top of page

నాకేమవుతోంది.. ? ఎపిసోడ్ 22


'Nakemavuthondi Episode -22' New Telugu Web Series

Written By Mallavarapu Seetharam Kumar

'నాకేమవుతోంది ఎపిసోడ్ -22' తెలుగు ధారావాహిక

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ...


కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త తరుణ్ నిద్ర లేపి, ఆమె తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు. అతన్నే అనుమానిస్తుంది ప్రియ.


స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల, గతంలో జరిగిన సంఘటనలు వివరిస్తుంది.

గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది.

అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది ప్రియ. తన గదిలోకి వచ్చిన వ్యక్తి అతని పేరు నీలకంఠం అని చెబుతాడు.


సిసి కెమెరా ఫుటేజ్ లో ప్రియ గదిలోకి ఎవ్వరూ వెళ్లలేదని తెలుస్తుంది. మరణించిన తన స్నేహితురాలు భార్గవిని చూడటానికి తల్లిదండ్రులతో హైదరాబాద్ వెడుతుంది ప్రియ. అక్కడ భార్గవి మేనమామ పేరు నీలకంఠం అని తెలిసి ఆశ్చర్య పోతారు ప్రియా పేరెంట్స్.


ప్రియా తండ్రి ప్రభాకర రావు చొరవతో పోలీసులు నీలకంఠం ఇంట్లో సోదా చేసి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుంటారు.


ప్రియను ఆమె తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తారు.


ప్రియకు మానసిక లోపం వల్లే జరగనివి జరిగినట్లు ఉహించుకొంటోందని చెబుతాడు సైకియాట్రిస్ట్ శ్రీనివాస్.

స్పృహలోకి వచ్చిన ప్రియా తను డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుంటుంది. తాను హాస్పిటల్ కి చేరుకునేవరకు జరిగిన విషయాలు డాక్టర్ శ్రీనివాస్ కి వివరిస్తుంది.


ప్రియా జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు, మాజీ మినిష్టర్ కనకరావుకు ఉన్న సంబంధం గురించి చెబుతాడు డాక్టర్ శ్రీనివాస్.


కనకారావు పిఎ డాక్టర్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి, మరుసటి రోజు ప్రియను కనకారావు గెస్ట్ హవుస్ కి తీసుకొని రమ్మంటాడు. అక్కడ ఢిల్లీనుండి వచ్చిన సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్ ఆమెను పరీక్షిస్తారని చెబుతాడు.


ప్రియను తీసుకొని కనకారావు గెస్ట్ హౌస్ కి వెళతారు డాక్టర్ శ్రీనివాస్ దంపతులు.. ఉదయ్, ప్రవల్లికలు కూడా వారితో వెళ్తారు. హిప్నాటిజం గురించి భయపడనవసరం లేదని ప్రియతో చెబుతాడు హిప్నాటిస్ట్ భూషణ్.


ట్రాన్స్ లోకి వెళ్లిన ప్రియ, హత్య కాబడటానికి ముందు రోజు భార్గవి తనకు గుర్తుకు వచ్చినట్లు చెబుతుంది.


కనకారావు శ్రీనివాస్ కి ఫోన్ చేసి మరుసటి రోజు ప్రియను చంపబోతున్నట్లు చెబుతాడు.

ప్రియ స్థానంలో తాను ఉంటానంటుంది ప్రవల్లిక. ఆమెకు సహాయంగా ఉదయ్ ఉంటానంటాడు.


తనను చంపడానికి ఒక వ్యక్తి కత్తితో వస్తున్నట్లు, అతన్ని మరో వ్యక్తి ఐరన్ రాడ్ తో కొట్టినట్లు ఆ రాత్రి ప్రియకు కల వస్తుంది.



ఇక నాకేమవుతోంది.. ధారావాహిక ఎపిసోడ్ 22(చివరి భాగం) చదవండి.



మరో అరగంటకి ప్రియ నిద్రలేచి హాల్లోకి వచ్చింది.


"నువ్వు బ్రష్ చేసుకుని రిఫ్రెష్ అయ్యి రా ప్రియా! ఈలోగా నేను వాచ్మెన్ ని పంపి అందరికీ కాఫీలు తెప్పిస్తాను" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.


తర్వాత వాచ్మెన్ ని పిలిచి ఫ్లాస్క్ నిండా కాఫీ తెమ్మని డబ్బులు ఇచ్చి పంపాడు.


