శ్రీకృష్ణ రాయభారం - పార్ట్ 1
- Ayyala Somayajula Subramanyam

- 2 hours ago
- 6 min read

Srikrishna Rayabharam - Part 1/3 - Telugu Mythological Story | Ayyala Somayajula Subrahmanyam
శ్రీకృష్ణ రాయభారం - పార్ట్ 1/3 - తెలుగు పౌరాణిక కథ | అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 01/05/2026
ధర్మం కోసం యుద్ధమా…? లేక శాంతి కోసం ప్రయత్నమా…?
పాండవులు, కౌరవుల మధ్య అంతిమ నిర్ణయానికి ముందు శ్రీకృష్ణుడు చేసిన అత్యంత కీలకమైన దౌత్య యత్నం ఇదే…
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
కస్తూరీ తిలకం లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే, వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం, కంఠేచ ముక్తావళి
గోపస్త్రీ పరివేష్టితో విజయతే, గోపాల చూడామణీ..
—————————
సంజయుడు ఉపప్లావ్యము నుండి నిష్క్రమించిన పిమ్మట యుధిష్టరమహారాజు శ్రీకృష్ణపరమాత్ముని సమీపించి ఇట్లు పలికెను: "హే ప్రభూ, నేను మరియు నా సోదరులు
నీపై పూర్తిగా ఆధారపడి ఉంటిమి. నిజమునకు, నీపై విశ్వాసముతోనే దుర్యోధనుని నుండి మా రాజ్యమును తిరిగి ఇవ్వమని నిర్భయంగా అడుగుటకు సాహసించితిమి.”
శ్రీకృష్ణుడు ఇట్లు బదులిచ్చెను: "ధర్మరాజా! నేను మీ ఆప్తబంధువును. మీ ఆజ్ఞానుసారము నేను ఏమి చేయుటకైనను సిద్ధముగా ఉంటిని.”
తరువాత ధర్మరాజు ఇటుల పలికెను: "హే కృష్ణా! ధార్తరాష్ట్రులు దుష్ట బుద్ధి కలవారు. వారు ఏమి చేయదలచిరో నీకు తెలిసియే ఉండును. ఏమైనను వారు మా హక్కు యైన మా రాజ్యమును తిరిగి ఇవ్వ దలచుకొనుట లేదు. దృతరాష్ట్రుడు యుద్ధమును నివా
రింప యత్నించినను, అదే సమయములో, అతడు తన దుష్ట పుత్రుని నియంత్రించుటకు అవసరమైన ధైర్యమును కూడగట్టి కోలేకుండెను. ఇది ఎంతటి దయనీయ పరిస్థితి.
మేము కేవలము ఐదు గ్రామాలనైనను ఇవ్వమని అర్థించునటులుగా రాజీకి వచ్చితిమి. ఏమైనను ఈ ప్రతిపాదనను కూడా దుర్యోధనుడు తిరస్కరించెను. దీనితో మేము మరింత గొప్ప సంకట స్థితిలో చిక్కుకొంటిమి.
ఎందుకనగా క్షత్రియులుగా ఇతరులను రక్షించుట, మరియు పోషించడం మా ధర్మము. ఏ రాజ్యమును పాలించకుండా, అవసరమైన సంపదలు పొందకుండా, తమ ధర్మవిహితమైన విధులను నిర్వర్తించుట ఏ క్షత్రియునికి సాధ్యం కాదు. ఓ; ఎంతటి దురదృష్టము. నేను క్షత్రియ
వంశములో జన్మించితిని. ఇప్పుడు నా విధ్యుక్త ధర్మ నిర్వహణకు బంధువులను వధింపవలసి ఉండును.
హే కృష్ణా, యదుపుంగవా! యుద్ధము ఎంత ఘోరమైనది. పరాజితులు మాత్రమే నష్టపోవుట కాకుండా, విజయము సాధించిన వారు కూడా తమ బంధువులను మరియు
ఇష్టులు వధింపబడుటకు ఎంతగానో శోకింపవలసి ఉండును. అంతేకాకుండా, శత్రుపక్షములో జీవించి ఉన్నవారందరూ విజయము సాధించిన వారి పట్ల తీవ్ర శత్రుత్వమును కలిగి ఉందురు.
