top of page
Original.png

నువ్వూ నేనూ.. ఓ శ్రావణమేఘం


నువ్వూ నేనూ.. ఓ శ్రావణమేఘం - తెలుగు ప్రేమ కథ
నువ్వూ నేనూ.. ఓ శ్రావణమేఘం - తెలుగు ప్రేమ కథ

Nuvvu Nenu o Sravana Megham - Telugu Love Story | M R V Sathyanarayana Murthy

నువ్వూ నేనూ.. ఓ శ్రావణమేఘం - తెలుగు ప్రేమ కథ | M R V సత్యనారాయణ మూర్తి | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com on 03/05/2026

ప్రేమను వదిలేసిన వాడు… సంవత్సరాల తర్వాత తిరిగి వెతికాడు…” 

అతని ప్రయత్నం ఫలించిందో లేదో ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి గారి నువ్వూ నేనూ.. ఓ శ్రావణమేఘం కథలో తెలుసుకుందాం. 


కార్తీక మాసం.. ఉదయం ఆరు గంటల సమయం. చలి చలిగా ఉంది. తెల్లవారుజామున లేచి గుడికి వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని, కరివేన వారి సత్రానికి వచ్చాను. గేటు లోపలే ఉన్న క్యాంటీన్ దగ్గర ఆగి కాఫీ తాగుతున్నాను.

సత్రం బిల్డింగ్ నుండి లిఫ్ట్ లో దిగి, గుడికి వెళ్లేవారు హడావుడిగా వెళ్తున్నారు. ఒక యువకుడు క్యాష్ కౌంటర్ దగ్గర రూమ్ తాళం అప్పగించి, సూట్ కేస్, బ్యాగ్ తీసుకొని కారు దగ్గరకు వచ్చి డిక్కీ తెరిచి సామాన్లు అందులో పెట్టి, తర్వాత కారులో కూర్చున్నాడు.


“రఘూ, సామాన్లు అన్నీ జాగ్రత్తగా పెట్టావా?” అన్న స్త్రీ గొంతు విని నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. పక్కకు తిరిగి చూస్తే, లేత గోధుమరంగు పంజాబీ డ్రెస్ లో ఉన్న ఒక ఆవిడ కారు దగ్గర నిలబడి ఉంది. ఆమెను చూడగానే నా గుండె వేగంగా కొట్టుకుంది. కారులో ఉన్న అతను ‘అన్నీ పెట్టాను మేడం’ అని చెప్పడం, ఆమె ‘ఓకే’ అని కారు ఎక్కడం జరిగింది. నేను కారు దగ్గరకు వెళ్లాలనుకునేసరికి కారు గేటు దాటి వెళ్లిపోయింది.


నేను గబగబా రిసెప్షన్ దగ్గరకు వెళ్లి “ఇప్పుడు ఎర్రరంగు కారులో వెళ్లినవారు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పగలరా? వాళ్లు నాకు బాగా తెలిసిన వాళ్లు. చాలా కాలం అయ్యింది కలిసి. కొంచెం అడ్రస్ చెబుతారా?” అని అడిగాను. నేను డిప్యూటీ కలెక్టర్ అని అతనికి తెలుసు. అతను చూపించిన రిజిస్టర్ లోని వారి వివరాలు నా ఫోన్ లో నోట్ చేసుకున్నాను. రూముకి వచ్చి కుర్చీలో కూర్చుని వెనక్కి వాలాను. గతం నా కళ్లముందు గిర్రున రంగులరాట్నంలా తిరిగింది.

********************

మా నాన్నగారికి రాజమండ్రి ట్రాన్స్ ఫర్ అవ్వడంతో తణుకు నుండి రాజమండ్రి వచ్చాము. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఆయన లెక్చరర్. అప్పుడు నేను ఇంటర్మీడియట్, చెల్లెలు పదవ తరగతి చదువుతున్నాము.


