top of page

తరంగిణి


'Tharangini' - New Telugu Story Written By Sheik Najeer

'తరంగిణి' తెలుగు కథ

రచన: షేక్ నజీర్


తెల్లవారుఝామునే లేచి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గేస్తూ ఉంది తరంగిణి. ఇంట్లో నుంచి కోపంగా వాళ్ల పిన్ని అరుపులు వినిపిస్తున్నాయి" ఏందే! ఇంకా ఎంతసేపైనా ముగ్గేస్తూనే ఉంటావా, మా ముఖానికి టీ కాఫీ ఇచ్చేది ఉందా లేదా?”.


ముగ్గు మధ్యలో ఆపేసి గబగబా ఇంట్లోకి వచ్చింది తరంగిణి.


తరంగిణిని చూసి కస్తూరమ్మ “ఏంటే పిలిస్తే వినిపించడం లేదా ?చెవుల్లో దూదులు పెట్టుకున్నావా? వెధవసంత ...వెధవసంత ….పుట్టగానే తల్లిని మింగేసావే పాపిష్టి ముఖం దానా .. నిన్ను ఇంకా ఎన్నిరోజులు భరించాలో” అని కోపంగా తరంగిణి పై అరుస్తుంది కస్తూరమ్మ.


తరంగిణి వంటింట్లోకి వచ్చి ఏడుస్తుంది. “మీ పిన్ని అలానే అరుస్తుంది పట్టించుకోకమ్మా” అని రాజారామ్ తన కూతురుతో అన్నాడు.


తండ్రిని చూసిన వెంటనే తరంగిణి” నాన్నా!” అని గట్టిగా పట్టుకొని “ఎందుకు నాన్నా అన్ని కష్టాలు నాకే?” అని ఏడుస్తుంది.


“ఊరుకో తల్లీ! తప్పు నేనే చేశాను. మీ అమ్మ చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే నీకు తల్లి అవుతుందని అనుకున్నాను .ఇలా నిన్ను రాచిరంపాన పెడుతుందని అనుకోలేదు తల్లీ!” అని రాజారాం బాధపడుతూ ఓదార్చాడు తరంగిణి ని.


టీ తీసుకొని వచ్చి తరంగిణి ,’ఇదిగో పిన్నీ! ‘ అని అంది.


కస్తూరమ్మ కోపంతో తరంగిణి చేతిలోనుండి టీ కప్పు లాక్కొని సాసర్ తో సహా నేలకు విసిరి కొట్టింది .పగిలి ముక్కలై పోయింది.


“ ఏంటే? నేను టీ ఎప్పుడు తెమన్నాను ?నువ్వు ఎప్పుడు తీసుకొస్తున్నావు ?ఏంటే ...ఒళ్ళు కొవ్వెక్కిందా?” అని తరంగిణి ని రెండు చెంపలపై ఎడాపెడా కొట్టింది .


రాజారామ్ పరిగెత్తుకుంటూ వచ్చి “ఏంటే... చిన్నపిల్ల ఎంబటి పడుతున్నావు?” అని కస్తూరమ్మ పై అరిచాడు.


తరంగిణి పగిలిపోయిన సాసర్ కప్పు ముక్కలను ఏరుతూ ఉంది.


“అబ్బో ! చాల్లే సంబడం .అది చిన్నపిల్లనా, రాక్షసి నా ?గంఢాన దాపురించింది. ఇది ఎప్పుడు ఇంట్లోనుంచి వెళ్లి బయట అడుగు పెడుతుందో అప్పుడు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. నీ ఈడు అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళవుతున్నాయి ముదనష్టపు జాతకురాలా !పెళ్లి లేదు పెటాకులు లేదు ఇంట్లో పడి ఏస్తుంది" అంది కస్తూరమ్మ .


రాజారామ్ ఏమీ చేయలేక చేతకానివాడిలా చూస్తు కూర్చున్నాడు.


రాజారామ్ కు తన కూతురి పెళ్ళి చేయాలన్న ఆలోచన పడింది .పెళ్లిళ్ల పేరయ్య దగ్గరికొచ్చి 'ఏదైనా మంచి సంబంధం చూడండి . మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలి ‘ అని అన్నాడు.

