top of page

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 16


'Nakemavuthondi Episode-16' New Telugu Web Series

Written By Mallavarapu Seetharam Kumar

'నాకేమవుతోంది…?' తెలుగు ధారావాహిక ఎపిసోడ్ 16

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


జరిగిన కథ…


కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త తరుణ్ నిద్ర లేపి, ఆమె తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు. అతన్నే అనుమానిస్తుంది ప్రియ. అతని వల్ల తనకు హాని కలగవచ్చునని తండ్రికి మెయిల్ పెడుతుంది.


స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్.

హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్.


పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్. కానీ తరువాత రంగనాథాన్ని, రిసార్ట్ మేనేజర్ సందీప్ ని విడుదల చేయమంటాడు. స్టేషన్ దాటి బయటకు వెళ్ళగానే వాళ్ళను ఎవరో కిడ్నాప్ చేస్తారు.

స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల గతంలో జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటుంది.


గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది.

అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది. తన గదిలోకి వచ్చిన వ్యక్తి అతని పేరు నీలకంఠం అని చెబుతాడు.


సిసి కెమెరా ఫుటేజ్ లో ప్రియ గదిలోకి ఎవ్వరూ వెళ్లలేదని తెలుస్తుంది. మరణించిన తన స్నేహితురాలు భార్గవిని చూడటానికి తల్లిదండ్రులతో హైదరాబాద్ వెడుతుంది ప్రియ. అక్కడ భార్గవి మేనమామ పేరు నీలకంఠం అని తెలిసి ఆశ్చర్య పోతారు ప్రియా పేరెంట్స్.


తన మేనమామ తనమీద హత్యా ప్రయత్నం చేసినట్లు తనకు అనిపించడం భార్గవి విషయంలో నిజం అయివుండొచ్చని ప్రియకు అనిపిస్తుంది. ప్రియా తండ్రి ప్రభాకర రావు చొరవతో పోలీసులు నీలకంఠం ఇంట్లో సోదా చేసి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుంటారు.


ప్రియను ఆమె తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తారు.


మేనమామ ఇంట్లో ప్రియకు కలిగిన అనుభవాలు, భార్గవి మేనమామ ఇంట్లో మరణించడం కేవలం యాదృచ్ఛికం అంటాడు సైకియాట్రిస్ట్ శ్రీనివాస్.


ప్రియకు మానసిక లోపం వల్లే జరగనివి జరిగినట్లు ఉహించుకొంటోందని చెబుతాడు.


ఒక సంవత్సరం పాటు ప్రియను మందులు వాడమంటాడు.


తనను బంధించిన ఉదయ్ కి అన్ని వివరాలు చెబుతానంటాడు రంగనాథం.


కనకారావు పిఎ ఫోన్ చేసి సందీప్ కి సహకరించమని చెప్పినట్లు అంగీకరిస్తాడు.


స్పృహలోకి వచ్చిన ప్రియా తను డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుంటుంది.

తాను హాస్పిటల్ కి చేరుకునేవరకు జరిగిన విషయాలు డాక్టర్ శ్రీనివాస్ కి వివరిస్తుంది.

ప్రియా జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు, మాజీ మినిష్టర్ కనకరావుకు ఉన్న సంబంధం గురించి చెబుతాడు డాక్టర్ శ్రీనివాస్.

ఇక నాకేమవుతోంది.. ధారావాహిక పదహారవ భాగం చదవండి.


డాక్టర్ శ్రీనివాస్ తనకు తెలిసిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు.

"తనకు సంబంధించిన వారి ప్రమేయం ఉన్న విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవడం, కనకరావుకి అనుమానాన్ని కలిగించింది.


ఒక దశలో అతనివల్ల చనిపోయిన స్త్రీ తాలూకు ఆత్మ నిన్ను ఆవహించిందేమోనని అనుమాన పడ్డాడు. అలాంటిదేమీ లేదని నేను నమ్మకంగా చెప్పాను. అయినా నిన్ను హాస్పిటల్ లో కొద్ది రోజులు ఉంచితే వాస్తవాలు తెలుస్తాయని భావించాడు. నీకు తెలిసిన వారికి హాని కలిగించి, ఆ విషయం నీకు ముందుగా తెలుస్తుందేమో చూడాలనుకున్నాడు.