అంతలో ఏదో సందేహం వచ్చి వెళ్తున్న అతన్ని పిలిచి, "నిన్న మీ అయ్యగారు నీకు ఫోన్ చేసి మేము వచ్చిన విషయం అడిగారా? ఏమని అడిగారు.." అని ప్రశ్నించాడు.


వాచ్మెన్ మాట్లాడుతూ "ఢిల్లీ నుంచి వచ్చినవాళ్ళని అయ్యగారి కారు డ్రైవర్ ఇక్కడ దింపి వెళ్ళాడు. అయ్యగారు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని, మీతో పాటు వచ్చిన వాళ్ళని ఆపవద్దని చెప్పాడు. ఇంకెవరు వచ్చినా గెస్ట్ హౌస్ లోకి రానివ్వ వద్దని చెప్పాడు. నిన్న నేనే ఒకసారి అయ్యగారికి ఫోన్ చేశాను. తీయలేదు.


తర్వాత ఆయన పిఏ సెల్ నుండి ఫోన్ చేసి, ఏదైనా అవసరం ఉంటే ఆ నెంబర్ కి చెయ్యమన్నాడు. ఆ పిఎ నాకు మామ వరసవుతాడు. నాకు ఇక్కడ పని ఇప్పించింది కూడా ఆయనే. అయన రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదని మా అత్త నాకు ఫోన్ చేసి చెప్పింది" చెప్పడం ఆపి ఒకసారి అటూ ఇటూ చూసి "ఈ దుర్మార్గుడు మా మామను ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది" అన్నాడు.


"ఏమీ కాదులే, ధైర్యంగా ఉండు. ముందు కాఫీ తీసుకొని రా. నీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు శ్రీనివాస్.


"అలాగేనయ్యా" అంటూ నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు అతను.


ఆ వాచ్మెన్ పేరు రంగయ్య. గతంలో అతని భార్యకు అనారోగ్యంగా ఉన్నప్పుడు శ్రీనివాస్ భార్య డాక్టర్ శ్రీదేవి ఆమెకు ట్రీట్ చేసింది. ఆ పరిచయంతోనే శ్రీనివాస్ తో తన అనుమానం చెప్పాడు రంగయ్య.


అతను కాఫీ తేవడానికి వెళ్ళగానే లోపలికి వచ్చిన శ్రీనివాస్, అందరితో అతను చెప్పిన విషయం చెప్పాడు.


"ప్రియ కల నిజం కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. నా అంచనా ప్రకారం ఆమె కలలో కనకారావును చంపింది అతని పి ఏ ఏకాంబరం". చెప్పాడు ఉదయ్.


అప్పుడే అక్కడికి రిఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రియకు తన లాప్టాప్ లో కనకారావు, ఏకాంబరం ఉన్న వీడియో చూపించాడు శ్రీనివాస్.. చూస్తున్న ప్రియా కళ్ళు పెద్దవయ్యాయి.


హత్య కావింపబడింది కనకారావు అనీ, హత్య చేసింది అతని పిఏ ఏకాంబరం అనీ తేల్చి చెప్పింది ప్రియ.


"ఇది ఎలా సాధ్యం? తన పీయేని కనకారావు బంధించి ఉన్నాడు కదా!" అంది డాక్టర్ శ్రీదేవి.

"వాచ్మెన్ రంగయ్య కు కనకారావు, తన పిఏ ఏకాంబరాన్ని తన ఇంటి కాంపౌండ్ లో ఉన్న ఒక సర్వెంట్ క్వార్టర్ లో బంధించి ఉన్న విషయం చెబుదాము. కల నిజం కావాలంటే అతను ఏకాంబరాన్ని విడిపిస్తాడు" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.


ఉదయ్ మాట్లాడుతూ "ఐడియా బాగానే ఉంది. కానీ ఏకాంబరాన్ని విడిపించడం పరోక్షంగా కనకారావు హత్యకు సహకరించినట్లే కదా.. విషయం తెలిస్తే మా బాబాయ్ ఏసిపి ప్రతాప్ గారు కానీ డిటెక్టివ్ పురంధర్ గారు కానీ మనల్ని తప్పు పడతారేమో" అన్నాడు.


