top of page

నాకేమవుతోంది..? ఎపిసోడ్ 19


'Nakemavuthondi Episode -19' New Telugu Web Series

Written By Mallavarapu Seetharam Kumar

'నాకేమవుతోంది ఎపిసోడ్ -19?' తెలుగు ధారావాహిక

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ..


కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త తరుణ్ నిద్ర లేపి, ఆమె తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు. అతన్నే అనుమానిస్తుంది ప్రియ.


స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్.


పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్.


స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల గతంలో జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటుంది.


గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది.

అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది. తన గదిలోకి వచ్చిన వ్యక్తి అతని పేరు నీలకంఠం అని చెబుతాడు.


సిసి కెమెరా ఫుటేజ్ లో ప్రియ గదిలోకి ఎవ్వరూ వెళ్లలేదని తెలుస్తుంది. మరణించిన తన స్నేహితురాలు భార్గవిని చూడటానికి తల్లిదండ్రులతో హైదరాబాద్ వెడుతుంది ప్రియ. అక్కడ భార్గవి మేనమామ పేరు నీలకంఠం అని తెలిసి ఆశ్చర్య పోతారు ప్రియా పేరెంట్స్.


తన మేనమామ తనమీద హత్యా ప్రయత్నం చేసినట్లు తనకు అనిపించడం భార్గవి విషయంలో నిజం అయివుండొచ్చని ప్రియకు అనిపిస్తుంది. ప్రియా తండ్రి ప్రభాకర రావు చొరవతో పోలీసులు నీలకంఠం ఇంట్లో సోదా చేసి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుంటారు.


ప్రియను ఆమె తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తారు.


ప్రియకు మానసిక లోపం వల్లే జరగనివి జరిగినట్లు ఉహించుకొంటోందని చెబుతాడు.

స్పృహలోకి వచ్చిన ప్రియా తను డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుంటుంది.


తాను హాస్పిటల్ కి చేరుకునేవరకు జరిగిన విషయాలు డాక్టర్ శ్రీనివాస్ కి వివరిస్తుంది.


ప్రియా జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు, మాజీ మినిష్టర్ కనకరావుకు ఉన్న సంబంధం గురించి చెబుతాడు డాక్టర్ శ్రీనివాస్.


కనకారావు పిఎ డాక్టర్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి మరుసటి రోజు ప్రియను కనకారావు గెస్ట్ హవుస్ కి తీసుకొని రమ్మంటాడు. అక్కడ ఢిల్లీనుండి వచ్చిన సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్ ఆమెను పరీక్షిస్తారని చెబుతాడు.


తన స్నేహితురాలు ప్రవల్లిక సహాయం తీసుకుంటానని చెబుతుంది ప్రియా.

ఉదయ్, ప్రవల్లికలు ప్రియను కలుస్తారు.

హన్సికను ఆమె భర్తే హత్య చేసినట్లు, అతనికి కనకారావు సహకారం ఉన్నట్లు చెబుతాడు ఉదయ్.

ప్రియను తీసుకోని కనకారావు గెస్ట్ హౌస్ కి వెళతారు డాక్టర్ శ్రీనివాస్ దంపతులు..

ఉదయ్, ప్రవల్లికలు కూడా వారితో వెళ్తారు.

హిప్నాటిజం గురించి భయపడనవసరం లేదని ప్రియతో చెబుతాడు హిప్నాటిస్ట్ భూషణ్.


ఇక నాకేమవుతోంది.. ధారావాహిక ఎపిసోడ్ 19 చదవండి.


