top of page

వస్తాను ఒకనాడు


'vasthanu Okanadu' New Telugu Story

Written By Ch. C. S. Sarma

'వస్తాను ఒకనాడు' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఇరువురి మధ్య వయస్సు రీత్యా ప్రేమానురాగాలు ఉండవచ్చు. వారి విషయంలో పెద్దల భావన మరో విధంగా ఉండవచ్చు. ఆదరించి అభిమానించిన ఆ ఇంటి పెద్దల గౌరవం ఆ ఇరువురి భావాల పరంగా ఆవేశపూరితం కాకుండా ఆ పెద్దలకు (కన్నవారు/పెంచినవారు) గౌరవాన్ని కలిగించే రీతిగా వుండాలి. సందర్భోచిత నిర్ణయం తీసుకోవాలి.


మధు... కారును ఇంటి ముందు ఆపాడు. ఇంటి ముందరి ఖాళీ స్థలంలో వాలీబాల్ ఆడుకుంటున్న ఏడేళ్ల పాప... పదేళ్ల బాబు... గేటు వద్దకు పరుగున వచ్చారు. గేటు తెరిచారు.

మధు... గేటును సమీపించాడు. పిల్లలు మధూకు దగ్గరైనారు. ముద్దు లొలికే ఆ చిన్నారులను తదేకంగా చూశాడు మధు.


"ఎవరండీ మీరు?" అడిగింది పాప.

"ఎవరు కావాలి?" బాబు ప్రశ్న.

నవ్వుతూ... ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ మెల్లగా... "ఆనందరావు గారు ఉన్నారా?" అడిగాడు మధు.


"ఉన్నారు." బాబు జవాబు.

"ఆయన మా తాతయ్య గారు." పాప ముద్దు పలుకులు.


"ఇంతకూ మీరెవరు?" మధూను పరిశీలనగా చూస్తూ బాబు అడిగాడు.

"నేను వారి బంధువును."


"అంటే మాకూ బంధువే" నవ్వుతూ పలికింది పాప.

"మీ పేరు?..." బాబు మధు ముఖం లోకి సూటిగా చూస్తూ అడిగాడు.


"మధు" నువ్వుతూ చెప్పాడు.

"రండి లోపలికి" స్వాగతం పలికాడు బాబు.

బాబు ఆ మాట పలికి ఇంటి వైపుకు వేగంగా పరిగెత్తాడు.


"గేటు మూయండి" పాప అంది.

మధూ... వెనక్కు తిరిగి గేటు మూశాడు. నవ్వుతూ... పాప ముఖంలోకి చూశాడు.

"నీ పేరేంటమ్మా?"


"వసుధ... అన్నయ్య పేరు మధుబాబు..." వివరాలు ఇంకా ఏమైనా కావాలా? అన్నట్టుగా చూసింది పాప.

"మీ అమ్మగారి పేరు?" చిరునవ్వుతో మెల్లగా అడిగాడు మధు.


"భారతి... నాన్నగారి పేరు గోపాల్... అవునూ!... మా అమ్మా నాన్న మీకు తెలుసా!..." జవాబు చెప్పి, ఎదురు ప్రశ్నివేసింది పాప.


"తెలుసమ్మా."

"మీరు నాతో రండి. అన్నయ్య తాతయ్యను పిలుచుకరాను వెళ్ళాడు." నడుస్తూ చెప్పింది పాప.

భారతి అన్న మాట వినగానే మధు వులిక్కిపడ్డాడు. మదిలో పాత జ్ఞాపకాలు మెదిలాయి. పాపను పరీక్షగా చూశాడు.


అది గమనించిన పాప "ఏం అలా ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారు. రండి" నవ్వుతూ అంది.

మధు ఆమెను అనుసరించాడు. ఏడెనిమిదేళ్ళేమో!... మాటల్లో ఎంత వందనం... గాంభీర్యం... సౌమ్యత... అంతా తల్లి పోలిక. గత జ్ఞాపకాలు మదిలో గజ్జలు కట్టుకొని నాట్యం చేస్తుంటే... మౌనంగా పాపను అనుసరించాడు. ఇరువురూ కార్ పోర్చి దాటి వరండాలో ప్రవేశించారు.

ఇంతలో... తాత... మనమడు ఇంట్లో నుంచి వరండాలోకి వచ్చారు.


