top of page
Original.png

వాసాంసి జీర్ణాని...

వాసాంసి జీర్ణాని, బంధకవి రమణ, తెలుగు కథ, అమ్మ ప్రేమ, తల్లి మరణం, అస్థి నిమజ్జనం, భగవద్గీత, గీతా శ్లోకాలు, ఆత్మ శాశ్వతత్వం, వాసాంసి జీర్ణాని యథా విహాయ, జాతస్య హి ధ్రువో మృత్యుః, నైనం చిందంతి శస్త్రాణి, కృష్ణా నది, బీచుపల్లి, గాయత్రి ఆశ్రమం, ఉత్తర కర్మలు, జీవితం మరణం, ఆధ్యాత్మిక కథ, తాత్విక కథ, సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు, తల్లి అనుబంధం, కుటుంబ కథ, భావోద్వేగ కథ, తెలుగు సాహిత్యం, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'వాసాంసి జీర్ణాని...' కథలో తల్లి అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేస్తున్న ముగ్గురు సోదరులు, భగవద్గీత తత్వం మరియు తల్లి ప్రేమను ప్రతిబింబించే భావోద్వేగ ఆధ్యాత్మిక దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'వాసాంసి జీర్ణాని...' కథలో తల్లి అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేస్తున్న ముగ్గురు సోదరులు, భగవద్గీత తత్వం మరియు తల్లి ప్రేమను ప్రతిబింబించే భావోద్వేగ ఆధ్యాత్మిక దృశ్యం.

Vasamsi Jeernani... - Telugu Emotional family Story | Ramana Bandhakavi

వాసాంసి జీర్ణాని... తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | రమణ బంధకవి

Published in manatelugukathalu.com on 25/06/2026


మరణం అనేది ముగింపా? లేక మరో ప్రయాణానికి ఆరంభమా? తల్లి మరణానంతరం అస్థి నిమజ్జనం కోసం బయలుదేరిన ముగ్గురు సోదరుల ప్రయాణంలో విశ్వాసం, శాస్త్రీయ దృక్పథం, భగవద్గీత తత్వం, తల్లి ప్రేమ, ఆత్మ శాశ్వతత్వం వంటి గంభీరమైన ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. హృదయాన్ని తాకే సంభాషణలతో, జీవితం గురించి లోతుగా ఆలోచింపజేసే బంధకవి రమణ గారి అద్భుత కథ "వాసాంసి జీర్ణాని...".


గాయత్రి ఆశ్రమం ప్రాంగణంలో ఇంకా వెలుతురు పూర్తిగా పరచుకోలేదు. చెట్ల కొమ్మలపై కాకులు అప్పుడప్పుడు కేకలు వేస్తున్నాయి. హోమగుండం నుంచి పైకి లేస్తున్న పొగ, సమిధల వాసన కలసి ఒక విచిత్రమైన వాతావరణాన్ని సృష్టించాయి.

బ్రహ్మగారు మంత్రాలు చదువుతున్నారు. నేను మంత్రాలు వింటున్నాను. కానీ నా మనసులో మాత్రం మరో స్వరం వినిపిస్తోంది.


"జాగ్రత్తగా వెళ్ళు నాన్నా..." 


ఎన్నిసార్లు విన్నానో ఆ మాట.


అమ్మ చనిపోయి వారం రోజులు అయింది. శరీరం అగ్నికి ఆహుతి అయిపోయింది. మిగిలింది కొన్ని అస్థికలు మాత్రమే.


కానీ ఆ స్వరం? ఆ ప్రేమ? ఆ అనుబంధం? అవి కూడా అగ్నిలో కాలిపోయాయా?

ఆల్వాల్ స్వర్గధామంలో అమ్మ పార్థివ దేహానికి వీడ్కోలు చెప్పాక, గాయత్రి ఆశ్రమంలో రోజూ నేనూ, అన్న రాఘవ, తమ్ముడు గోవిందు ఉత్తర కర్మలు జరిపిస్తున్నాము.