స్నేహితుడి గదిలో ఉన్న తరుణ్ కి తప్పించుకోవడానికి సహాయం చేసినట్లు నటించి తన ఆధీనంలో ఉంచుకోవాలనుకున్నాడు. అతనికి హాని కలిగిస్తే, ఆ విషయం ముందుగా నీకు తెలుస్తుందేమో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ తరుణ్ తప్పించుకోవడానికి అంగీకరించ లేదు. దాంతో ఆ ఉపాయం ఫలించలేదు. ఢిల్లీ నుండి తన మాట వినే డాక్టర్లను పిలిపించి నీ మెదడు మీద ప్రయోగాలు చేయించాలనుకున్నాడు.


నీ కోసం పోలీసులు ఖచ్చితంగా హాస్పిటల్ లో గాలిస్తారని, విషయం సద్దుమణిగేదాకా నిన్ను మా ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి ఇక్కడికి తీసుకోని వచ్చాను. నువ్వు కోలుకున్నాక నీ ఇష్టప్రకారం చేయాలనుకున్నాను." చెప్పాడు శ్రీనివాస్.


కొంతసేపు మాట పెగల్లేదు ప్రియకు.

డాక్టర్ శ్రీదేవి ప్రియా భుజంపైన మృదువుగా తడుతూ "రిలాక్స్ ప్రియా.. భయపడకు. నీకేమీ కాదు. నువ్వు ఇక్కడ క్షేమంగా ఉంటావు. మాకు రిస్క్ వచ్చినా సరే.. నిన్ను క్షేమంగా ఉంచడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాం." అంది.


కొంతసేపటికి తేరుకున్న ప్రియా "ఆ కనకారావు ఎంత దుర్మార్గుడు.. నాకు అతనితో ఏ విరోధం లేకున్నా నాకు, నా వాళ్లకు హాని చెయ్యాలని చూస్తున్నాడు.అతన్ని జైలుకు పంపే ఆధారాలు నాకు కలగానో భ్రమగానో వస్తే బాగుండునని ఇప్పుడు అనిపిస్తోంది" అంది ఆవేశంగా.

ఇంతలో డాక్టర్ శ్రీనివాస్ ఫోన్ మోగింది.

అటువైపునుండి కనకారావు పిఎ..


ఆ విషయం తన భార్య డాక్టర్ శ్రీదేవికి సైగ చేసి చూపించి కాల్ లిఫ్ట్ చేసాడు.

"చెప్పండి సార్! ఏమిటి విశేషాలు?" అడిగాడు శ్రీనివాస్.

"ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది?" అడిగాడు అతను.


"ఇంకా పూర్తిగా కోలుకోలేదు సార్! మరో రెండు మూడు రోజులకు నార్మల్ అవుతుంది" చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్.


"నార్మల్ కావాల్సిన అవసరం మనకు లేదు. స్పృహ లోకి వచ్చి ఉంటే చాలు" అన్నాడు పిఏ.


"కానీ పూర్తిగా కోలుకోకుండా మనం ఏమైనా ప్రశ్నలు వేస్తే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. మరొక రెండు రోజులు ఓపిక పడదాం" చెప్పాడు శ్రీనివాస్.


"ఆ అమ్మాయికి ఏమైతే మనకేం? అలా ఆలోచిస్తూ కూర్చుంటే పనులు జరగవు. ఢిల్లీ నుంచి ప్రముఖ హిప్నాటిస్టు, మరో ప్రముఖ సైకియాట్రిస్ట్ రేపు వస్తున్నారు. వాళ్లను కనకారావు గెస్ట్ హౌస్ లో దించుతున్నాము. మీరు కూడా ఆ అమ్మాయిని తీసుకొని గెస్ట్ హౌస్ కి రండి. అక్కడ వాళ్లు 'ఆ అమ్మాయి మీద వేరెవరి ప్రభావమైన ఉందా' అనే కోణంలో పరిశీలిస్తారు. కనకారావు కారణంగా చనిపోయిన వారి ఆత్మ ఏమైనా ఆ అమ్మాయి మీద ప్రభావం చూపిస్తోందా అనే విషయం గమనిస్తారు. అలాంటిదేమీ లేని పక్షంలో జరగబోయేవి తెలుసుకొనే అతీంద్రియ శక్తి ఆ అమ్మాయికి ఉందా అని పరిశీలిస్తారు. అలాంటి శక్తి ఏమైనా ఉంటే ఆ అమ్మాయికి, ఆమె భర్తకు కనకారావు కంపెనీలలో మంచి ఉద్యోగం ఇచ్చి తన దగ్గరే ఉంచుకుంటారు.