“సరే , తప్పకుండా . రేపే ఒక మంచి సంబంధం మీ ఇంటికి తీసుకొని వస్తాను “ అని అన్నాడు పెళ్లిళ్ల పేరయ్య.


రాజారామ్ ఇంటికొచ్చి రేపు మన ఇంటికి పెళ్లి వారు అమ్మాయి ని చూడటానికి వస్తున్నారు అని కస్తూరమ్మతో అంటూ ఉంటే తరంగిణి విన్నది.


తెల్లవారగానే పెళ్లివారు అమ్మాయిని చూడడానికి కస్తూరమ్మ ఇంటికి రానే వచ్చారు.


‘ నమస్కారం రాజారామ్ గారు ‘ అని పరిచయాలు మొదలుబెట్టాడు పెళ్లిళ్ల పేరయ్య.


‘ఆవిడ గారి పేరు అనసూయమ్మ .వారికి ఒక్కడే సంతానం. పేరు మోహన్. అబ్బాయికి తాగుడులాంటి అలవాట్లు లేవు. యాభై ఎకరాల మాగాణి .చాలా మంచి సంబంధం. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు .నాది బాధ్యత .’అని పరిచయాలు ముగించి ‘అమ్మాయిని తీసుకురండి’ అన్నాడు.


తరంగిణి పెళ్లి వారందరికీ టీ తీసుకొని వచ్చింది .చామనచాయ రంగు .తెలుగింటి అమ్మాయి లా అలంకరించుకొని వచ్చి మోహన్ కు టీ కప్పు ఇచ్చింది. మోహన్ తరంగిణి ని చూసి నవ్వాడు. తరంగిణి తలదించుకుని అందరికీ టీలు ఇచ్చి కింద కూర్చుంది.


అనసూయమ్మ కు పిల్ల కట్నకానుకలు నచ్చడంతో సంబంధం ఖాయం చేసుకున్నారు. ఆ రోజు మంచిరోజు కావడంతో నిశ్చితార్థం ఆ రోజే పెట్టుకొని వారంలో మంచి ముహూర్తం చూసుకున్నారు. పెళ్లి హడావుడి లు జరుగుతున్నాయి.


( అనసూయమ్మ ఎంత కఠినాత్మురాలు, ఛాదస్తురాలో చుట్టుపక్కల నాలుగుళ్లకు తెలుసు .

ఎంత తెగింపు మనిషో అంత మొరటు మనిషి. )


ఊఁ అంటూ పెళ్లి రోజు రానే వచ్చింది .పచ్చని తోరణాలతో ఇల్లంతా కళకళలాడుతూ ఉంది.ముత్యాల పందిరి వేసి, బాజాభజంత్రీలతో వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు, ఏడడుగులు, చల్లని దీవెనలతో తరంగిణి పెళ్లి జరిగి అత్తారింటికి బయలుదేరింది.


పెళ్ళైన నెల రోజులు ఓపిక పట్టింది అనసూయమ్మ. వరకట్నం లో సగం ఇచ్చి,మిగిలింది తర్వాత ఇస్తామన్నారు. అనసూయమ్మ కోపంతో తరంగిణి ని పిలిచి “ఏంటి మీ నాన్న ? వరకట్నం లో డబ్బులు తర్వాత ఇస్తామని అన్నారు .ఇంకా ఇవ్వలేదు .అసలు నన్ను ఏమనుకుంటున్నారు?. ఊరుకుంటే వదిలేస్తుందిలే అని అనుకుంటున్నారా? మీ నాన్నకు కబురు పంపి వెంటనే డబ్బులు పంపమని చెప్పు ?అని హెచ్చరించింది


తరంగిణి ఉత్తరం రాసి కబురు పంపించినా కస్తూరమ్మ సూటిపోటి మాటలతో రాజారామ్ ని కట్టివేసింది.


వరకట్నం లోని సగం డబ్బులు అందక అనసూయమ్మ కోడల్ని రాచిరంపాన పెడుతుంది.

పెళ్ళైన ఏడాది నిండకముందే తరంగిణి నీళ్లు పోసుకుంది. చల్లని వార్త అత్తగారికి చెప్తే’ కడుపులో మగ పిండం అయితేనే ఉంచుకో. కాదు కూడదని ఆడపిల్లని కన్నావని తెలిసిందో నిన్ను రోడ్డు మీద కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను .’అని గట్టిగా అరిచి చెప్పింది అనసూయమ్మ.

