top of page

నాకేమవుతోంది..? ఎపిసోడ్ 18


'Nakemavuthondi Episode-18' New Telugu Web Series

Written By Mallavarapu Seetharam Kumar

'నాకేమవుతోంది…?' తెలుగు ధారావాహిక ఎపిసోడ్ 18

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ...


కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త తరుణ్ నిద్ర లేపి, ఆమె తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు. అతన్నే అనుమానిస్తుంది ప్రియ.


స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్. హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్.


పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్.

స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల గతంలో జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటుంది.



గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది.

అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది. తన గదిలోకి వచ్చిన వ్యక్తి అతని పేరు నీలకంఠం అని చెబుతాడు.


సిసి కెమెరా ఫుటేజ్ లో ప్రియ గదిలోకి ఎవ్వరూ వెళ్లలేదని తెలుస్తుంది. మరణించిన తన స్నేహితురాలు భార్గవిని చూడటానికి తల్లిదండ్రులతో హైదరాబాద్ వెడుతుంది ప్రియ. అక్కడ భార్గవి మేనమామ పేరు నీలకంఠం అని తెలిసి ఆశ్చర్య పోతారు ప్రియా పేరెంట్స్.


తన మేనమామ తనమీద హత్యా ప్రయత్నం చేసినట్లు తనకు అనిపించడం భార్గవి విషయంలో నిజం అయివుండొచ్చని ప్రియకు అనిపిస్తుంది. ప్రియా తండ్రి ప్రభాకర రావు చొరవతో పోలీసులు నీలకంఠం ఇంట్లో సోదా చేసి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుంటారు.


ప్రియను ఆమె తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తారు. ప్రియకు మానసిక లోపం వల్లే జరగనివి జరిగినట్లు ఉహించుకొంటోందని చెబుతాడు. ఒక సంవత్సరం పాటు ప్రియను మందులు వాడమంటాడు.


తనను బంధించిన ఉదయ్ కి అన్ని వివరాలు చెబుతానంటాడు రంగనాథం.


స్పృహలోకి వచ్చిన ప్రియా తను డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుంటుంది.


తాను హాస్పిటల్ కి చేరుకునేవరకు జరిగిన విషయాలు డాక్టర్ శ్రీనివాస్ కి వివరిస్తుంది. ప్రియా జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు, మాజీ మినిష్టర్ కనకరావుకు ఉన్న సంబంధం గురించి చెబుతాడు డాక్టర్ శ్రీనివాస్.


కనకారావు పిఎ డాక్టర్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి మరుసటి రోజు ప్రియను కనకారావు గెస్ట్ హవుస్ కి తీసుకొని రమ్మంటాడు. అక్కడ ఢిల్లీనుండి వచ్చిన సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్ ఆమెను పరీక్షిస్తారని చెబుతాడు.


తన స్నేహితురాలు ప్రవల్లిక సహాయం తీసుకుంటానని చెబుతుంది ప్రియా.

ఉదయ్, ప్రవల్లికలు ప్రియను కలుస్తారు. హన్సికను ఆమె భర్తే హత్య చేసినట్లు, అతనికి కనకారావు సహకారం ఉన్నట్లు చెబుతాడు ఉదయ్.


ఇక నాకేమవుతోంది.. ధారావాహిక ఎపిసోడ్ 18 భాగం చదవండి.


తన ఇంటికి వచ్చిన ఉదయ్ ని సాదరంగా ఆహ్వానించాడు డిటెక్టివ్ పురంధర్. అతని భుజం పై చేయవేసి తన గదిలోకి తీసుకొని వెళ్ళాడు. గది బయటే ఆగిన ప్రవల్లిక ను చూసి "నువ్వు కూడా రావచ్చమ్మా" అన్నారాయన. వెంటనే ప్రవల్లిక కూడా తండ్రి గదిలోకి ప్రవేశించింది.


