top of page
Original.png

ముడిపడిన బంధం

ముడిపడిన బంధం, తెలుగు కథ, కుటుంబ కథ, దాంపత్య జీవితం, భర్త భార్య కథ, గ్రామీణ జీవితం, కుటుంబ విలువలు, ప్రేమ, సహనం, సంస్కారం, భావోద్వేగ కథ, తెలుగు సాహిత్యం, Mana Telugu Kathalu, Telugu Family Story, Emotional Telugu Story

గ్రామీణ ఇంట్లో అపార్థాల తర్వాత ప్రేమతో ఒకటైన తెలుగు దంపతులు
గ్రామీణ ఇంట్లో అపార్థాల తర్వాత ప్రేమతో ఒకటైన తెలుగు దంపతులు

Mudipadina Bandham - Telugu Emotional Family Story | Anisa Tabassum Sk

ముడిపడిన బంధం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | అనిసా తబస్సుమ్ SK

Published in manatelugukathalu.com on 19/07/2026


"ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోడానికి ఏం మాయరోగమే నీకు. బంగారంలాంటి సంబంధం, అబ్బాయికి సొంత ఇల్లు, పొలం ఉన్నాయ్!! నిన్ను బాగా చూసుకుంటాడే..... తల్లి!!" అంటూ వేడినీళ్లు కాచుకోడానికి పొయ్యిలో కట్టెలు పెడుతూ అరుస్తూ చెప్తుంది సుగుణ తల్లి వరాలమ్మ. 


"అబ్బో.... మహా గొప్ప సంబంధం. అంత బంగారం అయితే కరిగించి మెళ్ళో వేసుకో అంతే కానీ నా మెడకు చుట్టాలనుకోకు అమ్మ" అంటూ ఘాటుగానే బదులిచ్చింది సుగుణ, సన్నజాజి పందిరి కింద మడత మంచంపై కూర్చొని... ఆ రోజు తెంపిన సన్నజాజి పూలమాలను నాజూగ్గా అల్లుతూ. 


“అవునే నువ్వో పెద్ద అప్సరస!! నిన్ను చూసి అందరూ పడిచావడానికి. నువ్వు చదివిన పదోతరగతి చదువులకు నీకు ఇంతకన్నా గొప్ప సంబంధాలు రావు, పోనీ నీ కోరికలకు తగట్టు పట్నం సంబంధాలు ఇచ్చి చేయడానికి మా దగ్గర అంత డబ్బు లేదు. మాటవిని చేసుకుంటావో... బంగారంలాంటి సంబంధం పోగొట్టుకొని ఏడుస్తూ కూర్చుంటావో నీ ఇష్టం”, అంటూ కోపంతో ఇంట్లోకి వెళ్ళింది వరాలమ్మ. 


సువాసన వెదజల్లుతూ ముత్యాల్లా ఉన్న ఆ సన్నజాజి మాలను జడలో తురుముకొని తాను ఇంట్లోకి వెళ్ళిపోయింది సుగుణ. సుగుణది చెప్పుకోతగ్గ అందం కాకపోయినా అందంగానే ఉంటుంది. సుగుణకు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. ఆ ప్రభావం ఎక్కుగానే పడింది. 


సినిమాలు చూడడం.... అచ్చం హీరోలాంటి వ్యక్తి తనకు భర్తగా రావాలని, తాను ఎంచక్కా అన్ని సౌకర్యాలు పొందుతూ.... మరింత ముస్తాబు చేసుకుంటూ, దర్జాగా పట్నం జీవితం గడపాలని ఆమె కోరిక. అలాంటి కోరికలపై చన్నీళ్ళు చల్లినట్లు ఆమె జీవితంలో భాస్కరం సంబంధం వచ్చింది. 


భాస్కర్ చాలా మంచోడు. పెద్దగా ఏం చదువుకోలేదు.

అతనికి పదిహేనేళ్లపుడే తన తండ్రి కాలం చేసారు. ఇక అప్పటినుంచి ఇంటి బాధ్యత, పొలం, సంపాదన అంత భాస్కరే చూసుకుంటున్నాడు. అదే బాధ్యతతో అతని చెల్లి పెళ్లి చేశాడు. 


