట్ వరకూ కలిసే చదువుకున్నారు. సుధాకర్ తణుకు సమీపంలో ఉన్న ఇరగవరం నుండి రోజూ సైకిల్ మీద కాలేజీకి వచ్చేవాడు. టౌన్ హాల్ వెనుకవీధిలో ఉన్న శ్రీకాంత్ రోడ్ మీద రెడీగా ఉండేవాడు సుధాకర్ కోసం. ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్ళేవారు.


డిగ్రీలో మధుప్రియ చేరాక, శ్రీకాంత్ లో మార్పు వచ్చింది. డ్రెస్ విషయంలో చాలా నీట్ గా ఉండేవాడు. కొత్త హుషారు అతనిలో చోటుచేసుకుంది. 


మధుప్రియ, రైస్ మిల్లర్ కృష్ణమూర్తి గారి అమ్మాయి. చాలా అందంగా, స్టైల్ గా ఉండేది. క్లాసులో మగపిల్లలు ఆమెతో మాట్లాడాలని చాలా ఉత్సాహం చూపేవారు. ఆమె మాత్రం రిజర్వుగా ఉండేది. ఆమె బొమ్మలవీధిలోని మేడలో ఉండేది.


దసరా సెలవుల తర్వాత మధుప్రియ, శ్రీకాంత్ తో మాట్లాడటం మొదలుపెట్టింది. ఒకరోజు సుధాకర్ అడిగాడు, “ఏమిటి విశేషం? మీ ఇద్దరికీ ఎలా జత కలిసింది?” అని.


“మధుప్రియ, చల్లా సుబ్రహ్మణ్యం గారి దగ్గర వీణ నేర్చుకుంటోంది. నేను ఆయన దగ్గర ‘గాత్రం’ నేర్చుకోవడానికి వెళ్తున్నాను” అన్నాడు నవ్వుతూ. శ్రీకాంత్ పాటలు చక్కగా పాడతాడు. 


ఇంటర్ లో కాలేజీ ఫంక్షన్స్ లో పాడి మూడు ప్రైజ్ లు కూడా తెచ్చుకున్నాడు. మధుప్రియ కోసం శాస్త్రీయ సంగీతం నేర్చుకునే వంకతో సుబ్రహ్మణ్యం గారి దగ్గరకు వెళ్తున్నాడని సుధాకర్ కి అర్థమయ్యింది.


“చూడు మిత్రమా! జీవితం చాలా విలువైనది. కాలాన్ని తాత్కాలిక వ్యామోహాలకు కాకుండా, ఒక నిర్దుష్టమైన లక్ష్యసాధనకి వినియోగించు. నీ గొంతులో మాధుర్యం ఉంది. దానిని మెరుగుపెట్టుకో” అన్నాడు సుధాకర్. దానికి చిన్నగా నవ్వి, “నీ సలహా తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను” అన్నాడు శ్రీకాంత్.


డిగ్రీ రెండవ సంవత్సరంలోకి వచ్చేసరికి మధుప్రియ సుధాకర్ తో కూడా చనువుగా ఉండేది. కారణం అతను బాగా చదువుతాడు, హుందాగా మాట్లాడతాడు. ఒకరోజు సుధాకర్ ని అడిగింది, “అవునూ, మీ ఊరిలో వేదపండితులు ఎక్కువగా ఉంటారట కదా. మా అమ్మ చెప్పింది” అని.


“అవును. ఇరగవరం ఒకప్పుడు అగ్రహారం. చాలామంది వేదపండితులు ఉండేవారు. కంచి కామకోటి పీఠం, శృంగేరి పీఠంలలో జరిగే సభలకు వెళ్లి సత్కారాలు పొందేవారు. ఇప్పుడు తక్కువగా ఉన్నారు” అన్నాడు సుధాకర్.


ఒక ఆదివారం కారులో ఇరగవరం వచ్చింది మధుప్రియ, శ్రీకాంత్ తో కలిసి. సుధాకర్ పాలేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్ళాడు వాళ్ళిద్దరినీ. 