పక్కనే ఉన్న మోహన్. భార్య అంటే ప్రేమే కానీ, తల్లి మాటలకు అడ్డు వచ్చే ధైర్యం లేక తలదించుకుని చూస్తూ ఉన్నాడు.


తరంగిణి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చి తన నాన్నకు కబురు పంపింది “నాన్నా! నువ్వు తాత కాబోతున్నావు .నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రండి .అని లేఖ రాసి పంపించింది.


అది విన్న రాజారామ్ వెంటనే కూతురుని చూడడానికి ఊరు బయలుదేరాడు.


అనసూయమ్మ కుర్చీలో కూర్చొని ఉంది. ‘నమస్కారం అక్కయ్య గారు’ అని పలకరించాడు రాజారామ్ గారు.


‘వాటికి తక్కువ లేదు అన్నయ్య గారు .నయా పైసా ఖర్చు ఉండదు కదా. వరకట్నం డబ్బులు ఇస్తాన్నారు ...ఇంతవరకు మీరు మా ఇంటి గడప తొక్కనే లేదు . డబ్బూ ఇవ్వలేదు’ అని కఠినంగా మాట్లాడింది.


ఆ మాటలు అర్థం చేసుకొని రాజారాం ‘నా కూతురు ఇక్కడ ఎలా ఉంటుందో’ అని అర్థం చేసుకున్నాడు. ‘తరంగిణి ఎక్కడుంది చెల్లెమ్మ గారూ’ అని ఆప్యాయతగా అడిగాడు.

ఎక్కడకు వెళ్లి చచ్చిందో ఎవరికేమి ఎరుక ?దాన్ని చూడాలనుకుంటే డబ్బులు తీసుకుని వచ్చి చూడండి. లేదా దాన్ని ఈ ఇంటి నుండి తీసుకుని వెళ్ళండి’ అని అనసూయమ్మ గొడవగా మాట్లాడింది.


ఆ మాటలు పడలేక కూతుర్ని చూడలేక తిరిగి ఇంటికి వచ్చేశాడు రాజారామ్ గారు.


నెలలు నిండిన తరంగిణి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కోపంతో అనసూయమ్మ పచ్చి బాలింతరాలని చూడకుండా ఇంట్లో నుండి తరిమేసింది. మోహన్ కు తన కూతురు ఎలా ఉందో కూడా చూడలేదన్న బాధ, తిరిగి తన తల్లి అనసూయమ్మ కి ఎమి చెప్పాలో తెలియక సతమతమవుతున్నాడు.

తరంగిణి ఏడుపు ముఖంతో దీనంగా తన భర్త కళ్లను చూసి రోడ్డున తన బిడ్డను ఎత్తుకొని ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళాలో నా బ్రతుకు ఏమైపోతుందో అనుకుంటూ, ఏడుస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతుంది. ఎదురుగా బస్సు వచ్చింది. బస్సు ఆపి ఎక్కింది. టికెట్ కు డబ్బులు లేక మెడలో మంగళసూత్రం తీసి కండక్టర్ చేతిలో పెట్టి, ”అన్నా! బస్సు ఎక్కడికి వెళ్తుందో అక్కడికి టికెట్ ఇవ్వు.” అంది తరంగిణి.


‘అది మెడలో వేసుకో అమ్మా. నీ టికెట్ డబ్బులు నేను ఇస్తాను.’ అని తనని అర్థం చేసుకోని కండక్టర్ గారు టికెట్ ఇచ్చారు.


బస్ స్టేషన్ వచ్చింది .తరంగిణి బస్సు దిగి, ఒక చెట్టు కింద కూర్చొని దీనంగా ఏడుస్తూ ఉంది. ‘ఎందుకమ్మా నన్ను పుట్టించావు? నీతో పాటు నన్ను తీసుకెళ్తే ఈ బాధలు తప్పేవేమో! నా జీవిత ప్రయాణం ఎక్కడికి సాగి పోతుందో నాకే తెలియడం లేదు అని తన తల్లిని తలుచుకుంటూ ఏడుస్తుంది తరంగిణి.