"కాఫీ రెడీగా ఉంచాను. తాగాక మాట్లాడుకోండి" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది శారద. చిన్నగా నవ్వుకున్నాడు పురంధర్. తను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పొరపాటున కూడా మధ్యలో తన గదిలోకి రాదు శారద. మరీ అవసరమైతే గది బయటే నిలబడి తలుపు తడుతుంది. లేదా తనకు మిస్డ్ కాల్ ఇస్తుంది.


"అలాగే శారదా! వెయిట్ చేస్తాను" అన్నాడు అతను.

చెప్పినట్లుగానే రెండు నిమిషాల్లో వాళ్లకు కాఫీ అందించింది శారద. ఆమె బయటకు వెళ్లాక ఉదయ్, ప్రవల్లికలను కాఫీ తాగమని చెప్పాడు. తను కూడా కాఫీ సిప్ చేస్తూ చెప్పడం ప్రారంభించాడు.


"రేపు ఢిల్లీ నుంచి హిప్నాటిస్టు భూషణ్, సైకియాట్రిస్ట్ త్రిపాఠి వస్తున్నారు. భూషణ్ తెలుగు వాడే. నాకు బాగా తెలుసు. గతంలో కొన్ని కేసుల విషయంలో అతని సహకారం తీసుకున్నాను. అతను నాకు క్యాజువల్ గా కాల్ చేశాడు. కనకారావు ఒక పేషంట్ విషయంగా తన సహకారం కోరినట్లు చెప్పాడు. అందుకోసం తను హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పాడు. నన్ను తప్పకుండా కలుస్తానని చెప్పాడు. దాంతో అతను వచ్చేది ప్రియా విషయంగా అని నాకు అర్థమైంది. ఈ కేస్ మీరు పరిశోధన చేస్తున్నట్లు ఆయనకు చెప్పాను. భూషణ్ చాలా మంచి వ్యక్తి. మనకు సహకరిస్తానని చెప్పాడు. త్రిపాఠి తో కూడా మాట్లాడతానని అన్నాడు.


వాళ్ళిద్దరూ ప్రియాను పరీక్షించాక ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తరువాత మీతో మాట్లాడి కనకారావుకు ఎంతవరకు చెప్పవచ్చు అనే విషయంలో మీ సలహా తీసుకుంటారు. కనకారావు మనుషులు భూషణ్ తో మాట్లాడుతూ అవసరమైతే ప్రియా కు సంబంధించిన మనుషుల మీద దాడికి ప్లాన్ చేస్తామని, ఆ సమయంలో ప్రియ లో కలిగే మానసిక మార్పులు గమనించవచ్చని చెప్పారట. ముందు ప్రాథమికంగా పరీక్షించనివ్వమని, అంతగా అవసరమైతే ఆ తర్వాత చెబుతానని భూషణ్ దాట వేసాడట"


తనకు తెలిసిన విషయాలు చెప్పడం ముగించాడు డిటెక్టివ్ పురంధర్. ప్రవల్లిక మదిలో అప్పటికప్పుడు ఒక ఆలోచన రూపుదిద్దుకొంది. అయితే అది చెప్పడానికి సమయం కాదని ఊరుకుంది.


ఉదయ్ మాట్లాడుతూ "డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రియను తన తల్లిదండ్రులకు గాని లేదా పోలీసులకు గాని అప్పగించడానికి సిద్ధపడ్డారు. కానీ ప్రియాకు తనకేం అవుతుందో తెలుసుకోవాలని ఉంది. అందుకోసం రేపు గెస్ట్ హౌస్ కు వెళ్లడానికి సిద్ధపడింది" అని చెప్పాడు.


