top of page
Original.png

అచ్చియమ్మ


అడవి మధ్యలోని చిన్న పూరిగుడిసె ముందు నిలబడి ఉన్న వృద్ధ గిరిజన మహిళ అచ్చియమ్మ, పక్కన రెండు కుక్కలు మరియు కోళ్లు.

Acchiyamma - Telugu Inspirational Story | Anisa Tabassum Sk

అచ్చియమ్మ - తెలుగు ప్రేరణాత్మక కథ | అనిసా తబస్సుమ్ SK

Published in manatelugukathalu.com on 08/08/2026


"అచ్చియమ్మ" అనేది అడవి ప్రాంతంలో జీవించిన ఓ వృద్ధ గిరిజన మహిళ జీవితంలోని కష్టాలు, ఒంటరితనం, ఆస్తి కోల్పోవడం, కుటుంబ నిర్లక్ష్యం, అయినప్పటికీ తనపై తానే ఆధారపడుతూ జీవించిన ధైర్యాన్ని ఆవిష్కరించే హృదయస్పర్శి కథ. భర్త రాజయ్య మరణం తర్వాత అచ్చియమ్మ ఎదుర్కొన్న పరిస్థితులు, తనకు అండగా నిలిచిన అన్నా వదినల మానవత్వం, అడవి ఒడిలో కుక్కలు, కోళ్లతో ఏర్పరుచుకున్న అనుబంధం ఆమె జీవితానికి మరో కోణాన్ని చూపిస్తాయి. చివరికి కష్టాల మధ్య కూడా తన శేష జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించే అచ్చియమ్మ పాత్ర పాఠకుడి మనసులో చెరగని ముద్ర వేస్తుంది.


తెల్లవారుజామున..... అడవి ఇంకా సగం నిద్రలో ఉన్నట్లు కనిపిస్తుంది. చుట్టుపక్కల, చెట్లపైన ఏదో ఒక పలుచటి మంచు దుప్పటి కప్పినట్లుంది.


సూర్యుడు ఎక్కడ తగ్గకుండా చెట్ల మధ్యగా బంగారు రంగు సూర్యకిరణాలు మంచును చీల్చుకుంటూ నేలపై పడుతుంటే, అడవంతా బంగారు రంగు చీర కట్టుకున్నట్లు మెరిసిపోతుంది.


సూర్యకిరణాలకు మెల్లగా మంచు కరుగుతూ... ఆకుల చివర్లో వేలాడుతున్న మంచు బిందువులు తొలి వెలుగును తాకి ముత్యాల్లా మెరుస్తూ సెలవు తీసుకుంటున్నాయి.


చల్లని గాలి నెమ్మదిగా వీస్తూ, చెట్ల కొమ్మలను మృదువుగా ఊపుతుంటే.... నిద్ర లేచిన పక్షులు, అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న అడవిలో తీయనైన గోలను ఆరంభించాయి. అడవి తన అందాన్ని నిశ్శబ్దంగా పరిచయం చేస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. అందమైన కలల లోకంలా ఉంది ఆ ప్రాంతం.

*****************

కనుచూపు మేర చెట్లు, పచ్చదనంతో ఉన్న ఆ అడవిలో పెళ్లి కూతురి బుగ్గపై అందమైన దిష్టి చుక్కలా కనిపిస్తుంది ఒక పాత పూరిగుడిసె. కాదు.... కాదు ఏదో నాలుగు వైపులా వెదురు బొంగుల్తో కట్టిన తడికెలు, దానికి పైకప్పులా.... ఎండుగడ్డి, దానిపై ఒక నల్లటి కవరు కప్పి ఉంది చేనుమకాం (గూడెంకి దూరంగా పొలం/చేనుకు కాపలాగా ఉండడం కోసం ఏర్పరుచుకున్న చిన్న పూరిగుడిసె లాంటిది). గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా, ఎంతో అసౌకర్యంగా ఉంది ఆ మకాం.


ఆ మకాంకి తలుపులకు బదులుగా కొన్ని వెదురు బద్దెలను పేర్చి కట్టిన తడికెను పక్కకు జరుపుకొని బయటకు వచ్చింది ఓ ఎనభై ఏళ్ళ ముసలమ్మా. చూడడానికి చాలా బక్కపలుచగా ఉంది, నిటారుగా నిలబడడానికి బలం లేక కొంత వంగిపోయి ఉంది. 