మా కాలేజీలోనే చదువుతున్న శ్రావణితో పరిచయం విచిత్రంగా జరిగింది. కాలేజీ వక్తృత్వ పోటీలో నేను ప్రథమ, ఆమె ద్వితీయ బహుమతులు గెలుచుకున్నాము. స్టేజి దిగి వచ్చాక, ‘కృష్ణా నువ్వు ఎక్కడ ఉంటున్నావు?’ అని అడిగింది శ్రావణి. నేను మా ఇంటి గురించి చెప్పగానే, ‘అరే, ఆ పక్క వీధిలోనే మేము ఉంటున్నాము’ అంది శ్రావణి. మర్నాటి నుండి ఇద్దరం కలిసి సైకిళ్ల మీద కాలేజీకి వెళ్లడం మొదలయ్యింది. శ్రావణి అద్భుతంగా పాడుతుందని కాలేజీ యానివర్సరీ రోజున తెలిసింది. అప్పటి నుండి ఆమె మీద మరింత అభిమానం కలిగింది.


శ్రావణ మాస పేరంటాలలో మా అమ్మకి, వాళ్ల అమ్మకి పరిచయం ఏర్పడి, ఆవిడ మా ఇంటికి తరచూ రావడం మొదలయ్యింది. నేను శ్రావణి కోసం వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఆవిడ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. శ్రావణికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. చాలా గడసరులు ఇద్దరూ. ఒకరు నన్ను ‘కృష్ణా’ అని పిలిస్తే, ఇంకొకరు ‘గోపీ’ అని పిలిచేవారు. నా పూర్తి పేరు గోపాలకృష్ణ. శ్రావణి నాన్నగారు మునిసిపల్ ఎలిమెంటరీ స్కూల్ లో టీచర్.


డిగ్రీలో కూడా నేనూ, శ్రావణి ఒకే కాలేజీలో చేరాము. యథాప్రకారంగా సైకిళ్ల మీద వెళ్లేవాళ్లం. ఆదివారాల్లో గోదావరి ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. రైల్ రోడ్ బ్రిడ్జి మీద నుండి వెళ్లే వాహనాలను, రైళ్లను ఆసక్తిగా చూసేవాళ్లం.


“కృష్ణా, ఆధునిక విజ్ఞానం మనిషికే గాక, సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతోంది కదా. ఒకప్పుడు గోదావరి బ్యారేజీ మీద వాహనాలు వెళ్లేవి, రైళ్లు మరోచోట వెళ్లేవి. కానీ ఇప్పుడు రెండూ ఒకే వంతెన మీద వెళ్తున్నాయి. ఎంతో విచిత్రం కదా” అంది శ్రావణి కళ్లు పెద్దవి చేసి. నేను ఆమె కళ్లవంకే చూస్తూ సమాధానం చెప్పడం మరిచిపోయాను. అది చూసి చిన్నగా నవ్వింది శ్రావణి.

“నువ్వు అప్పుడప్పుడు ‘సమాధి’ లోకి వెళ్లిపోతావు” అంది శ్రావణి. నేను ఏమని చెప్పను? ఆమె సన్నిధి నాకు ఒక తన్మయత్వం కలిగిస్తోందని చెప్పనా? ఆమె విశాల నేత్రాలు నన్ను మాటలు రానివాడిగా చేస్తాయని చెప్పనా? ఉహూ... ఏమీ చెప్పలేను. అందుకే మౌనం వహిస్తాను.

డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా ఒక శ్రావణ శుక్రవారం రోజున, ‘కృష్ణా, రైల్ రోడ్ బ్రిడ్జి మీద నడుచుకుంటూ వెళ్లాలని ఉంది. నువ్వు తోడు వస్తావా?’ అని అడిగింది శ్రావణి. ‘అలాగే’ అన్నాను. ఇద్దరం బ్రిడ్జి ఎక్కి నడవడం ప్రారంభించాము. సాయంకాలం ఐదు గంటల సమయం. గోదావరి మీద నుండి చల్లని గాలి వీస్తోంది.

ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాము. బ్రిడ్జి సగం వరకూ వచ్చాము. ‘ఏదైనా పాట పాడు శ్రావణీ’ అని అన్నాను. గోదావరిలో రెండు చిన్న పడవలు వెళ్తున్నాయి. ఆకాశంలో పక్షులు ఎగురుతూ తమ గూళ్లకు వెళ్తున్నాయి. ఒక లలిత గీతం పాడింది శ్రావణి. ఆమె మధురమైన గాత్రం వింటూ, ఆమెనే చూస్తూ నడుస్తున్నాను. అప్పుడు అనిపించింది నాకు, శ్రావణి నా పక్కన ఉంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుందని.

కొవ్వూరు వరకూ వెళ్లి వెనక్కి తిరిగి వస్తున్నాం. ఆకాశంలో మేఘాలు కదులుతున్నాయి.

“కృష్ణా, శ్రావణ మేఘాలకి ఒక విశిష్టత ఉందిట. నీకు తెలుసా?” అని అడిగింది శ్రావణి. ‘తెలియదు’ అన్నట్టు తల అడ్డంగా ఊపాను.

“కొత్తగా పెళ్లి అయిన జంట, ఆషాఢ మాసంలో విడిగా ఉంటారు. శ్రావణంలో కలుస్తారు. అందుకని ఆనందంగా వర్షిస్తాయిట శ్రావణ మేఘాలు. శ్రావణంలో పేరంటాలకి వెళ్లే తరుణీమణులను చూసి చిరుజల్లులతో దీవిస్తాయని కూడా చెబుతారు” అంది తన విశాల నేత్రాలతో శ్రావణి. మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఇద్దరం గబగబా నడవడం మొదలుపెట్టాము. కానీ బ్రిడ్జి సగం వరకు వచ్చేసరికి పెద్ద వానజల్లు కురిసి ఇద్దరం తడిసిపోయాము. ఇద్దరం పక్క పక్కనే నడుస్తూనే ఉన్నాము.

బట్టలు పూర్తిగా తడిసిపోవడంతో శ్రావణి సిగ్గుపడింది. “కృష్ణా, నువ్వు ముందు నడువు. నేను వెనక నడుస్తాను” అంది. ఆమె ఇబ్బంది అర్థం చేసుకొని నేను ముందు నడవడం ప్రారంభించాను. సైకిల్ మీద రాజమండ్రి వైపు వెళ్తున్న కుర్రాడు ఒకడు మమ్మల్ని చూసి, ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ అన్న పాట పాడాడు. నేను నవ్వాను. శ్రావణి ‘ఒరేయ్ తిన్నంగా వెళ్లు’ అంది ఉక్రోషంగా. ఐదు నిమిషాలు గడిచేసరికి వర్షం ఆగిపోయింది. నేను జేబులోంచి కర్చీఫ్ తీసి ఆమెకిచ్చాను. ఆమె తల, మొహం తుడుచుకుంది.


“ఇప్పుడు ఈ తడి బట్టలతో ఇంటికి ఎలా వెళ్లేది?” దిగులుగా అంది.


“ఫరవాలేదు. రవికుమార్ ఇంటి దగ్గర ఆగి బట్టలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని వెళ్దువు గాని” అన్నాను. గబగబా నడుచుకుంటూ కొద్దిసేపటికి రవికుమార్ ఇంటికి వెళ్లాము. రవి అమ్మగారు శ్రావణిని లోపలికి తీసుకువెళ్లి ఆమెకి పొడి బట్టలు ఇచ్చారు. అవి కట్టుకొని, తన బట్టలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంది. ఆవిడ ఇద్దరికీ టీ ఇచ్చారు. ఒక అరగంట గడిచాక శ్రావణి తన బట్టలు వేసుకుంది. ఇద్దరం ఎవరింటికి వాళ్లం చేరుకున్నాం.