ప్రవల్లిక మాట్లాడుతూ "ప్రియా కల నిజమవుతుందని నిరూపించే ఏ ఆధారాలు మన దగ్గర లేవు. ప్రస్తుతానికి అది కేవలం ఊహ మాత్రమే. ఏకాంబరాన్ని కనకారావు బంధించి ఉన్నాడనేది వాస్తవం. ఆ మాట అతనే డాక్టర్ శ్రీనివాస్ గారితో చెప్పాడు. అతనికి కచ్చితంగా ప్రాణహాని ఉంటుంది. కాబట్టి మన ఊహ ప్రకారం కనకారావు హత్య చేయబడతాడు అనుకోవడం కంటే ఏ ఏకాంబరం బంధించబడ్డ సంగతి రంగయ్యకు చెప్పడం మంచిపని. తరువాత జరగబోయే పరిణామాలకు మన బాధ్యత లేదు. పైగా కనకారావు లాంటి దుర్మార్గుడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. తనకు ఏ హాని చెయ్యకపోయినా ప్రియాను చంపాలని చూస్తున్నాడు అతను" అని చెప్పింది.


"మీరు చెప్పింది కరెక్టే" అన్నాడు ఉదయ్. అక్కడ ఉన్న అందరూ కూడా ప్రవల్లిక మాటలకు ఆమోదం తెలిపారు.


ఇంతలో రంగయ్య ఫ్లాస్క్ లో టీ తీసుకొని వచ్చి అందరికీ కప్పుల్లో పోసి అందించాడు. డాక్టర్ శ్రీదేవికి నమస్కరించి "అమ్మా! ఆరోజు మీరు నా భార్యకు వైద్యం చేసి ఆమె ప్రాణాలు కాపాడారు" అని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.


శ్రీనివాస్ అతనితో మాట్లాడుతూ "ఏకాంబరం మీకు మామ వరస అవుతాడని చెప్పావు కదా! అతన్ని కనకారావు తన ఇంటి దగ్గరే ఎక్కడో బంధించినట్లు మాకు తెలిసింది. మరి ఈ విషయంలో పోలీసులకు రిపోర్ట్ చేస్తావా? మరేదైనా ఆలోచిస్తావా నీ ఇష్టం.." అని చెప్పాడు.


"ఆ కనకారావు ఇంటి పని వాళ్ళలో నాకు కావలసిన వాళ్లు ఉన్నారు. వాళ్ల సహాయంతో ముందు మా మామను విడిపిస్తాను. తర్వాత ఏం చేయాలనేది ఆయనే నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే కనకారావు గుట్టుమట్లన్నీ అతనికి బాగా తెలుసు" అన్నాడు రంగయ్య.


అతను బయటకు వెళ్లిపోయాక అందరూ హాల్లో కూర్చుని ఏం చేయాలో మరోసారి చర్చించుకున్నారు. ఒకవేళ ఏకాంబరం ఇక్కడికి రాకపోతే ఏం చేయాలి.. అనే విషయంగా మాట్లాడుకున్నారు.


ప్రవల్లిక డాక్టర్ శ్రీనివాస్ తో మాట్లాడుతూ "మీరు కనకారావు తో నేను ఉన్న గదిని చూపించండి. నేను ముఖానికి మాస్క్ వేసుకొని పడుకొని ఉంటాను. కనకారావు నామీద అటాక్ చేయబోయే సమయానికి అతన్ని ఎదిరిస్తాను. ఉదయ్ ఆ గదిలోనే ఉండి నాకు సహాయం చేస్తాడు" అని చెప్పింది.


ఆరోజు మధ్యాహ్నం కనకారావు త్రిపాఠికి ఫోన్ చేశాడు.


"మీ ఇద్దరికీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. మా డ్రైవర్ ని అక్కడికి పంపిస్తున్నాను. అతను మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాడు. మీ పేమెంట్ కూడా అతని దగ్గరే పంపిస్తాను." అని చెప్పాడు.


త్రిపాఠి మాట్లాడుతూ "భూషణ్ గారి హిప్నాటిజమ్ లో ఆ అమ్మాయి ఎక్కడా మీ గురించి చెప్పలేదు. ఆమెకు మీ విషయాలు ఏవీ తెలియవు" అని చెప్పాడు.


కనకారావు మాట్లాడుతూ "ఆ అమ్మాయి సంగతి నేను ఆలోచిస్తాను. ఇక మీరు ఈ కేసు విషయం వదిలేయండి" అని చెప్పాడు.


