top of page

శ్రీమతి డొక్కాసీతమ్మ గారి సంక్షిప్త చరితము - 1

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Srimathi Dokka Seethamma Gari Sankshiptha Charitham1/2' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 05/02/2024

'శ్రీమతి డొక్కాసీతమ్మ గారి సంక్షిప్త చరితము1/2' పెద్దకథ ప్రారంభం

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)



అది 18 వ శతాబ్దము. తెల్లదొరల పరిపాలనా కాలము. స్వాతంత్య్ర సమర సమయం. కొందరు “రావుబహదూర్‌” బిరుదుకొరకు అర్రులు చాచువేళ, ప్రాక్పశ్చిమ నాగరికతలు మేళవించు యుగము. 


ఆధునిక, సనాతన నాగరికతల సంధికాలము. 


కర్మభూమి భరతఖండమున, తెలుగుగడ్డపై, వశిష్ఠ, వైనతేయ గోదావరి నదీపాయల మధ్య లంకల గన్నవర గ్రామము. ఆ గ్రామము నడిబొడ్డున ధ్వాదశ గోపాలములలో ఒకటైన, వశిష్టమహర్షిచే ప్రతిష్టింపబడిన రాజగోపాలస్వామి దేవాలయము, ఆలయమునకు ప్రక్కగా డొక్కావారి మండువాలోగిళ్ళు. 


వాటిలో డొక్కాజోగన్న గారిల్లు. జోగన్నగారు మంచివారు. శాంతమూర్తి. మహాపండితుడు. పెద్దరైతు. సీతమ్మగారు జోగన్నగారి ధర్మపత్ని. దైవాంశసంభూతురాలు. 


1841 సంవత్సరములో మండపేట గ్రామమున, అనప్పిండి భవానీశంకరము, నరసమ్మ పుణ్యదంపతులకు సీతమ్మగారు జన్మించిరి. పువ్వు పుట్టగనే పరిమళించను గదా; బాల్యము నుంచి అతిథి సత్కారములు చేసెడిదామె. డొక్కాజోగన్నగారు పండితసభకు వెళ్ళిరి. తిరిగి వచ్చుచూ భవానీ శంకరంగారింట ఆగిరి. సీతమ్మగారు చేసిన మర్యాదలకు ఆనందించిరి. రూపురేఖావిలాసములను

బట్టి మహర్జాతకురాలిగా గుర్తించిరి. కొంతకాలమునకు పెద్దల ఆశీస్సులతో వేదవిహితముగా వారి

వివాహము జరిగెను. సీతమ్మగారు సత్య, శాంత, దయాకరణాది సధ్గుణశాలి. అమ్మగా, “అపర

అన్నపూర్ణ” గా పేరుపొందినారు. 


జోగన్నగారిల్లు పాడిపంటలకు నిలయము. పాలకుండా, చల్లకుండలకు కాణాచి, ఉరగాయలకు పుట్టినిల్లు. ఆప్యాయత, అనురాగములకు పట్టుకొమ్మ. సీతమ్మగారికి అన్నదానము పుట్టుకతో వచ్చినవిద్య. 


అన్నము పరబ్రహ్మ స్వరూపము. మానవులకు ఆహారము ప్రాణాధారము. అన్నము శక్తిస్వరూపిణి. 


గీతాచార్యులు భగవధ్గీతలో, 

అహంవైశ్యానరోభూత్వా

ప్రాణినాం దేహ మాశ్రితః 

అని బోధించెను. 


జఠరాగ్నిని శాంతింపజేయునది అన్నము. అందుచే అన్ని దానములలో అన్నదానము గొప్పది. అన్నదానముతో మానవుని తృప్తిగా చాలు అనిపించవచ్చును. కృష్ణ భగవానుడు వైశ్వానరాగ్ని అని పేరుతో ప్రాణులు తీసుకొను అన్నములోని అన్ని విశేషములు ఏమికలవో అన్నిటిని పచనక్రియ ద్వారా తాను స్వీకరించుచున్నానని చెప్పెను. అనగా అన్నదానము స్వయముగా భగవంతునికి చెందునని భావన. శుభాశుభ కార్యక్రమములకు, దైవారాధన చేయునప్పుడు, యజ్ఞయాగాది క్రతువులందు

అన్నదానము చేయుట భారతీయుల ఆచారము. 