ఉదయ్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ "ఆల్ ది బెస్ట్ మిస్టర్ ఉదయ్.. డ్యూటీలో జాయిన్ కాకముందే కమిట్మెంట్ తో పని చేస్తున్నావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ప్రతాప్ తో చెప్పి రేపు ఆ గెస్ట్ హౌస్ చుట్టుపక్కల మఫ్టీలో కొందరు పోలీసుల్ని ఉంచమని చెబుతాను. నేను కూడా దగ్గర్లోనే అందుబాటులో ఉంటాను. నువ్వు, ప్రవల్లిక లేదా ప్రియ.. ఎవరు మిస్డ్ కాల్ ఇచ్చినా పోలీసులు వెంటనే ఆ గెస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయ్యేలాగా చూస్తాము" అన్నాడు పురంధర్.


"థాంక్యూ సార్" అని చెప్పి అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు ఉదయ్. ఆ రాత్రి, మరుసటి రోజు ఏం చేయాలనే విషయంగా చాలాసేపు ఆలోచించి పడుకుంది ప్రవల్లిక.

***


మరుసటి రోజు ప్రవల్లికను పికప్ చేసుకొని తొమ్మిది గంటలకల్లా డాక్టర్ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నాడు ఉదయ్. వీళ్లు వచ్చేసరికి టిఫిన్ ను డైనింగ్ టేబుల్ పై ప్లేట్ లలో పెట్టి ఉంచింది డాక్టర్ శ్రీదేవి. తొందరగా టిఫిన్ ముగించి కనకారావు గెస్ట్ హౌస్ కి బయలుదేరారు అందరూ. సరిగ్గా పది గంటలకు కనకారావు గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. గెస్ట్ హౌస్ లోకి వెళ్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు డాక్టర్ శ్రీనివాస్. తరువాత తన భార్యను, ప్రియను కూడా పరిచయం చేశాడు. ఉదయ్, ప్రవల్లిక గురించి కూడా వాళ్లకు చెప్పాడు.


భూషణ్ ప్రియ తల పైన చేయి వేసి ఆప్యాయంగా నిమిరాడు. "నువ్వేమీ భయపడకమ్మా! మేము ఉన్నాము. నీకేమీ కాదు. టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు" అని చెప్పాడు.


త్రిపాఠి మాట్లాడుతూ "నేను గతంలో హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో కొంతకాలం పని చేశాను. నాకు తెలుగు బాగా వచ్చు. నీ ఫీలింగ్స్ నాతో ధైర్యంగా షేర్ చేసుకోవచ్చు" అని ప్రియతో చెప్పాడు.


తరువాత భూషణ్, ప్రవల్లిక వంక తిరిగి, "డాక్టర్ శ్రీనివాస్ నాతో మాట్లాడుతూ ఇద్దరు అసిస్టెంట్లను తీసుకొని వస్తానన్నాడు. కానీ ఒక లేడీ డిటెక్టివ్ నీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ నీ తీసుకొని వస్తానని మాకు చెప్పలేదు. కాస్త భయమేస్తోంది" అన్నాడు నవ్వుతూ.


ప్రవల్లిక నవ్వుతూ "డిటెక్టివ్ ని కదా! మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు తలచుకుంటే మీ చూపులతోనే మాకందరికీ స్పృహ తప్పించి ఇక్కడి నుంచి వెళ్లిపోగలరు" అంది.

తరువాత భూషణ్ మాట్లాడుతూ "నేను ఇప్పుడు ప్రియా ను ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్తాను. డాక్టర్ త్రిపాఠి ఆమెను రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఆమె ఇచ్చే సమాధానాలను బట్టి ఆమె మానసిక స్థితిని విశ్లేషిస్తాము. అలాగే ట్రాన్స్ లో ఉన్న ప్రియ సమాధానాలు ఇచ్చేటప్పుడు ఆమె భావోద్వేగాల ఫ్రీక్వెన్సీని తెలుసుకునే ఒక పోర్టబుల్ పరికరాన్ని కూడా మాతో తెచ్చాము. నేను, త్రిపాఠి ఆ పక్కనున్న గదిలోకి ప్రియను తీసుకుని వెళ్లి హిప్నటైజ్ చేసి ప్రశ్నిస్తాము. దయచేసి మీరెవరూ లోపలికి రావద్దు. మొత్తం ప్రోగ్రాం మేము రికార్డ్ చేసి ఉంచుతాము. ఆ తరువాత మీరు చూడవచ్చు" అన్నాడు.


