top of page

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 15


'Nakemavuthondi Episode-15' New Telugu Web Series

Written By Mallavarapu Seetharam Kumar

'నాకేమవుతోంది…?' తెలుగు ధారావాహిక ఎపిసోడ్ 15

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ…

కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త తరుణ్ నిద్ర లేపి, ఆమె తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు. అతన్నే అనుమానిస్తుంది ప్రియ. అతని వల్ల తనకు హాని కలగవచ్చునని తండ్రికి మెయిల్ పెడుతుంది.స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్.


హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్.


పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్. కానీ తరువాత రంగనాథాన్ని, రిసార్ట్ మేనేజర్ సందీప్ ని విడుదల చేయమంటాడు. స్టేషన్ దాటి బయటకు వెళ్ళగానే వాళ్ళను ఎవరో కిడ్నాప్ చేస్తారు.


స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల గతంలో జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటుంది.


గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది.


అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది. తన గదిలోకి వచ్చిన వ్యక్తి అతని పేరు నీలకంఠం అని చెబుతాడు.


సిసి కెమెరా ఫుటేజ్ లో ప్రియ గదిలోకి ఎవ్వరూ వెళ్లలేదని తెలుస్తుంది. మరణించిన తన స్నేహితురాలు భార్గవిని చూడటానికి తల్లిదండ్రులతో హైదరాబాద్ వెడుతుంది ప్రియ. అక్కడ భార్గవి మేనమామ పేరు నీలకంఠం అని తెలిసి ఆశ్చర్య పోతారు ప్రియా పేరెంట్స్.


తన మేనమామ తనమీద హత్యా ప్రయత్నం చేసినట్లు తనకు అనిపించడం భార్గవి విషయంలో నిజం అయివుండొచ్చని ప్రియకు అనిపిస్తుంది. ప్రియా తండ్రి ప్రభాకర రావు చొరవతో పోలీసులు నీలకంఠం ఇంట్లో సోదా చేసి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుంటారు.


ప్రియను ఆమె తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తారు.


మేనమామ ఇంట్లో ప్రియకు కలిగిన అనుభవాలు, భార్గవి మేనమామ ఇంట్లో మరణించడం కేవలం యాదృచ్ఛికం అంటాడు సైకియాట్రిస్ట్ శ్రీనివాస్.


ప్రియకు మానసిక లోపం వల్లే జరగనివి జరిగినట్లు ఉహించుకొంటోందని చెబుతాడు.


ఒక సంవత్సరం పాటు ప్రియను మందులు వాడమంటాడు.

తనను బంధించిన ఉదయ్ కి అన్ని వివరాలు చెబుతానంటాడు రంగనాథం.

కనకారావు పిఎ ఫోన్ చేసి సందీప్ కి సహకరించమని చెప్పినట్లు అంగీకరిస్తాడు.

స్పృహలోకి వచ్చిన ప్రియా తను డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుంటుంది.

ఇక నాకేమవుతోంది.. ధారావాహిక పదహైదవ భాగం చదవండి.


డాక్టర్ శ్రీనివాస్ భార్య శ్రీదేవి, "మరొక గ్లాస్ జ్యూస్ ఇవ్వనా?" అంది ప్రియా వంక చూస్తూ.


"ఇవ్వండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు ఉన్నాను. బాగా నీరసంగా ఉంది" అంది ప్రియ.

"అలా అయితే మీరు కాసేపు రిలాక్స్ కండి. నేను ఓ గంటకి మిమ్మల్ని కలుస్తాను" అన్నాడు శ్రీనివాస్.

"అవసరం లేదు. నన్ను చెప్పనివ్వండి. నా ఆలోచనలన్నీ మీకు తెలియడం మంచిది" అంది ప్రియ.

"అయితే ఓ రెండు నిమిషాలు ఆగు. జ్యూస్ తీసుకొని వస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది శ్రీదేవి.

"హాస్పిటల్లో ప్రమాదం ఉందని మీ ఇంట్లో ఉంచినట్లు చెప్పారు. ఏమిటా ప్రమాదం? నేను గతంలో కూడా రెండు మూడు సార్లు హాస్పిటల్ కి వచ్చాను కదా.." అంది ప్రియ.


"నీ జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు, కేకేఆర్ హాస్పిటల్ అధినేత కనకారావు కు ఏదో తెలియని సంబంధం ఉందనిపిస్తోంది, ముందు చెప్పడం పూర్తి చేయి, దాన్నిబట్టి నేను ఒక అభిప్రాయానికి వస్తాను" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

ఇంతలో శ్రీదేవి ఒక గ్లాసులో జ్యూస్ తీసుకొని వచ్చి ప్రియ చేత తాగించింది.

ఒంట్లోకి కాస్త శక్తి వచ్చినట్లు అయింది ప్రియా కి. డాక్టర్ శ్రీదేవికి థాంక్స్ చెప్పి చెప్పడం కొనసాగించింది.