తరువాతి కాలంలో ఏదైనా వైరము ఏర్పడినచో వారు వెంటనే మరోసారి ప్రతీకారముతో దాడి చేసెదరు. విజయము లేదా పరాజయము నకు సంబంధించిన ఆలోచనల నుండి విముక్తుడైన వ్యక్తి మాత్రమే రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రించగలడు.
మరోవైపు శత్రుత్వమును రగుల్చువాడు నిరంతర ఆందోళనతో, తన గదిలో ప్రమాదకరమైన సర్పము ఉన్నట్లుగా మిక్కిలి అశాంతితో సుఖముగా నిద్రించలేడు. శత్రుభావము తో శత్రుత్వమును తటస్థపరచలేము.
అలాకాకుండా అది మరింత దేదీప్యమానంగా ప్రజ్వలింపబడును. ఒకవేళ శత్రువును సమూలంగా నిర్మూలించగలిగినచో కొంత మనశ్శాంతి
కలుగవచ్చును. కానీ అట్టి చర్య క్రూరమైనదే కాకండా మిక్కిలి పాపపూరితమైనది.
నందనందనా! నేను కలవరపడుతుంటిని. క్షత్రియునిగా నేను నా రాజ్యమును త్యజించలేను. ఎందుకనగా అది మరణముతో సమానము. మరోవైపు, నేను కురువంశ నిర్మూలనకూ కారణముగా కాదలచుకోలేదు. కనుక కౌరవుల
ఎదుట ఎంతగా తగ్గవలసి వచ్చినప్పటికీ నేను సంధిని వాంఛించెదను. హే యదుభూషణా; దయచేసి మా ధర్మము మరియి ఉద్దేశములు భంగపడకుండ ఇరువురికి మేలైన మార్గమును సూచింపుము. నీవు తప్ప మాకు ఇతర ఆశ్రయము లేదు. "
శ్రీకృష్ణుడు ఈ విధముగా బదులిచ్చాడు: "యుధిష్ఠరా! నేను స్వయంగా హస్తినకు వెళ్ళి మీ ప్రయోజనములకు భంగము కలుగకుండ శాంతి ఒప్పందము కొరకు ప్రయత్నించెదను.
ఆ విధముగా ఒక గొప్ప కార్యక్రమమును నెరవేర్చిన వాడనగుదును. అంతేకాకుండా కురువంశము నాశనము చెందకుండా రక్షింపగలిగిన వాడనగుదును. "
మరల ధర్మరాజు ఈ విధముగా పలికెను: "హే కృష్ణా! ఈ ఆలోచనను నేను సమర్థించను. ఎందుకనగా, దుర్యోధనుడు నీ పలుకులను ఎన్నటికీ అంగీకరింపడు. కౌరవులు నీ పట్ల మూర్ఖముగా ఏదైనా కీడు తలపెట్టినచో, నేను అందుకు బాధ్యునిగా భావించుదును. దానితో నా జీవితము దుర్భరమగును. ”.
అంత కృష్ణభగవానుడు ఈ విధముగా పలికెను: "ధర్మరాజా! చింతింపవద్దు. భూలోకములోని రాజులందరూ ఏకమైననూ నన్ను ఎవరూ ఎదురుకొనలేరు. దుర్యోధనుడు నా శాంతి
ప్రస్తావనను వినిపించుకోడని నాకు తెలుసు. అయినను ఇట్టి ప్రయత్నముతో, భవిష్యత్తులో ఎవరూ నన్ను యుద్దోన్మాదిగా నిందించు అవకాశము ఉండదు. "
యుధిష్ఠరమహారాజు ఇటుల పలికెను: "నందనందనా! నీవు హస్తినకు వెళ్ళదలచినచో తప్పక అట్లు చేయుము. ఏ విధముగానైనను అక్కడ శాంతి ఒప్పందం కుదురునట్లుగా
ప్రయత్నించమనేది నా విన్నపము. "
ఐనను బోయి రావలయు హస్తిన, కచ్చటి సంధిమాట యె
ట్లైనను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు నీ
మానసమందు గల్గు ననుమానము దీర్పగ వచ్చు దత్సమా
ధానము మీ విధానమును తాతయ్య నొజ్జయువిందురెల్లరున్.
