top of page
Original.png

సూర్యకాంత పువ్వు


గ్రామీణ వాతావరణంలో పేదలకు భోజనం అందిస్తున్న శారదపిన్ని, ఆమెను కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు మరియు ప్రతీకాత్మకంగా వికసిస్తున్న సూర్యకాంతి పువ్వు

Suryakantha Puvvu - Telugu Inspirational Story | Madhupatra Sailaja Uppaluri

సూర్యకాంత పువ్వుతెలుగు ప్రేరణాత్మక కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 09/08/2026


మనసులోని మంచితనం పరిస్థితులు మారినా మారుతుందా?కొంతమంది మనుషులు కాలంతో పాటు తమ జీవిత విధానాన్ని మార్చుకుంటారు. కానీ ఇతరులకు సహాయం చేయాలనే వారి మనసు మాత్రం ఎప్పటికీ మారదు.

“సూర్యకాంత పువ్వు” కథలో చిన్ననాటి స్నేహితులైన ఆదిత్య, రఘు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రుద్రవరం గ్రామానికి తిరిగి వస్తారు. అక్కడినుండి  కథ  ఆసక్తికరంగా  సాగుతుంది.


ఆ రోజు ఆదివారం! ఆదిత్య వాళ్ళింటికి అతని చిన్ననాటి స్నేహితుడు రఘు వచ్చాడు. ఆదిత్య తండ్రి నీలకంఠంగారు హాల్లో కూర్చుని పేపరు చదువుతూ, పక్కనే ఉన్న సిస్టంలో రఫీ మధురమైన గాత్రంలో తనకిష్టమైన హిందీ పాటలను వింటూ తన్మయత్వంలో ఉన్నారు. 


రఘును చూసి “రావోయ్ రఘు! అమ్మానాన్నగార్లు కులాసానా?” అంటూ పలకరించారు. 


"బాబాయిగారూ నమస్కారమండి. మా వాడు ఉన్నాడా?" అని అడిగాడు రఘు.

“మీ స్నేహితుడు పైగదిలో ఉన్నట్లున్నాడు, వెళ్ళు” అంటూ రఘూతో కాస్సేపు ముచ్చట్లాడి పంపించారు.


“ఏరా ఆదిత్యా! ఎంత సెక్షన్‌హెడ్‌వైనా అన్నీ మీదేసుకుని ఇంటిని అఫీసులా మార్చేస్తే ఎలారా?” అంటూ పైగదిలోనున్న స్నేహితుని దగ్గరకు వచ్చాడు రఘు. 


“ఒరేయ్ రఘు! నీ మాటలు వినిపించి ఇందాకే కిందకు వద్దామనుకున్నా, కానీ ఇవి కాస్త అర్జెంట్ ఫైల్స్‌రా. రాత్రంతా కూర్చున్నా కొన్ని మిగిలిపోయాయి. కింద నువ్వు నాన్నగారితో కబుర్లాడేలోగా పూర్తిచేసేద్దామని కదల్లేదురా” అంటూ లేచి స్నేహితునికి ఎదురొచ్చాడు ఆదిత్య.


“తమరెప్పుడూ మా ఇంటికి రారు. కనీసం ఈ కుచేలుడన్నా వచ్చి పలకరిస్తే బాగుంటుందని వచ్చానురా” అన్నాడు రఘు. 


“అబ్బో! ఇద్దరు పిల్లలుండేసరికే నువ్వు కుచేలుడివైపోయావా? పరిహాసానికైనా నేను నీ ఇంటికి రాలేదని అనకురా!” అన్నాడు ఆదిత్య. 


“నిన్ను బాధపెట్టాలని అనలేదురా ఆదిత్యా. అంత ఇదై పోతావేమిటిరా?” అన్నాడు రఘు. 


ఆదిత్య తాతగారు కృష్ణాజిల్లాలోని రుద్రవరం అనే గ్రామంలో 25 ఎకరాల భూస్వామి. ఆయన కొడుకు నీలకంఠంగారు రిటైరైన తరువాత నాన్నగారికి వ్యవసాయపనులలో సాయం చేస్తూ ఉండేవారు. 