గదిలోకి వెళ్లాక ప్రియను ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు హిప్నాటిస్ట్ భూషణ్. ఆమెకు ఎదురుగా తను కూడా ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఇద్దరి మధ్య ఒక స్టూల్ ఉంచాడు. తనతో తెచ్చుకున్న మ్యూజిక్ ప్లేయర్ని ఆ స్టూల్ పై ఉంచాడు. వెలుతురు అడ్జస్ట్ చేయడానికి వీలున్న ఒక బల్బ్ ని కూడా ఆ టేబుల్ పై ఉంచాడు. ఆ బల్బ్ ని తన దగ్గర ఉన్న రిమోట్ తో ఆన్ చేసి గదిలో ఉన్న ట్యూబ్ లైట్ ని ఆపివేశాడు. స్టూల్ కి ఇటువైపు మరో కుర్చీలో తను కూర్చున్నాడు. డాక్టర్ శ్రీనివాస్ ని, సైకియాట్రిస్ట్ త్రిపాఠిని పక్కనే ఉన్న బెడ్ మీద కూర్చోమన్నాడు. తరువాత ప్రియతో మాట్లాడడం ప్రారంభించాడు భూషణ్. "చూడు ప్రియా! హిప్నాటిజం అనగానే నీకేదో మత్తుమందు ఇచ్చినట్లు అయిపోతుందని అనుకోవద్దు. కేవలం నీ మనసులో ఉన్న విషయాలు నిర్భయంగా చెబుతావు. అంతే! చిన్నప్పుడు స్కూల్లో నీ స్నేహితురాలు నీతో గొడవ పడి నిన్ను కొట్టిందనుకో.. లేదా నువ్వే ఆ అమ్మాయిని కొట్టావు అనుకో.. ఇంటికి వచ్చాక ఆ విషయం ఎవరితోనూ చెప్పవు. కానీ నువ్వు అదోలా ఉండడం గమనించి మీ అమ్మ ఎందుకలా ఉన్నావని నిన్ను అడుగుతుంది. మొదట ఏమీ లేదని చెబుతావు. ఆ తర్వాత అమ్మ నీకు ఇష్టమైన స్వీట్ లేదా చాక్లెట్ నీకు ఇచ్చి, నీ తల నిమురుతూ, 'ఏమైంది తల్లీ..' అని అడిగిందనుకో.. అప్పుడు అంతవరకు నువ్వు దాచుకున్న విషయం నువ్వు మీ అమ్మతో చెప్పేస్తావు. ఇది కూడా ఒక రకమైన హిప్నాటిజం. ఇందుకు నీకు కావాల్సింది హిప్నాటిజం చేసే వ్యక్తి మీద నమ్మకం. మరెవరికీ చెప్పని విషయం మీ అమ్మకు ఎందుకు చెప్పి ఉంటావు? వేరే వాళ్లకు చెబితే వాళ్లు నిన్ను తప్పు పట్టడమో, ఎగతాళి చేయడమో చేస్తారు అనే ఉద్దేశంతో నువ్వు ఎవరికీ చెప్పి ఉండవు. కానీ మీ అమ్మకు చెప్పడం వల్ల నీకు ఓదార్పు లభిస్తుంది అనే ఉద్దేశంతో చెప్పి ఉంటావు. నిజమేనా?" అడిగాడు భూషణ్. "అవునన్నట్లు తలాడించింది ప్రియ. "మీ అమ్మ ఎలాగైతే నీ మంచి కోరుతుందో నేను కూడా అలాగే నువ్వు బాగుండాలని కోరుకుంటాను. నేనే కాదు, డాక్టర్ శ్రీనివాస్ గారు, త్రిపాఠి గారు, బయట ఉన్న డాక్టర్ శ్రీదేవి గారు, ఉదయ్ ప్రవల్లికలు.. అందరం నీ మంచి కోరుకునే వాళ్ళం. కాబట్టి మాతో ఏ విషయమైనా నిర్భయంగా చెప్పు. మెదడులో కొన్ని విషయాలు మరుగున పడిపోయి ఉంటాయి. నువ్వు ఫ్రీగా మాట్లాడడం మొదలుపెడితే దాగి ఉన్న సంఘటనల తాలూకు జ్ఞాపకాలు కూడా గుర్తుకు వస్తాయి" అన్నాడు భూషణ్. "తప్పకుండా భూషణ్ గారూ! నాకు కూడా నాకిలా ఎందుకు అవుతుందో తెలుసుకోవాలని ఉంది. మీకు పూర్తిగా సహకరిస్తాను" అంది ప్రియ. "దట్స్ గుడ్! చూడు ప్రియా.. ఇప్పుడు నిన్ను ట్రాన్స్ లోకి తీసుకొని వెళతాను. నీకు ఏదైనా చెప్పాలంటే సహజంగా ఉండే సంకోచం లేదా బిడియం ఇప్పుడు