అది నా జీవితంలో ఒక మధురమైన అనుభూతి. డిగ్రీ పరీక్షలు అయిపోయాయి. నేను సెలవులకి మా మావయ్యగారి ఊరు ముక్కామల వెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి, శ్రావణి వాళ్ల నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని తెలిసి వాళ్ల ఇంటికి వెళ్లాను. ఆనందాల ‘పొదరిల్లు’ లా ఉండే ఆ ఇల్లు శోక గృహంలా ఉంది. నన్ను చూడగానే శ్రావణి కళ్లు నీటి కొలనులయ్యాయి. ఒక అరగంట ఉండి, ఆమెను ఓదార్చి ఇంటికి వచ్చాను. నేను రాజమండ్రిలోనే పీ.జీ. చేస్తానంటే మా అమ్మ ఒప్పుకోలేదు. పెద్ద మావయ్య ఇంటి దగ్గర ఉండి చదువుకోమని నన్ను బలవంతంగా హైదరాబాద్ పంపించింది. ఆ మరుసటి సంవత్సరమే నాన్నగారికి ప్రిన్సిపాల్ గా ప్రమోషన్ రావడం, విజయవాడ మకాం మార్చడం వేగంగా జరిగిపోయింది.


నేను చదువు మీదే శ్రద్ధ పెట్టి రెండు సంవత్సరాలు కష్టపడి పీ.జీ. చదివి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను.


విజయవాడ వచ్చి ఒకరోజు ఉండి, మరునాడు రాజమండ్రి వెళ్లి రవికుమార్ ను కలిశాను. రవి బీ.ఈడి. చేసి రాజానగరంలో టీచర్ గా చేస్తున్నాడు. శ్రావణి గురించి అడిగితే, వాళ్ల నాన్నగారు పోయిన ఏడాదికే వాళ్ల అమ్మగారు కూడా పోయారని, ఇద్దరు చెల్లెళ్లను తీసుకొని విశాఖపట్నం వెళ్లిపోయిందని చెప్పాడు. అడ్రస్ ఉందా? అని అడిగితే ఎవరికీ తెలియదని చెప్పాడు.


రవి మాటలు వినగానే నా మనసు కకావికలం అయిపోయింది. నెమ్మదిగా నడుచుకుంటూ గోదావరి ఒడ్డుకు వచ్చి కూర్చున్నాను. రైల్ రోడ్ బ్రిడ్జి మీద వాహనాలు వెళ్తున్నాయి, ఒక రైలు కూడా శబ్దం చేస్తూ వెళ్తోంది. పక్కన శ్రావణి లేకపోవడంతో ఆ శబ్దాలు విసుగ్గా అనిపించాయి. కష్టంలో ఉన్న స్నేహితురాలికి అండగా ఉండకుండా, నా భవిష్యత్తు అని అనుకుంటూ దూరంగా వెళ్లి తప్పు చేశానా? అన్న భావన నాలో కలిగింది. అమ్మ నన్ను హైదరాబాద్ వెళ్లమన్నా, ఆమెతో గట్టిగా దెబ్బలాడి రాజమండ్రిలోనే చదువుకోవాల్సింది. హూ.. ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం? జరగవలసింది జరిగిపోయింది అని నిట్టూర్చాను.


చీకటి పడింది. లైట్లు వెలిగాయి. నెమ్మదిగా లేచి మార్కండేయ స్వామి గుడిలోకి వెళ్లాను. ‘స్వామీ, నా శ్రావణి ఎక్కడున్నా సుఖంగా ఉండేటట్టు చూడు. మళ్లీ ఒకసారి ఆమె నాకు కనిపించేటట్టు అనుగ్రహించు’ అని దణ్ణం పెట్టుకొని, తిరిగి విజయవాడ వచ్చేశాను.