తమ్ముడు పదోతరగతి చదువుతున్నాడు. తల్లి సుభద్రమ్మ, తల్లి మాటకు ఎన్నడూ ఎదురు చెప్పి ఎరుగడు భాస్కర్. సుభద్రమ్మకు కొడుకు భాస్కర్ అంటే ఎంతో ఇష్టం. భాస్కరంకు ఊళ్లో కూడా మంచి పేరు. సహాయం చేసే గుణం ఉన్నవాడు భాస్కర్.                                  ********** 

ఎలాగో అలా సుగుణకు, భాస్కర్ కు పెళ్లి అయింది. సుగుణ పెళ్ళైతే చేసుకుంది కానీ... భాస్కర్ ను తన భర్తగా స్వీకరించలేకపోతుంది. తన పరిధిలో తాను ఉంటుంది సుగుణ. ఒక రోజు భాస్కర్ ప్రేమతో సుగుణ చెయ్యి పట్టుకోబోతే విదిలించుకుని వెళ్ళిపోయింది. ఎప్పుడన్నా మాట్లాడదాం అని ప్రేమగా 'సుగుణ' అంటూ పిలిచినా "పనుందండీ" అంటూ అక్కడ్నుంచి వెళ్ళేది. పెళ్ళప్పట్నుంచి సుగుణ ఏ రోజు భాస్కర్ కళ్ళలోకి చూసింది లేదు. భాస్కర్ ఎదురుపడ్డా  తప్పించుకొని తిరిగేది సుగుణ. 


పొద్దున్నే లెగవడం కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టడం, భర్తకి-అత్తగారికి కాఫీ ఇవ్వడం, మరిదికి క్యారేజీ కట్టి ఇవ్వడం. ఎవరైనా ఏమైనా అడిగితే అందుకు బదులు చెప్పడం, ఇంట్లో పనులు చేసుకోవడం ఇదే సుగుణ దినచర్యగా మారింది. సుగుణ ఎందుకో అసంతృప్తిగా ఉండటం భాస్కర్ గమనించాడు. 


సుగుణ భాస్కర్ తో అలా ప్రవర్తించడానికి గల కారణం... భాస్కర్ కు రంగు లేకపోవడం, తాను ఊహించినట్లు భాస్కర్ కు చదువు, మంచి ఉద్యోగం లేకపోవడం, తాను ఆ ఊరు విడిచి పట్నం వెళ్లకుండా ఇంకా ఆ ఊర్లోనే మగ్గిపోవడం.... ఇవేం సుగుణకు నచ్చట్లేదు.


సూర్యుడు తన కర్తవ్యం నిర్వర్తిస్తున్నాడు. ఒక్కసారిగా సూర్యుడిని మబ్బులు వాటి వెనకకు దాచి, ఆకాశం నల్లగా మారి మేఘావృతమైన వేళ. ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంది ఆ సన్నివేశం. ఇక ఉండబట్టలేక సుగుణ ఎందుకలా ఉంటుందో తెలుసుకోవాలని, సుగుణను వెతుకుతూ తన గదిలోకి వెళ్ళాడు భాస్కర్. 


పందిరి మంచంపై ఓ కాలు కిందకు వదిలి కూర్చొని బట్టలు మడత పెడుతుంది సుగుణ. భాస్కర్ లోపలి వెళ్ళి గది తలుపు మూశాడు. "నేను నీతో కొంచెం మాట్లాడాలి సుగుణ" అన్నాడు. 


తన చేతిలో మడతపెట్టడానికి తీసుకున్న చీరను పక్కన పెడుతూ "చెప్పండీ" అంది. 


"నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటినుంచి ఎందుకో అసంతృప్తిగా ఉంటున్నావు, ఈ ఇంట్లో నిన్నేమైనా బాధిస్తోందా? లేక ఏమైనా నచ్చట్లేదా?" అంటూ ఎన్నాళ్ళుగానో తన మనసులో ఉన్న ప్రశ్నలను అడిగాడు.... సుగుణ ఎదురుగా మంచంపై కూర్చుంటూ. 