అట్నుంచి ఒక ఆడ కూతురు వచ్చి ఓదార్చి తన ఇంటికి తీసుకెళ్లి కడుపునిండా అన్నం పెట్టి పక్కనున్న తన ఇంటి పక్కన ఖాళీ గది చూపించి అందులో ఉండమని ధైర్యం చెప్పింది. నెలలు గడిచి పోతున్నకొద్దీ గుండె దిటవు చేసుకోని తరంగిణి పక్కన ఆవిడ దగ్గరికి వెళ్లి “అక్కా! ఈ మంగళసూత్రం అమ్మి ఆ డబ్బులతో నాకు గాజులు కొని పెట్టు . నేను వాటిని అమ్ముకొని బ్రతుకుతాను” అని అంది .


బుట్ట నిండా గాజులు, ఒక పక్కన బిడ్డను పడుకోబెట్టి బుట్ట నెత్తి మీద పెట్టుకొని ఊరురూ తిరుగుకుంటూ గాజులను అమ్ముతుంది తరంగిణి. తన బిడ్డను గొప్పగా చదివించి గొప్ప స్థాయిలో నిలబెట్టాలని ధైర్యంగా ముందడుగు వేసి బిడ్డను డాక్టరు గా చదివించి (తరంగిణి నర్సింగ్ హోం) అనే పెద్ద ఆస్పత్రి కట్టించింది.


పేదలకు చక్కని వైద్యం అందిస్తుంది తరంగిణి కూతురు డా. వైశాలి. ఉదయమే డాక్టర్ వైశాలి కి ఫోన్ రావడంతో గబగబా ఆస్పత్రికి బయలుదేరింది. ఒళ్లంతా రక్తపు గాయాలతో వున్న ఒక మనిషిని బెడ్ పైన పడుకోబెట్టారు.


“నర్స్! ఆయనకు ఏమయింది ?” అని వైశాలి అడిగింది.

“మేడం. యాక్సిడెంట్ కేస్ “ అని అంది నర్స్.


యాక్సిడెంట్ అయిన కేసుని ఐ సి యూ లోకి తరలించి సెలైన్ పెట్టి వైద్యం అందిస్తున్నారు పేషెంట్ కి. కూతురు ఇంటి దగ్గర టిఫిన్ చేయలేదు అని బాక్స్ తీసుకొని హాస్పిటల్ కి వచ్చింది తరంగిణి.


‘తరంగిణీ ‘ అని చిన్నగా పిలుపేదో వినిపించిందని వెనుకకు తిరిగి చూసింది ఎవరూ కనిపించలేదు.


అయినా వినిపిస్తూనే ఉంది ఐ సి యూ లో ఉన్న పేషంట్ వంక చూసేసరికి చేతితో సైగ చేస్తున్నాడు.


ముఖానికి బ్యాండేజ్ చుట్టడంతో ఎవరో అర్థం కాలేదు .డోరు తీసి లోపలికి వెళ్ళింది తరంగిణి.


పేషెంట్ ని సరిగ్గా చూసింది .అతను ఎవరో కాదు తరంగిణి భర్త మోహన్. ఒకవైపు బాధపడాలో ఒకవైపు సంతోషించాలో తెలియక తరంగిణి అలాగే చూస్తూ ఉండిపోయింది.


నువ్వు హాస్పిటల్ ఎందుకు వచ్చావని మోహన్ అడిగాడు. “ఇది మన హాస్పిటలే నండి .ఇందులో డాక్టర్ వైశాలి మన అమ్మాయే. వైశాలీ “ అని గట్టిగా అరిచింది తరంగిణి.


వైశాలి పరిగెత్తుకుంటూ వచ్చి “ఏమైందమ్మా అంత గట్టిగా అరిచావు” అంది.


“వైశాలీ! ఇదిగో ఈయనే మీ నాన్నగారమ్మా.”


వైశాలి తన నాన్న పాదాలపై పడి సంతోషంతో ఏడ్చింది.


రెండు మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసుకొని తన తల్లిదండ్రులను ఇంటికి తీసుకు వెళ్ళింది వైశాలి.


వైశాలి నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య లకు కబురు పెట్టి వాళ్ళందరిలో మార్పు రావడంతో ఒకే ఇంట్లో వుంటూ సంతోషాల సంబరాలు జరుపుకుంటున్నారు కుటుంబం .

***

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
202 views0 comments

Comments


bottom of page