ఖచ్చితంగా హన్సికకు ఏదో ఆపద కలగబోతోందని నా సిక్స్త్ సెన్స్ చెబుతోందనిపించింది. గతంలో నా మీద మా మేనమామ అత్యాచార యత్నం చేసినట్లు, అది విఫలం కావడంతో హత్యా ప్రయత్నం చేసినట్లు నాకు భ్రమ కలిగింది. కానీ అదే విషయం నా స్నేహితురాలు భార్గవి విషయంలో నిజమైంది. తన మేనమామ ఆమెను హత్య చేశాడు.

ఇప్పుడు తరుణ్ నన్ను చంపబోయినట్లు అనిపించింది. మరి హన్సిక భర్త చేతిలో చనిపోతుందా? ఆమె భర్త అమెరికాలో ఉన్నాడు కదా.. ఒకవేళ అతను ఇండియాకు ఏమైనా వచ్చాడా.. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను. మర్నాడు ఉదయం లేవగానే హన్సికకు ఫోన్ చేయడానికి ట్రై చేశాను. తన నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నేను, తరుణ్ రిసార్ట్ కి బయలుదేరాము. దారిలో మీరు పని చేసే కేకేఆర్ హాస్పిటల్ కనిపించింది. మీరు గుర్తుకు వచ్చారు. ఒకసారి మిమ్మల్ని కలుద్దామని అనిపించింది. కానీ తరుణ్ కి ఏమని చెప్పాలి.. 'నా మానసిక స్థితి గురించి అతనికి అనుమానాలు రేకెత్తించడం ఎందుకు..?' అనిపించింది.

అర్థరాత్రి సమయంలో కిటికీ బయటనుండి హన్సిక నన్ను పిలిచినట్లు అనిపించింది.

తరుణ్ మంచి నిద్రలో ఉన్నాడు.

వెంటనే బయటకు వెళ్లాను. హన్సిక పక్క కాటేజ్ లోకి వెళ్లడం గమనించాను.

వేగంగా ఆ కాటేజ్ ని సమీపించాను.

తలుపు తట్టాను. చేతికి ఏదో తడిలా తగిలింది.

టెన్షన్ లో నేను అది పట్టించుకోలేదు.

ఒక యువకుడు తలుపు తీసాడు..

ఇంత రాత్రి పూట పక్క కాటేజ్ వాళ్ళను డిస్టర్బ్ చేయడమేమిటని విసుక్కున్నాడు .

నేను తిరిగి వచ్చేటప్పుడు తరుణ్ నాకోసం వెతుకుతూ కనిపించాడు.

ఇందాక అతను నిద్ర నటించాడా..

ఏమీ అర్థం కాలేదు.

ఇప్పుడు నేను అతనికి కనిపిస్తే చంపేస్తాడా.,

అప్పుడు చూసుకున్నాను నా చేతికి అంటిన రక్తపు మరకలను.వేగంగా కాటేజ్ లోని గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాను.

కొద్ది క్షణాలకే తరుణ్ వచ్చి “ఏమైంది ప్రియా?” అంటూ తలుపు బలంగా తట్టడం ప్రారంభించాడు. హన్సిక చనిపోయిందని చెబితే ఇక నన్ను చంపే ఆలోచన విరమించుకుంటాడేమో.. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా తలుపు తెరిచి హన్సికను నేనే చంపేశాను అన్నాను.

ఎక్కడని అడిగాడు.

పక్క కాటేజిలోనేనని చెప్పాను.

అతను వేగంగా బయటకు వెళ్ళాడు.

అతను వెళ్లిన కొద్దీ క్షణాలకే రిసార్ట్ మేనేజర్ సందీప్ మా కాటేజ్ లోకి వచ్చాడు.


నేను హన్సికను చంపడం తాను చూశానని చెప్పాడు.

"మీ మానసిక స్థితి సరిగ్గా లేదు. మిమ్మల్ని తప్పించమని డాక్టర్ శ్రీనివాస్ రికమెండ్ చేయడంతో కనకరావుగారు మాకు చెప్పారు.బయట మీకోసం వెహికల్ రెడీ గా ఉంది. మేము తరుణ్ తో మాట్లాడి శవాన్ని మాయం చేస్తాము. అతనికి తెలియడం కోసం ఒక స్లిప్ రాసి వెళ్ళండి" అన్నాడతను.


మరేమి ఆలోచించకుండా అతను చెప్పినట్లు రాసి బయట నాకోసం వెయిట్ చేస్తున్న వెహికల్ లో బయలుదేరాను.

హాస్పిటల్ కి చేరగానే వాళ్ళు కనకారావు పేరు చెప్పడంతో వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. మీకు కబురు పెట్టారు. స్పృహ తప్పుతున్నా బలవంతంగా మీకోసం ఆపుకున్నాను. మిమ్మల్ని చూడగానే నాకు స్పృహ తప్పింది. తరువాత నేను కళ్ళు తెరిచినప్పుడు నాకేం జరిగిందో మీకు చెప్పాను. ఇప్పుడు మిగిలిన విషయాలు కూడా చెప్పేశాను" చెప్పడం పూర్తి చేసింది ప్రియ.


కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు డాక్టర్ శ్రీనివాస్. తరువాత తనకు తెలిసిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు.

" మీ స్నేహితురాలు భార్గవి చనిపోయింది కదా.. ఆమె మేనమామ నీలకంఠం కనకారావు కు దగ్గరి బంధువు. పోలీసులు నీలకంఠాన్ని అరెస్ట్ చేశాక కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారం రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత అతను కనకారావు సహాయంతో బెయిల్ పొందాడు. తనమీద పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చిందో ఆరా తీశాడు. మీ కాలేజీలో మీ స్నేహితులను విచారించాడు. వైజాగ్ టూర్ లో నీకు కలిగిన భ్రమ గురించి అతనికి తెలిసింది. ఆ విషయాలన్నీ కనకరావుకు చెప్పాడు.


నీకేమైనా జరగబోయేవి ముందుగా తెలుసుకునే శక్తి ఉందా అని నన్ను అడిగాడు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే నిన్ను తన అదుపులో పెట్టుకొని, ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవచ్చు అని అనుకున్నాడు. విషయం గ్రహించిన నేను అది కేవలం కాక తాళీయమేనని అతనికి చెప్పాను. అయినా నన్ను అప్పుడప్పుడు, నిన్ను కలిసి ఇలాంటి సంఘటనలు మరేమైనా జరిగాయేమో తెలుసుకోమని చెప్పాడు.


ఇక మీ పెదనాన్న తన భార్యకు విటమిన్ టాబ్లెట్లు ఇస్తూ ఉండేటప్పుడు వాటిని వాడవద్దని, అవి ప్రాణానికి హాని చేస్తాయని మీ పెద్దమ్మకు చెప్పావు. నిజానికి ఆ సమయంలో మీ పెదనాన్న గారి పక్క అపార్ట్మెంట్లో ఉండే యువతికి ఆమె భర్త ప్రతిరోజు టాబ్లెట్లు మింగిస్తూ ఉంటాడు. ఒకవేళ అతను ఏమైనా తన భార్యకు హాని చేసే మాత్రలు ఇస్తున్నాడేమోనని అనుమానం వ్యక్తం చేశావు. కానీ ఆమెకు ట్రీట్ చేసేది నా శ్రీమతి డాక్టర్ శ్రీదేవి. ఆరోజు ఈవిడకు ఫోన్ చేసి ఆ టాబ్లెట్స్ విటమిన్ టాబ్లెట్స్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆ తర్వాత వాళ్లు ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. కొద్దిరోజుల తర్వాత ఆ యువతి గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది. ఆమె పేరుతో కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ కనకారావు కు బాగా కావలసిన వ్యక్తి . దీన్నిబట్టి ముందుగానే ప్లాన్ చేసి ఆమె పేరు మీద ఇన్సూరెన్స్ చేసినట్లు తెలుస్తోంది.

హాస్పిటల్ ప్రిస్క్రైబ్ చేసిన మాత్రల స్థానంలో స్లో పాయిజన్ లాగా పనిచేసే మాత్రలు ఇచ్చివుండవచ్చు.


మీ పెదనాన్న గారి పక్క పోర్షన్ లోనే ఉంటే జరిగే విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయని వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు" చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్.


"ఆశ్చర్యంగా ఉంది. జరిగిన రెండు సంఘటనల లోను కనకారావు ప్రమేయం ఏదో ఒక రకంగా ఉందన్నమాట" అంది డాక్టర్ శ్రీదేవి.


"అంతే కాదు. హన్సిక హత్యలోనూ కనకారావు కు సంబంధం ఉన్నట్లు నాకు అనుమానంగా ఉంది" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.


నమ్మలేనట్టు చూశారు ప్రియా, శ్రీదేవి.


"లేకుంటే రిసార్ట్ లో ఉన్న నిన్ను ఇక్కడికి తీసుకురావడం ఎందుకు?నువ్వే హత్య కాబడినట్లు, ఆ హత్య తరుణ్ చేసినట్లు సందీప్ పోలీసులకు చెప్పాడు. అందుకు కారణం నీ గురించి ఎవరూ వెతకకుండా ఉండడమే. ఈలోగా నీకు కలిగిన భ్రమల గురించి ఒక అవగాహనకు రావచ్చును అనేది కనకారావు ఆలోచన అనిపిస్తోంది.


అయితే హన్సిక హత్యలో కనకారావు ప్రమేయం ఎంతవరకు ఉందో నా ఊహకు అందడం లేదు" అన్నాడు శ్రీనివాస్.


"హాస్పిటల్ లో వుంటే నాకు ప్రమాదమని చెప్పారు. అదెలాగా" అడిగింది ప్రియ.

================================================

ఇంకా ఉంది...

================================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).

63 views0 comments

Comentarios


bottom of page