"అలాగే. ఆల్ ది బెస్ట్ మిస్టర్ కనకారావు. మళ్లీ మనం కలుసుకోవడం జరగదేమో" అన్నాడు త్రిపాఠి ఫోన్ కట్ చేస్తూ.


"మళ్లీ అతన్ని కలవరా! ప్రియా కల మీద మంచి నమ్మకమే ఉంది మీకు" అన్నాడు భూషణ్.


త్రిపాఠి మాట్లాడుతూ "ముందుగా మనం అనుకున్నది కనకారావు ప్రియా స్థానంలో ఉన్న ప్రవల్లిక మీద హత్య ప్రయత్నం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని! సీసీ కెమెరా రికార్డింగ్ ద్వారా అతన్ని అరెస్ట్ చేయించాలని అనుకున్నాం. కానీ కనకారావు లాంటి వాడికి ఇది పెద్ద సమస్య కాదు. ఏదో ఒక రకంగా బయటకు వస్తాడు. ప్రియాను చంపడానికి మళ్లీ ప్రయత్నిస్తాడు. ఈ సమస్యకు మంచి పరిష్కారం కనకారావు చనిపోవడమే. అదే ప్రియా కు కలగా వచ్చింది. ఇక ఏకాంబరం వాచ్మెన్ రంగయ్యకు బంధువు కావడం, ఆ విషయాన్ని అతను డాక్టర్ శ్రీనివాస్ తో చెప్పడం, ఏకాంబరాన్ని విడిపించాలని రంగయ్య అనుకోవడం.. ఇవన్నీ ఆ కల నిజం కావడంలో జరిగే పరిణామాలే" అన్నాడు త్రిపాఠి.


ఆరోజు మధ్యాహ్నం అందరికీ రంగయ్యే లంచ్ తీసుకువచ్చాడు. ఆ తర్వాత కనకారావు డ్రైవర్ కారుతో వచ్చి త్రిపాఠి, భూషణ్ లను ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్లాడు. వెళ్లే ముందు ఇద్దరూ ప్రియను దగ్గరకు తీసుకొని నీకేమి కాదనీ, అంతా మంచే జరుగుతుందనీ దీవించారు.


తర్వాత త్రిపాఠి ప్రవల్లికతో మాట్లాడుతూ "ఇలా వెంటనే వెళ్ళిపోతున్నందువల్ల నాన్నగారిని కలవలేక పోతున్నాను. మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను. ఈ విషయం ఆయనకు ఫోన్ చేసి చెప్పాను" అన్నాడు.


ఆరోజు సాయంత్రం అయ్యేసరికి అందరిలో ఏదో తెలియని టెన్షన్ మొదలయ్యింది. కల నిజం కాకపోతే ప్రవల్లికకు లేదా ప్రియాకు ఏదైనా ఆపద జరుగుతుందేమో.. కల నిజమైతే కళ్ళముందే ఒక హత్యను చూడాల్సి వస్తుందేమో.. అని అందరూ ఆందోళన పడ్డారు. ఆరోజు రాత్రి 8 గంటలకు కనకారావు డాక్టర్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి రాత్రి 11 గంటలకు తాను వస్తాననీ, ప్రియాను చంపి ఆ శవాన్ని డ్రైవర్ సహాయంతో తీసుకొని వెళ్తాననీ ఎవరికీ కనపడకుండా మాయం చేస్తాననీ చెప్పాడు.


ఫోన్ పెట్టేశాక ఆ విషయం అందరికీ చెప్పాడు శ్రీనివాస్. తర్వాత బయటకు వెళ్లి వాచ్మెన్ రంగయ్యను పలకరించాడు.


రంగయ్య మాట్లాడుతూ "కనకారావు రాత్రికి ఇక్కడికి వస్తాడట కదా! ఆయన డ్రైవర్ తో చెప్పడం విన్న వాళ్లు నాకు చెప్పారు. ఆయన ఇంటి నుండి బయలుదేరగానే అక్కడ తోటమాలిగా పనిచేస్తున్న మా మనిషి, మా ఏకాంబరం మామను విడిపిస్తాడు" అని చెప్పాడు.


లోపలికి వచ్చి ఇదే విషయాన్ని అందరికీ చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్.