"నిజమే! ఎక్కువమంది ఉంటే ప్రియా కాన్సెంట్రేషన్ దెబ్బతిని, హిప్నాటిజానికి లోను కాకపోవచ్చు. కానీ మీతో పాటు డాక్టర్ శ్రీనివాస్ ని ఉంచుకోవడం మంచిదని నాకనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మీద ప్రియా కి పూర్తి నమ్మకం ఉంది. ఆయన గొంతు వినిపిస్తే మంచి నిద్రలో ఉన్నా వెంటనే లేస్తుంది. కాబట్టి ఒకవేళ ప్రియ ఆవేశానికి లేదా ఉద్వేగానికి లోనైతే ఆయన పక్కన ఉండడం మంచిది" అంది డాక్టర్ శ్రీదేవి.


"అలాగేనండి.. శ్రీనివాస్ గారు పక్కన ఉండడం మాక్కూడా ఎంతో ఉపయోగకరం" అన్నాడు భూషణ్.


ప్రియ హిప్నాటిస్ట్ భూషణ్ గారి వంక చూస్తూ "ఒక చిన్న సందేహం. జరిగిన సంఘటనలన్నీ డాక్టర్ శ్రీనివాస్ గారికి నేను చెప్పాను. ఇప్పుడు హిప్నాటిజం వల్ల కొత్తగా తెలిసే విషయాలు ఏముంటాయి. ? మరోలా అనుకోకుండా నా సందేహం తీర్చండి" అంది.


భూషణ్ మాట్లాడుతూ "మంచి సందేహం అడిగావమ్మా! వివరంగా చెబుతాను, విను. " అంటూ చెప్పడం ప్రారంభించాడు.


"ప్రతి మనిషి జీవితం లోను, ప్రతి రోజూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలను మనం పైకి లెక్కచేయనట్లు ఉన్నా, మనకు తెలియకుండానే వాటి ప్రభావం మన ఆలోచన విధానం పైన ఉంటుంది.


హిప్నాటిజానికి లోనైనప్పుడు అలా మనసు మీద ప్రభావం చూపిన సంఘటనలు ఏవో తెలుసుకోవచ్చు. వాటి తాలూకు ప్రభావాన్ని మెదడు పైనుండి తొలగించవచ్చు. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు సాల్వ్ చేసిన ఒక కేసు గురించి క్లుప్తంగా చెబుతాను.


ఒక యువతి తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని, అందువల్ల విడాకులు కావాలని ఒక అడ్వకేట్ ని సంప్రదించింది. ఆ యువతి భర్త తో ఆ అడ్వకేట్ కి పరిచయం ఉంది. అడ్వకేట్ కి అతను చాలా మంచివాడని తెలుసు. ఆ అడ్వకేట్ నా స్నేహితుడు కావడంతో ఆ కేసు గురించి నాకు చెప్పాడు.


నా సలహా ప్రకారం ఆ అడ్వకేట్ నన్ను తన సీనియర్ గా ఆ యువతికి పరిచయం చేశాడు. తన అనుమానానికి కారణమేమిటని ఆమెను అడిగాను. ప్రతిరోజు తను స్నానానికి వెళ్ళినప్పుడు మరొక స్త్రీ తన ఇంటికి వస్తోందని, భర్తతో ఆమె మాట్లాడే మాటలు, వాళ్ళిద్దరి నవ్వులు తనకు వినపడుతున్నాయని చెప్పింది.


'అందుకు నువ్వేం చేసావు? రోజూ ఆయన ఆఫీసుకు వెళ్ళాకే స్నానం చేస్తున్నావు కదూ' అని అడిగాను.


ఆమె నా వంక ఆశ్చర్యంగా చూసి 'సరిగ్గా కనిపెట్టారు' అంది.