ఠక్కున మంచంపై నుంచి లేచి... తెరిచివున్న కిటికీ వద్దకు వెళ్లి మౌనంగా నిలబడింది. భాస్కర్ కూడా తన దగ్గరకు వెళ్లి "నువ్విలా మౌనంగా ఉంటె అసలు సమస్యేంటో నాకెలా అర్ధమౌతుంది సుగుణ" అంటూ ఆమె భుజంపై చెయ్యి వేశాడు. 


భాస్కర్ చేతి స్పర్శ తాకగానే తన గుండెల్లో అణచిపెట్టుకున్న దుఃఖం, కోపం, ద్వేషం ఒక్కసారిగా కట్టలు తెంచుకొని కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చాయి. చిరాకుతో భాస్కర్ చేతిని పక్కకు నెట్టింది. "నాకు అసలు ఈ పెళ్లి ఇష్టంలేదండీ, నేను కోరుకున్న జీవితం ఇదికాదు, మీరు నాకు నచ్చలేదు, ఈ ఇల్లు, ఊరు అసలేమీ నాకు నచ్చలేదు. 


ఈ జన్మకు నా రాత ఇంతే అనుకోని అయిష్టంగానే తలొంచుకొని తాళి కట్టించుకున్నాను. ఇష్టంలేకుండానే ఈ ఇంటికి కోడలిగా ఉంటున్నాను, మీరు దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోకండి, నా మానాన నన్ను వదిలేయండి మీకో నమస్కారం" అంటూ చేతులు జోడించి ఆవేశంతో అక్కడ్నుంచి వెళ్లిపోయింది. 


ఆ మాటలకు స్థాణువులా మారిన భాస్కర్ పెద్ద ఉరుము శబ్దంతో ఈ లోకంలోకి వచ్చాడు. తల తిప్పి కిటికీ వైపు చూసాడు... వర్షం జోరున కురుస్తుంది. సుగుణ అన్న మాటలకు, అతని గుండె ఒక దుఃఖ సముద్రమైంది. ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో అతను అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.                        

*************** 

కాలం పరిగెడుతూనే ఉంది. భాస్కర్ మొదట సుగుణ మాటలకు బాధపడినా, తరువాత చాలా సహనంతో ఏం మాట్లాడకుండా అతని పనులు చూసుకుంటున్నాడు. కోడలు, కొడుకు తీరును గమనించిన సుభద్రమ్మ, మొదట కొంత సందేహం వచ్చినా "భార్య భర్తల మధ్య ఏవో చిన్నపాటి మనస్పర్థలు వచ్చివుంటాయి, కొత్త జంటకి అదెంత కాలం, అవే సర్దుకుంటాయిలే" అని మనస్సు కుదుటపరుచుకుంది. 


సుగుణకు పొరుగుంటి లక్ష్మికి మంచి స్నేహం కుదిరింది, ఓ మాదిరి అక్క చెల్లెలుగా ఉండేవాళ్ళు. లక్ష్మికి ఇద్దరు పిల్లలు, పొలం పనులకు వెళుతుంది లక్ష్మి. ఆమె భర్త నరేంద్ర పెద్దగా బాధ్యత లేకుండా, తాగుతూ, అతని మాటకు ఎదురుచెప్తే లక్ష్మిపై చెయ్యి చేసుకుంటాడు. 


ఒకరోజు లక్ష్మి ఇంట్లో గొడవ పెద్దదైంది... ఇంట్లో నుంచి కేకలు వినిపిస్తున్నాయి. "అబ్బబ్బ.... ప్రతిరోజు ఇదే గోల, పాపం ఆ లక్ష్మిని కొట్టి... కొట్టి చంపుతాడో ఏమో" అనుకుంటూ వంటింటి నుంచి బయటకు వచ్చింది సుగుణ. అప్పటికే ఆ అరుపులు వింటున్న భాస్కర్ ఇక ఉండబట్టలేక లక్ష్మి ఇంటి వైపు కదిలాడు. 