"ఇప్పుడు జరగబోయేది క్లియర్ గా అర్థమవుతోంది. కనకారావు వెనకే బయలుదేరిన ఏకాంబరం ఇక్కడే అతన్ని చంపబోతున్నాడు" అన్నాడు ఉదయ్.


ఆరోజు రాత్రి 11 గంటలు కావస్తుండగా కనకారావు ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాడు. డ్రైవర్ను బయటే ఉండమని, తను పిలిచినప్పుడు లోపలికి రమ్మని చెప్పి లోపలికి వచ్చాడు కనకారావు. అతను వచ్చేసరికి ప్రియా స్థానంలో ప్రవల్లిక ఒక గదిలో పడుకొని ఉంది. ఆ గదిలోనే ఉదయ్ కనపడకుండా దాక్కొని ఉన్నాడు. ప్రియ మరొక గదిలో ఉంది. డాక్టర్ శ్రీనివాస్, అతని భార్య శ్రీదేవి హాల్లో ఉన్నారు.


కనకారావు రాగానే ఇద్దరూ లేచి నిలబడి విష్ చేశారు.


లోపలికి రాగానే "ఆ అమ్మాయి ఎక్కడ ఉంది?" అని అడిగాడు కనకారావు.


ప్రవల్లిక ఉన్న గదిని చూపించాడు శ్రీనివాస్.


"నేను వెళ్లి పని పూర్తి చేసుకుని వస్తాను. ఒకవేళ ఆ అమ్మాయి తిరగబడి నన్ను ఎదిరిస్తే ఒక కేక వేస్తాను. నువ్వు వెళ్లి డ్రైవర్ ని పిలుచుకొని రా" అని చెప్పి గదిలోకి వెళ్ళాడు కనకారావు.


గదిలో డిమ్ లైట్ వెలుగుతూ ఉంది. భుజాల వరకు దుప్పటి కప్పుకొని, ముఖానికి మాస్క్ వేసుకొని ప్రవల్లిక పడుకొని ఉంది. కత్తి చేతిలో పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళాడు కనకారావు. ఒకసారి ఆమె వంక పరిశీలనగా చూశాడు.


'చిన్న పిట్ట లాగా ఉంది.. కత్తి వాడడం ఎందుకు.. పీక పిసికేస్తే ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించవచ్చు' అనుకొని కత్తిని జేబులో పెట్టుకున్నాడు.


అతను మరి కాస్త దగ్గరకు వస్తే పొట్టలో కాలితో బలంగా తన్ని పైకి లేచి నిలబడాలని తయారుగా ఉంది ప్రవల్లిక. ఇంతలో తన వెనక ఏదో అలికిడైతే వెనక్కి తిరగబోయాడు కనకారావు. అప్పటికే అతని వెనక్కి చేరుకున్న ఏకాంబరం తన చేతిలోని ఐరన్ రాడ్ తో కనకారావు తలమీద బలంగా మోదాడు.


"అమ్మా!' అంటూ గట్టిగా అరవబోయాడు కనకారావు. అతని నోటి నుండి శబ్దం రాకముందే అతని ప్రాణం పోయింది. ప్రవల్లిక మంచం మీద నుండి కిందికి దిగింది. చాటుగా ఉన్న ఉదయ్ బయటికి వచ్చాడు. హాల్లో ఉన్న డాక్టర్ శ్రీనివాస్, శ్రీదేవి కూడా ఆ గదిలోకి వచ్చారు.


శ్రీనివాస్ ఏకాంబరంతో మాట్లాడుతూ "ఎంత పని చేశావు!.. కనకారావును పోలీసులకు పట్టించి ఉంటే సరిపోయేది కదా" అన్నాడు.


కనకారావు చేసిన నేరాలన్నిట్లో నాకు కూడా భాగం ఉంది. అతన్ని పట్టించినా నాకు జీవిత ఖైదు తప్పదు. అదేదో అతన్ని చంపి నా కసి తీర్చుకుంటే, ఆ తర్వాత నాకేమైనా పరవాలేదు అనిపించింది. ఇలాంటి దుర్మార్గుణ్ణి చంపినందువల్ల నా పాపం కొంతైనా తగ్గుతుందేమో.. పోలీసులకు ఫోన్ చేయండి" చేతిలోని ఐరన్ రాడ్డు కింద పడేసి చెప్పాడు ఏకాంబరం.