అందువల్లే ఆదిత్య రుద్రవరం గ్రామంలోని హైస్కూలు చదువు తరువాత, హాస్టల్‌లో ఉండి చదువుకుని అన్ని పరీక్షలలోనూ మంచి మార్కులను సాధించి తరువాత గ్రూప్ 1 ఆఫీసర్‌గా ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆదిత్య తాతగారు చనిపోయాక పొలాన్ని కౌలుకిచ్చేసి అంతా హైదరాబాద్‌లో ఆదిత్య దగ్గరే ఉంటున్నారు. 


కనుకనే ఆదిత్యకు బాల్యం అంతా ఓ బంగారు జ్ఞాపకంగా మిగిలింది. ఆ బాల్యంలోని కొన్ని గుర్తులనైనా తన భార్యాపిల్లలకు అందించాలన్నది ఆదిత్య కోరిక. ఒకరికి సెలవలొస్తే మరియొకరికి సెలవు దొరకక ఇన్నేళ్ళలో రుద్రవరం గ్రామాన్ని తొంగి చూడటం కుదరలేదు.


“ఓసారివెళ్ళొస్తే ఊరిమీద తనకున్న బెంగ కాస్తయినా తగ్గుతుందేమో చూడాలి” అనుకుంటూ మెట్లు దిగుతున్న మిత్రుణ్ణి “ఏమిటిరా ఆదిత్యా ఊహల్లోకి వెళ్ళిపోయావా ఏమిటి? మాటా పలుకు లేదు” అంటూ ఆదిత్యను తిరిగి వర్తమానంలోకి తీసుకొచ్చాడు రఘు. 


అప్పుడే స్నానానికి వెళ్తున్న నీలకంఠంగారితో ఆదిత్య “నాన్నగారూ! రఘుతోకలసి, మన ఊరికి వెళ్ళొద్దామనుకుంటున్నాను. మీరు కూడా వస్తారా?” అని అడిగాడు. 


“చాలా సంతోషం నాయనా. తప్పక వెళ్ళిరండి. ప్రయాణాలు చేయటం నా వల్ల కాదురా! అమ్మాయి ఇక్కడే ఉంటుందిగా. మీరెళ్ళిరండి” అంటూ స్నానానికి వెళ్ళి పోయారు నీలకంఠంగారు. 


“మనం శుక్రవారంనాడు స్టేషన్‌లో కలుద్దాం. ఇక ఉంటానురా” అంటూ రఘు వెళ్ళిపోయాడు. 


శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ‘రుద్రవరం’ అన్న బోర్డున్న ప్రదేశాన పల్లెవెలుగు బస్ దిగారు స్నేహితులిద్దరూ. 


“ఊరు కాస్త పెరిగినట్లనిపిస్తోంది కదరా?” చుట్టూ పరిశీలనగా చూస్తూ అన్నాడు రఘు. 

వీరి రాకకై ఎదురుచూస్తున్న కౌలురైతు స్వామి “బాబుగారూ ప్రయాణం బాగా జరిగిందా?” ఆదిత్య చేతిలోని సూట్‌కేస్‌నందుకుంటూ అడిగాడు. 


“మీ కోసం గదిని శుభ్రంచేసి ఉంచాను. స్నానాలుచేసి రండి” అంటూ ఆదిత్యకు గది చూపించి, “బాబూ నాకు పొలానికి ఎరువులు జల్లే పని వుంది. మీకు తోడుగా మా బాలిగాడు ఉంటాడు. వాడికి ఊరంతా తెలుసు. మీకు అన్నీ చూపిస్తాడు” అంటూ వెళ్ళిపోయాడు. 