ఆ గుడి చరిత్ర తెలుసుకుని ఆశ్చర్యపోయింది మధుప్రియ. తర్వాత సుధాకర్ ఇంటికి వెళ్ళింది. సుధాకర్ తల్లి రుక్మిణమ్మ ఎంతో ఆదరంగా మాట్లాడింది. ఒక అరగంట ఉండి తిరిగి తణుకు వచ్చింది మధుప్రియ.


కాలేజీ వార్షికోత్సవంలో మధుప్రియ వీణ వాయిస్తే, శ్రీకాంత్ దేవులపల్లి వారి లలితగీతాలు పాడాడు. ప్రిన్సిపాల్ ఇద్దరినీ అభినందించి, జ్ఞాపికలు ఇచ్చారు. 


డిగ్రీ ఆఖరి సంవత్సరంలో జరిగిన విశ్వవిద్యాలయం యువజనోత్సవాలలో కాలేజీ తరపున మధుప్రియ, శ్రీకాంత్ సంగీత విభాగంలో పాల్గొని బహుమతులు పొందారు. ఆ విధంగా వారిద్దరూ మరింత చేరువయ్యారు.


డిగ్రీ పూర్తి అయ్యాక సుధాకర్, శ్రీకాంత్, మధుప్రియ ముగ్గురూ పి.జి. చేయడానికి వైజాగ్ వెళ్లి ఒకే కాలేజీలో చేరారు. శ్రీకాంత్, మధుప్రియ ఆకాశవాణిలో ఆడిషన్ టెస్ట్ పాస్ అయ్యి, కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 


అలా వారి స్నేహం మరింతగా పెరిగింది. పి.జి. ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోగానే ముగ్గురూ బీచ్ లో కలుసుకున్నారు.


“శ్రీకాంత్, నీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి?” అడిగాడు సుధాకర్.

“అంతా మధుప్రియ చేతిలో ఉంది” అన్నాడు చిన్నగా నవ్వుతూ శ్రీకాంత్.


“అదేమిటి..?” ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్. దీర్ఘంగా నిట్టూర్చాడు శ్రీకాంత్.

“మధుప్రియ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఇద్దరం ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నాము” నెమ్మదిగా అన్నాడు శ్రీకాంత్. సుధాకర్ మధుప్రియ కేసి చూశాడు.


“అవును సుధాకర్. మా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను” అంది మధుప్రియ.


“మంచిది. ఇద్దరివీ ఒకే రకమైన అభిరుచులు. లలితకళల పట్ల ఎంతో మక్కువ ఉన్నవారు. ఇన్నేళ్ళ స్నేహంలో ఒకరి భావాలు ఒకరికి బాగా నచ్చాయి. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకోవడం చాలా మంచి ఆలోచన. శుభం” అన్నాడు సుధాకర్. 


అతని మాటలకి శ్రీకాంత్, మధుప్రియ చిన్నగా నవ్వారు. చాలాసేపు కబుర్లు చెప్పుకుని తర్వాత ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు.


ఆ మర్నాడే వైజాగ్ నుండి బయల్దేరి తణుకు వచ్చారు ముగ్గురూ. సుధాకర్ ఇరగవరం వెళ్ళాడు.


ఒక వారం గడిచాక సుధాకర్ అమ్మగారికి ఒంట్లో బాగుండకపోవడంతో ఆమెని విజయవాడలోని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాడు సుధాకర్. 


అతని మేనమావ శేషగిరిరావు అక్కడ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. డాక్టర్ ఆమెని పరీక్షించి, వారం రోజులలో గుండెకి ఆపరేషన్ చేయాలని చెప్పారు. శేషగిరిరావు ఆమెకి ఆపరేషన్ చేయించి నెల రోజులపాటు తన ఇంట్లోనే పెట్టుకున్నాడు చెల్లెలిని, మేనల్లుడిని.


నెల గడిచాక మరలా డాక్టర్ కి చూపించి, మందులు తీసుకుని తల్లితో ఇరగవరం వచ్చాడు సుధాకర్.


ఒకరోజు తణుకు వెళ్తే డిగ్రీలో క్లాస్ మేట్ రఘు కనిపించి చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాడు.