'మరి ఇక సమస్య ఏముంది' అని అడిగాను.

'వీకెండ్స్ ఏడ్చాయిగా.. అప్పుడే సమస్య' అందామె.


'మరి వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చుగా' అన్నాను.


'ఆ పని కూడా చేసాను. బాత్ రూమ్ గడియ పెట్టుకొని, హఠాత్తుగా సోప్ అయిపోయిందంటూ బయటకు వచ్చాను. అప్పటికే వెళ్ళిపోయింది. ఇలా కాదని మరోసారి బాత్ రూమ్ లో నీళ్ల శబ్దం చేస్తూ ఉన్నట్లుండి బయటికి వచ్చాను. కానీ దొరకలేదు' అందామె.


'సోఫా వెనక దాక్కుందేమో చూడక పోయారా.. ' అన్నాను.

'మీరు అన్ని విషయాలు కనిపెట్టగలరు. నా మొబైల్ జారి పడినట్లుగా సోఫా వెనక్కి జారవిడిచాను.

అది వెతికే నెపంతో సోఫా జరిపి మరీ చూసాను. కానీ అప్పటికే తప్పించుకుంది' అందామె.


'ఇంతకీ ఎవారావిడ? మీ ఇంటి చుట్టుపక్కల ఉంటుందా?' అని అడిగాను.

'ఏమో.. తెలీదు' అందామె.

'మీ భర్త, ఆవిడా కలుసుకోవడానికి వేరే చోటే లేదా? మీ ఇంట్లో మీరు స్నానానికి వెళ్ళినప్పుడే కలుసుకోవాలా?' అని అడిగాను.


కాస్త అలోచించి, 'బయటైతే నలుగురికీ తెలుస్తుందని భయమేమో.. ' అందామె.

'మీరు తరచూ మీ పుట్టింటికి వెళ్తూ ఉంటారట కదా.. '

'తరచూ ఏం కాదు. నెలకోసారి వెళ్తానేమో.. '

'వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నిరోజులు ఉంటారు?' అని అడిగాను.


'ఎంత.. ఒక వారం ఉంటానేమో.. అంతే' చెప్పిందా యువతి.

'మీ చుట్టుపక్కల వాళ్ళు గానీ, మీ పేరెంట్స్ గానీ అయన గురించి ఎప్పుడైనా చెడ్డగా చెప్పారా/' అని ప్రశ్నించాను.


'అబ్బే.. అయన శ్రీరామచంద్రుడిలా నటిస్తుంటేనూ.. ' అంది.


'మీ భర్త ఉద్యోగస్థుడు. రోజూ ఆఫీసుకు వెళ్తుంటాడు. బయట ఎక్కడైనా ఆమెను కలవచ్చు. లేదా మీరు వూరికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లోనే కలవొచ్చు. మీరు ఇంట్లో ఉండి, స్నానానికి వెళ్ళినప్పుడే మీ వారిని కలవడానికి రావాలా.. కాస్త ఆలోచించండి. మరి మీరే అయన గురించి పొరపడుతున్నారేమో' అన్నాడు నా అడ్వొకేట్ మిత్రుడు.


‘చూస్తుంటే ఆయనకు, మీకు లాలూచీ ఉన్నట్లుందే.. పొరపాటున మీ దగ్గరకు వచ్చాను' అనేసిందావిడ.


అప్పుడు నేను హిప్నాటిస్ట్ నని ఆవిడకు తెలియజేసి, నాకు సహకరిస్తే ఆ ఆ యువతిని పట్టుకోవచ్చునని చెప్పాను.

'నిజంగానా.. ' ఆశగా అడిగిందావిడ.


'ఖచ్చితంగా పట్టుకుంటాను' అని ఆమెను ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్లాను.

ఆమె లైఫ్ లో గతంలో జరిగిన సంఘటనల గురించి అడిగాను.


ఆమెకు పదేళ్ళప్పుడు వాళ్ళ అమ్మగారి పక్కింట్లో వీళ్లకు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు.