“మన చిన్నప్పుడు ఊరి చుట్టూ తాటితోపులు ఉండేవి. మీ పాలేరు భద్రంతో కలసి మన పొలంలోని తాటిచెట్ల దగ్గరకు వచ్చి, తాటిముంజలు అతను కొట్టిస్తే తినే వాళ్ళంగుర్తుందా? ఎండ కష్టం అతనిది. చల్లదనమంతా మనది అన్నట్లు ఉండేవి ఆరోజులు” అన్నాడు రఘు.


ఇంతలో చుట్ట కాల్చుతున్న ఒకతను వీళ్ళ మాటలకు అడ్డువస్తూ, "బాబూ నా పేరు బాలయ్యండి. సిటీ నుండి వచ్చింది మీరేనా? మీరిప్పుడు చెప్పుకుంటున్న ఆ భద్రం కొడుకును నేనేనండి. రెండేళ్ళ క్రితం మా నాన్న పాము కరిచి చనిపోయాడండి. నిన్ననే మన స్వామిగారి ద్వారానే మీరు వస్తున్నట్లుగా నాకు తెలిసింది. మీరు తయారైతే రాంబాబు గారింటికి తీసుకువెడతాను" అన్నాడు.


“అరే భద్రం చనిపోయాడా? మరి స్వామి మాటమాత్రం కూడా నాన్నగారితో చెప్పలేదే? విషయం తెలిస్తే ఆయన చాలా బాధపడతారు” అన్నాడు ఆదిత్య. 


స్నానం చేసి కాఫీటిఫెన్లు పూర్తిచేసి బాలయ్యతో రాంబాబును కలవటానికి బయలుదేరారు మిత్రద్వయం.


“ఆ కొబ్బరి చెట్లమధ్యనున్న డాబాఇల్లే రాంబాబుగారిది” అంటూ అంతలోనే మాయమయ్యాడు బాలయ్య. 


“అరే బాలయ్య ఏడిరా? ఇంటివరకూ రాకుండా ఇలా మంత్రం వేసినట్లుగా ఎలా మాయమయ్యాడు?” రఘుతో అన్నాడు ఆదిత్య ఆశ్చర్యపోతూ. 


“మన రాంబాబు చేసేది వడ్డీవ్యాపారం కదరా. మనవాడి దగ్గర అప్పేమైనా తీసుకునుంటాడు. అందుకే మనవాడికి కనపడకుండా వెళ్ళిపోయుంటాడు” అన్నాడు రఘు. 


“అయినా ఏమిటిరా ఇది? పేదవాళ్ళను వడ్డీ కోసం బాధ పెట్టటం? మనం నేర్చుకున్న సంస్కారం ఏమయ్యింది?” అంటూ బాధపడ్డాడు ఆదిత్య. 


మిత్రుల రాకకై ఎదురుచూస్తున్న రాంబాబు వీళ్ళను చూస్తూనే విప్పారిన ముఖంతో “రండి, రండి..” అంటూ “ఎంతకాలానికి వచ్చారురా? ఏమైనా పనిమీద వచ్చారా?” అంటూ వీళ్ళ రాకకు కారణాలను వెతుకుతూ అడిగాడు. 


“వేరే పనేమీ లేదురా! ఊరిని చూసి, మన స్నేహితులను కలవాలని వచ్చాంరా. నీ కబుర్లేమిటి? మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చిన బాలయ్య నీ ఇల్లు చూపించి క్షణంలో మాయమయ్యాడు. నువ్వంటే ఊరివాళ్ళకు అంత భయమా?” నవ్వుతూ అడిగాడు రఘు. 


“హాయిగా కాలు కదపకుండా, కడుపులో చల్ల కదలకుండా ఇంటిపట్టునే ఉండి నాన్నగారు చేసే వడ్డీవ్యాపారాన్నే చేసుకుంటున్నాను” అన్నాడు రాంబాబు. 

"హాయిగా ఉండటమంటే నిజంగా ఇదేనా? ఎందుకంటే నీ ఇల్లు చూపించటానికి వచ్చిన ‘బాలయ్య’, నీ ఇల్లు చూపించిన క్షణంలో మాయమయ్యాడు. 


గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పు. నువ్వు అతనికిచ్చిన వడ్డీనో, అసలో అడుగుతావనే కదా వాడలా వెళ్ళిపోయింది. 


ఊరివాళ్ళను భయపెట్టటమేనా నీవు అనుభవిస్తున్న హాయి? మనకి మన గురువులు చెప్పిన మాటలనన్నింటినీ నీటిమూటలు చేశావా? ఓ పేదవాడి కష్టాన్ని మన ఆనందంగా మార్చుకోవద్దురా?" రాంబాబుతో బాధగా అన్నాడు ఆదిత్య.


“ఛా! ఆలాంటిదేమీ లేదురా? వారానికోసారి వచ్చి ఆ బాలిగాడు మా దొడ్డినంతటినీ శుభ్రం చేస్తాడు. అలాంటిది గత నెలరోజులుగా అసలు నాకు కనిపించనే లేదు. ఆ విషయమడుగుతాననే నాకు కనిపించకుండా వెళ్ళిపోయుంటాడు. 


అయినా వాడెక్కడికి పోతాడు. వెనక గుమ్మం ద్వారా వచ్చి నా భార్యతో వాడి బాధలను జాలిగా ఏకరువుపెట్టి, ఆమె మనసును కరిగించి, ఆమెతో కలసి మనముందుకొస్తాడు చూస్తూండండి. 


మన ముగ్గురి దేహాలు వేరైనా భావాలు మాత్రం ఒక్కటేరా! ఆ దేవుడి దయవల్ల ఆరోజుకి ఈరోజుకీ ఆ భావాలలో మార్పు రాలేదు. ఇకముందు రాబోదు కూడా. మన ద్వారా ఇతరులకు బాధ కలిగించవద్దని మనమానాడు తీసుకున్న ప్రతిజ్ఞ నేనేనాడు మరచిపోలేదురా ఆదీ!” అన్నాడు రాంబాబు. 


రాంబాబు మాటలు పూర్తికాకముందే అతని భార్య వెనకాల చేతిలో మజ్జిగ గ్లాసులతో వచ్చిన బాలయ్య అందరికి మజ్జిగనందించాడు. రాంబాబు కళ్ళతోనే ఆదిత్యను “విషయం అర్ధమయ్యిందిగా” అనడిగాడు. ముగ్గురూ కలసి ఊళ్ళోకి బయలుదేరారు. 

కాలువగట్టున ఉన్న పున్నాగపూల వాసనలను ఆఘ్రాణిస్తూ నడుస్తున్న రఘు, “మన శారదపిన్ని ఎలా ఉన్నారురా రాంబాబూ?” అని అడిగాడు. 


“ఆవిడకు వయోభారం వచ్చింది. కానీ బాగానే ఉన్నారురా రఘూ” అన్నాడు రాంబాబు. 


“అదిగో ఆ గన్నేరుచెట్ల పక్కనున్న అరుగుల ఇల్లు మన శారదపిన్నిదే కదా! ఏమాత్రం మార్పు లేదు” ఆనందంగా అన్నాడు ఆదిత్య. 


“ఒరే! గోదావరి జిల్లాలలో 'డొక్కా సీతమ్మ’గారికి ఎంత గొప్ప పేరుందో మన శారదపిన్నికి కూడా అంతే పేరుందీ ఊరిలో” అన్నాడు రఘు. అతని మాటలలో ఆమె గురించిన ఆత్మీయరాగం వినిపించింది అందరికి. 


“నువ్వు చెప్పింది నిజమేకదరా! మనం చదువుకునే రోజులలో వారి ఇంటిమీదుగా స్కూలుకు వెళ్ళేవాళ్ళని ‘ఇటురండిరా’ అంటూ గట్టిగా పిలిచి, వాళ్ళ ముఖాలలో తన ముఖాన్ని పెట్టి పరీక్షగా చూసి ‘ఇవాళ అన్నం తినకుండా వచ్చారు కదా. పదండి అన్నం తిని స్కూలుకు వెళ్ళండి వెర్రిభడవల్లారా’ అంటూ ఆ అరుగులమీద పిల్లనందరినీ కూర్చోబెట్టి, అందరికీ బాదంఆకులలో అన్నంపెట్టి పంపేదా మహాతల్లి. 