“సుధా, మన శ్రీకాంత్ గత వారం ఆత్మహత్య చేసుకోబోయాడు. సకాలంలో హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం వలన బతికి బయటపడ్డాడు” అన్నాడు రఘు.

“ఎందుకు అలా జరిగింది?” ఆందోళనగా అడిగాడు సుధాకర్.


“శ్రీకాంత్, మధుప్రియని ప్రేమించాడట కదా. ఆమెకి అమెరికా సంబంధం వచ్చిందట. హడావిడిగా హైదరాబాద్ లో పెళ్లి చేసుకుని, భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయింది. 


దీనితో మనస్తాపం చెందిన శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇక్కడ ఉండడం ఇష్టం లేక శ్రీకాంత్ బెంగళూరు వెళ్ళిపోయాడు” అన్నాడు రఘు.


“వాడి అడ్రస్ కానీ ఉందా?” అడిగాడు సుధాకర్ కంగారుగా.


“లేదు” అన్నాడు రఘు. ఇద్దరూ కలిసి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి, వాళ్ళ నాన్నగారిని శ్రీకాంత్ అడ్రస్ అడిగితే, “బెంగళూరులోని ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నానని వెళ్ళాడు. ఉత్తరం లేదు, ఫోన్ లేదు” అన్నారు ఆయన బాధగా. ఉసూరుమంటూ ఇద్దరూ వెనుదిరిగారు. సుధాకర్ ఇరగవరం వచ్చాడు.


ఆ రోజు రాత్రంతా బాధపడుతూనే ఉన్నాడు సుధాకర్, శ్రీకాంత్ గురించి. మధుప్రియ చేసిన మోసం వలనే మిత్రుడికి ఈ పరిస్థితి వచ్చిందని అర్థమయ్యింది. 


మధుప్రియ ప్రేమ నిజం కాదని, కేవలం కాలక్షేపానికే శ్రీకాంత్ ని ప్రేమించినట్టు నటించిందని అనుకున్నాడు. కొద్దిరోజులకే ఎం.ఏ. రిజల్ట్స్ తెలిశాయి సుధాకర్ కి. మిత్రులు ముగ్గురూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. తన ఆనందం పంచుకోవడానికి శ్రీకాంత్, మధుప్రియ ఇద్దరూ లేరని బాధపడ్డాడు సుధాకర్.


ఆ మరుసటి నెలలోనే మేనమామ శేషగిరిరావు విజయవాడలోని ఒక ప్రైవేట్ కాలేజీలో సుధాకర్ కి లెక్చరర్ పోస్ట్ చూడడం, తల్లిని తీసుకుని సుధాకర్ విజయవాడ వెళ్ళడం చాలా స్పీడ్ గా జరిగిపోయాయి. 


ఒక ఏడాది గడిచాక తల్లి కోరిక మీద మేనమావ కూతురు మాధవిని పెళ్లి చేసుకున్నాడు సుధాకర్. ఆ తర్వాత పి.హెచ్.డి. చేసి హైదరాబాద్ లో యూనివర్సిటీలో లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. 


ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేశాడు. అల్లుడు, కూతురు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.

ఇప్పుడు భార్య కోసం ఇలా వచ్చాడు. అనుకోకుండా మధుప్రియ కనిపించింది. ఆమెని ఎన్నో అడగాలని అనుకున్నాడు. కానీ వీలులేని పరిస్థితి ఏర్పడింది.


టైం చూసుకున్నాడు. బస్సుకి అరగంట టైం ఉంది. వెంటనే రూమ్ ఖాళీ చేసి బస్సు స్టాండ్ కి వచ్చి హైదరాబాద్ బస్సు ఎక్కాడు సుధాకర్.


వారం రోజుల తర్వాత సుధాకర్ భార్య మాధవికి గుండె ఆపరేషన్ జరిగింది. పది రోజులయ్యాక హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది ఆమె. దూరపు బంధువు వర్ధనమ్మని మాధవికి కాపలాగా ఉంచి యూనివర్సిటీకి వెళ్లి వస్తున్నాడు సుధాకర్. తరచూ మధుప్రియ అతనికి గుర్తుకువస్తోంది.


