శ్రీకృష్ణ రాయభారం - పార్ట్ 2
- Ayyala Somayajula Subramanyam

- May 3
- 8 min read
Updated: May 6

Srikrishna Rayabharam - Part 2/3 - Telugu Mythological Story | Ayyala Somayajula Subrahmanyam
శ్రీకృష్ణ రాయభారం - పార్ట్ 2/3 - తెలుగు పౌరాణిక కథ | అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 03/05/2026
ఇక శ్రీకృష్ణ రాయభారం - పార్ట్ 2 చదవండి.
అర్జునుడు ఇట్లు అర్థించెను. ”హే పరంధామా! నీవు తప్పక శాంతికి అవకాశము ఇవ్వవలెను. కానీ ఇదివరకే యుద్ధము అనివార్యమని భావనకు వచ్చినట్లుగా కనబడుచున్నది. కృష్ణా! నీవు సర్వ శక్తిమంతుడవు. నీవు తలచుకొనినచో, కౌరవులను తప్పక శాంతియుత పరిష్కారమునకు ఒప్పించగలవు. ఒకవేళ యుద్ధమునే నీవు వాంఛించినచో నేను అన్ని రకములుగా నిన్ను అనుసరించుటకు సిద్ధముగా ఉన్నాను. దుష్టబుద్ధి గల దుర్యోధనుడు రణరంగంలో మా చేత వధింపబడుట అన్నది సందేహము లేదు.”
అంత కృష్ణుడు శాంతిమతస్థాపకుని వలె అర్జునుని దగ్గరకు వెళ్ళి, ”అర్జునా! మీరు మరియు కౌరవులకు మేలు చేకూర్చు పరిష్కారమును సాధించుట కొరకు తప్పక ప్రయత్నించెదను. నేను నా శక్త్యానుసారము ప్రయత్నము చేసినది విశ్వసింపుము.
దుర్యోధనుడు ఎన్నటికినీ యుధిష్ఠిరునికి రాజ్యము తిరిగి అప్పగించుటకు అంగీకరించడని నా ప్రగాఢ దృఢ విశ్వాసం. ఏమైనను నేను అందులకు విచారించుట లేదు.
ఎందుకనగా, మీ సోదరుల పట్ల అతడు ఎంత లజ్జావిహీనంగా ప్రవర్తించినందున అతడి మరణదండనకు తగును. ఇంద్ర లోకమునకు నీవు వెళ్ళినప్పుడు అచట నీకు తెలిసిన విషయం ఏమనగా, నీవు కౌరవ వినాశనమునకు సాధన వస్తువగుదువని విషయమును నీవు మరచితివా?
అర్జునా, నిజమునకు యుధిష్ఠరమహారాజు సంపూర్ణ ధరిత్రికి చక్రవర్తిగా తిరిగి స్థాపించ బడవలెనని నా కోరిక. శాంతి పరిష్కారము కొరకు గొప్పగా ఆశలు పెట్టుకొనుట వలన ప్రయోజనము ఏమిటి? భూభారమును తగ్గించుట కొరకే దేవతలు భూమిపై అవతరించిరి. ఏమైనను ధర్మజుని ఆదేశమును పాటింపవలసినదే.”
నకులుడు ఇటుల పలికెను. ”కృష్ణా! ఏమైనను నీవు మొదట దుర్యోధనుడితో మృదువుగా సంభాషించుము. అటుపిమ్మట, అవసరమైనచో అతని ధైర్యము సన్నగిల్లునట్లుగా కఠినముగా సంభాషింపవచ్చును. మా అరణ్యవాస కాలము పూర్తయ్యెను. మాకు సైన్యము సమకూరినందున సహజముగనే మా రాజ్యమును తిరిగి పొందవలెనను కోరిక మాలో వృద్ధి
చెందెను. ఈ విషయము కౌరవులు ఆకర్షించునటుల తెలుపగలవు. మేమందరమూ నీకు శరణాగత సేవకులము. కనుక నీ అభీష్టము నెరవేర్చుటకు సిద్ధముగా నుంటిమి.”