చుట్టుపక్కల ఊళ్ళనుండి వచ్చే బీదవారిని, ఆ రోజు మధ్యాహ్నభోజనం తెచ్చుకోని పిల్లలను పిలిచి మరీ అన్నం పెట్టేది శారదపిన్ని. ఆమెకి బాల్యవివాహం జరిగింది. పిల్లాజెల్లా కలగకుండానే భర్త మరణించాడు. 


తమ్ముణ్ణి, మరదల్ని తనకు ఆసరాగా తనదగ్గరే ఉండమని, వారి బాగోగులను తానే చూసుకుంది. పిల్లలంటే ఆవిడకు మహా ఇష్టం. భర్తకున్న పదెకరాల వ్యవసాయం తమ్ముడు చూసుకుంటూంటే, తాను స్వేచ్ఛగా ఇలా వండివారుస్తూ ఆత్మానందాన్ని పొందేవారు. 


తమ్ముడు అక్కను అర్థం చేసుకున్నాడు, కానీ అతని భార్య మాత్రం “ఇలా దానధర్మాలు చేసుకుంటూపోతే చివరికి మనపిల్లలకు ఏమి మిగులుతుంది?” అని బాధపడేది. శారదపిన్ని భోజనం నెలలో మూడుసార్లయినా నేను తినేవాణ్ణి” అంటూ చెప్పుకొచ్చాడు రాంబాబు. 


“ప్రతి ఏకాదశినాడు ఆమె ఉపవాసం ఉండేది. ద్వాదశి రోజు చక్కగా పరమాన్నం వండి అందరికీ పెట్టేది. దానికోసం నేను ప్రత్యేకంగా ద్వాదశినాడు ఆమె చేతి వంట తినేవాణ్ణి” అన్నాడు ఆదిత్య. 


“ఓసారి ఏమయ్యిందో గుర్తుందా ఆదిత్యా?” అని అడిగాడు రఘు. 


“ఆ గుర్తుందిరా! ఆరోజు మనతరగతివాళ్ళు ఈమె భోజనం చేసివచ్చి “ఇవాళ శారదపిన్ని మాకు పులిహోర, గారెలు, చక్రపొంగలి పెట్టింది” అని చెపితే మన ముగ్గురం నోరూరి, మధ్యాహ్న భోజనానికి క్యారేజీలు తెచ్చుకున్నా, తెచ్చుకోనట్లుగా వాళ్ళ అరుగు మీద కూర్చుంటే, “మీరు గొప్పింటి బిడ్డలు మీకెందుకు అన్నం పెట్టాలి?” అని అనలేదా తల్లి. 


మన కడుపునిండా భోజనం పెట్టి పంపించింది. అలా ఊళ్ళో పిల్లలందరూ శారదపిన్ని చేతి వంట తిన్నవాళ్ళే” అన్నాడు ఆదిత్య. 


“శారదపిన్ని దగ్గర భోజనం చేసి పెరిగి పెద్దవాళ్ళయి, మంచి ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు బట్టలు, స్వీట్లు, పళ్ళూ తీసుకొచ్చి ఆమెకిచ్చి దీవెనలను తీసుకుంటూంటారు. మాఅభివృద్ధికి మూలకారణం మీచేతి అమృతఫలం తీసుకోవటమేనని, ఆమెను ప్రశంసించి వెళ్ళేవారు. 


వాటినన్నింటినీ మరదలుచేతికిచ్చి ‘నువ్వు నాకు తోడుగా నిలిచావు కాబట్టే నేను పదిమందికి సాయం చేయగలిగాను’ అంటూ మరదల్ని మెచ్చుకునేదామె” అని చెప్పాడు రాంబాబు. 


“సరే పదండి! మనమూ వెళ్ళి ఆమె దీవెనలనందుకుందాం” అంటూ శారదపిన్ని ఇంటివైపు నడిచాడు ఆదిత్య. 