“ఇక్కడ ఈ పని అయ్యాక మనం ఆల్వాల్ స్వర్గధామం వెళ్లి అస్థికలు తీసుకుని, అక్కడి నుండి బీచుపల్లి వెళ్దాం. అక్కడ కృష్ణమ్మలో అస్థి నిమజ్జనం. బ్రహ్మగారు అక్కడ పురోహితుడితో చేయవలసిన కార్యక్రమం మాట్లాడి పెట్టారు” అన్నాను.


“అస్థికలు ఉంచిన లాకర్ రసీదు ఎవరి దగ్గర ఉంది?” అని అడిగాను.


“నా దగ్గర ఉంది” అన్నాడు రాఘవ.


ముగ్గురూ నా కారులో బయలుదేరాము. ఆల్వాల్ స్వర్గధామం చేరేసరికి ఉదయం ఎనిమిది గంటలు అయింది. అస్థికల పాత్ర తీసుకుని రావడానికి రాఘవ, గోవిందు లోపలికి వెళ్ళారు. నేను కారులో కూర్చున్నాను. స్వర్గధామం ప్రవేశ ద్వారం దగ్గర చిద్విలాసం చిందిస్తూ, సుమారు ముప్పై అడుగుల మహాశివుడి విగ్రహం ఉంది. 'అందరూ చివరకు చేరేది నా సన్నిధికే' అన్న భావం ఆయన ముఖంలో కనబడుతోంది.


చేతిలో అస్థికల పాత్ర భద్రంగా పట్టుకుని గోవిందుతో పాటు రాఘవ బయటకు వచ్చాడు. గోవిందు నా పక్కన ముందు సీటులో కూర్చున్నాడు. రాఘవ వెనక సీటులో కూర్చుని, అస్థి పాత్రను పక్క సీటుపై పెట్టి ఒక చేయి వేసి పట్టుకున్నాడు.


“పాత్ర పక్కకి పడిపోకుండా చూడు” అని రాఘవతో చెప్పి కారు స్టార్ట్ చేశాను.


కరీంనగర్ రాజీవ్ రహదారిపై నా హోండా సివిక్ కారు వేగంగా దూసుకుపోతోంది. ఒకసారి అస్థి పాత్ర వైపు చూశాను. మిగిలిన తన పాంచభౌతిక అస్తిత్వంతో అమ్మ, గుడ్డతో మూతి బిగించిన ఆ కుండలో భద్రంగా సమాధి స్థితిలో ఉన్నట్లు ఉంది.


అమ్మ ఆలోచనలు నా మెదడును కమ్మివేశాయి. సుమారు అరవై ఏళ్ల మా బంధంలో, గతించిన ముప్పై పైచిలుకు సంవత్సరాల అనుబంధం ఇంకా బలీయమైనది. నాన్నగారు చనిపోయిన తరువాత అమ్మ నా దగ్గరే ఉందని చెప్పొచ్చు. మా పిల్లలు ఆవిడ పర్యవేక్షణలోనే పెరిగి పెద్దయ్యారు. కనుక ఆవిడ లేని వెలితి నన్ను వెంటాడుతోంది. పొంగి వచ్చే కన్నీటిని అణచుకుని భగవద్గీత శ్లోకం మననం చేసుకున్నాను.


“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ....”


పుట్టినవారు మరణించక తప్పదు, మరణించినవారు పుట్టక తప్పదు. అయినా, తనవాళ్ళ మరణం మనిషిని క్రుంగదీస్తూనే ఉంటుంది.


వాహనాల రద్దీ తక్కువగా ఉండటం వలన నేను కారు కొంచెం స్పీడుగా నడుపుతున్నాను. ఎందుకంటే, బీచుపల్లి 11.30 కల్లా చేరాలి. లేకపోతే అక్కడి పంతులుగారు వెళ్ళిపోతారు. వాతావరణం మబ్బు పట్టి, నా మనసులానే గజిబిజిగా ఉంది.