పిమ్మట సహదేవుడు ఇటుల పలికెను. ”పరంధామా! ఒకవేళ కౌరవులు శాంతి ఒప్పందము చేయదలచినను వారిని యుద్ధము చేసేందుకు ప్రేరేపించవలెనని నా భావన. ద్రౌపది అవమానింపబడినందున, మాలో కలిగిన ఆగ్రహము దుర్యోధనుడు మరియు అతని చెలికాండ్రు (దుష్టచతుష్టయం) మరణించినప్పుడు శాంతించును.’
సాత్యకి సహదేవుడి పలుకులకు అభినందిస్తూ ఇటుల పలికెను. ”కృష్ణా! పాండవులు అరణ్య వాసపు ఆరంభ సమయములో మొదటిసారిగా మృగచర్మమును ధరించుట చూచి కౌరవులపై వెంటనే దాడిచేసి బలవంతముగా యుధిష్ఠరుని రాజ్యమును వెనక్కు తీసుకొన వలెనని నేను ప్రతిపాదించితిని. ఆ సమయములో, నీవు నన్ను ఓపికతో వేచి ఉండమని సూచించితివి. ఇప్పుడు మనము మన ఈ చిరకాల వాంఛను నెరవేర్చుకొనుటకు అవకాశము లభించినప్పుడు, ఈ సంధి సంభాషణలను ఏల వినవలెను?”
సమావిష్టులైన యోధానుయోధులందరూ ఆ పలుకులను విని సమ్మతిని తెలియజేస్తూ సింహనాదాలు చేసిరి.
యుధిష్ఠరుని మరియు భీముని మృదువచనాలను వినిన ద్రౌపది ఎంతగానో ఆందోళన చెందెను. కానీ సహదేవుడు మరియు సాత్యకి పలుకులు వినినంతనే ఆమెలో ఆశలు రేకెత్తెను.
ద్రౌపది ఆందోళన ముఖముతో శ్రీకృష్ణుని వైపునకు తిరిగి ఇట్లనెను. ”అన్నా, కృష్ణా!
భీకరమై యగాధమయి భీష్మగురు ప్రముఖోల్లాకులం
హౌ కురురాట్చమూజలధి కడ్డముగా జనగా భవచ్చమూ
నౌకను ద్రిప్పగా. దగిన నావికుడెవ్వడు; నీవు లేక యీ
శోకము తీఱునే ద్రుపద సూక్తికి నిక్కము వాయునందనా.
———
వర్మను బుట్టితిన్ భరతవంశము జొచ్చితి నందు బాండు భూ
వరుసకు గోడలైతి జనవంద్యుల బొందితి నీతి విక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్ సహజన్యుల ప్రాపు గాంచితిన్
సరసిజనాభ! తిన్నట బ్రశస్తికి నెక్కిన దాన నెంతయున్.
ద్రౌపది మరల ఇటుల విన్నవించెను. ”కేవలము ఐదు ఊళ్ళనైనా ఇమ్మని అర్థించినప్పుడు కూడా దుర్యోధనుడు సమాధానమీయలేదు. ఇంత నిరుత్సాహపరిచే శాంతి ఒప్పందమును నేను అంగీకరింపను. నిరపరాధియైన వ్యక్తిని వధించుట ఎంత పాపకార్యమో, వధింపబడుటకు అర్హుడైన అపరాధిని వధింపకపోవుట కూడా అంతే పాపకార్యము.
అందుచేత మన హక్కు అయిన రాజ్యము కొరకు మనము యుద్ధము చేయవలెను. ఓహో! నేనెంత నిస్సహాయురాలిని! దుర్మార్గుల చేతుల్లో అవమానాలు పొందుటయే గాక ఇప్పుడు నా స్థితిని పట్టించుకునే వారు కూడా లేకుండిరి. ప్రతి ఒక్కరూ దోషులనూ క్షమింప చూచువారే.’