ఉదయ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ప్రవళిక తన తండ్రికి కాల్ చేసింది. పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. పారిపోబోతున్న కనకారావు డ్రైవర్ ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు సరెండర్ అయిన ఏకాంబరం, తాను కనకారావును హత్య చేసినట్లు ఒప్పుకోవడమే కాకుండా కనకారావు చేసిన వివిధ నేరాల చిట్టాను కోర్టుకు వివరించాడు.


ఆవేశంలో కనకారావును చంపినట్లు కోర్టు నిర్ధారించి ఏకాంబరానికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తన నేరాన్ని స్వయంగా అంగీకరించడమే కాక అప్రూవర్ గా మారి, కనకారావు చేసిన నేరాలు తెలియజేసినందుకు ఆ శిక్షను ఒక సంవత్సరానికి తగ్గించింది.


ప్రియకు ఉన్న అతింద్రీయ శక్తి గురించి ఆమె అనుమతితో పరిశోధన చేయవచ్చని కోర్టు తెలిపింది. హిప్నాటిస్ట్ భూషణ్, డాక్టర్ త్రిపాఠీలు తిరిగి హైదరాబాద్ కి వచ్చారు. ఈసారి ఇద్దరూ నేరుగా డిటెక్టివ్ పురంధర్ గారి ఇంటికి వచ్చారు. ఏసిపి ప్రతాప్, ఉదయ్ లు కూడా అక్కడికి వచ్చారు. ప్రియ, తరుణ్ లను అక్కడికి పిలిపించారు.


త్రిపాఠి మాట్లాడుతూ "ప్రియ కు ఉన్న అతింద్రియ శక్తి గురించి పరిశోధన చేయడానికి కేంద్ర ప్రభుత్వం నాకు, హిప్నాటిస్ట్ భూషణ్ గారికి అనుమతిని ఇచ్చింది. అయితే అందుకు ప్రియా అనుమతి తప్పకుండా అవసరం. అందుకోసమే మిమ్మల్ని పిలిపించాము" అని చెప్పాడు.


"ఈ విషయం గురించి నేను, తరుణ్ మాట్లాడుకున్నాము. ఒక మానవతీత వ్యక్తిగా ఉండాలనే కోరిక నాకు ఎంత మాత్రం లేదు. నాకు సాధారణ జీవితం కావాలి. నేను, నా భర్త సరదాగా గడపాలి. ఇద్దరం కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్ళాలి. వీటన్నిటినీ కోల్పోయే ఏ మానవాతీత శక్తీ నాకు అవసరం లేదు. తరుణ్ కోసం బ్రతకడం లోనే నాకు ఆనందం ఉంది" అని చెప్పింది ప్రియ.


తరుణ్ మాట్లాడుతూ "నాకు కూడా నా ప్రియ కావాలి. నా భార్య గా కావాలి. మీ ప్రయోగాలకు ఒక స్పెసిమెన్ గా ప్రియను వాడుకోవడం నాకు ఇష్టం లేదు" అన్నాడు.


భూషణ్ మాట్లాడుతూ "మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మీ వ్యక్తిగత జీవితాన్ని హైజాక్ చేసే ఉద్దేశం మాకు ఎవరికీ లేదు" అన్నాడు.


"అందరి దగ్గర సెలవు తీసుకొని ప్రియా తరుణ్ బయటకు వెళ్లారు. వెళ్లిన రెండు నిమిషాలకి తిరిగి లోపలికి వచ్చారు.


"నాకు ఉందని చెబుతున్న ఈ అతింద్రియ శక్తి వల్ల మన దేశానికి ఏదైనా మేలు జరుగుతుందని మీకు అనిపిస్తే తప్పకుండా నామీద పరిశోధనలు జరుపుకోండి. దేశం తరువాతే నేను, నా కుటుంబం" చెప్పింది ప్రియ.


"తప్పకుండా ప్రియా! మీ అవసరం వచ్చినప్పుడు మీ సహాయం అడుగుతాము. అంతవరకు మీరు సాధారణ జీవితం గడపండి" అని చెప్పాడు డిటెక్టివ్ పురంధర్.

========================================================================

సమాప్తం


ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

========================================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).




60 views1 comment

1 Comment


vidya sagar vesapogu • 1 hour ago

Nice nice Thanks sir

Like
bottom of page