"వీరే తాతయ్యా!... మీకోసం వచ్చారు.” మధూను చూపుతూ... చిన్న మధు బాబు ముద్దుగా చెప్పాడు. ఆనందరావుగారిని చూసి మధు నిశ్చేష్టుడయ్యాడు. ఆనందరావు కళ్లద్దాలను సరి చేసుకుంటూ...

"ఎవరు బాబూ మీరు?"

ఆ మాటను వినగానే తొట్రుపాటుతో ఆనందరావుగారిని సమీపించాడు మధు.


"మామయ్యా! నేను మీ... మీ... మధూని" ఆ క్షణంలో అతని కంఠస్వరములో కంపనం. హృదయంలో మూగ బాధ.

"ఏమిటీ!... నీవు... నీవు... మధువా!" ఆశ్చర్యంతో అడిగాడు ఆనందరావు.


పిల్లలు ఇరువురూ వారి ముఖ భావాలను, సంభాషణలను గమనిస్తూ ఆలకిస్తున్నారు.

"అవును మామయ్యా!... మీరు కూర్చోండి" ఆనందరావు గారి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మధు. వారు కుర్చీల్లో కూర్చున్నారు.



"దగ్గరగా రా!...” చేతితో సైగ చేస్తూ పిలిచాడు ఆనందరావు.

మధు వంగి వారి ముందు మోకాళ్ళ పైన కూర్చున్నాడు. ఆనందరావుగారికి వయస్సు రీత్యా శరీరంలో కలిగిన మార్పులు మధును కలవరపరిచాయి. పరీక్షగా వారి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.

ఆనందరావు గారు తన కాళ్ళ ముందు కూర్చొని ఉన్న మధు ముఖంలోకి పరీక్షగా చూశాడు. అతని వదనం ఎంతో విచారంగా ఉంది.


"ఏరా మధూ!... నేను నీకు ఏం తక్కువ చేశానని నాతో ఒక మాట కూడా చెప్పకుండా పన్నెండేళ్ళ క్రిందట నన్ను వదిలి వెళ్ళిపోయావు.... నేను ఏనాడైనా నీకు వ్యతిరేకంగా వర్తించి కష్టం కలిగించానా?....” విచారంగా ఆడిగాడు ఆనందరావు.


"లేదు మామయ్యా!... లేదు... నేనే తప్పు చేశాను." దీనంగా పశ్చాత్తాపంతో పలికాడు మధు.

"హు... ఈ పన్నెండు సంవత్సరాలు... ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నీవు నాకు గుర్తుకు వచ్చేవాడివి. నావల్ల ఏం తప్పు జరిగింది?‌... బిడ్డలా నన్ను అంటిపెట్టుకొని ఉండేవాడు... ఒక్క మాట కూడా చెప్పకుండా ఎటో ఎందుకు వెళ్లిపోయాడు?... అనే ఈ ప్రశ్నలతో నాలో నేను సతమతం కాని రోజంటూ లేదంటే... నీవు నమ్మగలవా?...." డెబ్బై ఏళ్ల ఆ వృద్ధ ఆనంద రావు గారి మాటల్లో మధుకు ఎంతో ఆవేదన వినిపించింది.


"మామయ్యా!... నన్ను క్షమించండి... నన్ను మీరు క్షమించండి." రోదిస్తూ ఆనందరావు కాళ్లు పట్టుకున్నాడు మధు. అతని నయనాల నుండి కారిన కన్నీరు ఆనందరావు గారి పాదాలపై పడ్డాయి.

ఆ చల్లదనానికి ఆనందరావు చలించిపోయాడు.

"మధూ!... ఏడుస్తున్నావా!... రేయ్!... ఏడవకు... ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా!... నీవు వచ్చావుగా!..."


అతని భుజాలను తన చేతులతో పట్టుకొని "లే... అలా కుర్చీలో కూర్చో. నా మాట విను." అవ్యాజమైన ప్రేమానురాగాలు ఆ పలుకుల్లో నిండి ఉన్నాయి.

మధూ... కుర్చీలో ఆనందరావుగారికి ఎదురుగా కూర్చున్నాడు. అతని మనస్సు నిండా ఎంతో ఆవేదన.


"ఆఁ... మధూ! ఇప్పుడు చెప్పు. ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు?" దరహాసవదనంతో అడిగాడు ఆనందరావు.

"మామయ్యా!... బెంగళూరులో ఉంటున్నాను.”

పెళ్లి అయ్యిందా!..."

"అయ్యింది."

"పిల్లలు ఎంతమంది?"