కన్నీటితో తడిసినట్టి ద్రౌపది తన చేతితో జుట్టు పట్టుకుని ఇంకను ఇటుల శ్రీకృష్ణుని
ప్రార్థించెను. ”హే దీనబాంధవా! ఈ నా జుట్టును అలనాడు దుశ్శాసనుడు ఎట్లు పట్టుకొని లాగెనో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొనుము. పదమూడు సంవత్సరాల దుర్భరమైన జీవిత సమయంలో, మంచికాలము ముందున్నదనే ఒకేఒక ఆశతో కొనసాగితిని. దుశ్శాసనుని చేయి నరకబడి, అతని శరీరము అణువణువుగా ఛేదింపబడినప్పుడే నాకు శాంతి లభించును. కనుక, భీముని దయార్ద్ర పలుకులతో నా హృదయము అనేక బాణాలతో ఒక్కసారిగా ఛేదింప బడినట్లయ్యెను.”
అట్లు పలికి ద్రౌపది బిగ్గరగా రోధించెను. శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చుతూ ఇటుల పలికెను.
”పాంచాల రాకుమారి! త్వరలోనే నీ భర్తలచే సంహరింపబడిన వారి భర్తలను చూసి కౌరవుల భార్యలు కూడ ఈవిధముగనే రోధించెదరు. నీవు దుఃఖించవద్దు.”
“ఓ యదుకులభూషణా! నీ ఆగ్రహమునకు గురియైన వారు నిజమునకు మృత్యుసమానులే. నీ వాక్కులను మేము సదా విశ్వసింతుము. ఎందుకనగా నీ వాక్కులు ఎన్నడూ వృధా కాబోదు.”
అర్జునుడు మరోసారి శ్రీకృష్ణునితో ఇటుల పలికెను. ”ప్రభూ! ముందుగా కౌరవులతో సంధి పరిష్కారమునకు కావలసిన ప్రయత్నము అంతటినీ చేయుము.
”
అది కార్తీక మాసము. అందుచేత వ్యవసాయ క్షేత్రములన్నీ పంటలతో నిండి సస్యశ్యామలంగా శోభిల్లుతుండెను. ఆరాత్రి అచ్చటనే విశ్రాంతి తీసుకొనెను. మరుసటిరోజు ప్రాతఃకాలమునే లేచి నిత్యారాధనలు నెరవేర్చుకొని ప్రయాణమునకు సిద్ధముగా నుండెను.
ఆపైన శ్రీకృష్ణుడు సాత్యకిని ఈ విధంగా ఆజ్ఞాపించెను. ”అన్నిరకముల ఆయుధములతో నా రథమును సిద్ధము చేయించుము. ”
సాత్యకి వెంటనే శ్రీకృష్ణుని రథమునకు కావలసినవన్నీ సమకూర్చుటకు ఆ పనిలో నిమగ్నమయ్యెను. రథమును లాగే శ్వేతాశ్వాలు నాలుగింటిని శైవ్య, సుగ్రీవ, మేఘపుష్ప మరియు వాల్హకలను రథమునకు కట్టించెను.
పిమ్మట శ్రీకృష్ణుడు సాత్యకితో కలిసి రథమును అధిరో
హించెను. బయలుదేరుటకు సిద్ధపడుతుండగా, ఆకాశము నిర్మలమైన సుగంధభరితమైన పిల్లవాయువులు వీచనారంభించెను. ఇరుప్రక్కల భూదేవులు, రాజన్యులు భక్తితో నిలుచుండిరి.
శ్రీకృష్ణుడు బయలుదేరగా అతని వెంట పాండవులు, సన్నిహితులు వారిని కొంతదూరము వరకూ అనుసరించిరి. మంగళవాయిద్యములు కూడా అనుసరించినవి. ఇది మన సాంప్రదాయం. వచ్చిన వారిని తిరుగు ప్రయాణంలో కొంత దూరం వారి వెంట వెళ్ళుట సత్సాంప్రదాయం.
యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకొని ఇట్లు పలికెను. ”హే ప్రభూ! మా తల్లి గారి క్షేమ సమాచారం విచారింపుము. మాగురించి శోకము ఆమెకు నిరంతరం బాధించుచుండును.
కనుక సాధ్యమైనంతవరకూ ఆమెను ఓదార్చగలరు. మమ్మల్ని పెంచుటకు ఆమె ఎంతగానో కష్టపడెను. ఆమెకు మా ప్రణామములు అర్పింపగలరు. దయచేసి కురుపెద్దలకు, గురువులకు కూడా మా ప్రణామములు సమర్పించగలరు. ముఖ్యంగా విదుర మహాశయుని నా తరఫున ఆలింగనం చేసుకొనుము.”
పిమ్మట యుధిష్ఠరుని తిరిగి వెనక్కి వెళ్ళవలసిందిగా కోరెను. అంత అర్జునుడు ఆ సమయములో ఇటుల పలికెను. ”హే ప్రభూ! ఒకవేళ దుర్యోధనుడు నీ పట్ల సముచిత గౌరవాన్ని ప్రదర్శిస్తూ అర్ధరాజ్యమును యుధిష్ఠిర మహారాజుకు తిరిగి అప్పగించ దలచినచో, నేను కౌరవులతో యుద్ధము మానుకొందును.
కానీ, ఒకవేళ అందుకు విరుద్ధంగా ప్రవర్తించినా మమ్మల్ని ఎదురుకొనే రాజన్యులందరినీ యమపురికి పంపెదనని ప్రతిజ్ఞ చేయుచున్నాను.”
ఆ మాటలు వినినంతనే భీమసేనుడు ప్రళయగర్జన వలె సింహనాదం చేసెను. అర్జునుడు వీడుకోలు పలుకుతూ శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకొనెను. అతని అనుమతితో అర్జునుడు వెనుదిరిగెను. రథసారథి దారకుడు గుర్రాలను అదిలించగా, శ్రీకృష్ణుని రథము వేగము పుంజుకొన తమను అనుసరిస్తూ వచ్చిన వారిని వెనుకకు విడుస్తూ హస్తినకు కొనసాగిపోయెను.
మరోవైపు శ్రీకృష్ణ భగవానుడు పయనిస్తున్నట్టి మార్గములో సుగంధ పరిమళ భరితమైన శీతల వాయువులు ప్రసరించసాగెను. ఆకాశము నుండి స్వర్గ సౌగంధిత పుష్పాలు వర్షించెను. దానితో సమస్తము మంగళప్రదముగా అగుపడసాగెను.
మార్గములో శ్రీకృష్ణుడు ఎక్కడ నిలిచినా వేలాది బ్రాహ్మణులు మరియు పురజనులు ఒక్కసారైనను ఆ పరమాత్ముని దర్శించుకుందామని ఆతురతతో రాసాగిరి. గ్రామస్థులందరూ ఆ భగవానుని తమ జీవితములో ఒక్కసారైనను దర్శించుకుందామని వచ్చిరి.
పిమ్మట శ్రీకృష్ణుడు సూర్యాస్తమయమగుటతో వృకస్థలి యను గ్రామములో విశ్రమించెను. గూఢచారుల వలన శ్రీకృష్ణుడు హస్తినకు బయలుదేరెనని తెలుసుకొన్న ధృతరాష్ట్రుడు ఆశ్చర్యము మరియు ఆనంద చకితుడయ్యెను. మరియు విదురుని తన సమ్ముఖమునకు పిలిపించుకొనెను. ఈ విధముగా ఆనతి ఇచ్చెను.