శ్రీకృష్ణుడు ఇటుల పలికెను: "ఓ ధర్మరాజా! భిక్షకుని వలె అర్థించుట మరియు పిరికిదనమును ప్రదర్శించుట క్షత్రియులకు ఉచితము కాదు. రాజును యుద్దరంగంలో జయించవలెను లేదా పోరాడుతూ మరణించవలెను. కనుక సందేహస్థితిని సమర్థించుటకు బదులుగా, నీ శత్రువులను జయించవలెను.
నా అభిప్రాయములో సంధి కి, శాంతి ఒప్పందానికి ఏ మాత్రమూ అవకాశం లేదు. ఎందుకనగా భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ మొదలగు వారందరి సహాయముతో తమ స్థితి మిక్కిలి గొప్పది, శక్తివంతమైనదనే పూర్తి విశ్వాసంతో ధుర్యోదనుడు ఉండెను. ధర్మమును
లేక మృదుత్వమును ప్రదర్శించమని నీవు వేడుకొనిననను, నీ రాజ్యమును నీకు తిరిగి ఇచ్చుటకు అతడు ఎన్నటికీ అంగీకరించడు.
యుధిష్టరా; వాస్తవమేమనగా, జూద సమయంలో అతని ప్రవర్తన మరియు పరుష వాక్కులు దుర్యోధనుడు వధింపబడుటకు యోగ్యుని చేసెను. ఇతరులచే ఖండింపబడుట ఒక ఉత్రమునికి మరణము కంటెను హీనమైనది. కానీ దుర్యోధనుడు కురుసభలోని వారందరూ తనను ఛీత్కరించినను, కనీసము లజ్జితుడు కూడా కాలేదు.
నేను హస్తినకు పోయి సభలోని రాజులందరి సమక్షంలో నీ ధర్మగుణాలను వివరించి, దుర్యోధనుని దుష్టత్వమును ఖండించెదను. ఈ విధముగా ఇప్పటివరకూ, ఏ విధమైన
నిర్ణయానికి రాలేని వారెవరైనా ఉండినచో, వారు వాస్తవాలను గ్రహింపగలుగుతారు. అట్లే నేను శాంతికారణమును వివరించెదను. అది మీ ప్రయోజనాలను త్యాగము చేయనంత వరకే అట్లు చేయవలసి ఉండును. ఇట్లు ప్రయత్నించుట ద్వారా, మీరు రాజ్యపాలన లోభముతో పాపమునకు ఒడిగట్టిరని ఎవరూ మిమ్ములను నిందించే అవకాశము లేదు. ఏమైనను కౌరవులతో పోరు నివారించలేము. కనుక నీవు దుష్టబుద్ధి గల దుర్యోధనుని వధించుటకు సన్నద్ధుడవు కావలెను. ఈర్ష్యాళువైన సర్పము వలె అతడు వధింపబడుటకు అర్హుడు. "
తరువాత భీముడు ఇటుల పలికెను: "హే కృష్ణా! దుర్యోధనుడు స్వల్ప కారణముతో కోపోద్రిక్తుడగును. కనుక అతనితో మృదువుగా వ్యవహరింపవలెను. అట్టి అహం కారి మరియు మోసకారి వ్యక్తితో శాంతి ఒప్పందం ఎంతో కష్టము. దుర్యోధనుని హృదయము చోరుని వంటిది. అతడు తన సంపద మరియు తన పరపతిని చూసుకొని మత్తెక్కి ఉండెను.
