top of page

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 12


'Nakemavuthondi Episode-12' New Telugu Web Series





జరిగిన కథ…

కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త నిద్ర లేపి, ఆమె- తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు.

అతన్నే అనుమానిస్తుంది ప్రియ.

అతని వల్ల తనకు హాని కలగవచ్చునని తండ్రికి మెయిల్ పెడుతుంది.

కూతురి కోసం హైదరాబాద్ బయలుదేరుతుంది ప్రియా తల్లి ప్రమీల.

ప్రియా స్నేహితురాలు.. డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక ఫోన్ చేసి హన్సిక అనే మరో ఫ్రెండ్ మూడు రోజులనుండి కనపడ్డం లేదని చెబుతుంది.

ప్రియ కూడా కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని చెబుతాడు ప్రభాకర రావు.

స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్.

హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్.

పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్.

తరుణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.

సస్పెండయిన ఎస్సై రంగనాథాన్ని, రిసార్ట్ మేనేజర్ సందీప్ ని విడుదల చేయమంటాడు ఎసిపి ప్రతాప్.స్టేషన్ దాటి బయటకు వెళ్ళగానే వాళ్ళను ఎవరో కిడ్నాప్ చేస్తారు.

తమను కిడ్నాప్ చేసింది మఫ్టీలో ఉన్న పోలీసులేనని అనుమానిస్తారు రంగనాథం, సందీప్ లు.

స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల గతంలో జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటుంది.

గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది.

అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది.

తన గదిలోకి వచ్చిన వ్యక్తి అతని పేరు నీలకంఠం అని చెబుతాడు. కానీ ఆ గొంతు తన మేనమామ శివరావు గొంతులాగే అనిపించిందని ప్రియా చెప్పింది.

కానీ సిసి కెమెరా ఫుటేజ్ లో ప్రియ గదిలోకి ఎవ్వరూ వెళ్లలేదని, ఆమె గాలితో మాట్లాడుతూ బయటకు వెళ్లిందని తెలుస్తుంది.

మరణించిన తన స్నేహితురాలు భార్గవిని చూడటానికి తల్లిదండ్రులతో హైదరాబాద్ వెడుతుంది ప్రియ.

అక్కడ చనిపోయిన భార్గవి మేనమామ పేరు నీలకంఠం అని తెలిసి ఆశ్చర్య పోతారు ప్రియా పేరెంట్స్.

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక నాకేమవుతోంది.. ధారావాహిక పన్నెండవ భాగం చదవండి.


చెప్పడం ఆపిన ప్రమీల తరుణ్ వంక చూసింది.

“బాబూ తరుణ్! నీ దగ్గర ఇన్ని విషయాలు దాచి పెట్టి పెళ్లి చేశామని అనుకుంటున్నావు కదూ..” అంది.

లేదన్నట్టు తల అడ్డంగా ఆడించాడు తరుణ్.


“లేదత్తయ్యా.. పూర్తిగా కాకపోయినా నాకు కూడా కొంతవరకు తెలుసు. పెళ్లికి ముందే మామయ్య గారు నన్ను పర్సనల్ గా కలిసి, ప్రియా ను గతంలో సైకియాట్రిస్ట్ కి చూపించినట్లు చెప్పారు. ప్రస్తుతం తను నార్మల్ గా ఉంది కాబట్టి పాత విషయాలు నేను పట్టించుకోనని వారితో చెప్పాను. ఆయన నాతో మాట్లాడిన విషయం తెలిస్తే ప్రియా బాధపడుతుందని, కాబట్టి ఎవరికీ చెప్పవద్దని ఆయన అడిగారు. కానీ ఇంత వివరంగా అయితే నాకు తెలీదు. జరిగిపోయిన విషయాలను నేను తవ్వదలుచుకోలేదు. ప్రియ నా భార్య. ఆమె ఆరోగ్యంగా, క్షేమంగా ఉండడమే నాకు కావాలి. మీరు చెప్పడం కొనసాగించండి. నా ఉద్దేశం ప్రకారం మీరు చెప్పే విషయాలను బట్టి ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని, ప్రియా వీలైనంత తొందరగా దొరుకుతుందని అనిపిస్తోంది” అన్నాడు.


