top of page
Original.png

రంజాన్ తీపి జ్ఞాపకాలు

#అనిసాతబస్సుమ్, #AnisaTabassum, #RamjaweetMemories, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

90's లో మా ఊరి రంజాన్ తీపి జ్ఞాపకాలు

Ramzan Sweet Memories - New Telugu Story Written By Anisa Tabassum Sk Published in manatelugukathalu.com on 21/02/2026

రంజాన్ తీపి జ్ఞాపకాలు - తెలుగు కథ

రచన: అనిసా తబస్సుమ్ SK


90's లో మా ఊరి రంజాన్ తీపి జ్ఞాపకాలు


ఈ కథ నేను మా అమ్మ చిన్నప్పటి రంజాన్ ఉపవాసాల గురించి, ఆ మధుర జ్ఞాపకాల గురించి రాస్తున్న కథ.


మాది ఒక చిన్న గ్రామం. ఊరికి తగ్గట్టు ముచ్చటగా ఒక మసీదు ఉండేది. మా వీధికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ మసీదే. మా ముత్తాతగారు (సుమారు వందేళ్లు బ్రతికారు), చీమకి కూడా హాని చేయని మంచి మనసున్న మనిషి. ఆ మసీదులో మా ముత్తాతగారే అజాన్ ఇచ్చేవారు. మా అమ్మమ్మ వాళ్లది ఉమ్మడి కుటుంబం. మా తాతయ్య వాళ్ళు ముగ్గురు అన్నతమ్ములు. వారు వారి సంతానంతో ఇల్లెప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఇంటి ముందు చాలా పెద్ద ఖాళీ స్థలం. ఇంటి ముందు ఎప్పుడూ పచ్చని చెట్లతో, మా చిన్న తాతయ్య ప్రేమగా పెంచే పూల మొక్కలతో, కూరగాయ మొక్కలతో చాలా అందంగా ఉండేది.


రంజాన్ నెల మొదలవ్వగానే మసీదులో వారు, ఊరి కుర్రాళ్లు అందరూ మసీదుకి పెయింట్ వేయించడాలు, మరమ్మత్తులు చేసి లైటింగ్‌తో అందంగా అలంకరించేవారు. ఆడవారందరూ ఇల్లు శుభ్రం చేసుకోడం, ఆ నెలకి సరిపోయే సరుకుల చిట్టా చూసుకోడం చేసేవాళ్ళు. ఇక ఉపవాసాలు మొదలు పెట్టే ముందు నెలవంకను చూస్తారు. అలా నెలవంకను చూశాక ఇక ఉపవాసాలు మొదలైనట్టే. ఆ రాత్రంతా చాలా హడావిడిగా ఉండేది. ఇంట్లో ఎవరెవరు ఉపవాసాలు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు అని మళ్లీ దాని గురించి చర్చలు. మా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా ఉపవాసం ఉండటానికి ఆసక్తి చూపేవాళ్ళంట.


మొదటి సెహ్రీ (తెల్లవారు ఝామున 4 AM భోజనం చేసేదాన్ని సెహ్రీ అంటారు) రోజు, పెద్దవాళ్ళు పొద్దున్నే 3 AM కి లేచి సెహ్రీకి అన్నీ సిద్ధం చేసుకునేవారు. మా తాతమ్మ, అమ్మమ్మ వాళ్ళు అంత పొద్దున్నే వంటకం మొదలు పెట్టేవారు. అదంతా చూస్తున్న పిల్లలకు చాలా సందడిగా ఉంటుంది. ఆ ఆనందంలో ఏమాత్రం నిద్ర మత్తు లేకుండా, ఎక్కడ సెహ్రీ టైం అయిపోతుందో అని గబా గబా లేచి పళ్లు తోముకొని, ముఖాలు కడుక్కొని ఎవరి ప్లేట్, గ్లాస్ వాళ్ళు తీసుకొని పిల్లలంతా కలిసి ఒక పక్కకి కూర్చునేవారు. ఐదింటికి నమాజ్ చేసి పడుకునేవాళ్ళు. ఒక్కసారి ఉపవాసం ఉంటే సాయంత్రం ఇఫ్తార్ దాకా పచ్చి మంచినీళ్లు కూడా తాగకూడదు.


ఉదయం లేచాక ఉపవాసం ఉన్నారన్న సంగతి మర్చిపోయి నీళ్లు తాగబోయే వారంట. ఆ రోజుల్లో ఇలాంటి పొరపాట్లు ఎన్నో జరిగేవి. కొంత మంది పిల్లలైతే మర్చిపోయి అలవాటులో తాగేసి ఏమవుతుందోనని భయపడి ఏడ్చేవారు. సరదాకి ఇంటి పక్క పెద్దవాళ్ళు "అయ్యో, తాగేసావా? ఇంక నువ్వు నరకానికేలే! ఎంత పాపం చేశావ్!" అని కావాలని భయపెట్టేవారు. ఆ భయానికి ఇంకా ఏడ్చేవారు. 