ఆయనకు శత్రువులు చాలామంది ఉన్నారు. తనమీద ఏదైనా హత్య ప్రయత్నం జరిగితే అది ముందుగానే ప్రియా ద్వారా తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు అని ఆయన ఉద్దేశం. ఏదైనా రేపు ఆ ఢిల్లీ హిప్నాటిస్ట్ పరిశీలించాక నిర్ణయిస్తారు. రేపు మన వాళ్లకు పూర్తిగా సహకరించమని ఆ అమ్మాయికి చెప్పు. మనకు ఎదురు తిరిగితే తనకు ప్రాణాపాయం తప్పదని కూడా చూచాయిగా చెప్పు. ఆ అమ్మాయి నీ పేషెంట్ కాబట్టి నీకు కాస్త సానుభూతి ఉండవచ్చు. కానీ నువ్వు పని చేసేది కనకారావు దగ్గర అనే విషయం మరచిపోవద్దు. ఆయన చెప్పినట్లు నడుచుకోవడం మనందరికీ క్షేమం. గుర్తుంచుకో!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు కనకారావు పిఏ.


కాల్ ముగిశాక ప్రియా వంక, తన భార్య డాక్టర్ శ్రీదేవి వంక చూశాడు శ్రీనివాస్. స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో వాళ్ళిద్దరూ ఆ సంభాషణ పూర్తిగా విన్నారు.


డాక్టర్ శ్రీనివాస్ ప్రియా వంక చూస్తూ "చూడు ప్రియా! ఇంతటితో నిన్ను పోలీసులకు లేదా మీ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయమంటే చేస్తాను. కనకారావు వల్ల నా ఉద్యోగం పోయినా, ఇతర ఇబ్బందులు ఎదురైనా నేను ఫేస్ చేస్తాను" అన్నాడు.


ప్రియ మాట్లాడుతూ "ఇప్పటివరకు నా విషయంలో కనకారావు డైరెక్టుగా ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టి నేను పోలీసులను ఆశ్రయించినా కనకారావుకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మరీ తప్పని సరి పరిస్థితి వస్తే నేరాన్ని తన పీఏ మీద, మీ మీద వేసి తప్పించుకోగలడు. తరువాత అయినా నాకు అతని వల్ల హాని తప్పదు. కాబట్టి అతను నా నుంచి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకోవాలి. అంతకంటే ముఖ్యంగా నాకేమవుతోందో కనిపెట్టాలి. అందుకు ఆ హిప్నాటిస్ట్ ని కలవడం ఎంతో ముఖ్యం. నాకు ఒక సహాయం చేయగలరా.." అడిగింది ప్రియ.


"తప్పకుండా చేస్తాను, చెప్పమ్మా" అన్నాడు డాక్టర్ సుధాకర్.

"నా స్నేహితురాలు ప్రవల్లిక గురించి మీరు వినే ఉంటారు. ఆమె డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి. మీరు అనుమతిస్తే ఆమెను ఇక్కడికి పిలిపిస్తాను. ఆమెతో డిస్కస్ చేసి ఈ కేసు విషయంలో ఎలా ప్రొసీడ్ కావాలో నిర్ణయిద్దాం. ఏమంటారు?" అని అడిగింది ప్రియ.


డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ "ప్రియా చెప్పింది నిజమే. కనకారావుతో ప్రియా ముఖాముఖి మాట్లాడితే కానీ అతని ఉద్దేశ్యం ఏమిటో తెలియదు. కానీ అక్కడ మనకు అనుకోని ఇబ్బంది ఎదురైతే సహాయం చేసేవారు కావాలి. ఆ అమ్మాయి ప్రవల్లిక గురించి నేను విని ఉన్నాను. ఈ విషయంలో తన తోడ్పాటు తీసుకోవడం మంచిది" అంది.