“తరుణ్! నీలాంటి మంచి మనసున్న వ్యక్తి భర్తగా దొరకడం, మా అమ్మాయి చేసుకున్న అదృష్టం” అంది ప్రమీల.

“భార్గవి నాకు కూడా తెలుసు. ఆ టైంలో నేను అమెరికా టూర్ వెళ్లి ఉన్నాను” చెప్పింది ప్రవల్లిక.


తర్వాత ప్రమీల గతంలో జరిగిన సంఘటనలను తిరిగి వివరించడం ప్రారంభించింది.


“ప్రియ నీలకంఠం అనే వ్యక్తి పేరు చెప్పడం, ఇక్కడ భార్గవి వాళ్ళ మేనమామ పేరు కూడా అదే కావడం చూస్తుంటే నాకు కూడా ఈ రెండు విషయాలకు ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. కానీ అదేమిటో తెలియడం లేదు. పైగా ఇతను మా తమ్ముడి ఇంట్లో ఉన్న ప్రియా గదిలోకి వెళ్లడం ఎలా సాధ్యం? అదీకాక సీసీ కెమెరా రికార్డింగ్ లో ఆ గదిలోకి ఎవ్వరూ వెళ్ళ లేదని తేలింది కదా” అన్నాను నేను.


ఇంతలో బయట ఉన్న ప్రియ, కొందరు స్నేహితులతో లోపలికి వచ్చింది. మేము కూర్చున్న చోటికి వచ్చి, “భార్గవి పేరెంట్స్ డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లారట. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాక డెడ్ బాడీని తీసుకుని వస్తారట. అంత్యక్రియలు రేపు మార్నింగ్ ఉంటాయట.


పాపం భార్గవి వాళ్ళ మామయ్య చాలా బాధపడుతున్నాడట. రెండు రోజులకు ముందే ఆయన కొడుకు నిశ్చితార్థం జరిగింది. ఇంతలో తన ఇంట్లో భార్గవి ఉరి వేసుకొని చనిపోవడంతో ఆయన తట్టుకోలేక పోతున్నాడు. మేము వెళ్లి ఒకసారి ఆయన్ని పలకరించి వస్తాము” అంది.


“నీతో కాస్త మాట్లాడాలమ్మా! వాళ్లను వెళ్ళనీ. నువ్వు తరువాత వెళ్ళొచ్చులే. అన్నట్లు భార్గవి వాళ్ళ మామగారి పేరు ఏమిటమ్మా?” అడిగారు మావారు.


“ఆ అంకుల్ పేరు నీలకంఠం” అని చెప్పింది ప్రియా స్నేహితురాలు.


ప్రియా ఒంట్లో ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించినట్లు అయింది. నా పక్కనే ఉన్న కుర్చీలో కూలబడింది.


“ఓకే.. మేము లోపలికి వెళ్లి ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. తొందరగా రా. నువ్వు కూడా ఒకసారి కలుద్దువు గాని” అని ప్రియతో చెప్పి, వాళ్ళు ఇంటి లోపలికి వెళ్లారు.


వెంటనే ప్రియ “అమ్మా! ఆ నీలకంఠం అనే పేరు వినగానే నాకు ఏదోలా అయింది. ఆ పేరు ఎక్కడో విన్నాను” అంది. ఆయన వైపు చూశాను. పరవాలేదు చెప్పమనట్లు తల ఊపారు ఆయన.

ప్రియా చేతిని నా చేతిలోకి తీసుకొని, “మొన్న రాత్రి నీ గదిలోకి వచ్చిన వ్యక్తి, తన పేరు నీలకంఠం అని చెప్పాడని నువ్వు అన్నావు. గుర్తుందా” అని అడిగాను.