”విదురా! రేపు శ్రీకృష్ణ పరమాత్ముడు హస్తినకు చేరుకొనును. దుర్యోధనుని తప్ప మిగిలిన సోదరులను స్వాగతము పలుకుటకు పంపెదను. అతని విడిది కొరకు ఉన్నతమైన భవనమును ఏర్పాటు చేసెదను. ”
విదురుడు ఇటుల బదులిచ్చెను. ”ఓ రాజా! నీవు శ్రీకృష్ణుని ప్రసన్నము చేసుకొనుటకై చేయుచున్న ప్రయత్నములు ఎంతో బాగున్నవి. కానీ ఏది ఏమైనను ఇవి కాదు అతనికి సమర్పించు స్వాగత సత్కారాలు. నీవు శ్రీకృష్ణుని ధర్మబుద్ధితో సేవించుటలేదని నీవెరుగవా? మీ ఈ అట్టహాస ప్రదర్శనమంతా అతని అభిమానము పొందదలచుటకు నీవు చేస్తున్నట్టి కపటనాటకములు కాదంటారా?
మీరు పాండవులు కోరిన ఐదు ఊళ్ళను ఇచ్చుటకు సిద్ధముగా లేరని నేనెరుగుదును. కనుక ఈ ఘనమైన స్వాగతసన్మానాలు శ్రీకృష్ణ భగవానుని పాండవులకు
దూరము చేయవలెనని ఆశతో చేస్తున్నదని నేనర్ధము చేసుకొనగలను.
అగ్రజా! ఇది మూర్ఖపు ఆలోచన. శ్రీకృష్ణార్జునుల బంధము విడదీయరానిది. ఆయన పాద ప్రక్షాళనమునకు అర్ఘ్యమును మరియు క్షేమసమాచార విచారణలను తప్ప నీ నుండి వేటినీ అంగీకరించడు. శ్రీకృష్ణుడు వచ్చిన కార్యమును నెరవేర్చుట ఉత్తమకార్యము. అదే పాండవుల మరియు నీ పుత్రుల మధ్య సంధి ఏర్పాటు. ”
అంత దుర్యోధనుడు తన తండ్రికి ఇట్లనెను. ”శ్రీకృష్ణుడు మరియు పాండవుల బంధము మనకందరకు తెలిసినదే. అతని సహాయము పొంద లేనప్పుడు మనము ఇట్టి ఘనస్వాగత కార్యక్రమాలు చేసిన ప్రయోజనమేమి? కావున ప్రస్తుత పరిస్థితుల ననుసరించి అతని స్వాగత ఏర్పాట్లు తగ్గించమని నా ఆదేశం.”
భీష్మ పితామహుడు ఇలా వాదించెను. ”ధృతరాష్ట్రా! నీవు ఒకవేళ శ్రీకృష్ణునికి విధేయునిగా ఉండకపోతే, రాబోయే దుష్పరిణామాలను ఎదురుకొని, వాటిని అనుభవిస్తూ జీవితమంతా శోకముతో గడుపవలసి యుండును.”
అంత దుర్యోధనుడు ఇటుల అనెను. ”పితామహా! మనము శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము నడుచుకోలేము. ఎందుకనగా నా రాజ్యమును పాండవులతో పంచుకొని జీవించుటకు నే
నంగీకరించను. నేను నా ప్రణాళిక ప్రకారము వెళ్ళెదను.”
ఆ పలుకులతో క్రోధావేశముతో భీష్ముడు వెంటనే లేచి విసురుగా సభనుండి నిష్క్రమించెను.
————————
మరోవైపు మరుసటిరోజు ఉదయము ప్రాతఃకాలములో నిదురమేలుకొని శ్రీకృష్ణుడు తన నిత్య ఆరాధనలు పూర్తి చేసుకొని హస్తినకు బయలుదేరెను.