"ఇద్దరు"


"వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు రా! మీ మామయ్యకు చూపించవా!..." నవ్వుతూ అడిగాడు ఆనందరావు.

"ఈసారి వచ్చేటప్పుడు తీసుకుని వస్తాను మామయ్యా!..."


కారు వచ్చి పోర్టకోలో ఆగింది. 'పిల్లలు... అమ్మా నాన్నా... వచ్చారు' ఆనందంగా నవ్వుతూ కారును సమీపించారు.

గోపాల్, భారతి, శాంతమ్మ కారు దిగి వరండాలోకి వచ్చారు. వారిని చూసి మధు కుర్చీ నుంచి లేచి... ఆశ్చర్యంతో చిత్తరువులా నిలబడిపోయాడు.

గోపాల్ మధును సమీపించాడు.


"రేయ్! మధూ!... ఎన్ని ఏళ్ళయిందిరా!... మేమంతా నీకు గుర్తున్నామా!..." ఆనందంతో మధును కౌగిలించుకున్నాడు.


"గోపాల్! నేను నిన్ను మరువడమా!... నిన్నే కాదు మీ అందరిని నేను ఎలా మరువగలనురా!... నాకు ఈ జీవితాన్ని ప్రసాదించింది మీరే కదా!..." సంతోషంతో గోపాల్ ను గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు.

అతనిలోని భావావేశాన్ని అర్థం చేసుకొన్న గోపాల్ మధూకి ఊరట కలిగించాలని...

"భారతీ!... అత్తయ్యా!... మన మధు." నవ్వుతూ చెప్పాడు.


మధూ... శాంతమ్మను సమీపించి పాదాలను తాకి నమస్కరించాడు.

"అత్తయ్యా!.. నన్ను క్షమించు" అతని పలుకులలోని వేదన... కంపనాన్ని శాంతమ్మ గ్రహించింది.

చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ...

"పోరా దొంగ వెధవా!... నీ మీద నాకు చాలా కోపంగా ఉంది" నవ్వుతూ భుజాలు పట్టుకొని అతని ముఖంలోకి ప్రీతిగా చూసింది.

"ఎప్పుడు వచ్చావు?"

"పది నిమిషాలు అయింది అత్తయ్యా!..." వినయంగా చెప్పాడు మధు.


"సరే పద... ముందు స్నానం చెయ్యి. నీ ముఖం చాలా అలసటగా ఉంది. భోంచేస్తూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం." భర్తగారి వైపు చూసి "ఏమండీ! మీరూ రండి" చెప్పి శాంతమ్మ ఇంట్లోకి పోయింది.

మధు భారతిని సమీపించాడు. భారతి అతని చూసి చిరునవ్వుతో…


"మధూ!... బాగున్నావా?" ప్రీతిగా అడిగింది.

"ఆఁ..." ఆమెను పరీక్షగా చూస్తూ నవ్వుతూ పలికాడు.


"రేయ్ మధూ!... భారతి ఇప్పుడు ఏడవ నెల. డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లి వచ్చాం. ప్రొడక్షన్ త్రీ..." మధు భుజంపై చేయి వేసి భార్య ముఖంలోకి కొంటెగా చూస్తూ నవ్వాడు గోపాల్.


ఆనందరావు కుర్చీ నుంచి లేచాడు. "అందరూ పదండి లోపలికి... మధును సమీపించి... "మధూ! పద..." అతని భుజంపై చేయి వేసి నవ్వుతూ ముందుకు నడిచారు. మధు ఆనందరావును అనుసరించాడు.

భారతి... గోపాల్... పిల్లలు వారిరువురి వెనకాలే ఇంట్లోకి ప్రవేశించారు.


భోజన సమయంలో శాంతమ్మ మధును ఎన్నో ప్రశ్నలు అడిగింది. అన్నింటికీ నవ్వుతూ జవాబులు చెప్పాడు మధు. పన్నెండేళ్ళ మధు చరిత్ర వారందరికీ బాగా అర్థమైంది. మధు భార్య పేరు పావని... కూతురు పేరు అమృత.... కొడుకు నరేంద్ర... వారిని తీసుకొని రానందుకుశాంతమ్మ... 'కుంటి సాకులు చెప్పకు...' మధు తలపై మొట్టింది నవ్వుతూ.