ఆ రోజులలో అన్నము అమ్ముకొను ఆచారము లేదు. సంస్థానాధీశులు, జమీందారులు, కోటీశ్వరులు, లెక్కకు మించి సత్రములు నిర్మించారు. వాటి నిర్వహణకు సిబ్బందిని నియమించారు. అక్కడ నిర్ణీత సమయములలో లెక్క ప్రకారము అన్నము పెట్టేవారు. ఆర్థిక, అసమానతలను బట్టి గౌరవించేవారు. 


కుల, మతములను పాటించేవారు. యజమానులు అహంకారపూరితులు. సిబ్బంది బాధ్యతా రహితులు. అందుచే బాటసారులు నిరాధారణకు గురయ్యేవారు. ఇబ్బందిపడేవారు. 


అమ్మ సీతమ్మ అన్నివేళలా, అందరినీ ఆదరించి ఓర్పుగా సహనముతో సమారాధన చేసెడిది. తృప్తిగా వేలాదిమంది చాలమ్మా, ఇంకవద్దు అనేవారు. ఆమె నుండి లేదు, కాదు, వద్దు, ఇప్పుడు కాదు అనే మాటలు వచ్చేవి కావు. రాజు, పేద, ఆబాలగోపాలము, అన్ని కులములవారు, మతములవారు

తృప్తిగా భోజనమును చేసెడివారు. సీతమ్మగారి వద్ద మాతృవాత్స్యల్యము పొందనివారు లేరు. అమ్మని మించిన దైవము లేదు. 


రారాజు దుర్యోధనుడు, పాండవాగ్రజుడు ధర్మరాజు కూడా దానము చేయుటలో కర్ణుడికి సాటిరారు. అక్రమార్జన వున్న వారింట భోజనము చేయరాదు. ఎంత గొప్పవారైననూ ఆ ఫలితము ననుభవించక తప్పదు. 


జోగన్నగారిది కష్టార్జిత, ధర్మబద్ధమైన, ద్య్రవ్యశుద్దిగల ధనము. సీతమ్మగారు హస్తవాసి, చేతిచలువ, ధర్మచింతన గల దాత. అందుచేత ఆ రోజులలో సీతమ్మగారింటిని మించిన అన్నదాన సత్రములు మరేవి లేవు. డొక్కాసీతమ్మగారిల్లు అన్నదానానికి అద్వితీయ అగ్రగామి. 


గంగిగోవు పాలు గరిటెడైనను చాలు

కడవడైన నేమి ఖరము పాలు

భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు

విశ్వదాభి రామ; వినుర వేమ ;


అతిథి దేవో భవ; అభ్యాగతిః స్వయం విష్ణుః

సీతమ్మగారికి భూదేవికున్న ఓర్పు గలదు. జోగన్నగారు ఆకాశమంత విశాల హృదయము కలవారు. అందరు యాత్రికులకు అన్ని వేళలా ఆప్యాయత, అనురాగము, కరుణ కురిపించిన తల్లి సీతమ్మ. అలుపు లేని, విసుగు, విరామము ఎరుగని, సహనము గల సౌజన్యమూర్తి ఆమె. 


అత్తింట అడుగు పెట్టింది మొదలు, ఆఖరి శ్వాస విడుచు వరకు అన్నదాన దీక్ష పరిపాలించినది ఆమె. 

పుట్టింటికైనా వెళ్ళలేదు. యాత్రలైనా చెయ్యలేదు. 

మానవసేవయే మాధవ సేవ. 

తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు గ్రామము లంకల గన్నవరము. చుట్టూ గోదావరి రేవులు. మధ్య మధ్య ఇసుక తిన్నెలు. దుబ్బుల చాడవలు- గోతులు, గోతుల్లో నీరు, బురద గుంటలు, పచ్చిక బయళ్ళు, ముళ్ళడొంకలు వుండేవి. రహదారులు లేవు. ప్రయాణ సౌకర్యములు లేవు. 