అవునన్నట్లు తల ఊపింది ప్రియ. “చాలా కో ఇన్సిడెన్స్ కదూ! వైజాగ్ లో నేను మామయ్య వాళ్ళ ఇంట్లో పడుకోవడం.. భార్గవి ఇక్కడ తన మేనమామ ఇంట్లో పడుకోవడం.. నా గదిలోకి వచ్చిన వ్యక్తి తన పేరు నీలకంఠం అని చెప్పడం.. ఇక్కడ భార్గవి వాళ్ళ మామ పేరు కూడా నీలకంఠం కావడం.. చాలా విచిత్రంగా ఉంది. నేను ఒకసారి ఆయన్ని కలవాలి” అంటూ పైకి లేచింది ప్రియ.


“పదమ్మా.. మేము కూడా వస్తాం” అన్నాము మేము.

ఇంతలో ఇంట్లో నుంచి ప్రియా స్నేహితురాళ్లతో పాటు నలుగురైదుగురు వ్యక్తులు బయటకు వచ్చారు. అందులో పొడవుగా దృఢంగా ఉన్న ఒక నడి వయస్కుడిని చూసి ప్రియా ఉలిక్కిపడింది.

నా భుజం తట్టి “అమ్మా.. ఈయనకు మంకీ క్యాప్ వేస్తే అచ్చం నా గదిలోకి వచ్చిన వ్యక్తిలా ఉంటాడు” అంది.

తరువాత దగ్గరలో నిలుచుని ఉన్న వ్యక్తిని పిలిచి ఆయనెవరని అడిగింది.

"ఆయనే నీలకంఠం. ఈ ఇంటి ఓనర్" చెప్పాడు ఆ వ్యక్తి.


మా వారు ప్రియను దగ్గరకు పిలిచి, తన చెవిలో నెమ్మదిగా “నీ గదిలోకి ఎవరు రాలేదన్నది సీసీ కెమెరా రికార్డింగ్ లో తెలిసిపోయింది. మొన్న రాత్రి నీ మేనమామ నీ గదిలోకి వచ్చినట్లు, నిన్ను చంపడానికి ప్రయత్నించినట్లు నీకనిపించింది. భార్గవి నిన్న రాత్రి ఉరి వేసుకుని చనిపోయింది. ఒకవేళ అది ఆత్మహత్య కాదేమో.. భార్గవి మేనమామ ఏదైనా చేసి ఉండడానికి అవకాశం ఉందేమో..” అన్నారు.


“ఒక్క నిమిషం. ఇప్పుడే తేల్చేస్తాను” అంటూ ముందుకు వెళ్ళబోయింది ప్రియ.

ఆందోళనగా తన చెయ్యి పట్టుకున్నాను నేను. నా చేతిని విడిపించుకుంటూ, “అమ్మా! నేను నార్మల్గానే ఉన్నాను. నాకేమీ కాదు” అని చెప్పి ఒక స్నేహితురాలిని పిలిచి ఆమెతో కలిసి నీలకంఠం ఉన్న వైపు వెళ్ళింది.


మేము కూడా ఆమె వెనకే నడిచాము. అతనికి సమీపంలో వెళ్లాక ప్రియ తన స్నేహితురాలితో మాట్లాడుతున్నట్లుగా “నేనెవరో తెలిసిపోయిందన్నమాట! అయితే నిన్ను వదిలిపెట్టను” అంది.


నీలకంఠం ఉలిక్కిపడి ప్రియా వైపు చూశాడు. ప్రియా అదేమీ పట్టనట్లుగా తన ఫ్రెండ్స్ ని విష్ చేస్తూ కాస్త దూరంగా ఉన్న కుర్చీల వైపు వెళ్ళింది. మేము కూడా తన వెనకే వెళ్లాం. నీలకంఠం ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నా అతని ధ్యాసంతా ప్రియా వైపే ఉంది.


మరికొంతసేపటికి ఒక కుర్రాడు ట్రేలో టీ కప్పులు పెట్టుకొని అక్కడ ఉన్నవారికి సర్వ్ చేయడం గమనించాడు నీలకంఠం. అతన్ని దగ్గరకు పిలిచి అతని చేతిలోని ట్రే తీసుకొని నెమ్మదిగా మా వైపు వస్తున్నాడు. అతను దగ్గరకు వస్తుండగానే ప్రియా లేచి నిలబడింది. అతను ప్రియా వంక చూస్తూ “ఎవరమ్మా మీరు? తన స్నేహితులా?” అని అడిగాడు.