ఆ ఇంటావిడ స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె భర్త వాళ్ళ వంటావిడతో సరసాలు ఆడేవాడట.

అది ఒకసారి ఆమె కంట్లో పడటంతో ఆవేశంతో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.


నలుగురూ చేరి మంటలు ఆర్పి, ఆమెను హాస్పిటల్ లో చేర్చారు. వీళ్ళు హాస్పిటల్ కు వెళ్లి ఆమెను పరామర్శించినప్పుడు ఆమె ఈ విషయం చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుందట. తర్వాత కొద్ది రోజులకు గాయాలు మానక ఆవిడ మరణించింది.


తన పదేళ్ల వయసులో జరిగిన ఈ సంఘటన ఆ యువతిపై తెలీకుండానే తీవ్ర ప్రభావం చూపింది. అది తన భర్త మీద అనుమానం రూపంలో ఇప్పుడు బయటకు వచ్చింది.


'నీ భర్తతో మాట్లాడుతున్న ఆమెను కనిపెడతాను. ఒక వారం తరువాత నన్ను కలువు' అని చెప్పాను.

ఆ వారంలో ఆ యువతి పుట్టింటి వారిని సంప్రదించాను.


వాళ్ళ పక్కింటిలో అప్పట్లో ఉన్న వంట మనిషి ఫోటో కోసం ప్రయత్నించాను. దొరకలేదు. ఆమె ప్రస్తుతం ఎక్కడ వుందో తెలీదని చెప్పారు. ఆమె వయసు ప్రస్తుతం అరవై పైనే ఉండవచ్చునని చెప్పారు. ఫోటో దొరకలేదు కాబట్టి ఆమె పోలికలు గుర్తుంటే చెప్పమని అడిగాను.


ఆమె చీరను గోచిపోసి కట్టుకునేదని, జుట్టు ముడి వేసుకునేదని చెప్పారు.

ఆ పోలికలతో ఒక బొమ్మ గీయించాను. ఆ యువతి వచ్చినప్పుడు చూపించాను.

'ఈవిడే.. సందేహం లేదు' అంటూ ఆవేశంగా ఆమె బొమ్మను గీచిన పేపర్ ని తన చేతిలోకి తీసుకుంది.


'ఆమెను మీరు చూడలేదని చెప్పారు కదా.. ' అన్నాడు నా అడ్వొకేట్ మిత్రుడు.

'చూడకుంటే ఎలా గుర్తుపడతాను?' అందావిడ.

'ఈ బొమ్మను చింపేస్తే ఇక ఆవిడ మీవారి జోలికి రాదు' అన్నాను.


వెంటనే ఆవిడ ఆ బొమ్మను చింపేసింది.

నాకు థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. ఆ తరువాతెప్పుడూ ఆమెకు అలాంటి ఊహలు రాలేదు.

అలా ఆవిడ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది"


చెప్పడం ముగించాడు హిప్నాటిస్ట్ భూషణ్.

క్లాప్స్ కొట్టింది ప్రియా.. "మీ హిప్నాటిజమ్ ఎంత ఉపయోగ పడింది.. " అని మెచ్చుకుంది.


'ఈ ఉదంతం చెప్పడం ద్వారా తన టాలెంట్ గురించి ప్రియకు ముందుగానే భూషణ్ తెలియజేశాడు. అంటే ప్రియను హిప్నటైజ్ చెయ్యడం ఆల్రెడీ ప్రారంభించాడన్న మాట.. ' అనుకున్నాడు డాక్టర్ శ్రీనివాస్.


తరువాత భూషణ్, త్రిపాఠి, డాక్టర్ శ్రీనివాస్ లు ప్రియను హిప్నటైజ్ చెయ్యడానికి పక్క గదిలోకి తీసుకోని వెళ్లారు.

================================================

ఇంకా ఉంది...

================================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link






మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).







61 views0 comments
bottom of page