“కాసేపు రోడ్డు పక్కన ఆపి కాఫీ తాగుదాం” అన్నాడు గోవిందు.


మా ముగ్గురివి మూడు భిన్న ప్రపంచాలు. నేను ఆస్తికుణ్ణి. గోవిందు హేతువాది. రాఘవ మా ఇద్దరి మధ్య చిక్కుకున్న శాంతిదూత. గోవిందు ఈ కర్మకాండలు అవీ, ఫ్యామిలీ కోసం ఏదో తన వంతుగా మాతో కలసి చేస్తున్నాడు.


ఇంటి దగ్గర నుండి వచ్చేప్పుడు ఫ్లాస్క్ లో వేడి కాఫీ, కాసిని బిస్కెట్స్ తెచ్చుకున్నాం. రోడ్డు పక్కన కొంచెం చెట్టు నీడన కారు ఆపి, బిస్కెట్లు తిని కాఫీ త్రాగి బయలుదేరాం. వెనుక సీట్లో అమ్మ తాలుకు ఆఖరి భౌతిక ఆనవాళ్లు ఉన్న అస్థి పాత్ర కేసి ఒకసారి చూశాను. 


ఎన్నో వందల సార్లు నా కారులో వెనుక సీట్లో కూర్చుని, ఎన్నో విషయాలు మాట్లాడుతూ, అప్పుడప్పుడు జాగ్రత్తగా నడపమని హెచ్చరికలు చేసేది. ఇప్పుడు మౌనంగా తను చేరవలసిన గమ్యం వైపు నా కారులో ఆఖరి ప్రయాణం చేస్తోంది. హృదయం ఆర్ద్రమైంది. కనులకు కమ్మిన నీటి పొరను కనురెప్పలతోనే చిదిమేసాను. మౌనాన్ని చీలుస్తూ గోవిందు అడిగాడు;


"నువ్వు నిజంగానే అమ్మ ఇంకా ఎక్కడో ఉందని నమ్ముతున్నావా?" 


అతని ప్రశ్నలో వెటకారం లేదు, నిజమైన కుతూహలం ఉంది.


"అవును" అన్నాను.


"ఎక్కడ ఉంది?"


"నాకు తెలియదు."


"తెలియకపోయినా నమ్ముతున్నావా?"


"అవును."


"అదే నాకు అర్థం కాదు. మెదడు పనిచేయడం ఆగిపోయింది. జ్ఞాపకాలు పోయాయి. ఆలోచనలు పోయాయి. శరీరం కూడా లేదు, మరి మిగిలింది ఏమిటి?"


"ఆత్మ" అన్నాను గంభీరంగా.


"ఆత్మ ఉందని ఎవరు చూశారు?" అడిగాడు గోవిందు.


"ప్రేమని ఎవరు చూశారు?" అన్నాను నేను.


"ప్రేమ ఒక భావోద్వేగం. మెదడులోని న్యూరాన్ల రసాయనిక చర్య." అన్నాడు.


"సరే. ఈ క్షణం నేను అనుభవిస్తున్న బాధ కూడా రసాయనిక చర్యేనా?"


"శాస్త్రీయంగా చెప్పాలంటే అవును."


"అయితే అమ్మ బతికున్నప్పుడు మనం అనుభవించిన ప్రేమ కూడా అదేనా?"


"అవును."


"గోవిందూ, వీణలో సంగీతం వినిపిస్తే తీగలు కంపిస్తున్నాయని శాస్త్రం చెబుతుంది. కానీ ఆ సంగీతం మనసుని ఎందుకు కదిలించిందో పూర్తిగా చెప్పలేకపోతుంది."


"తెలియకపోవడం వల్ల ఆత్మను మధ్యలో తీసుకురావడం సరైన వాదన కాదు."


"అవును. కానీ తెలియనిది లేదని చెప్పడం కూడా సరైన వాదన కాదు."


రాఘవ మధ్యలో కలగజేసుకున్నాడు.

"మీ ఇద్దరూ ఇక ఆపండి బాబూ?" అన్నాడు విసుగ్గా.