***

ఆ రాత్రి... తనకు వారు కేటాయించిన గదిలో మంచం పై పడుకున్నాడు. మధు ఆ ఉదయం పదకొండు గంటల నుంచి అంతవరకు తనకు వారి మధ్యన జరిగిన సంభాషణ అంతా గుర్తుకు వచ్చింది. పన్నెండేళ్ళ తర్వాత తను ఆ ఇంటికి వచ్చినా... వారంతా తన పట్ల చూపించిన ఆదరాభిమానాలు అతని మనసును పులకింపచేసాయి. మనోదర్పణం మీద పన్నెండు ఏళ్లకు ముందు... తన గతం ప్రతిబింబించింది.


అప్పుడు తన వయస్సు ఐదు సంవత్సరాలు. ఆ రోజుల్లో... పెను తుఫాను దివి తాలూకాను, తన ప్రళయతాండవంతో ఇసుకమేటగా మార్చేసింది. ఎందరో గతించారు. ఎన్నో పశువులు, మేకలు, గొర్రెలు, చెట్లు ఇసుకలో కలిసిపోయాయి. తన తల్లిదండ్రులు... ఏమైనారో తనకు తెలియదు. సస్యశ్యామలమైన ఆ ప్రాంతం... ఎడారిలా మారిపోయింది.


ప్రభుత్వ సిబ్బంది... సహాయక సంస్థలు... ఆయా ప్రాంతాలను సందర్శించి... బ్రతికి ఉన్న వారిని రక్షించి ఆశ్రయాన్ని కల్పించారు. గ్రామ సర్పంచిగా ఉన్న ఆనందరావు... మధును చూసి 'వీడిని నేను సాక్కుంటాను' ప్రభుత్వ సభ్యులకు చెప్పి... మధును తన హృదయానికి హత్తుకున్నాడు. తన ఇంటికి తీసుకొని వచ్చాడు. అప్పటికి రెండుసార్లు గర్భస్రావం జరిగిన శాంతమ్మ ఆ బిడ్డను చూసి మురిసిపోయింది. కన్నబిడ్డలా భావించి అతని ఆలనా పాలన చేసింది. ఆనందరావు మధును స్కూల్లో చేర్పించారు.


మధు ఆ ఇంటికి వచ్చిన సంవత్సరం లోపలేశాంతమ్మ గర్భవతి అయింది. పండంటి ఆడబిడ్డనుకన్నది. అంతా... మధు ఆ ఇంటికి వచ్చిన వేళా విశేషం... అనుకున్నారు. ఆ బిడ్డకు భారతి అని నామకరణం చేశారు.


చిన్నతనం నుంచీ... మధుకు భారతి అంటే ప్రాణం. సోదరి వాత్సల్యంతో అభిమానించేవాడు. ఆ ఇరువురినీ చూసుకుంటూ ఆ దంపతులు ఎంతగానో మురిసిపోయేవారు.

పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. మధు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. భారతి ప్లస్ టు చదువుతూ వుంది.


గోపాల్ ఆనందరావు గారి అక్క కొడుకు. ఆ తల్లి కొడుకులకు, భారతిని తమ ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆశ. మధు, గోపాల్ ఒకే వయస్సు వారు. ఇంజనీరింగ్ కలిసి చదివారు. పరీక్షల ఫలితాలు తెలిసాయి. ఇరువురు పాసైనారు. ఆ సందర్భంలో తను భారతిని ప్రేమిస్తున్నట్లు గోపాల్ మధుకు చెప్పాడు. భారతకి గోపాల్ అన్ని విధాల తగినవాడని మధు నిర్ణయించుకున్నాడు.

కానీ... భారతి మధును ప్రేమించింది. ఒక సందర్భంలో తన నిర్ణయాన్ని మధుకు చెప్పింది. ఆమె పట్ల ఆ భావన లేని మధు ఆశ్చర్యపోయాడు. చిన్నతనం నుంచీ భారతి తత్వాన్ని బాగా ఎరిగిన మధు... తను ఇకపై అక్కడ ఉండటం భారతికి తనకు మంచిది కాదనే నిర్ణయానికి వచ్చి... భారతికి ఒక లేఖ వ్రాసి... భారతికి ఇచ్చి ఆ రాత్రి ఎవరికీ చెప్పకుండా ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు.

***

భారతి మధు తనకు ఇచ్చిన లేఖను విప్పి చూసింది.

అందులో....