ఉండదు. ఎవరికీ చెప్పని విషయాలైనా నాతో ధైర్యంగా చెబుతావు. అలా నాకు చెప్పడం వల్ల నీకు మంచే జరుగుతుందని నీకు బాగా తెలుసు. అందుకే అమ్మానాన్నలతో మాట్లాడినంత చనువుగా నాతో మాట్లాడుతావు. కొన్ని విషయాలు పేరెంట్స్ తో చెప్పకపోయినా స్నేహితురాలికి చెబుతావు. అటువంటి విషయాలు చెప్పేటప్పుడు నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ గా అనుకో. ఇప్పుడు ఈ స్టూల్ పైన ఉంచిన బల్బు వంకే ఏకాగ్రతతో చూడు. మధ్యలో తల తిప్పకు. ఈ వెలుతురును కొద్ది కొద్దిగా తగ్గిస్తూ వస్తాను. నువ్వు నిద్రపోయేటప్పుడు నీకేమీ కనిపించదు కదా! అలా కొంతసేపటికి ఈ వెలుతురు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ మ్యూజిక్ ప్లేయర్ నుంచి వస్తున్న సౌండ్ కూడా క్రమంగా తగ్గిపోతుంది. అప్పుడు నీకు మా ముగ్గురి మాటలు తప్ప మరేమీ వినిపించవు. మేము అడిగిన వాటికి అన్నిటికి నిజమైన సమాధానాలు ఇస్తావు. మా దగ్గర నీకు ఎటువంటి దాపరికము ఉండదు" అని చెప్పాడు. తరువాత తన దగ్గర ఉన్న రిమోట్ తో ఆ బల్బ్ వెలుతురు క్రమంగా తగ్గేటట్లు అరేంజ్ చేశాడు. అలా ఆ బల్బ్ వెలుతురును 15 నిమిషాల పాటు నెమ్మది నెమ్మదిగా తగ్గేటట్లు చేశాడు. మ్యూజిక్ ప్లేయర్ లోని సౌండ్ కూడా అలాగే క్రమక్రమంగా తగ్గించాడు. మధ్య మధ్యలో తన గొంతు వినిపిస్తూ తన మాటలు తప్ప మరేమీ నీకు వినపడని చెప్పాడు. క్రమంగా ప్రియ ట్రాన్స్లోకి వెళ్ళింది. గదిలోని ట్యూబ్లైట్ను ఆన్ చేశాడు భూషణ్. ప్రియా కళ్ళు మూసుకొని ఉంది. మ్యూజిక్ ప్లేయర్ సౌండ్ ని పెంచాడు. అయినా ఆమెలో చలనం లేదు. ప్రియ పూర్తిగా హిప్నటైజ్ కాబడిందని గ్రహించారు శ్రీనివాస్, త్రిపాఠి. మ్యూజిక్ ప్లేయర్ సౌండ్ ని మరింత పెంచి చాలా చిన్న స్వరంతో ‘ప్రియా..’ అని పిలిచాడు భూషణ్. "చెప్పండి భూషణ్ గారూ! అంది ప్రియ. మ్యూజిక్ ప్లేయర్ ని ఆఫ్ చేశాడు భూషణ్. "ఇంతసేపూ ఏ పాట వచ్చిందో చెప్పగలవా?" అని అడిగాడు. "నాకేమీ వినపడలేదు" అంది ప్రియ. తరువాత భూషణ్ తను తీసుకువచ్చిన హెల్మెట్ లాంటి పరికరాన్ని ప్రియ తలకు అమర్చాడు. దాని తాలూకు వైర్లను ఒక పోర్టబుల్ మానిటర్ కి బిగించాడు. ప్రియ ట్రాన్స్ లోంచి బయటకు రాకుండా మధ్య మధ్యలో తన గొంతును వినిపిస్తున్నాడు. తరువాత ప్రియా నుండి విషయాలు రాబట్టడానికి సంభాషణ ప్రారంభించాడు. "నీ డేట్ అఫ్ బర్త్ గుర్తుందా?" అని అడిగాడు ప్రియని. టక్కున చెప్పింది ప్రియ. "గుడ్ ప్రియా.. చూసావా! నీ మెమరీ మామూలుగానే పని చేస్తోంది" అని అభినందించి తరువాత ప్రియా తల్లి పేరు, తండ్రి పేరు, భర్త పేరు, తను చదివిన స్కూల్ పేరు.. కాలేజీ పేరు.. ఇలాంటివి వరుసగా అడిగాడు. అన్నిటికీ వెంటనే సమాధానమిచ్చింది ప్రియ. ఆసక్తిగా హిప్నాటిజం ప్రక్రియని చూస్తున్నాడు డాక్టర్ శ్రీనివాస్. భూషణ్ అడిగే