"మీ ఇద్దరినీ చూస్తుంటే గీతా వ్యాఖ్యానం, సైన్స్ కాంగ్రెస్ రెండూ ఒకే కారులో ప్రయాణిస్తున్నట్టుంది." అన్నాడు రాఘవ బుర్ర గోక్కుంటూ. కొద్దిసేపు మౌనం నెలకొంది.


ఎనభై మూడేళ్ళ పైచిలుకు జీవితంలో అమ్మ పాపం చివరి ఐదేళ్లు మంచం మీదే గడిపింది. మరి జీవుడు అలాంటి శిధిల పంజరాన్ని ఎంతకాలం అంటిపెట్టుకుని ఉంటాడు!


“వాసాంసి జీర్ణాని యధా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి..” గీతా శ్లోకం మనసులో మెరిసింది. మానవుడు జీర్ణ వస్త్రాలను వదిలేసి కొత్త బట్టలు తొడుక్కున్నట్లు, జీవుడు పాత శరీరాలను వీడి కొత్త శరీరాలను పొందుతాడు. పాపం ఈవిడ మళ్ళీ ఎప్పుడు ఎక్కడో?


సమయం పదకొండు దాటింది. అదుగో కృష్ణా నదిపై వంతెన వస్తోంది. కుడి వైపు తిరిగి నది ఘాట్ అని ఉన్న సైన్ పోస్ట్ అనుసరించి ముందుకు వెళ్లాను. అక్కడ ఒక చిన్న మండపంలో ఎంతోమంది గుమికూడి ఉన్నారు. గట్టిగా మంత్రాలు వినబడుతున్నాయి.


మా బ్రహ్మగారు చెప్పిన పురోహితుడికి ఫోన్ చేసి ఆయన్ను ఆ మండపంలో పట్టుకున్నాం. మా పంతులుగారు సుమారు ముప్పై ఏళ్ల వయసు ఉంటుందేమో, ఓ ముగ్గురు బృందాలను మూడు వైపులా కూర్చోబెట్టుకుని రిలే పద్ధతిలో మంత్రాలు చదివి కార్యక్రమం చేయిస్తున్నాడు.


ఈ వ్యవహారం అంతా చూసి గోవిందు ముఖం విసుగ్గా పెట్టి “ఇటువంటివి నా వల్ల కాదు. నేను ఆ మూల కూర్చుంటాను, మీరు కానివ్వండి” అన్నాడు. 


ఈ లోగా మమ్మల్ని దీక్షా వస్త్రాలు కట్టుకుని నదిలో స్నానం చేసి రమ్మన్నారు బ్రహ్మగారు.


మేము అక్కడికి వెళ్లి చూసేసరికి పరిస్థితి భీతావహంగా ఉంది. ప్రవాహం లేకపోవడం వలన నిలవ నీళ్లు మురికిగా ఉన్నాయి. నీటి నిండా విప్పేసి పడేసిన రకరకాల వస్త్రాలు, పూజా సామాన్లు తేలుతున్నాయి. గోవిందుకి ఒళ్ళంతా కంపరంగా ఉంది. వచ్చేప్పుడు రెండు లీటర్ల సీసాలో డెట్టాల్ నీళ్లు కలిపి తెచ్చాడు. ఈ నీళ్ళలోకి దిగేదిలేదన్నాడు. 


కానీ ఏ కళ నున్నాడో తరువాత మనసు మారి "ముందు మీరు చెయ్యండి" అన్నాడు.


 రాఘవ, నేనూ మెల్లగా నీటిలోకి దిగి కాళ్ళకు పాముల్లా చుట్టుకుంటున్న గుడ్డ పీలికలు వదిలించుకుంటూ వీలైనంత దూరం వెళ్లి భక్తిగా మునిగి వచ్చాం. వచ్చిన వెంటనే గోవిందు మా తల నుండి క్రింది దాకా డెట్టాల్ నీళ్ళతో సంప్రోక్షణ చేశాడు. తరువాత ముఖం ముటముటలాడిస్తూ, అడుగులో అడుగు వేసుకుంటూ, అడ్డు వచ్చే చీరలు, లుంగీల నుండి ఒడుపుగా తప్పించుకుంటూ ఏదో అయిందనిపించి హడావిడిగా వచ్చి డెట్టాల్ నీళ్ళతో స్నానం చేశాడు.