****

ఇన్ని సంవత్సరాల తర్వాత శ్రావణి ఈరోజు శ్రీశైలంలో కనిపించింది. కానీ మాట్లాడే అవకాశం దొరకలేదు. ఫోన్ నెంబర్ ఇప్పుడు లభించింది. కానీ ఇప్పుడు తను ఫోన్ చేస్తే బదులిస్తుందన్న నమ్మకం లేదు. ఉహూ.. ఒకసారి ఇంటికి వెళ్లి మాట్లాడాలి అని నిశ్చయించుకున్నాను.


నాలుగు రోజులు గడిచాక సికింద్రాబాద్ వెళ్లాను. డిఫెన్స్ కాలనీ లోని సాగర్ అపార్ట్ మెంట్ లోని శ్రావణి ఫ్లాట్ కి వెళ్లాను. కాలింగ్ బెల్ కొట్టగానే శ్రావణి తలుపు తీసింది. ముందు ప్రశ్నార్థకంగా చూసినా, తర్వాత గుర్తుపట్టి చిన్నగా నవ్వింది. “బాగున్నావా శ్రావణి” అన్నాను. ఆమె తలూపి లోపలికి నడిచింది. నేను లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాను.


“ఎక్కడ ఉంటున్నావు కృష్ణా?” అంది.


“ముందు నన్ను క్షమించాలి” అన్నాను తలవంచుకొని. ఆమె ఏమీ మాట్లాడలేదు.

“శ్రావణి, నీకు తోడు ఉంటానని ఆ వర్షం రోజున నీకు వాగ్దానం చేశాను. కానీ మీ నాన్నగారు పోయి కష్టంలో ఉంటే నీకు అండగా నిలబడలేకపోయాను. చదువు, భవిష్యత్తు... ఇవే ఆలోచించాను కానీ మానవత్వం మరిచాను. తర్వాత కొంతకాలానికి నేను రాజమండ్రి వస్తే నువ్వు వైజాగ్ వెళ్లిపోయావని రవి చెప్పాడు. ఒక వారం పాటు వైజాగ్ అంతా తిరిగాను నీకోసం. నీ జాడ కనుగొనలేకపోయాను. నిరాశగా తిరిగి వచ్చేసాను. మొన్న నువ్వు శ్రీశైలం వచ్చావుగా, నువ్వు కారు ఎక్కి వెళ్లేటప్పుడు నీ మాట విని నీ దగ్గరకు వద్దామనుకునే సరికి నువ్వు వెళ్లిపోయావు. అదే సత్రంలో నేనూ ఉన్నాను. వారిని అడిగి నీ అడ్రస్ తీసుకున్నాను. నీకు ఇంకో ముఖ్య విషయం చెప్పాలి” అని ఒకసారి ఆగాను.


ఆమె అలాగే నాకేసి చూసింది.


“మన ఇద్దరి మధ్య ఉన్న పరిచయం పెళ్లి వరకూ వెళ్తుందని మా అమ్మ గ్రహించిందిట. కొంచెం ఉన్నతమైన కుటుంబంలోని అమ్మాయితో నా పెళ్లి జరగాలని, నన్ను బలవంతంగా పీ.జీ. చదువు కోసం హైదరాబాద్ పంపించానని, నిన్ను పెళ్లి చేసుకుంటే మీ కుటుంబ భారం నా మీద పడుతుందని, అందుకే ఇదంతా చేశానని చనిపోయే ముందు మా అమ్మ నాకు చెప్పి బాధపడింది. మా అమ్మ చనిపోయి ఐదేళ్లు గడిచాయి. నెపం అంతా మా అమ్మ మీద వేయడం లేదు. అప్పటి నా అపరిపక్వ మనస్థితి నీకు చెబుతున్నాను. నువ్వు నన్ను క్షమించావని ఒక మాట అంటే నాకు తృప్తి” అన్నాను వేడుకోలుగా.