మా పట్ల అతడు ఎల్లప్పుడూ వైరి భావమును కలిగి ఉండుంటే కాకుండ పరుషముగ పలుకుతూ, ఇతరులను విమర్శిస్తూ ఆనందించును. దుర్యోధనునికీ ముందు చూపు లేదు. అతడిని ఒప్పించుట కష్టము. దుష్టబుద్ది మరియు మోసప్రవృత్తి కలిగిన వాడగుట చేత అతనికి
దేనిని ఉపదేశించలేము. నిజమునకు, దుర్యోధనుడు ఎంత మూర్ఖుడనగా అతడు తన ప్రాణములైనా విడువగలడు. గానీ, తన అభిప్రాయాలను మార్చుకొనడు.
కురువంశ మంతటినీ నిర్మూలించుట కంటెను, దుర్యోధనుని సామంతులుగా చిన్ని రాజ్యమును పాలించుట ఉత్తమమనే యుధిష్టరుని ఆలోచన నాకు సమ్మతమే. ”
ఈ రకమైన సాధువాక్యములని భీముని వంటి వాడు పలుకుట అతని ప్రవృత్తికి పూర్తిగా భిన్నమే కాకుండా చల్లటి అగ్ని లేక భారరహిత పర్వతాలకు వలె అనూహ్యమైనది. దానితోశ్రీకృష్ణుడు నవ్వెను.
అట్టి క్షమాభావనలో భీముడు మునిగి ఉండుటను గమనించిన శ్రీకృష్ణుడు అతని క్రోధమును ప్రేరేపించదలచెను. అతడు ఇటుల పలికెను.
“మాయదురోదంబున నమాయికునిన్ నిను గెల్చి కాంతకున్
జేయగరాని యంత పని జేసి యరణ్యములోన కంపియున్
హాయిగా నుండక బలులై పలునెగ్గుల పన్నుతున్న యా
దాయలు చత్తురంచు దయ దాల్చేద వెంతటి ధర్మరాజువో?
అనుపమ విక్రమ క్రమ సహాయుల కంతటి పాండు రాజసం
దనులకు నొక్క కూళ భరణం బిడు చాడ్పున నూళులైదు ని
చ్చునట/ కటా; యటుల్ బ్రదుక జూచుట రాచ కొలంబు వారికిన్
ఘనతయె?మంత్ర రుద్ధ భుజగంబు నిసి; యిపుడేమి చేయుదున్.
నిదురవోచుంటివో; లేక బెదరి పల్కు
చుంటివో?కాక నీవు తొల్లింటి భీమ
సేనుడవె కావొ;యెన్నడీ చెవులు వినని
కనులు చూడని శాంతంబు గానవచ్చె.
—-
“కురుపతి పెందొడ విఱుగ గొట్టెద ఱొమ్ము పగిల్చి వెచ్చ నె
త్తురు కడుపార గ్రోలి యని దున్మెద దుష్టుని దుస్ససేను భీ
కర గధ చేత “నంచును బ్రగల్బము లాడితి వల్ల కొల్వులో
మరల నిదేల యీ పిరికి మానిసి పల్కులు మృష్ట భోజనా:
"ఓ భీమా! వీరాధివీరా! అనేక సందర్భాలలో నీవు పోరాటములలో ఇతరులను వధించి ఆనందించిన విషయము మరచితివా?నీ సోదరులు మరియు ద్రౌపది సహించిన అవమానాలను తలచుకుంటూ నిద్ర లేని రాత్రులను గడపుటను మరచితిరా?
నిద్రించలేక తలను మోకాళ్ళ నడుమ పెట్టుకుని రాత్రంతా కూర్చుని ఉండేవాడివి. కొన్ని సమయాల్లో వేడి నిట్టూర్పులతో ఉన్మాది వలె క్రోధపూరితమై పలుకులను పలికెడి వాడివి.
కౌరవులపై ప్రతీకారము తీర్చుకొను అవకాశము కొఱకు ఎల్లప్పుడు ఎదురు చూస్తూ, అట్టి ఆలోచనల్లో నిమగ్నుడై ఇన్ని సంవత్సరములు గడిపితివి. ఎల్లవేళలా కనుబొమ్మలను ముడి వేస్తూ క్రోధముతోపెదవి కొరుకుతూ కూర్చుని, మధ్యమధ్యన బిగ్గరగా నవ్వేవాడివి.