తరువాత మండపంలో నేనూ రాఘవ, పంతులుగారు చెప్పిన విధులు పూర్తి చేసి, ముగ్గురూ కలసి అస్థికలు భక్తిగా నదిలో నిమజ్జనం చేశాం. అమ్మకు ఆఖరిసారి వీడ్కోలు పలికాము. పంచభూతాల నుండి వచ్చిన ఉపాధి తిరిగి పంచభూతాలలో కలసిపోయింది. నిమజ్జనం పూర్తయిన తరువాత నేను నదిలో కలుస్తున్న అస్థికల వైపు చూస్తూ నిలబడ్డాను. అవి నీటిలో కలిసిపోతున్నాయి. ఆ క్షణంలో ఒక ప్రశ్న మళ్లీ నా మనసులో మెరిసింది.


ఈ నీటిలో కలిసింది అమ్మేనా? లేక అమ్మ వదిలిపెట్టిన ఒక పాత వస్త్రమా? సమాధానం నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు. ఈ ప్రపంచంలో నన్ను నిస్వార్థంగా ప్రేమించిన ఒక శక్తి ఉంది. దానికి నేను "అమ్మ" అని పేరు పెట్టుకున్నాను. అటువంటి ప్రేమ పూర్తిగా నశించిపోతుందని నా హృదయం ఒప్పుకోలేదు.


“నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః”


ఆత్మను ఆయుధాలు చీల్చలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఎండించలేదు.


మరొక్కసారి గీతా వాక్యాలు నా మనసుకు ఊరట కలిగించాయి. కృష్ణమ్మ తల్లికేసి చూస్తుంటే గోవిందు అందుకున్నాడు:

“బాగా చూడండి. మీ కృష్ణమ్మ తల్లి దురవస్థ ఎలా ఉందో. ఏమాత్రం ఇంగితంలేని ఈ మనుష్యులు నీటిని ఎంత కలుషితం చేస్తున్నారో. నాకు ఒళ్ళు మండిపోతోంది. ఈ అజ్ఞానులను ఎవరు మార్చగలరు! చూడు చూడు...అతగాడ్ని చూడు...ఇప్పుడే నదిలో స్నానం చేసి బయటకు వచ్చి, కట్టుకున్న లుంగీ, చడ్డీ విప్పేసి నీళ్ళలోకి కసిగా ఎలా విసిరేస్తున్నాడో. అతడిని ఏం చేయగలదు మీ కృష్ణమ్మ?” అనుకుంటూ విసవిసా నడిచి కారు వైపు వెళ్ళిపోయాడు.


కృష్ణమ్మ కేసి మరొక్కసారి భక్తిగా చూసి దండం పెట్టుకున్నాను.

“కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి”


లోకంలో చెడ్డ పుత్రులు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లులు ఎప్పుడూ ఉండరు. ఎంత సత్యం! పిల్లవాడు తల్లిని ఎత్తుకున్నప్పుడు ఆవిడ మీద మలమూత్ర విసర్జన చేస్తాడు. కానీ ఆ తల్లికి కోపం రాదు. ఎందుకంటే ఆవిడ తల్లి కనుక.


“అమ్మా కృష్ణమ్మా, తెలిసో తెలియకో నీ పట్ల ఘోరమైన తప్పులు చేసే ఈ నీ పిల్లలను దయతో క్షమించి కాపాడు” అని భక్తిగా నమస్కరించాను. కృష్ణమ్మ, తల్లిలా దయతో నవ్వుతున్నట్లు నాకు అనిపించింది. తృప్తిగా కారు వైపు నడిచాను.