రెండు నెలలు గడిచాయి. మాధవి కొద్దిగా కోలుకుంది. ఒకరోజు డాక్టర్ చెకప్ కి తీసుకువెళ్ళాడు సుధాకర్. డాక్టర్ మాధవిని పరీక్షించి “అంతా బాగుందమ్మా” అని అన్నాడు.


వర్ధనమ్మని, మాధవిని కారులో ఇంటికి పంపించి, నెల రోజులకి సరిపడా మందులు హాస్పిటల్లోనే ఉన్న షాప్ దగ్గర తీసుకుని, వెనుతిరిగిన సుధాకర్ తనకి ఎదురైన మధుప్రియని చూసి ఆశ్చర్యపోయాడు.


“మధూ, బాగున్నావా?” అని అడిగాడు. ఆమె సందిగ్ధంగా చూస్తుంటే “నేను సుధాకర్ ని” అన్నాడు.


“ఓహ్.. నువ్వా? చాలా మారిపోయావు” అంది మధుప్రియ. సుధాకర్ తన బట్టతలని, పొట్టని ఒకసారి చూసుకుని నవ్వాడు. “ఒక్క నిముషం ఉండు. మందులు తీసుకుని వస్తాను” అని షాప్ దగ్గరకు వెళ్ళింది.


ఆమెనే పరిశీలనగా చూశాడు. ఎప్పుడూ అందంగా ఉండే మధుప్రియ వయసు తెచ్చిన హుందాతనంతో మరింత అందంగా ఉంది. అయిదు నిముషాలలో ఆమె వచ్చింది. ఇద్దరూ క్యాంటీన్ కి వెళ్ళారు.


“ఏమిటి సుధాకర్, ఎక్కడ ఉంటున్నావు?” అడిగింది మధుప్రియ ఉత్సాహంగా.

“నేను ఇక్కడ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. కానీ నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదు మధూ. ప్రేమ పేరుతో శ్రీకాంత్ ని మోసం చేశావు. 


డబ్బున్నవాడు రాగానే అతన్ని పెళ్లి చేసుకుని నీ సుఖం నువ్వు చూసుకున్నావు. శ్రీకాంత్ భగ్నహృదయంతో దేశాలు పట్టి పోయాడు. నువ్వు స్వార్థపరురాలివి మధూ” నిష్ఠూరంగా అన్నాడు సుధాకర్. ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. ఇంతలో కాఫీలు వచ్చాయి. మౌనంగా ఇద్దరూ కాఫీలు తాగారు.


“అంతేనా, నన్ను ఇంకా అడగవలసినవి ఏమైనా ఉన్నాయా?” గంభీరంగా అడిగింది మధుప్రియ. ఆమె వంక విభ్రాంతిగా చూశాడు. చేయవలసింది అంతా చేసి ఇలా మాట్లాడుతోంది ఏమిటి?


“నేను చెప్పేది సావధానంగా విను” అంది మధుప్రియ. ‘అలాగే’ అన్నట్టు తలూపాడు సుధాకర్.


“నేను పి.జి. పరీక్షలు రాసి ఇంటికి వచ్చేసరికి నాన్నగారికి తీవ్ర అనారోగ్యం చేసింది. లంగ్ క్యాన్సర్. నా చదువుకి ఆటంకం అవుతుందని నాకు చెప్పలేదు. అమ్మ లోపలకు తీసుకువెళ్ళి చెప్పింది. 


రెండు సంవత్సరాల నుండీ వ్యాపారం బాగుండలేదుట. నాన్నకు వైద్యానికి అప్పులు ఎక్కువయ్యి, మిల్లు అమ్మేశారట. నాకు మతిపోయింది ఆ మాటలకి. రెండు రోజులు గడిచాక నాన్నకి నోటివెంట రక్తం పడింది. హైదరాబాద్ తీసుకువెళ్ళాము. 


డాక్టర్ చూసి ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అని చెప్పారు. నాన్న బంధువు రాఘవరావు నాన్నని చూడటానికి వచ్చారు. వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి వచ్చాడట. వారం రోజుల్లో వెళ్లి పోతాడట. ఏవో సంబంధాలు చూస్తున్నామని చెప్పారు ఆయన. 