ఒకసారి నీ సోదరులతో కూర్చున్నప్పుడు’ సూర్యుని ఉదయాస్తమయాలకు వలె ఖచ్చితంగా దుర్యోధనుని వధించెదను. ’ అంటూ హఠాత్తుగా నీ గదను ఎత్తి ప్రతిజ్ఞ చేసితివి. అట్టి భీముడు ఇట్టి శాంతి వచనాలను ఇంత మృదువుగా ఎట్లు పలుక గలుగుతుంటివి?"
"భీమా! కౌరవులకు భయపడి ఇలా పిరికిమాటలు మాట్లాడటం నీ వంటి అతిరథులకు తగదు. "
భీముడు ఆ అవమానమును ఎంతమాత్రమూ సహించలేదు. శ్రీకృష్ణుని పదునైన పలుకులకు, భీమునిలో తన నిజస్వరూప స్వభావం వెంటనే మేల్కొని ఇట్లు పలికెను.
"ఓ కృష్ణా! నా పరాక్రమము గురించి సందేహించకుము. నా పట్టులోకి వచ్చిన పిమ్మట ఇంద్రుడు కూడా తనను తాను విడిపించుకొనజాలడు. నీ పదునైన పలుకులు నాకు గ్రుచ్చుకొనెను. నీవు ఏ సమయములో ఆజ్ఞాపించినా యుద్ధములో నాపూర్తి పరాక్రమమును ప్రదర్శించుటకు సిద్ధముగా నుంటిని.
కేవలము దయా స్వభావముచేత నేను మా దుష్టశత్రువు పట్ల
కొంత సానుభూతి పలికితిని.
బకునిం జంపితి, రూపు మాపితి హిడింబా సోదరుని, దుష్ట కీ
చకులం దున్మితి మొన్న నూర్గుర, జరాసంధున్ నే నొక్కడం, జంపితి నాకు భీమునకు వేఱొక్కండు తోడేల; యె
న్నక నన్నీరీతి బోరికిం బెదరు చున్నాడం చనం బాడియే.
పిదప శ్రీకృష్ణుడు ఇటుల పలికెను: "భీమా! కేవలము నీమీద ప్రేమ చేతనే నిన్ను అలా అంత తీవ్రముగా విమర్శించితిని. నీ పరాక్రమము గురించి నేను బాగా ఎరుగుదును. నీ మనస్సులోని వాస్తవ భావాలను ఎరుగుటచే నీతో ఇట్లు తీవ్రముగా పలికితిని. సమయము వచ్చినప్పుడు నీవు ఊహించినదాని కంటే వేయిరెట్లు అధికంగా వీరోచిత కార్యాలను నీవు యుద్ద రంగములో నిర్వహించెదవని విశ్వాసం కలదు.
భీమా; మన కర్మ ఫలితాలనేవి అదృష్టము మరియు ప్రయత్నము అనబడు రెండింటిపై ఆధారపడి ఉండును. ప్రయత్నము పట్ల వ్యక్తి ఉత్సాహము సన్నగిల్లినప్పుడు విజయము దెబ్బ తినవచ్చును. కనుకనే నీలో ఏదైనా సందేహము లేదా నిరాశ ఉంటే వాటిని తొలగింప
దలచి అట్లు పలికితిని.
రేపు నేను హస్తినకు బయలుదేరెదను. ఒకవేళ శాంతి ఒప్పందంను సాధించగలిగితే, అది నాకు గొప్ప ఖ్యాతిని తెస్తుంది. అది మీ ఉద్దేశములను నెరవేర్చును.
ఇంకను కౌరవులకు కూడా ప్రయోజనం కలుగును. అలాకాకుండా, ఒకవేళ దుష్ట దుర్యోధనుడు పట్టును విడువకున్నచో యుద్దము తప్పదు. ఆ పోరు బాధ్యత నీవు మరియు అర్జునుని భుజస్కంధాలపైననే ఉండును. "
=========================================
ఇంకా ఉంది.
శ్రీకృష్ణ రాయభారం - పార్ట్ 2 త్వరలో వస్తుంది.
===========================================
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కొన్ని ఇతర రచనలు:
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










Comments