"మనకెందుకు నాయనా పక్కింటి గొడవలు.... వాడు అసలే తాగేసి ఉన్నాడు" అంటున్న సుభద్రమ్మ మాటలను పట్టించుకోలేదు భాస్కర్. ఏం జరుగుతుందో అని ఆతృతగా బయటకు వచ్చారు సుగుణ, సుభద్రమ్మ.


భాస్కర్ నెమ్మదిగా నరేంద్రతో మాట్లాడి, అతన్ని బయటకు తీసుకువెళ్లాడు. సుగుణ, లక్ష్మి వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చే ప్రయత్నంలో పడింది. భాస్కర్, నరేంద్ర కలిసి వెళ్తున్న దృశ్యం చూసిన సుగుణ, భాస్కరాన్ని నరేంద్రతో పోల్చుకోవడం మొదలు పెట్టింది. 


భాస్కర్ కు తనకు పెళ్ళై ఎనిమిది నెలలవుతుంది, ఇన్ని రోజుల్లో భాస్కర్, సుగుణపై ఏరోజు కోప్పడిందిలేదు, ఏరోజు సుగుణపై దుర్భాషలాడింది లేదు, ఆ రోజు సుగుణ.... భాస్కర్ ను అన్నేసి మాటలు అని, అతని మనసు గాయపరిచినా అతను పల్లెత్తు మాట అనిందిలేదు, అంతెందుకు అసలు సుగుణతో ఆమెపై గౌరవం లేకుండా ప్రవర్తించింది లేదు. 


"అసలు మనుషుల్లో ఎంత తేడా!!" అనుకుంటూ భాస్కర్ మంచితనాన్ని, అతని స్వభావాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. భాస్కర్ పై మరింత గౌరవాన్ని పెంచుకుంది సుగుణ.

                          *************** 

కొద్దిరోజులకు సుగుణ తల్లిదండ్రులు సుగుణ ఇంటికి వచ్చారు. భాస్కర్ ఎంతో అభిమానంగా స్వాగతించాడు. భోజనాలు అయ్యాక వరాలమ్మ (సుగుణ తల్లి), సుగుణ ఇద్దరూ వంటింటి వెనుక గచ్చుపై కూర్చున్నారు. 

ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు. 


మాటల మధ్య సుగుణ తన స్నేహితురాలు 'రేణుక' గురించి తల్లిని అడిగింది. రేణుకకు, సుగుణ పెళ్ళికి ఆరు నెలల ముందే వివాహం జరిగింది. మంచి పట్నం సంబంధం, అబ్బాయి సినిమా హీరోలా ఉన్నాడు... మంచి ఉద్యోగం, అందరూ రేణుక అదృష్టం అనుకున్నారు. కట్నం వద్దు అంటే రేణుకకు బంగారం పెట్టారు. 

"రేణుక ఎలా ఉంది అంటే అలా ఆలోచనలో పడ్డావు ఏంటమ్మా" అన్న సుగుణ మాటలకు ఈ లోకంలోకి వచ్చిన వరాలమ్మ కంట్లో నీళ్లు తిరిగాయి. 


"ఏంటమ్మా! ఏమైంది ఎందుకా కన్నీళ్లు" అంటూ ఆందోళనగా తల్లిని అడిగింది సుగుణ. 


"ఏం చెప్పమంటావే, అబ్బాయి అందగాడు, మంచి ఉద్యోగం అని మన అమ్మాయి సుఖపడుతుందని ఆ పాపిష్టి సంబంధం ఇచ్చి చేసారు, వాడు ఓ శాడిస్టు... నలుగురిలో మంచి అనిపించుకోవాలని కట్నాలు వద్దు అని..... బంగారం తీసుకురా, డబ్బు తీసుకురా, బండి కావాలి అంటూ సాధించేవారట భర్త, అత్త కలిసి... చిటికీ మాటికీ పుట్టింటికి పంపేవారు". ఆ తల్లిదండ్రులు కూతురి కాపురం గురించి లోలోపల కుమిలిపోతున్నారు" అంటూ చెప్పుకొచ్చింది వరాలమ్మ. 