విషసర్పములతో ప్రయాణము భయానకము. అమ్మ ఇంట దాహార్తులకు మంచినీరు, తరువాణీతేట, మజ్జిగతేట లభించేవి. చంటిబిడ్డలకు ఆవుపాలు, వృద్దులకు పండ్లరసములు యిచ్చెడిది. 24గంటలు అర్ధరాత్రి

కూడా అన్నదానము చేసెడిది సీతమ్మ. 


పశ్చిమగోదావరి జిల్లా నుండి ఒక రాజు గారు నిండు చూలాలైన తన కుమార్తెను తూర్పుగోదావరి జిల్లా

లోని తన యింటికి “ మేనాపై” పురిటికి తీసుకువచ్చు చుండిరి. ఆమెక ఇంకనూ నవమాసములు నిండ

లేదు. పురిటికి సమయము కాలేదు. ఒక రేవు దాటిరి. లంకల గన్నవరము వచ్చిరి. మరొక రేవు దాటవలెను. చీకటి పడుచున్నది. రేవు దాటదు. ప్రయాణము ముందుకు సాగదు. రాకుమారికి పురిటినొప్పులు మొదలైనవి. అచ్చట వైద్య సౌకర్యములు లేవు. రాజుగారు కంగారు పడిరి. 


మరో మార్గము లేక సీతమ్మ గారింటికి తీసుకు వచ్చిరి. తన అమృత హస్తములతో రాకుమారికి తన యింట పురుడు పోసినది. పండంటి బిడ్డ కలిగెను. కరుణరసనారీ రత్నం రాకుమారికి పథ్యం పెట్టెను. చీర, సారె పెట్టి

సగౌరవముగా సాగనంపెను. 

అన్ని దానములలో అన్నదానము గొప్పది. సేవాధర్మముతోడైన ఆదిశేషువు కైనను ఫలితము చెప్పనలవి కాదు. 


కారుమబ్బులు, కటిక చీకటి, ఉరుములు, మెరుపులు, పిడుగులు, పెనుగాలులు, భారీవర్షము,

ఉప్పొంగుతున్న గోదావరి. సుడిగుండాలు, పెద్దపెద్ద కెరటాలు, అవతలిగట్టున ముసలివాడు. 


పూర్తిగా తడిశాడు. చలితో వణుకుతున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. ఆకలితో అలమటిస్తున్నాడు. 

శోష వస్తోంది. కొసప్రాణంతో వున్నాడు. పంచప్రాణాలను కూడగట్టుకున్నాడు. ” సీతమ్మతల్లీ” అనే

ఆర్తనాదం చేశాడు. 


సీతమ్మ తల్లి విన్నది. చిన్నమూట, లాంతరు తీసుకున్నది. పడవ ఎక్కినది. జోగన్నగారు స్వయముగా పడవ నడిపినారు. వసుదేవుడు శ్రీకృష్ణుని యమునా నదిని దాటించినప్పుడు ప్రకృతి సహకరించినది. 


అటులనే సీతమ్మగారికి వాతావరణము అనుకూలించినది. అమ్మ ఆదరణతో నిమ్నకులస్థుడైన ఆ ముసలి వానికి అన్నము పెట్టినది. పొడిబట్టలు ఇచ్చింది. చుట్ట అగ్గిపెట్టె కూడా యిచ్చెను. ఆ ముసలివాడు నెమ్మదిగా కోలుకొనెను. బతికి బట్ట కట్టెను. ఆ రోజులలో కుల, మత భేదములు హెచ్చు. అయిననూ కులము కన్న గుణము గొప్పది. మతము కన్న మానవత్వము మేలైనది. సేవకు అంటరాని

తనము లేదు. అని చాటిన సాధ్వీమణి సీతమ్మ. గజేంద్రమోక్షంలో, విష్ణుమూర్తి ఆఖరిక్షణము వరకూ

గజేంద్రుని పరీక్షించెను. సీతమ్మ తల్లి, అడిగిందే తడవుగా ఆర్తులను ఆదుకొనేది. 


సీతమ్మగారిల్లు —“నిత్యకళ్యాణము-పచ్చతోరణము”. 