అంగీకారంగా తల ఊపాడు శ్రీనివాస్. "నీ ఫోన్ కనకారావు పిఏ స్వాధీనంలో ఉంది. నా ఫోన్ నుండి కాల్ చేయి" అంటూ తన ఫోన్ ప్రియాకు అందించాడు.

"ప్రవల్లిక నంబర్ నాకు గుర్తులేదు. ముందుగా నా భర్త తరుణ్ తో మాట్లాడుతాను. నేను క్షేమంగా ఉన్నట్లు తనకు తెలియాలి" అభ్యర్థనగా అంది ప్రియ.

"అలాగేనమ్మా, మాట్లాడు" అన్నాడు శ్రీనివాస్.


తన భర్త నెంబర్ కు రింగ్ చేసింది ప్రియా. ఫోన్ రింగ్ అవుతోంది. తరుణ్ కాల్ లిఫ్ట్ చేయడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది ప్రియా. ఆమెకు ప్రతిక్షణం ఒక యుగంలా అనిపిస్తోంది.


అటువైపు కాల్ లిఫ్ట్ చేయగానే "తరుణ్! నేను ప్రియాను మాట్లాడుతున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు?" అంటూ ఆత్రుతగా అడిగింది. అటువైపు కొంతసేపు నిశ్శబ్దం. బహుశా ఉద్వేగంతో తరుణ్ కి గొంతు పెగలడం లేదని గ్రహించింది ప్రియా.


"మాట్లాడు తరుణ్.. నీ గొంతు వినాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను" అంది ప్రియ.


అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న తరుణ్ ఒక అన్నోన్ నంబర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేయడానికి కాస్త తటపటాయించాడు. అంతలో ట్రూ కాలర్ లో 'డాక్టర్ శ్రీనివాస్, సైకియాట్రిస్ట్' అని పడడంతో లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు నుంచి ప్రియా కంఠం వినపడడంతో కొంతసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. తను క్షేమంగా ఉన్నట్లు ప్రియా చెప్పడంతో అతని కళ్ళనుండి ధారగా నీళ్లు కారాయి. మెదడు స్తబ్దుగా అయిపోయింది. మాటలు పెగలడం లేదు.


తన ఉద్వేగాన్ని అణచుకొని "ప్రియా..! ఎలా ఉన్నావు.. తిరిగి నీతో మాట్లాడతానని అనుకోలేదు. నువ్వు కనబడకుండా పోవడంతో నా మతి పోయినట్లు అయింది. దానికి తోడు నువ్వు హన్సిక ను హత్య చేశానని చెప్పడం, చనిపోయింది నువ్వేనని రిసార్ట్ మేనేజర్ చెప్పడం.. నాకు పిచ్చి పట్టినట్లు అయింది. దానికి తోడు నేను నిన్ను హత్య చేశానని సందీప్ పోలీసులతో చెప్పడంతో నేను ఉచ్చులో ఇరుక్కున్నానని అనిపించింది. నా స్నేహితుడు ఉదయ్ సహాయం కోరాను. మీ అమ్మానాన్నలు స్టేషన్ కి వచ్చి గతంలో జరిగిన సంఘటనలు చెప్పారు. ఉదయ్ కొందరిని విచారించి చనిపోయింది నువ్వు కాదని, హన్సిక అని చెప్పడంతో కాస్త కుదుటపడ్డాను. నువ్వు కేకేఆర్ హాస్పిటల్ కి వెళ్లినట్లు కూడా తెలిసింది.ఇప్పుడు నీ గొంతు వినడంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది" చెప్పాడు తరుణ్, వణుకుతున్న గొంతుతో.


తరుణ్ మాటలు వింటుంటే ప్రియాకు దుఃఖం ఆగలేదు. ఫోన్ పక్కనపెట్టి రెండు చేతులతో ముఖం కప్పుకొని గట్టిగా వెక్కిళ్లు పెడుతూ ఏడవ సాగింది.