***

రమణ బంధకవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రమణ బంధకవి
రమణ బంధకవి

రచయిత పరిచయం: రమణ బంధకవి

రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కథలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు, రెండు అనువాద నవలలు ప్రచురింపబడ్డాయి. రెండు స్వీయ నవలలు ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయి. ఒకటి 'సంచిక' వెబ్ మాగ్జైన్ వార పత్రికలో ధారావాహికగా వస్తోంది. ఇంకోటి 'ప్రతిలిపి' లో ధారావాహికగా వస్తోంది.

7 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని మధురమైన క్షణాలు అంతులేని ప్రేమను పంచే అమ్మ ప్రేమను మించిన తీపి జ్ఞాపకం ఈ లోకంలో మరొకటి లేదు."

అలాగే అమ్మను , కోల్పోయిన వేళ భరించలేని భాధ వర్ణణాతీతం.

"శరీరం నశించినా, వారి జ్ఞాపకాలు ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి.

అంతులేని ప్రేమను పంచే అమ్మ ప్రేమను మించిన తీపి జ్ఞాపకం ఈ లోకంలో మరొకటి లేదు."

ఆస్తికులైన, నాస్తికులైన అమ్మ అంటే అద్భుతమైన వరం. 🙏🏻

Like

Rated 5 out of 5 stars.

చాలా మనసు కదిలించిన కథ . తల్లి పట్ల రచయిత కున్న ప్రేమ ఆమె మరణం వలన మనసులోని బాధ మరియు వోదార్పు చాలాచక్కగా వ్యక్తీకరణ చేశారు. మనకు అత్యంత ప్రియమైన మనుషులు శాశ్వతంగా దూరమైన సందర్భంగా మన మనసులో జరిగే అంతరమథనం యీ కథ .

Like
Replying to

ధన్యవాదాలు భవానీ గారు.

Like

Rated 5 out of 5 stars.

Chala shradda gaa, mee manasuloni bhavalu , addbhutam gaa avishkarinchaaru!! Congratulations!!


Every section of the people, everywhere in the world have their own way of bidding fare well to the gone people folllowing their own customs and traditions. Whatever way the religious practices could be, the inner feeling is same. That is Love and Affection and expression of respect. It is about remembering the cherished moments with the gone people and a way of consoling ourselves that enables us better to move on. In this process, there should not be debates and discussions and judgments on right/wrong. The author has indirectly made the readers to think in those lines of thought process.


However, The author has used the references to…


Edited
Like
Replying to

Thanks Srinivasu Garu for an excellent, detailed and thought-provoking review. The feelings of love and associated emotions are universal. The rituals of bidding farewell to the departed Soul are culture-dependent as you rightly commented. Every story narration invariably depends on certain props to create a kind of healthy distraction. Some people mention about a cow grazing in the nearby meadow, a girl playing in the courtyard, an old man sitting in front of a thatched house, etc. You can consider Honda Civic as such a trivial distraction. More so, all the three are leading a materialist life like any other. If these had to take a train-they would have taken a 'Vande Bharat' or by bus, they would have take…

Like

Rated 5 out of 5 stars.

రమణగారు, గుండె   బరువెక్కించే కథను అందించారు.. తల్లి అస్థికలు నదిలో కలిపేటప్పుడు ఆవిడ ముగ్గురు పిల్లల మానసిక స్థితి  , ‘న హన్యతే  హన్యమానే శరీరే ‘ అని నమ్మే ఒక కొడుకు మనసులో జరిగే తత్వ విచారణ, హృద్యమైన మాటలతోను, జ్ఞానపూరితమైన భగవద్గీత శ్లోకాలతో, జనన మరణ చక్రాల గురించి ఆలోచింపజేసే విధంగా వుంది.


Like
Replying to

ధన్యవాదాలు రత్నా గారు. స్వంత అనుభవాలు, అనుభూతులనుండి పుట్టే కథలు జీవితాలకు దగ్గరగా ఉంటాయి. మీకు నచ్చినందుకు సంతోషం.

Like
bottom of page