సీతమ్మగారింటిలో ఎన్నో ఉపనయనములు, మరెన్నో వివాహములు, ఇంకెన్నో కాన్పులు, నామక్రమములు, లెక్కకు మించిన అన్నప్రాశనాలు జరిగేవి. ఏ దిక్కులేని వారికి సీతమ్మతల్లే దిక్కు. ఆమెసహాయ, సహకారులతో ఎందరో విద్యార్థులు చదువుకున్నారు. కవులను, కళాకారులను, పండితులను సన్మానించేవారు ఆ అభినవ సీతారాములు. 

ఉభయగోదావరి జిల్లాలో అనేక దేవాలయములకు చెఱువులు త్రవ్వించిరి. ప్రహారీలు నిర్మించిరి. ధ్వజస్తంబములు ప్రతిష్టించిరి. 


ల్యాండు సీలింగులు కానీ, ఇండ్లస్థలముల పట్టాలు కానీ లేని ఆ రోజులలో వందలాది ఇండ్లస్థలములను దానము చేసిరి. దానములు చేయుటలో ఆ దంపతుల చేతికి ఎముక లేదు. పిన్నల యెడల ఆదరణ, పెద్దలయందు గౌరవము, భగవంతుని పై భక్తిగలిగిన పుణ్యదంపతులు వారు. అంటుమామిడితోట ఆరు ఎకరములు ఇండ్ల స్థలములకు ఇచ్చిరి. 


దయాసాగరి సీతమ్మ.


నెల్లూరు జిల్లాలో ధనగుప్తుడు అనే వజ్రాలవ్యాపారి వుండేవాడు. అతను ఆగర్భశ్రీమంతుడు. కోటీశ్వరుడు. కానీ బిడ్డలు లేరు. అతను సీతమ్మగారి దర్శనము చేయదలచుకొనెను. భగవంతుడు భక్తికి అధీనుడు. సీతమ్మగారు మానవసేవయే మాదవసేవగా గుర్తించినవారు. అనుక్షణము అన్నార్తుల జఠరాగ్నికి అన్నము హోమము‌ను చేసి శాంతింపజేసెడి వారు. సీతమ్మగారు నిజమైన భక్తురాలు. 


భగవంతుడు భక్తులకు అధీనుడు. కావున వజ్రాల వ్యాపారికి పుత్రోదయమైనది. అతనికి వరహాలశెట్టి అని పేరు పెట్టెను. కానీ సీతమ్మగారి దర్శనము చేసుకొనలేదు. 


వరహాలశెట్టికి చేతినిండా డబ్బు వుండేది. చెడుస్నేహాలు చేసెను. సహవాస దోషమున చోరుడు, జారుడు, దుష్టుడు అయ్యెను. తండ్రి మాట వినువాడు కాదు. మ్రొక్కై వంగనిది మ్రానై వంగునా? అని తండ్రి బాధ పడెను. వరహాలసెట్టికి అన్నము పెట్టిన చేతిని నరుకు స్వభావము వచ్చెను. తండ్రిపై కోపగించెను. ఇల్లు వదలిపోయెను. గ్రామస్థులు కూడా వరహాలసెట్టిని గ్రామము నుండి వెడలగొట్టిరి. 


తిన్న యింటి వాసములు లెక్కబెట్టు వరహాలసెట్టిని ఏ గ్రామస్థులు కూడా ఆదరించలేదు. తెగిన గాలిపటమైనది అతని బ్రతుకు. బికారి అయ్యెను. దుర్మార్గమునకు మారుపేరు వరహాలసెట్టి. నిలువనీడ లేక తిరుగసాగెను. 


మార్గవశమున సీతమ్మ గారింటికి వచ్చెను. మ్రొక్కు తీరినట్లు అయినది. స్వేచ్ఛావాయువులు శ్వాసించెను. గోదావరి పవిత్ర జలముతో కాళ్ళు, చేతులు కడుగుకొనెను. సీతమ్మగారి బావి వద్ద స్నానము చేసెను. అమ్మ చల్లని చూపులతో పరిశుద్దుడయ్యెను. దర్శన భాగ్యము వలన పరివర్తన వచ్చెను. 