ఆ తరువాత అతను కురు రాజధాని పొలిమేర ప్రాంతమును చేరుకొనినప్పుడు, అక్కడ దుర్యోధనుడు తప్ప మిగతా కౌరవ సోదరులు, కురువృద్ధులు, గురువృద్ధులు మరియు వేలాది పురజనులు స్వాగతించిరి.
జనాలతో చుట్టుముట్టబడిన శ్రీకృష్ణుడు తన గౌరవార్థం ఘనముగా అలంకరించబడిన హస్తినాపురంలో ప్రవేశించెను. స్త్రీపురుషులందరూ తమ గృహాలనుండి బయటకు వచ్చి
శ్రీకృష్ణుని దర్శించుటకై వీధుల్లో నిలుచుండిరి.
జనులందరూ ముకుళిత హస్తాలతో, గౌరవముగా తలవంచి శ్రీకృష్ణుని స్తోత్రం చేయసాగిరి. చివరకు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని రాజ భవనమును చేరుకొనెను.
అతడు సభలో ప్రవేశించగనే సభలోని వారందరూ గౌరవసూచకముగా లేచి నిలుచుండిరి. శ్రీకృష్ణుడు మొదట భీష్మ పితామహుని, ధృతరాష్ట్రుని కుశల ప్రశ్నలు వేసి పలకరించెను. అటుపిమ్మట మిగిలిన రాజన్యులు, ప్రముఖులను పలకరించెను. మర్యాదల ననుసరించి స్వాగతసత్కార్యాలు పూర్తైన పిమ్మట, కౌరవులతో శ్రీకృష్ణుడు తన సంబంధమునకు అనుగుణంగా హాస్యపూర్వకముగా భాషించెను.
తరవాత కొంతసేపటికి ధృతరాష్ట్రుని అనుమతితో విదురుని గృహమునకు బయలుదేరెను. శ్రీకృష్ణుడు అరుదెంచిన విషయము ఎరిసిన విదురుడు వెంటనే ఆ పరమాత్ముని వేనవేల స్తుతిస్తూ మంగళకరవాయిద్యాలతో ఎదురేగి, తన గృహమునకు తోడుకొనిపోయెను. విదురుడు ఎల్లప్పుడూ పాండవుల శ్రేయోభిలాషి కావున విదురునికి వారి క్షేమ సమాచారాలన్నింటినీ వినిపించెను.
పిమ్మట కుంతీదేవిని కలుసుకొనుటకు వెళ్ళెను.
శ్రీకృష్ణుని చూచిన కుంతీదేవి సంతోషముగా ఆనంద భాష్పములతో అతడిని హృదయమునకు హత్తుకొనెను. కుంతీదేవి తన మేనల్లుని చాలాకాలము తరువాత చూస్తుండెను. తన దీర్ఘకాల దుఃఖమును తన పలుకులతో ఇటుల మాట్లాడెను.
”ఓ మాధవా! దయచేసి నా పుత్రుల గురించి తెలుపుము. రాజభోగాలకు అలవాటు పడిన నా కుమారులు ఇంతటి దీర్ఘ కాలము అడవిలో ఎలా గడిపారు? ద్రౌపది ఎలా వుంది? ఆమె నా పుత్రుల కంటెను ప్రియమైనది. హే నందనందనా! నిన్ను చూచినంతనే నాకు ఎంతో సంతోషం, అదే సమయంలో నా కుమారుల దుస్థితికి దుఃఖముతో నిండిపోతుంటిని. కౌరవులు విరాటనగరము పై దాడి చేసినప్పుడు వారినందరినీ కౌంతేయుడు జయించి దాదాపు ఏడాది కాలము గడిచి పోయింది. నా పుత్రులు ధర్మమార్గమును అనుసరించు వారైనందున వారు త్వరలోనే తమ రాజ్యమును తిరిగి సాధించగలరని విశ్వసిస్తుంటిని.
కృష్ణా! నా భర్త పాండుమహారాజు మరణించినప్పుడు నేను అనుభవించిన దుఃఖము కంటెను, నా పుత్రుల నుండి విడివడుట చేత ఏర్పడిన దుఃఖమే ఎంతో అధికము.