“నేను భార్గవిని..” అంటూ ఉండగానే ఆయన ఉలిక్కిపడ్డాడు. అతను చేతిలోని ట్రే జారి పడబోయింది.


ప్రియా అది పడకుండా పట్టుకొని, “నేను, భార్గవిని.. అంటిపెట్టుకొని తిరిగే స్నేహితురాలిని. మీరు బాధపడకండి అంకుల్. నేను మిమ్మల్ని వదిలిపెట్టను” అంది.

మళ్లీ కంగు తిన్నాడు ఆయన.


“అదే అంకుల్.. భార్గవిని మిస్ అయ్యారు కదా.. నేను మిమ్మల్ని తరచూ కలుస్తూ ఉంటాను. మీరు నాలో భార్గవిని చూసుకోవచ్చు” అంది అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ.


అతను తన ఫీలింగ్స్ ని కప్పిపుచ్చుకుంటూ “అలాగేనమ్మా, మంచిది” అంటూ మాకందరికీ టీ కప్పులు అందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


“సందేహం లేదు నాన్నా! భార్గవి మరణంలో ఖచ్చితంగా ఇతని ప్రమేయం ఉండి ఉంటుంది. కానీ ఇతన్ని ఎవరూ అనుమానించడం లేదు” అంది ప్రియ.


మావారు వెంటనే తన అన్నయ్యకు కాల్ చేశారు. ‘పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా’ అని అడిగాడు. విషయమేమిటని అడిగాడు ఆయన.


“ప్రియ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్న విషయం మీకు చెప్పాను కదా! పోలీసులు కూడా ఇది ఆత్మహత్యేనని నమ్మినట్లు ఉన్నారు. మాకెందుకో ఈ విషయంలో అనుమానం కలుగుతోంది. ఈ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా రికార్డింగ్ ని పోలీసులు స్వాధీనం చేసుకుని చూస్తే బాగుంటుందని అనిపిస్తోంది” అన్నారు ఈయన.


“పోలీసులు కాదు గాని హోం మినిస్టర్ గారి పిఏ మా ఎదురు అపార్ట్మెంట్ లోనే ఉంటాడు. ఆయనతో చెప్పి చూస్తాను. ఈలోగా అక్కడి లొకేషన్ నాకు షేర్ చెయ్యి” అన్నారు మా బావగారు.


మరో పావు గంటలో ఆ ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. నలుగురు పోలీసులు నేరుగా ఇంట్లోకి వెళ్లారు. సీసీ కెమెరా మానిటర్ ఎక్కడని నీలకంఠాన్ని ప్రశ్నించారు. ఆయన ఒక మూల ఉన్న మానిటర్ ని చూపిస్తూ “హార్డ్ డిస్క్ పాడై పోయింది. దాన్ని తీసి పారేశాము. అందువల్ల రికార్డింగ్ కావడం లేదు” అని చెప్పాడు.


“సీసీ కెమెరా పని చేయకపోతే సర్వీస్ పర్సన్ ని పిలిపించాలి. అంతేగాని హార్డ్ డిస్క్ తీసి పారేస్తారా?” అని అడిగారు పోలీసులు. సమాధానం చెప్పలేదు నీలకంఠం. అక్కడే రాసి ఉన్న సర్వీస్ పర్సన్ ఫోన్ నెంబర్ కి కాల్ చేశారు పోలీసులు.


నాలుగు రోజులకు ముందే సిసి కెమెరా యూనిట్ ని తనిఖీ చేసినట్లు.. హాల్లో, బయట వరండాలో ఉన్న రెండు కెమెరాలు బాగా పనిచేస్తున్నట్లు చెప్పాడు అతను. రికార్డింగ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా అవుతోందని చెప్పాడు. దాంతో పోలీసులు హార్డ్ డిస్క్ కోసం ఇల్లంతా గాలించడం మొదలుపెట్టారు. పెద్దగా శ్రమ పడే అవసరం లేకుండానే బుక్ షెల్ఫ్ లో దాచి ఉంచిన హార్డ్ డిస్క్ వాళ్లకు దొరికింది.