అటువైపు నుండి తరుణ్ "ప్రియా! మాట్లాడు ప్లీజ్.." అంటూ బిగ్గరగా అరిచాడు. కొంతసేపటికి తేరుకున్న ప్రియ తన పరిస్థితిని తరుణ్ కి క్లుప్తంగా వివరించింది. ప్రవల్లిక సహాయం తీసుకోదలచుకున్నట్లు చెప్పింది. ప్రవల్లిక పక్కనే ఉన్నా ఆ విషయం చెబితే ఫోన్ ఆమెకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎంత సేపైనా ప్రియతో మాట్లాడుతూ ఉండాలని ఉందతనికి.

అక్కడ ప్రియా పరిస్థితి కూడా అలాగే ఉంది.


అది గ్రహించిన డాక్టర్ శ్రీదేవి, "ముందు ప్రవల్లిక అక్కడ ఉందో లేదో తెలుసుకో. ఆమె అక్కడ లేకుంటే తన నంబర్ తీసుకోని కాల్ చెయ్యి. నీ ఫీలింగ్స్ నేను గ్రహించగలను. కానీ ముందు జరగవలసిన పనులు చూడాలి కదా. తరువాత తరుణ్ కి కాల్ చేసి తీరికగా మాట్లాడుకోవచ్చు" అంది.


అప్పుడు ప్రియా "ప్రవల్లిక అక్కడ ఉందా..?" అని అడిగింది.

"ఉంది.." అంటూ అయిష్టంగా ఫోన్ ప్రవల్లికకు అందించాడు తరుణ్.


ఫోన్ అందుకున్న ప్రవల్లిక "ప్రియా.. ఎలా ఉన్నావు? నీకోసం మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా.. ఆ రిసార్ట్ మేనేజర్ సందీప్ ని ఉదయ్ స్పెషల్ గా ఇంటరాగేట్ చేశాడు. అప్పుడు అతను నువ్వు కేకేఆర్ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పాడు. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకున్నాను. హన్సిక చనిపోయినందుకు చాలా బాధగా ఉన్నా కనీసం నువ్వైనా క్షేమంగా ఉన్నావని తెలిసి కాస్త రిలాక్స్ అయ్యాను. కేకేఆర్ హాస్పిటల్ మీద రైడ్ చేస్తే వాళ్లు నీకు ఏదైనా హాని చేస్తారేమోనని ఆలోచిస్తున్నాము. ఏదో ఒక నెపంతో ఆ హాస్పిటల్ లో చేరి నీ గురించి ఎంక్వయిరీ చేద్దామనుకున్నాను. ఇంతలో నువ్వే కాల్ చేశావు. చెప్పు ప్రియా.. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ నెంబర్ డాక్టర్ శ్రీనివాస్ గారిదని తెలుస్తోంది. దీన్నిబట్టి నువ్వు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ, సేఫ్ గా ఉన్నావని అనుకుంటున్నాను." అని అడిగింది ప్రవల్లిక.


"అవును ప్రవల్లికా.. హాస్పిటల్ లో ఉంటే నాకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని శ్రీనివాస్ గారు నన్ను తన ఇంట్లో ఉంచారు. శ్రీనివాస్ గారు, వారి సతీమణి డాక్టర్ శ్రీదేవి గారు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నామీద పరిశీలన చేయడానికి కనకారావు ఢిల్లీ నుండి ఒక సైకియాట్రిస్ట్ నీ, ఒక హిప్నాటిస్ట్ నీ పిలిపించాడట. రేపు నన్ను కనకారావు గెస్ట్ హౌస్ కి తీసుకొని రమ్మని శ్రీనివాస్ గారికి కనకారావు పిఏ చెప్పాడు. అక్కడికి వెళితే గాని వాళ్ళ ఉద్దేశం ఏమిటో స్పష్టం కాదు. కానీ అక్కడ ఏదైనా సమస్య తల ఎత్తితే మాకు సహాయం కావాలి. అందుకే నీతో మాట్లాడాలనుకున్నాను. నీకు వీలుంటే వెంటనే శ్రీనివాస్ గారి ఇంటికి వచ్చేయి. లొకేషన్ షేర్ చేస్తున్నాను. మిగతా విషయాలు నేరుగా మాట్లాడుకుందాం" అంది ప్రియ.

================================================

ఇంకా ఉంది...

================================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
50 views0 comments

コメント


bottom of page