నాన్న వెంటనే ఆయన చేతులు పట్టుకుని, ‘మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకో’ అని అడిగారు. గతంలో ఆయనకి మా నాన్న ఉపకారం చేశారుట. 


ఆయన అంగీకరించడం, ఒక గంటలో వాళ్ళ అబ్బాయి హాస్పిటల్ కి వచ్చి నన్ను చూడటం, మర్నాడే గుళ్ళో మా పెళ్లి జరగడం చాలా స్పీడ్ గా జరిగిపోయాయి. అంబులెన్స్ లో మా నాన్న గుడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. 


నేను ఏమీ చెప్పలేని పరిస్థితిలో నిస్సహాయంగా ఉండిపోయాను. మా పెళ్లి జరిగిన మూడవ రోజున మా నాన్న చనిపోయారు. 


పది రోజులు అయ్యాక నేను నా భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయాను. తండ్రి ఋణం తీర్చుకున్నానన్న ‘తృప్తి’ ఒక్కటే మిగిలింది.” ఒక్క క్షణమాగి టేబుల్ మీదున్న గ్లాసులో ఉన్న నీళ్ళు తాగింది మధుప్రియ. తిరిగి చెప్పడం మొదలుపెట్టింది.


“ఒక ఏడాది గడిచేసరికి మా నాన్న మీది బెంగతో మా అమ్మ కూడా చనిపోయింది. నేను పూర్తి ఒంటరిగా మిగిలాను. భర్త, నా కూతురు... ఇదే నా ప్రపంచంగా బతుకుతుంటే రెండు సంవత్సరాల క్రితం మా వారికి ‘లివర్’ పాడయ్యింది. 


నా ‘లివర్’ వారికి ఇచ్చి బతికించుకోవాల్సి వచ్చింది. ఆయనా, నేనూ చాలా జాగ్రత్తగా జీవిస్తున్నాము. ఏడాది క్రితం ఇండియా వచ్చేశాము. మా అమ్మాయి పెళ్లి చేసేస్తే, ఆ తర్వాత మేము ఏమైనా ఫరవాలేదు. 


నాకూ, మా వారికీ కావాల్సిన మందులు కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వు కనిపించావు. ఇప్పుడు చెప్పు. నేను మోసగత్తెనా? స్వార్థపరురాలినా? నా సుఖం నేను చూసుకున్నానా?” ఆవేదనగా అడిగింది మధుప్రియ. ఆమె కళ్ళంట నీళ్ళు జలజలా రాలాయి.


నేను తలవంచుకున్నాను. అందరిలాగే ఆమెని తప్పుగా అర్థం చేసుకున్నానని గ్రహించాను. కన్నతండ్రి కోసం, కట్టుకున్న భర్త కోసం ఆమె చేసిన ‘త్యాగం’ ముందు నేను మరుగుజ్జుగా కనిపించాను.


“నన్ను క్షమించు మధూ! నిన్ను అపార్థం చేసుకున్నాను. మనం చూసే వెలుగు వెనుక, భయంకరమైన కారుమబ్బులు లాంటి చీకటి పరుచుకుని ఉంటుందని ఈరోజే తెలుసుకున్నాను” అన్నాడు సుధాకర్ చేతులు జోడించి.


“అంత పెద్ద మాట వద్దు సుధాకర్. భవిష్యత్తులో ఎప్పుడైనా శ్రీకాంత్ కనిపిస్తే ఈ విషయం చెప్పు. అదే నేను కోరుకునేది” అంది మధుప్రియ. ‘అలాగే’ అన్నాడు సుధాకర్.


ఆమె హృదయం మబ్బులు విడిన ఆకాశంలా స్వచ్ఛంగా ఉంది.


*******









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


M R V సత్యనారాయణ మూర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):








M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


సత్యనారాయణ మూర్తి  M R V

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

సత్యనారాయణ మూర్తి  M R V

సత్యనారాయణ మూర్తి  M R V


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page