“మిమ్మల్ని విచారించాలి. స్టేషన్ కు రండి. సహకరించకపోతే బేడీలు వేసి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది” అని చెప్పారు వాళ్లు.


నీలకంఠం చుట్టూ ఉన్న జనాల వంక చూస్తూ “జస్ట్ ఫార్మాలిటీ కోసం స్టేషన్ దాకా వెళ్లి వస్తాను” అని చెప్పి పోలీసుల వెంట నడిచాడు.


మరికొంతసేపటికి భార్గవి డెడ్ బాడీని ఇంటికి చేర్చారు. భార్గవి పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు. కొద్దిసేపు అక్కడ ఉండి, మేము మా బావ గారి ఇంటికి బయలుదేరాము. మేము వెళ్లేసరికి ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు.


మేము రాగానే ఫోన్ పెట్టేసి “మీరు చెప్పిన విషయం ఎదురింట్లో ఉన్న మినిస్టర్ గారి పీఏ కి చెప్పాను. ఆయన వెంటనే పోలీసుల్ని అక్కడికి పంపారు. పోలీసులు నీలకంఠాన్ని స్టేషన్ కి తీసుకెళ్లారట కదా..

ఇక మీరు స్నానం చేసి వస్తే అందరం కలిసి భోజనం చేద్దాం. రేపు ఉదయం 10 గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. కాబట్టి మళ్లీ ఆ ఇంటికి వెళ్లే పని పెట్టుకోకండి” అన్నారాయన.

బాగా అలసిపోయి ఉండడంతో భోజనం చేయగానే మంచి నిద్ర పట్టింది. పొద్దున 10 గంటలకల్లా హాస్పిటల్ కి చేరుకున్నాము. ఆ డాక్టర్ పేరు శ్రీనివాస్.


ఆయనకు ముందుగా, వైజాగ్ లో ప్రియా కు జరిగిన అనుభవం ప్రియా ద్వారానే చెప్పించాము. తరువాత భార్గవి మరణించిన విషయం, అక్కడ జరిగిన సంఘటనలు కూడా వివరించాము. ఆయన కొంతసేపు ఆలోచించి తరువాత ఇలా చెప్పాడు.


“రెండు సంఘటనలకు మధ్య 24 గంటల సమయం తేడా ఉంది. భార్గవి మరణానికి ఒకరోజు ముందు మీ అమ్మాయి తన మీద ఎవరో అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పింది. ఆ తరువాత రోజు భార్గవి మరణం జరిగింది. ఆమె మీద తన మేనమామ అత్యాచార ప్రయత్నం చేసినట్లు గాని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రించినట్లుగాని ఇంకా నిరూపణ కాలేదు.


ఇక వైజాగ్ లో మీ అమ్మాయి ఆ రోజంతా బయట స్నేహితులతో కలిసి తిరిగింది. ఆ సమయంలో తనని ఎవరైనా అనవసరంగా టచ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు. మామయ్య తన కొడుక్కి ప్రియా సరైన జోడినా కాదా అని తెలుసుకోవడం కోసం ఆమెను కొంత పరిశీలనగా చూసి ఉండవచ్చు. ఈ రెండు సంఘటనలను క్రోడీకరించుకొని ఆమెకు ఆ విధమైన కల వచ్చి ఉండవచ్చు.


భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఏదో ఒక రూపంలో తమకు ముందుగా తెలుస్తున్నట్లు కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ లోతుగా చూస్తే అవి వాస్తవాలు కావని అనిపిస్తుంది. ఉదాహరణకు నా దగ్గరకు ఒక 50 ఏళ్ల స్త్రీ వచ్చింది. ఆమె కొడుక్కి యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నాడు. ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు. కొడుక్కి యాక్సిడెంట్ జరగడానికి కొన్ని గంటల ముందే అలా జరగబోతుందని ఆమెకు అనిపించిందట. వెంటనే కొడుక్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించిందట. కానీ కాల్ కలవలేదని చెప్పింది. ఆమెకు అలా అనిపించిన కొన్ని గంటలకే యాక్సిడెంట్ జరగడం వెనుక కారణం ఏముంటుందని నన్ను కన్సల్ట్ చేసింది.