ఇంటికివచ్చిన వీరిని వివరాలను అడిగి, శారదపిన్నిని కలసుకోవటానికి వచ్చినట్లుగా తెలుసుకుని, సాదరంగా లోపలికి తీసుకెళ్ళి, కూర్చోబెట్టి మర్యాదలు చేసాడు ఆమె తమ్ముడు రమేష్ తన భార్యతో కలిసి. 


“అక్క గుడికి వెళ్ళిందని, కాసేపట్లో వచ్చేస్తుంది” అని చెప్పాడు రమేష్. 


“పిన్ని ఎలా ఉన్నారు?” అని అడిగాడు ఆదిత్య. 


“వయస్సువల్ల వచ్చిన ఇబ్బందులు తప్ప ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు” అని చెప్పాడు రమేష్. 


“ఇంకా అరుగుమీద భోజానలు పెడుతున్నారా?” అని అడిగాడు రఘు. 


“లేదండీ! ప్రభుత్వం వారే స్కూలుపిల్లలకు మధ్యాహ్నభోజనాలు పెడుతున్నారుకదా. అందువల్ల పిల్లలెవరూ ఇటువైపు తొంగిచూడటం లేదు. మా అక్కకు పని తగ్గింది. ఆ పథకం వచ్చిన కొత్తల్లో అక్క చాలా బాధపడింది. 


కానీ తన పని మాత్రం మానలేదు. సూర్యునితో పాటు దిశ మార్చుకొనే "సూర్యకాంత" పుష్పంలా ఆమె స్కూలుపిల్లలకు బదులు ఇప్పుడు గుడిమెట్లమీద కూర్చునే అభాగ్యులకు అన్నం తీసుకెళ్ళి ఇచ్చి వస్తోంది” అని చెప్పాడు రమేష్. 


ఉన్నట్లుండి రాంబాబుకు ఓ విషయం గుర్తుకువచ్చింది. "ఒరేయ్ రఘూ! ఇందాకటి నుండి చూస్తున్నా! టైలర్ సత్తిపండు గురించి అడగవేమిటిరా?" అన్నాడు.


రఘు "ఇలాంటి మంచి సమయంలో వాడి గోలెందుకురా? పోనియ్" అన్నాడు ఉడుక్కుంటూ.


“ఏమయ్యింది మీ చిన్నతనంలో? నేను కూడా వింటాను చెప్పండి” అన్నాడు రమేష్ ఉత్సాహంగా. 


“అవి మేము తొమ్మిదవతరగతి చదువుతున్న రోజులు. శ్రావణమాసం దశమినాడు రఘు పుట్టినరోజు. అప్పట్లో ఊరిలో ప్రఖ్యాతిగాంచిన సత్తిపండు టైలర్‌తో కుట్టించిన కొత్తబట్టలనేసుకుని అందంగా తయారై, సంతోషంగా స్కూలుకు వచ్చాడు రఘు. 


క్లాస్ ప్రారంభం కాగానే అందరికీ మిఠాయిలు పంచటానికి లేచాడు మన రఘు. అదేరోజు ‘లీల’ అనే అమ్మయిది కూడా పుట్టినరోజు కావటంతో ఆమె కూడా చాక్లెట్లు పంచటానికి ముందువరస దగ్గరకు వచ్చి అందరికీ ఇస్తోంది. అందరూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతూ చాక్లెట్లను తీసుకుంటున్నారు. 


కానీ మనవాడు మిఠాయిలు ఇస్తూంటే మాత్రం, ఒకరి మొఖాలను ఒకరు చూసుకుంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు.


ఇదిగమనించిన లీల “ఏమిటి రఘూ? నిన్ను, నన్ను చూస్తూ వాళ్ళంతా ఎందుకు అలా నవ్వుతున్నారు?” అని అడిగింది. 


“నాకేం తెలుసు?” అని అమాయకంగా అన్నాడు రఘు. 