ప్రశ్నలకు వెంటనే సరైన సమాధానం చెప్పేలా ప్రియా మైండ్ ని, భూషణ్ సెట్ చేసినట్లు గ్రహించాడు. తరువాత భూషణ్ మాట్లాడుతూ కొంతమందికి అసాధారణమైన ప్రతిభ ఉంటుంది. ఏదైనా పుస్తకం ఒకసారి చదివితే జీవితాంతం గుర్తు పెట్టుకోగలరు కొందరు. ఆ పుస్తకానికి సంబంధించి ఏ విషయం అడిగినా చెప్పగలరు. ఇంకొంతమంది జీవితంలో పరిచయమైన ప్రతి ఒక్కరిని ఎప్పటికీ గుర్తు పెట్టుకోగలరు. ఇలా ఒక్కొక్కరికీ ఒక ప్రతిభ ఉంటుంది. అలా నీకు ఏదైనా ప్రతిభ ఉందా.. ఉంటే ఏ విషయంలో ఉంది? కాస్త ఆలోచించుకొని చెప్పు" అన్నాడు. ప్రియ కొద్దిసేపు ఆలోచించి "అలా ఎక్స్ట్రా టాలెంట్ నాకు ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదు. అందరు అమ్మాయిల్లాంటి దాన్ననే అనుకుంటున్నాను" అని సమాధానం ఇచ్చింది. “కొంతమందికి వాళ్లకు ఉన్న టాలెంట్ గురించి తెలియదు. నువ్వు అలాంటి దానివే. ప్రపంచంలో ఎవరికీ లేని అద్భుతమైన శక్తి నీకు ఉన్నట్లు మాకు అనిపిస్తోంది. బాగా ఆలోచించుకొని చెప్పు. ముందుగా జరగబోయే విషయాలు నీకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటాయి కదా" అని అడిగాడు. "చెప్పాను కదా.. నా గురించి నేను మామూలు అమ్మాయిని అనుకుంటున్నాను. అలాంటి శక్తి ఉన్నట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు" చెప్పింది ప్రియ. అప్పుడు భార్గవి విషయం ప్రస్తావనకు తెచ్చాడు భూషణ్. “నీ గురించిన వివరాలన్నీ డాక్టర్ శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకున్నాను. మీ స్నేహితురాలు భార్గవి తన మేనమామ చేత హత్యకు గురైంది కదా.. ఆ విషయం నీకు ముందుగానే ఎలా తెలిసింది? దీన్ని బట్టి నీకే తెలియని శక్తి ఏదో నీలో ఉన్నట్లు అనిపిస్తోంది." అన్నాడు. "భార్గవి హత్య కాబోతున్నట్లు నాకు ఎంత మాత్రం అనిపించలేదు. అలాంటి కల గానీ, భ్రమ గానీ నాకు కలగలేదు. అసలు నాకు ఆ ముందు రోజు భార్గవి గుర్తుకు రాలేదు. కేవలం నా మేనమామ నన్ను చంపాలని చూసినట్లు మాత్రం నాకు అనిపించింది. నా ప్రాణానికి హాని కలుగుతుందని భయం కలిగి అక్కడి నుంచి పారిపోయాను.భార్గవి కి ఏమైనా జరుగుతుందని నాకు అనిపించి ఉంటే తనను కాంటాక్ట్ చేసి ఆ విషయం చెప్పేదాన్ని" చెప్పింది ప్రియ. "సరిగ్గా చెప్పావు ప్రియా! జరగబోయే విషయం డైరెక్ట్ గా నీ ఆలోచనలోకి రాలేదు కానీ జరగబోయే సంఘటన తాలూకు ప్రభావం ముందుగానే నీ మీద కలిగింది. తన ఇంట్లో ఉన్న యువతి పైన ఆమె మేనమామ అత్యాచార యత్నం చేయడం, అది ఫలించకపోవడం, తనెవరో తెలిసిపోతుందన్న భయంతో ఆ యువతిని అతడు హత్య చేయడం.. ఇదంతా భార్గవి విషయంలో జరిగింది. అవన్నీ అదే రీతిలో నీ విషయంలో జరిగినట్లుగా నీ ఊహకు ఒక రోజు ముందుగానే వచ్చింది. ఇది కచ్చితంగా నీలో దాగి ఉన్న శక్తివలనే జరిగింది. ఆరోజు సరిగ్గా ఏం జరిగిందో.. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ..కాస్త గుర్తు చేసుకుని చెప్పగలవా? చెప్పడానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆపేయి. నిన్ను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు" అన్నాడు భూషణ్. "మీరంతా నా మంచి కోరేవారని నాకు తెలుసు. ఆరోజు జరిగిన సంఘటనలు గుర్తుకు చేసుకుంటాను" అంది ప్రియ. మానిటర్లో కనిపిస్తున్న ఆమె భావోద్రేకాల తాలూకు హెచ్చుతగ్గులను గమనిస్తున్నాడు భూషణ్. ప్రియా కళ్ళు మూసుకొని వున్నా రెప్పల మాటున ఆమె కనుగుడ్లు అటు ఇటు కదులుతున్నట్లు గ్రహించాడు. అంటే ఆమె ఉద్రేకానికి లోనవుతోందన్నమాట.. శ్రీనివాస్ వంక చూసి ఆ విషయం చెప్పాడు భూషణ్. వెంటనే శ్రీనివాస్ మాట్లాడుతూ "ప్రియా! నేను.. డాక్టర్ శ్రీనివాస్ ని. నువ్వు కూల్ గా ఉండు. నీకేమీ కాదు. నేను పక్కనే ఉన్నాను. నార్మల్ గా ఉన్నప్పుడు జరిగిన విషయాలను ఎలా గుర్తు చేసుకుంటావో అలానే అనుకో" అని అన్నాడు. అతని గొంతు విన్న తర్వాత ప్రియ కనుగుడ్లు తిరగడం ఆగింది. ఆమె ట్రాన్స్ లోనే ఉందని, కానీ టెన్షన్ పడడం లేదని గ్రహించారు అందరూ. ఆ రోజు జరిగిన సంఘటనల గురించి గుర్తుకు తెచ్చుకుంది ప్రియ. హఠాత్తుగా "నాకు ఒక విషయం గుర్తుకు వస్తోంది. ఆ టూర్ కి వచ్చిన వాళ్లలో జయంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతను చాలా డల్ గా ఉండడం గమనించాను. మేము బీచ్ కి వెళ్ళినప్పుడు అతను దూరంగా కూర్చొని కళ్ళు ఒత్తుకుంటున్నట్లు నాకనిపించింది. ఆ విషయం మిగతా స్నేహితులతో చెప్పాను. కొందరు అతని దగ్గరకు వెళ్లి చూసారు. అతను మామూలుగానే ఉన్నట్లు నాకు సైగ చేసారు. ఆ తరువాత నేను ఆ విషయం పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రి నాకు మళ్ళీ అతను గుర్తుకు వచ్చాడు. నిజానికి అతను తనకు ఒకసారి ప్రపోజ్ చేసినట్లు భార్గవి నాతో ఒకసారి చెప్పింది. ‘కానీ ఇంట్లోవాళ్ళు మేనమామ కొడుకుని అనుకుంటున్నారు. అందుకని అతనికి ఏమీ చెప్పకుండా దాటవేసా’నని నాతో అంది భార్గవి. "నీకు కూడా ఇష్టమైతే ఓకే చెప్పక పోయావా?" అన్నాను నేను. "ఆమ్మో.. పీక పిసికెయ్యరూ.." అంది భార్గవి నాలుక బయటపెట్టి. నిజానికి ఆ సంభాషణ జరిగినప్పుడు భార్గవి నవ్వుతూ నాలుక బయట పెట్టింది. కానీ ఆ రాత్రి నేను గుర్తు చేసుకున్నప్పుడు ఎవరో తన పీక పిసుకుతున్నప్పుడు నాలుక బయట పెట్టినట్లు అనిపించింది.. చెప్పడం ఆపింది ప్రియ. ఆమె చెప్పేది వింటున్న అందరికీ ఉద్వేగంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

================================================

ఇంకా ఉంది...

================================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).







55 views0 comments

Comments


bottom of page