పాండవులు తమ కర్తవ్యము ననుసరించి తమ తండ్రి రాజ్యము కొరకు పోరాడునట్లుగా నీవు వారిని ప్రోత్సహించవలెను. శకుని మోసముతో పాచికలాటలో నా పుత్రుల రాజ్యమును కోల్పోయినప్పుడు కూడా నేనంతటి బాధపడలేదు. కానీ, ఏకవస్త్ర అయిన పాంచాల రాకుమారిని కురుసభలో కొప్పుపట్టి ఈడ్చిన విషయము న్నెప్పటికీ మరువలేను.”
కుంతీదేవి ఒకరి తరువాత ఒకరిని తన కుమారుల గూర్చి గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ తన బాధను వెలిబుచ్చుచుండెను. శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చుతూ ఇటుల అనెను. ”అత్తా! నీ జీవితము దుఃఖపూరితమని భావించినను, అది ఎంతో శ్లాఘనీయం. ఎందుకంటే నీవు వీరపత్నివి. వీరమాతవు. నీవంటి స్త్రీలు ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన ద్వంద్వములను సహనముతో భరించగలరు. సాధారణ వ్యక్తులు మాత్రమే సవాళ్ళు మరియు పోరాటాలు లేనట్టి సాధారణ జీవితమును కోరుకుందురు. నిజమునకు శ్రేష్టులు తీవ్రకష్టాలను ఎదురుకుంటూ ముందుకు వెళుతుంటారు. నీకుమారులు మరియు ద్రౌపది మీ క్షేమసమాచారాలను విచారించి వారి క్షేమమును తెలుపుమనిరి.
పుత్రశోకముతో శ్రీకృష్ణుని పలుకులు విని కుంతీదేవి మనస్సు కొంత ఉపశమించెను. ఆమె ఇట్లనెను. ”కృష్ణా! నీవు భగవత్సరూపుడవు. అందరికీ మరియు అన్నింటికన్నా ఏకైక ఆశ్రయుడవు. ఎందుకనగా ధర్మహాని జరగకుండా నాకుమారులకు ఏది హితకరమేమో దానినే చేసెదవని విశ్వసిస్తుంటిని.”
అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఆమె అనుమతితో విదురుని మందిరమునకు బయలుదేరెను.
విదురుడు,శ్రీకృష్ణునకు చక్కని ఆతిథ్యం ఇచ్చెను. ఆ సాయంత్రం శ్రీకృష్ణునితో కూర్చున్నట్టి విదురుడు ఇటుల అనెను.
”హే ప్రభూ! మీరు స్వయంగా హస్తినకు విచ్చేయుట సరియైన ఆలోచన కాదని నా అభిప్రాయం. ధర్మార్థాలను విడిచిన దుర్యోధనుడు తన దుష్టప్రవర్తనతో మీ పట్ల అపరాధము చేయవచ్చును. దుర్యోధనుడు ఇతరులందరూ తనను గౌరవించవలెనని భావించి అందరినీ అవమానపరుస్తున్నాడు. అతడు పెద్దలపట్ల అవిధేయతను కలిగి ఉండును. అతడు ఎల్లప్పుడూ అనుమానముతో, కృతజ్ఞత లేని మరియు నియంత్రణ లేని మనస్సుతో ఉండును. పాపపూరితమైన జీవితము పట్ల ఆకర్షింపబడుటయే అతని స్వభావము. ”
అందుచేత మీరు దుర్యోధనుడి ప్రయోజనమును ఆశించి పలికినా, తన పరాక్రమము మరియు ఇతర కౌరవుల పట్ల విశ్వాసం కలిగిన దుర్యోధనుడు ఎన్నటికీ సంధికి అంగీక
రించడని నేను ఖచ్చితంగా చెప్పగలను. అతడు ఇదివరకే పాండవుల రాజ్యమును వారికి తిరిగి ఇవ్వకూడదని నిర్ణయించుకునెను. మంచిచెడు మాటల నడుమ భేదమును
గుర్తించని అతనితో చర్చించుటకు ప్రయత్నిస్తూ మీ సమయమును వృధా చేసుకొనరాదు.