ఓ సారి రఘు వేసుకున్న డ్రస్‌వైపు పరీక్షగా చూసింది లీల. అతని షర్ట్ జేబులూ, కాలర్, ప్యాంట్ జేబులు తాను వేసుకున్న పరికిణి క్లాత్‌తో సరిపోలుతున్నాయి. “మనిద్దరి బట్టలు మ్యాచింగ్ అయినాయి. అందుకే వాళ్ళు నవ్వుకుంటున్నారు” అంది లీల. 


“ఆ! ఇది ఆ సత్తిపండుగాడి పనే. వాడిని దులిపేయాలి ఇవాళ” అన్నాడు రఘు లోలోపల కుతకుతలాడుతూండగా. 


“అనవసరంగా ఆ సత్తిపండునెందుకంటావు. నీకే ఏదో లోపల నామీద..” అంటూ ఇకపై చెప్పలేక ఏడుస్తూ బయటకు వెళ్ళింది లీల. కోపంతో ఆమె ముఖం కందగడ్డలా తయారయ్యింది.


ఆమెకు ఎదురొచ్చిన క్లాస్ టీచర్ విషయం తెలుసుకుని లీలను సముదాయించి క్లాస్‌లోపలికి తీసుకొచ్చారు. 


"ఇది టైలర్లంతా చేసే పనే. మీరిద్దరూ ఒకే అతనికి బట్టలు కుట్టమని ఇచ్చుంటారు. అందుకే ఇలా జరిగింది. ఇది చాలా మామూలు విషయమే. పుట్టిన రోజును సంతోషంగా జరుపుకోవాలేగానీ ఇలా ఏడవకూడదు" అని ఆ విషయాన్ని సర్దేశారు.


“ఇదే కదరా జరిగింది. ఇంకా ఏమైనా ఉందా?” రఘును ఆటపట్టిస్తూ అన్నాడు రాంబాబు.


“ఊరుకోరా! నువ్వు మరీను! అంటూ తానూ అందరి నవ్వులతో జత కలిపాడు రఘు. 


వీళ్ళ కబుర్లిలా బావిలోని నీటిలా ఊరుతూండగానే, శారదపిన్ని వచ్చింది. ఆమె రాగానే ముగ్గురు స్నేహితులు లేచి ఆమెకు నమస్కారం చేసి, తమని తాము పరిచయం చేసుకుని, తెచ్చిన బట్టలను, మిఠాయిలను, పళ్ళనూ ఆమెకు ఇచ్చారు. 


“ఉన్నవాళ్ళమే అయినా మేము కూడా మా చిన్నతనాన మీ చేతి భోజనం చేసినవాళ్ళమేనమ్మా! ఈ ఊరికి రాగానే మాకు గుర్తు వచ్చింది మీరూపమే!. ఆ ‘సూర్యకాంత’ పువ్వులాగే మీరు కూడా పరిస్థితులకు తగ్గట్లుగా మీ మనసును మలచుకుని పదిమందికి మేలు చేస్తున్నారు. 


అన్నార్తులకు భోజనం పెట్టి వారి ఆకలి తీరుస్తున్న మీకు ఆ దేవుడు పూర్ణాయుర్దాయాన్ని ఇవ్వాలి” అంటూ ఆమె దగ్గర శెలవు తీసుకున్నారా మిత్రులు. మిగిలిన ఊరినంతటినీ చూసి, తమ పొలం గట్లమీదుగా నడిచి ఏటిగట్టుకు చేరుకుని మధుర జ్ఞాపకాలను మది నింపుకున్నారు. 


“వయ్యారి నడకలతో ఓ ఏరు, ఏరుదాటి సాగితే మా ఊరు, ఊరి మధ్య కోవెలా కోనేరు, ఒకసారి చూస్తిరా మరచిపోలేరు, మరలిరాలేరు…” అంటూ ఆదిత్య తన కమ్మని కంఠంతో తీయని రాగాలను పలికిస్తున్నాడు.


***** 


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు: 


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page