ముడతలు పడ్డ ముఖం, రేపటి గురించి ఎటువంటి చింత, ఆశ లేని కళ్ళు, ముక్కుపై గుండ్రటి పెద్ద ఎనిమిది రాళ్ల బేసరి, చిరునవ్వు లేని ముఖం, కొంచెం మురికి పట్టిన జాకెట్టు, పాత కాటన్ చీర (గోచి కట్టు కట్టింది), ఆ సన్నటి బలం లేని కాళ్ళకు రెండు లావు వెండి కడియాలు... ఈ ముసలమ్మే అచ్చియమ్మ. *******************

చేతిలో దువ్వెన పట్టుకొని మెల్లగా అడుగులు వేస్తూ మకాం పక్కనే ఉన్న చెట్టు కింద, తుమ్మమొద్దుపై కూర్చుంది అచ్చియమ్మ. ఆ పక్షుల కిలకిలలు వింటూ జుట్టు దువ్వుకుంటుంది తన దినచర్య మొదలు పెట్టడానికి.


అచ్చియమ్మకు తన చిన్న వయస్సులోనే రాజయ్యతో పెళ్లి జరిగింది. అచ్చియమ్మకు పెళ్ళయ్యాక, అందరి ఆడవాళ్ళలానే కుటుంబాన్ని చూసుకుంటూ, భర్తకు సహాయంగా వారి సొంత పొలంలోనే కలిసి పనిచేసేవారు. అచ్చియమ్మ జీవితం ఆనందంగా, సాఫీగానే సాగుతోంది. 


అచ్చియమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు మగపిల్లలు, ఒక్క అమ్మాయి. కాలంతో పాటు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేసింది. ఇద్దరు కొడుకులు కూడా వేరు కాపురాలు ఉంటున్నారు.


అచ్చియమ్మ,తన భర్త, పూటకు ఇంత ఉడకేసుకొని తింటూ,పొలం చూసుకుంటూ, పండించిన వాటిని సంతకు తీసుకువెళ్లి, అమ్ముకొని, వచ్చిన ఆ కాస్తో...కూస్తో డబ్బుతో కాలం వెళ్లబుచ్చేవారు.

************

కాలం కరిగిపోతూనే ఉంది. రాజయ్యకు అనారోగ్య సమస్యలు రావడంతో ఇదివరకులాగా పనులు చేయలేకపోతున్నాడు. పొలం పనులంతా అచ్చియమ్మ ఒక్కతే చూసుకోలేకపోతుంది. తనకు చేతనైనంతలో నెట్టుకొస్తోంది. ఏమీలేని రోజు... అడవికి వెళ్లి దుంపలో, ఆకుకూరలో తెచ్చుకొని ఆ పూటకు ఏదో ఒకటి వండుకొని తినేవారు. 

పిల్లాపాపలతో ఒక మంచి కుటుంబం ఉన్నా, ఎవరూ లేని ముసలి పక్షుల్లా మిగిలిపోయారు రాజయ్య, అచ్చియమ్మ.


గడుస్తున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకొని, ముందు ముందు పరిస్థితులు ఎలా ఉండబోతాయోనని గ్రహించిన రాజయ్య, తన పేరు మీద ఉన్న పది ఎకరాల భూమిని అచ్చియమ్మ పేరు మీదకు మార్చేశాడు.


అచ్చియమ్మకు చదువులేదు, ఒక్క రోజైనా బడి ముఖం చూసి ఎరుగదు. చాలా అమాయకురాలు అచ్చియమ్మ. తన కుటుంబం, తన గూడెం, ఆ అడవి, ఇదే అచ్చియమ్మ ప్రపంచం. తమ పొలంలో పండించిన చిరుధాన్యాలని... చిన్న చిన్న మూటల్లో వేసుకొని, దాదాపు మూడు కిలోమీటర్లు కొండ కింద ఉన్న గిరిజన సంతకు తెల్లారుజామునే ఆ ముసలి దంపతులు కాలినడకన వెళ్లి అమ్మగా, వచ్చిన ఆ కొంత డబ్బుతో వారికి సరిపడా కూరగాయలు, నూనె, ఉప్పు, పప్పులు తెచ్చుకునేవారు.