ఇంట్లో వారు "ఏం కాదులే, మర్చిపోయి తాగితే!" అని నచ్చజెప్పే దాకా ఊరుకునేవారు కాదు. ఉపవాసాలు ఉన్నా కానీ సాయంత్రం ఎప్పుడవుతుందో అని ఎదురుచూస్తూ ఆటల్లో పడిపోయేవారు. ఆడుకొని ఆడుకొని ఉపవాసం అయిపోడానికి (ఇఫ్తార్) ఇంకా పది నిమిషాలు ఉందనగా పళ్లు తోముకొని, కాళ్లు చేతులు కడుక్కొని కూర్చునేవాళ్ళు. వజూ చేసుకొని వెళ్లేవారు. దస్తర్‌ఖాన్ (తినేటప్పుడు పరిచే క్లాత్) మీద 4-5 రకాల వంటకాలు, పుచ్చకాయ, అరటిపళ్లు, ఖర్జూరాలు, రూఆఫ్జా (చల్లని డ్రింక్ లాంటిది) ఉండేవి. 


మసీదులో సైరన్ మోగగానే దుఆ చదివి ఉపవాసం విరమించేవారు. ముందు అన్ని రకాల పదార్ధాలు ఉన్నా ఫస్ట్ ఖర్జూర పండుతోనే ఉపవాసం విరమించాలి. ఇంట్లో మగవారు మసీదులోనే ఉపవాసం విరమించేవారు. ఇఫ్తార్‌లో ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ ఫేమస్ ఐటెం మసీదులో చేసే గంజి. ఇంట్లో మగవాళ్ళు మసీదులో ఇఫ్తార్ చేసి, నమాజ్ చదువుకొని మసీదులో ఇచ్చే గంజి-బూందీ, ఖర్జూర పళ్లు తెచ్చేవారు.

వేడి వేడి గంజి మీద బూందీ వేసుకొని తింటారు. ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు దానికి ఫ్యాన్స్ అయిపోవాల్సిందే. అన్నట్టు రంజాన్‌లో ఇచ్చే గంజికి-బూందీకి మతంతో సంబంధం లేదండోయ్... హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్‌లో రంజాన్ గంజి-బూందీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.


ఇంట్లో వాళ్ళు ఎంత చేసినా రంజాన్‌లో మసీదులో చేసిన టేస్ట్ రాదెందుకో?


ఇఫ్తార్ అయిన తరువాత, ప్రశాంతమైన చల్లని గాలిలో ఆరుబయట అంతా చేరి కూర్చునేవారు... మొదటి రోజా వాళ్లకు ఎలా ఉందో కాసేపు చర్చలు జరిపి. అలా ఆరుబయట పిల్లలంతా నులక మంచంపై పడుకొని ఆకాశంకేసి చూస్తే నెలవంక ఎంత అందంగా ఉండేదో! రాత్రి భోజనాలు చేసి తరవీహ్ నమాజ్ చేసి పడుకుంటారు. ఈ రంజాన్ నెల మొత్తం మా ఊరి మసీదు లైటింగ్‌తో, నమాజ్‌కి వెళ్లే జనాలతో వెలిగిపోతూనే ఉంటుంది.


ఇలా రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉంటారు. ఆ నెల మొత్తం ఒక కొత్త కళతో, సందడితో ప్రతి రోజు పండుగలానే ఉంటుంది.


ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఎన్నో తీపి గుర్తులు. మరువలేని, తిరిగిరాని మధుర జ్ఞాపకాలు.


మా ముత్తాతగారు, తాతమ్మ కాలం చేశాక ఇంటి కళ తప్పింది. ఇప్పుడు మా ముత్తాతగారు లేరు, ఇంటికి ఆ పండుగ కళ లేదు. ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయిపోయి వారి అత్తారింటికి వెళ్లిపోయారు. మగపిల్లలు ఉద్యోగాల పేరిట, చదువుల పేరిట పట్టణాలకు వెళ్లిపోయారు. ఈ జ్ఞాపకాలన్నీ చెరపలేని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

***

మరొక కథతో మళ్లీ కలుద్దాం -మీ అనిసా తబస్సుమ్ sk❤

అనిసా తబస్సుమ్ SK  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కథ సమాప్తం


అనిసా తబస్సుమ్ SK


3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Good olden days🥰

Like
Shaik Anu
Shaik Anu
Feb 27
Replying to

Thank you😇

Like

Shaik Anu
Shaik Anu
Feb 23
Rated 5 out of 5 stars.

❤❤❤

Like
bottom of page