పురుషోత్తమా; ఇంద్రుని మరియు ఇతర దేవతలను కూడా తాను జయింపగలనని భావించు గర్విష్టులు, మూర్ఖులు ఉన్నట్టి సభలోనికి మీరు ప్రవేశించుట సరికాదు. పాండవులు భీష్మ, ద్రోణ, కృపులతో పోరాడుట యేమిటి, వారి దరి జేరలేరను భావనతో తన విజయము పట్ల విశ్వాసంతో ఉండెను. నిజమునకు పాండవసైన్యము నంతటినీ
జయించుటకు కర్ణుడొక్కడే చాలునను భావనతో కూడా దుర్యోధనునిలో కలదు.
ఇప్పుడు దుర్యోధనుడు సమస్త భూమండలాన్ని పాలిస్తున్నాడు. దానితో అతడు తనకు ఎవరూ ఎదురు లేరని, తాను సురక్షితుడనని భావిస్తున్నాడు. కనుక అతడు ఏ మాత్రం తగ్గదలచుకోలేదు”
అంత శ్రీకృష్ణుడు ఇట్లు బదులిచ్చాడు. ”ఓ విదుర మహాశయా! మీ సత్యవాక్కులు నిజాయితీ గల మిత్రునికి తగినట్లుగా ఉండును. దుర్యోధనుని దుష్ట స్వభావం, పన్నాగాలు నేను పూర్తిగా ఎరుగుదును. ఏమైనను తమ సామర్థ్యం ననుసరించి ధర్మకార్యములకు పూనుకొని అందుకు శ్రద్ధగా ప్రయత్నించినచో, అతడు అందులో విఫలమైనను గొప్ప పుణ్యమును ఆర్జించును. ఏమైనను, ఒకరు ఏదైనా పాపకార్యమును చేయ సంకల్పించి, ఆ కార్యములో నెలకొనినచో, అతడు తప్పక పాపమును పొందును.
రాబోయే యుద్ధములో విపత్తు కేవలము దుర్యోధనుని దుష్టబుద్ధి వలననే ఏర్పడును. ఏమైనను, ఒక స్నేహితుడు ఏదైనా ఘోరచర్యకు పూనుకొనునప్పుడు అతడిని జుట్టు
పట్టుకొని ఈడ్చుటకైనను వెనుకాడక, అన్ని రకములుగా ప్రయత్నించని వ్యక్తి కూడా దుర్మార్గుడే.
మరోవైపు, పెడద్రోవ పట్టిన వ్యక్తిని రక్షించుకునేందుకు అన్ని రకములుగా ప్రయత్నించు వ్యక్తి ప్రశంసనీయుడు. కనుక దుర్యోధనుడు నా సలహాను అంగీకరించకపోయినను నా మనస్సాక్షి ప్రశాంతముగా ఉండును. అంతేకాకుండా, వివాదమును శాంతియుతముగా పరిష్కరించుటకు ప్రయత్నించలేదని నన్ను నిందించు అవకాశం ఉండదు. ”
శ్రీకృష్ణుడు మరియు విదురుడు ఇట్లు అర్ధరాత్రి సమయము వరకు సంభాషించుకొనిరి. చివరకు శ్రీకృష్ణుడు విశ్రాంతి కొరకు తన శయ్యపై పవళించెను. విదురుడు అయిష్టంగా
శ్రీకృష్ణుని విడిచి వెళ్ళెను.
ఈ మహాభారత ఘట్టం మీకు నచ్చితే షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కొన్ని ఇతర రచనలు:
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.











Comments