 *************

అచ్చియమ్మకు వయస్సు మీద పడడంతో తాను ఒక్కతే పొలం పనులు చేసుకోలేకపోతుంది. రాజయ్యకు ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. ఇంటి పట్టునే ఉంటున్నాడు రాజయ్య. ఈ ముసలి దంపతులు ఎలా ఉన్నారో అని తిరిగి చూసే దిక్కు లేకుండా పోయింది. అచ్చియమ్మ కూలి పనులకు వెళ్లడం మొదలు పెట్టింది. 


పనులేమీ లేనప్పుడు అచ్చియమ్మ అడవిలోకి వెళ్లడం... కాయ, దుంప తీసుకురావడం, అచ్చియమ్మ ఒక్కతే అంత కష్టపడడం చూడలేకపోయిన రాజయ్య, అనారోగ్యంతోనే పొయ్యిలోకి కట్టెలు తీసుకురావడం లాంటి చిన్న చిన్న పనులు చేసేవాడు. అలా ఆ పూటకు వండుకొని తినేవారు.


అదే వర్షాకాలం అయితే వారికి పూట గడవడం కూడా ఇంకా కష్టంగా ఉండేది. చేయడానికి పనులు దొరక్క, వండుకోవడానికే ఏమీ లేక పస్తులు ఉండేవాళ్ళు అచ్చియమ్మ, రాజయ్య.


కష్టకాలం ఎక్కువైంది. రాజయ్య అనారోగ్యంతో కన్నుమూశాడు. అచ్చియమ్మ ఒంటరిదైంది. ఆ వృద్ధాప్య వయస్సులో బిక్కుబిక్కుమంటూ అతికష్టంగా జీవితాన్ని నెట్టుకొస్తోంది అచ్చియమ్మ. తన కడుపు నింపుకోవడానికి పనికి వెళ్ళక తప్పలేదు. 


కాఫీ తోటల్లో, మిరియాల తోటల్లో కూలిపనులకు వెళుతుంది. కష్టం చేసే ఓపిక లేక తనకున్న భూమిని కౌలుకిచ్చి బ్రతుకుదాం అనుకుంది, కానీ అప్పటికే ఆలస్యం అయింది. మూలిగే నక్క పైన తాటాకు పడ్డట్టు... అచ్చియమ్మ పక్షాన మాట్లాడేవారు లేరని, ఆవిడకు అక్షర జ్ఞానం లేదని, అచ్చియమ్మ పది ఎకరాల భూమిని ఎవరో అన్యాయంగా లాక్కున్నారు.


 జరుగుతున్నది చూస్తున్న జనాలు అయ్యో పాపం అన్నారేగానీ అచ్చియమ్మకు మద్దతుగా నిలిచిన వారెవరూ లేరు. విషయం పాతబడింది, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఎలాగో కాళ్ళీడ్చుకుంటూ... ఎవరిపై ఆధారపడకుండా మిగిలిన జీవిత కాలాన్ని వెళ్లబుచ్చుతుంది అచ్చియమ్మ. 


ఉన్న కష్టాలు సరిపోవన్నట్టు కొత్త కష్టం వచ్చిపడింది అచ్చియమ్మకు. చివరికి తాను ఉంటున్న ఇంటిని కూడా తన రక్తసంబంధీకులే లాక్కున్నారు, దిక్కులేని ఒంటరి పక్షి అయింది అచ్చియమ్మ.

***************

గూడెంకు కొద్ది దూరంలో అడవిలో ఉంటున్న అచ్చియమ్మ అన్న, వదినకు జరిగిన విషయం తెలిసింది. వాళ్ళు కూడా ముసలి దంపతులైనా, వాళ్ళు ఆ ముసలి వయస్సులో ఎవరిపై ఆధారపడకుండా కష్టం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అలాగని అచ్చియమ్మను అలా ఒంటరిగా వదిలేయలేకపోయారు. వారితో పాటు అచ్చియమ్మను కూడా అడవిలోకి తీసుకువెళ్లారు.


వారి పూరిగుడిసెకు రెండడుగుల దూరంలోనే ఒక పాత మకాం ఉంది.అచ్చియమ్మను ఆ మకాంలో ఉంచి, వారు పనిచేసే ఆ తోట యజమానికి అచ్చియమ్మ గురించి చెప్పి ఒప్పించి, అదే తోటలో అచ్చియమ్మను పనికి కుదిరించారు అచ్చియమ్మ అన్న,వదిన.


ఆ చేనులో, తోటలో తన చేతనైన పని చేసుకుంటూ, ఆ మకాంలోనే వండుకొని తింటుంది అచ్చియమ్మ.