నేను ఆమెతో మాట్లాడుతూ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్లు పరుగెత్తుతూ ఆడుకుంటూ ఉంటే పడతారేమోనని ప్రతి తల్లికి అనిపిస్తుంది. ఏదో ఒక రోజు వాళ్ళు ఆటల్లో కింద పడ్డప్పుడు తాము అనుకున్నట్లే జరిగిందని అనుకుంటారు.


కానీ ఎన్నో సార్లు వాళ్ళు అనుకున్నది జరగలేదు. ఆ విషయం వాళ్లకు గుర్తు ఉండదు.

అలాగే వాళ్ళ కాలేజీ రోజుల్లో బైక్ లో వెళ్తుండేటప్పుడు కూడా తల్లికి ఆందోళన గానే ఉంటుంది. అలాగే పిల్లలు పెద్దవాళ్ళై కార్లో వెళ్తున్నప్పుడు కూడా ఆ తల్లి ఆందోళన ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. ఇక పిల్లలు ఫ్లైట్లో వెళ్తూ ఉంటే తల్లి పడే టెన్షన్ కి అంతే ఉండదు. మీరు బాగా ఆలోచించుకొని చెప్పండి. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అవుతుందేమోనని మీరు ఇంతకుముందు ఎప్పుడూ భయపడలేదా.. ఖచ్చితంగా భయపడే ఉంటారు. టీవీలో గాని పేపర్లో గాని ఏదైనా యాక్సిడెంట్ న్యూస్ చదివితే ఆ తర్వాత మరో వారం రోజులు ఆ ప్రభావం ఉంటుంది” అని చెప్పాను. ఆమె నా మాటలకు కన్విన్స్ అయింది.


అయినా మీరు చెప్పిన విషయాలను నేను తీసి పారేయడం లేదు. ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా ఒకదాన్ని ఒకటి పోలి ఉంటాయి. అమ్మాయికి అన్ని రకాల పరీక్షలు చేస్తాను. తర్వాత ఏ విధమైన వైద్యం అందించాలని ఆలోచిస్తాను “ చెప్పడం ముగించాడు డాక్టర్ శ్రీనివాస్."


తను కూడా చెప్పడం ఆపింది ప్రమీల. ఆమె భర్త ప్రభాకర్ రావు స్టేషన్లోకి వచ్చాడు. దాంతో ఆమె లేచి నిలబడింది. తరుణ్ కూడా ఆయనకు ఎదురుగా వెళ్లి నమస్కరించాడు. ప్రభాకరరావు తరుణ్ భుజం తట్టి “భయపడకు. అంతా సర్దుకుంటుంది” అన్నాడు.


ఏసిపి ప్రతాప్ గారి ఫోన్ మోగింది. అటువైపు నుండి ఉదయ్ మాట్లాడుతూ “ఇక్కడ రిసార్ట్ మేనేజర్ సందీప్ నోరు విప్పాడు. చనిపోయింది ప్రియా కాదని, హన్సిక అనే అమ్మాయిని చెప్పాడు” అని చెప్పాడు.


ప్రతాప్ అందరినీ ఉద్దేశించి “చనిపోయింది ప్రియా కాదట. హన్సిక అనే మరో అమ్మాయి అట” అని చెప్పాడు.


ప్రభాకర్ రావు, ప్రమీల, తరుణ్ ల ముఖాల్లో వెంటనే రిలీఫ్ కనిపించింది.

ప్రవల్లిక కూడా ఆనందించినా, హన్సిక కూడా తన ఫ్రెండ్ కావడంతో వాళ్ల పేరెంట్స్ కి ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచనలో పడింది.

అలాగే ప్రియా ఏమైనట్లు అనే ఆలోచన కూడా ఆమెకు కలిగింది.

================================================

ఇంకా ఉంది...

================================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

Twitter Link



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



65 views0 comments
bottom of page