'భారతీ!... నేను నిన్ను ప్రేమించలేను. గోపాల్ నిన్ను ప్రేమించాడు. మామయ్య గారు ఈ ఊరి పెద్ద. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న గొప్ప మనిషి. అనాథనైన నన్ను చేరదీసి తన బిడ్డగా భావించి... చదివించి నాకు భవిష్యత్తును ప్రసాదించారు. నేను వారికి ద్రోహం చేయలేను. గోపాల్ నాకు మంచి హితుడు... మిత్రుడు... నీకు అన్ని విధాల తగినవాడు. నీవు చిన్నపిల్లవు. యుక్తాయుక్తాలు నీకు ఇప్పట్లో తెలియవు. నా మూలంగా మామయ్య... అత్తయ్య... గోపాల్ బాధపడకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నీవు బాగా ఆలోచించు. నీవు కోరుకున్న వాడిని చేసుకునే దానికంటే... నిన్ను కోరేవాడిని నీవు పెళ్లి చేసుకుంటే, నీ జీవితం అన్ని విధాలా బాగుంటుంది. గోపాల్ నీకు వరసైనవాడు. మీ అత్త కొడుకు. మీ బావ. నాకంటే గోపాల్ అన్ని విధాల గొప్పవాడు. నీకు తగినవాడు. అమ్మానాన్నల మాటను కాదనక గోపాల్ ను వివాహం చేసుకో... నేను వస్తాను ఒకనాడు నీ అన్నగా!...”

ఇట్లు

మధు


భారతి చేతిలోని ఉత్తరం జారిపోయింది. నయనాలు అశ్రుపూరితాలైనాయి. మనస్సున ఎంతో బాధ.

***

కాలానికున్న శక్తి అద్వితీయం. ఆ గమనంలో వ్యక్తులకు ఎన్నో నగ్న సత్యాలు గోచరిస్తాయి. మనస్సులో ఉండే ఆందోళనలు, ఆదేశాలు, నిరాశలు మారి ఆలోచనపరంగామానసొల్లాసం కలుగుతుంది. అదే జరిగింది భారతి విషయంలో. మధు సందేశం కనువిప్పు కలిగించింది. తన తల్లిదండ్రుల ఇష్టానుసారం గోపాల్ కు అర్ధాంగి అయింది. మూడు మాసాల్లో మరో బిడ్డకు తల్లి కాబోతూవుంది.


ఎన్నో ఏళ్ల తర్వాత... తాను ఎంతో పదిలంగా పెట్టి అడుగున దాచి వుంచిన ఆనాటి మధు లేఖను బయటికి ‌తీసింది. ఒక్కసారి సాంతం చదివింది. ఆమె నయనాలు... మధులో ఉన్న మంచితనానికి... ఔన్నత్యానికి... అశ్రుపూరితాలైనాయి.


'నేను వస్తాను ఒకనాడు నీ అన్నగా, ఆ పదాన్ని పదిసార్లు జపించింది. మనస్సులో ఎంతో ఆనందం... ఎంతో శాంతి... మధు పట్ల పూజ్య భావం.

***

ఉదయం ఆరున్నరకు కాఫీ కప్పు సాసర్ తో భారతి మధు గదిలో ప్రవేశించింది.

"గుడ్ మార్నింగ్."

బేసిన్ దగ్గర ముఖం కడుక్కుని తుడుచుకుంటున్న మధు వెనక్కి తిరిగి చూశాడు. భారతిని సమీపించాడు. నవ్వుతూ కాఫీ కప్పును మధుకు అంధించింది భారతి. కొన్ని క్షణాలు అతని ముఖంలోకి చూసి వెళ్ళిపోయింది.


కప్పు కింద ఉన్న మడత కాగితాన్ని చూశాడు మధు. కప్పును, సాసర్ ను టీ పాయ్ పై ఉంచి ఆ కాగితాన్ని చేతికి తీసుకున్నాడు. అది పన్నేండేండ్లక్రిందట తను భారతికి రాసిన ఉత్తరం. 'వస్తాను ఒకనాడు నీ అన్నగా....’ ఆ పదాల క్రింద అండర్లైన్ చేసి ఉంది.


దాని క్రింద... 'మాట నిలబెట్టుకున్న అన్నయ్యకు ఈ చెల్లెలి ధన్యవాదాలు...' నీ చెల్లి భారతి, అని వ్రాసి ఉంది.

భారతి తన్ను క్షమించి... అన్నయ్యా అని సంబోధన చేసినందుకు మధు... మురిసిపోయాడు.

* * *

-సమాప్తం-

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



36 views0 comments

Comments


bottom of page