కొంత కాలానికి అచ్చియమ్మకు తోడుగా రెండు పెంపుడు అడవి కుక్కలు అలవాటు అయ్యాయి.


అచ్చియమ్మ వాటిని ఎంతో ప్రేమగా చూస్కుంటూనేది, అవికూడా అంతే విశ్వాసంగా అచ్చియమ్మకు కాపలాగా ఉండేవి.



పురుగులు, పాములు, ఏవైనా ఇతర జంతువులు వచ్చినా వెంటనే పసిగట్టేవి. ఇవే కాకుండా అచ్చియమ్మ ఓ మూడు, నాలుగు కోళ్లను కూడా పెంచుకుంటుంది. ప్రతిరోజు అవి గుడ్లను ఇచ్చి అచ్చియమ్మకు కృతజ్ఞత తెలుపుకుంటాయి. ఆ రెండు కుక్కలు, కోళ్లు కూడా అచ్చియమ్మతో పాటు ఆ మకాంలోనే ఉంటాయి.

***********

తాను పనిచేసినందుకు డబ్బుకు బదులుగా తిండి పెట్టేవారు ఆ తోట యజమానులు. గూడెం నుంచి అడవిలోకి వచ్చాకే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అచ్చియమ్మ. పగలంతా పనులు చేసుకొని, సాయంత్రం కాసేపు చలిమంట వేసుకొని కూర్చొని... అచ్చియమ్మ, తన అన్న, వదిన ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకుంటూ అడవిలో దొరికే పనసపండు ద్రవ్యాన్ని పుచ్చుకునేవారు.


ఎప్పుడైనా అచ్చియమ్మకు సుస్తీ చేసినా, ఆ పూటకు తన వదినే ఇంత వండి పెట్టి చూసుకునేది. ఇద్దరు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఎప్పుడైనా చేపలు పట్టడానికైనా, కూరలకు తెచ్చుకోవాలన్నా అడవి లోపలికి వెళ్లేవారు అచ్చియమ్మ, తన వదిన. 


తాగడానికి, వండుకోవడానికి నీళ్లు కావాలంటే మాత్రం ప్రతిరోజు కొండ కిందకు దిగి, అక్కడ వచ్చే ఊట నీళ్లను పట్టుకొని, ఏవైనా వంట పాత్రలు, గిన్నెలు ఉంటే అక్కడే కడిగి, శుభ్రపరుచుకొని, పట్టిన ఆ ఊట నీళ్ల బిందెను తలపై పెట్టుకొని కాలినడకనే తిరిగి వెళ్లేవారు. ఇక వర్షాకాలంలో అయితే వాళ్ళు పడే కష్టాన్ని చెప్పనక్కర్లేదు.


ఇప్పటికి అచ్చియమ్మ భర్త కాలం చేసి పది సంవత్సరాలు అవుతుంది. ఇన్నేళ్లుగా తన అన్న, వదిన తప్ప ఆమెను పలకరించిన వారు లేరు. అయినా ఇవేమీ లెక్క చేయకుండా అచ్చియమ్మ తన శేష జీవితాన్ని ఆ అడవి ఒడిలో ఒక పసిపాపలాగా గడుపుతుంది.


అక్కడి ప్రాంతాన్ని చుట్టూ చూసుకొని, జుట్టు దువ్వుకొని కొప్పు ముడి పెట్టుకుంది. మెల్లగా లేచి వెళ్లి ఓ నాలుగు పుల్లలు పొయ్యిలో పెట్టి, నిప్పు రాజేసి కొంత రాగి అంబలి కాచుకొని తాగింది. కొంత తాను పెంచుకునే కుక్కలకు పోసింది. కోళ్లకు, కోడిపిల్లలకు కొన్ని జొన్నలు చల్లి, ఆ పూరిగుడిసె ద్వారానికి తడికను అడ్డుపెట్టి తోట వైపు అడుగులు సాగించింది అచ్చియమ్మ.


కథ సమాప్తం


అనిసా తబస్సుమ్ SK  గారి కొన్ని రచనలు:


అనిసా తబస్సుమ్ SK  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కథ సమాప్తం


Anisa Tabassum Sk

అనిసా తబస్సుమ్ SK


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Shaik Anu
Shaik Anu
11 hours ago
Rated 5 out of 5 stars.

ఈ కథను నిజ జీవిత ఆధారంగా రాయడం జరిగింది ❤

Like
bottom of page