శ్రావణి నాకేసి చూసి గట్టిగా నవ్వింది. “నన్ను చూసి సమాధిలోకి వెళ్లే నువ్వు ఇన్ని మాటలు ఎలా మాట్లాడావు కృష్ణా?” అంది. ఆమె నవ్వు చూసి నాకు ధైర్యం వచ్చింది.

“మీ చెల్లాయిలు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? వైజాగ్ నుండి ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నువ్వు ఏం చేస్తున్నావు?” ఆత్రుతగా అడిగాను.


“వైజాగ్ లో మా దూరపు బంధువుల ఇంట్లో ఉండి, బ్యాంకు టెస్ట్ పాసయ్యి గుమస్తాగా చేరాను. చెల్లాయిలు డిగ్రీలు చేసి ఉద్యోగాలు చేస్తూ ఉండగానే పెళ్లిళ్లు జరిగాయి. పెద్ద చెల్లెలు బెంగళూరు, రెండో చెల్లెలు చెన్నై. ఇప్పుడు నేను బ్యాంకు మేనేజర్ గా ఏ.ఎస్. రావు నగర్ లో పనిచేస్తున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు?” అడిగింది శ్రావణి.


“నేను పీ.జీ. అయ్యాక సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి రెవిన్యూ డిపార్టుమెంటులో చేరాను. ప్రస్తుతం నర్సాపురం డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నాను. మీ వారి గురించి చెప్పలేదు. ఆయన ఏం చేస్తున్నారు?” అడిగాను.


“ఏమో.. నాకు ఏమీ తెలియదు. అది సరే.. నీ ఫ్యామిలీ గురించి చెప్పు. మీ శ్రీమతి, పిల్లలు..?” సూటిగా అడిగింది. దానిని బట్టి ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదని గ్రహించాను. నేను జేబులోంచి పెన్ తీసి ఆమెకి చూపించి, చిన్నగా నవ్వి పెన్ జేబులో పెట్టుకున్నాను.


ఆమె మరోసారి గట్టిగా నవ్వింది నా అభినయానికి. తర్వాత చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాము.

***************

ఒక ఏడాది గడిచింది. ఇద్దరం బదిలీ చేయించుకొని రాజమండ్రి వచ్చాం.

ఒకరోజు సాయంత్రం రాజమండ్రి రైల్ రోడ్ బ్రిడ్జి మీద నడుస్తున్నాం నేనూ, శ్రావణి.

“శ్రావణి, నువ్వు గతంలో ఒక మాట అన్నావు. మేఘం రైతు అడిగినా, అడగకపోయినా వర్షాన్ని ఇచ్చి అతనికి సాయపడుతుందని. మనం కూడా అలాగే ఉండాలని. ఇది శ్రావణ మాసం. ఆ మేఘం సాక్షిగా అడుగుతున్నాను.. నువ్వు నా పక్కన ఉంటే, నీ మాటలు నిజం చేయగలను. ఏమంటావు?” అని అడిగాను.


ఆమె సంతోషంగా ‘అలాగే’ అన్నట్టు తలూపింది. సంధ్యా కిరణాలు ఆమె మొహం మీద పడి మరింత వెలుగునిచ్చాయి. నేను ఆనందంగా శ్రావణి చేయి పట్టుకొని నెమ్మదిగా నడవసాగాను. విచిత్రంగా సన్నటి జల్లు మమ్మల్ని పలకరించి వెళ్లింది, మమ్మల్ని దీవించినట్టుగా.


సమాప్తం.

*******

M R V సత్యనారాయణ మూర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):







M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



telugu emotional story,  wife husband story telugu,  old age home story


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@mrvsmurthy311

•3 minutes ago

చాలా బాగా చదివారు.. ధన్యవాదాలు మేడం

Like
bottom of page