"ఏంటమ్మా!! ఇదంతా నిజామా??" అంటూ తల్లి చెప్పిన మాటలకు నిర్ఘాంతపోయింది సుగుణ. 


వరాలమ్మ కళ్ళొత్తుకుంటూ.... "అమ్మా అల్లుడుగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా?? సఖ్యంగా ఉంటున్నారా" అంటూ ఆశగా అడిగింది వరాలమ్మ. 


"ఈ పెళ్లి వద్దని గోల గోల చేసావుగా.... ఇప్పుడు అర్థమవుతుందా అల్లుడు ఎంత మంచివాడో, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి తల్లి" అంటున్న వరాలమ్మ మాటలను అడ్డుకుంటున్నట్టు "ఏమిటి తల్లి, కూతుళ్లు ఏవో చెప్పుకుంటున్నట్టు ఉన్నారు" అంటూ వచ్చి వరాలమ్మ పక్కన కూర్చుంది సుభద్రమ్మ. 


ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూనే సాయంత్రమైంది. నేను కాఫీ పెట్టి ఇస్తాను అంటూ అక్కడ్నుంచి వంటింట్లోకి నడిచింది సుగుణ. 


వంటింట్లో కాఫీ పెడుతున్న సుగుణకు మనసంతా భాస్కర్ మీదే ఉంది, అతని ఊహల్లోనే తిరుగుతుంది. సుగుణ తల్లిదండ్రులు వెళ్లిపోయారు. రాత్రి భోజనాల తరువాత తన గదిలోకి వెళ్ళింది సుగుణ.                             ************* 

మంచం పక్కన కింద పడుకుంటున్న భాస్కర్ వద్దకు వెళ్లి కూర్చుంది సుగుణ. 


"ఏమైంది సుగుణ" అంటూ కొద్దిపాటి కంగారుగా అడిగాడు భాస్కర్. 


భాస్కర్ స్వరం వినగానే కళ్ళలో నీళ్లు ఆగలేదు సుగుణకు. "నేనెంత మూర్ఖురాలిని, ఎంత అజ్ఞానురాలిని, పట్నం... పట్నం.. అంటూ పిచ్చి ఊహల్లో ఉండి, పిచ్చి కోరికలు మనసునిండా నింపుకొని బంగారంలాంటి మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. మీ మనసును ఎంతో గాయపరిచాను. ఇప్పుడు నా కళ్లు తెరుచుకున్నాయి. నాకు పట్నం వద్దు, ఆ అందం వద్దు, చదువుకున్న భర్త వద్దు...... చదువుకున్న వాళ్లకన్నా గొప్ప సంస్కారం, విధేయత మీలో ఉన్నాయి. మీరు నిజంగా గొప్ప వ్యక్తి, నన్ను క్షమించండి" అంటూ అతని పాదాలు తాకి బోరున ఏడిచింది సుగుణ. 


"అయ్యో సుగుణ... ముందు లే!! ఏమిటిది చిన్నపిల్లలా, మన మధ్య క్షమాపణలు ఏంటి" అంటూ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు భాస్కర్.

మరుసటి రోజు ఉదయాన్నే వేడి వేడి కాఫీని భాస్కరానికి అందించింది సుగుణ.... కానీ ఈసారి అతనిపై ప్రేమతో.


                        కథ సమాప్తం


ఈ కథ చదివినవారు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంచుకోండి 

 By: అనిసా తబస్సుమ్ sk (Anisa Tabassum sk)

                       Thank you🤍     


అనిసా తబస్సుమ్ SK  గారి కొన్ని ఇతర రచనలు:


అనిసా తబస్సుమ్ SK  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కథ సమాప్తం


అనిసా తబస్సుమ్ SK


bottom of page