అమ్మ అన్న ప్రసాదముతో పరిపక్వత సిద్దించెను. అమ్మ హితముతో గుణవంతుడయ్యెను. దీవెనలతో

బుద్ధిమంతుడయ్యెను. పశ్చాత్తాపపడి తండ్రి వద్దకు తిరిగి వెళ్ళెను. 


కుమారునిపై బెంగపడ్డ తల్లిదండ్రులు చేరతీసిరి. క్షమించిరి. వరహాలసెట్టి ప్రవర్తనా సరళిలో మార్పు గమనించిరి. ఆనందించారు. వరహాల సెట్టి వ్యాపారమెలకువలు నేర్చుకొనెను. సముద్ర రవాణా వ్యాపా

రమును కూడా చేసెను. తండ్రిని మించిన తనయుడిగా కీర్తిపొందెను. 


ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో విశాఖ జిల్లాలో నర్సాపురం తాలూకా వుండేది. పిఠాపురం ఎస్టేట్‌లో పలివెల ఠాణా వుండేది. నర్సాపురం తాలూకా, పలివెల ఠాణాలో లంకల గన్నవరం గ్రామం వుండేది. 


విశాఖజిల్లా కలెక్టర్‌ గారికి పిల్లలు లేరు. ఎన్నో నోములు నోచిరి. వ్రతములు, పూజలు చేసిరి. పుణ్య నదులలో స్నానమాచరించిరి. జపతపములు, దానధర్మములు చేసిరి. తీర్థయాత్రలు చేసిరి. వైద్యము చేయించిరి. అయినను సంతానము కలగలేదు. 


కలెక్టర్‌గారు సీతమ్మగారి దర్శనమునకు బయలుదేరారు. మార్గమధ్యంలో పిఠాపురం జమీందారుగారింట బస చేసినారు. కలెక్టర్‌గారు జమీందారు గారిని కూడా సీతమ్మగారింటికి రమ్మనిరి. తన ఎస్టేట్‌లో తన కంటే ఒక ఆడమనిషికి ఎక్కువ పేరు ప్రతిష్టలు వుండుట జమీందారుకు కిట్టదు. ఈర్ష్య, అసూయ, ద్వేషము గలవు. ఇంతి అనే ఈసడింపు గలదు. ఆడదనే అలుసు కూడా ఉన్నది. 


అయినను అత్యున్నత అధికారితో ప్రయాణమయ్యెను. అయిష్టముగా విధిలేక బయలుదేరెను. చీకటిపడిన సమయమునకు గన్నవరము వచ్చిరి. బాటసారుల వలె పొరుగింటి అరుగుపై పడుకొనిరి. సీతమ్మగారి దర్శనకాంక్షతో కలెక్టర్‌ గారికి, కడుపుమంట, కంటగింపులతో జమీందారుగారికి కంటిపై కునుకు వచ్చుటలేదు. నిద్ర పట్టుట లేదు. 


అమ్మ ప్రతిరాత్రి అన్ని అరుగులు చూసి, అన్నార్తులను పిలిచి అన్నము పెట్టిన తరువాత విశ్రమించెడిది. అమ్మ వారిద్దరినీ పిలచినది. జమీందారు అనారోగ్యమనెను. పథ్యపుకూరలతో జమీందారుకు భోజనము పెట్టెను. కలెక్టర్‌ గారు భక్తిగా అన్నప్రసాదము తీసుకొనిరి. సీతమ్మతల్లి కొసరి కొసరి వడ్డించినది. వారు తృప్తిగా కడుపార భుజించిరి. 


అమ్మ ఆదరణతో జమీందారు అహంకారము మాడి మసైపోయెను. చల్లనిచూపులతో అసూయ దగ్ధ

మయ్యెను. కరుణతో కాఠిన్యము కరిగిపోయెను. జమీందారు పశ్చాత్తాపపడెను. అమ్మకు భక్తుడయ్యెను. 

కలెక్టర్‌గారికి, కాలక్రమములో సంతానప్రాప్తి కలిగెను. 

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు. 



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









161 views0 comments
bottom of page